కులం గురించి క్రైస్తవ మిషనరీలు

0
9

[dropcap]“C[/dropcap]aste” అంటే ‘కులం’ గురించి పంతొమ్మిది మరియు ఇరవయ్యో శతాబ్దపు క్రైస్తవ మిషనరీల రచనలలో ఉన్న విషయాలను యథాతథంగా ప్రస్తావిస్తూ వాటిపై చేసిన వ్యాఖ్యానాల సమాహారం ఈ వ్యాసం. అప్పటి మిషనరీల రచనల ఆధారంగా ఆ కాలపు సమాజంలో కులం పోషించిన పాత్రను గురించి ఒక అవగాహనకు రావటం తద్వారా ఇప్పటి కాలపు సమాజంలో కులం పాత్రను గురించి ఒక అంచనాకు రావటంలో సహాయపడటం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. కులం గురించి రకరకాల అభిప్రాయాలు తీర్మానాలు చలామణిలో ఉన్న కాలంలో క్రైస్తవ మిషనరీల రచనలు కులాన్ని ఒక కొత్త కోణంలో చూడటంలో సహాయపడతాయి అని ఈ వ్యాస రచయిత అభిప్రాయం.

అయితే మిషనరీల అభిప్రాయాలలోకి వెళ్ళే ముందు ఈ వివాదాస్పద విషయం పై కొన్ని అభిప్రాయాలు ఇప్పటి కాలంలో ఈ చర్చ జరగాల్సిన అవసరము గురించి కొన్ని మాటలు పంచుకోవాలి.

ఈ విషయమై పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్ళలో కులం గురించి భారతీయ సమాజం గురించి రచనలు చేసిన ఆంథ్రోపాలజిస్ట్ ఏ.ఎం.హోకార్ట్ వాక్యాలను గుర్తుకు తెచ్చుకోవాలి. హోకార్ట్ వాక్యాలను తన రచనలలో పదే పదే తలుచుకునేవారు మేధావి మరియు సాంప్రదాయవాది అయినటువంటి ఆనంద కెంటిష్ కూమారస్వామి (A K Coomaraswamy).

“పారిశ్రామిక సమాజపు విలువలతో సామ్యం కుదరకపోవటం వలననే వంశానుగత వృత్తి పరంపరలను చిన్నచూపు చూడటమన్నది జరుగుతుంది” అంటారు హోకార్ట్ (Les castes, p. 238)

పారిశ్రామిక విప్లవానికి మునుపు దాదాపుగా ప్రపంచం అంతా కూడా వంశానుగత వారసత్వ వృత్తి పరంపరల ఆధారంగానే నడిచేది. Enlightenment విలువలు వచ్చాక సమాజంలో చాలా మార్పులు జరిగాయి. ఫ్రెంచి విప్లవానంతరం నెపోలియన్ బోనపార్ట్ “careers open to talents” అంటే ఎవరి టాలెంటును బట్టి వారి జీవన ప్రగతి జరగాలి అన్న ప్రతిపాదనను ప్రధాన స్రవంతిలోకి తెచ్చాక ఐరోపా సమాజంలో చాలా మార్పు జరిగింది. ఇవన్నీ జరగక మునుపు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలలో వారసత్వ వృత్తి పరంపరలు ఉండేవి. భారత దేశంలో జాతులు కులాలు వర్ణాలు వగైరా బహు నామాలతో ఇటువంటి ఆచరణ మరింత పకడ్బందీగా ఏర్పడింది.

అయితే ఈ వంశానుగత పరంపరలలో అప్పుడప్పుడు దిద్దుబాటులు సవరణలు మినహాయింపులు వగైరాలు జరుగుతూనే ఉండేవి. కొత్త జాతులు కులాల సృష్టి జరుగుతూనే ఉండేది. అయినప్పటికీ తాతల తండ్రుల జాతి పరంపర కుల వృత్తి పరంపర అన్నది సర్వ సాధారణమైన విషయంగా ఉండేది. ఈ పరంపరల ఆధారంగానే ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానం విజ్ఞానం ఆచారాలూ వ్యవహారాలూ వ్యాప్తి చెందేవి. ఇది కుల పరంపరల యొక్క మంచి చెడు గురించిన తీర్మానం చేసే ప్రయత్నం కాదు. ఇప్పటి కాలపు ఫ్రీ మార్కెట్టు పెట్టుబడిదారీ విధానాలకు ఇవన్నీ నప్పవు ఎలాగూ. ఐతే అప్పటి కాలపు సమాజంలో కులాల ప్రాముఖ్యతను తీసిపారేయలేము. బ్రిటీషు వారు రాక మునుపటి కాలపు భారతీయ సమాజంలో కులం అన్నది చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందన్నది చారిత్రక సత్యం.

హోకార్ట్ పేర్కొన్నట్టుగా పారిశ్రామిక విప్లవానంతర సమాజాల విధి విధానాలకు కుల పరంపరలకు సమన్వయము కుదరదు. ఇవంతా కూడా “ప్రోగ్రెస్” అంటే ప్రగతి నిరోధక భావాలని తీర్మానం చేసేయచ్చు. ఐతే ఎందరో సంఘ సంస్కర్తలు కలలుగన్న కుల రహిత సమాజం అన్నది ఎప్పటికి సాధ్యపడుతుందో తెలియని అనిశ్చితి ఇప్పటికీ ఉండనే ఉంది. అంతేకాక  కులం లేని హిందూ మతం యొక్క స్వరూప స్వభావాల విషయంలో కూడా సరైన అవగాహన అన్నది ఒక వైపు మేధావి వర్గపు బుద్ధిజీవులకు మరొక వైపు సామాన్య ప్రజానీకానికి ఇరువురికీ ఉన్నట్టుగా అనిపించదు. అందుకే వృత్తి వారసత్వాల విషయంలో కులాల ప్రాధాన్యం ఎలా ఉన్నా కూడా ఆచార వ్యవహారాలలో కులాల ప్రాధాన్యత ఇంకా పూర్తిగా సమసి పోలేదు మన సమాజంలో.

కులాల వారీ జన గణన చేయాల్సిందే అని కులం గురించిన రాజకీయాలు రాజుకుంటున్న కాలం ఇది. ఎవరు కాదనుకున్నా ఇంచు మించుగా ప్రతీ పౌరునికి కులం అన్నది పుట్టుకతోనే ఆపాదింపబడుతుంది ఇప్పటికీ. ముఖ్యంగా సంక్షేమ పథకాలు రిజర్వేషన్ల అమలు సామజిక న్యాయ విధానాల చెల్లుబాటు కోసం. ఇదంతా రాజకీయ నాయకులు మరియు రాజ్యాంగమూ చట్టవ్యవస్థల ఆశీస్సులతోనే జరుగుతోంది. ప్రభుత్వాలు రకరకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికిని చాలా వరకు వివాహాలు కుల చట్రానికి లోబడే జరుగుతున్నాయి. ఒకవేళ కులాంతర వివాహం జరిగినా కూడానూ తర్వాతి తరాల వారికి తండ్రి కులం అన్నది ఆపాదింపబడటం రివాజుగా మారింది ఎలాగూ.

కుల వ్యవస్థ యొక్క ఆర్థిక పునాదులకు పారిశ్రామిక విప్లవానంతరం బీటలు పడ్డాయి. యాంత్రిక విప్లవం మరియు వలస పాలన యొక్క ప్రభావానికి లోనైన హిందూ సమాజంలో కుల వ్యవస్థ మూలాలు బాగానే దెబ్బతిన్నాయి. ఆ దెబ్బ నుంచి ఇప్పటికీ మన సమాజం పూర్తిగా కోలుకోలేదు.

అయితే క్రైస్తవ మిషనరీలు గుర్తించినట్టుగా కులం అన్నది కేవలం వృత్తి పారంపర్యానికి సంబంధించిన వ్యవస్థ మాత్రమే కాదు కులం అంటే ఒక జీవన విధానం. వివిధ రకాలైన ధార్మిక భావనలు ఆచార వ్యవహారాలు దానితో విడదీయరానంతగా ముడిపడి ఉన్నాయి మన సమాజంలో. అందుకనే హిందువులకు కులాన్ని మతాన్ని వేరు చేసి చూడటం చేతనవ్వట్లేదు ఇప్పటికీ.

బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రతిపాదించిన annihilation of caste అంటే కుల నిర్మూలన అన్నది ఎలా అమలు చేయాలి అన్న విషయం పై ఏకగ్రీవ అంగీకారం లేదు మన సమాజంలో. సమూల నిర్మూలన అన్నది జరగలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో కులం అన్నది మన సమాజంలో కొనసాగుతూనే ఉంది.

నేడు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడానూ ఆర్థిక అసమానతలు అన్నవి హెచ్చరిల్లుతున్నాయని హద్దు మీరుతున్నాయని ఎందరో మేధావులు తత్వవేత్తలు ఘోషిస్తున్నారు. మెరిటోక్రసీ అంటే మెరిట్ ఆధారంగా వృత్తులు జీవన ప్రమాణాలు నిర్ణయించే విధానంపై ఆధారపడిన సమాజాలలో కూడా అసమానతలు ఏ మాత్రం తగ్గక పోగా మెరిట్ అన్న పేరు మీద ఈ అసమానతలకు ఒక రకమైన న్యాయబద్ధత చేకూరినట్టుగా తయారయ్యిందని హార్వార్డ్ యేల్ వంటి విశ్వవిద్యాలయాలలో గొప్ప చదువులు చెప్పే న్యాయశాస్త్ర రాజకీయ తత్వశాస్త్ర కోవిదులు వాపోతున్న కాలం ఇది. కాబట్టి కుల నిర్మూలన ఎలా చేయాలి అన్న విషయం పక్కన పెడితే అసలు నిర్మూలన జరిగాక సమాజం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అన్న విషయం పై కూడా సరైన అవగాహన ఏకాభిప్రాయం అన్నది లేదు మనకు ఇంకా.

 పూర్తిగా మెషీన్ల పై టెక్నాలజీ పై ఆధారపడ్డ యాంత్రిక సమాజం అన్నది వృత్తుల విషయంలో వారసత్వాలకు పూర్తిగా వ్యతిరేకం. టెక్నాలజీ ఎటు తీసుకువెళితే అటు మనం వెళ్లాల్సిందే మనకి వేరే దిక్కు లేదు ఈ విషయంలో. టెక్నాలజీ ముందు ఎవరైనా సరే తలొగ్గాల్సిందే అన్నది దాదాపుగా అందరూ ఇప్పటి కాలంలో ఒప్పుకుంటున్న సత్యం. కాబట్టి ఇటువంటి సమాజంలో అందరు వారి తాతలు తండ్రుల వృత్తులు ఉన్నది ఉన్నట్టుగా చేయాల్సిందే అని మంకుపట్టు పట్టడంలో అర్థం లేదు, నిరంతరం పనిముట్లు వృత్తులు మార్పు చెందే యాంత్రిక సమాజంలో దాని అమలు కూడా సాధ్యం కాదు. ఈ వ్యాసం దాని గురించి కాదు. అయితే కుల నిర్మూలనా వాదం మూలంగా హిందూ సంప్రదాయానికి జరిగే లాభ నష్టాలు ఏమిటి సాంస్కృతిక పరంపరల విచ్చిన్నం మూలంగా మనం కోల్పోయేది ఏమిటి ఆ నష్టాన్ని పూడ్చే ప్రత్యామ్నాయాలు ఏమిటి వాటి ఏర్పాటూ మరియు సాధ్యా సాధ్యాల గురించిన ఆలోచించాల్సివుంటుంది.

వలసపాలన తెచ్చిపెట్టిన ఆధునికతకు మునుపు నాటి భారతీయ సమాజంలోని హిందూ ధార్మిక జీవనంలో కులం యొక్క ప్రాముఖ్యతను గురించి మన మేధావి వర్గంలో చాలా మందికి అవగాహన ఉన్నట్టుగా అనిపించదు. అందుకే మన మేధావి వర్గం కులం లేని సమాజంలోని హిందువు తన ధార్మిక మూలాలను మత భావాలను వదులుకోకుండా జీవించడం ఎలా ఆన్న విషయమై సరైన ప్రతిపాదన చేయలేకపోయారు. కాబట్టే ఆస్తిక జనులు ఇప్పటికి కులాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అది లేకుండా ధార్మిక విషయాలలో ఆచార వ్యవహారాలలో సంప్రదాయాలలో చెల్లుబాటు జరగట్లేదు కనుక. మన సమాజం అంతా కూడా సంప్రదాయానికి పారిశ్రామిక నాగరికతకూ మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంది ఒకరకమైన త్రిశంకు స్వర్గంలో.

ఈ విషయంపై ప్రముఖ సోషియాలజిస్టు ఎం.ఎన్. శ్రీనివాస్ 1962లో రాసిన వ్యాసంలోని ఒక భాగాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. “భారత దేశంలో మార్పుకు లోనవుతున్న వ్యవస్థలు విలువలు” (“Changing Institutions and Values in Modern India”) అని EPW లో వచ్చిన వ్యాసంలో శ్రీనివాస్ ఇలా అంటారు.

“భారత దేశంలో సామాజిక వ్యవస్థలు మరియు విలువలు పెను మార్పుకు లోనవుతున్నాయి. దీని ప్రభావం భారతీయులందరి పైనా ఉంటుంది,  ముఖ్యంగా హిందువుల పై. ఎందుకంటే హిందూ మతం అన్నది దాని ప్రాపకానికి కొన్ని వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యవస్థలన్నీ కూడా ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి. రాబోయే తరాలకు జీవన లక్ష్యాలు మరియు జీవిత విలువల విషయంలో దిశానిర్దేశం చేయవలసిన విషయమై ఎంతో జాగురూకతతో వ్యవహరించవలసి ఉన్నది. దేశ భక్తి భావం లేదా జాతీయతా భావం అన్నది ఒక లక్ష్యాన్ని ఇస్తే ఇవ్వవచ్చునుగాక కానీ విలువల విషయంలో అది సరిపోదు. అంతర్జాతీయతా వాదం కూడా సరిపోదు ఆ విషయంలో. ప్రతీ వ్యక్తికీ తన జీవితం గురించి ఒక తాత్త్విక దృక్కోణం అవసరం. చాలా వరకు ఈ విషయంపై ప్రతి వ్యక్తికీ ఒక అవగాహన అన్నది తన మతం లేదా ధర్మం ఆధారంగా ఏర్పడుతుంది. ఈ మతం అన్నది కులము , గ్రామము (లేదా సొంత ఊరు), ఉమ్మడి కుటుంబము అన్న మూడు వ్యవస్థల పై ఆధార పడి ఉంది. ఇవన్నీ కూడా ఎంతో మార్పునకు లోనవుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం ఈ ప్రజానీకం పైనా మరియు ఈ దేశం పైనా ఎలా ఉండబోతుందో అన్న ప్రశ్న ముఖ్యమైనది.   అయితే అసలు ఇటువంటి సమస్య ఒకటి ఉంది అన్న విషయం పై కూడా చాలా మందికి సరైన అవగాహన లేదు. ఇది మనం చాలా చింతించవలసిన విషయం “

ఎం.ఎన్. శ్రీనివాస్ కులం గురించి కూడా ఇలా రాశారు

“కులం అన్నది అదృశ్యమైపోతే మరిక హిందూ మతం సంగతేమిటి అన్న ప్రశ్న గురించిన చర్చ నేను ఇప్పుడు చేయాలని అనుకోవట్లేదు. ఆ విషయమై సుదీర్ఘమైన చర్చ చేయవలసి ఉంటుంది. దానికి ఇది అనువైన సమయం కాదు” అని.

శ్రీనివాస్ అన్నట్టుగా కులం లేని హిందూ మతం అన్నది ఎలా ఉంటుందో ఊహించుకోవటం అప్పటి కాలానికే కాదు ఇప్పటికి కూడా కష్టతరమే. నిజానికి ఇది అంత సులభతరమైన విషయమే ఐతే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం వైపు దృష్టి సారించవలసిన అవసరమే లేదు. ఎలాగైనా సరే కుల నిర్ములన చేసేద్దాం అని అనుకునే హిందూ సంస్కరణ వాదులకు అసలు ఈ సంస్కరణ వలన హిందూ మతం పై ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్న విషయం గురించి లోతుగా ఆలోచించాలి.

దైనందిన వ్యవహారాలలో మరియు ధార్మిక విషయాలలో కులం అన్నది హిందూ సమాజంలో ఎంతగా పెనవేసుకు పోయింది అన్న విషయం తెలుసుకోగోరేవారికి 1800-1950 మధ్య కాలంలో క్రైస్తవ మిషనరీలు రాసిన రచనలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఇటువంటి విషయాల పై హిందూ ధర్మ గురువులు సంప్రదాయ మేధావులు పండితులు చెప్పిన విషయాలను హిందువులు ఎలాగూ పట్టించుకోరు కనుక కనీసం క్రైస్తవ మిషనరీల మాటలన్నా పట్టించుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఈ వ్యాసంలో వీరి వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నాను.

