‘నిదురించిన ఎద నదిలో.. అలలెగసిన అలజడిగా..’ కోయిల పాట బావుందా…కొమ్మల సడి బావుందా!

1
6

[dropcap]ఈ[/dropcap] ప్రపంచాన్ని వొణికిస్తున్న ఈ కరోనా – కఠిన కాలాన.. మనసుని చుట్టుకున్న విషదాన్ని తొలగిస్తూ – ఒక కమ్మని స్వరం – కొమ్మల్లో ఊగుతూ.. చిరు గాలిలో తేలుతూ.. కొత్త ఆశల్ని పుట్టిస్తోంది.
కరోనా ధాటుకి – జన సముద్రపు నగరాలన్నీ ఇప్పుడు మౌన ముద్రలై నిలిచిపోయాయి. మనం ఇన్నాళ్ళూ ఈ రణగొణ ధ్వనుల్లో వినలేకపోయాం కానీ, ఇప్పుడీ నిశ్శబ్దాన వీధి వీధినా, వాడ వాడల్నా – కోయిల స్వరం ఎంత స్పష్టంగా, స్వచ్ఛంగా.. మరెంత మధురాతి మధురంగా వినొస్తున్నదంటే.. మరో సారి మరో సారి కొసరి కొసరి ఆలకించి ఆనందించేలా!
విషాదాన్ని ఊడ్చేస్తూ.. ఉల్లాసాన్ని ఉబికిస్తూ.. ఆశల చివుళ్ళు పూయిస్తున్న గానం – ఓ చిన్ని సందేశాన్ని అందిస్తోంది. ‘మొన్నటి దాకా మంచు తాకి మూగదైన తాను, మళ్ళీ కోలుకుని, గొంతు సవరించుకున్నట్టు…కరోనా కాటు నించి నువ్వూ కోలుకుని..నవ్వుతూ ముందుకెళ్తావ్..దుఃఖించకు నేస్తం..’ అని ఓదార్చుతున్నట్టుంది..
‘కలకాలం ఈ విధం కాదోయి జీవితం… ఏదో ఒక నాడు వసంతం నీ వాకిట నిలుచును ఇది సత్యం..’ చిత్తరంజన్ గారి మెత్తని స్వరం.. మది స్మృతిలో కదిలించింది కుహూకంఠము!
ఆలకించిన కొద్దీ.. ఆలపనలెన్నో… వినే మనసుకే వినిపించు రాగాలెన్నో… ఆ గొంతుకీ, ఈ గుండెకీ దూరం తొలగి, దగ్గరయి, విన గల మనసుంటే.. విని మెచ్చుకునే హృదయముంటే, – కోయిల కూడా మాట్లాడుతుంది – నీతో!
ఎద మీది ఎద పెట్టి సొదలన్నీ వినగలిగితే… కుహు కుహు ల రావాలలో..’ఓహో! అలాన్నే?!’ అనే ఊసులెన్నో వినిపిస్తాయి.
ఇది నేనంటున్నా,.. చాలామంది భావకుల ప్రశంశ కూడా!
ఈ సందర్భంగా, పదిమంది మంచి మాటలతో బాటు, పసందైన కోయిల గీతాలను మీ ముందుంచుతున్నాను. విని ఆనందించండి… కోయిల గొంతు సవరించుకున్న సవ్వడికి… ఆనందమైన మనసు అలికిడి అవుతుంది. అప్పుడు నాకు చప్పున మెదిలే గీతం… ‘కొమ్మలో కోయిల..కో అంటది..ఆడిమే ఆటగా..కొమ్మలో కోయిలా కోయంటదే…రాగతనమో ఏమో బాగుఓగులెరగదే..’
మృదు మెత్తని స్వరాన.. బాల మురళీ గారి పాటే – నా మదిన సెలయేటి పాటలాఅ.. నండూరి వారి యెంకిలా నడుచుకొస్తుంది.

అలానే చిట్టి బాబు గారి వీణ మెట్టు మీద చేతి వేలి కొస మీంచి మీటిన రాగాన నిలిచిన వీణ కోయిల అలా బంగారు జ్ఞాపకమై నిలిచిపోయింది.

