క్రౌర్యం

0
9

[‘క్రౌర్యం’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – ఎస్‌. దివాకర.]

[dropcap]ప్రొ[/dropcap]ఫెసర్‌ తిరుచ్చెందూర్‌ శ్రీనివాస రాఘవాచార్యులు, ఆయన ధర్మపత్ని కళ్యాణమ్మగారి ఏకైక పుత్రిక అలమేలు మొన్న చనిపోయింది. ఒంటి చర్మంలోంచి దూరి ఎముకను కోసేటటువంటి మండుటెండ; కోడంబాక్కం స్టేషన్‌ దగ్గర మరిగి, కరిగి, పొగలు కక్కుతున్న డాంబర్‌ మీద చస్తూ పడివున్న అలమేలు.

అనుకోకుండా విసురుగా వచ్చిన ఒక కత్తి అలమేలు వీపును చీల్చింది. తోపుడు బండిలో ఉప్పు అమ్మే పళనిచామి ఆమెను పట్టుకుని తన నగ్నమైన ఛాతీకి ఆనించుకున్నాడు. గుమిగూడిన జనం అంబులెన్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

అలమేలు వెడల్పుగా కళ్ళు తెరిచినపుడంతా అనంతమైన నీలి ఆకాశం కనిపిస్తోంది. తనచుట్టూ గుంపుకట్టిన నల్లటి తలల మీద ఇప్పుడే వచ్చి అమరిపోయే నీలం. కుక్క మొరగటంతోపాటు రైలు కూత. హబీబుల్లా రోడ్డులోని తన ఇంటి ముంగిలిలో పూలపరిమళం పిలుస్తుందేమో అని ముక్కుపుటాలు విప్పార్చింది. చుట్టూ తలా ఒకరు అంటున్న మాటలు అర్థం కాలేదు. పరుగుతీస్తున్న రైలుతోపాటు దడదడమని శబ్దం చేస్తూ కాలం జరుగుతున్న భ్రమ. ఉన్నట్టుండి తనను ఎదకు ఆనించుకున్నవాడి నోటి నుంచి తోసుకొచ్చిన పుల్లటి వాసన అసహ్యం అనిపించలేదు.

అలమేలుకు ముప్ఫయి ఆరేళ్ళయినా ఆమె ఒక మహిళగా పెరగనే లేదు. ప్రొఫెసర్‌ తిరుచ్చెందూర్‌ శ్రీనివాస రాఘవాచార్యులు పద్దెనిమిదేళ్ళకే పెళ్ళిచేసుకోవడం నిజం. వడగలై సంప్రదాయం పట్ల అత్యంత భక్తివున్న కళ్యాణమ్మ ఆయనకు ఇష్టమైన భార్య కావటం అంతే నిజం. అయితే అలమేలు పుట్టడానికి ప్రొఫెసర్‌గారికి నలభై ఏళ్ళ వయసు చేరుకోవాల్సి వచ్చింది. తమ వంశోద్ధారకుడి కోసం ఎదురుచూసిన వాళ్ళకు పుట్టగానే పోలియో రోగానికి బలియై, వికలాంగురాలైన అలమేలు ముద్దుల కూతురు కాలేదు. కళ్ళను, మనసునునాకర్షించే అమ్మాయీ కాలేదు.

