కొత్త వెలుగు

1
7

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘కొత్త వెలుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]లం[/dropcap]చ్ బ్రేక్‌లో రూపాలీ – రితికతో చెప్పింది “మమ్మీ పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ చేస్తోంది” అని!

“దట్స్ గుడ్.. అది సహజమే కదా.. యు కెన్ ఫాలో.”

“ఏమో.. మన ఫ్రీడమ్ కోల్పోతాం. అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. ప్రతిరోజూ ఏదో ఒక న్యూసెన్స్.. ఇవన్నీ నేను భరించలేను.”

“భలేదానివే! నా హస్బెండ్ లేడూ.. నేను చెప్పినట్టే వింటాడు. నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. తెలుసా”

“అది నీ లక్. అలాటివాళ్ళు వెరీ రేర్‌గా వుంటారు. మన ఫ్రెండ్స్‌లో ఎంతమంది లేరూ. పాపం ఏదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే వుంటారు.”

“రూపా! మన పేరెంట్స్ గ్రాండ్ కిడ్స్‌తో ఆడుకోవాలని ముచ్చట పడతారు. అందులో నువ్వు ఒక్కదానివే కూతురివి. వాళ్ళకోసం అయినా చేసుకో” అంది రితిక

“సరేలే మన టాపిక్ క్లోజ్ అవదు కానీ, చాలా వర్క్ వుంది. మేనేజర్ సీరియస్ అవుతుంది పద..” అంటూ ఆ రోజుకి టాపిక్ వదిలేసింది రూపాలి.

***

ఇంటికి రాగానే మొదలు పెట్టింది ఇందుమతి.. పెళ్లికొడుకుల వివరాలు వున్న ఫైల్ చేతికి ఇచ్చి.

“నాలుగేళ్లుగా జాబ్ చేస్తున్నావ్. బోరుగా లేదు! ఇంకా ఎన్నాళ్ళు ఆలస్యం? నా మాట విను.. రూబీ”.

“మామ్, నాకేమీ నా జాబ్ బోరుగా లేదు. ఇంటికి వస్తే నీ బోర్ భరించలేక పోతున్నా!”

“అలా చెప్పు రూబీ.. మీ మామ్‌కి బోరుకొట్టి మనిద్దరిని హరాస్ చేస్తూ ఉంటుంది. ఇలా ఖాళీగా ఉండద్దు. జాబ్ చెయ్యి లేదా సోషల్ సర్వీస్ చేయి.. నీకు టైం పాస్ అని ఎన్నిసార్లో చెప్పాను. వినదు.” అప్పుడే వచ్చిన శరత్ అన్నాడు సరదాగా ఆట పట్టిస్తూ.

“నాకు నచ్చేవాడు అంత సులువుగా దొరకడు. ఈ ఫైల్ చూడటం నాతరం కాదు. టైం లేదు..” అంటూ రూపాలీ పక్కన పడేసింది.

“నువ్వు చూసి తీరాలి. ఆలస్యం ఐనా సరే!” అంది ఇందుమతి.

“నా ఫ్రెండ్ ఏమి చెప్పిందీ అంటే ‘పేరెంట్స్ అందరికీ మన పిల్లలతో ఆదుకోవాలని ఉంటుంది. ఆ సరదా తీర్చుకోడానికి పెళ్లి అంటారు’ అని. మమ్మీ అదే నిజమైతే దానికి వేరే దారి వుంది. ఏ అనాథ పిల్లలనో అబ్బాయిని, అమ్మాయినీ తెచ్చుకుని ఒకేసారి పెంచుకోవచ్చు.” అంది రూపాలీ.

“మంచి సలహా చెప్పేవు కానీ.. మొదట ట్రై చేద్దాం. నీకు నచ్చినవాడు దొరకలేదు అంటే అదే పని చేస్తాలే! ఒక్కసారి నా మాట విను తల్లి..” బతిమాలింది ఇందుమతి.