అలానే వేదవతి ప్రభాకర్ గారి లలిత స్వరాన వినిపించే..’కొమ్మలో..కోయిలనై కొసరి కొసరి కూయనా..’ అనే గీతం గుప్పుమని పరిమళిస్తుంది మనసులో.
ఇప్పుడు మరో సారి..ఆ జ్ఞాపకం.. సంచిక పై మెరుస్తూ.. మీరూ వినండి!


గూడు కట్టుకోమని నా తోటలోని చెట్లనిచ్చాను – ప్రేమ ప్రసాద్:

మా వూరొక సుందరమైన ప్రదేశం అని చెప్పాలి. పానుగల్లు చెరువు… ఉదయ సముద్రం గురించి పరీక్ష ప్రశ్నా పత్రాలలోని ప్రశ్నకి మా నల్గొండ పిల్లలు తప్ప ఎవరూ ఠక్కుమని జవాబు చెప్పలేరు మరి.. (నవ్వులు).
ఆనాటి కాకతీయుల కట్టడాలు, కళా వైభవ శిల్ప సౌందర్యాలతో వెలసిన దేవాలయాలు ఒక వైపైతే, పానుగల్లు ఉదయసముద్రం చెరువు రిజర్వాయర్ పుణ్యమా అని, పంట చేలతో ఆకుపచ్చని చీర చుట్టుకుని, సశ్య శ్యామలమైన మా వూరు నాకొక సుందరవనం! అందునా ఈ వసంతానప్పుడు కోయిలమ్మల గానాలతో ‘కూ’ అంటే ‘కూ అంటూ.. మా నల్గొండ ప్రాంతమంతా కూడా కలకంఠి రావాలతో వసంత సుందరిలా మారిపోతుంది. (నవ్వులు)
నాకు ఇంటి పని కన్నా మా తోట పని అంటేనే చాలా ఇష్టం. మా ఇంటి ముందున్న వందల గజాల విశాలమైన ఆవరణ అంతా తోటగా మార్చేసుకున్నాం దమయంతీ!
నా తోటకి అతిథులుగా విచ్చేసే వారంటే నాకు మహా ప్రాణం. అవి – రక రకాల పిట్టలు, పక్షులు, చిలకలు, పావురాలు, ఉడతలు.. వాటి భాషలు, పలుకులు.. నడకలు.. పరుగులు.. ఇవన్నీ నా కనులకెంత ఇంపైన దృశ్యాలో చెప్పలేను. నా మనసుకెనలేని ఆనందాన్నిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు ఐతే, ఈ మధు మాసంలో కోయిలమ్మల గానాల సంబరాలు ఒక వైభవాన్ని మోసుకొస్తాయి. కోయిల గానాలను వింటుంటే…ప్రతి రోజూ పండగలా వుంటుంది. చల్లని ప్రభాతాన కోయిల భూపాల రాగంతో ప్రతి వేకువ ఒక వేడుకలా వుంటుంది. అది మొదలు.. ఇక ఆ స్వరాలాపనలు ఎప్పటి దాకా సాగుతాయంటే… ఇదిగో ఈ సాయంత్రం సంధ్య పొద్దు వరకూ నా వెనకెనక బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వినిపిస్తూనే వుంటాయి. మూడు పొద్దులూ.. ముప్ఫై మూడు రాగాలు వినిపించకుండా వూరుకోవు.. వచ్చిన సంగీతాన్ని ఉచితంగా పంచడం.. వినిపించడం.. ఎదుటవారి మనసుల ఆనందపరచడమే – సంగీత కళ ప్రధాన లక్షణమని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం – కోయిలమ్మ! యుగాలు మారినా.. మనుషులు మారినా.. కోయిలమ్మ మాత్రం.. అదే లక్ష్యంగా గానిస్తున్నాయనిపిస్తుంది..
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం..మనం..ఆఫ్ట్రాల్ మనుషులం..!
అందుకనే, మా తోటలో మునగ చెట్ల మీద, అల్ల నేరేడు చెట్ల మీద ఇళ్ళు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోమన్నా.. (నవ్వులు) అందుకు ప్రతిఫలంగా నిరంతరం – మధుర గాన కచేరీలని వినిపిస్తున్నాయి.
ద్రాక్ష తీగల మీద వాలి ఊగుతున్న కోయిలల అందాలని వర్ణించడానికి నేను కవినైతే బావుణ్ను అని విచారిస్తుంటాను అప్పుడప్పుడు.. (నవ్వులు)
అన్ని వేళలా దాని స్వరం ఒకలా వుండదు. అప్పుడప్పుడు వెలితి కనిపిస్తుంది నాకు. అది ఎండ వేళ కావొచ్చు.. మరి దాని జంట ఇంటికి తిరిగి రావడంలో జాప్యమేమో కావొచ్చు.. ఆ విషాదాన్ని సరిగ్గా అందుకుని అర్థం చేసుకుని అక్షరీకరించిన ఒకే ఒక్క గొప్ప కవి – మన దేవులపల్లి… ‘మోసం ద్వేషం లేని సీమలో..’ ఈ పాట వింటున్నప్పుడు..నా స్నేహితురాలు గుర్తుకొస్తుంది.. మనసు మూగబోతుంది..