హబీబుల్లా రోడ్డులోని ‘ఆండాళ్‌ మందిరం’లో అలమేలు తన జీవితంలోని చాలా కాలాన్ని గడిపింది. మళ్ళీ అక్కడే తాను చనిపోతానని అనుకుంది. పాతకాలపు పైకప్పు ఉన్న బంగళా. గేటు దాటి లోపలికి వెళితే ఇరువైపులా పెంచిన పూలమొక్కలు. ఇంటి నుంచి ముందుకు చాపుకుని రెండు స్తంభాల మీద నిలుచున్న వసారా. ముందరి హాలులో కిటికీ తెరిచినా మబ్బుమబ్బు. ఇరుపక్కలా లేచిన మేడలు, ఈ ఇంట్లోకి వెలుతురు దూరకుండా చూసుకున్నాయి. మండువాలోకి తీసుకెళ్ళే తలుపుకు ఎడమమూలలో ఒక నిలువుటద్దం. ఎడమ పక్కన రెండు బెత్తపు కుర్చీలు. కుడిమూలలో ఒక టేబుల్‌. ఒక గోడ మీద పొడుగునా వరుసగా పెట్టిన తాతముత్తాల కాలం నాటి చిత్రపటాలు. ఎక్కడికైనా వెళ్లి వచ్చిన అలమేలు టేబుల్‌ మీద తన వస్తువులను పెట్టి తల్లితో మాట్లాడటానికి వంటింట్లోకి వెళ్ళడం అలవాటు. ఆమె కట్టుబొట్టు మొదలు లైబ్రరీ నుంచి ఆమె తెస్తున్న పుస్తకాల వరకు బయటి ప్రపంచానికి సంబంధించిన సమస్త విషయాలనూ ప్రొపెసర్‌గారు, ఆయన ధర్మపత్ని ఓ కంట కనిపెట్టేవారు.

సంద్యవేళ ఇదే హాల్లో ప్రొఫెసర్‌ తిరుచ్చెందూర్‌ శ్రీనివాస రాఘవాచార్యులూ, ఆయన ధర్మపత్ని బెత్తపు కుర్చీలలో కూర్చుని విశిష్టాద్వైత చర్చల్లో పాల్గొనటం జరిగేది. మందపాటి తుండుగుడ్డ కట్టుకుని, సగం చేతుల చొక్కా తొడుక్కున్న ప్రొఫెసర్‌ ఘాటు వాసన కొట్టే పాతకాలంనాటి ఒక పుస్తకాన్ని తెరుస్తూ మొదట ఓరకంటితో, తరువాత పూర్తిగా తన ధర్మపత్నిని చూసి బిగించిన పెదవుల నడుమ ముందుకు తోసుకొచ్చిన రెండే రెండు దంతాలను చూపించి, చిరునవ్వు నవ్వుతారు. కళ్యాణమ్మగారు వేలాడుతున్న చుబుకం వికసిస్తున్నట్టే ఆమె ఎడమచెయ్యి ముక్కు చివరను పట్టుకుంటుంది.

“చూడు కళ్యాణూ, తిరుక్కోవిలూరులో పొయ్‌హై ఆళ్వారుగారు పడుకున్న అరుగు ఆయనకు మాత్రమే చాలు. పొదత్తాళ్వారుగారు వచ్చినపుడు ఆయన లేచి కూర్చోవలసి వచ్చింది. ఇద్దరూ కూర్చున్నప్పుడు పేయాళ్వారులు రావాలా? ముగ్గురు కూర్చోవటానికి స్థలం లేకపోవటంతో అందరూ లేచి నిలబడవలసి వచ్చింది. అయినా నాల్గవ వాడొకడు అక్కడున్నాడని ముగ్గురికీ జ్ఞానోదయమైంది.”

‘మహా మహిమాన్వితులు! మహా మహిమాన్వితులు!’ అని కళ్యాణమ్మగారు ముక్కు చివరను బలంగా రుద్దుతూ, పెదవులే లేని మూసిన నోటిని లాగి, కళ్ళను సగం మూసి, పొదత్తాళ్వారుగారి పియమైన ‘పాశురా’లు ఎంత బాగున్నాయి! భక్తియే ప్రమిద, ఆశేనెయ్యి, ఆనందంతో కరుగువ చింతనే ఒత్తి. ఈ విధంగా నా ఆత్మ నుంచి నారాయణునికి జ్ఞానజ్యోతి వెలిగిందని అంటారుకదా!’ అని పరమాశ్చర్యం చెందారు.