హిందూ ధర్మాన్ని భారత దేశం నుంచి పూర్తిగా పెకిలించి వేసి దేశం మొత్తాన్ని క్రైస్తవీకరించాలని ఉబలాట పడిన అప్పటి క్రైస్తవ మిషనరీల రచనలలో కులం గురించిన ప్రస్తావనల స్వేచ్ఛానువాదం తదనుగుణ వ్యాఖ్యానాలు ఈ వ్యాసంలో ఇక్కడి నుంచి మొదలు.

మిషనరీలు హిందూ మతాన్ని సమాజాన్ని అర్థం చేసుకున్న విధానంలోని లోపాల గురించి చాలా పరిశోధనలే జరిగాయి. అయితే ఈ వ్యాసంలో నేను ప్రస్తావిస్తున్నది కేవలం వారు కుల ప్రాముఖ్యతను గురించీ భారత దేశాన్ని క్రైస్తవీకరించడం అనే ప్రాజెక్టుకు కులం అన్నది ఒక అడ్డుగోడలా నిలవడం గురించి రాసుకున్న విషయాలను మాత్రమే.వారి స్వంత డైరీలలో,  రచనలలో మత మార్పిడి విషయంలో కులం ఒక కొరకరాని కొయ్యగా ఉండటం అన్న విషయంపై మిషనరీలు రాసుకున్న రాతల గురించి మాత్రమే ఇక్కడి నా ప్రస్తావన.

లూయి జార్జి మిల్నే అని బొంబాయి నగరానికి చెందిన బిషప్పు 1908లో రాసిన ”Missions to Hindus : A contribution to the Study of Missionary Methods” అన్న పుస్తకంలో ఇలా అన్నారు

“ఈ కులం అన్నది పైకి కేవలం సాంఘిక కట్టుబాటు లాగా అనిపిస్తుంది. అయితే వందల వేల మందికి రోజువారీ విషయాలలో కులమే మతానికి ప్రతినిధి వంటిది. వారి వ్యక్తిత్వాన్ని వారి కులమే ప్రభావితం చేస్తుంది. అదే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. కులం అన్నది వారి ధర్మానికి వారి మత విశ్వసాలకు మరియు వారి వ్యక్తిత్వానికి మధ్యన ఉండే ప్రధానమైన లంకె లేదా వారధి. ఒక హిందువు యొక్క స్వభావానికి గుణగణాలకు మత విశ్వసాలకు పునాది ముమ్మాటికీ కులమే.

కాబట్టి మిషనరీలైన మనము ముందుగా గురి పెట్టాల్సింది ఈ కులం వైపే. హిందువులకు వారి మతాన్ని వారి మెడలకు తెంచుకోవటానికి వీల్లేని సంకెళ్ళలాగా బంధించింది వారి కులమే. వారు హిందూ మతాన్ని వదులుకొని క్రైస్తవాన్ని పుచ్చుకోవాలంటే మనకున్న ప్రధాన అడ్డంకి కులం. భారత దేశంలో సువార్త వ్యాపించాలన్న మన సంకల్పం నెరవేరాలంటే మనం ముందుగా ఢీ కొట్టవలసిన అతి భీకరమైన ప్రత్యర్థి ఈ కుల వ్యవస్థ”

ఈ విధంగా మిషనరీలు కులం అన్నది హిందువుల దైనందిన వ్యవహారాలలో ఎలా పెనవేసుకుని ఉందో అన్న విషయాన్ని ముందుగానే గుర్తించారు. వ్యక్తి స్వేచ్ఛ అన్న భావన అంటే individualism అన్నది కులంతో ముడిపడ్డ ఈ దేశంలో లేదన్న విషయాన్ని వారు గుర్తించారు. కులం అన్నది మత మార్పిడి విషయంలో గొప్ప అడ్డుగోడ అని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఇటువంటి మిషనరీల అనంతరం వారు చెప్పెడి చదువులు చదువుకున్న హిందూ సంస్కరణ వాదులు కుల నిర్మూలన గురించి గుడ్డిగా తాపత్రయ పడ్డారు తప్పితే క్రైస్తవ మిషనరీలు కులాన్ని మతమార్పిడికి ప్రధాన అడ్డంకిగా భావించారనే విషయాన్ని గుర్తించి ఆ విషయమై ఆలోచన చేసిన దాఖలాలు పెద్దగా లేవు. కుల నిర్మూలన వాదం ద్వారా హిందూ మతానికి ఏదో గొప్ప మేలు చేస్తున్నామని అనుకునే వారు ఇప్పటికీ ఉన్నారు. కులాన్ని నిర్మూలిస్తే హిందూ మతం సంస్కరింపబడి రాజకీయంగా బలోపేతమవుతుందని వాదించే వారు కూడా ఉన్నారు. అయితే కొందరు మేధావుల అభిప్రాయం ప్రకారం  ఓటు బ్యాంకు రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి కులం ఇంకా బలోపేతమైనట్టుగా ఉంది ఇప్పటి హిందూ సమాజంలో.

మిషనరీ సాహిత్యం నుంచి మరొక వాక్యం

“… అన్ని దేశాలకు మల్లే దైనందిన జీవితం పై వారసత్వ పరంపరలు మరియు తర తరాల సంప్రదాయాల ప్రభావం అన్నది ఇక్కడ కూడా ఉంది. అయితే భారత దేశంలో ఉన్నంతగా ఈ సంప్రదాయాల ప్రభావం మరెక్కడా లేదనటంలో అతిశయోక్తి లేదు.. “

ఇటువంటిదే మరొక వాక్యం

“కులం అన్నది ఈ సమాజంలో ఏవిధంగా వ్యక్తీకరింపబడ్డా కూడా సువార్త ప్రచారానికి సంబంధించినంతవరకు మిషనరీల దృష్టిలో మాత్రం దానిని కేవలం మనం ఒక ఆగర్భ శత్రువులానే భావించాలి. కులంతో సంధి లేదా సఖ్యత అన్నది అసాధ్యం. కులాన్ని సమూలంగా కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేయవలసిందే”

ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే కులాన్ని సమూలంగా పెకిలించి వేస్తే గానీ సువార్త ప్రచారం సాధ్యం కాదని అప్పటి మిషనరీలు గుర్తించారు. మరి అటు తర్వాత వచ్చిన హిందూ సంస్కర్తలు కులాన్ని పెకిలించి వేసి ఆ ఖాళీని దేనితో పూర్తి చేద్దామని అనుకున్నారో ఏమిటో.

రెవరెండ్ ఐ. హెచ్. హ్యాకర్ ట్రావెన్కోర్ (నేటి కేరళలో ఒక భాగం) లో లండన్ మిషనరీ సొసైటీ వారి కార్యకలాపాలను గురించి ప్రస్తావిస్తూ రాసిన పుస్తకం “A hundred years in Travancore, 1806–1906 : A History and Description of the Work Done by the London Missionary Society in Travancore, South India during the past century” లో ఇలా అన్నారు.

“మన మిషనరీలు పదిహేను వందల ఏళ్ళుగా ప్రయత్నించినా కూడా ఈ చిన్న రాష్ట్ర (కేరళ) సరిహద్దులను దాటుకొని భారత దేశాన్ని మొత్తాన్ని క్రైస్తవీకరించటం అన్న విషయంలో వెనకపడటానికి ఈ కుల ప్రత్యేకతల వ్యవస్థ అన్నదే ప్రధాన కారణం”

లండన్ మిషనరీ సొసైటీ కలకత్తా కు చెందిన రెవరెండ్ ఎడ్వార్ స్టారో 1859లో రాసిన ”India and Christian Missions” లో ఇలా రాసారు హిందూ మతం గురించి

“హిందూ మతం అన్నది ఆ జాతి చరిత్రతో విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నది. వారి జాతీయ జీవనంలోనూ ప్రతి శ్వాసలోనూ హిందూ మతమే ఉన్నది. వారి సాహిత్యంలోనూ తత్త్వశాస్త్రంలోనూ కూడా హిందూ మతమే ఉన్నది. పుట్టుక నుంచి చావు వరకూ వారి జీవితంలోని ప్రతీ అంకంలోనూ అది ధృడంగా అల్లుకుపోయి ఉంది. వారి మతాన్ని వదులు కోవటం అంటే వారికి వారిని మూలాల నుంచి వేరు చేసినట్టుగా అదొక విజాతీయకరణ చర్య లాగా (act of denationalization) అనిపిస్తుంది”

అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు! జాతీయతా భావం అన్నది హిందూ మతంతో అంతగా పెనవేసుకుపోయిన కాలం నుంచి మనం చాలా దూరం ప్రయాణించాం సెక్యులర్ యుగంలో.

అప్పటి కాలపు క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి సాధారణ హిందువులు ఇలా జవాబు ఇచ్చేవారట:

“మీరు చెప్పేది సబబుగానే ఉన్నది. మీ మతం నిజమైనదే శ్రేష్ఠమైనదే. మాది కూడా అంతే. ఇంగిలీషు వారైన మీకు మీ మతము సరైనది. హిందువులైన మాకు మా మతము సరైనది”

ఇప్పటి కాలంలో ఈ వాక్యాన్ని చూసి అబ్బో ఎంత బహుళత్వమో ఎంత పరమత సహనం ఉండేదో చూసారా అని అంటారేమో. కానీ ఆ వాక్యంలో “మీరు” “మేము” “మీ మతం” “మా మతం” అన్న భావనలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోవాలి అని సెక్యులరిజం ముసుగులో చేసే వాదనలలో ఈ విషయం గుర్తుంచుకోవాలి.

ఆ కాలపు మిషనరీ రిపోర్టులు చదివితే అయ్యో మనము అవసరమైనంతగా మత మార్పిడి చేయలేకపోతున్నామే మన టార్గెట్టు చేరుకోలేకపోతున్నామే అన్న నిస్సహాయత ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ టార్గెట్ అన్నది ఎవరినో గేలి చేయటానికి వాడుతున్న పదం కాదు. ఈ పుస్తకాలలో టేబుళ్ళు గణాంకాలతో సహా ఉంటాయి లెక్కలు. ఇంత మందికి సువార్త చేరింది. ఇంకా ఇంత మంది ఉన్నారు. దీనికి ఇంత డబ్బు కావాలి ఇంత మంది బలం అవసరము అని. ప్రస్తుత కాలంలో కూడా జాషువా ప్రాజెక్టు ( Joshua Project ) వంటి వెబ్సైట్లలో భారత దేశాన్ని క్రైస్తవీకరించాలంటే ఏం చేయాలి ఈ మత మార్పిడి విషయంలో ఏం చేయాలి ఎలా చేయాలి అని విశదీకరిస్తూ కులాల వారీగా గణాంకాలు ఇతరత్రా విషయాలు బోలెడు లభ్యం.

రెవరెండ్ ఎడ్వార్డ్ స్టారో ఇదే పుస్తకంలో మరొక చోట “అడ్డంకులు” (The obstacles) అన్న అధ్యాయంలో ఇలా అంటారు. కులం గురించి హిందువులకి ఉన్న నమ్మకం అది వారిని వారి మతంలో ఎలా కట్టిపడేసింది అన్న విషయాన్ని చర్చిస్తూ ఇలా అంటారు.

“వారి శాస్త్రాలలో ఎన్నో మానవతా విలువల గురించిన చర్చలు నైతికత గురించిన పాఠాలు ఉంటాయి. అయితే సాధారణ హిందువుకు అవన్నీ ప్రధానం కాదు. సాధారణ హిందువును మతంతో కట్టిపడేసే కట్టుబాటు ఒక్కటే. అదేమిటంటే తన కుల ధర్మానికి తాను తలొగ్గి ఉండాలి అన్న సూత్రం.

హిందువుల ఉద్దేశంలో కులం అన్నది కేవలం లౌకిక పరమైన సాంఘిక కట్టుబాటు కాదు. అది వారి మత ధర్మానికి సంబంధించిన విషయం. ఈ కుల ప్రత్యేకతలు నియమాలు అన్నవి ఏదో యాదృచ్ఛికంగా ప్రణాళిక లేకుండా తాత్కాలికంగా చేసుకున్న ఏర్పాటు కాదు. ఈ ఏర్పాటు శాశ్వతమైనది ప్రాథమికమైనది మరియు గాఢమైన ధార్మిక మూలాలు గలది”

కులము మరియు శాస్త్రాల గురించి అంబేడ్కర్ మహాశయుని రచనలలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి.

మతమార్పిడి గురించి రెవరెండ్ స్టారో ఇలా అంటారు.

“ఒక హిందువు క్రైస్తవుడిగా మారాడంటే తన కులాన్ని తాను కోల్పోయినట్టే. అంటే తనకు సమాజంలో లభించే పరువు, మర్యాద , గౌరవం ఇతరత్రా విలువైనవన్నీ కోల్పోయినట్టే. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా క్రైస్తవ మతం పుచ్చుకున్నారంటే వారంతా కూడా పతితులుగా నీచులుగా అపవిత్రులుగా భావింపబడతారు. ఇటువంటి పరిస్థితులలో హిందువులకు మత మార్పిడి అన్న ఆలోచన ఎంత అసహ్యం కలిగిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు”

ఈ విషయం ప్రస్తావిస్తూ స్టారో 1850 లో ఆస్తి వారసత్వాల విషయమై చేసిన ఒక చట్టం గురించి ప్రస్తావిస్తారు. ఇది కంపెనీ పాలనలో చేసిన చట్టం. దీని పేరు Caste Disabilities Removal Act, 1850. ఈ చట్టం అమలులోకి రాక మునుపు ఒక వ్యక్తి కులం మారినా మతం మారినా వారికి తాతలు తండ్రుల ఆస్తుల పై వారసత్వ హక్కులు ఉండేవి కాదు. ఈ విషయమై స్టారో వ్యాఖ్యలు:

“1850 వరకు తమ సాంప్రదాయ మతాన్ని వదులుకున్న హిందువులకు తమ ఆస్తుల పై వారసత్వ హక్కులు ఉండేవి కావు. ఇప్పుడు బ్రిటీషు ప్రభుత్వం వారి పుణ్యమా అని క్రైస్తవం పుచ్చుకున్న హిందువు కూడా మూర్ఖపు విగ్రహారాధన చేసెడి అతని హిందూ సోదరునితో సమానంగా ఆస్తిలో వాటా పొందచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి చట్టం ఈ విషయంలో భేదం చూపించక పోయినా కూడా సమాజం చూపిస్తుంది. కులం కట్టుబాటును అతిక్రమించిన వ్యక్తి తన కుటుంబంతో సహజీవనం చేయటానికి సహపంక్తి భోజనం చేయటానికి సమాజం ఒప్పుకోదు. యూదులు కుష్టు వ్యాధిగ్రస్తుణ్ణి తప్పించినట్టుగా కులం కోల్పోయిన వ్యక్తిని హిందూ సమాజం వెలివేస్తుంది. అటువంటి వారు వారి సొంత కులంలో వివాహం చేసుకునే అవకాశం కోల్పోతారు. వారికి వారి సొంత కులపు సమఉజ్జీలతో సహవాసం లేకుండా పోతుంది.సమాజంలో వారి పరువు మర్యాద మంటగలుస్తుంది. వారు ఎన్నో అవమానాలు బహిష్కరణలు ఎదుర్కొన వలసి వస్తుంది. అయితే తన పూర్వపు హిందూ కుల సమాజం నుంచి వారెన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నా కూడా వారు పుచ్చుకున్న సరికొత్త క్రైస్తవ మతం వారికి ఎంతో కొంత ఆసరాగా నిలుస్తుంది. అయినప్పటికీ హిందూ కుల సమాజం ఈ కులం కోల్పోయి మతం మార్చుకున్న వ్యక్తులకు ఏదో ఒక అవరోధం సృష్టిస్తూనే ఉంటుంది. మతం మార్చుకున్న వ్యక్తి యొక్క పూర్వకాలపు బంధువులు స్నేహితులు అందరు కూడాను అతనిని ఘోర అపరాధం చేసిన వ్యక్తి లాగా చూడటం మొదలు పెడతారు. ఈ స్థాయిలో సాంఘిక బహిష్కరణ మరియు చిన్నచూపు అవమానంతో చూడటం అన్నది ఇంగిలీషు సమాజంలో ఉండే వ్యక్తులకు తెలియని అనుభవం. ఈ సాంఘిక కట్టుబాట్లు అపరాధ భావన అవమాన భారం వలన ఎవరన్నా మతం మార్చుకోవాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు. అందువలనే ఇటువంటి సమాజంలో హిందువులకు సువార్త వ్యాప్తి చెందాలంటే మరింత భీకరమైన పోరాటం చేయవలసి ఉంటుంది”

ఈ 1850 చట్ట సంస్కరణల వెనుక ఉన్న మిషనరీల అత్యుత్సాహం కుతంత్రం గురించి తెలుసుకున్న హిందువులు ఈ విషయాల పై నిజానికైతే ఘాటైన విమర్శలు లోతైన చర్చలు చేయాలి. అయితే ఈ చట్ట సవరణలు సంస్కరణల వెనుక ఉన్న క్రైస్తవ కుట్రలను పట్టించుకోకుండా ప్రతీ సంస్కరణా మన మంచికే మన మతంలోని లోపాలను మనం సవరించవలసిందే అని హిందువులు గుడ్డిగా తమను తాము సంస్కరించుకుంటూ క్రైస్తవీకరణ కు లోనవుతున్నారు.