‘నలిగిన గుండెలను తడిమి తన్మయరాగాలతో తడుపుతుంది!’ – రత్న రెడ్డి యెరువ:

కరోనా! కరోనా కాలం కఠినమైనదే కావచ్చు..
కదలక కూర్చుంటే కొన్నాళ్లకు అది కనుమరుగై పోవచ్చు
కానీ కనిపించకుండా పోయిన కొన్ని అందమైన బంధాలను.. కనుల ముందుకు తెచ్చింది.
కలగానే మిగిలిపోతుందేమో క్రమంగా అనుకున్న కోకిలమ్మనూ,
కమ్మని కూజితాలనూ కాలం కాని వేళల్లో కూడా వినిపించేలా చేసింది!

నీకు తెలుసా నేస్తమా!
నాకు కోకిలమ్మ పాటంటే ఎంతిష్టమో,
నలనల్లని మేని ఛాయ మెరిసేలా ఆ పాట మురిపిస్తుంది,
నలిగిన గుండెలను తడిమి తన్మయరాగాలతో తడుపుతుంది,

వేల వేల రాగాలను ఒకే కూతతో స్రుష్టిస్తుంది,
వీణ తీగల వినూత్న రాగాలూ
కోకిలమ్మ పాట ముందు దిగదుడుపే,
వీనుల విందైన ఫిడేలు మోతలూ ఆ కూత ముందు ఆదమరుపే!
కొంత కాలం కిందట,
నేనెప్పుడన్నా మానసిక వేదనలో ఉన్నప్పుడు,
నీకై వెదుకుతూ నువు కానరాక
వేసారిన క్షణాలు కమ్ముకున్నప్పుడు,
మా ఇంటి ముందున్న వేపచెట్టు మీదనుండి
ఒక కొత్త గానం వినిపించేది పాడిందెవరో కనపడకుండా,
మనసంతా మల్లెలు నిండినట్లు పరమళించేది
ఏ బాధా కనుల ముందుకు రాకుండా,

తాను వినిపించే భాష లేని భావాలన్నీ బరువెక్కిన గుండెని తేలిక పరిచేవి,
తను ఎగిరెళ్లేటప్పూడూ కూస్తూనే వెళ్లేది కొత్త పాట వినిపిస్తూ,
తఁనువు లోని ప్రతి అణువూ పులకరించి తన కోసమే ఎదురు చూసేది,
కొత్త ఉత్సాహాన్ని నింపుకుని
మళ్లీ తానొచ్చే దాకా,
తన పలుకు వినిపించే దాకా..


ఉషోదయంలో భూపాలరాగం – జి.యస్.లక్ష్మి:

పల్లవి –
ఉషోదయంలో భూపాలరాగం
వసంత ఋతువున కోకిలగానం
మథుర మథురమో సుధాభరితమో
మాటలకందని దివ్యభావమో।
చరణం –
చివురులు మేసిన కోయిలా
బోసినవ్వుల పసిపాపలా
మీటెను మనసును వీణలా
ఇక కురిసెను వెన్నల వానలా।ఉషోదయంలో।
చరణం –
అలసిన కన్నుల అలమేలుమంగలా
అలకలు తీరిన సత్యభామలా
రాముని చూసిన క్షణము సీతలో
కలిగిన వలపుల పులకరింతలా।ఉషోదయంలో।


