‘కులం కథ’ – పుస్తక పరిచయం

0
9

[box type=’note’ fontsize=’16’] ‘ఆహ్వానం’ పేరిట ‘కులం కథ’ పుస్తకపు ముందుమాటని అందిస్తూ, సంకలనం గురించి, దానిలోని కథల గురించి వివరిస్తున్నారు సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్. [/box]

కులము లేనివాఁడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న మిగులకలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ వినర వేమ

కులం కథ సంకలనం పఠనానుభవానికి పాఠకులందరికీ ఆహ్వానం.

రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, క్రీడా కథ వంటి కథా సంకలనాలు, సంకలనాల తయారీలో ఒక ఒరవడిపై తెరతీశాయి. సంకలనాల తయారీలో ఉత్తమ విలువలు, ఉన్నత ప్రామాణికాలకు పెద్దపీట వేసే పద్ధతిని పునరుజ్జీవితం కావించామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. కథకు తప్ప మరే ఇతర అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, నిజాయితీగా, వీలయినంత నిష్పాక్షికంగా సంకలనాలను రూపొందిస్తూ తెలుగు సాహిత్య సాగరంలోని మణులను, ముత్యాలను ఏర్చి కూర్చి సంకలనాలను రూపొందిస్తున్నాం. పాఠకుల ప్రశంసలను అందుకుంటున్నాం. క్రీడా కథ తరువాత సంకలనాన్ని ఎలాంటి అంశం ఆధారంగా రూపొందించాలనే ఆలోచనలు తర్జన భర్జనలు జరిగాయి. పలు రకాల కథలు చదువుతూ, చర్చిస్తున్న సమయంలో తోలేటి జగన్మోహనరావు కథ ‘కులం’ చదవటం తటస్థించింది. వెంటనే ఇలాంటి ‘కులం’ కథలను ఒకచోట చేర్చి సంకలనం చేస్తే, ‘కులం’ పట్ల తెలుగు కథకుల స్పందనను, సమాజానికి వారిచ్చే సందేశాన్ని, ఆదర్శాన్ని పరిశీలించే వీలు కలుగుతుంది కదా అనిపించింది. అంతేకాదు, తెలుగు కథకులు ‘కులం’ సమస్యకు స్పందించిన తీరును విశ్లేషిస్తూ, సమస్య పరిష్కారానికి వారు సూచించిన మార్గాల గురించి చర్చించే వీలు చిక్కుతుంది. తద్వారా సాహిత్య ప్రపంచంలో ఒక మథనానికి నాందీ ప్రస్తావన జరిగే వీలుంటుందన్న భావన కలిగింది. దాంతో ‘కులం’ ఆధారంగా తెలుగు కథకులు సృజించిన కథల సంకలనం చేయాలన్న ఆలోచన కలిగింది. ఈ ఆలోచన వెనుక మరొక అంశం ఉంది.

‘కులం కథ’ అనగానే ప్రస్తుతం సాహిత్య ప్రపంచంలో ద్వేషపూరితమూ, అదోషభరితమూ అయినవే గుర్తుకువస్తాయి. తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపిస్తూ విద్వేషాలు వెదజల్లడం, మనుషుల మనసుల నడుమ గతాన్ని అడ్డుగోడలా నిర్మించి, వాటి చుట్టూ ముళ్ళ కంచెలు, మొసళ్లు నిండిన కందకాలు నిర్మించటమే కనిపిస్తోంది. అంటే ఎలాంటి సమన్వయానికి, సామరస్యానికి స్నేహ సౌహార్ధ భావనల అభివృద్ధికి ఆస్కారాన్నివ్వక కేవలం గతాన్ని ఒక సర్వనాశక ఆయుధంలా వాడుతూ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవే కులం కథలుగా ప్రచారం అవటం కనిపిస్తోంది. దీనితోపాటు భారతీయ ధర్మాన్ని దూషించటం, అది నాశనమైతే కానీ కులం నాశనం కాదని తీర్మానించటం, పురాణాలు, భారతీయ శాస్త్రాలను ఇష్టం వచ్చినట్టు విమర్శించటం, దేవీ దేవతలను హేళన చేయటం, అగ్రవర్ణాలవారే దీనికి కారకులని అగ్రవర్ణాలపై విషం వెదజల్లటమే కులం కధగా చలామణీ అవటం తెలుస్తోంది.