అప్పటి కుటుంబాలలో స్త్రీ యొక్క పాత్రను గురించి మత మార్పిడులను వారెలా ఎదుర్కొన్నారు తమ భర్తలు మతం మారకుండా వారెలా నివారించారు అన్న విషయం పై మిషనరీలు రాసుకున్న వాక్యాలు ఇవి.

“మతపరమైన విషయాలలో పురుషుల మెదళ్ళపై స్త్రీల ప్రభావం చాలా మెండుగా ఉంటుంది. ఈ కుటుంబాలలోని స్త్రీలకు మూఢ మతాచారాల వ్యవహారాల విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ.  అందుకనే వారికి క్రైస్తవం గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. తమ ఇంటి మగవారు మతం మార్చుకునే విషయంలో ఆలోచన చేస్తున్నారు అన్న విషయం పసిగట్టగానే ఈ స్త్రీలు నింగి నేల ఏకం చేసైనా సరే ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటారు. మతం మార్చుకోవాలని ఆలోచించే మగవారి మనసులను వారి తల్లి, సోదరి, భార్య యొక్క కన్నీళ్ళే నియంత్రిస్తాయి. తమ ఇంటి ఆడవారి ఏడుపు పెడబొబ్బలను అధిగమించి మత మార్పిడి చేసుకోవటం అన్నది సామాన్యమైన విషయం కాదు”

స్థానిక ప్రజానీకం పై ప్రభుత్వ బడులు మరియు మిషనరీ బడులలో చెప్పే చదువుల ప్రభావం గురించి మిషనరీ సాహిత్యంలో ఇలా ఉంది:

“మన మిషనరీ స్కూళ్ళలో డెబ్భై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విధంగా క్రైస్తవ సువార్త మనం చాలా మందికి చేరవేసాము.

ప్రతి సంవత్సరము మన స్కూళ్ళ నుండి మన చదువులు చదువుకొని వేల మంది విద్యార్థులు సమాజంలోకి తిరిగి వెళుతున్నారు. వీరంతా కూడా క్రైస్తవ మత విషయాలలో శాస్త్రాలలో చదువులు చదువుకున్న వారు. వారికి మన క్రైస్తవ మత నియమాలు బాగానే అలవడ్డాయి. హిందువుల మత విశ్వాసాలు ధార్మిక మూలాల విషయంలో చాలా మార్పులు జరుగుతున్న కాలం ఇది. అగ్ర కులాల కుటుంబాలకు చెందిన ఎందరో హిందువులు పౌరాణిక హిందూ మతం నుంచి వేరుపడి చాలానే దూరం ప్రయాణించారు. మన స్కూలు చదువుల ప్రభావంలో పడ్డాక వారి మతం గురించి వారు ఇలా చెప్పుకుంటారు – “విగ్రహారాధన అన్నది ఒక మూఢ నమ్మకం. అది ఒక అర్థం లేని ఆచారం. మాకు కాళీ కృష్ణుడు దుర్గ వగైరా దేవుళ్ళ మీద నమ్మకం లేదు. ఓల్డ్ టెస్టమెంట్ లో చెప్పినట్టుగా మేము కేవలం శాశ్వతమైన నిత్యమైన దైవాన్ని మాత్రమే నమ్ముతాము. మాకు ఈ విషయంలో వ్రాతపూర్వకంగా మతభోధనలు చెప్పెడి గ్రంథాలు ఏమీ అక్కర్లేదు. మేము తెలుసుకోవలసిన విషయాలన్నీ ప్రకృతి పరిశీలన ద్వారా తెలుసుకుంటాము. యేసు క్రీస్తు ఎంతో తెలివైన వ్యక్తి మరియు పవిత్ర గురువు కానీ అతను భగవంతుడు కాడు. అసలు ట్రినిటీ అన్నది ఒక అభూత కల్పన. ముగ్గురు ఒకరే అవటం ఏమిటి ఒకరు ముగ్గురుగా ఉండటం ఏమిటి ? ఏది ఏమైనప్పటికి నైతిక విలువల విషయంలో బైబిల్ లో ప్రతిపాదించిన సిద్ధాంతాలు మాకు తెలిసిన ఇతర మత సిద్ధాంతాల కంటే గొప్పవి. మీ మతం నిజంగానే చాలా ఉన్నతమైనది. మా మతం తాలూకా ఆచారాలు చాలా వరకు నీచమైనవి. ఆడవారికి చదువుకునే అవకాశాలు ఉండాలి. విధవలకు పునర్వివాహం చేసుకునే వెసులుబాటు ఉండాలి. ముస్లిములు మరియు కులీన బ్రాహ్మణుల విషయంలో బహు భార్యత్వం నిర్మూలించటం విషయమై బ్రిటీషు ప్రభుత్వం ఏవైనా చట్టాలు తెస్తే అది ఆమోదయోగ్యమైన విషయమే. అవును మా మతము ఆచారాలు వగైరాలన్నీ కూడా చాలా వరకు పాడైపోయాయి. సంస్కరణలకు (Reformation) మునుపు కాలం నాటి క్రైస్తవంకు మల్లే హిందూ మతం కూడా పాడైపోయింది దీనిని సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది”

మా మతము మా ఆచారాలు పాడైపోయాయి వీటికి సంస్కరణలు అవసరమే అన్న భావన ఇలా ఇంగిలీషు మిషనరీ విద్య ప్రభావం వలన మన వారిలో బాగా వేళ్ళుసుకొని పోయింది. ఇది పదహారవ శతాబ్దపు ప్రొటెస్టెంటు క్రైస్తవ భావజాలపు ప్రభావములో ఎన్నో సంస్కరణలకు లోనైన ఐరోపా దేశపు క్రైస్తవ సమాజాన్ని పోలినట్టుగా ఉంది. ఐతే ఇదే భావజాలము ఇప్పటికి కూడా హిందువుల మెదళ్ళలో బలంగా నాటుకుపోయి ఉంది. మేమింకా మమ్మల్ని మేము సంస్కరించుకోవాలి మా మతంలో చాలా లోపాలు ఉన్నాయి అన్న భావన చాలా బలంగా ఉంది మనలో. ఇది వందల ఏళ్ళ మిషనరీ చదువుల పుణ్యమే. ఇప్పటికి కాలంలో “ఐ యాం స్పిరిట్యుయల్ బట్ నాట్ రెలిజియస్” అని అంటారు కొందరు బుద్ధిమంతులు “నాకు దేవుని మీద నమ్మకం ఉంది కానీ ఆచారాలు కర్మ కాండల మీద నమ్మకం లేదు “ అంటారు మరి కొందరు.

మిషనరీ స్కూలు చదువుల గురించి అప్పటికి ఇంకా ప్రభువు బిడ్డలుగా రూపాంతరం చెందని హీతెన్ (heathen) ప్రజల గురించి వారిని వారి సొంత మతం నుంచి దూరం చేసి క్రైస్తవం వైపుకు మరల్చటం గురించి ఇలా అన్నారు అప్పటి మిషనరీలు

“మన మిషనరీ పాఠశాలలో చదువులు చదువుకున్న వారందరి వ్యక్తిత్వము నైతిక భావనలు మన మత భవనాలకు అనుగుణంగా సంస్కరింపడతాయి. వారి చుట్టుపక్కన ఉండే హీతెన్ (heathen) జనాభా కంటే వీరు ఎంతో నిజాయితీతో నిబద్దతతో ఉంటారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులుగా వీరు ఎంతో పురోగతి సాధిస్తారు. అయితే వీరంతా కూడా ఏ మేరకు క్రైస్తవ భావజాల ప్రభావంలో ఉన్నారో అన్నది చాలా అబ్బురపరిచే ఆలోచన. వారికి తెలియకుండానే వారు క్రైస్తవ భావజాలానికి క్రైస్తవ ఆలోచనావిధానానికి దాసోహం అయిపోయారు. వారు మన మత విశ్వసాల యొక్క ఆధ్యాత్మిక మూలాలను తిరస్కరించినా సరే వారి ఆలోచనాధార క్రైస్తవ మూలకమైనదే”

ఇప్పటికీ కూడా మన విద్యా విధానం తాలూకా మూల సిద్ధాంతాలన్నీ క్రైస్తవ కాలంలో మిషనరీలు నాటినవే. కొన్ని తరాలుగా మనం క్రైస్తవ విద్యనే అభ్యసిస్తున్నాం. ఆ ప్రభావం హిందూ ధర్మం పై కనిపిస్తూనే ఉంది.

మరొక చోట మిషనరీలు ఇలా అంటారు:

“మన క్రైస్తవ పాఠశాలలో ఎవరైనా విద్యార్ధి ఓ మోస్తరు కాలము గడిపితే చాలు వారి మనసులో వారి పూర్వపు మత విశ్వసాల గురించి ఎన్నో అనుమానాలు వస్తాయి. మనం వేటినైతే మత మార్పిడికి అవరోధాలుగా భావిస్తున్నామో ఆ అవరోధాలన్నీ వాటికవే వినాశనానికి గురవుతాయి. ఆ విధంగా మత మార్పిడికి మనకు మార్గం సుగమమవుతుంది. ఆ విద్యార్థులు అందరికీ వారి దేవతలు దేవుళ్ళ మీద నమ్మకం సన్నగిల్లుతుంది. వారి శాస్త్రాల మీద విశ్వాసం మెల్లగా సమసిపోతుంది. కుల కట్టుబాట్ల పట్ల గౌరవం పూర్తిగా నాశనం అయిపోతుంది. తమ మత వ్యవస్థల పట్ల పూర్తిగా ఛీత్కార భావం అన్నది వారిలో పెరిగిపోతుంది. వారి మతమంటే వారికి ఏవగింపు అసహ్యం ఏర్పడి పోతాయి. రకరకాల కారణాల వలన పైపై మెరుగులు విషయంలో వారేదో హిందూ మతానుయాయుల లాగా అనిపించినా కూడా నిజానికి వారికి వారి మతంపై నమ్మకం అన్నది పూర్తిగా సన్నగిల్లుతుంది”

ఈ పై వాక్యాలలో మిషనరీలు ప్రస్తావించిన విషయాలకు స్వాతంత్ర్యానంతరం మనకు చెప్పిన చదువులకు ఆట్టే తేడాలు ఏమీ లేవు. మన చదువుల పుణ్యమా అని మనకు హిందూ మతం గురించి హిందూ సమాజం గురించి చాలా వరకు ఇటువంటి భావాలే ఉన్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనకు చెప్పలేనంత చిన్నచూపు ఇప్పటికి అలానే చెక్కుచెదరకుండా ఉంది. ఇదే విషయమై మిషనరీలు ఇలా అన్నారు.

“మన పాఠశాలలో పై తరగతులకు చెందిన విద్యార్థులలో ముప్పై మందిలో కనీసం ఒక్కడికి కూడా హిందూ ధర్మంపై విశ్వాసం అన్నది నిలబడదు. వారి మతంలో ఉన్నవన్నీ కల్పితాలేనని అందులో మంచి అంటూ ఏమీ లేదనే భావన వారిలో ప్రగాఢంగా నాటుకుపోతుంది”

ఇక పాశ్చాత్యీకరణ గురించిన ఈ వాక్యాలను ఆలోచనాశీలురు అందరు తప్పక పరిశోధించాలి. దాదాపుగా ఆధునిక భారతదేశపు సంస్కరణవాదులు అందరు ఈ మాటలతో ఏకీభవిస్తారు.

“మన రైలు మార్గాలు, మన స్టీమ్ బోట్లు, మన తంతి తపాలా వ్యవస్థలు, మన మిలిటరీ ప్రజ్ఞ వగైరాలన్నీ చూసాక ఈ భారత దేశ ప్రజలకు తమ కంటే మన నాగరికత ఎంతో ఉన్నతమైనది అన్న నమ్మకం బాగా బలపడింది. వారి సొంత నాగరికత కంటే కూడా మన పాశ్చాత్య నాగరికతలోనే వస్తు సంపద ఐశ్వర్యం మెండుగా లభిస్తాయని వారికి అవగతమైంది. కొన్ని సందర్భాలలో వారి ఆచార వ్యవహారాలకంటే కూడా మన పాశ్చాత్య ఆచారాలే గొప్పవిగా భావిస్తున్నారు. మనము వారికి ఏది అందిస్తే దాన్ని వారు మహా ప్రసాదం లాగా స్వీకరిస్తున్నారు. ఇంగిలీషు చదువులు చదువుకున్న ప్రతీ ఒక్కరికి ఇటువంటి లాభం ఎదో ఒకటి చేకూరుతూనే ఉంది. స్తబ్దతలో చిక్కుకు పోయిన హిందూ సమాజంలో కొత్త ఆలోచనల తరంగాలు కదిలింపబడ్డాయి. వారి మతానికి మన మతానికి పోలికలు ప్రారంభమయ్యాయి. మార్పు సంస్కరణల శరపరంపర ప్రారంభమయింది. వీటన్నిటి వలన హిందూ ధర్మం మెల్లగా నిర్వీర్యం అయిపోతుంది. ఆ విధంగా భారత దేశాన్ని క్రైస్తవీకరించటానికి మనకు మార్గం సుగమం అవుతోంది”

సంస్కరణాభిలాష మెండుగా ఉన్న భారతీయులు ప్రతి సంస్కరణ కూడా మన మంచికే అని అనుకుంటూ తమ ధర్మ మూలాలకు దూరంగా జరుగుతూ వస్తున్నారు. తాము చేపడుతున్న సంస్కరణలు అన్ని కూడా దాదాపుగా ఇరవయ్యో శతాబ్దపు మునుపు నాటి క్రైస్తవ మిషనరీల playbook మీద ఆధారపడి ఉందన్న సత్యాన్ని గుర్తించే వివేచన కోల్పోయారు.

ఇటువంటిదే మరొక వ్యాఖ్య హెన్రి కే రో అన్న మిషనరీ అమెరికా బోర్డు అఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ వారు 1910లో ప్రచురించిన “Carey and the land of India” అన్న పుస్తకంలో చేసారు.

“కుల వ్యవస్థను ధ్వంసం చేయటంలో రైలు రోడ్డుల వ్యవస్థ ప్రభావాన్ని కొట్టిపారేయలేము. పాశ్చాత్య దేశపు విలువలు ఆలోచనలు ప్రాచ్య దేశపు ప్రజలలో మెల్లగా చలామణిలోకి వస్తున్నాయి. ఈ రైలు రవాణా వ్యవస్థ పాశ్చత్య ప్రపంచానికి ప్రాచ్యానికి మధ్యన ఒక వారధి లాగా ఉపయోగపడుతున్నది.

మిషనరీల విజయ యాత్రకు అడ్డుగా చాలా అవరోధాలు ఉన్నాయి. బ్రిటిషు ప్రభుత్వానికి ప్రజలలో అక్కడి పాలకులలో ఉన్న అసమ్మతిని ఇతర ప్రత్యర్థులను నిర్ములించినా కూడా ఈ అవరోధాలు అలానే ఉన్నాయి. కులం అన్నది మనకు నిరంతరం ఒక ఆటంకంగా ఉంది.

ఆంగ్లేయ ప్రభుత్వపు విధానాల వల్ల భారత దేశపు ప్రజల పాతకాలపు వ్యవస్థలకు చాలా వరకు బీటలు వారుతున్నాయి. ఇంగిలీషు చదువులు , బ్రిటిషు ప్రభుత్వమూ , రైలు రవాణా వ్యవస్థ మూడూ కలిసి కుల వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాయి. కుల వ్యవస్థ కునారిల్లితే దానితో పాటు హిందూ ధర్మం కూడా కుప్పకూలాల్సిందే”

ఆధునిక హిందూ సంస్కర్తలకు ఈ విషయం అర్థమైనట్టుగా అనిపించదు. మిషనరీ సాహిత్యం ఆసాంతం పరిశీలిస్తే ఇటువంటి వ్యాఖ్యలు చాలానే కనిపిస్తాయి. కుల నిర్మూలన అన్నది క్రైస్తవ మిషనరీల వంటి హిందూ వ్యతిరేక శక్తులకు మరియు భారత దేశ సార్వభౌమత్వనికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులకు ఎప్పటి నుంచో ప్రధాన అజెండాగా ఉన్నది. ఐతే కులం లేని హిందూ మత స్వరూపం గురించిన సరైన అవగాహన మరియు చర్చ లేకుండా హిందువులు తమను తామే అడ్డగోలుగా సంస్కరించుకోవటం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. పరిణామాల గురించిన అవగాహన లేని సంస్కరణాభిలాష వలన హిందువుల మతాంతరీకరణకు మార్గం సుగమం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది హిందువులు గుర్తుంచుకోవలసిన విషయం.

రెవరెండ్ స్టారో వంటి మిషనరీల పుస్తకంలో బ్రహ్మ సమాజం వంటి సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా క్రైస్తవీకరణకు ఉపకరిస్తాయి అన్న విషయం గురించిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. మన సంస్కర్తలు నెత్తిన ఎత్తుకునే హేతువాదం గురించి కూడా కొన్ని ఘాటైన చురకలు ఉన్నాయి ఈ పుస్తకంలో.

