‘క్షణ క్షణం’ ఇప్పుడు విడుదలయ్యుంటే?

8
10

[dropcap]నే[/dropcap]ను ఉద్యోగం చేస్తున్నపుడు నాలాంటి సినిమాప్రియులు కొందరు పరిచయమయ్యారు. నాకంటే వయసులో చిన్నవాళ్ళు. ప్రపంచభాషల చిత్రాలు చూసేవారు. కానీ తమ మూలాలు మరచిపోలేదు.

దీపక్ ఉత్తరాఖండ్ వాడు. పర్వతప్రాంతాలంటే ప్రాణం. దేవభూమి ఉత్తరాఖండ్ అంటే భక్తి. రఫీ అంటే ఆరాధన. హారర్ సినిమాలంటే పిచ్చి. రఫాయెల్ నదాల్ టెన్నిస్ ఆట అంటే అభిమానం. ప్రస్తుతం ఫిక్షన్ రచయితగా హిందీలో, ఆంగ్లంలో రచనలు చేస్తున్నాడు.

శ్రీదేవి ‘మామ్’ సినిమా చూశాక వాట్సాప్‌లో మెసేజ్ చేశాను. “‘మామ్’ చూశాను. అక్కడక్కడా కృత్రిమత్వం ఉన్నా మొత్తానికి బావుంది.”

“శ్రీదేవి ‘మామ్’ఏనా?”

“అవును.”

“‘చాల్ బాజ్’ చూసినప్పటి నుంచి నేను ఆమె ఫ్యాన్ని.”

“ఐతే నువ్వు ‘క్షణ క్షణం’ చూడాలి.”

యూట్యూబ్ లో వెతికాను. సబ్ టైటిల్స్ తో పాటు ‘క్షణ క్షణం’ ఉంది.

“యూట్యూబ్ లో ఉంది చూడు. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి” అన్నాను.

“సబ్ టైటిల్స్ లేకుండా తమిళ సినిమాలు చూశాను నేను” అన్నాడు.

మర్నాడు మెసేజ్ చేశాడు “’క్షణ క్షణం’ చూశాను. What a delightful thriller! సినిమా పొడుగునా శ్రీదేవి ముఖంలో ఆ అయోమయం భలే బావుంది. పరేష్ రావల్ తెలుగు సొంతంగా మాట్లాడాడు కదా. బాగా మాట్లాడాడా?”

“రామ్ గోపాల్ వర్మ సంభాషణల్లో సహజత్వం తీసుకొచ్చాడు. పరేష్ రావల్ ఉచ్చారణ గొప్పగా లేకపోయినా ముద్దొస్తుంది.”

ఆ తర్వాతెప్పుడో మేమిద్దరం ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో సినిమాల గురించి ప్రస్తావన వచ్చినపుడు “‘క్షణ క్షణం’ is Sridevi’s best. ఒకవేళ నేను భవిష్యత్తులో అంతవరకు చూడని శ్రీదేవి సినిమా చూసినా ఇది మాత్రం మారదు” అన్నాడు.

***

ఇషితా బెంగాల్‌కి చెందిన యువతి. ఫ్రెంచ్ బాష నేర్చుకుంది. రవీంద్రుని రచనలంటే ఇష్టం. సత్యజిత్ రే సినిమాలు, మార్టిన్ స్కోర్సేసి సినిమాలు, విజయ్ దేవరకొండ సినిమాలు చూస్తుంది.

“‘అర్జున్ రెడ్డి’లోని ఇంటెన్సిటీ నచ్చింది” అంది.

“కానీ ఈ సినిమా వివాదస్పదమైంది. బూతు మాటలూ అవీ…”

“కాలేజీ వాళ్ళు అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు?”

నిజమే కదా అనిపించింది. కానీ ఉన్నదున్నట్టు చూపించడమే కళ యొక్క ఉద్దేశమా? కాదంటాను నేను.