ఆమని రాక – రత్నశ్రీ వట్టెం:

వసంతరాజుకు వేడుకగా
ఆహ్వానమ్ములు పలుకంగ
పచ్చని చిగురుల తరువులు మురియగ
ప్రకృతి శోభల పరవశించగ

కోయిల తియ్యని పంచమగీతం
కొండల కోనల ప్రతిధ్వనించెను
పాటల పల్లవులకు తను జతగా
నెమలి పదములను కలిపేను

శిశిర నీహారికల దుప్పటి తొలగి
సిగ్గులమొగ్గై విరిసిన వనదేవికి
చిగురులు పచ్చని చీరను చుట్టెను
మావి చిగురులే కుంకుమ దిద్దెను
పువ్వుల హారము నగలై విరిసెను

లేత పల్లవముల ఆరగింపుతో
కోకిల స్వరముల స్థాయి హెచ్చగ
తుంటరి పిల్లలు కుహు కుహుయనగా
వెర్రి కోయిలలు బదులు పలుకుతూ
మరింత తియ్యని రాగం తీసెను
ఋతుశోభలతో అలరిన ప్రకృతి
వసంత రాజుతో జత కూడినది
విరిసిన మురిసిన ఫలపుష్పములతొ
విద్యుల్లతయై మెరిసిపోయినది.
***
కోయిల పాట వినంగానే తలపుకొచ్చే మధుర లలిత గీతం ‘పలుకు తేనియలు నీ పాటలో చిలికేవు అంటూ కృష్ణ శాస్త్రి గారి సాహిత్య గీతం.. మదిలో మ్రోగుతుంది. అదేమిటంటే –
పలకు తేనియలు నీ పాటలో చిలికేవు
కోటి వీణియలు నా గుండెలో మీటేవు
ఏ కొమ్మ దాగినావే కోయిలమ్మా, నీ పాట కర్థమేమే కోయిలమ్మా।।
గున్నమామిడి మీద తీయగా హాయిగా
తీయుదువు రాగాలు ఎవరు నేర్పారే
చిగురుటాకులు మెక్కి వగరెక్కు గొంతుతో
పొగరెక్కి ఏమిటే పాడుతున్నావు।।

నీ పాట కర్థము నేనెరుంగను గాని
వినగానే నా గుండె విరహమ్ము పాలాయె
ఆపివేయవె పాట ఓ కోయిలమ్మా
ఓపలేనే బతుకు ఓ కోయిలమ్మా…
ఈ లలిత గీతం ఆడియో అందుబాటులో లేనందున లింక్ ఇవ్వలేకపోతున్నాను.
***
సినిమా పాటల్లో నాకిష్టమైన కోయిల గీతం..
కోయిలమ్మ చిత్రం నించి .. కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది..


సినీ వనాన వర్ణకోయిల వన్నెల రవాలో! – కృష్ణ మోహన్ మోచర్ల:

కోయిల పాట వినంగానే మనసు రవళించని హృదయం వుంటుందా! కోయిల కూ అనంగానే ఎన్నో సినీ గీతాలు నా హృదిని కదలుతాయి. సినీ కోయిల పాటలన్నీ తలపుకొచ్చి, మనసంతా వంసంతాలు పూయిస్తాయి.

కవుల కలాల నించి ఎన్ని కోయిల వర్ణనలు గుప్పుమన్నాయో.. రాత్రి లాంటి కోయిల అని ఒక కవి అంటే, ఎడారిలో కోయిలా, తెల్లారనీ రేయిలా అంటూ విరహాన్ని పలికించిన కవి మరొకరు.

మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెల..అంటూ పంచదార చిలకల్లాంటి పదాలు ఒలికించారు.
కొమ్మల సడితో కోయిల కూత పోలికన్నట్టు- కోయిల పాట బావుందా కొమ్మల సడి బావుందా అన్నారు సీతారామ శాస్త్రి గారు.