“నిజానికి హిందూ ధర్మం అన్నది అంత అజేయమైన శక్తి ఏమీ కాదు. అంత దుర్భేద్యమైనది కూడా కాదు. ఆ మతం తాలూకా ప్రతీ అంకాన్ని కూడా శ్రద్ధగా అధ్యయనం చేసి వారి విశ్వాసాల డొల్లతనాన్ని మనం తిప్పికొట్టగలము. ఆ మతంలోని కొన్ని ఉన్నతమైన ఆచారాలు ఇప్పటికే కనుమరుగయిపోయాయి. విగ్రహారాధన నుంచి వేదాంతం వైపుకు వారి దృష్టి మరలుతుంది. వేదాంతం నుంచి హేతువాదం వైపుకు వెళతారు. హేతువాదం నుంచి ఒక రకమైన సమైక్యవాదంలోకి (Unitarianism) వెళతారు. ఆ సమైక్యవాదం నుంచి త్రిమూర్తుల క్రైస్తవ వాదంలోకి (Trinitarian Christianity) వెళతారు. ఈ విధంగా రక రకాల సంస్కరణ మార్గాల ద్వారా విభిన్న వేగాలతో జనులంతా కూడా వారి పాత మతాన్ని మెల్లగా వదులుకొని చివరాఖరికి క్రైస్తవమనే స్వర్గానికి చేరవలసిన వారే”

ఆధునిక హిందూ సంస్కర్తలు అందరిలోనూ ఒక విషయంలో ఐక్యత ఉంది. వీరందిరికీ ఆచార వ్యవహారాలంటే ఒక రకమైన రోత మరియు ఏవగింపు. కోర్టులు చేసే చట్టాల మీద న్యాయాల మీద ఉన్న విశ్వాసం వీరికి ధార్మిక ఆచారాలు కట్టుబాట్ల మీద లేదు. సాధారణ హిందువుల దైనందిన జీవితాలలో ఆచారాలకు సంప్రదాయాలకు ఉన్న ప్రాముఖ్యత మెల్లగా కనుమరుగవుతోంది. బహుశా ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్టే అనుకోవాలి. అయితే అప్పటి కాలపు మిషనరీలు ఆచార వ్యవహారాల ప్రాధాన్యాన్ని బాగానే అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు ఈ వాక్యాన్ని పరిశీలించండి.

“హిందూ సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ అన్నది ఆ వ్యక్తికి కులం నిర్దేశించిన సాధారణ సామజిక జీవనం తాలూకా కట్టుబాట్లలో సునాయాసంగా కలిసిపోతుంది. హిందూ సమాజంలోని కులాచారాలు సాంఘిక కట్టుబాట్లు మరియు లోకాచారాల సమాహారానికి నేటికాలపు కోర్టులు చేసే చట్టాలకు న్యాయాలకు ఉన్నంత శక్తి ఉన్నది. వాటిని అతిక్రమించటానికి ఎవరూ సాహసించరు. ఫలానా పని చేయాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఇతరులైతే “ఇది సరైనదేనా?” “ఇది సౌకర్యవంతమైనదేనా?” “ఇది సహేతుకమైనదేనా?” అని ఆలోచిస్తారు అయితే భారతీయ సమాజంలోని వ్యక్తులు “మన ఆచారాలు కట్టుబాట్ల ప్రకారం ఇది సరైనదేనా” అనే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతారు అంతే”

హర్లాన్ పేజ్ బీచ్ అన్న మరొక అమెరికన్ మిషనరీ రాసిన “India and Christian Opportunity” అన్న పుస్తకంలోని ఈ వాక్యాలు పరిశీలించండి. ఇది 1905 ప్రచురణ. స్టూడెంట్ వాలంటీర్ మూవ్మెంట్ ఫర్ ఫారిన్ మిషన్స్ వారి ప్రచురణ. వలస పాలకులు వారి మతాంతరీకరణ ప్రణాళికకు అనుకూలమైన చట్టాలు ఎలా తయారు చేసారు అన్న దానికి ఇదొక తార్కాణం.

“భారత దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అన్నది ప్రబలంగా వ్యాప్తి చెందింది. మూడు నాలుగు తరాల వారు కలిసికట్టుగా ఒక చూరు కింద ఉంటారు ఈ వ్యవస్థలో. ఆ కుటుంబ పరిమితులు సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా. వారంతా కలిసి ఉండటమే కాదు ఆస్తి వ్యవహారాలలో కూడా వారికి ఉమ్మడి ఆస్తులే ఉంటాయి. సొంత ఆస్తులు వ్యక్తి హక్కులు అంటూ ఏమీ ఉండవు. ఈ విధంగా భారత దేశంలో ఒక రకమైన పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూసుకుని ఉన్నది. ఈ వ్యవస్థలో వ్యక్తి పరిధి తక్కువగా ఉంటూ కుటుంబం యొక్క పరిధి విస్తృతంగా ఉంటుంది. పాశ్చాత్య సమాజపు విలువల చొచ్చుకోవటం వలన ఇంగిలీషు చదువులు చదువుకున్న వారిలో మెల్లగా ఒక కదలిక మొదలైంది. ఈ మధ్యనే మద్రాసు శాసన సభలో “గెయిన్స్ అఫ్ లెర్నింగ్” అన్న చట్టం చేసారు. ఇది ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పై మేము ఎక్కువెట్టిన మొదటి అస్త్రం. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి తన సొంత చదువు ద్వారా సంక్రమించిన ఆస్తిపై సర్వ స్వామ్య హక్కులు ఆ వ్యక్తికే చెందుతాయి కానీ అతని ఉమ్మడి కుటుంబానికి కాదు. ఈ విధంగా ఈ చట్టం ద్వారా మొట్టమొదటి సారి ఒక వ్యక్తి తన కుటుంబ హక్కులతో సంబంధం లేకుండా తనకంటూ సొంతమైన హక్కులను పొందవచ్చు. ఈ బిల్లు విషయమై సామాన్య ప్రజలలో చాలానే అసమ్మతి ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబపు హక్కులతో పాత కాలపు కుటుంబ అధికారాల ఆచారాలతో విలువలతో వ్యక్తిగత హక్కుల ఈ కొత్త వ్యవస్థకు సామ్యం కుదరదు”

ఈ వ్యాసం మొదటిలో ప్రస్తావించిన ఆధునికతకు మునుపు కలం నాటి భారతీయ సమాజం గురించిన ఎమ్ ఎన్ శ్రీనివాస వ్యాఖ్యలతో ఈ మిషనరీ వాక్యాలను పోల్చుకోవచ్చు. ఇప్పటికి కూడా ఎందరో ధర్మ గురువులు ఇతరత్రా హిందూ మేధావులు భారతీయ (ఉమ్మడి) కుటుంబ ప్రాశస్త్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఆ కుటుంబ విలువలకు ఈ వ్యక్తి హక్కుల ఆధునిక కాలపు విలువలకు గల వైరుధ్యాలను ఎత్తిచూపుతునే ఉన్నారు.

నిజానికి వలస పాలకులు హిందూ సమాజం విషయమై చేసిన చట్ట సంస్కరణల గురించి జరగాల్సినంతగా విశ్లేషణ జరగలేదనే చెప్పాలి. అసలు ఈ సంస్కరణల మంచి చెడు పక్కనపెడితే అసలు బ్రిటీషు పాలకులు ఈ సంస్కరణలు ఎందుకు చేయాలని తాపత్రయపడ్డారు అన్న విషయమై సమాలోచన జరగవలసి ఉన్నది. మన పాఠ్య పుస్తకాలన్నిటిలో అన్ని సంస్కరణలు మన మంచికే జరిగాయి అన్నట్టుగా చెప్పటం కద్దు. ఈ Hindu Gains of Learning Act, 1930 చట్టాన్నే తీసుకుంటే ఇటువంటి చట్టాల ద్వారా భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా వరకు ధ్వంసం అయ్యింది అన్నది చారిత్రక సత్యం.

హిందువులను గొర్రెల మందలతో పావురాలతో పోల్చిన విషయం పక్కన పెడితే ఈ క్రింది మిషనరీ వాక్యాలను ఖచ్చితంగా పరిశీలించవలసిందే. ఇందులో ఎంతో కొంత సత్యం లేకపోలేదు. కులం అనగానే అణచివేత పీడితులు వంచితులు అని అంటారు మన మేధావులు. వారికంటే ఈ మిషనరీలే కులాన్ని కొద్దో గొప్పో కొంత కూలంకషంగా సమగ్రంగా అర్థం చేసుకున్నారేమో అని అనిపిస్తుంది.

“భారతీయ సమాజంలో కులం అన్నది ఒక వారసత్వ సంస్థ. ఇది కేవలం సాంఘికమైనది కాదు. ఇందులో మతపరమైన అంశాలు, శ్రమ విభజనకు సంబందించిన అంశాలు, జాతి జవసత్వాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి.

కుల ప్రత్యేకతలకు సంబందించిన అతి ముఖ్యమైన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఆహార నియమాలు ఆహార తయారీ పద్ధతులు, వివాహానికి సంబందించిన నియమాలు, వృత్తుల వారసత్వము, సొంత కులం అంటే చెప్పలేనంత అభిమానము మరియు చొరవ వంటివి.

వీటన్నిటి ప్రభావం వలన గొర్రెల మందలో గొర్రెల వలె పావురాల గుంపులో పావురం వలె తన కులం ఎటుపోతే తాను కూడా ఆటే వెళతాడు కుల సమాజంలోని హిందువు. బహుశా భారతీయ సమాజంలో కులాల ఆచారాలలో స్థానిక వైవిధ్యాలకు ఇది కూడా ఒక కారణం కావచ్చును. ఒకటే కులానికి చెందిన వ్యక్తులలో కూడా ఆచారాల విషయంలో రకరకాల వైవిధ్యాలు ఉండటం అన్నది సహజమే. ఒకానొక సమయంలో సందర్భంలో తాను ఒప్పుకొని చేసిన పనిని మరొక సందర్భంలో చేయటానికి అతను విముఖత వ్యక్తం చేయచ్చు. ఒక సందర్భంలో అతనికి తన కులం వారి అనుమతి లభించి ఉండచ్చు మరొక సందర్భంలో అది లభించి ఉండకపోవచ్చు. గొర్రెల మందలో గొర్రెలు లేదా పావురాల గుంపులో పావురాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగా ప్రవర్తించచ్చు. కులవ్యవస్థలోని వ్యక్తులు కూడా అంతే”

సాధారణ హిందువుకు కులం ద్వారా లభించే సాంఘిక ఆసరా మరియు ఉపాధి భద్రత ధార్మిక విలువలు వగైరాల గురించి మిషనరీలు ఇలా రాశారు.

“కుల వ్యవస్థ వలన భారతీయ సమాజానికి కొన్ని లాభాలు లేకపోలేదు. ఉపాధి హామీ విషయంలోనూ శ్రమ విభజన విషయంలోనూ కులమనే పెద్ద కుటుంబం ఆ వ్యక్తికి ఇచ్చే భరోసా విషయంలోను కష్టాలలో అతనికి కులం అందించే ఆసరా అండ వంటి విషయాలలో కుల వ్యవస్థలో ఉండే లాభాలను మిషనరీలము అయినటువంటి మేము కూడా గుర్తించాము. వాటిని కొట్టిపారేయలేము. నిజానికి కుల కట్టుబాట్లు అనేవి ఒక వ్యక్తికి నైతికత విషయంలో స్వీయ నియంత్రణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించిన నియమాలు వగైరాలు అలవడటంలో కూడా ఉపయోగపడతాయి. అంతేకాక కులం అన్నది బ్రిటీషు ప్రభుత్వానికి పాలనా సౌలభ్యం విషయంలో పోలీసు వ్యవస్థను కట్టుదిట్టం చేయటంలో కూడా ఉపయోగపడింది. ఇంతేకాక ఒక కులం వారు పాండిత్యంలో ఆరితేరేలాగా సౌలభ్యం ఏర్పరిచింది. ఇటువంటిది లేకపోతే ఈ జాతి ఎప్పుడో నామరూపాలు లేకుండా పోయేది. అగ్రకులాల వారిలో వ్యసనాలకు బానిసత్వం పెరగకుండా అధికమైన కట్టుబాట్లు ఏర్పడ్డాయి. కులం వల్ల చాలా మంది హిందువులకు వారి జీవితంలో ఒక విధమైన ఆత్మ సంతృప్తి అన్నది అలవడింది. ఆ వ్యవస్థలో కట్టుబాట్లకు లోబడి ఉండటం ద్వారా ఆ సమాజంలో ఒక రకమైన ఉన్నతమైన నైతిక ప్రమాణాలు నిలబడ్డాయి.

కుల కట్టుబాట్ల విషయంలోని దుర్మార్గాలను కూడా మరీ ఎక్కువ నిరసన లేకుండా భరిస్తూ సర్దుకు పోయే లక్షణం ఈ సమాజం వారికి అలవాటు అయ్యింది. నిజానికి నిరసనలు అగ్రకులాల వారిలోనే ఎక్కువ. కుల కట్టుబాట్లను నిష్కర్షగా కఠినంగా అమలు చేసేవారు నిమ్న కులాలలో బహిష్కృత కులాలలోనే ఎక్కువగా ఉన్నారు “

ఈ మిషనరీలు చెప్పినట్టుగా లాభాలూ నష్టాలు రెండూ ఉండి ఉండాలి కుల వ్యవస్థలో. ఏ లాభమూ లేకపోతే మిషనరీల ప్రకారం నిమ్న కులాలైన వారిలో కూడా ఎందుకు ఇన్ని కఠినమైన నియమాలు ఉండేవి. వారెందుకు వాటిని పాటించారు. వారెందుకు వారి కులాలను వదులుకొని నిరసన వ్యక్తం చేసి తిరుగుబాట్లు చేయలేదు. జ్ఞాన సముపార్జనే ప్రధానంగా ఒక కులం ఏర్పడటానికి కారణాలు వాటి వలన కలిగిన లాభ నష్టాల గురించి కూడా మిషనరీలు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఒక కులానికి ఇది మాత్రమే పనిగా కేటాయించటం వలన మాత్రమే ఇన్ని వందల వేల ఏళ్ళైనా ఇది ఒక సజీవ పరంపరగా మిగిలింది అన్నది కాదనలేని సత్యం. ఇటువంటి వ్యవస్థీకృత విధానం లేని ఎన్నో మతాలూ ఎన్నో పేగన్ (pagan) సంస్కృతులు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి గత కొన్ని శతాబ్దాలలో. ప్రపంచ చరిత్రను పరికించి చూస్తే కాదనలేని సత్యం ఇది. ఇది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన వ్యాఖ్య మాత్రమే కాదు. ఎన్నో చేతి పనిముట్ల కులాలు లోహపు కళాకారుల కులాలు శిల్ప కళాకారుల కులాలు తతిమ్మా విశ్వకర్మ కులాలు మరియు జానపద కళాకారుల పరంపరలు వగైరాలు అన్నీ కూడా ఈ వారసత్వ వ్యవస్థ యొక్క పునాదుల పైనే నిలబడ్డాయి. అయితే ఇదంతా పారిశ్రామిక నాగరికత మరియు వలసవాదం యొక్క ప్రభావం భారత దేశంపై పడనంతవరకే.

మరొక చోట బిషప్ స్పెన్సర్ ఇలా అంటారు. కులం అన్నది ఈ సమాజ సౌధాన్ని కట్టిపడేసే సిమెంటు వంటిదని అంటారాయన.

“విగ్రహారాధన మూఢాచారాలు ఇవన్నీ కూడా ఈ హిందూ సమాజమనే సౌధానికి రాళ్ళు ఇటుకల వంటివి కులం అన్నది ఈ సౌధాన్ని నిలబెట్టే సిమెంటు. ఈ పునాదిని మనం పెకిలించి వేశామంటే విగ్రహారాధన ఆచారాలతో కూడుకున్న ఈ సౌధమంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలుతుంది”

విచిత్రమేమిటంటే అప్పటి ఇప్పటి సంస్కర్తలు కూడా గుడ్డిగా ఈ మిషనరీల వాక్యాలే వల్లె వేశారు. కులం అన్నది హిందూ సమాజ పురోగతికి ప్రధాన అడ్డంకిగా భావించారు. సంస్కర్తల గురించి మిషనరీలు ఇలా అన్నారు.