ఇలాంటి సందర్భాలలో ఒకవేళ అలమేలు కంటపడితే వెంటనే ప్రొఫెసర్‌ కోపంతో ‘నీకు ఎన్నిసార్లు కొంగు కప్పుకోమని చెప్పాలి? మానం లేదు, మర్యాద లేదు’ అని కనుబొమ్మలు ముడివేసేవారు. మదరాసు యూనివర్శిటిలో దీర్ఘకాలం తత్త్వశాస్త్రం బోధించి నివృత్తుడైన ప్రొఫెసర్‌ శ్రీమివాస రాఘవాచార్యులకు ఈ మధ్యన విశిష్టాద్వైతం ఒక్కటే మనశ్శాంతినిస్తోంది. ఒకప్పుడు షోపెన్‌ హావర్‌ సంకల్ప సిద్ధాంతానికి ఆకర్షింబడిన ఆయన ఈ మధ్య భగవాన్‌ రామానుజుల కర్మయోగం ముందు ఇతర సమస్త తత్త్వాలనూ దిష్టితీసి పారేయాలనేవారు. తమ తండ్రి తాతల ధర్మనిష్ఠ, నిర్మలమైన జీవనాన్ని గుర్తుచేసుకుని పులకించే ఆయనకు అలమేలు పరాయిదానిలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. తల్లిదండ్రులైనా తనను ప్రేమించకూడదా అని అలమేలుకు వ్యథ ఉండేది. ఇంట్లో ఆమెకు ఉన్న స్వాతంత్య్రం అంతంత మాత్రమే. తల్లిదండ్రులు కోరుకునే, మెచ్చుకునే గుణాలకు మరీ వ్యతిరేకంగా ఉన్న ఆమె తన గది కిటికీని కూడా తెరవటానికి లేదు.

అలమేలుకు ఇరవై ఏళ్ళు నిండిన తరువాత ఒక రోజు ఇంటి ముందు నుంచి వెళుతున్న ఇద్దరు తుంటరులు ఆమెను పరిహాసంగా ‘ముసలిది’ అన్నారు. ముప్పయ్యేళ్ళు నిండే సమయానికి ఆమె ముసలిదే అయిపోయింది.

కోలముఖం కలిగిన అలమేలు పాలిపోయింది. ఆమె చిన్న కళ్ళకింది చర్మం నల్లబడింది. పొడుగ్గా ఉన్న ముక్కు చివర అణగిపోయింది. సన్నగా పల్చగా పెరిగిన జుట్టు మెడనుంచి కిందికి దిగలేదు. కుడిబుగ్గ మీద పోలియో వచ్చినపుడు వేయించిన వాత గుర్తు. నడుస్తున్నప్పుడు పొట్టిగా, పుల్లలా ఉన్న కుడికాలును బలంగా అదిమిపెట్టి ఎడమకాలును ఎత్తి పెట్టేది.

ఒకానొక కాలంలో ఈ అలమేలు కూడా ప్రేమపాశంలో చిక్కుకుందని మొత్తం హబీబుల్లా రోడ్డుకు కానీ, ప్రొఫెసర్‌ దంపతులకు కాని తెలియదు. కొద్దికాలపు ప్రేమ. అంతే. తనను ప్రేమించినవాడు చనిపోయాడా అని అప్పుడప్పుడు అలమేలుకు అనిపిస్తుంది. ఒకే ఒకసారి తన తల్లి పుట్టిల్లయిన కాంచీపురానికి వెళ్ళినపుడు జరిగిన సంఘటన. దేవస్థానం పక్కనే ఉన్న ఇంట్లో తన పిన్ని పెళ్ళి వేడుక. ఇంట్లో ఎన్నడూ చూడని, వారి గురించి వినని బంధువులు. తన వయసువారికి పండుగలా ఎక్కడికైనా తిరగడానికి అవకాశమున్న సమయం. అతని పేరేమి? రామానుజం కదా? దేవస్థానం గడపను తన చేయి పట్టుకుని దాటించాడు కదా! అందమైన యువతులంతా తనను తిరస్కారంగా చూసి, తన దగ్గరికి రావటానికి బింకం చూపిస్తుండగా అతను కళ్లల్లోనే ప్రేమను పొంగిస్తూ పక్కనే నడిచాడు. అంతెందుకు, పెళ్ళి జరిగిన మూడో రోజు తాము పదిహేనుమంది ‘నెంజిల్‌ ఒరు ఆలయం’ సినిమా చూడటానికి వెళ్ళినపుడు రామానుజం తన పక్కనే కూర్చున్నాడు. థియేటర్‌ చీకట్లో అతని చేతులు తన ఒంటినంతా పలకరించాయి.

