క్షీరసాగరము – గోప్రాముఖ్యము

0
5

[dropcap]క్షీ[/dropcap]రసాగరము అంటే పాలసముద్రము. ఈ పాలసముద్రములో అమృతము పుట్టింది. దేవతలు ఆ అమృత పానము చేసి అమరులయ్యారు. విష్ణు మహేశ్వరులు అందుకు అమరులకు సహకరించారు. త్రిమూర్తులులో మొదటి వాడు బ్రహ్మ పాల సముద్ర మథనమునకు ముందే ఈ అమృతమును త్రాగిన కథ ఉంది. పాలసముద్రముతో బాటు, అమృతభాండము కూడ బ్రహ్మదేవుడే మొదట సృష్టించి పాలసముద్రము చేర్చాడా? అవుననే సమాధానముంది.

కొన్ని భారతప్రతులలో క్షీరసాగరము పుట్టుకకు బ్రహ్మ కారకుడని చెప్పబడింది. తను సృష్టించిన అమృతమును బ్రహ్మ రుచి చూశాక విపరీతంగా త్రాగిన కారణంగా వాంతి చేసుకున్నట్లు చెప్పబడింది (VETTTAM MANI.. puranic Encyclopedia). ఆ వాంతినుండి సురభి పేరుతో ధేనువు జన్మించింది. పాలధారలు సముద్రముగా పొదుగు నుంచి వర్షించింది. పాలధారలు సాగరముగా మారడంతో కనిపించకుండా క్షీరసాగర నివాసానికే పరిమితమైంది. అమృతముతోబాటు పాలసముద్ర మథనము వేళ కామధేనువు పేరుతో దేవలోక నివాసానికి చేరుకుంది.

పాలసముద్రము దేవతలకు బ్రహ్మ ఆజ్ఞగా మిగిలిన అమృతముగల భాండాన్ని దాచి క్షీరసాగర మథనముగ అందించింది. ఆవుల పొదుగులో మానవులకు క్షీరమై ఆరోగ్యానిచ్చే అమృత పానముగ మారింది. దేవతల ఆ కామధేనువుకు అంశలుగా గోవులు సురభికి సంతానంగా క్షీరసాగరమై మానవలోకం లోనూ ఖ్యాతి వహించడానికి కారణముంది.

దేవీభాగవతము ప్రకారము కృష్ణుడు సురభిని సృష్టించాడు. కృష్ణుడు రాధాదేవితో విహరిస్తూ తన శరీరము ఎడమవైపు నుంచి సురభిని సృష్టించి పాలు పిండాడు. ఆ సమయములో పాత్ర చేజారి పాలధారలు నేలమీదపారి వంద యోజనముల క్షీరసాగర ప్రవాహమైంది. రాధాకృష్ణులు ఆ పాలనముద్రములో విహరించారు. సురభి నుంచి వేనవేలు గోవులు పుట్టి గోపాలురచే సాకబడ్డాయి. కశ్యప సంతానముగా కూడ దక్షప్రజాపతి పుత్రిక క్రోధావశద్వారా సురభి జన్మించి గోజాతి అభివృద్ధి చెందిందని వాల్మీకి రామాయణము చెబుతోంది. బ్రహ్మ ఓంకారము చేసినపుడు పుట్టిందన్నఖ్యాతి కూడా సురభికుంది. సురభినానుకుని మురళి వాయించి ఈ సురభికి కృష్ణుడు మనోరథ అని కూడ పేరుపెట్టాడు.

బ్రాహ్మణుడుతో సమానము. ఆవుకు మించిన సంపద లేదు. గోదానము మించిన పుణ్యము లేదు. ఆవును చంపడము, గోమాంసము తినడము నిషేధం. కామధేనువుగ మహిమలు చూపిన కథలున్నాయి. గోవులను ఆనందపరిచి కృష్ణుడు గోవిందుడయ్యాడు. కామధేనువు అర్థములో సురూప, హంసిక, సర్వకామధుక్, సురభిర్గవి అని ఆవులకు అమరకోశము అర్థమిచ్చింది. జోరాస్ట్రెయిన్ మతము GAUSHURVA అంటే భూదేవి ఆత్మగ గోవులను భావించింది. జన్మదిన, గృహప్రవేశాది శుభసమయం, చనిపోయినపుడు గోదానము చేస్తారు.