కులం సమస్య ఉంది. అది కాదనలేని నిజం. కానీ సమస్యను మాత్రమే ఎత్తిచూపిస్తూ, పుండులాంటి దోషాన్ని మాటిమాటికీ పొడుస్తూ ఉండటం, గాయం మానకుండా దాన్ని కెలుకుతూండటం వల్ల సమస్య పరిష్కారం కాదు సరికదా సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో సృజనాత్మక రచయితలు సమస్యపై అవగాహన కలిగిస్తూ, భవిష్యత్తు పట్ల ఆశాభావం కలిగించే రీతిలో సమస్యకు పరిష్కారం సూచిస్తే సమాజంలో ఒక సృజనాత్మకమైన ఆశాభావ బీజాన్ని నాటినవారవుతారు. అలాంటి ఒక పాజిటివ్ దృక్పధం, సమస్యపట్ల సానుభూతి, సామరస్యపూర్వక అవగాహన ప్రదర్శిస్తూ అడ్డుగోడలను కూలగొట్టి, విద్వేష భావనలను తొలగించి, మనుషుల మనసులను కలిపే రీతిలో సృజించిన కధలను సంకలనం చేయవలసిన ఆవశ్యకత ఉందనిపించింది. ఫలితంగా కులం కథా సంకలనం తయారు చేయాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. అయితే ‘కులం కథ’ అనగానే పలు అపోహలు, ఆవేశాలు కలగటం గమనించాము. దూషించటం, ద్వేషించటం, తిట్టటం, ఆవేశం ప్రదర్శించే కథలే ‘కులం కథ’గా ప్రచారం అవుతున్న తరుణంలో అందుకు భిన్నమైన కథలను ‘కులం కథ’గా భావించటం సాహసమైన పనే. కానీ మథనం జరగాలంటే సాహసం చేయకతప్పదు. ఆ సాహసం మేమే ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కులం కథ సంకలనం కోసం కథలను ఆహ్వానించాం.

మేము ఊహించినదానికన్నా అధికమైన స్పందన లభించటం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్ని కలిగించింది. రచయిత నుంచి లభించిన ఈ స్పందన ‘కులం కథ’ పట్ల రచయితలలో ఉన్న ఆలోచనలను స్పష్టం చేసింది. ఫలితంగా, కథల ఎంపికలో మేము కొన్ని ప్రామాణికాలను ఏర్పరచుకున్నాం.

  • కథ ఏ ఒక్క కులానికి చెందినదీ అయి ఉండకూడదు. ఒకవేళ కథలో ఏదో ఒక కులప్రస్తావన ఉన్నా, కథలో అంతర్లీనంగా కులభావన పట్ల అవగాహన, విశాలదృక్పధం ఉండాలి. కథ ఒక కులానికి సంబంధించినదయినా దానిలో సార్వజనీన భావన ఉండాలి.
  • కథలో ఎలాంటి సంకుచితత్వం ఉండకూడదు. ద్వేషభావనలు, దూషణలు ఉండకూడదు. ఒక కులాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని దానిలో నైచ్యం చూపటం, విమర్శించటం అన్నిటినీ దోషిగా చూపించే ప్రయత్నాలు ఉండకూడదు.
  • కథలో సమాజాన్ని ఏకం చేయటమన్న ఆలోచన ఉండాలి కానీ సమాజాన్ని చీల్చాలని ఆలోచన ఉండకూడదు.
  • కథలో భారతీయ ధర్మాన్ని దూషించటం, ధర్మం నశించాలని తీర్మానించటం, ధర్మశాస్త్రాలపై అనవసర, అకారణ విమర్శలు ఉండకూడదు. అవగాహన, ఆలోచన, సమన్వయ సాధన వంటి అంశాలకు ప్రాధాన్యం ఉండాలి.
  • కథ కేవలం సమస్యను ప్రదర్శిస్తే సరిపోదు. సమస్య ప్రదర్శనలో కూడా ఆలోచన, అవగాహన ఉండాలి తప్ప ఆవేశం, ద్వేషం ఉండకూడదు. ఈ కథలు ఏ ఒక్క వ్యక్తినో, వర్గాన్నో అన్నిటికీ దోషిగా చూపించి, కించపరిచేట్టుగా ఉండకూడదు.