యవ్వనంలోని సహజమైన సిగ్గుతో, వద్దనే ప్రదర్శనలో అలమేలు కూడా ప్రేమించింది-గుట్టుగా. కాంచిపురం నుంచి వచ్చిన తరువాత చాలా నెలలు ఆ కుర్రవాడు కనిపించకుండా వేధించాడు. ఇప్పుడు అతను బతికి ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు! అలమేలు మాత్రం మార్కెట్‌ నుంచి చిన్నాచితకా సామాన్లు, కూరగాయలు తెస్తూ, ఇంట్లో తల్లికి సహాయపడుతూ జీవితాన్ని అరగదీయసాగింది.

ఇప్పుడు తన ముప్పయ్యారవ సంవత్సరంలో సౌందర్యం కానీ, కనికరం పుట్టించే రూపం కానీ లేని అలమేలును చస్తూ పడివుంది. రోడ్డు అంచున కూలబడిన వేగానికి చేతిలోంచి ప్లాస్టిక్‌ బాస్కెట్‌ అంత దూరానికి ఎగిరింది. అస్తవ్యస్తమైన చీర, ఒక్కొక్క దిక్కుకు చాపుకున్న కర్రకాళ్ళను, మోకాళ్ళ వరకూ ఒకే పరిమాణంలో ఉండటం చూపిస్తోంది. పళనిచామి ఆమెను నిటారుగా కూర్చోబెట్టి తన ఛాతీకి ఆనించుకుని కాలి మీది చీరను సరిచేశాడు.

కత్తితో పొడిచిన వార్తను వినగానే పళనిచామి పరుగున వచ్చాడు. నడుముకు ఒక గళ్ళ లుంగీని మాత్రమే చుట్టుకున్న అతను పడుకుని ఉన్నాడేమో. దృఢమైన ఆసామే! బొగ్గులాంటి నల్లటి దేహం. ఛాతీ మీద దట్టంగా పెరిగిన జుట్టు. ముఖంలో మరీ ఉబికి బయటికి దూకేలా ఉన్న ఆతని కళ్ళల్లో అలమేలు గొధుమ రంగు మచ్చలను చూసింది. ‘ఇతను గుడిసె మనిషి. అయినా నాకెంత శాంతంగా ఉంది’ అనుకుంది. క్రమంగా ఆమె ముఖంలో విషాదం తొలగి సంతోషం పరుచుకుంది. దీర్ఘంగా వస్తున్న అతని ఊపిరి ఆమెలో శ్వాసను నింపుతున్నట్టుగా అనిపించింది.

“నీళ్లు..” అని అలమేలు వెక్కింది.

“నీళ్ళు, నీళ్ళు తెచ్చివ్వండి” అని చుట్టూ గుమిగూడినవారి వైపు చూస్తూ అరిచాడు పళనిచామి.

ఇంకెవరో, “నీళ్లు వద్దు. సొడా తెచ్చివ్వండి” అన్నారు.

అలమేలుకు విచిత్రమైన సుఖం అనిపించింది. ఈ నల్లనివాడు, తల్లిదండ్రుల నుంచి తాను కోరుకుంటున్న ప్రేమదృక్కులను విసురుతున్నాడు కదా! అయితే ఇతనికీ నాకూ ఎంత వ్యత్యాసం ఉంది! నేను నల్లగా పుట్టి, ఇతని కూతురై వుంటే నన్ను ఎంతగా ప్రేమించి వుండొచ్చు. లేదా ఇతనే తెల్లగా ఉండి, నా తండ్రి అయివుంటే నాతో మృదువుగా పలకరిస్తూ వాత్సల్యంతో చూసేవాడేమో. ఈ ఆలోచన రాగానే అలమేలు చిన్నగా నవ్వింది. కుడివైపుకు పెదవులను లాగి నవ్విన ఆ నవ్వు చుట్టూ గుమిగూడిన స్లమ్‌వారికి బాధగా కనిపించింది. తనను గుండెకు ఆనించుకున్నవాడి కళ్ళల్లో పొంగిన కరుణను ఇంకెవరిలోనూ ఆమె చూసినట్టు లేదు.