మమ్మీ తృప్తి కోసం వీకెండ్‍లో ఆ పెళ్లికొడుకుల ఫైలు ఓపెన్ చేసింది. అందులో ఏభై మంది వివరాలు ఫోటోలు వున్నాయి. ఇవన్నీ చూడాలంటే తలనొప్పి అని లాటరీ వేసి అయిదుగురిని సెలక్ట్ చేసింది.

“ఇదిగో మమ్మీ, ఇదేమీ ఫైనల్ డెసిషన్ కాదు. డాడీతో కూడా చెప్పు. ఏమి చెయ్యమంటారో!”

“ఒక్కొక్కరికే ఫోను చేసి మాటాడు. నీకు నచ్చిన సమాధానాలు చెప్పిన వారిని మీట్ అవ్వు. డాడీ సంగతి ఏముంది? అయన నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. తర్వాత చూద్దాం.”

“అదంతా మరో న్యూసెన్స్. ఇంకో నెల రోజులు టైం కావాలి. మధ్యలో నన్ను ఏమీ అడగకు” అని మరో నెల తప్పించుకుంది.

శరత్‌కి చెప్పింది కూతురు అన్నమాటని.

“అదేమీ చిన్న పాపకాదు. కంగారుపడకు. దానికి టైము ఇవ్వు.” అని నచ్చజెప్పాడు.

శరత్‌కి కూతురు మనసు తెలుసు. ఆమె తెలివి తేటలమీద నమ్మకం వుంది. అలాగే రూపాలికీ తెలుసు. డాడీ తనకే సపోర్టు ఇస్తారని.

“డాడీ నేను.. రెండు నెలల్లో ఫారిన్ ట్రిప్పుకి వెళ్ళాలి. మమ్మీ పెళ్లిగోల ఒకటి. ఎలా?” అంది. ట్రిప్ గురించి శరత్‌కి మాత్రమే చెప్పి.

“రూబీ! మమ్మీ ప్రయత్నం మమ్మీ చేస్తుంది. నీ ప్రయత్నం నీది. గుడ్ లక్” అన్నాడు శరత్.

రూపాలీ ఎలాగో వీలు చేసుకుని అయిదుగురిలో ముగ్గురిని సెలక్ట్ చేసుకుని ఫోను చేసింది.

ఒకడేమో మా అమ్మానాన్నలతో మాటాడి వాళ్లకి నచ్చితేనే గాని మీతో మాటాడను! అన్నాడు

ఇంకోడేమో “డేటింగ్ చేద్దాం కొంతకాలం” అన్నాడు. మూడోవాడికి అమెరికా వెళ్లాలని ధ్యేయంట. “ఎవరైనా వొకే!” అన్నాడు.

“నేను అమెరికా వెళ్ళను. ఇండియాలో ట్రైబల్ ఏరియాలో వుంటాను. వాళ్ళు చేసే నృత్యాలు, తినే ఆహారం, వేటాడే జంతువులూ, వారి జీవన విధానం మీద రీసెర్చి చేస్తున్నాను. అందుకు సౌత్ ఆఫ్రికా సరిగ్గా సరిపోతుంది కదా! అందుకు నేనే అక్కడికి వస్తాను. మీరే నచ్చారు.. నాకు” అంది నవ్వుకుంటూ.

“మీ కంపెనీ అమెరికా పంపుతోందని కంపెనీ జర్నల్లో చూశానండీ. మీరిలా అంటారేమిటీ?” అని కంగారుపడిపోయాడు.

‘హమ్మయ్య! గొడవ వదిలింది. నాకు లాటరీ ఉపయోగపడింది’ అనుకుంది రూపాలి .

“మమ్మీ ఇదిగో వీళ్ళ ముగ్గురి సంగతీ ఇలా వుంది.. ఏమి చేయాలో నువ్వే చెప్పు..” అంది అమాయకంగా మొహం పెట్టి. తప్పించుకోడానికి చేసిన లాటరీ సంగతి చెప్పకుండా.