ఋగ్వేదము ప్రకారము ఉదయ, సాయం సంధ్య గా పేరుగాంచిన ఉష అనే ఆ సంధ్యాదేవి రథాన్ని గోవులు లాగుతాయి. అథర్వవేదములో గోకీర్తన ఉంది. స్వర్గము, భూమి, నదీజలాలు, సకలభూతరాశి పుట్టాయని ఆవులను సకల సృష్టి ప్రదాత అనాలన్నది వేదవాక్కయింది. గోరూవధారిణి భూమి నుంచే పృథుచక్రవర్తి సమస్తవస్తువులు పిదికాడు. స్వర్గనరకాధిపత్య పోరాటములలో ఋగ్వేదము గాథలులో గోప్రశస్తి ఉంది.

వేదగాథలో ముద్గలుడనే మహర్షికి అపారగోసంపద ఉండేది. ఉషోదయం చూసి ఎర్రావుల మందలా ఉందని, సముద్రం వైపు ప్రవహిస్తున్న నదిని దూడకై పరుగెత్తే గోవని వర్ణించాడు. మనువు గోవును ఘృతపదిగ యజ్ఞ పవిత్ర వస్తువులను అందించేలా దేవతల వరం పొందాడు. అందుచేత ముద్గలుడు ప్రాణాలను త్యజించైనా గోరక్షణ చేయాలని ఉద్బోధించాడు.

చ్యవనమహర్షి కూడ గోదానము స్వీకారము గొప్పదని భావించాడు. చ్యవనమహర్షి పులోమ, భృగుల పుత్రుడు. అశ్వనీ దేవతలకు యజ్ఞహవిస్సులో భాగమిప్పించి యవ్వన వంతుడైన కథ ప్రసిద్ధము. శర్యాతి కుమార్తెతో వివాహానికి ఒప్పృకోవడానికి ముందు గోదానము స్వీకరించాడు. పాలసముద్రము లోనే బ్రహ్మ అమృత నిక్షిప్త కుంభమును ఉంచాడు. అయితే పృథుచక్రవర్తి భూమిని గోవును చేసి పితికిన వస్తువులలో అమృతము కూడ ఉందిట! కాని, అనేక అపూర్వ వస్తువులతో బాటు పాలసముద్రము చేరిపోయిందని భాగవతము చెప్పింది. అందుకే పాలసముద్రమును దేవదానవులు ఈ అమృతభాండము కోసము మథించారు. అమృతభాండ ఉనికిని కాపాడుతూ నిత్య పాలధారలు స్రవిస్తూ గోరూప భూమాత దేవతల ఆవుగా పాలసముద్రము నుండి మొదట బయటపడి కామధేనువుగ క్షీరసాగరము మథన కథలో పేరు తెచ్చుకుంది. ఈ కామధేనువు కృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తి లీల చూపిన అనంతరము పాలధారలతో అభిషేకించినట్లు భాగవతములో ఉంది. గోవిందుడని పించుకుని సురభిగ గోసంపదను మనకు కృష్ణుడిచ్చిన వరము.

సృష్టికర్త బ్రహ్మ సకల జీవరాశితోబాటు విషప్రాణులను, క్రూరజంతుసంతతినీ సృష్టించాడు. వాటి నుంచి సృష్టిరక్షణకు అవసరమైతే ఏర్పాట్లున్నాయి. అమృతముతోబాటు కాలకూట విషమును కూడ పాలసముద్ర ప్రవేశము చేయించాడు. ధన్వంతరి వంటి ఆయుర్వేద వైద్యుడు పాలసముద్రము చేరాడు. విష్ణువునకు తోడు నీడగ భూమిని రక్షించేందుకు అవతార మూర్తికి ఇల్లాలిగా లక్ష్మి పాలసముద్రము లోనే ఎదురు చూస్తోంది. సోముడున్నాడు. ఐరావతము, ఉఛ్చైశ్రవము, కల్పవృక్షము, పారిజాతము ఇలా పాలసముద్రము అపూర్వ వ్యక్తులు వస్తుసంపదలకు నిలయము. లోకోపకారకంగా బయటకు రప్పించిన కథాశ్రవణపఠనముగ పుణ్యదాయకము.

అమరత్వసిధ్ధి, ఆరోగ్య, బల ఐశ్వర్యములు అమృత పానము వలన లభిస్తాయి. ఈ అమృతనిక్షిప్త భాండము బ్రహ్మ కారణంగా పాలసముద్రములో చేరింది. అందుకే పాలసముద్రము మరుగుగ ఆశ్రయానికీ అజ్ఞాతఉనికి తప్పనిసరైన అపూర్వవ్యక్తులు, వస్తువులు ప్రశాంత నివాసావాసంగా చేసుకున్నాయనిపిస్తుంది. ఉదాహరణకు ఐరావతము.