గత మూడేళ్ళ నుంచి అలమేలు సామాన్లు తీసుకుని రావటానికి ఉదయమూ, సాయంత్రమూ పాండిబజారుకు ఇదే రోడ్డులో వెళ్ళేది. హబీబుల్లా రోడ్డు నుంచి మాసిలమణి మొదటి క్రాస్‌లో తిరిగి నేరుగా పాండిబజార్‌కు వెళ్ళివుండొచ్చు. అయితే ఆమె మాసలమణి మొదటి క్రాస్‌లో తిరగకుండా కోడంబాక్కం రైల్వే స్టేషన్‌కు వెళ్ళి, రైలు పట్టాల వెంబడి వరుసగా ఉన్న గుడిసెల దారిని చుట్టుకుని వెళ్ళేది. దానికి కారణం ఇంతే. ఒకసారి కుంటుతూ నడుస్తున్నప్పుడు ఆకస్మికంగా ఒక అపరిచితుడు తన భుజానికి ఒళ్లు రాసుకుంటూ వెళ్ళాడు. విపరీతమైన భయంతో కాళ్ళు వణికినా, అతను అన్న ఒక మాట అలమేలు పాలిపోయిన చెంపలకు ఎరుపును తెచ్చింది. అలమేలు ఆ రోజు పాండిబజార్‌కు వెళ్ళాలనుకుని సూటిగా కోడంబాక్కం స్టేషన్‌ వైపు నడవసాగింది. హాడావుడిగా కాళ్ళీడుస్తూ నడుస్తున్న ఆమెకు నాలుగు రోడ్ల కూడలి ఓ మూలలో పాములవాడొకడు భారీ గుంపును ఆకర్షించడం వల్ల, రోడ్డు నాలుగు వైపుల నుంచి ఏమైందో ఏమిటోనని హడావుడిగా పరుగెత్తుకొస్తున్న జనాన్ని చూసి విచిత్రమనిపించింది. జనుల గుంపును దాటినా అటు వైపే ఒక కంట గమనిస్తూ నడుస్తున్న ఆమె భుజాన్ని ఉన్నట్టుండి ఎవరో నొక్కినట్టు అనిపించింది. చూస్తే చిరుగుల నిక్కరూ తొడుక్కున్న మెల్లకళ్ళ పొట్టివాడు కనిపించాడు. భుజం మీద ఒక తువ్వాలు వేసుకున్నాడు. చెదరిన జుట్టు నుంచి జారుతున్న చెమట చెంపల మీద గీతలయ్యాయి. ఛాతీ మీది జుత్తు మెరుస్తోంది. కింది పెదవి మీద గాయం చిట్లి పోయే దశలో ఉంది. అలమేలు తిరిగినపుడు అతను ఎడమవైపుకు పడిపోతున్నట్టు నటించి, తన వైపు కళ్ళు విప్పార్చి, “ఎన్న అయ్యర్‌ కుట్టీ?” అన్నాడు. ఎడమ చేతిలో ఉన్న పర్స్‌ను గుండెలకు హత్తుకున్న అలమేలుకు అతను కిసకిస నవ్వి కన్ను గీటినట్టు అనిపించింది. ఆ క్షణం ఆమె కనుబొమ్మలు ముడిపడటం నిజం. అయితే మరుక్షణం ‘ఎన్న అయ్యర్‌ కుట్టీ?’ అనే మాటలో మార్దవం ఉన్నట్టు, ప్రేమ పొంగినట్టు అనిపించింది. గబగబా అడుగులు వేసింది. ఎడమవైపున ఉన్న మాంసం అంగడి వైపు ఎన్నడూ కన్నెత్తి చూడని ఆమె ఈ రోజు అక్కడ వేలాడదీసిన గొర్రెపక్కటెములనే రెప్పలు వాల్చకుండా చూసింది. అక్కడవున్న కొందరు తన వైపు తిరిగినట్టు అనిపించింది. ముఖం ఎర్రబడి, పెళ్ళికూతురిలా సిగ్గుపడింది.