నేను చెప్పగా ఎప్పుడో వీలు చూసుకుని ‘క్షణ క్షణం’ చూసింది. ఆమె చూసిందని కూడా నాకు తెలియదు. వాట్సాప్ గ్రూప్‌లో పైన చెప్పిన చర్చ జరుగుతున్నపుడు “నేను ఏ సినిమాలు చూడాలని అడిగేవారికి ‘క్షణ క్షణం’ చూడమని చెబుతాను. నేనేదో సినిమాల గురించి పెద్ద పరిజ్ఞానం ఉన్నదానిలా పోజు కొట్టేస్తాను” అంది. తెలుగు రాష్ట్రాల బయట సినిమా పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే తెలిసిన సినిమాలా మిగిలిపొయింది ‘క్షణ క్షణం’.

ఈ సంఘటనలు గత నాలుగైదు ఏళ్ళలోనే జరిగాయి.

***

‘క్షణ క్షణం’ గురించి ఎందరో ఎంతో మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? నిజమే. సంభాషణల్లోని సహజత్వం గురించి మాత్రం మాట్లాడతాను.

బ్యాంకు దోపిడీ తర్వాత గ్యాంగ్‌లో ఒకడు డబ్బు పట్టుకుని పోయాడని తెలిశాక గ్యాంగ్ లీడర్ పరేష్ రావల్ తన తోటివాడితో “నువ్వెందుకు మొహం అలా పెట్టావ్? పోనీ. జానే దేవ్. ఇంక బ్యాంకులే లేవా?” అంటాడు. ఎంత ధీమా! మంచి నాయకత్వ లక్షణం ఇది. ఎవరూ నీరుగారిపోకుండా ఉత్సాహపరచటం.

డబ్బు పట్టుకుపోయినవాడు ఫొటో స్టూడియోలో ఉన్నాడని తెలిసి అక్కడికి చేరిన పరేష్ వాడు వెనక ఉన్న చిన్న కిటికీ లోనుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంటే చూసి “ఎక్కడికో వెళ్తున్నట్టున్నావ్?” అంటాడు. వెటకారం!

డార్క్ రూమ్ (ఇప్పటి పిల్లలకి తెలియదేమో! అప్పట్లో ఫొటోలు డార్క్ రూమ్‌లో ప్రింట్ చేసేవారు) లో వాణ్ని కట్టేసి కొడుతూ వేడికి తట్టుకోలేక “ఫ్యాన్ లేదా ఇక్కడ?” అంటాడు. ఎలాంటి వాడికైనా శీతోష్ణాలు తప్పవుగా!

ఈ లోపల శ్రీదేవి వచ్చి ఫోటో స్టూడియో యజమాని దగ్గర తన ఫొటోలు తీసుకుంటుంది. ఫొటోలు చూసుకుని “అయ్యో! నల్లగా ఉన్నానేంటి? ప్రింట్ డార్క్ అయిందా? మొదటే ముఖం అందం!” అంటుంది. సామాన్య యువతి మనస్తత్వం ఇంతే. తానెంత అందంగా ఉన్నా అందంగా లేననుకుంటుంది. ఫోటోలు సరిగా రాకపోతే నిరాశపడుతుంది. “పరవాలేదులే. అప్లికేషన్ కే కదా” అని సరిపెట్టుకుంటుంది శ్రీదేవి.

ఆటోలో ఇంటికి వెళ్ళి ఆటో డ్రైవర్‌తో గొడవపడుతుంది.

ఆటో డ్రైవర్: ఔర్ పాంచ్ రుపయే దేవో (ఇంకో ఐదు రూపాయలు ఇవ్వు).

శ్రీదేవి: ఔర్ పాంచ్ రుపయే… ఎందుకు… ఇవ్వాలి?

ఆటో డ్రైవర్: యహాసే రిటర్న్ సవారీ నహీ మిల్తా (ఇక్కడి నుంచి తిరుగు బేరం దొరకదు).

శ్రీదేవి: అరే. ఇక్కణ్నుంచి రిటర్న్… ఈజీ మిల్తా హై.

ఆటో డ్రైవర్: పాంచ్ రుపయే కే లియే ఝూఠ్ బొల్తే క్యా? దేవో. (ఐదు రూపాయల కోసం అబద్ధమాడతావా? ఇవ్వు.)

శ్రీదేవి: యే తో బహుత్ అన్యాయ్ హై (ఇది చాలా అన్యాయం). పెహలే… చెప్పాలి కదా? ఎందుకు… చెప్పలేదు?

