సజీవ జ్ఞాపకాలు కూచిమంచి అగ్రహారం కథలు

30
14

కూచిమంచి అగ్రహారం కథలు c/o ముక్కామల చక్రధర్

[dropcap]కొ[/dropcap]న్ని జ్ఞాపకాలు

మధురాతి మధురమైనవి కొన్ని జ్ఞాపకాలు

మరవాలనుకొన్నా

మరువలేనివి

కొన్ని జ్ఞాపకాలు

మనసులో సదా మెదిలేవి

అదిగో.. అలాంటి.. కూచిమంచి అగ్రహారం గురించి తన మనసు నిండా ఉన్న జ్ఞాపకాలను అక్షరాల్లో అందరికీ పంచారు ముక్కామల చక్రధర్. ఏడాదిగా విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి శనివారం “చక్రవాకం” అన్న శీర్షికన చక్రధర్ రాస్తున్న “కాలమ్స్” కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం “స్వతంత్ర” ఛానల్ లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న చక్రధర్ గతంలో ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలో సాహిత్య పేజీలలో ప్రముఖ రచయితలతో చేసిన ఇంటర్వ్యూలు, అలాగే సాహిత్య వ్యాసాలు 150 పైగా రాసారు. రాయడం కంటే విస్తృతం గా చదవడం తనకిష్టమంటారాయన. తను పుట్టి పెరిగిన అమలాపురం లోని కూచిమంచి అగ్రహారం జ్ఞాపకాలని నిత్యం తలుచుకుంటూ, ఇంటింటా ఆవకాయ పెట్టే సందడిని ఒక చిన్న కథగా రాశారు. అది చదివిన మిత్రులు తమ ఊరి గురించి రాసినందుకు ఆనందిస్తూనే, తమ గురించి కూడా రాయమంటూ దాదాపు చొక్కా పట్టుకొని దబాయించినంత పని చేసినట్టున్నారు – వరుసగా 15 కథలు రాసారు కూచిమంచి అగ్రహారం గురించి.

అవి “సారంగ” అంతర్జాతీయ అంతర్జాల పక్ష పత్రిక లో 2020 లో వరుసగా ప్రచురించబడి తనకెంతో మంది పాఠకులను ఆత్మీయులుగా చేసాయి. కవిత్వాన్ని ఇష్టంగా, విస్తృతంగా చదివే చక్రధర్ తన ఊరి విశేషాలను కథలుగా రాసి 2021 లో పుస్తకంగా తీసుకువచ్చారు. ఐదు రోజుల్లోనే కాపీలన్నీ అయిపోయాయంటే ఈ కథల సంపుటి ఎంత సంచలనం సృష్టించిందో తెలుస్తుంది.

“మాల్గుడి డేస్” కంటే గొప్పవి” అని భమిడిపాటి జగన్నాథశర్మ మెచ్చుకొన్నా —

“అవి కల్పిత పాత్రలు కావు. సజీవులైన వారి కథలు రాయాలంటే రచయితకి ధైర్యం ఉండాలి, సంయమనం ఉండాలి” అని పురాణం శ్రీనివాసశాస్త్రి ప్రశంసించినా — అతిశయోక్తి కాదు.

గతంలో తమ ప్రాంతం, లేదా మాండలికం, లేదా ఊరి జ్ఞాపకాలను చాలామంది రచయితలు కథలుగా రాశారు. అవి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి కూడా.

సత్యం శంకరమంచి రాసిన “అమరావతి కథలు” విశేష ఆదరణ పొందడమే కాక 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాయి. కొన్ని కథలు ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఆడియో రూపంలోనూ ఎందరో వింటున్నారు పాఠకులను ఏక బిగిని చదివించే ఈ కథలు అత్యుత్తమ కథా సంకనాలలో ఒకటిగా ముళ్ళపూడి వెంకటరమణ గారు అభివర్ణించారు. బాపు ఇష్టంగా బొమ్మలు గీశారు. రాజులు, జమిందారులు, సామాన్య జనాలు, దొంగ స్వాములు… అందరూ మన పక్కింటివారన్నంత సహజంగా మన కళ్ళ ముందు నిలిచారు కాబట్టే “అమరావతి కథలు” క్లాసిక్ గా నిలిచాయి.