ఐరావతము ఇంద్రుడి వాహనము. దాని మీద వస్తూ దుర్వాసమునికి ఎదురుపడ్డాడు. ఆ ముని దేవరాజు అన్న గౌరవంతో రంభవంటి అప్సరస తయారుచేసిన అపూర్వమైన పూలమాల నిచ్చాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా ఆందుకుని ఐరావతము కుంభస్థలముపై వేశాడు. అది చిరాకుపడి తొండంతో తీసిపారేసి కాలితో నలిపేసింది. ఆ నిర్లక్ష్యానికి దుర్వాసుడు మండిపడ్డాడు. ఇంద్రునికి పదవీ భ్రష్టత, ఐరావతానికి స్థాన భ్రష్టత శాపాలుగ ముని ఇచ్చాడు. ఫలితంగా ఇంద్రుడు రాక్షసుల చేతిలో ఓడి రాజ్యము కోల్పోయి బలహీనుడయ్యాడు. శాపగ్రస్త ఐరావతము స్వర్గమువీడి పాలసముద్రము మరుగు సొచ్చింది. తమిళనాడు లోని తంజావూరు జిల్లా లోని ఐరావతేశ్వర దేవాలయ స్థలపురాణం ఈ కథను బలపరుస్తుంది.

పాలసముద్రములో అమృత భాండముతో ఉన్నంతసేపు కాలకూటవిషము లోకానికి శిక్ష కాలేదు. బయటకువస్తే లయకారకుడు నీలగళుడై శివుడు అండగ నిలుస్తాడని బ్రహ్మకు తెలుసు. అందుచేత దేవదానవుల క్షీరసాగర మథనానికి విష్ణు అనుమతి లభించింది. కాని రాక్షసులు వంచనకు గురవడము కూడా విధి నిర్ణయముగజరిగింది.

అమరత్వసిధ్ధి ఉన్నా లేక కోల్పోయినా అమృత భాండమున్నకారణాన పాలకడలి అపూర్వ వ్యక్తులకు, వస్తువులకు ప్రశాంత నివాసాలయముగా ఉండేది. అమృతము దేవతలకు అవసరమైన కారణముగా మథనానికి గురయింది. అమృతము సాధిస్తేనే అమరులనిపించుకుని రాక్షసులను నిర్జించగలరని బ్రహ్మ, శ్రీ మన్నారాయణుడు చెప్పారు.

దేవదానవులు పాలసముద్రము మథించారు. దితి,అదితి సంతానముగా అక్కచెల్లెల్ల పిల్లలుగా వైషమ్యాలు పక్కన పెట్టారు. అన్నదమ్ముల్లా అమృతాన్ని సాధించేందుకు ఒప్పంద మయ్యారు. అమృత పానం వల్ల బలము, ఆయుర్దాయం పెరుగుతాయి. కాని వారిలో చిత్తశుద్ది లేదు. అమృతమును రాక్షసులకు దేవతలు అందనీయకూడదని భావిస్తున్నారు. దేవతలకు రాక్షసులు చిక్కనీయ కూడదన్న పన్నాగంలో ఉన్నారు. దేవతలకు శ్రీమన్నారాయణుని అండదండ లున్నాయి. క్షీరసాగరము మథన కథ ప్రసిద్ధము.

శ్రీ మన్నారాయణుడు కూర్మావతారుడయ్యాడు. మందరపర్వతాన్ని పాలసముద్రములో మునిగి పోకుండ వీపుపై ధరించాడు. మందర పర్వతము కవ్వమయింది. వాసుకి తరిత్రాడయ్యాడు. వాసుకి తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు కలిసి చిలకసాగారు.

బయటపడిన కాలకూటవిషమును శివుడు తన గళ నివాసము చేసి నీలకంఠుడయ్యాడు. సోమబింబాన్ని శిరస్సుపై ధరించి చంద్రశేఖరుడయ్యాడు. చంద్ర సహోదరి లక్ష్మి శ్రీనివాసుని కిల్లాలయింది. అపూర్వ వస్తువులను దేవదానవులు పంచుకున్నారు. ధన్వంతరి అమృత భాండముతో అవతరించాడు. అమృత మథనము కుండలిని సాధన అని భావిస్తున్నారు. మంచి, చెడు కలయికల విషమ పరిస్థితి నుంచి బయటపడి సాధించిన మోక్ష కాంక్ష అమృతముగా కుండలినీ సాధన ప్రబోధమథనమదని యోగాభ్యాసకులు చెబుతున్నారు.