“ఏమిటీ? ఇంకా ఈ రోజుల్లో కూడా అమ్మానాన్నలదే సెలక్షణా? నాకు ఈ అమ్మాయి నచ్చింది అని చెప్పకుండా అమెరికాలోనే ఉంటూ.. అమ్మాయికి ఎలాంటి గౌరవం ఇవ్వకుండా..” అని ఇందుమతి కోపం వచ్చింది అతడి మీద.

“అదే మరి! ఇక రెండో అతడి సంగతి విను మరి.. డేటింగ్ చేయాలట..!” మండే నిప్పు మీద కర్పూరం వేసాడు శరత్.

“ఇలా తయారు అవుతున్నారేమిటి మరీను. మనకి అలాటి పద్ధతులు నచ్చవు.. అని చెప్పు రూబీ!” అంది కోపంగా ఇందుమతి.

“ఇక చెప్పేది ఏమిటిలే! మాటాడకుండా ఫోను కట్ చేసాను..” అంది రూపాలీ.

‘అలాగే ఓ పదేళ్లు డేటింగ్ చేసి, నచ్చినప్పుడే చేసుకో. తొందరలేదు..’ అని ఘాటుగా చెప్పినట్టు తెలియనీయలేదు.

“మరి మూడో అబ్బాయి సంగతి చెప్పనా! సౌత్ ఆఫ్రికా సుగ్రీవుడి కోరిక?” అడిగింది రూపాలి.

“వద్దులే.. సుగ్రీవుడు.. అన్నప్పుడే అర్థం అయి పోయినది.” అంది ఇందుమతి.

“మమ్మీ నీకు నిరాశ కలిగించాను. సారీ! నేను వారం రోజుల్లో అమెరికా వెళ్ళాలి. మా బాస్ పంపుతున్నారు” అని అప్పుడు చెప్పింది.

“అయ్యో! ఆ మాత్రం టైం ఇవ్వకుండా అమెరికా ప్రయాణం వారమేనా! ఈ పెళ్లికొడుకుల సంగతి ఏమి చేద్దాం? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అయినా నీతో చెప్పకుండా కొన్ని సంబంధాలు చూసాను. వాళ్ళు ఎలా వున్నారంటే అబ్బాయి అమెరికా. తల్లితండ్రులు చూసేవి ఎలా ఉండాలో చెప్పాను. అమ్మాయి అందంగా ఉండాలి. పెద్ద కంపెనీలో పనిచేయాలి. జీతం ఎక్కువ ఉండాలి అందరిలో కలిసిపోవాలి జాయింట్ ఫ్యామిలీగా ఉండాలి.. అంటూ ఆంక్షలు పెడుతున్నారు.

పిల్లలు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకి నచ్చినట్టు వుంటారు. అదీకాకుండా అబ్బాయి అమ్మాయి ఇష్టపడాలి. మనం కుటుంబం సంప్రదాయం చూస్తాం. మనకి నచ్చినట్టు వాళ్ళు వుండాలని చెబితే వినరు. అత్తమామలు కూడా మంచి గా కోడలిని కలుపుకు పోవాలి.. అని నేను అంటే, వాళ్లకి నచ్చలేదు. ముందే కండిషన్లు పెడుతున్నారు. కాలం మారినా మనుషులు మారలేదు. నీకు నచ్చిన వాడు ఎవరైనా ఉంటే చెప్పు రూబీ నాకు ఎలాంటి అభ్యంతరము లేదు.” అంది ఇందుమతి.

“చూశావా మమ్మీ! నీకే నచ్చలేదు నాకెలా నచ్చుతారు? ఎన్ని రకాల ఇబ్బందులో! పెళ్లి చేసుకుని నచ్చలేదు అని విడిపోవడం కంటే నన్ను ఇలా ఉండనీ.” అంది రూపాలీ.

“మనకి ఇన్ని చెప్పినవాళ్లు వాళ్ళ అమ్మాయి ఎవరినో లవ్ మ్యారేజి చేసుకుంటే బాగానే ఊరుకున్నారు. ‘నీ కూతురే నీ మాట వినలేదు. వేరే అమ్మాయి వినాలి అనుకోడం బాగుందా’ అని అడిగాను. ఆయనకు ఎంత కోపం వచ్చిందో!” అన్నాడు శరత్.