అదలా వుంచి, పాటల్లో కోయిల హమ్మింగ్స్‌తో మనసుని దోచేస్తారు.. సంగీత దర్శకులు. ‘కొయ్ల కొయ్ల కొర కొయ్ల ….తేనెలా పాడే కోయిల ..’ ‘కోయిల కూ కు క్కూ పాడమ్మ తేనెలా మా చంటి పాపయి నవ్వుల రాగాలు తియ్యమ్మ సిరిమల్లె నవ్వులా’ (చందమామ రావె సినిమా లో), ‘ ఇలా ఎన్నో గీతాలలో కోయిల కూ అంటం మనం వింటాం.
మనసులో కోయిల కూస్తుందని మనకి తెలీదు.. కో యని మదిని పలికించిన కోయిలని మన కనుల ముందు నిలిపాడు కవి. ‘కోయిల ‘కో ‘యని పిలచినది.. ‘కో ‘ యని నా మది పలికినది (రంగుల రాట్నం) లో పాట వింటుంటే.. పూల వనాన తూగే కోయిలమ్మలు కనిపిస్తాయి కళ్ల ముందు!
ప్రేమ కథ వినే కోయిలలూ వుంటాయి. ‘కోయిలా నా పాటను వినవే… కోయిలా నా పాటను వినవే… వినవా మా ప్రే..మ కథ ఓ కోయిలా వినవా మా ప్రేమ కథ ‘ అనే గీతం వింటున్నప్పుడు.. కోయిల అందమైన ప్రేమ రాయబారిగా కనిపిస్తుంది. ఈ పాట ప్రేమ కానుకది.
కోయిల వస్తూ వస్తూ తన వెంట మధుమాసాన్ని తీసుకొస్తుంది. కిల కిల నవ్వే కోయిల మధుర మంద హాసాల కోసం మధు మాసం వస్తుంది (సూర్య వంశం)..

గుండెల్లో వూయల ఊగించే కోయిల కొమ్మల్లొ కొయిలా కూసిందె తీయగా..! గుండెల్లొ వూయలా వూగిందె హాయిగా…! (నిను చూడక నేనుండలేను), సరిగమల కోయిల కొమ్మలో కొయిల సరిగమలు .. కోరికల మల్లెల ఘుమ ఘుమ ..(సంసారం),

గమకాల కోయిల కొమ్మలో కూసింది ఓ కోయిల కొమరాకు గమకాల సన్నాయిలా (కొత్త పెళ్ళి కూతురు) ఆశలు రేపే కోయిల కొమ్మలో… ఒక కొయిల కూసింది… గుండెలో చిరు ఆశలు రేపింది…. ( కౌసల్య సుప్రజా రామ) మౌనంగా ఉండొద్దు అన్న కోయిల
కొమ్మల్లో.. కొయిలమ్మ మౌనంగ ఉండద్దంటు కమ్మంగా ప్రెమిస్తొంది మనసా వాచా నిన్ను… కో యంటె పలికే కోయిల మీద ఒక గానం గుమ్మెత్తెస్తుంది…- ‘ కొమ్మ మీద కోయిలుందిరా చినవోడా కో యంటె పలుకుతుందిరా చినవోడా ‘కో యంటె పలుకుతుందిరా (రాజ నందిని)

‘కులికే కోయిల కొమ్మన కులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే కమ్మగ నవ్వ నెచ్చెలి నీ అందెల సవ్వడి చెయ్యవె..’ (మావి చిగురు) …కోయిల దీపాలు వెలిగించి, వెలుగులూ చిమ్ముతుందనడానికి ఈ పాట ఒక నిదర్శనం గా నిలుస్తుంది. – ‘కొండల్లొ కోయిల.. పాటలు పాడాలి .. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి (దండోరా).

కోయిల కూని రాగాలనుకుంటాం కానీ ఆ కూతల్లో గాథలూ వుంటాయి.. ఒంటరితనాల బాధలూ వుంటాయని మనకి తెలుసా! ఈ కోయిల గుండె కథ గురించి చెబుతూ ..ఒక కవి అంటాడూ, ‘ కొండల్లో కొనల్లో కోయిలాలో…ఇద్దరము ఒకటెలే కోయిలాలో గుండెల్లొ నా బాధ కూతల్లొ నీ గాధ ఎవరమ్మ వింటారు నీగోడు నాగోడు (భారత సిం హం) !
విప్లవ కోకిలలూ వుంటాయి. అవి వీరుల గుండెల బడబాగ్నులను వినిపిస్తాయి… గాయాలను తుడుస్తాయి.. అవి ఎలా వుంటాయి తన సాహిత్యంలో అద్దం పట్టి చూపుతారు కవి – ‘చెట్టుమీద కొయిలమ్మ .. ఓ కోయిలమ్మ వీరుల రాగాల త్యాగ మెత్తవమ్మ … కూతకూసి ఎర్ర జెండ పాట పాడవమ్మ ..’ (వేగు చుక్కలు)