నామిని సుబ్రమణ్య నాయుడు రాసిన “సినబ్బ కథలు”, “మిట్టూరోడి కథలు” మనుషుల జీవితాలను కూలంకషంగా అధ్యయనం చేసి రాసిన కథలు. కాబట్టే చిత్తూరు యాసలో రాసినా ఆ పల్లె బతుకుల్ని యావత్ తెలుగు ప్రజలు నెత్తికెత్తుకున్నారు.

మహమ్మద్ ఖదీర్ బాబు “దర్గామిట్ట కతలు”, “పోలేరమ్మ బండ కతలు” రాసారు. నెల్లూరు యాసలో ఉర్దూ పదాలను మిళితం చేస్తూ రాసిన ఈ కథల్లో ముస్లిం కుటుంబాల జీవన విధానం, ఇరుగుపొరుగు వారితో వారి సఖ్యత, కుల మతాలకతీతంగా స్నేహబాంధవ్యాలను అద్భుతంగా చిత్రీకరించారు. గమ్మత్తుగా సున్నితమైన హాస్యాన్ని, దాని వెనక కనీ కనిపించని విషాదాలని వర్ణించడంతో ఈ కథలు ఖదీర్ బాబు ని ‘ పెద్ద రచయిత’ స్థాయిలో నిలిపాయి.

చిత్రం ఏమిటంటే ఈ నలుగురు రచయితలూ తమ తమ ప్రాంతాల విషయాలు, యాసలు రాయడమే కాక, గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వంటి పత్రికల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులే.

ఏ భాషలోనైనా కథలు అనేవి ఆయా జాతి సహజ సృష్టి. ఇంటింటా మొదటి కథకురాలు అమ్మే. పిల్లలకి ఆసక్తి కలిగేలా తాను విన్నవి మాత్రమే కాక అప్పటికప్పుడు తన కల్పనని జోడించి మరింత కొనసాగిస్తుంది. పూర్వం “గాధ” అన్నా, ఆంగ్ల సాహిత్య ప్రభావంతో “స్టోరీగా, కథగా” అంటున్నా, తెలుగువారికి “కథ” అనే ప్రక్రియ ప్రాచీన రూపమే.

“c/o కూచిమంచి అగ్రహారం” కథలు చక్రధర్‌కి ఆగ్రహారంలోని సజీవ జ్ఞాపకాలు. పాత్రలన్నీ నిజంగా తన జీవితంలో తటస్థ పడ్డ మనుషులే, ఇప్పటికీ బ్రతికి ఉన్నవారే. సుగుణ, చిట్టెమ్మ, వసీరా, అగ్నిహోత్రుడు, అమర్ టైలర్స్, డాక్టర్ రామన్.. అందరూ సజీవ పాత్రలే. కొందరు చనిపోయినా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ దసరా సమయాల్లో అమలాపురానికి మాత్రమే సొంతమైన అపురూపమైన పురాతన కళ “చెడీ తాలింఖానా” ప్రదర్శిత మౌతుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలను ఎదుర్కోవటానికి అప్పిరెడ్డి రామదాసు గారు 1856 లో పురుడు పోసిన కళ ఇది. అబ్బిరెడ్డి రామదాసు గారు మరణానంతరం, వారి వారసులు కొనసాగిస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్న వారి ముని మనవడి కుమారుడు అబ్బిరెడ్డి మల్లేష్ దసరాకు అమలాపురం వచ్చి (ఇప్పుడు వచ్చి ఉన్నారు) ఈ కళను ప్రదర్శించి, తమ వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కర్ర సాము చేయటం అంటే ఒక విద్యను ప్రదర్శించటంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శించడం. ఈ విద్యను ప్రదర్శిస్తున్న కొందరు కర్ర సాము చేయడంతో పాటు ‘అగ్గి బరాటా’ కూడా తిప్పుతారు. అగ్గి బరాటా అంటే లావుపాటి కర్రకి ఆ చివర ఈ చివర గుడ్డలతో ఫుట్ బాల్ అంత బట్టలు చుడతారు. ఆ బట్టల మూటలను కిరోసిన్ లో ముంచి అంటిస్తారు. అటూ ఇటూ నిప్పుల కొండల్లా మండిపోతున్న కర్రను మధ్యలో పట్టుకొని అగ్గి బరాటా సాము చేస్తారు.