“భారత దేశానికి చెందిన సంస్కర్తలు అందరు కూడా వారి మధ్యన ఎన్ని వైరుధ్యాలు ఉన్నా సరే కుల నిర్మూలన అన్న ఒక్క విషయంలో మాత్రం ఏకత్రాటిపై నిలబడ్డారు. వారి భౌతిక సామజిక పురోగతికి కులం ప్రధాన అడ్డంకి అని అందరూ నమ్మారు. బొంబాయి నగరానికి చెందిన బాబు నాగర్కర్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఇలా అన్నారు – “హిందూ మతము మరియు సంఘ సంస్కరణల విషయంలో మా మొట్టమొదటి ప్రాధాన్యత కుల నిర్మూలన అన్న అంశానికే. కులం అన్నది ఈ హిందూ సమాజంలో లెక్కలేనన్ని వైరుధ్యాలు విభేదాలను కొని తెచ్చింది. ఈ కులం అన్నది సమాజంలో ఒక స్థబ్దతను తెచ్చింది ఔత్సాహిక వైఖరిని ఎదగనివ్వకుండా చేసింది. ఇది మా సమాజానికి పట్టిన పెద్ద శాపం మా సమాజానికి అపరిమితమైన కీడు చేస్తున్న వ్యవస్థ ఇది. అన్ని విషయాలలోనూ మా దేశం క్షీణించిపోవటానికి ఈ వ్యవస్థనే ప్రధాన కారణం”

అయితే కుల నిర్మూలన విషయంలో మిషనరీలు సంస్కర్తలు ఒక్క త్రాటిపై నిలబడినా కూడా ఆ ప్రక్రియ ముగిసాక ఏమి చెయ్యాలి అన్న విషయం పై మిషనరీల దగ్గర మత మార్పిడి అనే ఒక నిర్దుష్టమైన ప్రణాళిక ఉండనే ఉంది. మరి సంస్కర్తల దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక అన్నది ఏమిటి అన్నది ఎవరికీ తెలియలేదు.

గ్రామీణ భారతం గురించి మిషనరీ సాహిత్యంలో ఇలా ఉంది :

“భారతీయ గ్రామీణ వ్యవస్థ అన్నది చాలా ప్రత్యేకమైనది. ఇది ఎంతో ఆసక్తిగలిగించే కూర్పు. భారత దేశంలోని ప్రతి గ్రామం కూడా వేటికవే స్వతంత్రంగా బయటి ప్రాంతాలతో సాధ్యమైనంత తక్కువగా ఆధారపడుతూ స్వయం ప్రతిపత్తి గల విభాగాలుగా వర్ధిల్లాయి.

నిజానికి భారతీయ సంస్కృతి ఇన్ని వందల వేల ఏళ్ళైనా చెక్కుచెదరకుండా ఉండటానికి ఈ గ్రామీణ సంస్కృతులే ప్రధాన కారణం. ఏ ఊరుకు ఈ ఊరు ఒక స్వతంత్ర రాజ్యం. ఆ ఊరి వారికి అదే ప్రపంచం. ఎవరికి వారికి వారి సొంత గ్రామం లేదా ఊరు అన్నదే వారి స్వేచ్చా స్వాతంత్య్రాలు మరియు సంతోషాలకు నిలయం”

ఇటువంటి గ్రామీణ సంస్కృతి ప్రధానమైన దేశం త్వరిత గతిన అత్యంత వేగంగా పారిశ్రామీకరణకు నగరీకరణకు గురవుతోంది. ఈ ప్రక్రియ యొక్క ప్రభావం ఆ ప్రజలపై ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయంపై మన మేధావి వర్గం ఎంతవరకు ఆలోచన చేసింది అన్నది ప్రశ్నార్ధకం.

కులానికి మతానికి ఉన్న లంకెను గురించి ఒక మిషనరీ రాసిన ఈ వ్యాఖ్యను చూద్దాము:

“కులం అన్నది ప్రతి అణువణువులోను హిందూ మతంతో కలగలిసిపోయి ఉంది. అవి రెండూ కూడా ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా అల్లుకు పోయాయి. భారతీయ సమాజమనే వస్త్రానికి నిలువు పోగు హిందూ మతమైతే అడ్డం పోగు కుల వ్యవస్థ. కుల ఆచారాలు కట్టుబాట్లలో మత ధర్మాలు మరియు విలువలు అన్నవి అలా అల్లుకుపోతాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సొంత అస్తిత్వం అంటూ లేదు. అది ఆ వ్యక్తి యొక్క కుల సమూహ అస్తిత్వంలో కలిసిపోతుంది. సమాజంలోని ఇతర వ్యక్తుల నైతిక తీర్పులకు తలొగ్గి ఉంటుంది. ఈ విధంగా ఆచార వ్యవహారాలు అనేవి ఇంచుమించుగా దేవతా స్థానాన్ని పొందుతాయి భారతీయ సమాజంలో. మరే ఇతర సమాజంలో కూడానూ సామజిక జీవనం అన్నది మతంతో ఈ విధంగా పెనవేసుకుపోలేదు”

ఈ నిలువు పోగు అడ్డం పోగు అన్న పోలికపై ఖచ్చితంగా దృష్టి సారించాలి కులాన్ని అర్థం చేసుకోగోరే వారు. బహుశా మతంతో అంతగా కలిసిపోయినందునే ఇప్పటికి కూడా కులం అన్నది సజీవంగా ఉంది భారతీయ సమాజంలో. కులం విషయమై ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని సంస్కరణలు జరిగినా. మతాన్ని వదులుకోలేని హిందువులు ఆ మతం తాలూకా ఆచరణకు సంబంధించిన విషయంలో ఆయువుపట్టైనటువంటిదైన కులాన్ని కూడా వదులుకోలేకపోతున్నారు.

అప్పటి కాలపు సంస్కర్తల గురించి మిషనరీలు ఇలా అన్నారు. కేశబ్ చంద్ర సేన్ వంటి సంస్కర్తలు తీవ్ర క్రైస్తవ ప్రభావానికి లోనవడం గురించి చరిత్ర పాఠాలలో ప్రస్తావన ఉండనే ఉన్నది.

“హిందూ దేశంలో కొత్తగా పుట్టుకొచ్చిన రక రకాల సమాజాలు సంస్కరణోద్యమాలు అన్ని కూడా అప్పటి కాలంలోని భారతీయ మత భావాలకు మరియు క్రైస్తవ మతప్రచార సంస్థలకు మత సత్యాలకు మధ్య జరిగిన రాపిడి నుంచి పుట్టుకొని వచ్చినవే. అందుకనే ఆర్య సమాజం వంటి వారు కొందరు తిరిగి వేదాలలోకి పోదాం అన్న వాదన తెచ్చారు. ఈ సంస్కర్తలు అందరు కూడా ఎన్నో క్రైస్తవ ఆదర్శాల ప్రభావానికి లోనైనవారే. ఈ సంస్కర్తలు తెచ్చిన కొత్త మతాలన్నీ కూడా హిందూ మతం నుంచి క్రైస్తవం పుచ్చుకోవడం అనే మత మార్పిడి ప్రయాణంలో మార్గమధ్యంలో సేద తీరే వసతి గృహాల వంటివి. ఇవన్నీ కూడా దాదాపుగా క్రైస్తవ మతం వైపునకు తిరిగి ఉన్న ఉద్యమాలే. ఏదో ఒక రోజు ఈ సంస్కర్తలు వారి అనుయాయులు అందరు క్రైస్తవ మత తీర్థము పుచ్చుకోక మానరు”

మిషనరీలు వారి దృష్టిలో అగ్ర కులాలుగా గుర్తింపబడిన వారి విషయంలో మరియు నిమ్న కులాలుగా గుర్తింపబడిన వారి విషయంలో మతమార్పిడి గురించి విభిన్నమైన ప్రణాళికలు చేశారు. కేవలం నిమ్న కులాల వారి మతమార్పిడితో వారెప్పుడు కూడా సంతృప్తి చెందలేదు. భారతీయ సమాజంలో నుంచి హిందూ మతాన్ని పారద్రోలాలంటే నిమ్నకులాలు నివసించే outpost లను మాత్రమే కాదు అంటే ఊరికి చివర ఉండే సైనిక స్థావరాల వంటి వాటిని మాత్రమే కాదు నగరం నడిబొడ్డులో ఉండే అగ్రకులాల citadel లను అంటే కంచుకోటలను దుర్గాలను కూడా ముట్టడి చేయాల్సిందే అని తీర్మానించారు అప్పటి మిషనరీలు.

ఒక మిషనరీ ఈ విషయమై ఏమన్నాడో చూద్దాం.

“ట్రిచినోపోలీకి (తిరుచ్చి) చెందిన ఆంగ్లికన్ కాలేజ్ తాలూకా ప్రిన్సిపాల్ షార్రోక్ ఇలా అన్నాడు. అగ్రకులాల మత మార్పిడి విషయంలో మనము మన వైఖరి మార్చుకోవాలి. ప్రస్తుతానికి మతం మారటానికి ఉవ్విళ్లూరుతున్న నిమ్న కులాల వారి పని పడతాం. తర్వాత అగ్ర కులాల వారి సంగతి చూద్దాం. నిమ్నకులాలనే outpost ను స్వాధీనపరుచుకోవటం వలన మనము సాధించేది ఏమి లేదు. అగ్రకులాల citadel లను (అంటే దుర్గాలను) ముట్టడి చేయవలసిందే. అయితే దానికి ఇది సరైన సమయం కాదు. ఆ కులాల వారిలో మత మార్పిడి జరగాలంటే మనకు స్కూళ్ళ వ్యవస్థే ప్రధాన ఆయుధం. స్కూళ్ళ ద్వారానే ఆ అగ్ర కులాల సభ్యులు మన చేతికి చిక్కింది. స్కూళ్ళ ద్వారానే వారు మన మిషనరీల బోధనలకు తలొగ్గే అవకాశం ఉంది.

ప్రతీ ప్రాణికి సువార్త వినిపించండి. ఎవరిని వదలద్దు. పై కులాలను క్రింది కులాలను అందరిని మన శిష్యులుగా చేద్దాము. సంయమనం కోల్పోకూడదు నిరాశ చెందకూడదు. అవరోధాలను చూసి చేతులెత్తేయకండి. దారిలో వచ్చేవారందరిని ముట్టడి చేయండి. ఔట్పోస్ట్ ను వశం చేసుకోండి అంతటితో ఊరుకోకండి కోటలో పాగా వేయండి ఆ దుర్గాన్ని కూడా స్వాధీన పరుచుకోండి. ఈ మహా పర్వతాలను రెండు దిక్కుల నుంచి ముట్టడి చేయండి (రెండు దిక్కులు అంటే అగ్ర కులాలు నిమ్న కులాలు అని ఈ మిషనరీ భావం). రెండు దిక్కుల నుంచి ముట్టడి చేసాక ప్రభువు కృప కటాక్షం కోసం వేసి చుడండి”

Catholic Missions In Southern India To 1865” అన్న మరొక మిషనరీ పుస్తకంలో రెవరెండ్ విలియం స్ట్రిక్లాండ్ మరియు టి.డబ్ల్యు.ఎం.మార్షల్ రాసిన ఈ వాక్యాలు చూస్తే మిషనరీలకు కులం గురించిన ఎంత స్పష్టమైన అవగాహన ఉండేది అన్నది స్పష్టమవుతుంది.

“భారతీయ సమాజం మొత్తం కూడా రకరకాల కులాలుగా జాతులుగా వర్గీకరింపబడింది. రకరకాల పేర్లతో ఈ విభాగాలు దేశం అంతటా విస్తృతమై ఉన్నాయి. కులం అన్నది ప్రధానంగా జన్మ ఆధారంగా ఆపాదింపబడుతుంది. హిందూ సామజిక జీవనానికి కులం అనేదే ప్రధానం. విదేశీ మూకల నుంచి ఇన్ని దండయాత్రలు జరిగినా కూడా ఈ సంస్కృతి నాశనం కాకుండా మూలాలు చెక్కుచెదరకుండా నిలబడటానికి కారణం ఈ కుల వ్యవస్థే.ఇటువంటి వ్యవస్థ లేకపోతే ఇతర సంస్కృతుల వలె హిందూ సంస్కృతి కూడా కాలగర్భంలో కలిసిపోయేది. ముస్లిములు ఈ దేశాన్ని లోబరుచుకోవటానికి వందల ఏళ్లుగా ప్రయత్నించినా కూడా విఫలం చెందటానికి ప్రధాన కారణం ఈ కుల వ్యవస్థే. ముస్లిములు ఈ దేశ సంపదను ఎంతగా కొల్లగొట్టినా కూడా దోచుకున్నా కూడా మతాంతరీకరణ చేయటంలో విఫలమయ్యారు. ముస్లిములను చాలా వరకు హిందువులు తమలో కలుపుకునే ప్రయత్నం చేయలేదు. వారితో వివాహ సంబంధాలు సామజిక సంబంధాలు వగైరాల విషయంలో ఎంతో నియంత్రణ పాటించారు.

ఇది మీకు కొంత వింతగా అనిపించవచ్చును. కానీ దేశాన్ని ఇన్ని రకాలుగా జాతులుగా కులాలుగా విభజించినందునే ఈ దేశంలో నైతికత అన్నది ఇన్నేళ్ళు నిలబడింది. వీరి ఆచార వ్యవహారాలు కూడా ఇన్నేళ్ళుగా మనగలగడానికి కారణం ఇదే”

ఇక్కడి ఈ మిషనరీల వాదం అంతా కూడా మన సంస్కర్తల వాదనలను భిన్నంగా అనిపిస్తుంది. ఇటువంటివే మరికొన్ని వాక్యాలు పరిశీలిద్దాం.

“నాకు దేవుడంటే భయం లేదు నేను ఏ మనిషిని లెక్కచేయను అని విచ్చలవిడిగా పెట్రేగి పోయేవాడు కూడా తన సొంత కుల సమూహం ముందు వణికిపోతాడు. ఎక్కడ తనను తన కులం నుంచి వెలివేస్తారేమో అన్న భయం అతనిని వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారి తన కులం తనను వెలి వేస్తే తన మిత్ర బృందాన్ని అంతా కూడా తాను కోల్పోవలసి వస్తుంది తాను ఆప్తులు అని అనుకున్న వారంతా కూడా తనను వేలి వేస్తారు తాను దేశ దిమ్మరి లాగా ఒంతరివానిలాగా తయారవుతానేమో అన్న భయం తనను నిత్యం వెంటాడుతూ ఉంటుంది. ఈ వ్యవస్థను ముస్లిములు పెకిలించి వేయలేకపోయారు బ్రిటిషు వారు రాజకీయాలలో మునిగిపోయి ఈ వ్యవస్థను నిర్మూలించే విషయం పై శ్రద్ధ చూపలేదు” అని వాపోయాడొక మిషనరీ.

మరొక మిషనరీ కులాన్ని నిర్మూలించాల్సిందే కానీ ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉందాం సంయమనం పాటిద్దాం అని ఇలా అన్నాడు. ఈ మాత్రం సంయమనం కూడా మన హిందూ సంస్కర్తలలో కానరావట్లేదు నేటి కాలంలో.

“నిజమే ఈ దేశంలో ఈ కుల ప్రత్యేకతల వ్యవస్థ మరీ తారాస్థాయికి చేరుకుంది. కానీ దీనిని ఏ ఆలోచన లేకుండా ఒక్క వేటుతో నిర్మూలించరాదు. వేల ఏళ్ళ సంప్రదాయాల నుంచి ఒక్క సరిగా ఈ ప్రజానీకాన్ని దూరం చేస్తే నిరసన భావంతో ప్రజా విప్లవం జరిగే అవకాశం లేకపోలేదు. ఇటువంటిదే జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది”.

ఇదే పుస్తకంలో మరికొన్ని వాక్యాలు ఒక మిషనరీ సమావేశం నుంచి:

“.. కులం అన్నది మతాంతరీకరణ జరగకుండా హిందూ సమాజాన్ని కాపాడుతున్న అత్యంత శక్తివంతమైన కాపు మరియు రక్షణ అన్నది జగద్విదితమైన సత్యము. ఈ దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి ప్రధానమైన అడ్డంకి ఈ కులమే.

ఇప్పటికైతే ఒక విషయం మనం ఒప్పుకొనవల్సిందే. ఈ దేశంలో రెండు మూడు ప్రధాన మతాలు ఉండే విషయంలో ఇక్కడికి ప్రజలకు వచ్చిన సమస్య ఏది లేదు. అయితే వారి కుటుంబ వారసత్వాలకు విధేయతలకు ఈ మతాలు ఏ విధమైన ఆటంకం కలిగించకూడదు. వారి కుల మర్యాదలకు భంగం వాటిల్ల రాదు. ఈ విధంగా ఉంటే వారు మన మత బోధనలతో ఏకీభవించనప్పటికీ మన ప్రచారానికి అడ్డురారు. మనతో సహజీవనం చేయటానికి అడ్డు చెప్పరు”

హిందువులలో మతాంతరీకరణ అన్నది నియంత్రించడంలో కులం పాత్ర చాలా ప్రధానమైనది అన్న మాట వేరే ఎవరన్నా అంటే అది బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం అని కొట్టిపడేస్తారు మన విమర్శకులు. అయితే మరి ఇక్కడ ఈ మాటలు అంటున్నది మిషనరీలు వీరిలో కూడా బ్రాహ్మణ భావజాలం ఉన్నట్టేనా? ఉదాహరణకు ఎడిన్బర్గ్ రిపోర్ట్ లో క్రైస్తవ ప్రచారానికి ప్రధాన అవరోధాలు అన్న సెక్షన్ లో ఉన్న ఈ వాక్యాలు చూడండి.