ఇలా గొడవపడినా చివరకు ఇవ్వకతప్పదు. ఆటో డ్రైవర్ “యాడేడకెల్లి ఒస్తరో ఊర్లకెల్లి” అనుకుంటూ వెళ్ళిపోతాడు.

అప్పట్లో ఆటోలకు మీటర్లుండేవి. మీటరులో ఎంత చూపిస్తే అంత డబ్బు ఇవ్వటం పరిపాటి. కొందరు డ్రైవర్లు ఇలా గొడవ చేయటం కూడా మామూలే. దాన్నెంతో సహజంగా చూపించారు. డ్రైవర్ ఉర్దూలో మాట్లాడుతుంటే శ్రీదేవి తెలుగు, ఉర్దూ కలిపి మాట్లాడుతుంది. “అన్యాయ్” అనే పదం హిందీలో ఉన్నా వాడుకలో ఉర్దూ పదం “నాయిన్సాఫీ” వాడతారు. శ్రీదేవి మాత్రం “అన్యాయ్” అంటుంది. తెలుగు పదం కదా! చివరకి డ్రైవర్ తెలుగులో మాట్లాడుతూ వెళ్ళిపోవటం కొసమెరుపు. ఇద్దరూ తెలుగు వాళ్ళైనా ఉర్దూలో మాట్లాడుకుంటూ ఉంటారు. హైదరాబాద్ వాళ్ళపై వ్యంగ్యాస్త్రం ఇది. ‘పల్లెటూరి వాళ్ళు’ అని ఈసడించుకుంటాడు డ్రైవర్. అప్పటికే శ్రీదేవి తన స్నేహితురాలితో “మాకు ఊళ్ళో బోల్డంత డబ్బు ఉంది. ఏదో టైంపాస్ కోసం ఉద్యోగం చేస్తున్నా” అంటుంది. అది గుర్తొచ్చి మనకి నవ్వొస్తుంది.

అపార్ట్మెంట్ మెట్లెక్కుతుంటే కింది ఫ్లాట్ ముసలాడు అడ్డుపడతాడు. “ఈరోజు హాఫ్ డే కదా. ఇంత లేటయిందే?” అంటాడు. అప్పట్లో స్కూళ్ళు, ఆఫీసులు శనివారం సగం రోజే పనిచేసేవి.

“నేనెప్పుడొస్తే మీకెందుకండీ” చిరాకుని దాచుకుంటూ అంటుంది శ్రీదేవి. అప్పటికీ ఇప్పటికీ ఆడవాళ్ళకు ఈ వేధింపులు తప్పటం లేదు.

ఇంట్లో మర్డర్ జరిగాక పారిపోయి ఒక కాఫీ హోటల్‌కి వచ్చిన శ్రీదేవికి మళ్ళీ పోకిరీల వేధింపులు తప్పవు. ‘దేవుడా దేవుడా దేవుడా’ అనుకుంటుంది పంటిబిగువున. ‘దేవుడా’ అనే ఊతపదం సినిమాలో ప్రమాద పరిస్థితుల్లో అంటూనే ఉంటుంది.

వెంకటేష్ సహాయంతో అడవిలోకి పారిపోయిన శ్రీదేవిని పోలీసులు, పరేష్ గ్యాంగ్ వెంబడిస్తారు. పరేష్ నుంచి తప్పించుకున్న తర్వాత వెంకటేష్ విషయమేమిటని అడుగుతాడు. కత్తెరతో ఒకడ్ని పొడిచానని చెబుతుంది. “చంపేశావా?” అంటే “ఊహూ. పొడిశానంతే” అంటుంది. “నువ్వు పొడిశాక వాడు చచ్చిపోయాడు” అంటే “ప్చ్. నేను పొడిసింతర్వాత చచ్చిపోయాడు” అంటుంది ‘తర్వాత’ అనే పదాన్ని ఒత్తిపలుకుతూ. ఆ పరిస్థితిలో ఉన్నవారు ఎలా కంగారుపడుతూ ఉంటారో అలాగే సహజంగా ఉంటుంది శ్రీదేవి నటన. ఇంకో దర్శకుడైతే ప్రేక్షకుల తెలివిని తక్కువ అంచనా వేసి నాటకీయంగా తీసేవాడేమో!