ఇలా పూర్తిగా సజీవపాత్రలను తీసుకొని కథల్లో రాయడం బహుశా ఇదే ప్రథమ ప్రయోగమని చెప్పాలి.

సస్పెన్స్, ఉత్కంఠ వంటివి లేకపోయినా మొత్తం 15 కథలు ఏకబిగిన చదివించేవి. ఎత్తుగడ, క్లైమాక్స్, ముగింపు, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన వంటి సూత్రాలను అనుసరిస్తూ ఈ కథలు రాయలేదు. ఓ శిల్పమో, సౌందర్యపోషణో లక్షణాలను నిర్దేశించుకొని రాయలేదు. నిజానికి పక్కా ప్రణాళిక వేసుకొని రాసినవి కూడా కాదు. అయినా.. చదివిస్తాయి. అదే చిత్రం. విశేషం.

తన చుట్టూ జరిగిన సన్నివేశాల్ని కథలుగా రాశారు రచయిత. పల్లెటూరు ప్రజల మధ్య ఉన్న సఖ్యత, అమాయకత్వం, బంధాలు, బాంధవ్యాలు, మానవత్వ కోణం పాఠకుల్ని చదివింపజేస్తాయి. వారి మనసుల్లోని దయ, కరుణ చదివింపజేస్తాయి. గోదారోళ్ళ “ఎటకారం” చదివి నవ్వు ఆపుకోలేం. అగ్రహారం లోని భాష, ఆత్మీయత అచ్చు గుద్దినట్టు “అచ్చువేసిన” ఈ అగ్రహారం కథల పుస్తకం లోని పేజీలు అలవోకగా తిరిగిపోతాయి. హాయిగా చదివింపజేస్తాయి.

ఉపమా కాళిదాసస్య అంటారు. ఆధునిక కాలంలో పేజీలకు పేజీలు ఉపమాలంకారాలు రాసినది ముళ్ళపూడి వెంకటరమణ. చక్రధర్ కి ఉపమ అంటే అనురక్తి. అగ్రహారాన్ని వర్ణించేటప్పుడు అందమైన ఉపమలు అలవోకగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహంలో పాఠకుల్ని ముంచి మునకలు వేయిస్తారు.

“చెట్ల కింద జరిగే ఆ కారాల దంపుళ్ళ సమయంలో సూర్యుడి కిరణాలు చెట్ల సందుల్లోంచి కారం దంచే స్త్రీల ముఖాల మీద పడి చిత్రమైన కాంతితో వెలిగిపోయేవి. ఆ దృశ్యం సూర్యుడు చెట్టు మించి రాసుకున్న కవిత్వంలా ఉండేది”

“మహాశివుడు మెడలో నాగుపాము ధరించినట్లుగా తన మెడలో కొలతలు కొలిచే టేపుతో నిత్యం నవ్వుతూ నిలిచిన శివుడిలా ఉండేవాడు”