ధన్వంతరి చేతి నుంచి రాక్షసులు అమృతాన్ని లాక్కుని దెబ్బలాడుకోసాగారు. విష్ణువు మోహినిగ సమ్మోహపరిచాడు. దేవదానవుల నందరిని వరుసగా వేరువేరుగా ఎదురెదురుగా కూర్చోబెట్టి చేతులు చాచమన్నాడు. చేతులలో చిన్నపాటి పాత్రలుంచి అమృతము పంచాడు. త్రాగమన్నాడు. కాని విష్ణుమాయ వల్ల మోచేతిని వంచి నోటి దగ్గరగా తేలేకపోతున్నారు. దేవతలు తెలివి ఉపయోగించారు. పరస్పరం చాచిఉన్న అమృత పాత్ర చేతులు ఒకరి నోటికి మరొకరందించు కుంటూ అమృతము దేవతలందరూ త్రాగారు. రాక్షసులు మాత్రం ఎవరిది వాళ్ళకు దక్కాలని అసూయతో ఇతరుల చేతిలోది కూడ నేలపాలవడానికి సహకరించుకున్నారు.

దేవతలు అమరులయ్యారు. రాక్షసులను తరిమికొట్టారు. స్వర్గాధిపత్యము లభించింది. మిగిలిన అమృతభాండము దేవతల రక్షణ లోకి వచ్చింది. ఎంతటి కట్టుదిట్ట రక్షణ స్వర్గములో చేయబడిందో భారతములో గరుత్మంతుడి అమృతాపహరణ ఘట్టములో వర్ణించబడింది. భాండము అంటే కుండ లేదా కలశము అనే అర్థాలు అమృత నిక్షిప్త పాత్రకు వర్తిస్తాయి.

గరుత్మంతుడు ఈ అమృతకలశాన్ని తల్లిని దాస్య విముక్తి చేయడానికి నాగమాత కద్రువకివ్వడానికి అమృత భాండరక్షకులను ఎదుర్కొని గెలుచుకున్నాడు. నాగమాత కలశాన్ని ధర్భలపై ఉంచి నాగసంతానాన్ని పవిత్రంగా స్నానం చేసి వచ్చి త్రాగమంది. సర్ప సంతానము వచ్చే లోపు ఇంద్రుడు కలశాన్ని మళ్లీ స్వర్గ రక్షణ కు చేర్చేశాడు. ఆశతో ధర్భలపై అమృతము చుక్క లుంటాయని నాగులు నాలుకలతో నాకారు. నాలుకలు రెండుగా చీరిపోయి ద్విజిహ్వులని పేరు పడ్డారు. అమరులు కాలేకపోయారు.

అమృత కలశం స్వర్గము దేవతల రక్షణ లోనే ఉంది. కాని భూలోకంలో కూడ పవిత్రతను చాటే కథలు కలిగి ఉంది. మరణము సమీపించకుండా రావణుడు అమృత భాండమును మింగాడని నాభి క్రింద దాగి ఉన్న ఆభాండమును రామబాణము బయటకు రప్పించి మరణానికి కారణమైందని కథ అవాల్మీక రామాయణాల రచనలలో కనిపిస్తుంది. తమిళనాడులో తిరుక్కడైయూర్ సమీపములో Mayiladuthurai వద్ద ఉన్న అమృత ఘటేశ్వర. ..అభిరామి దేవాలయము క్షీరసాగర మథనము కథతో నంబంధము కలిగి ఉంది.

amritaghateswarar-abirami temple

తనను ముందుగా ప్రార్థన చేయలేదని అమృత భాండాన్నిమాయం చేసి వినాయకుడు ఇక్కడకు చేర్చి దాచాడని నమ్ముతారు. జ్యోతిర్లింగాలలో వైద్యనాథుడు అమృత లింగేశుడు. గోక్షీరాభిషేకము ఇష్టదేవతారాధనాభిషేక అమృత స్నానసమము. అందించిన గోమాతలు పాలసముద్రము వంటివి. పురాణ క్షీరసాగరోద్భవ సంజీవనిలు. గోమాతరూప అమృతసంజీవ వర్షిణిగ క్షీరసాగరాన్ని చిరస్మరణీయము చేసిన గోరక్షణ మన కర్తవ్యంగా భావిద్దామని చెప్పడమే ఈ వ్యాసోద్దేశము.

***

Image Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here