కోయిల మనకు తోడుగా వుంటే, బ్రతుకంతా వసంత వనమే కాదూ? ఇల్లే ఒక ఆనంద నిలయమ.. క్షణ క్షణమూ మధుమాసంలా జీవితం మధుర మయమై పోతుంది. ఈ పాటలో ఆ రమణీయత ఎలా తొంగి తొంగి చూస్తూ మనసుని ఊరిస్తుందో చూడండి.
పచ్చని చిలుకలు తొడుంటె పాడె కొయిల వెంటుంటే.. భూలోకమె ఆనందానికి ఇల్లు (భారతీయుడు)

ఇన్ని పక్షులున్నాయి కదా, మరి కోయిల స్వరం ఏ ఇతర పిట్టలకీ, లేదెందుకనీ..అని గనక ఆలోచిస్తే, గుప్పున మామిడి చిగుళ్ళు మేస్తూ కనిపిస్తుంది కోయిలమ్మా. అందుకే అంటాడు కవి.. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా … కోయిల గొంతు వినగానె మావి చిగురు తొడిగేనా అని! అవును రెండూ ఒక దాని వెనక ఒకటన్నట్టుంటాయి మరి ! కవి ఎంతైనా గొప్ప ఆలోచనాత్మకుడు!

విషాదాల కోయిలలూ గానిస్తాయి.. మల్లెలు విషాద పరిమళాల్ని వెదజల్లుతున్నట్టు.. దేవులపల్లి వారి మృదుపద హృదయాన చిక్కిన ఈ మధుర గీతం ఆలపించని వారు, ఆలకించని వారెవరనీ!
ఆ గీతమే – ‘ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది.
ఇంకా చాలా కోయిల స్వరాలే వున్నాయి. వినగ ల మనసుంటే.. ఆలకించి అర్ధం చేసుకునే హృదయమే గనక వుంటే..కొమ్మ కొమ్మకో సన్నాయి.. గుండె గుండెనా మోగుతాయి.
సంచిక ద్వారా నా భావాలను మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా వుంది. ధన్యవాదాలు.


మేఘాన్ని వేడుకున్న స్వరమూ విన్నా! – ఆచంట హైమవతి:

వసంతకాలానికి సంకేతం కోకిల పాట.
ఎవరు వినినా, వినకపోయినా, కోకిల తన పాట మానదు. పాడుతూనే వుంటుంది. కష్టాలలో ఉన్న వాళ్ళు కూడా కోకిల తీయని పాట విని, మనసుని పులకింపచేసుకుంటారు. ఎండలు మెండుగా ఉన్నప్పుడు కోకిల తన పాట ‘కుహూ ‘నుంచి, ‘కుఋౠ’ లోకి మార్చుకుని ప్రకృతి పచ్చదనం కోసం మేఘాన్ని కురవమని అర్థిస్తుంటుంది. మానవులందరికీ కోకిల మైత్రి ఆనంద దాయకమే.
ఈ సందర్భంగా నా చిన్నతనాన రేడియోలో విన్న మధుర లలిత గీతాన్ని మీకు వినిపిస్తాను. ఈ పాటనెప్పుడూ పాదుకుంటుంటాను… కొమ్మ మీద కోయిల కూసినప్పుడల్లా.. నా హృదిన ఈ గీతమూ కంఠం సవరించుకుంటుంది. ఈ గీతం ఇంత మధురమైన వైనం ఎందుకంటే.. ఆనాటి ఎస్. రాజేశ్వర రావ్ గారూ, బాల సరస్వతి దేవి గారు ఎంతో శ్రావ్యంగా ఆలపించిన వైనాన…
రావే..రావే.. రావే రావే..
రావే రావే కోకిలా -2
రాగము పాడవే కోకిలా..-2
రావే…రా..వే.. రా..వే.. రావే.. రావే రావే కోకిలా.. ఆ.
1. చ: రాగములో అనురాగము లేదా రంజిల్ల చేయవే కోయిలా -2
రావే రావే… రావే రావే కోకిలా..
2. చ: మామిడి కొమ్మలు చిగురించే..ఒక మారిటు చూడవే కోకిలా..-2. కాముడు రాసిన ప్రేమ గీతమును గానము చేయవే కోకిలా..-2
ఎవరు పిలిచినా చేరువ రావు..కోపమదేలే కోకిలా..రావే..రా..వే…రావే. …రావే రావే కోకిలా…
3. చ. చాటుకు పోయెదవేలా మా గూటిలోకి రావే కోకిలా – 2
ధీటుగా నీతో మేళము చేసెదా..పాటలు నేర్పవే కోకిలా..ఇదె వినుమా అదె కనుమా.. ఇది కోకిల పాట సుమా…
రావే… రావే… రావే రావే కో..కిలా…- 2.


