కుక్క పిల్ల

0
5

[dropcap]పొ[/dropcap]ద్దునయ్యే సరికల్లా నల్లనయ్య మధురానగరం వెడుతున్నాడనే వార్త గోకులం అంతా పొక్కింది. అక్రూరుడు మెల్లిగా రధం సిద్ధం చేస్తున్నాడు. నందుడి ఇంటి ముందు లోగిలి అంతా వచ్చే పొయ్యే వాళ్ళతో సంరంభ సంకుల విస్తీర్ణమై ఉంది. కృష్ణుడూ, బలరాముడూ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ తిరుగుతున్నారు. అందరూ ఒక్కసారి రావటంతో నందుడూ యశోదా పొట్టు పొట్టయి పోతున్నారు. ఇంతలో చెయ్యి ఎవరో లాగినట్టయి ఎవరా అని ఒకసారి పక్కకి చూసాడు కృష్ణుడు. అయిదేళ్ళ పిల్లాడు ఒక కుక్కపిల్లని ఎత్తుకుని నిల్చున్నాడు. మిత్రులతో మాటలాపి కొద్దిగా వొంగి “ఏమిటి” అన్నాడు కృష్ణుడు. ఆ పిల్లాడు గోచీ పెట్టుకున్నాడు. అప్పుడే పుట్టినట్టు అనిపిస్తున్న కుక్కపిల్లని ఎత్తుకుని నిలుచున్నాడు. బంగారు వర్ణంలో ఉన్న జుట్టుతో ఆ కుక్క ముద్దొస్తోంది.

“నువ్వు మథురకి వేలుతున్నావుట కదా, మళ్ళీ రావుట కదా” అన్నాడు పిల్లవాడు.

“ఎవరన్నారు” అన్నాడు కృష్ణుడు

“అందరూ అంటున్నారు”

“అయితే”

“ఈ కుక్క పిల్ల బావుంది కదా”

“ఊ, ఎందుకు ”

“భలే ముద్దోస్తోంది కదా”

“అవును అయితే”

“ఇది ఇవ్వాళ్ళ పొద్దునే పుట్టింది”

“సరే ఇది నాకు ఎందుకు చెబుతున్నావు” అని సమ్మోహనంగా అంటూంటే అక్కడ ముత్యాలు రాలాయి.

“నిన్న రాత్రి దాకా మేము అందరమూ నీ పాట విన్నాం కదా. పాపం ఇది కూడా నీ పాట వింటే బావుంటుందనీ”

“నేను ఇవాళే వెళ్ళిపోతున్నాను కదా”

“ఇప్పుడు పాడచ్చు కదా” అని ఆ అబ్బాయి అని మెల్లిగా అన్నాడు.

“ఇప్ప్పుడా? ఇక్కడా? ఇట్లా ఎట్లా” అన్నాడు కృష్ణుడు.

“నువ్వు తలుచుకుంటే ఏ మన్నా చెయ్యగలవు, కొండలెత్తగలవూ, రాక్షసులని చంపగలవూ, ఇది ఒక లెక్కా నీకు” అని నవ్వాడు అబ్బాయి.

ఇంతలో కుక్కపిల్ల భౌ మంటూ మొరిగింది.

“అది కూడా అవునని చెబుతోంది చూడు. పాపం పసివాడు. వాడి మొహం చూడు. నువ్వు పాడక పోతే ఎలా చెప్పు. మేమందరం నీ పాట వినీ వీడొక్కడే నీ పాట వినకపోతే దానికి అన్యాయం చేసినట్టు కాదూ” అని నవ్వాడు పిల్లాడు..

కృష్ణుడికి ఏమి చెయ్యాలో తెలీలేదు.

“చూడు నీ వంకే ఎంత తీక్షణంగా చూస్తోందో. నీ పాట వింటే ఒక్క సారైనా, దీని జన్మ ధన్యమై పోతుంది కదా” అని మళ్ళీ అని కృష్ణుడి చెయ్యి తీసి కుక్క పిల్ల మీద పెట్టాడు. కృష్ణుడు కుక్క పిల్ల తల మీద చెయ్యి వేసి నిమిరాడు. అది కృష్ణుడి చెయ్యిని నాకింది.

“హుష్, వొద్దు అలా చేయక” అన్నాడు పిల్లవాడు ఆ కుక్కతో. అది ఏమీ పట్టించుకోకుండా కృష్ణుడి మొహం చూస్తూ నాలికతో చేతిని నాకుతోంది.

“ఏం పేరు పెట్టావు” అన్నాడు కృష్ణుడు.

“ఇంకా పెట్టలేదు కానీ గోవిందుడు అని అనుకుంటున్నాను” అన్నాడు పిల్లవాడు..

“అదేంటి నా పేరు పెడుతున్నావు”

“నిన్ను మళ్ళీ మళ్ళీ తలుచుకోటానికి అవకాశం దొరుకుతుంది కదా. ఇంకోటి ఆ పేరంటే నాకు చాలా ఇష్టం కూడా.”