భగవాన్‌ రామానుజాచార్యులు వివరించిన స్థితప్రజ్ఞత దశలైన యతమాన సంజ్ఞ, వ్యతిరేక సంజ్ఞ, ఏకేంద్రియ సంజ్ఞ, వశీకరణ సంజ్ఞలను కళ్యాణమ్మగారికి సవివరంగా బోధిస్తున్న ప్రొఫెసర్‌ తిరుచ్చందూర్‌ శ్రీనివాస రాఘవాచార్యులకు ప్రత్యేమైన సద్దు చేస్తూ నవ్వుముఖంతో లోపల కాలుపెట్టిన అలమేలు వల్ల రసభంగమైంది. “ఏమిటే నవ్వుతూ వస్తున్నావ్‌? నవ్వు రావటానికి నీకు ఏమైంది? పిచ్చిముండా..” అని కసురుకున్నారు. అలమేలు లోపలికి కనుమరుగైన తరువాత భగవంతుడినే వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్న ఆండాళ్‌, దేవుడి కోసం అల్లిన పువ్వులను తానే ముడుచుకుని, ‘ఆ భగవంతుడికి తాను అంగీకారమవుతుందా?’ అని అద్దంలో చూసుకుంటున్న సందర్భాన్ని చెప్పసాగాడు.

వంటింట్లో తండ్రి ఎదుట కంచెం ముందు కుడితొడను నేలకాన్చి, ఎడమ తొడను నిలిపి, ఎడమచేత్తో దాన్ని పట్టుకుని కూర్చోవటానికి అలమేలుకు మరీ విసుగు అనిపించింది. తండ్రి ఎదురుగా ఉన్నప్పటికీ ఆమె ముఖం కాంతీహీనం కాలేదు. ప్రొఫెసర్‌ శ్రీనివాస రాఘవాచార్యులు ఆమె ముఖంలో కనిపించిన కొత్త లక్షణం వల్ల అసంతృప్తి చెంది భార్యవైపు తిరస్కారంతో కూడిన గాంభీర్యంతో చూడటం ఒకటి రెండు సార్లు కాదు.

భోజనం తరువాత కళ్యాణమ్మగారు ‘కల్కి’ పత్రికను తిరగేస్తూ కూర్చుంటే, ప్రొపెసర్‌ రెండోసారి ‘హిందూ’ పత్రికపై దృష్టి సారించడం వాడుక. ఎప్పటికన్నా విశాలంగా కనిపించిన పక్కలో అలమేలు బోరగిలా పడుకుని, పాములవాడిని, చుట్టూ చేరిన జనాన్ని, తన భుజాన్ని నొక్కి కన్నుగీటినవాడిని, మాంసం అంగడి నుంచి తనపై కన్నుపెట్టిన ముఖాన్ని కళ్ళముందుకు తెచ్చుకుంది. అలవాటుగా ఈ రోజూ రామానుజంతో గడిపిన రోజులను జ్ఞాపకం చేసుకుంది. అతని బాహువుల్లో ముడుచుకున్నట్టు, అతని చేయి తన శరీరంలోని మృదువైన భాగాలను ఒత్తినట్టు అనిపించి నిద్రపోయింది.

ఆ రోజు నుంచి అలమేలు పాండిబజార్‌కు వెళ్ళడానికి మాసిలమణి మొదటి క్రాస్‌లో తిరగకుండా కోడంబాక్కం రైల్వే పట్టాల వెంబడి తీసుకెళ్ళే దారినే పట్టుకుంది. జనసందడి ఉన్నంతగా ఆమెకు సంతోషం. ఈ రోడ్డుకు ఉన్న రెండు ఫుట్‌పాత్‌లలో ఒకదాని పక్కన వరుసగా గుడిసెలు. ఇంకొక ఫుట్‌పాత్‌ మీద జనమే జనం. బాస్కెట్‌ పట్టుకుని కుంటుతూ నడిచే అలమేలు ఎవరికైనా ఒంటిని తాకిస్తే చూసినవారికి అమర్యాదగా అనిపించలేదు! ఈ ప్రదేశంలో జడగం, కొట్టుకోవడం, లూటీలు అత్యంత సాధారణమైనవని తెలిసినా ఆమె భయపడలేదు. ఆకస్మికంగా ఒంటిని తాకే జనం వల్ల, కుతూహలాన్ని చూపే కళ్ళవల్ల, ఒక్కోసారి ఎగతాళి చేసే ధోరణిలో వినిపిస్తున్న ఈలల వల్ల ఆమె పులకరించేది.