“కుల వ్యవస్థ యొక్క ఉనికి అన్నది క్రైస్తవీకరణకు ప్రధాన ఆటంకం”

“హిందూ భారతంలో కులం తాలూకా నిరంకుశమైన కట్టుబాట్లు మరియు బాధ్యతలు అనేవి క్రైస్తవ మత వ్యాప్తి చేయాలని సంకల్పించిన మిషనరీలకు ప్రధాన అడ్డంకులు “

రెవరెండ్ విలియం స్ట్రిక్లాండ్ వాక్యాలు దాదాపుగా అప్పటి కాలపు మిషనరీ సాహిత్యంలో కులం గురించి మనకు కనపడే ఇతర వాఖ్యాలను పోలి ఉంది.

“ప్రతీ హిందువు కూడానూ అంటే అగ్ర కులాల వారి నుంచి నిమ్న కులాలూ అంత్యజుల వరకూ అందరూ వారి కులానికి కట్టుబడి ఉండటానికి కారణం ఏమిటి. కులం అన్నది ప్రతీ వ్యక్తిని ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించే ఒక ఆసరా ఒక నమ్మకం. అదే వారికి దేశం. అదే వారికీ వంశం. అదే వారికి ట్రేడ్ యూనియన్. తన కులాన్ని దాటి బయటకు వెళితే సమాజంలోని ఇతర వ్యక్తులు అందరూ అతనికి అపరిచితులే. తన సొంత కులంలో మాత్రమే వ్యక్తికి సానుభూతి, రక్షణ, సోదరభావం వంటివి దొరుకుతాయి. అందుకే నడిసముద్రంలో ఓడను నావికుడు పట్టుకున్నట్టుగా యుద్ధంలో తన పటాలంతోనే వెన్నంటి ఉంటూ పోరాడే సైనికుడి లాగా కులాన్ని వదలకుండా పట్టుకొనే వ్రేలాడతారు హిందువులు”

పదహారవ శతాబ్దపు ఐరోపా సంస్కర్తలు మరియు పందొమ్మిదవ శతాబ్దపు హిందూ సంస్కర్తల ఆలోచనలో సామ్యాన్ని గుర్తిస్తూ మిషనరీలు చేసిన వ్యాఖ్యలు కొన్ని. ఆర్య సమాజపు వ్యవస్థాపకుడు దయానంద సరస్వతికి క్రైస్తవ సమాజపు సంస్కర్త లూథర్‌కు ఉన్న పోలికలను కూడా ప్రస్తావించారు కొందరు సంస్కర్తలు. హిందూ మత సంస్కర్తల ఆలోచనలు అంతా కూడా కాథలిక్ క్రైస్తవ సమాజాన్ని సంస్కరించ తలపెట్టిన ప్రొటెస్టెంటు సంస్కర్తల భావజాలాన్ని పోలి ఉండడటం గురించి ప్రస్తావించారు అప్పటి మిషనరీలు.

“క్రైస్తవ సమాజంలో చర్చి ఆధిపత్యం నుంచి లూథర్ విముక్తుడైనట్టుగా పండిట్ దయానంద సరస్వతి పూర్తిగా బ్రాహ్మణవాదపు ఆధిపత్యం నుంచి బయటపడ్డాడు. లూథర్ చర్చి అధికారాన్ని ప్రశ్నించాడు. ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ బోధనల లోకి తిరిగి వెళదామని ప్రతిపాదించాడు. దయానంద సరస్వతి బ్రాహ్మణీకం అనే చర్చి నుంచి విముక్తి కోరాడు. స్మృతుల అధికారాన్ని ప్రశ్నించాడు. తిరిగి వేద మూలాల లోకి వెళ్లాలని ప్రతిపాదించాడు. లూథర్ బ్యాక్ టు బైబిల్ అంటే దయానంద సరస్వతి బ్యాక్ టూ వేదాస్ అని అన్నాడు”

ఈ వాక్యాలు India, One Hundred Years After అన్న పుస్తకంలో సంస్కర్తల భావజాలాల గురించి. హిందూ సంస్కరణ వాదం ద్వారా చివరాఖరికి బలపడేది క్రైస్తవమే అని అభిప్రాయపడ్డారు అప్పటి మిషనరీలు.

హిందూ సమాజాన్ని విచ్చిన్నం చేసే విషయంలో మనకు సానుకూల సంకేతాలు హిందూ సంస్కరణ ఉద్యమాలలో లభిస్తున్నాయి. బ్రాహ్మణ భావజాలపు మతంలో ఆర్య సమాజం బ్రహ్మ సమాజం వంటి కొత్త ఉద్యమాలలో వందల వేల మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు. హిందూ సమాజంలో ఆలోచనాశీలురు సున్నిత మనస్కులు మెల్లగా బ్రాహ్మణ ధర్మాన్ని ప్రశ్నిస్తున్నారు. వారికి వారి సొంత ఆచారాలు అన్ని కూడా మూఢాచారాల లాగా అనిపిస్తున్నాయి. వారి సొంత మతం నాసిరకమైందిగా అనిపిస్తోంది. ఈ సంస్కరణల ప్రభావానికి లోనైన వారు తిరిగి వారి మత మూలాల శోధనలోకి వెళతారా లేక క్రైస్తవం వైపును మళ్ళుతారా అన్నది అప్రస్తుతం. ఇప్పటికే బ్రాహ్మణులలో చాలా మందికి వారి మతం పై విశ్వాసం సన్నగిల్లింది. వారు క్రైస్తవాన్ని ప్రత్యక్షంగా ఒప్పుకోకపోయినా కూడా యేసు క్రీస్తు బోధనలు ఈ సమాజానికి ఉపయోగకరమైనవే అని విశ్వసిస్తున్నారు. వీరు యేసు క్రీస్తును ఒక గొప్ప పవిత్ర మత గురువుగా మత పెద్దగా చూడటానికి వెనుకాడరు. మనకు కావలసినది అదే”

ప్రిన్స్టన్లో స్టూడెంట్స్ లెక్చరర్ ఆన్ మిషన్స్ గా పని చేసిన రెవరెండ్ జేమ్స్ ఎస్ డెన్నిస్ రాసిన “Christian Missions And Social Progress A Sociological Study Of Foreign Missions Vol I” అన్న పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఈ డెన్నిస్ కూడా అమెరికాకు చెందిన ప్రెస్బిటేరియన్ మిషన్లకు పని చేసిన వ్యక్తి. ఈయన కూడా హిందూ మత విశ్వసాలకు కులానికి ఉన్న లంకెను గురించి ప్రస్తావించారు.

“హిందువుల ఆధ్యాత్మిక జీవనంలోని అంతరాంతరాల లోనికి కులం అన్నది చొచ్చుకుని పోయి ఉన్నది. అంతేకాక బాహ్యప్రపంచపు ఆచార వ్యవహారాలలో కూడా కులం అన్నది విడదీయలేనంతగా పెనవేసుకుపోయి ఉన్నది. దైనందిన జీవితంలో అత్యంత సామాన్యమైన విషయాల నుంచి అత్యంత గాఢమైన ప్రధానమైన ధార్మిక విషయాల వరకు కుల వ్యవస్థ ప్రభావానికి లోనుకానిది అంటూ ఏది లేదు హిందూ సమాజంలో”

రెవరెండ్ డెన్నిస్ మోనియర్ విల్లియమ్స్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇలా అంటారు.

“ఐరోపా వాసులమైన మనకు భారతీయ సమాజపు ప్రజల కులాభిమానాలూ వారు కులం కట్టుబాట్లను దైవ శాసనంగా భావించే తీరు ఒక పట్టాన అర్థం కావు. సాధారణ హిందువు తన కుల ధర్మాన్నే తన దైవంగా భావిస్తాడు ఏ కుల కట్టుబాట్లను మనం మత మార్పిడికి అడ్డంకిగా భావిస్తామో అతను ఆ కట్టుబాట్లనే తన ధర్మానికి సంబంధించిన పరమోత్కృష్ట సారంగా భావిస్తాడు. ఆ కట్టుబాట్లే అతని జీవితాన్ని అతని నడతను ప్రభావితం చేస్తాయి”

1906లో ప్రచురితమైన The Challenge to Christian Missions: Missionary Questions and the Modern Mind, అన్న పుస్తకంలో రాబర్ట్. ఈ. వెల్ష్ అన్న ప్రెస్బిటేరియన్ మినిష్టర్ రాసిన పుస్తకంలోని ఈ వ్యాఖ్యను పరిశీలించండి.

“మన రైలు రవాణా వ్యవస్థ, వస్తు వాణిజ్యము మరియు మన పాశ్చాత్య నాగరికత తాలూకా విలువలు ఇతరత్రా సామాగ్రి అంతా కూడాను ఏదో ఒక రోజు ఈ కుల కట్టుబాట్ల వ్యవస్థను వారి ఆచారాలను వారి అమాయకపు మూఢ విశ్వాసాలను పూర్తిగా పెకిలించి వేస్తాయి”

వెల్ష్ ఈ పుస్తకంలో ఇంగిలీషు స్కూళ్ళలో చదువుల గురించి కూడా ఇలా రాశారు.

“మన వస్తు వాణిజ్య వ్యవస్థ మన నౌకా దళాలు వగైరాల సహాయంతో సాలెవాడు నాడె వాడుతూ జాలం నేసినట్టుగా మన వర్తకులు వ్యాపారస్తులు అందరు కూడా ఈ భారతీయ సమాజంలోని అంతరాంతరాలలోకి చొచ్చుకుని పోయి వారిని మనం నేసే జాలంలో చిక్కుకునేలా చేస్తారు. మన స్కూళ్లలో మన పుస్తకాలలో మన చెప్పే సైన్సు బోధనల వలన వారి మూఢనమ్మకాలు మత విశ్వాసాల పునాదులు కదులుతాయి. వారిలోని ఆలోచనాశీలురు అందరును కూడా మన కళాశాలలలో మన న్యాయ విద్యాలయాలలో చదువుకుంటున్నారు. దాదాపుగా లక్ష మంది దాకా ఇలా విదేశీయుల పాఠాలు వింటూ పెరుగుతున్నారు. వీరు తర్వాత విద్యాలయాల నుంచి జనజీవన స్రవంతిలోకి వెళ్ళేసరికి వీరి పూర్వపు మత విశ్వాసాల పునాదులు పూర్తిగా కమిలిపోయిన స్థితిలో ఉంటాయి. భారత దేశపు వలసపాలకులు ఈ దేశపు యువతకు ప్రభుత్వ ఖర్చుతో చదువులు చెప్తున్నారు. ఈ స్థితికి మిషనరీల క్రైస్తవ చదువులు ఎంత కారణమో ప్రభుత్వం వారి సెక్యులర్ చదువులు కూడా అంటే కారణం. నిజానికి మిషనరీ పాఠశాలలే ఒకందుకు మంచివేమో వారు కనీసం క్రైస్తవమైనా బోధిస్తున్నారు ప్రభుత్వం వారి పాఠశాలలో సెక్యులర్ చదువులు సాగుతున్నాయి. కాబట్టి ఈ పాఠశాలలోని విద్యార్థులు రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతున్నారు. వారి పూర్వపు మతాన్ని నిర్ములించేసి దాని స్థానంలో కొత్త మతాన్ని ప్రవేశింపనివ్వట్లేదు ప్రభుత్వం వారి సెక్యులర్ చదువులు. పాశ్చాత్య నాగరికత అప్రతిహతమైన వేగంతో దూసుకొని వస్తోంది. ఈ కొత్త ఆలోచనలు పాశ్చాత్య ప్రభావిత అలవాట్లు విప్లవాత్మకమైన విజ్ఞానము ఇవన్నీ కూడా వారి పాతకాలపు పద్దతులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడులు దేవాలయాలలోనికి కూడా చొచ్చుకొని వచ్చాయి”

వెల్ష్ తన రచనలలో పాశ్చాత్య నాగరికత ఇతర నాగరికతలను అత్యంత వేగవంతంగా రూపుమాపుతున్న విధానం గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా పాశ్చాత్య నాగరికత ప్రభావానికి లోనై ఇతర సంస్కృతుల తాలూకా మత సౌధాలు కూలిపోయాక ఏర్పడ్డ శూన్యాన్ని పూడ్చాలంటే అది కేవలం క్రైస్తవం ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు.

“ఈ మొరటు జాతులు మరియు పాతకాలపు నాగరికతలను క్రైస్తవ మతభోధనల ద్వారా ఉద్ధరింపకపోతే వారి యొక్క పాత కాలపు పేగన్ జీవన పద్దతుల నిర్మూలన జరిగాక కొత్తగా వేరే ఏ ఇతర ప్రత్యామ్నాయ నైతిక విలువలు మరియు ఆధ్యాత్మిక విలువల విధానం ఏర్పాటు చెయ్యకపోతే అప్పుడిక వారికి అంతకంటే మంచివి మరియు ఉన్నతమైన విలువలు చట్టాలు ఆచారాలు అలవడేది ఎలాగా?”

ఇప్పటి కాలపు హిందువు సంస్కర్తలు కూడా ఆలోచించవలసిన విషయం ఇది. పాత పేగన్ పద్ధతులనన్నిటిని కూడాను మూడాచారాలనో దురాచారాలనో సంస్కరించుకుంటూ పొతే చివరికి మిగిలే శూన్యాన్ని డొల్లతనాన్ని దేనితో పూడ్చాలని వారి తాపత్రయమో మరి. మంచో చెడో మిషనరీలకు ఆ విషయంలో ఎంతో స్పష్టత ఉంది.

వెల్ష్ పుస్తకంలోనే మరొక చోట గవర్నమెంటు వారి సిలబస్ లోని నాస్తిక భావపు ప్రచారం గురించిన ప్రస్తావనను మనమంతా గుర్తించి ఈ విషయమై ఆలోచించాలి. మిషనరీలు బ్రిటీషు ప్రభుత్వం వారి విద్యా విధానాలను విమర్శించటం ఇక్కడి విశేషం. వారి బాధల్లా బ్రిటీషు ప్రభుత్వపు విద్యా విధానంలో లౌకికత పాలు ఎక్కువ అంటే సెక్యులరిజం ఎక్కువ క్రైస్తవం పాలు తక్కువ అని.

“మీ ప్రభుత్వ పాఠశాలలో అసలే విధమైన మతపరమైన బోధనలు చెయ్యట్లేదు అని చాలా గొప్పగా చెప్తారు.అయితే ఇటువంటి విద్యాబోధన అన్నది కొన్ని తరాలు కొనసాగితే చివరాఖరికి భగవంతుడిని బహిరంగ ప్రదేశాలలో గుర్తించటానికి మరియు భక్తి భావాన్ని సమాజంలో నలుగురి ఎదుటా బయటకి వ్యక్తం చేయటానికి ఏమాత్రం కూడా సుముఖత లేని ఒక వింత తరం తయారవుతుంది. అంతకు మునుపు నాటి స్వదేశీ విద్యా విధానంలో అప్పటి పాఠశాలలు వారి వారి స్వధర్మానికి అనుగుణంగా సహజ సిద్ధంగా సరిపోయే విద్యను అందించేవి. మీ ప్రభుత్వ పాఠశాలలో ఓ మోస్తరు తెలివి తేటలు ఉన్న ప్రతీ విద్యార్థిని కూడా ఇంకా పెద్ద చదువులు చదవాలని పెద్ద పెద్ద విద్యాలయాలలో ప్రవేశం సంపాదించాలని వారికి ఉపకార వేతనాలు భత్యాలు వగైరాలు ఇచ్చి వారిలో భవిష్యత్తు గురించిన లేనిపోని ఆశలు నూరిపోస్తారు. తీరా ఈ చదువులన్నీ అయ్యాక వీరంతా గుమాస్తాగిరీ చేయవలసిందే. అలా వారు గవర్నమెంటు ఉద్యోగాల వేటలో గవర్నమెంటు వారిచ్చే భత్యాల వేటలో వారి భవిష్యత్తును అంతా వృథా చేసుకుంటారు. వీరందిరికి సరైన సంతృప్తిని ఇచ్చే ప్రభుత్వోద్యోగాలు లేవు అన్న సంగతి మీకు తెలియనిది కాదు. చివరికి మిగేలేది ఏమిటి? వలసపాలకుల విద్యా ఉద్యోగ విధానాలలో పెరిగి పెద్దయిన ఈ తెలివైన మూర్ఖులనబడే తరగతి ప్రజలలో క్రమశిక్షణ లోపిస్తుంది ఆత్మ సంతృప్తి అన్న భావన సమసిపోతుంది భగవంతుని మీద విశ్వాసం అన్న భావన అసలే మాయమవుతుంది”

ఈ పుస్తకంలో వెల్ష్ “ది స్పెక్టేటర్” అనే పత్రిక యొక్క పాత్రికేయుడు సంపాదకుడు అయినటువంటి మెరిడిత్ టౌన్సెన్డ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తారు. టౌన్సెన్డ్ భారత దేశంలో క్రైస్తవ వ్యాప్తికి కులం అడ్డుగోడగా నిలవటం గురించి ప్రస్తావిస్తారు ఇక్కడ.

టౌన్సెన్డ్ గారి ఉద్దేశ్యంలో కుల వ్యవస్థ అన్నది ఒక రకమైన సామ్యవాదం అంటే సోషలిజంను పోలి ఉంటుంది. అది ఎన్నో తరాలుగా హిందూ సమాజాన్ని అరాచకత్వం నుంచి పారిశ్రామిక సమాజపు వెర్రి పోకడలు మరియు పోటీతత్వ సమాజపు విశృంఖల వైఖరుల నుంచి కాపాడింది.