ఇలా ప్రామాణికాలు ఏర్పరచుకుని విభిన్న కథలను ఎంపిక ప్రారంభించాం. వచ్చిన కథలను చదువుతూంటే ఆనందాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. తెలుగు కథకులు అత్యంత అద్భుతమైన రీతిలో సమాజంలో సమన్వయం సాధించే కథలు రాశారు. ద్వేష భావనలు తొలగిస్తూ, ప్రజల మనస్సుల నడుమ అడ్డుగోడగా నిలచిన కుల భావనను ఛేదిస్తూ, కుల భావన అసలు అర్ధాన్ని వివరించే కధలు అద్భుతమైన విధంగా సృజించారు. సాటి మనిషిని అర్థం చేసుకుని, ప్రేమించటం మానవత్వం అని ప్రకటిస్తూ ద్వేషించటం, దూషించటం అమానుషం అన్నదీ స్పష్టం చేస్తూ ద్వేషం, క్రోధం వంటి భావనల మేడిపండు పొట్ట విప్పి అసలు స్వరూపాన్ని ప్రదర్శించి అత్యద్భుతమైన కథలను సృజించారు. ఇలా ఒకో కథను విశ్లేషించి ఎన్నుకుంటూంటే కులం కథల సంకలనం ఆలోచనలోని వైశిష్ట్యం, ఆవశ్యకతలు మనకు స్పష్టం అయ్యాయి. నిజానికి ఇలాంటి కథలకు సాహిత్య ప్రపంచం పెద్దపీట వేయాలి. ఇలాంటి కథకులు తెరపైకి రావాలి అన్న ఆలోచనలు బలపడ్డాయి. మా దృష్టిలో ‘కులం’ పదం సమస్త భారతీయ సమాజాన్ని సూచించే పదంగా ఎదిగింది. కులం అంటే సమూహం అని అర్థం. భారతీయ సమాజమంతా ఒకే కులం అన్న భావన ఈ కథలను చదువుతూంటే కలిగింది. ఎందుకని ఈ విశాలమైన భావన సంకుచితమై విద్వేషాగ్నులకు కారణమౌతోందో బోధపడింది. దోషం భావనలో కాదు మానవ మనస్తత్వంలో ఉందన్న నిజం గ్రహింపుకు వచ్చింది. అంటే, ఈ సంకలనం తయారుచేయటం మాకు ఒక educating experience అన్నమాట!

ఈ సంకలనంలో మొత్తం 42 కథలున్నాయి. 1927లో ప్రచురితమైన కథ మొదలుకొని 2019లో ప్రచురితమైన కథ వరకూ ఈ సంకలనంలో ఉన్నాయి.

కథలను ఒక వరుసలో అమర్చటం వెనుక కూడా ఎంతో ఆలోచన, ఎన్నో తర్జన భర్జనలున్నాయి. సంకలనంలో అన్ని కథలు అవి ప్రచురితమైన సంవత్సరం ఆధారంగా Chronological order లో అమర్చాము. ఇలా అమర్చటం వల్ల రచయితల ఆలోచనలలో మార్పులు, వారి శైలి పరిణామ క్రమం కూడా పరిశీలించే వీలు కలుగుతుంది. అయితే రెండు కథలు కాలం పరిధిలో ఒదగవనిపించింది. ఆ రెండు కథలు కాలానికి అతీతం అనిపించింది. అందుకని ఆ రెండు కథలనూ ఒకదాన్ని మొదటి కథగా, రెండవదాన్ని చివరికథగా ఉంచాం. ఈ నడుమ ఉన్నవి కులం కథలు. మొదటి కథలో అంకురార్పణం జరిగితే చివరి కథలో ఉపసంహారం అన్నమాట.

గోపిని కరుణాకర్ రచించిన ‘కుమ్మరి చెక్రం’ కుమ్మరి కులానికి సంబంధించిందయినా భారతీయ వ్యవస్థ ఆరంభంలోని ప్రణాళికను సూచిస్తుంది. కుమ్మరి చక్రం తిరిగితేనే సూర్యచంద్రులు తిరుగుతారు. ఋతువులు సంభవిస్తాయి. మనుషులు జీవిస్తారు. ఈ కధలో రైతుకూ, కుమ్మరికీ ఉన్న అనిర్వచనీయమైన అవినాభావ సంబంధాన్ని ఆధ్యాత్మిక స్థాయిని ఎదిగించి ప్రదర్శిస్తాడు రచయిత. ఇది ఒక్క కుమ్మరి కులానికే కాదు, భారతీయ సమాజంలో ప్రతి కులానికి ఒక పురాణం ఉంటుంది. ఆ పురాణం వారిని తిన్నగా సృష్టికర్త స్థాయికి చేరుస్తుంది. దీన్లో హెచ్చుతగ్గులకు తావులేదు. న్యూనతాభావానికి ఆస్కారం లేదు. ఎవరి స్థాయిలో వారు ఉన్నతులు. ఎవరు ఎవరికీ తక్కువకాదు. ఒకరిపై ఒకరు ఆధారపడి ఒకరు లేకపోతే మరొకరికి మనుగడలేని అత్యంత అద్భుతమైన symbiotic సంబంధం భారతీయ సమాజంలో ‘కులం’ అని ప్రదర్శిస్తుందీ కథ. ఆరంభంలోని స్వచ్ఛత ఇది. ఎలాగయితే ఆవిర్భావ సమయంలో ఉన్న స్వచ్ఛత, నది కొండదిగి మైదానంలో ప్రవేశించి ప్రవహించేటప్పుడు ఉండదో, అలా ఆరంభంలోని ఈ సమాన సంబంధం రానురాను ఎలా ఎందుకు రూపాంతరం చెందిందో ఇతర కథలు ప్రదర్శిస్తాయి. అందుకని ఆ కధలను ‘కులం కథ’ శీర్షికలో చేర్చాము.