తన జీవితంలోని ముప్ఫయ్యారవ సంవత్సరంలో ఉన్న అలమేలుకు ఇదే రోడ్డులో కత్తిపోటుకు గురైంది. ఉదయం పదకొండు గంటలు. మాంసం అంగడి ఎదురుగ్గా ఒక పెద్ద గుంపు చేరింది. ఒంటిమీద చొక్కా లేని దృఢంగా ఉండేవాడొకడు పదహారు-పదిహేడేళ్ళ ఒక కుర్రవాడిని జుట్టు పట్టుకుని నేలమీద కుక్కి, ముఖం మూతి చూడకుండా కొడుతున్నాడు. కుర్రవాడి నోటి నుంచి రక్తం కారుతోంది. తొడుక్కున్న షర్టు చిరిగి పీలికలైంది. కొద్ది దూరంలో పేడ గంపతో కూర్చుని ఆకువక్కలు నములుతున్న ఇద్దరు ఆడవాళ్ళు ఈ గొడవనే చూస్తున్నారు. ముక్కుకు ఇరువైపులా ముక్కెరలు మెరుస్తున్న ఒకామె క్షణక్షణానికీ పల్లుకొరుకుతోంది. దృఢకాయుడు కొడుతున్న ఒక్కో దెబ్బకు ఆమె భుజాలు కదిలిస్తోంది. మరొక ఆమె రెండు కాళ్ళు చాపుకుని, చంకలు గీరుకుంటూ, తనదైన లోకంలో ఉంది. వీళ్ళందరిని చూసిన అలమేలు కుంటుతూ, గబగబా చుట్టూ చేరిన గుంపును అంచును చుట్టుకుని వెనుకకు తిరగకుండా నడవసాగింది. పదిబారలు నడిచివుండొచ్చు. అంతలో ఆ కుర్రవాడు, “బోడిముండా కొడకా, నీకు చేస్తానుండు” అని అరుస్తూ, ఆ దృఢకాయుడి చేతుల్లోంచి విడిపించుకుని అలమేలు వైపు పరుగెత్తికొచ్చాడు. ఆ దృఢకాయుడు “ఏయ్‌” అంటూ తరుముతు వచ్చాడు. గుంపులోని వాడొకడు ఆ దృఢకాయుడిని పట్టుకుని ఆపటానికి ప్రయత్నించాడు. కుర్రవాడు వేగంగా అలమేలు ముందు వచ్చి రెండు చేతులతో ఆమె భుజాలను పట్టుకుని నిలబెట్టి దృఢకాయుడి వైపు చూస్తూ నోటికొచ్చినట్టు తిట్టసాగాడు. ఉన్నట్టుండి తన భుజం పట్టుకుని ఒంటికి ఒత్తుకుని నిల్చున్నవాడిని చూసి అలమేలు ముఖం వికసించింది. మరుక్షణం ఆ కుర్రవాడి నోటి నుంచి కారుతున్న రక్తం చూసి వణికింది. ఇప్పుడు దృఢకాయుడిని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని ఆపారు. అతను ఇష్టమొచ్చినట్టు అరుస్తూ ఉన్నట్టుండి ఒక కత్తిని బయటికి తీశాడు. మండుటెండలో కత్తి అంచు తళతళమని మెరిసింది. కుర్రవాడు అలమేలు ముందు వంగటం, దృఢకాయుడు విసిరిన కత్తి అలమేలు వీపులో దిగడం ఒకేసారి జరిగింది. కుర్రవాడు ఆమెను వదిలి పరుగుతీశాడు. ‘ఎవరో పొడిచారు’ అని మాత్రమే అనిపించిన అలమేలు చిన్నగా ఆర్తనాదం చేసింది. కత్తి విసిరిన దృఢకాయుడూ ఆమెను దాటుకుని కువ్రాడిని పట్టుకోవడానికి పరుగెత్తాడు. కళ్ళకు చీకటి కమ్మి ఊపిరి తీసుకోవడానికి కష్టమై నేలకొరిగే సమయంలోనే, వాళ్ళిద్దరూ గుడిసెల మధ్య కనుమరుగవ్వటం అలమేలు చూసింది.