“నిజానికి కుల వ్యవస్థ అన్నది స్వతహా పేద తరగతుల వైపు పక్షపాతం చూపించేటటువంటిది. అది ఒక రకంగా ఆలోచిస్తే అత్యంత శక్తివంతమైన ట్రేడ్ యూనియన్. అయితే ఆ వ్యవస్థలోని మంచి అన్నది ఏదైనా ఉండవచ్చును కానీ ఒక విషయం మాత్రం సత్యం. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ మరియు క్రైస్తవం అన్నవి రెండూ ఒకేసారి కలిసి ఉండటం అన్నది జరిగే పని కాదు. కులానికి క్రైస్తవానికి సామ్యం కుదరదు” అంటారు టౌన్సెన్డ్.

రెవరెండ్ జేమ్స్ హో అని మద్రాసు ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకా ఛాప్లైన్ (chaplain) రాసిన పుస్తకం “The History of Christianity in India : From the Commencement of the Christian Era : Second Portion: Comprising the History of Protestant Missions, 1706–1816” లోని వాక్యాలను పరిశీలించండి. బ్రాహ్మణుల పై వెళ్ళబోసుకున్న అక్కసు విషయాన్ని పక్కనబెడితే కులం గురించి ఈయన కూడా ఇతర మిషనరీల లాగానే స్పందించారు.

“ఈ కుల వ్యవస్థ అన్న దానిని ఒక ధార్మికమైన లేదా మతపరమైన ప్రత్యేకతగా గుర్తించాలి. ఇది బ్రాహ్మణులు కుట్రపూరితంగా ఈ దేశంలోని లక్షల మంది ప్రజలకు తగిలించిన బానిసత్వపు సంకెళ్ళు. భారత దేశంలో క్రైస్తవ వ్యాప్తిని ఈ కుల వ్యవస్థ అన్నది ఎంత ఆటంకం కలిగిస్తోందంటే మన మత వ్యాప్తికి దీనిని మించిన అడ్డంకి మరేదీ లేదు ఈ దేశంలో”

ఇది  “The pioneers : a narrative of facts connected with early Christian missions in Bengal, chiefly relating to the operations of the London Missionary Society” అన్న పుస్తకంలో మరొక మిషనరీ రాసిన వాక్యాలు

“నిజానికి మనలో చాలా మంది కుల వ్యవస్థ అన్నది దాదాపుగా అంతరించిపోయిందనే అనుకుంటున్నాము. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి కులం మరియు హిందూ మతం లేదా ధర్మం అన్నవి సమానార్థకాలు మరియు పర్యాయ పదాలు. ముందు కులం అన్నది అంతరిస్తేనే తర్వాత హిందూ మతం అన్నది అంతరించేది”

India and the Hindoos: being a popular view of the geography, history, government, manners, customs, literature and religion of that ancient people; with an account of Christian missions among them” అన్న పుస్తకంలో ఎఫ్. డి. డబ్ల్యు. వార్డ్ అని మద్రాసు రాష్ట్రానికి చెందిన ఒక మిషనరీ కులం గురించి రాసిన ఈ వాక్యాలు చుడండి.

“కులం అన్నది కేవలం సామాజికమైనదా లేక మతపరమైన సంస్థనా? నా ఉద్దేశ్యంలో రెండూ. నిజానికి మతపరమైన భావాల పాలే ఎక్కువ అందులో. కుల వ్యవస్థ నిర్దేశించే ప్రత్యేకతలు కట్టుబాట్లు అనేవన్నీ కూడా భగవంతుని శాసనాల లాగానే శాస్త్ర సమ్మతమైనవి గానే భావిస్తారు అందరు. కులం అనేది వారి సాంఘిక జీవనంలోని ఎన్నో అంశాలను నేరుగానే ప్రభావితం చేస్తుంది. ఈ ధార్మికమైన మతపరమైన అంశాలు ఇందులో లేకపోతే అసలు ఇన్ని వేల ఏళ్ళు నిరంతరంగా ఈ వ్యవస్థ మనగలిగేదా? ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫలితాలు ఈ వ్యవస్థ వల్ల ఈ సమాజానికి లభ్యమయ్యేవా? భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి ఈ కుల వ్యవస్థ అన్నది అత్యంత బలీయమైన అవరోధం అన్నది ఈ పాటికే నా పాఠకులకు అర్థమై ఉంటుంది. అది నిజమే మన మత పురోగతికి అడ్డుగా నిలిచే అడ్డంకులలో మనకు తెలిసినవాటన్నిటిలోను ఇదే అత్యంత బలమైన అడ్డంకి. ఈ కులం కట్టుబాట్ల వల్లనే మన మిషనరీలకు ఈ ప్రజలతో సులభంగా సంభాషించే సౌలభ్యం లేదు. మన మత ప్రచారకులు వీరితో ఏ కల్మషాలు లేకుండా నిష్పాక్షికంగా చర్చించాలంటే ముందు వారితో మనకు హాయిగా సంభాషించే వెసులుబాటు ఇవ్వాలి. పాశ్చాతులను అందరిని వీరు మ్లేచ్చులుగా తక్కువ జాతి వారిగా పరిగణిస్తారు. కాబట్టి ఇతర దేశాలకు మల్లే వారి కుటుంబ సభ్యులతో హాయిగా భోజనం చేస్తూ సఖ్యంగా సంభాషించే వెసులుబాటు మనకు లేదు. ఈ కుల వ్యవస్థ వలన ఈ ప్రజానీకంలో ఏర్పడ్డ మనః స్థితి బైబిల్ సిద్ధాంత ప్రచారానికి అనువుగా లేదు”

రెవరెండ్ విలియం బయ్యర్స్ అని వారణాసికి చెందిన ఒక మిషనరీ “Letters On India: With Special Reference To The Spread Of Christianity” అన్న పుస్తకంలో ఇలా రాసాడు. కుల వ్యవస్థలోని కట్టుబాట్ల వలన స్థానిక ప్రజలతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవటంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయని నిరాశ నిస్పృహను ఈ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నాడు.

“కులంతో మనకు వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటే ఆ వ్యవస్థలో ఉన్న సవాలక్ష నియమాలు కట్టుబాట్ల వలన మనకు ఆ ప్రజలతో సుఖంగా సంభాషించే అవకాశం దొరకదు. వారితో ఆప్యాయపూరితమైన సంభాషణ అన్నది మనకు అసాధ్యం. మనకు వారి ఇళ్ళలో కుటుంబాలలో ప్రవేశం లేదు. మనల్ని వారు తమతో సమానమైన జాతిగా గుర్తించరు కనుక వారితో కలిసి మనం ఏమీ తినరాదు తాగరాదు. మనం ఒక ఊరు నుంచి మరొక ఊరుకు తిరిగి ప్రచారం చేయగలము మహా అంటే వీధి వీధి తిరిగి ప్రచారం చేయగలము కానీ ఇంటింటికి చొచ్చుకుని వెళ్ళి ప్రచారం చేయలేము ఎందుకంటే వారి ఇళ్ళల్లోకి మనకు అనుమతి లేదు కనుక. కుల వ్యవస్థ అన్నది వారికి మనకు మధ్యన ఒక నిర్ధిష్టమైన లక్ష్మణ రేఖ గీసి వారికి మనకు ఒక బలమైన సరిహద్దును నిర్మించింది. దానిని దాటుకొని మనం వెళ్ళటం కష్టసాధ్యం. నిజానికది అసంభవం కూడానూ.

కాబట్టి ఈ ప్రజలతో మన సంవాదాలన్నీ కూడా బహిరంగ ప్రదేశాలలో జరగవలసినవే. వారి వ్యక్తిగత జీవితంలోకి మనకు ప్రవేశం లేదు. కాబట్టి వారి వ్యక్తిగత అలవాట్లు అభిప్రాయాలు గురించిన అవగాహన మనకు చాలా తక్కువ. మరి అలాంటప్పుడు మన భావాలు వారి హృదయాంతరాలలోకి మస్తిష్కాలలోకి ప్రవేశించేది ఎలాగు? ఇదంతా లేకుండా కేవలం బహిరంగ ప్రదేశాలలో మాత్రమే మత ప్రచారాలు చేయటంలో అర్థం లేదు. దానివలన పెద్ద ప్రయోజనం లేదు.

మత మార్పిడి విషయంలో లేదా ఒకరిని మన భావాలతో ప్రభావితం చేసే విషయంలో ఇతరులెవరు లేని ప్రదేశాలలో ఏకాంత సమయాలలో వారితో చేసే సంభాషణలు వగైరాల ప్రాముఖ్యత చాలానే ఉంటుంది. ఇవేవి లేకుండా మీరు చేసే ప్రచారం అంతా కూడా బహిరంగంగానే జరగాలి అంటే మిషనరీలకు కష్టసాధ్యమైన పనే. ఈ ప్రజలు మనల్ని అపరిశుభ్రమైన మ్లేచ్ఛ జాతిగా భావిస్తారు. మనతో తినటం మరియు తాగటమే కాదు వేరే ఏ ఇతర సంపర్కం పొందటానికి కూడా ఇష్టపడరు. కాబట్టి మన మతం గురించి వారిలో సున్నితమైన భావాలు రేకెత్తించడం అన్నది చాలా కష్టసాధ్యం. మన దృష్టిలో వారు అనాగరికులు వారి దృష్టిలో మనం అనాగరికులం.

మనల్ని వారు కులం కట్టుబాట్ల వల్ల ఆచారాల వల్ల మ్లేచ్ఛ జాతి అని దూరంగా పెట్టడంతో మనకు వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడవు. వారితో ఇచ్చి పుచ్చుకోవడాలు ఇతరత్రా సంబంధ బాంధవ్యాలు స్నేహాలు ఏర్పడవు. కాబట్టి వారి అభిరుచులను ఆలోచనలను పసిగట్టు తదనుగుణంగా మన సువార్త ప్రచారం వారితో చేసే అవకాశం మనకు లేదు. అలాగని వారిలో దయా భావం స్నేహ శీలత లోపించిందని నేను అన్నట్టుగా కాదు. వారు సహజసిద్ధంగా కలుపుగోలుతనం గలవారు అయినప్పటికిని ప్రతిదీ కులాచారపు కనుసన్నల్లో జరగాలి కాబట్టి మనల్ని వారు దూరంగా పెడతారు. ఈ దూరాలను సరిహద్దులను దాటుకొని మనం వెళ్ళలేము. ఇది ఆ ప్రజలతో సమస్య కాదు వారిపై వారి కుల వ్యవస్థ ప్రభావం అలాంటిది. విదేశీయులను వారు సహజంగానే వేరే ఏదో జాతికి చెందిన వారిలాగా అనుమాన భావంతో చూస్తారు. కాబట్టి బయటివారితో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకోవాలి అన్న ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేదు”.

ఇదే పంథాలో కొనసాగుతూ రెవరెండ్ బయ్యర్స్ ఈ పుస్తకంలో ఇలా రాశారు

“నిజానికి కులం కట్టుబాట్ల వలన ఈ సమాజంలో ఇన్ని వైరుధ్యాలు ఒక కులం ఇంకొక కులం వేరుగా ఉండటం వంటివి లేకపోతే మతమార్పిడి విషయంలో మనకు ఇంత కష్టం ఎదురుపడేది కాదు. తన కులాన్ని వదులుకొని క్రైస్తవాన్ని పుచ్చుకోవాలన్న విషయమై ఈ స్థానికులలో ఉన్న సహజ సిద్ధమైన విముఖతను పక్కన పెడితే అసలు వారితో ఇటువంటి సంభాషణలు చేయటానికి వారి మనసులలోకి మెదళ్ళలోకి చొచ్చుకువెళ్ళటానికి క్రైస్తవ ప్రచారకులకు అనుమతి లభించకపోవటం వారి కట్టుబాట్ల ప్రకారం మనకు ప్రవేశారార్హత లేకపోవటం అన్న విషయం మన మిషనరీలు ఇంకా పెద్ద అడ్డంకి”.

“గురువుకు శిష్యునికి మధ్యన ఒక విధమైనటువంటి ఏకత్వం అవసరం. కానీ క్రైస్తవ ప్రచారకులకు హిందువులకు మధ్యన కులం అన్న ఒక్క అగాధం ఉన్నది. దానిని దాటుకొని రావటం ఇరువురికి అసాధ్యం. ఈ దేశంలో యూరోపు వారిని అపరిచితులుగా అనాగరికులుగా చూస్తారు. ఆ యూరోపు దేశస్థుడు ఎంత ప్రయత్నించినా కూడానూ కులం అన్నది అతనిని అతని జీవితాంతం అపరిచితునిగా అనాగరికునిగానే చూస్తుంది.

ఈ దేశంలోని కుటుంబ వ్యవస్థ కూడా చాలా పటిష్టమైనది. ఎంతో పకడ్బందీగా ఏర్పడిన వ్యవస్థ ఇది. నిజానికి కులం కంటే కూడా ఈ కుటుంబ వ్యవస్థ శక్తివంతమైనదేమో. అయినా కులానికి కుటుంబ వ్యవస్థకు రెంటికీ అవినాభావ సంబంధం ఉన్నది. కాబట్టి ఈ సమాజంపై ఆ రెండిటి ప్రభావాన్ని వేరు చేసి చూడటం బహుశా కుదరదనుకుంటాను”

జోసెఫ్ ముల్లెన్స్ అని లండన్ మిషనరీ సొసైటీ కలకత్తాలో పని చేసిన మిషనరీ “A Brief Review of Ten Years’ Missionary Labour in India Between 1852 and 1861” అన్న పుస్తకం రాశారు. అందులో కులం గురించి ఇలా అన్నారు.

“వారి సొంత కులంతో వారికి ఏర్పడిన ధృడమైన బంధమే వారి చేత క్రైస్తవ మతాన్ని పుచ్చుకునేలా చేయటం అనే కార్యంలో మనకున్న ప్రధాన అడ్డంకి”

రెవరెండ్ ఆర్. జీ. వైల్డర్ అన్న మిషనరీ 1861 లో రాసిన పుస్తకం “Mission Schools in India of the American Board of Commissioners for Foreign Missions: with Sketches of the Missions among the North American Indians, the Sandwich Islands, the Armenians of Turkey, and the Nestorians of Persia” లోని వాక్యాలివి.

“రెవరెండ్. మైరాన్ విన్సలౌ డి.డి దాదాపుగా ముప్పైఐదు ఏండ్లకు పైగా హిందువుల మధ్యన పని చేసి ఈ మాటలు అన్నారు. “భారత దేశంలో మిషనరీ కార్యకలాపాలకు చాలానే అడ్డంకులు ఉన్నవి. వంశానుగత పరంపరలు ఆధారంగా వచ్చే అర్చకత్వం, అతి పురాతనమైన అతి విస్తృతమైన ధార్మిక సాహిత్యం, అనాది నుంచి కాల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డ ఆచారాలు వంటి అడ్డంకులన్నీ ఒక ఎత్తైతే కులం అన్నది మరొక ఎత్తు. ఇది ఇనుము వజ్రము కంటే కూడా అతి కఠినమైన అడ్డుగోడ. అతి క్రూరమైనదైనప్పటికినీ అత్యంత అబ్బురం కలిగించే మూఢాచారం ఇది. ఈ ప్రజల ప్రతి అడుగును అది నియంత్రిస్తోంది. కులం వారిచే ఎన్నో పాపాలు చేయిస్తోంది.