రూపాలీ అమెరికా వెళ్లి ఏడాది తర్వాత వచ్చినపుడు ‘అక్కడ నచ్చినవాడు దొరుకుతాడు.. జంటగా వస్తుంద’ని ఆశపడిన ఇందుమతికి నిరాశే మిగిలింది మళ్ళీ.

భర్తతో తన బాధ చెప్పుకుంటే “కాలంతోబాటు మనమూ మారాలి. మన టైములో ప్రేమలు పెళ్లిళ్లు లేవు. తర్వాత మన తమ్ముళ్లు చెల్లెల్లు లవ్ మ్యారేజి చేసుకుంటామని ధైర్యంగా చెప్పేరు. ఇప్పుడు మన పిల్లలు ఇలా వాళ్లకి నచ్చినట్టు వున్నారు. ఏమీ చేయలేము. వాళ్ళు సుఖంగా ఉండటమే కోరుకుందాం” అన్నాడు ఓదార్పుగా.

రూపాలీ కొత్తగా ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కుని అందులోకి మారింది. ఫ్రొఫెషన్‌లో ఉన్నతంగా ఎదిగింది. ఆఫీస్ రూమ్, జిమ్, బెడ్ రూమ్, గెస్టు బెడ్ రూమ్, పెద్ద డైనింగ్ రూమ్ విశాలమైన లివింగ్ రూమ్.

శని ఆది వారాలు వీలుంటే మమ్మీ డాడీ వస్తారు. లేకుంటే రూపాలీయే వెడుతుంది.

కూతురు చెప్పినట్టే అనాథలు ఒక అబ్బాయిని అమ్మాయినీ తెచ్చుకుని పెంచుకుంటోంది ఇందుమతి.

వాళ్ళ కోసం ఆయాను కుదిర్చింది. వాళ్ళ ఆట పాటల్లో కాలం త్వరగా గడిచిపోతూ రూబీ పెళ్లి గురించిన ఆలోచన ఇప్పుడు రావడం లేదు. ఏదైనా అలవాటు పడేవరకు దిగులు వుంటుంది. ఒక నిర్ణయానికి కట్టుబడితే అదే లోకం అవుతుంది.

‘ఎవరి జీవితాలు ఎలా నిర్దేశించబడతాయో అలాగే జరుగుతుంది..’ అనుకుంది ఇందుమతి.

రూపాలీ కూడా పిల్లలతో గడుపుతోంది, కొంత టైం వాళ్ళకోసం స్పెండ్ చేసి. ఇప్పుడు వీకెండ్స్‌లో పిల్లలను రైడ్స్ కి తీసుకు వెడతారు అందరూ కలసి.

జీవితంలో కొన్ని మార్పులు అవసరం. అవి మరొకరి జీవితాలను నిలబెట్టేవి అయితే మరీ ఆనందంగా ఉంటుంది.

ఎందరో అనాథలు వున్నారు. అందరికీ ఎటూ ఏమీ చేయలేము. నూటికి ఒక్కరికి ఆశ్రయం ఇవ్వగలిగితే, అదే ఆత్మ సంతృప్తి.

అన్నీ వుండి.. సంతోషం ఉండదు కొందరికి. వాళ్ళు ఆద్యాత్మికం అంటూ కనిపించని ఏదో శక్తిని నమ్ముకోడం లేదా వచ్చే జన్మను నమ్ముకోడం వృథా. నిజానికి కళ్ళ ఎదుట వున్నా దీనులకు కొత్త జీవితం ఇవ్వడంలో గొప్ప ఆనందం ఉంటుంది. నమ్మేవారికి అందులో పరమార్థం వుంది.

ఇక ఫ్రెండ్స్ ఎటూ వున్నారు ఆ వయసు ఆ తరం ఆలోచనలు పంచుకునేందుకు.

వారిని అర్థం చేసుకుందాం, గౌరవిద్దాం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here