భారతీయ సమాజం గంగానది వంటి సజీవనది. ఇదొక నిత్యపరిణామ శీలి తత్వం కల సమాజం. భారతీయ సమాజం ఏనాడూ స్తబ్దుగా staticగా లేదు. ఎలాగయితే గంగానది నీటిలో తనని తాను పరిశుభ్రం చేసుకునే లక్షణం ఉందో, అలాగే భారతీయ సమాజంలో కూడా తనని తాను సంస్కరించే లక్షణం ఉంది. ‘సంభవామి యుగేయుగే’ అన్నట్టు ఎప్పుడెప్పుడు సమాజం సంకుచితత్వంలో దిగజారి తనని తాను మరచిపోయే పరిస్థితి వచ్చిందో, అప్పుడప్పుడు సంఘసంస్కర్తలు సమాజంలోంచే ఉద్భవించి సమాజం మనస్సాక్షిని తట్టి లేపారు. సమాజానికి దిశానిర్దేశనం చేశారు. ఇది ఆధునిక సమాజంలో మహాత్మాగాంధీ ప్రేరణతో ఉద్యమం రూపం దాల్చింది. ఆ సమయంలో మహాత్మాగాంధీ ప్రేరణతో, ఆదర్శంతో కథకులు సమాజంలో మార్పుని ఆహ్వానిస్తూ, ఆదర్శవంతమైన కథలు రాశారు. అంటరానితనం, వెట్టిచాకిరీ వంటి వ్యవస్థలోని నైచ్యాన్ని ఎత్తిచూపిస్తూ సామాజిక మనస్సాక్షిని తట్టి లేపాలని ప్రయత్నించారు.

శ్రీనివాసులు రచించిన ‘నేరేడు పండ్లకంటు’, మ్యాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మ కధ ‘వెట్టి మాదిగ’, ఆవుల పిచ్చయ్య కథ ‘వెట్టి చాకిరి దినచర్య’, మానేపల్లి తాతాచార్య కధ ‘పాలేరు తమ్ముడు’ వంటి కథలు సమస్యను ప్రదర్శిస్తూ వివక్షతలోని నైచ్యాన్ని చూపిస్తూ సమాజ మనస్సాక్షిని తట్టిలేపాలని ప్రయత్నించిన కథలు. గజపతిరాయ వర్మ కథ ‘మాలోళ్ల యెంకి’, అంటరానితనం ఆధారంగా జరిగే మతమార్పిడి ప్రయత్నాలలోని నైచ్యం చూపిస్తూ, భారతీయ సమాజంలోని బానిస మనస్తత్వం, న్యూనతాభావాలు ఎలా ఇతర మతాల ‘వేట’కు బలవటానికి తోడ్పడుతున్నాయో హృద్యంగా చూపిస్తుంది. ఈనాటి సమాజాలు సమస్యగా పరిగణిస్తున్న మత పెద్దల లైంగిక అత్యాచారాలను ఆనాడే ప్రదర్శించిన కథ ఇది. రావులపర్తి సూర్యనారాయణమూర్తి కథ ‘కులమా? కులపాలికా?’ కథలో కులంకన్నా మానవ సంబంధాలకు పెద్దపీట వేయటం కనిపిస్తుంది. మానవ సంబంధాల కోసం కులాన్ని త్యాగం చేయవచ్చన్న ఆదర్శ భావనను ప్రదర్శిస్తుంది. ఆర్. జనాబాయి నాయుడు కథ ‘హరిజన లక్ష్మి’ లో ఇతరులను చిన్నచూపు చూడటంలోని దౌష్ట్యాన్ని చూపిస్తూ ‘నేడు రాయన్నది ఒకనాటికి రత్నమౌతుంది’ కాబట్టి ప్రతి ఒక్కరూ మరొకరిని గౌరవిస్తూ భేదభావాలు, ఉచ్చనీచ భావనలు లేకుండా మెలగాలని బోధిస్తుంది.

