‘కృష్ణ ఘట్టం’, ఒక విభిన్న ప్రయోగం

1
12

[‘కృష్ణఘట్టం’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మ[/dropcap]హాభారతాన్ని సోషియలైజ్ చేసి తీసిన సినిమాలు మునుపు కొన్ని వచ్చాయి. కానీ, ఇటీవల విడుదలై, యువతరాన్ని ఆలోచనలో పడవేయగలిగి, మహాభారతాన్ని, సమకాలీన సమాజాన్ని సమాంతరంగా చిత్రించిన చిత్రం ‘కృష్ణ ఘట్టం’. భారతంలోని మౌసల పర్వం, ఈ సినిమాకు ప్రేరణ అనడం కంటే, ఇతివృత్తం అనడం మంచిది.

మౌసల పర్వంలో యాదవులందరూ సముద్రం ఒడ్డున ఏపుగా పెరిగిన తుంగ మొక్కలతో కొట్టుకుని మరణిస్తారు, ఒక జాతర సమయంలో. శ్రీకృష్ణుడు అక్కడే ఉండి కూడా దానిని ఆపడు. ఎందుకని ఉద్ధవుడు పరమాత్మను ప్రశ్నించే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. సినిమాలో ఒక నాటక సమాజం ఉంటుంది. మాయాద్యూతాన్ని కూడా శ్రీకృష్ణుడు ఎందుకో ఆపలేదో అని ఉద్ధవుడు పశ్నిస్తాడు. దానికి ఆయనిచ్చిన సమాధానమే ఈ చిత్రం.

తెలివి, వివేకం ఈ రెండూ వేరని దర్శకుడు చిత్రంలో చూపాడు. ప్రముఖ బ్రిటిష్ వేదాంతి బెర్ట్రండ్ రస్సెల్ ప్రవచించిన సిద్ధాంతం ఇది. మన సమాజంలో విజ్ఞానం విపరీతంగా పెరిగింది కాని, వివేకం తదనుగుణంగా పెరగలేదంటారు రస్సెల్. నాలెడ్జ్ అంటే విషయపరిజ్ఞానం. విజ్‍డమ్ అంటే ఏది మంచి ఏది చెడు అన్న దాన్ని తెలుసుకోగల విచక్షణ. దీనినీ మన పూర్వ ఋషులు ‘సదసద్వివేకము’ అన్నారు.

ఇందులో శ్రీ కృష్ణుని పాత్యను అద్భుతంగా పోషించారు డా. వెంకట్ గోవాడ. ఆయన ప్రసిద్ధ నటుడు, దర్శకుడు, ప్రయోక్త, న్యాయనిర్ణేత. ఇంతకు మునుపు శ్రీకృష్ణ పాత్ర ధరించిన రఘురామయ్య, ఎన్.టి.ఆర్, కాంతారావు గారల ప్రభావం, తన మీద ఏ మాత్రం పడకుండా, తనకు మాత్రమే స్వంతమైన అభినయాన్ని ఆవిష్కరించారు వెంకట్ గోవాడ. గతంలో ఆయన అంబేద్కర్ పాత్రలో కూడా రాణించారు. ‘తరిగొండ వెంగమాంబ’లో వెంకటేశ్వరస్వామిగా అలరించారు. కానీ ఆయన కెరీర్లో తలమానికంగా నిలువ దగింది, ‘కృష్ణ ఘట్టం’లోని కృష్ణుని పాత్ర.

శ్రీ కృష్ణ ఉద్ధవ సంవాదం ఈ చిత్రానికీ హైలైట్. పద్యాలు కాకుండా, మమూలు వచనాన్ని కూడా రాగయుక్తంగా ఆలపించి, ప్రేక్షకులను రంజింపచేయవచ్చునని చిత్ర సంభాషణల రచయిత, సంగీతత దర్శకులు నిరూపించారు.

మనుషుల్లోని హిపోక్రసీ, కుహనా మంచితనం, ఆపాదిత విలువలను నగ్నంగా బయటపెట్టడంలో దర్శకుడు కృతకృత్యుడైనాడు. ఒక వేశ్యను పెళ్లి చేసుకుంటానని, ఒక యువకుడు ముందుకువస్తాడు. ఆమె అంగీకరించదు. అతని వ్యక్తిత్వంలోని ద్వంద్వ  ప్రమాణాలను ఆమె విమర్శిస్తుంది. ఒక భూస్వామి కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించినట్లు నటించి మోసం చేస్తాడు. ఆమె చిత్రం లోని ప్రొటాగనిస్టు, శ్రీకృష్ణ పాత్రధారిని ఆశ్రయిస్తుంది. పంచాయితీ జరగబోయే ముందు, “భూస్వామి కుటుంబం పెళ్లికి ఒప్పుకోకపోతే ‘సెటిల్ మెంట్’ చేసుకొందాము, రెండులక్షలు అడుగుదామా?” అంటాడాయన, కేవలం వారి నిజస్వరూపం తెలుసుకుందామని. “కనీసం పది లక్షలయినా లేకపోతే ఎలా?” అంటుందా అమ్మాయి.

‘ఏ పాత్రను ఎవరు పోషించాలో నిర్ణయించేది మనం కాదు’; ‘నేను వృత్తిరీత్యా బజారుదాన్ని కావొచ్చు కాని నా హృదయం బజారుది కాదు’ లాంటి భావస్ఫోరకమైన సంభాషణలు; ‘మత్తునాహ్వానిస్తే వివేకానికి వీడ్కోలు పలకడమే కదా’ అన్న ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే మాటలు, మన హృదయానికి హత్తుకుంటాయి.

భగవంతుడు చూస్తూ ఊరుకోడు శిక్షించి సన్మార్గంలో పెడతాడని చూపించారు. ఒకవైపు భారతం, ఒక వైపు సమకాలీన సమాజం, ఈ రెండు పడవల్లో మనలను అద్భుతంగా ప్రయాణింపచేశాడు దర్శకుడు. మనం ఎలా ముందుకు సాగాలో భగవంతుని నుండి ఎప్పటికప్పుడు అన్యాపదేశంగా సందేశం వస్తూ ఉంటుంది. కాని మనం దాన్ని పెడచెవిన పెడతాము. పైగా దేవుడు అలా ఎందుకు చేయలేదు? ఇలా ఎందుకు చేశాడు? అని ప్రశ్నిస్తాము; అన్న చక్కని పెజెంటేషన్ సినిమాలో ఉంది.

సురేష్ పల్లా యువ దర్శకుడు. డా. వెంకట్ గోవాడ కృష్ణపాత్రలో అద్భుతంగా నటించారు. యువతరాన్ని ఆసహజంగా చూపించకుండా, ‘ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్’ అన్న అరిస్టాటిల్ సూత్రాన్ని చక్కగా పాటించాడు దర్శకుడు. ఉత్తమాభిరుచిగల వారంతా తప్పక చూడవలసిన మంచి సినిమా ఇది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here