“అప్పుడు రామన్ నవ్వుతున్న వెన్నెలలా ఉన్నాడు./ అప్పుడు రామన్ నడుస్తున్న సరస్వతీ పుత్రుడిలా ఉన్నాడు./ అప్పుడు రామన్ పోరాట యోధుడిలా ఉన్నాడు / అప్పుడు రామన్ కుల సమాజం మీద ఎగిరి పడాలనుకున్న గండ్రగొడ్డలిలా ఉన్నాడు”

“సుగుణ ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల గులాబీ రేకలగుట్ట. కళ్ళు చేరడున్నర. మంచినీళ్లు తాగుతుంటే గోదారి ఏ పాయ నుంచి వచ్చిన నీళ్లు గొంతులోకి దిగుతున్నాయో తెలిసిపోద్ది. వెన్నెల వెనుక అమావాస్య తెరలుతెరలుగా ఉన్నట్టు భ్రమించే జుట్టు. అలాంటి నల్లటి జుట్టుకి ఉరేసుకుని చచ్చిపోతే అందమైన ఆత్మహత్య అవుతుంది. నవ్వితే బుగ్గలు సొట్టలు పడవు. హాయిగా పెదాలు రెండు సాయం సంధ్యలో కొబ్బరాకుల మధ్య కమలాపండు రంగులో విచ్చుకుంటున్న సూర్యుడిలా ఉంటాయి”..

అమర్ టైలర్స్ కథలో టైలర్‌కి సాహిత్యాభిమానం ఉండటం, ఎవరైనా తిలక్‌ను, శ్రీ శ్రీను చదువుతుంటే చకచక చొక్కా ని మిషన్ మీద కుట్టేసే అతని అభిరుచికి గౌరవం కలుగుతుంది. ఆ షాపు ఒక చిన్న సాహిత్య వేదికగా పాత, కొత్త రచయితలు చేరటం కులమతాలకు అతీతంగా కవిత్వం కథలు చదివి వినిపించడం ఒక విశేషం.

చిట్టెమ్మ ఒక చుట్టం కాని ఆత్మబంధువు. ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ కూచిమంచి అగ్రహారానికి చేరింది. మాట తీరు, ప్రవర్తన బట్టి బ్రామ్మలనుకోవాలి. అంతే. మరే వివరాలు తెలియవు. ఇంటింటికి తిరుగుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లు పండో ఫలహారమో ఇస్తే తినటం, వారి కష్టసుఖాలు వినటం, సానుభూతి చూపి ధైర్యం చెప్పటం తో అందరికీ తల్లో నాలుకలా, పెద్దదిక్కుగా మారిపోయింది. ఏ ఇంటి విషయము, రహస్యమూ మరో చోట పెదవి కదపక తన పెద్దరికాన్ని నిలుపుకొంది. అందుకే ఎవరికీ రక్త సంబంధం లేకపోయినా ఆమె మరణానికి ఊరంతా కళ్ళు ఒత్తుకొన్నారు. అంత్యక్రియలు చేయడమే కాక పదో రోజున ధర్మోదకాలు ఇచ్చారు.

అల్లం పచ్చడి చేయడంలో ఘనాపాటి అయిన అగ్నిహోత్రుడిది ఓ విచిత్రమైన మనస్తత్వం. పైకి హుషారుగా ఉంటాడు కానీ లోపల కొండంత దిగులు. సీసా ఎత్తి పూర్తి చేయందే వంట పూర్తి చేయడు. సిగరెట్టూ ఊదాల్సిందే. అది నచ్చకపోయినా అతని రుచికరమైన వంటకి ముఖ్యంగా అల్లం పచ్చడికి దాసోహమైన అగ్రహారం కుటుంబాలు శుభ, అశుభ కార్యాలకి అతన్ని పిలవక మానరు. కానీ అశుభ కార్యాల్లో మాత్రం తన అలవాటుని పక్కనపెట్టి, భోక్తల భోజనాలు పూర్తయ్యేదాకా నిష్టగా ఉండేవాడు. అలాంటి అగ్నిహోత్రుడు గోదావరి పుష్కరాలకి రాజమండ్రీ వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడున్నాడోనని వాకబు చేశారు.. కానీ ఆచూకీ తెలియలేదు. ఆ అగ్నిహోత్రుడు, ఆ అల్లప్పచ్చడి అగ్రహారానికి ఒక తీయని జ్ఞాపకం.