“సరే అయితే అలా వెడదాం పద” అని బలరాముడికి సైగ చేసి బయలుదేరాడు కృష్ణుడు. కొద్ది నిమిషాల్లో చిన్న చెరువూ, దాని ఒడ్డున పెద్ద రావి చెట్టూ కనిపించినయ్యి. అక్కడ అరుగు మీద కూర్చున్నాడు కృష్ణుడు. పక్కనే పిల్లాడు కూచున్నాడు. వాడి వొళ్ళో నుంచి కుక్క ఎగిరి వెళ్ళి కృష్ణుడి వొళ్ళో కూచుంది. కృష్ణుడు దాని వొళ్ళు అంతా నిమురుతూ “ గోవిందా” అని పిలుస్తూ ఉంటే లో గొంతుతో కుక్కపిల్ల దీర్ఘాలు తీసింది. కుక్క పిల్లని తీసి కిందకి వొదిలి వేణువు అందుకున్నాడు కృష్ణుడు. అమృతం ధారలుగా పడుతుంటే దాంట్లో కుక్కపిల్లా, పిల్లాడూ తడిసి ముద్దయ్యారు. కృష్ణుడు పాడుతున్నంత సేపూ ఇద్దరూ తదేకంగా కృష్ణుణ్ణి మైమరచి చూసారు. చెట్టూ చేమా యమునా నదీ అన్నీ రాత్రి రావాల్సిన అమృతం జల్లు పొద్దునే పడిందేమిటా అని నిక్కి నిక్కి చూశాయి. చెట్టూ చేమా చెరువూ చెమ్మా గొడ్డూ గోదా అన్నీ ఆనంద తరంగితాలయ్యాయి. కాసేపాగి పాట ఆపేశాడు కృష్ణుడు పిల్లాడి కళ్ళల్లోంచీ కుక్క పిల్ల కళ్ళల్లోంచీ కారుతున్న ఆనంద బాష్పాలని తుడిచాడు. కుక్క పిల్లని గట్టిగా ఒక సారి కౌగలించుకుని కిందకి వొదిలిపెట్టాడు. పిల్లవాడి జుట్టుతో కాసేపు ఆడుకుని, అవీ ఇవీ మాట్లాడి, ఒక ముద్దు పెట్టి సరే వెళ్ళొస్తా అని బయలుదేరాడు కృష్ణుడు. కుక్కపిల్ల కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణం చేసింది. ఆ పిల్లవాడు ఆశ్చర్యంగా చూసాడు. కృష్ణుడు కదలకుండా కుక్కపిల్ల వెంటబడి ఆపుతుంటే ‘నన్ను పోనీ’ అన్నాడు కృష్ణుడు. ఆ పిల్లవాడు కుక్కపిల్లని గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడు.

కుక్కపిల్ల ఆ రావిచెట్టూ చుట్టూ తిరుగుతూ ఉంది. కాసేపాగి పిల్లవాడు ఆ కుక్కపిల్లని “ గోవిందా పద” అంటూ ఎత్తుకుంటే అది గట్టిగా అరిచి కిందకి దూకి చెట్టు చుట్టూ పరుగులు పెట్టింది. పిల్లవాడు ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టుకోలేకపోయాడు. ఇంతలో తనని వెతుక్కుంటూ వొచ్చిన స్నేహితుడి సాయంతో ఎలాగోలా దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో మర్నాడు పొద్దున్న చూస్తే కుక్క పిల్ల కనిపించలేదు. ఏమైపోయిందబ్బా అని పిల్లవాడు ఊరంతా వెతికితే ఊరిచివర నిన్న కృష్ణుడు పాట పాడిన రావి చెట్టు దగ్గర కనిపించింది. అస్పష్టంగా కనిపిస్తున్న కృష్ణుడి పాదముద్రల మీద అక్కడి నించీ ఇక్కడి నించీ పూలు తీసుకొచ్చి పెడుతున్న కుక్కపిల్లని చూసి ఆనందంతో “గోవిందా” అని దగ్గిరి కెళ్ళి కావిలించుకున్నాడు. ఆ సాయంత్రం కుక్కపిల్లని ఇంటికి తీసుకెళ్లటం పిల్లవాడి వల్ల కాలేదు. సరే అని దాన్ని అక్కడే వొదిలి వెళ్లాడు. అప్పటినించీ ఆ పిల్లాడు రోజుకోసారి వొచ్చి గోవిందుడిని చూసిపోయ్యేవాడు. పిల్లవాడు పెద్దవాడయ్యాడు, కుక్క పిల్ల పెద్దదయ్యి ముసలిదయ్యింది. కృష్ణుడు ఎక్కడ తనని వొళ్ళో కూచోబెట్టుకుని తల మీద రాశాడో అక్కడే కాలధర్మం చెందింది.

ఇప్పుడక్కడ కృష్ణుడు లేదు, కుక్క పిల్ల లేదు. చెరువు సగం పూడి పోయింది, రావి చెట్టు కొట్టేసింది పోగా కొద్దిగా మిగిలి ఉంది. కానీ ఇప్పటికీ ఆ ప్రదేశంలో కృష్ణుడి వేణుగానమూ, మధ్యలో కుక్క పిల్ల మొరగటమూ వినిపిస్తుందని వినగలిగిన వాళ్ళు చెబుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here