కోకిలమ్మ – పద్మజ మాచిరాజు:

కుహు కుహు కోకిలమ్మా ! రావమ్మా.. రా
సృష్టిని పులకితం చేయ “వసంత దూతవై” వచ్చావా
మావి చిగుళ్లు తిని “మత్తెక్కిన గాత్రం”తో అలరింపను వచ్చేశావా

ఇంత చిన్న పిట్టవి …. గానంలో …ఏకఛత్రాధిపత్యమే కదా… నీది
వీనుల విందైన గానం ..ఎదలో హర్ష పులకింతలు రేపే నాదం
అనిర్వచనీయం ..కోకిలమ్మా! వనాలకే సొగసు తెచ్చేను నీ మోహన గానం

రూపానికి కృష్ణ వర్ణం… గానం. ఆ వంశీనాదంలా మధురం
ధన్యమే నీవు… నీకే స్వంతమైన ఈ ముగ్ధ మోహన గాత్రం
నీ గాన సమ్మోహనంలో అంకితమైన మాకు నీ రాకే అపురూపం
నీ రూపం నల్లనైనా… నీవంటే మహా ఇష్టం
నీ కూతలు వింటే… మాకు పులకింతల
పర్వం… ప్రీతిపాత్రం
నీ గాత్రానికి మూలకర్తలు. ఆ మావి చిగుళ్లు కదా… నీకు చాలా ఇష్టం

సంఘర్షణల నలిగే మానవాళి…. అపురూపమై మది మీటే నీ గానం వింటే,
ఎదలో తీయని స్పందనం వస్తుందిలే ……..
వసంతం వచ్చేసిందని …సర్వులకు గుర్తు చేస్తుందిలే …..

ఋతువుతో జనాలను సంధానం చేస్తున్న
నీ నైజం…. వందనీయం

బిడ్డలను కాకి గూట్లో పెట్టి పెరగనిస్తావు … ఎడబాటు మరుస్తావు…
అవి మారు తల్లి వద్ద పెరిగి …. బలం రాగానే ఎగిరిపోతాయి…అవునా
కోయిలమ్మా నీ సంతానం ఎక్కువైతే
గాన భాగ్యం మాకే …

స్వార్ధపు మనుషులు మీ పిట్టలకు కరువు చేస్తున్నారు నివాసం
మా తప్పిదాలు సరి చేసుకుని ….. బాగా చెట్లు పెరుగనిస్తాము
పిట్టలన్నీ చెట్లపై ఎగురుతూ …. కలకలం చేస్తుంటే ఎంత మనోరంజితం

ఈ యాంత్రిక జీవితంలో… ఇలా నీ గానం
వినిపిస్తే… ప్రకృతికి చేరువగా ఉన్నాము
అని ఎంత సంబరం… ఎంత ఆహ్లాదం..

నీ గుంపుతో వచ్చి అలరించవా…
నీ పాటతో మాకు ఉల్లాసం అందించవా!!

***

ప్రియమైన సంచిక పాఠకులారా!
మీకు నచ్చిన ఓ కోయిల గీతాన్ని ఇక్కడ మీరూ ఆలపించండి!
-ఆర్.దమయంతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here