ఇవేవో బ్రామ్మల కథలు లెద్దూ, గోదారి యాస కాబోలు.. అనుకోవటం పొరపాటు. మనుషుల మధ్య ఆప్యాయతానురాగాలు, మానవత్వం, కరుణ, స్నేహం, అన్ని వృత్తుల వారు కలిసిమెలిసి జీవనం సాగించే విధానం – హాయిగా చదివింపజేస్తాయి. రచయిత ఎలాంటి హిపోక్రసీ లేకుండా తన “జ్ఞాపకాలు” అంటూ దాపరికం లేకుండా రాశారు. ఆ జ్ఞాపకాలు పాఠకుల్నీ అగ్రహారంలోకి లాక్కెళతాయి. సమస్త వృత్తుల శ్రమైక జీవన సౌందర్యం ఈ పల్లెటూర్లలోనే ఇంకా ఉన్నాయి. అందుకే పాఠకులకూ ఇవి మంచి జ్ఞాపకాలుగా మిగులుతాయి.

నల్ల మేఘ శ్యాముడు మరిడయ్య. తోటలో “గొబ్బరి” కాయలను దొంగలిస్తున్న దొంగల్ని పట్టుకోడానికి చాలా ప్లాన్లు వేయటం, చివరికి పట్టుకోవడం, వాళ్ళల్లో చిన్నవాడైన ‘సంటి’ కి చదువుకునేలా ఏర్పాటు చేయటం, వాడు పెద్దయ్యి తన కొడుక్కి ‘మరిడయ్య’ అని పేరు పెట్టుకుని, మరిడయ్య చివరి కాలంలో ఆసుపత్రి పాలైన విషయం తెలుసుకొని వచ్చి ఆపరేషన్ కి డబ్బు కట్టేయటం – నిజంగా జరిగిన కథేనంటే నమ్మాలి. మానవత్వం మిగిలే ఉంది అన్న ఆశ ఉంచుకోటానికైనా నమ్మాలి.

కోడూరి బ్రదర్స్ ఎటకారం వెనక ఉన్న ఉపకారం తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి. వచ్చే పోయే వారిని సరదాగా పంచ్ డైలాగులతో (ఒక్కోసారి త్రివిక్రమ్ గుర్తొస్తాడు) ‘ఎటకారం’తో ఏడిపించటం వారి నైజం. అలాంటి అన్నదమ్ముల్లో ఒకడు చనిపోతే రెండో వాడి దుఃఖం వర్ణనాతీతం. అదే దిగులుతో మరికొన్ని నెలల్లోనే అతనూ చనిపోయాడు. ఈ “విషాద హాస్యం” చార్లీ చాప్లిన్”ను గుర్తుకు తెస్తుంది. హాస్యం కంటే విషాదహాస్యం గుండెను మెలితిప్పుతుంది.

రచయిత మరో కొత్త ప్రయోగం ‘పునరుక్తి’ – ఒక విషయాన్ని నొక్కి వక్కాణించడానికి పునరుక్తిని ఉపయోగించటం జరుగుతుంది. ఒక భావాన్ని మూడు నాలుగు విధాలుగా చెప్పటం వల్ల దాని ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. కథని వేగంగా చదివే చదువరి ఓ క్షణం ఆగి మళ్లీ చదివి ఆ భావాన్ని, దాని లోతుని, గాంభీర్యాన్ని అవగతం చేసుకుంటారు.