ఇంతవరకూ ప్రస్తావించుకున్న కథలన్నీ స్వాతంత్ర్యానికి పూర్వం సృజించిన కథలు. ఈ కథలలో ఆదర్శం కనిపిస్తుంది. సమాజంలో కలగాల్సిన మార్పుల స్వరూపాన్ని చూపిస్తూ అందుకు ఆదర్శవంతమైన మార్గం సూచించటం కనిపిస్తుంది. అన్నిటిలో ఆశాభావం స్పష్టంగా కనిపిస్తుంది.

స్వాతంత్ర్యానంతరం కథలకు అంతకుపూర్వం కథలకూ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథల నడుమ వారధిలాటిది ‘ఆముక్తమాల్యద’లోని మాలదాసరి కథను కాస్త మార్పుచేసి వేలూరి శివరామశాస్త్రి రచించిన ‘మాలదాసరి’ కథ ఆనాటి రచయితల ఆదర్శ దృష్టిని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుందీ కథ. స్వాతంత్ర్యానంతరం ఆదర్శం స్థానాన్ని అతితెలివి, స్వార్ధంవంటివి ఆక్రమించాయి. ఆదర్శం ముసుగులో వ్యక్తి తనని తాను మోసం చేసుకోవటం కనిపిస్తుంది. కప్పగంతుల మల్లికార్జునరావు కథ ‘సుడిగుండాలు’లో వ్యక్తుల న్యూనతాభావాన్ని ఆధారం చేసుకుని చేసే మతాంతరీకరణ ప్రయత్నాలనూ రచయిత స్పృశించారు. ఎస్. పార్వతీదేవి కథ ‘మంచితనానికి కులమేమిటి?” కథ ‘దయాదాక్షిణ్యాలు ఉన్నవాడిదే అగ్రజాతి’ అని స్పష్టం చేస్తుంది. వసుంధర కథ ‘కులతత్వం’ ‘లేనిచోట కులతత్వాన్ని సృష్టించే సుపీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్న మేధావుల ‘అసలు రూపును ప్రదర్శిస్తుంది. ఈ కథ వివక్షత భావనకు మనిషిలోని ‘అహం’ కారణం తప్ప తత్వం కాదని స్పష్టం చేస్తుంది. ఏ కులమైతేనేమిటి? అందరూ బతికేది ఈ భూమిపైనే – అందరూ జీవనం గడిపేది పొట్ట కొరకే అన్న అద్భుతమైన సత్యాన్ని ప్రదర్శిస్తుంది. వి.ఆర్. రాసాని కథ ‘మెరవణి’. పట్టుదల, మొండితనం ఉన్నవాడిని “ఏం కులం?” అని అడిగే ధైర్యం ఎవరూ చేయరని, కుల సంకుచితత్వాన్ని అధిగమించేందుకు సమాజానికి కావాల్సింది ఈ తెగింపేనని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది చావా శివకోటి కథ ‘ఏం కులం?”

స్వాతంత్ర్యం సాధించి ఎన్నేళ్లయినా, కుల సంకుచిత భావనలు రూపుమాపటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వ్యక్తుల స్వార్ధాలు, అహంకారాలు, తొలగని న్యూనతా

భావనలు ఊడలమర్రిలా వ్యాపించిన ఈ సంకుచితత్వాన్ని తొలగించలేమేమో అన్న నిరాశాభావనను ప్రదర్శిస్తుంది చిలుకూరి దేవపుత్ర కథ ‘ఊడల మర్రి’. ఈ కథలో అంతర్లీనంగా కులభావన తొలగకపోవటానికి కారణం సూచించటం ఉంది. వ్యక్తులలో ఆత్మవిశ్వాసరాహిత్యం ఈ భావన తొలగదని సూచిస్తుందీ కథ. ‘కులం అంటే డబ్బు. కులం లేనోడంటే డబ్బులేనోడు’ అని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూ భవిష్య సమాజంలో చెలరేగే పలు వివాదాల స్వరూపాన్ని వివరిస్తుంది తోలేటి జగన్మోహనరావు కథ ