కృష్ణ లీలలు

16
6

[ఈ కథ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. ఏవైనా పోలికలు యాదృచ్ఛికం. ఇది పాఠకులు సరదాగా చదువుకోవడానికి మాత్రమే, ఇందులో సొసైటీకి ఎటువంటి సందేశాలు లేవు.-రచయిత.]

[dropcap]ని[/dropcap]ద్ర లేచి కళ్ళు నులుముకుంటూ ఇంటి బయటకు మెల్లిగా అడుగులు వేస్తూ వచ్చి చుట్టూ చూసాను. కాస్త దూరంగా కనపడుతున్న పచ్చని పొలాల నుండీ వస్తున్న చల్లని గాలిని గుండెల నిండా పీల్చుకున్నాను. చాలా రోజుల తర్వాత స్వంత ఊరు గాలి ఎంతో హాయిగా వుంది. తూర్పున సూర్యుడు మెత్తగా ఉదయిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత స్వంత ఊరికి రావడంతో మనసుకి హాయిగా వుంది. ఈ వేపు నడిచాను.

స్నేహితులు చాలా మంది వచ్చారు. కానీ అందులో కామేశం కనపడలేదు. ఆ విషయం అడిగాను. “వాడిదంతా ప్రత్యేకం” అని నవ్వుకోవటం మొదలెట్టారు. ఎందుకలా నవ్వుతున్నారో అర్థం కాక చూస్తున్న నా మొహం చూసి “నీకే తెలుస్తుంది.. తొందర పడకు” అంటుండగానే అక్కడికి కామేశం వచ్చాడు.

అందరినీ ప్రేమగా పలకరిస్తూ, నన్ను చూసి ఆనందంగా దగ్గరికొచ్చి చేతులతో చుట్టేశాడు.

“ఎన్ని సంవత్సరాలయిందిరా నిన్ను చూసి..” అన్నాను ఆనందంగా.

“అవును రా, కాలేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదుగో ఇప్పుడే” అన్నాడు కామేశం నింపాదిగా నవ్వుతూ.

“పెళ్లి అయ్యిందా?” అడిగాను.

“ఆఁ.. ఎప్పుడో” అని అదోలా నవ్వాడు. వాడి నవ్వులో ఏదో నిగూడార్థం గోచరించింది. అదేంటో సరిగా నాకర్థం కాలేదు

“సరే, మీ ఆవిడని తీసుకుని, ఒక సారి ఇంటికి వచ్చేద్దు” అన్నాను కామేశం చెయ్యి పట్టుకుని.

“నువ్వే రారా.. కాస్త ముందు ఫోన్ చేసి రా” అని తన విజిటింగ్ కార్డు చేతిలో పెట్టాడు.

“ఇల్లెక్కడ?” అడిగాను.

కాసేపు ఆలోచించి “పక్క ఊరే.. నీకు తెలుసుగా” అని కారెక్కాడు.

అందరం పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ చాలా సేపు కూర్చుండిపోయాము.

కారు నడుపుతూ వెళ్లిపోతున్న కామేశాన్ని చూసి కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పటినుండీ చూస్తున్నాను,. చాలా గమ్మత్తయిన మనిషి వీడు. తన చదువు తప్ప మిగిలిన విషయాల్లో తల దూర్చేవాడు కాదు. చాలా నికార్సయిన మనిషని చెప్పాలి. నిక్కచ్చిగా ఉండేవాడు.

కామేశం, నేను, ఇంకా ఇద్దరం స్నేహితులం కాలేజీ సమయంలో ఎక్కువగా కలిసి మెలిసి తిరిగే వాళ్ళం. మా మధ్య చాలా అవగాహన ఉండేది. ఎంతలా అంటే, ఒకరికి నచ్చిన అమ్మాయిని, ఇంకొకరు పొరపాటున కూడా చూసే వాళ్ళు కాదు.

కాలేజీకి, క్లాసులకి క్రమం తప్పకుండ వెళ్లేవారిని పరమ శుంఠల కింద జమ కట్టే వాళ్ళం. “వాడికి సబ్జెక్టు సరిగ్గా రాదన్న మాట, లేదా అర్థం కావటం లేదన్నమాట. అందుకే ప్రతీ క్లాసుకి వెళ్తున్నాడు వెధవ” అని పగలబడి నవ్వుకునే వాళ్ళం.

మా మధ్య ఐక్యమత్యం ఎంతలా ఉండేదంటే, కెమిస్ట్రీ లాబ్‌లో ఒకడి చేతిలో గాజు బీకర్ పగిలి పోతే, మిగిలిన ముగ్గురం కూడా బీకర్లను పగల కొట్టేవాళ్ళం. అయితే మా అందరి లోకీ కామేశం మాత్రం తక్కువ అల్లరి చేసేవాడు.

జువాలజీ లాబ్‌లో ఒక మూలన, నిలువెత్తు గాజు అల్మిరాలో మనిషి స్కెలిటన్ వేలాడదీసి ఉండేది. మనిషి శరీరంలో వుండే అన్ని ఎముకల పేర్లు అక్కడ రాసి ఉండేవి.

ఒక రోజు ఆ స్కెలిటన్ ముందు నిలబడి కొందరు విద్యార్థులు నిలబడి నవ్వుకోవటం చూసి అదేంటో అని మేము కూడా వెళ్లి చూసాం.. తీరా అక్కడ చూసిన తర్వాత నవ్వు ఆగింది కాదు.. ఆ అద్దాల బీరువా మీద “ఇది మొదటి ప్రిన్సిపాల్ యొక్క అస్థిపంజరం” అని రాసిన స్టికర్ అతికేసి వుంది.

అదెవరు రాశారు? అని కాలేజీలో పెద్ద చర్చ జరిగింది. కానీ రాసిందెవరో కనిపెట్టలేక పోయారు. కానీ నేను మాత్రం ఆ చేతి రాత మా కామేశం గాడి రాతను పోలి ఉండటం గమనించాను. నేనా మాట అడిగితే వెంటనే వాడు ఒప్పుకోలేదు, కానీ చాలా రోజుల తర్వాత ఒక రోజు ఒప్పుకున్నాడు. ‘హార్నీ దొంగ వెధవా!!’ అని వాడి మొహం చూసి మనసు తీరా పగలబడి నవ్వాను.

కాలేజీ అయింతర్వాత స్వంత వ్యవసాయం, వ్యాపారం చూసుకునేవాడు. ఉద్యోగరీత్యా నేను కొన్ని ఊర్లు తిరిగి స్వంత ఊరికి పోస్టింగ్ చేయించుకుని వచ్చిన కొన్ని రోజుల తర్వాత కామేశం ఈ రోజు కనపడ్డాడు.

తర్వాత కొన్నాళ్ళకు సెలవు నాడు కామేశాన్ని కలుద్దామని అనిపించి ఫోన్ చేసాను. “ఎక్కడ కలుద్దాం కామేశం” అన్నాను.

“నేనొచ్చి తీసుకెళ్తాను కాసేపటిలో” అన్నాడు అటువైపు నుండీ.

అన్నట్లుగానే కారేసుకొచ్చి మా ఇంటి ముందు ఆపాడు.

నే కూర్చోగానే కారు కదిలింది. “ఒక ముఖ్య విషయం చెప్పాలి” అని నా వేపు అనుమానంగా చూసాడు.

చెప్పమన్నట్లుగా తల ఊపాను.

“ఇప్పుడు మనం ఊరిలో ఇంటికి వెళ్తున్నాం. అక్కడ వేరే విషయాలేవీ మాట్లాడొద్దు.” అన్నాడు కాస్త భయంగా మొహం పెట్టి.

నాకు విషయం అర్థం కాలేదు. “దేని గురించి మాట్లాడొద్దు?” అన్నాను అనుమానంగా చూసి.

“నీకందరూ చెప్పే వుంటారు ఆ విషయాలు” అన్నాడు.

“ఏమిటోరా.. నాకర్థం కావటం లేదు” అన్నాను భుజాలెగరేసి.

“సరే” అని కారు నడుపుతూ వుండిపోయాడు. వాడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాను.

లోనికెళ్ళగానే ఎదురొచ్చిన అమ్మాయిని చూపించి “మా ఆవిడ” అని పరిచయం చేసాడు. నేను నమస్కారం పెట్టగానే “రండి అన్నయ్య గారు భోజనం చేద్దురు గానీ ఇప్పటికే ఆలస్యమైంది” అని నిండుగా నవ్వుతూ ఆహ్వానించింది.

“మా ఆవిడ వంటలు అద్భుతం. అసలు ఈవిడ లేకుంటే నేనింత సంతోషంగా వుండేవాడినే కాదు. ఎప్పుడో నేను చేసుకున్న అదృష్టం నా భార్యగా తను దొరకటం” అన్నాడు కామేశం.

“ఆఁ చాలు ఈ నాటకాలు, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎందుకు?” అని కసురుకుంది.

“అలా మాట్లాడాకే, నువ్వలా అంటే నేనేమై పోవాలి” అన్నాడు మొహం దీనంగా పెట్టి.

వాడి మొహం చూసి, కాస్త మెత్తపడి “సర్లే రండి..” అంది కామేశం భార్య.

వాడింట్లోకి వెళ్లి భోజనాలు చేసి ఇంటి వెనక పెరట్లో విశాలంగా పెరిగిన మామిడి చెట్టు నీడలో వాలు కుర్చీల్లో వాలాము.

భుక్తాయాసంతో కూర్చున్న మా దగ్గరికి కామేశం భార్య వక్క, ఆకు తీసుకొచ్చి మా చేతికిచ్చింది.

కామేశం వైపు చూసి “మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు రా” అన్నాను.

“సెలక్షన్‌లో మీ ఫ్రెండ్‌కు మంచి తెలివి వుందన్నయ్యా” అంది గమ్మత్తుగా నవ్వుతూ, కామేశం వేపు ఓరగా చూసి.

అది విని, మనసు నిండుగా నవ్వేసాడు కామేశం.

వాడి భార్య వెళ్ళిపోగానే మొహం గంభీరంగా పెట్టి “నీకో విషయం చెప్పాలి. నీకు బహుశా తెలిసే ఉంటుంది” అన్నాడు.

“ఏమిటా సస్పెన్స్.. ఉపోద్ఘాతం ఎందుకు.. చెప్పు” అన్నాను అసహనంగా.

“నేను రెండో పెళ్లి చేసుకున్నాను” అన్నాడు.

అది విని షాక్ తిని ఏమీ మాటలు రాక అలా చూస్తుండిపోయాను.

కాసేపు మౌనంగా వుండి మళ్ళీ అన్నాడు “ఇద్దరు భార్యలు నాకు”.

“ఎందుకలా.. రెండవ పెళ్లేమిటీ.. చక్కగా వుంది ఈ అమ్మాయి. ఇంకో పెళ్లి.. ఎందుకు” అన్నాను విస్తుపోయి.

“అదంతా పెద్ద తలనొప్పి కథ. చెప్తాను మళ్ళీ” అన్నాడు కామేశం.

వీడు రెండో పెళ్లేందుకు చేసుకున్నాడని ఎంతాలోచించినా నాకు మాత్రం కారణం అర్థం కాలేదు.

మరుసటి రోజు నేను స్నేహితులతో కలిసి చెరువు గట్టు మీద కూర్చుని సిగరెట్లు తాగుతూ లోకాభిరామాయణం మాట్లాడుతుండగా కామేశం పెళ్లి సంగతేమిటో తెలుసుకోవాలని ఉత్సుకతో ఆ విషయం పై చర్చ మొదలుపెట్టాను.

“వాడు కనపడినంత అమాయకుడు కాదు.. ఆమ్మో” అన్నాడొకడు.

“అవును, వాడు బాగా తెలివైనవాడు.. చక్కగా ఇద్దరు భార్యలతో గడిపేస్తున్నాడు జీవితం” అన్నాడింకొకడు నన్ను చూసి అదోరకంగా నవ్వుతూ.

“ఇద్దరు భార్యలకు వాళ్ళ పుట్టింటి నుండీ భూములొచ్చాయి. ఇంకే ఆ దెబ్బతో వీడు ఊర్లో పెద్ద భూస్వామి అయిపోయాడు.” అంటూ భళ్ళున నవ్వాడొక స్నేహితుడు. అందరూ వాడికి జత కలిపారు.

“ఇంతకీ ఎలా జరిగింది” రెట్టించాను, మళ్ళీ.

“ఎలా చేసాడో గానీ ఓ ఫైన్ మార్నింగ్ రెండో భార్యతో ఊరిలో దిగాడు. వాడికి జతగా తోడు కొందరు తాగుబోతు వెధవలు. మాక్కూడా అసలు తెలీనీకుండా భలే చేసుకొచ్చాడు” అన్నాడింకో స్నేహితుడు..

“అందుకే నాయనా.. తక్కువగా మాట్లాడేవాడిని నమ్మొద్దు అని అంటారు” అన్నాడు మరో స్నేహితుడు సూక్తి చెప్తున్నట్లుగా .

నిజమే అనుకుని ఇక ఆ విషయం వదిలేసి వేరే మాటలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సాయంకాలం చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆకాశంలో పక్షులు బారులుగా ఎగురుతున్నాయి. చెరువులో కప్పల అరుపులు, పొలాల్లో నుండీ కీచురాళ్ళ రొద మొదలయ్యింది. అందరం లేచి బట్టలకంటుకున్న దుమ్ము, గడ్డి దులుపుకొని ఇళ్లకు బయలుదేరాం.

అయితే కామేశం గాడు చేసిన పని ఎవరూ చెప్పలేక పోయారు. తల దులుపుకుని ఆ విషయాన్ని వదిలేసాను.

కొన్ని రోజుల తర్వాత కామేశం స్వయంగా తానే వచ్చి అన్నీ చెప్పేస్తాడని నేనసలు ఊహించలేదు.

ఆ రోజు ఆదివారం, నేను టిఫిన్ చేసి టీవీ చూస్తూ కూర్చున్న సమయానికి ఇంట్లోకి అడుగు పెట్టాడు కామేశం.

“రారా కామేశం” అని కూర్చోబెట్టి, అమ్మ ఇచ్చిన కాఫీ తీసుకొచ్చి ఇద్దరం తాగుతున్నప్పుడు మెల్లిగా అన్నాడు కామేశం “పద అలా వెళ్ళొద్దాం బయటకు. భోజనం అక్కడే”

“ఎటు వేపు? ఎక్కడ భోజనాలు” అన్నాను.

“చెప్తా పద కారెక్కు” అని లేచి బయటకు నడిచాడు. నేనూ వెనకాలే నడిచి కారెక్కాను.

“ఇప్పుడు మీ చిన్న వదిన ఇంటికెళ్తున్నాం” అన్నాడు.

“సరే వెళ్దాము.. కానీ చాలా మంచి పేరున్న నీవు ఇలా భార్య ఉండగానే రెండో వెళ్లేందుకు చేసుకున్నట్లు?” అని ఇక ఉండబట్టలేక అడిగేసాను.

“ఏం చేయాలి రా.. మా పెళ్లయిన కొన్నాళ్ళకు మీ పెద్ద వదినకు తెలీని జబ్బు మొదలయ్యింది. సిటీ తీసుకెళ్లి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో చూపించాను. లాభం కనపడలేదు. జబ్బేమిటో తెలీదు.. కొందరేమో ఊపిరితిత్తుల వ్యాధి అన్నారు. మందులు వాడుతూ వున్నాం. రోజు రోజుకి ఆరోగ్యం దెబ్బ తిని మంచం పట్టింది. దాదాపు సంవత్సరం చూసాం కానీ లాభం లేదు. నాకు జీవితం విరక్తి మొదలయ్యింది. అప్పుడు పెద్దలు కొందరు ఇదుగో ఇలా రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. దానికి మంచం మీదున్న తాను కూడా నన్ను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొమ్మని ఒప్పించింది. ఇక తప్పనిసరి అయి ఒప్పుకున్నాను.” అని దిగాలుగా చెప్పసాగాడు.

కామేశం మొహం చూసాను. చాలా బాధేసింది.

మళ్ళీ చెప్పసాగాడు కామేశం “నా సంగతి తెల్సుగా.. నాకిలాంటివి నచ్చవు. అయినా తప్పని సరి అయ్యి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది”

“మరి పెద్ద భార్య బాగానే ఉందిగా ఇప్పుడు. పైగా కొడుకు పుట్టాడు కదా” అన్నాను కాస్త అనుమానంగా.

“అవును, నాకు రెండో పెళ్లి అయిన తర్వాత దేవుని దయతో, ఆమె ఆరోగ్యం పుంజుకుని బాగయింది.” అన్నాడు కళ్ళు తుడుచుకుని.

“సరే సరే బాధపడకు. కొన్ని మన చేతుల్లో వుండవు. అన్నీ సాఫీగా అయిపోయాయిగా, ఇప్పుడెందుకు ఫీల్ అవ్వడం” అన్నాను సముదాయిస్తూ.

“సాఫీగా ఎక్కడయ్యింది. బోలెడు తల నొప్పులు. సరిగా మా మామ రూపంలో అసలు విలన్ అవతరించాడు. రెండో పెళ్లెలా చేసుకుంటాడో చూస్తా అని ప్రతిజ్ఞ పట్టి మా ఇంటి వద్దే వచ్చి కూర్చున్నాడు.” అని చిన్నగా నవ్వాడు.

“మరేలా చేసుకున్నావు?” అడిగాను ఆసక్తిగా.

“అయ్యో అదొక పెద్ద అడ్వెంచర్.. సాహస కృత్యం, చాలా బాధలు పడాల్సి వచ్చింది” అని నవ్వాడు కామేశం.

“మళ్ళీ ఏమైంది” అని కాస్త టెన్షన్‌తో అడిగాను.

“అమ్మాయిని చూసి, వాళ్ళింట్లో నా పరిస్థితి అంతా చెప్పి ఒప్పించి ముహూర్తానికి సమయం అవీ మాట్లాడి వచ్చేవాడిని, ఈ విషయం తెలిసీ మా మామగారు వాళ్ళింటికి వెళ్లి నానా గొడవ చేసి, బెదిరించి, అన్నీ కాన్సిల్ చేసి వచ్చేవాడు. ఈ విధంగా అన్ని సంబంధాలను చెడగొట్టేవాడు” అని చెప్పటం ఆపాడు.

అది విని, కామేశం మొహం చూసి నాకు నవ్వు ఆగింది కాదు. “మరేం చేసావు?” అడిగాను.

“అప్పుడు.. ఈ సంబంధం విషయం ఎవరికీ తెలీకుండా ఉంచి.. అమ్మాయి తండ్రికి ఒప్పించి, పెళ్లి నాడు నా కారులో బయలుదేరి, ఆ తర్వాత రకరకాల కార్లు మారి, చివరికి ముందనుకున్న గుడికి చేరుకొని, త్వరగా పెళ్లి ముగించుకుని ఇంటికి వచ్చేసాను’’ అని నవ్వటం మొదలెట్టాడు.

“ఆ తర్వాత ఏం జరిగింది?” అన్నాను.

“ఆ తర్వాత మా మామ పెద్ద గొడవ చేసి, ఆఖరున వాళ్ళమ్మాయి పేరు మీద సగం ఆస్తి ఇస్తానని నేనొప్పుకున్న తర్వాత వెళ్ళిపోయాడు” అని చిరునవ్వుతో ముగించాడు.

“ఇంతకీ ఇదేంటి నీ ఆరోగ్యం కాస్త దెబ్బ తిన్నట్లుగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎందుకని?” అన్నాను మాట మారుస్తూ.

“అవును. దానికి కారణం ఇదుగో వీళ్లిద్దరితో పడుతున్న టెన్సన్స్” అన్నాడు వేళ్ళతో తల నొక్కుకుంటూ.

“ఈ లెక్కన అందరూ నువ్వేదో ఎంజాయ్ చేస్తున్నావు చక్కగా ఇద్దరు భార్యలతో అనుకున్నట్లు కాకుండా నీకు నిజంగా మనశాంతి లేనట్లుంది” అన్నాను.

“అవును. భలేగా కనిపెట్టావు. నిజంగా నాకు జీవితంలో శాంతి కరువయ్యింది” అని కళ్ళు పెద్దవి చేసి విస్మయంతో చూసాడు.

నేను నవ్వుతుండటం చూసి అన్నాడు “ఎలా చెప్పగలిగావు ఈ విషయం? నిజం చెప్పావు! నన్ను ఆవిడా నమ్మదు, ఈవిడా నమ్మదు. అక్కడే అన్నీ డబ్బులిస్తున్నావు అని ఆవిడంటుంది, ఈవిడ అదే మాట అంటుంది.” అని నొసటి మీద అరచేత్తో బాదుకున్నాడు.

కామేశం చెప్పింది విన్న తర్వాత వాడి మీద బయట స్నేహితులు చెప్పిన చెడు అభిప్రాయం తొలగిపోయి, మంచి వాడు పాపం అనవసరంగా అందరి దృష్టిలో చెడ్డవాడు అయ్యాడు అనుకుని జాలి పడ్డాను. ఎవరి కష్టాలు వారే అర్థం చేసుకుంటారు. దూరం నుండీ చూసే వారికివేవి అర్థం కావు అనుకుని నిట్టూర్చాను.

“ఎన్నెకరాల భూమి రాసిచ్చావు మరి?”

“ఏమీ రాయలేదు, మళ్ళీ ఎవరూ అడగలేదు. అలా గడిచిపోయింది” అని చెప్పి, కారు ఒక పెద్ద బంగాళా ముందు ఆపాడు.

కారు దిగి లోపలికెళ్ళి కుర్చీలో కూర్చున్న తర్వాత “ఇదుగో.. మీ చెల్లెలు” అంటూ చక్కని అందమైన అమ్మాయిని పరిచయం చేసాడు.

నమస్కారం పెట్టి “అన్నయ్య కూర్చోండి. మీ గురించి విన్నాను. ఈ రోజు ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి” అంది కామేశం రెండవ భార్య.

“మీ పెళ్లి ఆల్బమ్ చూపించు” అన్నాను ఏమీ తోచక.

అది విన్న కామేశం భార్య నా మాట అందుకుని “ఎక్కడి ఫోటోలు అన్నయ్య. ఈయన గారు దొంగ పెళ్లి చేసుకున్నాడు’’ అంది చిరు కోపంతో.

“తెలుసమ్మా.. వాడైనా ఏం చేస్తాడు మరి, వాడి మొదటి భార్య ఆరోగ్యం, పెద్దల మాట కాదనలేక అలా చేసాడు” అన్నాను వాడి వేపు సానుభూతిగా చూసి.

“అలా చెప్పాడా మీకు. అంత ఉత్తిదే అన్నయ్య. ఆమెకు కాస్త ఆరోగ్యం బాగాలేని మాట నిజమే. కానీ ఈయన, నా మీద మనసు పడి, నా వెంట పడి, మా వాళ్లకు కూడా ఇవే అబద్ధాలు చెప్పి, మొదటి భార్య బ్రతకదు అని మాటలు చెప్పి నన్ను చేసుకున్నాడు. ఆమె ఆరోగ్యం చక్కగా అయ్యి బాబు కూడా పుట్టాడు.” అని కోపంగా అంది.

అవి విన్న నాకు నోట మాట రాలేదు, కామేశం వేపు విస్మయంగా చూసాను. మొహం అసహాయంగా పెట్టి నా వేపు ఒక వెర్రి నవ్వు నవ్వాడు.

హార్నీ వెధవ అనుకున్నాను.

“లెండి అన్నయ్య భోజనానికి” అంది.

“నేను తినొచ్చాను” అన్నాడు మెల్లిగా.

“ఇక్కడకు వస్తున్నావని తెలుసుగా, ఎందుకు తినొచ్చావు. పెద్ద భార్య అంటే అంత ప్రేమా? అయినా సరే నే పెట్టేది తినాల్సిందే, లేచి రా” అంటూ గయ్యిన అరిచింది.

భయంతో లేచి “సరే సరే.. నువ్వు చెప్పింది కాదంటానా ఎప్పుడైనా? నువ్విలా కోపగించుకుంటే నేనేమై పోవాలి” అని మొహం దీనంగా పెట్టి, డైనింగ్ టేబుల్ వేపు నడుస్తున్న కామేశం, వెనక్కి తిరిగి మెల్లిగా నా వేపు చూసి చిన్నగా నవ్వుతూ చిలిపిగా కన్ను గీటాడు. అది గమనించిన చిన్న భార్య, ఫక్కున నవ్వి “నాటకాలు చాలు ఇక రండి.. ఇలా చేసే నన్ను బుట్టలో వేశారు” అంది.

ఇది చూసిన నేను ‘అమ్మా.. కామేశం.. గొప్ప అమాయకుడిలా అందరినీ భలే నమ్మించావు రా’ అనుకుని నవ్వుతూ లేచాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here