“కోర్టు వారి ఏనుగు స్వర్గంలో ఇంద్రుడి ఐరావతముల ఉండేది/కోర్టు వారి ఏనుగు నడిచి వస్తున్న న్యాయంలా ఉండేది/ కోర్టు వారి ఏనుగు అబద్ధపు ప్లీడర్లను తొక్కేస్తా అన్నట్లు ఉండేది/కోర్టు వారి ఏనుగు తెల్లగా మచ్చలేని చంద్రుడిలా ఉండేది”

“ఆ నవ్వు పాల నురుగులా హాయిగా ఉంది/ ఆ నవ్వు నదిలో నీళ్ళలా శుభ్రంగా ఉంది/ ఆ నవ్వు పసిపాప బోసి నవ్వులా స్వచ్ఛంగా ఉంది”

“ఓ రోజు ఉదయాన్నే వసీరా ఒంట్లో నలతగా ఉంది/ ఓ రోజు ఉదయాన్నే వసీరా కడుపులో గాబరాగా ఉంది/ ఓ రోజు ఉదయాన్నే వసీరా ఒళ్లంతా తిప్పుతున్నట్టుగా ఉంది”

ఈ పునరుక్తి ప్రయోగం వల్ల ఏదో ప్రత్యేకత ఉంది, జరగబోతోంది అన్న సూచనని పాఠకుడు గ్రహిస్తాడు.

మేధస్సుని కదిపి కుదిపేసే కథలు ఖచ్చితంగా గొప్పవే. కానీ సున్నితంగా మనసు పొరల్ని తాకే, స్పందింపజేసే ఈ అగ్రహారం కథలు అన్నీ ఆణిముత్యాలే.

వేసవి కాలంలో మండే ఎండల్లో ఏసీలు, కూలర్లు లేని గ్రామంలో ఊరగాయల కోలాహలం, కారాలదంపుళ్ళ జాతర, యజమానుల పనివారల ఆప్యాయతల హడావుడి, మామిడికాయలపై సర్రుమనే కత్తిపీటలు, ఛెళ్ళుమనే చెణుకులు, అమ్మలు కలిపి పెట్టే ఊరగాయ ముద్దలు.. మొత్తం జీవం తొణికిసలాడే రోజులవి. శ్రావణమాసంలో చిత్రమైన మట్టి వాసన, అగ్రహారంలో పట్టు చీరల పెద్దమ్మలు, పట్టు లంగాల పిల్లగాయలు, పేరంటాల సందడి, శనగల తాంబూలాలు, పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అత్తారింటికి వెళ్లే క్షణాల కంటనీరు, కుటుంబాన్ని తీర్చిదిద్దుకోమని అమ్మల తనివి తీరని జాగ్రత్తలు, సూచనలు.. దృశ్య చిత్రాలుగా దిద్ది తీర్చారు రచయిత. ఇక ప్రకృతి వర్ణనలైతే సహజ సిద్ధంగా ఎలాంటి ఆడంబరం లేకుండా వర్ణిస్తారు.

మరో మంచి కథ. రామన్ మంచి మనసున్న డాక్టర్. అగ్రహారంలో మొదటి డాక్టర్ అయిన కుర్రాడు. కుల సమాజం మీద ఎగిరి పడాలనుకున్న గండ్రగొడ్డలి లాంటివాడు. తక్కువ ఫీజు, ఒక్కోసారి ఉచితంగా వైద్యం చే‌సేవాడు. ఓ రోజు వార్తాపత్రికలో “మలేరియాతో అల్లాడుతున్న గిరిజనులు. అందని వైద్యం” అన్న వార్త చూసి హుటాహుటిన రంపచోడవడానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళాడు. కొన్ని మందులు తీసుకెళ్లడం అతని వృత్తికి చిహ్నం. అయితే తనతో పాటు కొన్ని పళ్ళను బిస్కెట్లను తీసుకువెళ్లి వారికి ఇవ్వటం అతని మనసు ప్రవృత్తి. తనకు చేతనైనంత వైద్య సాయం చేసి వచ్చాడు. కానీ –

“ఇంత చేస్తున్నా రామన్ ని ఓ నిర్లిప్తత వెంటాడేది/ ఇంత చేస్తున్నా రామన్‌ని ఓ శూన్యం ఆవరించేది/ ఇంత చేస్తున్నా రామన్ ని సమాజం అతలాకుతలం చేసేది/అలాంటి సమయంలో రామన్ నవ్వు వెలిసిపోయిన వెన్నెల ఉండేది..