పరేష్ వాళ్ళ జిప్సీ (ఒక రకం కారు) దొంగిలించి అందులో నగరానికి తిరిగి వస్తారిద్దరూ. మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు మార్చుకోవటానికి బట్టల షాపుకి వెళతారు. బ్రహ్మానందం షాపు యజమాని. వీళ్ళ వాలకాలు చూసి అడ్డుపడినా ఇంగ్లీష్ మాట్లాడటంతో లోపలికి రానిస్తాడు. ఆ తర్వాత సన్నివేశం చూడాల్సిందే కానీ చెప్తే సరిపోదు. బ్రహ్మానందం, శ్రీదేవి భలే పండించారు.

ఫొటో స్టూడియో కవర్లో ఉన్న క్లోక్ రూమ్ రసీదు చూసి డబ్బు ఎక్కడుందో తెలిశాక దొంగ అయిన వెంకటేష్‌కి దుర్బుద్ధి పుడుతుంది. ఇప్పుడే వస్తానని చెప్పి ప్రెండ్‌తో మాట్లాడటానికి ఇంటి దగ్గరున్న బార్‌కి వెళతాడు. ఇంతలో పరేష్ ఆ ఇంటికి వస్తాడు. “జిప్సీలో ప్రయాణం బాగా జరిగిందా?” అంటాడు శ్రీదేవితో అక్కసుగా. కిసుక్కున నవ్వుకోవటం మన వంతు.

వెంకటేష్ ఇప్పుడే వస్తానని చెప్పివెళ్ళాడని అంటుంది శ్రీదేవి. “వాడింకేం వస్తాడు. డబ్బు పట్టుకుని చెక్కేసి ఉంటాడు. జేబులు కొట్టేసే రకం” అంటాడు పరేష్. “ఆయనేం అలాంటివారు కాదు. అసలాయన దొంగగా ఎందుకు మారారంటే..” అంటూ వెంకటేష్ చెప్పిన కాకమ్మ కథ చెబుతుంది. నొసలు ముడివేసి ఓపిగ్గా వింటాడు పరేష్. ఇంతలో వెంకటేష్‌ని బార్ నుంచి లాక్కువస్తారు పరేష్ గ్యాంగ్ వాళ్ళు. “ఫ్రెండ్‌తో కలిసి పోతుంటే పట్టుకొచ్చాం” అంటారు. పరేష్ శ్రీదేవి వైపు తిరిగి “ఆయనేం అలాంటివారు కాదు” అంటూ వెక్కిరిస్తాడు. ఉక్రోషంతో వెంకటేష్‌ని తిట్టిపోస్తుంది శ్రీదేవి. విసిగిపోయిన పరేష్ “షటప్! నా కవరిస్తే నేను వెళతాను” అంటాడు డబ్బు వసూలుకి వచ్చిన అప్పులవాడిలాగా. విలన్లు కూడా మనుషులే. వాళ్ళకీ చిరాకులూ, విసుగులూ ఉంటాయి. అలాగని ఎల్లప్పుడూ క్రూరంగా ఉండరు. హాస్యచతురత (సెన్స్ ఆఫ్ హ్యూమర్) కూడా ఉంటుంది.

కథ మలుపులు తిరిగి అందరూ ఒక రైల్లో చేరతారు. ఈ రైలు సీన్లు అద్భుతంగా తీశాడు రామ్ గోపాల్ వర్మ. కొత్త కెమెరా యాంగిల్స్‌తో అబ్బురపరిచాడు కెమెరామన్ ఎస్. గోపాలరెడ్డి. ఇందులో వర్మ హస్తం ఉందనేది కాదలేని నిజం. ఎడిటింగ్‌లో అయోమయం లేకుండా కథ నడిపించారు. “జామురాతిరి” పాట తప్ప మిగతా పాటలు కథకు అడ్డుపడుతున్నట్టుంటాయి. ఇక్కడ సహజత్వం లోపించిందనే చెప్పాలి. ప్రేయసీప్రియులు పాటలు పాడుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు… నిజజీవితంలో అలా జరగకపోయినా. ఇక్కడ నాయికానాయకులు అపరిచితులు. ప్రేక్షకులకి కావాలి కాబట్టి పాటలు పెట్టారంతే. కానీ పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయనేది మాత్రం ఒప్పుకోవాలి.

దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌కి నంది అవార్డులు వచ్చాయి. శ్రీదేవి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. సరదాగా సాగినట్టుండే సినిమాకి ఇన్ని అవార్డులు ఇచ్చిన కమిటీని అభినందించాలి. సినిమా అంటే కథ కన్నా కథనమే ముఖ్యం అని గుర్తించారు. సీరియస్‌గా ఉంటేనే అవార్డులిస్తాం అనలేదు.

ఆమధ్య రెడిట్ అనే సోషల్ మీడియా సైట్లో ఒక విదేశీయుడు ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘దెయ్యం’, ‘క్షణ క్షణం’ సినిమాలు చూసి “ఈ దర్శకుడు చాలా ప్రతిభ కలవాడు. కథలు పాతవే అయినా తీసిన తీరు బావుంది” అన్నాడు. ‘రొమాన్సింగ్ ద స్టోన్’ సినిమా నుంచి ‘క్షణ క్షణం’కి ప్రేరణ పొందానని వర్మ ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఇప్పటికీ సినీప్రియులని అలరిస్తూనే ఉన్నాయి వర్మ పాత సినిమాలు. ‘క్షణ క్షణం’ లాంటి సినిమా మళ్ళీ తీస్తారా అంటే “ఆ ఇన్నోసెన్స్ నాలో ఇప్పుడు లేదు కాబట్టి తీయలేను” అన్నాడు వర్మ. నిజమే! చిన్న వయసులో ఉన్న ఆశలు, ఆశయాలు, స్వప్నాలు వయసు పెరిగేకొద్దీ మాసిపోయి మనసు మొద్దుబారిపోవటం మామూలే. దాన్ని అరికట్టాలంటే ఆధ్యాత్మికత అలవాటు చేసుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. కొత్త ఆలోచనలతో కొత్త కళాకారులు ఎలాగూ వస్తూనే ఉంటారు. వీరంతా ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు కాక ఎలా ఉంటే బావుంటుందో చూపిస్తూనే ఉంటారు. పాఠాలు నేర్పుతూనే ఉంటారు.

ముప్ఫై ఏళ్ళ క్రితం మూడు ఫైట్లు, ఆరు పాటల సినిమాలు, సెంటిమెంట్ చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో వచ్చింది ‘క్షణ క్షణం’. ఇందులోనూ మూడు ఫైట్లు, ఐదు పాటలు ఉన్నాయి. కానీ ఫైట్లు సహజంగా ఉంటాయి. గాల్లో ఎగరటం, వంద మందిని ఒక్కడే కొట్టడం ఉండవు. ప్రేక్షకులు చాలామంది నాటకీయత కోరుకునేవారు. ఇప్పుడు ప్రేక్షకులూ మారిపోయారు. అప్పట్లో థియేటర్లలో వందరోజులు ఆడితేనే సినిమాకి లాభాలొచ్చేవి. ఇప్పుడు కొలమానాలు మారిపోయాయి. అప్పట్లో కొందరే పాత్రికేయులుండేవారు. యువతని ఆకట్టుకోవటానికి దర్శకులు సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండీ సినిమా పత్రికల్లో ప్రచారం చేసేవారు. వర్మ అసలు ప్రచారమే చేయలేదు. వర్మ మీద కోపంతో “సినిమాలో విషయం లేదు” అన్నారు కొందరు. ఇప్పుడు సోషల్ మీడియాతో అందరూ పాత్రికేయులైపోయారు. అభిరుచికి తగ్గట్టు సినిమాలు చూస్తున్నారు, రాస్తున్నారు. ఓటీటీలో ఇంట్లోనే ఇష్టమైన సినిమా చూసే రోజులివి. భాషాభేదం లేకుండా చూసేవారి సంఖ్య పెరిగింది. ‘క్షణ క్షణం’ ఇప్పుడు విడుదలయ్యుంటే ప్రేక్షకులు ఆకాశానికెత్తేసేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here