అంతసేపు గొడవ చూస్తున్న గుంపు ఇప్పుడు అలమేలు వైపు రాసాగింది. ఎవరో పోలీసులకు ఫోన్‌ చేయమన్నారు. ఎక్కడి నుంచో పళనిచామి అయ్యో అని అరుస్తూ పరుగెత్తుకొచ్చాడు. రెండు ముక్కెరలు పెట్టుకున్న ఆడది అలమేలును పొడిచి కింద పడివున్న కత్తిని తన గంపలోని పేడలో దూర్చింది. ఇంకొకతె అలమేలు పర్స్‌ను కొట్టేసింది. కళ్ళుమూసి తెరిచేలోగా వాళ్ళిద్దరూ మాయమయ్యారు.

ఒక కుర్రవాడు పరుగున సోడా తెచ్చినపుడు పళనిచామి దాన్ని అలమేలు నోటికి పెట్టాడు. ఆమె కళ్ళు తేలవేస్తూ ఒక గుటుక తాగి, తలను కుడివైపుకు వాల్చింది. ‘నీళ్ళెందుకు ఇసుకలా గొంతులో సిక్కుకుంటోంది’ అనిపించింది.

“అంబులెన్స్‌ వచ్చేవరకు బతికివుంటుందో లేదో?” అన్నాడొకడు.

అలమేలు స్థితికి, ఆమె వీపు పళనిచామి ఛాతీని తడుపుతున్న రక్తానికి, సర్దుకున్న జనం కోలాహలం తగ్గించారు.

అలమేలు తన శక్తినంత వదిలేసి పళనిచామి ఎదకు ఒరిగింది. ఊపిరి తీసుకోవటం కష్టమైంది. నోరు తెరిచింది. “దూరంగా జరగండి. కాస్త గాలి తగలనివ్వండి’ అని పళనిచామి అరిచాడు. కళ్ళు మూసుకున్న అలమేలుకు పళనిచామి హృదయస్పందన వినిపిస్తోంది. అతని భుజాల మాంసఖండాలు తన చంకలను ఒత్తుతున్నాయి. కళ్ళు తెరిచినప్పుడంతా అతని ఉబ్బిన కళ్ళల్లో కరుణ కనిపిస్తోంది. అతని పుల్లటి వాసనతో కూడిన ఊపిరి, అతని నుదురు నుంచి జారి తన తలమీద బొట్లుగా రాలుతున్న చెమట నిజమైన బతుకు పిల్చుకొచ్చినట్టు, తడితో ముద్దవుతున్న ఆతని చేతిలో ఉయ్యాల ఊగినట్టు అనిపించింది.

పోలీస్‌ వ్యాన్‌ వచ్చి ముగ్గురు పోలీసులు కిందికి దిగుతున్నట్టే గుంపు చెదిరిపోసాగింది. అలమేలుకు మళ్ళీ పళనిచామి మాటలు వినిపించాయి. ఆ మాటలు అర్థం కాకపోయినప్పటికీ, అతని స్వరంలో మనిషి మనిషికి చూపించవలసిన సానుభూతి ఉన్నట్టుంది. ఇద్దరు పోలీసులు పళనిచామిని లేపి కత్తి చేసిన గాయం చూస్తుండగా అలమేలు చివరిసారి చిన్నగా మూలిగి, ఒకసారి వెక్కి, పూర్తిగా కళ్ళు మూసింది. పోలీసులు “కత్తి ఎక్కడ పెట్టావు?” అని పళనిచామిని విచారించసాగారు.

కన్నడ మూలం: ఎస్‌. దివాకర

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here