ఈ పునరుక్తి వల్ల అతనిలోని ఆవేదన ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుస్తోంది. కానీ ఇంత మంచి మనసున్న మనిషి ఈ వ్యవస్థలోని లోపాల వల్ల సామాన్య జనులకు తానేమీ చేయలేకపోతున్నాను అన్న దుఃఖంతో, తనలో చెలరేగే సంఘర్షణను తట్టుకోలేక గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేం. సమాజంలోని అనేక ‘రుగ్మత’లకు రామన్ బలైపోయినప్పుడు నాలుగేళ్ల వయసున్న రామన్ కూతురు తర్వాత కాలంలో డాక్టర్ అయిన విషయం నిజంగా ఓ రిలీఫ్.

వినాయక చవితి వేడుకలు, దసరా పండుగలు, కార్తీకంలో అగ్రహారంలో పూజలు స్నానాలు పంచాక్షరి మంత్రాలు.. అన్నీ నెమలీక వంటి ఙ్ఞాపకాలు. గ్రామీణ వాతావరణం, పందిళ్ళలో మైకుల హోరు, నాటకాల జోరు, ఈలలు, గోలలు, పడుచు వారి వేళాకోళాలు, ముది వయసు వారి మధుర జ్ఞాపకాలు … అన్నీ ఈ కథల్లో కళకళలాడతాయి. వయ్యారాలు పోతాయి. పట్టణ కాలుష్యాలు సోకని ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాలు, గ్రామీణుల సౌరభాలు ఈ కథలు.

 ముఖ్యంగా చెప్పుకోవాల్సింది “భోగం వీధి సుగుణ” కథ. నో.. కథ కాదు, నిజంగా జరిగిన వాస్తవం. ఆ రోజుల్లో చాలామంది ఆడపిల్లల గుండెల్లో గులాబీలు పూయించిన అందాల నటుడు శోభన్ బాబు. ఆయన అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ సుగుణ. ‘ఆ’ వృత్తి చేస్తూ కూడా కొన్ని నియమాలు ఉన్న స్త్రీ. అందం, ఆకర్షణ, సౌజన్యం ఉన్న అద్భుతమైన స్త్రీ మూర్తి. సోమవారం, మంగళవారం వృత్తికి సెలవు ఇచ్చి గుడి కి వెళ్తుంది. మొహం మీద ఇంకా మీసాలు రాని, వచ్చీ రానీ యవ్వనం, తెలిసీ తెలియని ప్రేమ(ఆరాధన?) భావన తో సుగుణను చూస్తూ ఉండిపోతాడు రచయిత. మాట్లాడుతూ ఉండిపోతాడు. చూడాలని, మాట్లాడాలని తహతహలాడి పోతుంటాడు. అది ఏమిటో అతనికే తెలియదు. అమ్మ చనిపోతే సుగుణ చెంతనే సాంత్వన పొందాడు. ఎవరో రౌడీలు సోమవారం వచ్చి ఆమె వ్రతాన్ని భగ్నం చేస్తూ, బలవంత పెట్టి, తర్వాత చంపేశారు అని తెలిసి బోరుమన్నాడు. కదిలి కదిలి ఏడ్చాడు. ఒకరోజు కలలో కనిపించి సుగుణ చెప్పింది —

“ఏడవకు. నేను నీతోనే ఉన్నాను. నీకు సంతోషం కలిగిందనుకో.. మీ ఆవిడ కళ్ళల్లోకి సూడు. నే కాపడతా! ఎప్పుడైనా ఏడుపు వచ్చిందనుకో.. నీ మనీ పర్స్ లో మీ అమ్మ ఫోటో ఉంది కదా.. అది సూడు మళ్ళీ నేను కాపడతా! నీకు భయమేసిందనుకో.. నీ కూతురి సేయట్టుకో.. నీకు ధైర్యాన్ని ఇస్తా..!”