రెవరెండ్ డాక్టార్ స్కడ్డర్ ఇలా అంటారు “ఈ దేశంలో క్రైస్తవ మత ప్రచారానికి సువార్త ప్రచారానికి అత్యంత శక్తివంతమైన అడ్డంకి ఏమిటి అని నన్నెవరైనా అడిగితే అది కుల వ్యవస్థే అని గుక్కతిప్పుకోకుండా నిర్మొమహమాటంగా చెబుతాను నేను. అది వర్ణింపశక్యం కానీ మహా రాకాసి. కులం అన్నది భారతీయుల నర నరాల్లో జీర్ణించుకుపోయి వారిని నియంత్రిస్తోంది. వారి శరీరంలో ప్రతీ రక్తపు బొట్టులో ఈ కులమనే కాఠిన్యం ఇంకిపోయి ఉంది. కులమనే నూలుపోగుతో వారి ఆత్మల యొక్క ఆకృతి సృజింపబడియున్నది. కులమనేది హిందూ మతానికి రూపాన్ని శక్తిని జీవాన్ని ఇస్తోంది. కులమనేదే లేకపోతే హిందు మతం నామరూపాల్లేకుండా నాశనం అవుతుంది. ఆణువణువూ అంతకంతా విచ్చిన్నమైపోతుంది. కులమనేది పైశాచిక భావనతో సైతాను చేసిన పరోమోత్కృష్ట సృష్టి. ఈ కుల వ్యవస్థ యొక్క కూర్పును తదేకంగా చూస్తూ ఉంటే నాకనిపిస్తుంది అది ఆ మహా మాయావి యొక్క గొప్ప కుయుక్తి అని. ఇంత తెలివిగా పన్నాగం పన్ని కులమనే ఉక్కు సంకెళ్ళతో ఈ ప్రజలను పూర్తిగా నియంత్రించే విధానం రూపొందించారు. ఈ వ్యవస్థ యొక్క క్రౌర్యము విశ్వజనీనమైన శక్తి అన్నది దగ్గరగా చుసిన వారికే అర్థమవుతుంది. ఈ దేశంలో సువార్త వ్యాప్తి చెందనివ్వకుండా మేరు పర్వతం వలె మనకి అడ్డంగా నిలిచింది ఈ కుల వ్యవస్థే. ఈ మహా పర్వతం యొక్క పునాదులను అతి బలిష్ఠమైనవి అపరిమితమైనవి ఈ కుల పర్వత శిఖరం ఆకాశాన్ని ముద్దాడుతోంది ఇది అనంతమైనది ”

ఈ విధంగా ఈ పుస్తకంలో రెవరెండ్ స్కడ్డర్ కులాన్ని సైతాను చేసిన మహాసృష్టి అన్నాడు హిందూ మతానికి జీవశక్తిని ఇస్తున్న వ్యవస్థ అని గుర్తించాడు. అంతేకాక కులమనేది హిందువులు హీథెన్ల (heathen) వలె బ్రతకటానికీ మరియు వారి క్రైస్తవీకరణకు మధ్యన ఉన్న ఒక దుర్భేద్యమైన దుర్గం అని అన్నాడు. ఈ పుస్తకం ప్రచురించిన వంద ఏళ్ళ వరకు ఎందరో మిషనరీలు కూడా కులం గురించి ఇటువంటి వ్యాఖ్యానమే చేయటం గమనార్హం.

మరిప్పుడు మన హిందూ మత సంస్కర్తలు అందరు కూడాను కూడబలుక్కుని కులం విషయంలో ఈ మిషనరీలు ఏదైతే కావాలనుకున్నారో దానికోసమే అహర్నిశలు శ్రమ పడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మిషనరీలకైనా ఒక పరమార్థముంది ఈ పనిలో విజయవంతమైతే ఎంచక్కా ఈ దేశాన్నంతటిని క్రైస్తవీకరించవచ్చని. మరి మన సంస్కర్తలు మిషనరీలు కోరుకున్న ఈ సంస్కరణలన్ని తు.చ తప్పకుండ అమలు చేసి ఏం సాధిద్దామని?

ఇది 1913లో అమెరికన్ బోర్డు ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ వారిచే ప్రచురింపబడ్డ India, One Hundred Years After అన్న త్రైమాసిక పత్రికలో సెక్రెటరీ కార్నిలియస్ హెచ్ పట్టోన్ రాసిన వాక్యాలు

“హిందువులలో అగ్ర వర్ణాల వారు ఒక సారి పశ్చిమ దేశాలకు ప్రయాణం చేసి ఒక్కసారి ఐరోపా దేశాలలో పాశ్చాత్య సంస్కృతి రుచి చూశారంటే ఆ క్రైస్తవ నాగరికత యొక్క పరిమళాలను ఆస్వాదించారంటే ఇక వారిలో కలిగే మార్పులు చాలానే ఉంటాయి. వారు మారిన మనుషులుగా తిరిగొస్తారు. ఈ ప్రయాణాల వలన కలిగిన మార్పులకు మరియు పాశ్చాత్య చరిత్ర మరియు విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం, ప్రాచ్య దేశాలపై పాశ్చాత్య నాగరికత యొక్క జీవన శైలీ మరియు ఆలోచనల ప్రభావం ఇవన్నీ కలిపి మూల్యాంకనం చేసి ఈ దేశం భవిష్యత్తు గురించిన ఊహ చేస్తే ఒక విషయం ప్రస్ఫుటమవుతుంది. కులం అన్నది ఇక అడ్డు తప్పుకొని సువార్తకు దారి ఇవ్వవలసిందే బ్రాహ్మణ్యం అన్నది నిర్వీర్యమై అంతరించిపోవలసిందే”

మైరోన్ విన్స్లో అని మద్రాసుకు చెందిన ఒక మిషనరీ “Hints on Missions to India” అన్న పుస్తకంలో ఇలా రాశారు

“ఈ దేశంలో కులమన్నది ఒకటి ఉంది. ఇది వేరే ఏ ఇతర దేశంలో కూడా ఈ విధంగా ఏర్పడలేదు. ఇది మనకు విగ్రహారాధనకంటే కూడా పెద్ద ఆటంకం. ఇది వేయి తలలు గల రాక్షసి. ఇది సజీవమైన వ్యవస్థ. ఒక శిరస్సును తెగనరికామా దాని స్థానంలో మరొక కొత్త శిరస్సు సృష్టి వెనువెంటనే జరిగిపోతుంది. దీనిని పూర్తిగా మట్టుపెట్టాలంటే మన ప్రభువు యొక్క దివ్యమైన దీవెనలు పవిత్ర ప్రేమ నుంచి పుట్టిన దివ్యమైన అగ్ని మనకెంతైనా అవసరం”

కులం గురించి మిషనరీలు చేసిన వాక్యాలలో క్రమ బద్ధత సామంజస్యము చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాదాపుగా అందరు కులాన్ని క్రైస్తవీకరణకు అడ్డంకి గానే చూసారు. రెవరెండ్ జె.పీ జోన్స్ తాను రాసిన “Modern Hinduism : Does it meet the needs of India?” అన్న పుస్తకంలో ఇలా రాశారు.

“ఈ భారతదేశపు ప్రజలంతా కూడా పాశ్చాత్య ప్రజానీకం కంటే భిన్నమైన వారు. పాశ్చాత్యులకు మతం అంటే వారి జీవితంలోని ఒక యాదృచ్ఛికమైన సంఘటన వంటిది మాత్రమే. వారి జీవితంలో మతానికి ఒక ప్రత్యేకమైన విభాగం (department) కలదు. మతం ఆ పరిమితులకు లోబడి ఉండాల్సిందే. మతమనేది వారి జీవితాలలో ఏదో ఒక మూలకు నెట్టివేయబడింది. కానీ ఈ ప్రాచ్య దేశపు సమాజంలో మతమన్నది వారి జీవితంలోని ప్రతీ అణువణువులో అంతర్భాగమైపోయింది. వారి జీవితాలలో ఫలానా విభాగానికీ మతానికీ సంబంధం లేదని చెప్పటం కుదరదు. ఫలానా పని చేయటానికి మతపరమైన విధానం లేదు అని చెప్పటం సాధ్యం కాదు. కుల వ్యవస్థ అన్నది హిందూ మతాన్ని అన్ని దిక్కుల నుంచీ చుట్టుముట్టి ప్రతి విషయంలోనూ దిశానిర్దేశం చేస్తూ ఉంది. అందుకనే హిందూ మతము మరియు కులము రెండూ పర్యాయపదాలు సమానార్ధకాలు అని అంటారు ”

ఇంతటితో కులం గురించి క్రైస్తవ మిషనరీల వ్యాఖ్యల ఉటంకింపు సమాప్తం.

హిందూ మతాన్ని సునిశితంగా పరిశీలించిన వారందరికీ కులమనేది ఈ మతంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో అర్థం అవుతుంది. హిందూ మత ఆచారాలు, సంప్రదాయాలు కులంతో ముడిపడి ఉన్నాయి. నిజానికి ధర్మము అన్న భావనకు కూడా కులంతో విడదీయరాని లంకె ఉంది. ఈ వ్యాసం ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా కుల వృత్తుల వారసత్వ పరంపరలకు ఇప్పుడు కాలం చెల్లింది. ఈ విషయమై ఎవరూ ఎవరినీ బలవంతపెట్టట్లేదు. టెక్నాలజీ మార్పుల దృష్ట్యా అటువంటి వ్యవస్థను అమలు చేయటం కూడా సాధ్యం అయ్యే విషయం కాదు. అధిక సంఖ్యాకులకు ఆమోద్యయోగ్యమైనది కూడా కాదు. అయితే ఇప్పుడు ఈ వ్యాసంలో చేసిన చర్చంతా దేనికి అంటే ఆచరణ విషయంలో హిందూ మతంలో అంతర్భాగంగా మారిన కులానికి ప్రత్యామ్నాయం ఏమిటి? కుల నిర్మూలన అనేదసలు సాధ్యమా? కుల నిర్మూలన జరిగాక హిందూ మత స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి? ఆ రూపాంతరం చెందిన మతాన్ని ఆచరించాలంటే ఏ పద్ధతులు అవలంబించాలి వంటి ప్రశ్నలకు సమాధానాల విషయంలో మన హిందూ సమాజానికి ఇంకా అవగాహన ఉండాల్సినంతగా లేదని ఆ విషయమై చర్చలు జరగాలన్న ఉద్దేశంతో రాసిన వ్యాసం ఇది. ఆ వ్యవస్థలో వారసత్వ వృత్తుల విషయాన్ని పక్కన పెడితే క్రైస్తవ మిషనరీల మత మార్పిడి ప్రయత్నాలను ఇంతగా ఎదురొడ్డిన ఈ వ్యవస్థ నమూనా నుంచి మనం నేర్చుకోగలిగేది ఏదైనా ఉందా? హిందూ సమాజం పూర్తిగా నాస్తికం వైపుగానో లేక ఇతర అబ్రహామిక్ మతాల వైపుగానో ప్రయాణించకుండా ఉండాలంటే మనం చేయగలిగేదేమైనా ఉందా? ఆ ప్రయత్నంలో కులం గురించి క్రైస్తవ మిషనరీలు చేసిన ఈ ప్రస్తావనల నుంచి మనం తెలుసుకోగలిగేది ఏమైనా ఉన్నదా? అన్నవి మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు. కుల సంస్కృతుల ద్వారా కుల వారసత్వాల ద్వారా మన సమాజంలో ఎన్నో వైవిధ్యతలు ప్రత్యేకతలు జ్ఞాపకాలు ఆచారాలు ఎన్నో తరాలు నిలబడ్డాయి. కుల నిర్మూలన మత్తులో పడిపోయి మనము మన ప్రత్యేకతలను అన్నిటిని కోల్పోయి నిస్సారమైన ఏకత్వం గల మతంగా రూపాంతరం చెందుతామా? కుల వ్యవస్థను బ్రాహ్మణులు పన్నిన కుట్రగా తిట్టుకుంటూ మన ప్రత్యేకతలను బహుళత్వాలను మనమే నాశనం చేసుకుంటున్నామా? ఈ విషయాల పై చర్చలు జరుగవలసిన అవసరం ఉంది. ఈ విషయమై అప్పటి మిషనరీలు కులం గురించి చేసిన వ్యాఖ్యలను పరిశీలించటం అవసరం.

ఇప్పటి కాలంలో హిందూ మత సంస్కరణల విషయంలో దూకుడు భావం చెలామణిలో ఉంది. ఆలోచన కొరవడింది. హిందువులను ఎలాగైనా ఆధునీకరించేయాలన్న తాపత్రయంలో హిందూ సంస్కరణ వాదులు, రాజకీయ నాయకులు, మేధావులు హిందూ శాస్త్రాల మీద ఆచార వ్యవహారాల మీద సరైన అవగాహన లేకుండానే సంస్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. సంస్కరణ అన్నది ఆయా సమాజాల ప్రజా సమూహాల మధ్యనుంచే రావాలి. సంస్కరణాభిలాష యొక్క తాత్త్విక పునాదులు వలస పాలకుల కుత్సితమైన ఆలోచనల పైనో లేదా క్రైస్తవ మిషనరీల వ్యూహాల పైనో ఆధార పడరాదు. ఆలా జరిగితే హిందువులకు మొదటికే మోసం జరిగే అవకాశం ఉందని మనమంతా గుర్తించుకోవాలి. ఇటువంటి విషయాలలో చెస్టర్టన్ కంచె (Chesterton’s fence) గురించిన ప్రస్తావనను గుర్తుకు తెచ్చుకోవాలి.

చెస్టర్టన్ కంచె అనేది సంస్కరణల విషయంలో తొందరపాటు తగదని దేనినైతే నిర్మూలించాలని సంస్కరించాలని అనుకుంటున్నామో అసలు ముందైతే ఆ వ్యవస్థ లేదా ఆచారం అనేది ఎందుకొచ్చిందో దాని వలన ఆ సమాజానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో పూర్తిగా అర్థం చేసుకొని అటు తర్వాత సంస్కరణ చేయ ప్రయత్నం చేయాలని ప్రతిపాదించే సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని జి.కె.చెస్టర్టన్ 1929లో రాసిన పుస్తకం “The Thing”లోని “The Drift from Domesticity” అన్న అధ్యాయంలో ప్రతిపాదించారు.

“సంస్కరణల విషయంలో ఒక అతి సాధారణమైన సులువైన సూత్రాన్ని పాటించాలి. ఇలా చేస్తే మనం చేసే సంస్కరణలు వికటించకుండా మనం జాగ్రత్త పడచ్చును. ఉదాహరణకు ఒక గేటు లేదా కంచె వంటిది ఉందనుకోండి. ఆధునిక భావాలు గల సంస్కర్త ఎవరైనా సరే మితిమీరిన సంస్కరణాభిలాషతో “నాకసలు ఈ కంచె వలన ఏ ఉపయోగం కూడా కనపడట్లేదు దీనిని వెంటనే తీసివెయ్యండి” అని అంటే అతనికంటే కొంచెం గాఢమైన ఆలోచనలు చేయగల మేధావిపరుడైన సంస్కర్త ఎవరైనా ఇలా అంటాడట. “నీకు ఈ కంచె వలన ఏ ఉపయోగము లేదు అని అనిపిస్తే దానిని తీసివేయటానికి నేను ససేమిరా ఒప్పుకోను. ఖచ్చితంగా అడ్డుచెబుతాను. నువ్వు తిరిగి కాసేపు ఆ విషయమై ఆలోచించి అటు తర్వాత నా దగ్గరకు వచ్చి ఆ కంచె ఉపయోగం నాకిప్పుడు తెలిసివచ్చింది దీని వలన ఫలానా ప్రయోజనాలు ఉన్నాయని అంటే అప్పుడు ఈ కంచెను తొలగించే విషయమై నీకు అవకాశం ఇవ్వటం గురించి నేను ఆలోచన చేస్తాను” అని అంటాడట ‘ఆలోచనాపరుడైన’ సంస్కర్త ‘ఆవేశపరుడైన’ సంస్కర్తతో”

సరళమైన భాషలో చెప్పాలంటే దారికి అడ్డుగా ఉందని తొందరపడి కంచెను తీసివేసే ముందు అసలైతే ఆ కంచెను ఎవరు వేశారు దానివలన ఉపయోగాలేంటి అని తెలుసుకొని ఆ విషయమై ఆలోచన చేసి అటు తర్వాత ఆ కంచెను నిర్మూలించే విషయమై ఆలోచించాలన్నది చెస్టర్టన్ కంచె అనే సూత్రం.

హిందూ సమాజ సంస్కరణల విషయంలో కులమనేది చెస్టర్టన్ కంచె వంటిది. ఎలాగైనా సరే దానిని నిర్మూలించేయాలని చివరకు మనము తీర్మానించవచ్చును. అది సాధ్యమా కాదా అన్నది వేరే విషయం. అయితే ఆ తీర్మానం చేసి కులమనే ఆ కంచెను నిర్మూలించే ముందు అసలు ఆ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది దాని వలన ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి దానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి అన్న విషయమై ఆలోచన చేసి అటు తర్వాత నిర్మూలన దిశగా ఉద్యుక్తులవ్వాలి. ఈ విషయమై క్రైస్తవ మిషనరీల ఆలోచనలను తెలుసుకువటం చాలా అవసరం ఉపయోగకరం కూడా. వందల ఏళ్ళ కిందటి కంటే ఈ వ్యూహ ప్రతివ్యూహాలను అర్థం చేసుకొని ఇటువంటి ప్రయత్నాలకు సముచితమైన సమాధానం ఇవ్వటానికి మరియు ఇటువంటి మతాంతరీకరణ భావాలను తిప్పికొట్టటంలో మునుపటికంటే ఇప్పుడు హిందూ సమాజం మెరుగైన స్థితిలో ఉందనిపిస్తోంది. ఆ దిశగా ధార్మిక విషయాలలో చింతనాపరులైన ఆస్తిక హిందువులు అడుగేయాలి.

ఈ వ్యాసం ఇది వరకే ఆంగ్లంలో “ప్రగ్యత”(Pragyata) అన్న అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. దాని తాలూకా లంకె ఇక్కడ. ఆ వ్యాస్యం తాలూకా ప్రతిస్పందనలకు ఇక్కడ చూడండి. ఆంగ్లంలోని మూల వ్యాస్యంలో యథాతథంగా పేర్కొన్న క్రైస్తవ మిషనరీల వ్యాఖ్యలకు తెలుగులో స్వేచ్ఛానువాదం చేయటం జరిగింది. ఆంగ్ల మూలం చదవాలని అనుకునే వారు ప్రగ్యత పత్రికలోని మూల వ్యాసాన్ని చదవగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here