ఒక స్త్రీలో ప్రియురాలితో పాటు తల్లిని కూతురిని కూడా చూడమని చెప్పిన సుగుణ అద్భుతమైన మానవి. ఇది రాసిన రచయిత వ్యక్తిత్వం కొండంత ఎదిగిందని చెప్పాలి. రచయితతో పాటు పాఠకుడు కూడా సుగుణని మర్చిపోలేడు.

తన తప్పు లేకపోయినా బ్యాంకు వారు ఉద్యోగం నుంచి తీసేస్తే, కుటుంబ పోషణార్థం ప్రైవేట్లు చెప్పుకుంటూ, న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగి, ఇరవయ్యేళ్ళు పోరాడి గెలిచిన అమాయకపు, ఛాదస్తపు ముక్కామల మాస్టారు (రచయిత తండ్రి) శ్రీ శారద ట్యుటోరియల్స్ కథలో కనిపిస్తారు.

అడుగడుగునా విధి తనతో వికృతపు ఆట ఆడుతూ, వంచిస్తూ, కష్టాలు పెడుతుంటే సహనంతో భరిస్తూ, గెలుస్తూ, నిబ్బరంగా నిలబడి ధైర్యశాలి గా, కవిగా ఎదిగిన వక్కలంక సీతారామారావు (అవును. అతనే. మనమెరిగిన వ సీ రా) ఎందరికో ఆదర్శం. ఇంటిపేరు V – అంటే ‘విజయం’. “గతుకుల్లోనూ గెలవటం నేర్చుకున్న” విజేత కథ.

ఈ కూచిమంచి పదిహేను కథలు రాసేటప్పుడు పదిహేను వందల సార్లు దణ్ణాలెట్టుకున్నారేమో రచయిత – అగ్రహారం అనుగ్రహించి తన కథలని చక్కని వాక్య నిర్మాణంతో, అందమైన వర్ణనలతో, గిలిగింతలు పెట్టే హాస్యంతో, కొందరు మనుషులు మరుగై పోవటం వంటి గుండె బరువెక్కే వాస్తవ సంఘటనల్ని ఉన్నది ఉన్నట్లుగా రాయించుకుంది. ఈ ‘ఉపమ’లని, గోదావరి ‘ఎటకారాన్ని’, సరికొత్త సహజమైన వర్ణనల్ని, చదివించే శైలిని ఆనందించాలంటే “c/o కూచిమంచి అగ్రహారం” పుస్తకాన్ని ‘కొని’ ఆస్వాదించాలి మరి.

కూచిమంచి అగ్రహారంలో వీరేనా! ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కథల్ని రాయాల్సిన బాధ్యత చక్రధర్ పై ఉంది. కాబట్టి దీనికి సీక్వెల్ గా రెండో పుస్తకం కూడా వస్తుందని ఆశిద్దాం.

***

C/o కూచిమంచి అగ్రహారం (జ్ఞాపక కథలు)
రచన: ముక్కామల చక్రధర్
పేజీలు 174
వెల: 150 (పోస్టేజి అదనం)
ప్రతులకు:
అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు
~
ఎం.వి.చక్రదర్
C/o కె.శ్యామలదేవి
ఇంటి నెంబర్ 3-1-163/2, చింతపల్లి కృష్ణమూర్తి వీధి,
నారాయణపేట, కె. అగ్రహారం, అమలాపురం – 533201
ఆంధ్రప్రదేశ్. ఫోన్: 9866710422
గూగుల్ పే: 9912019929

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here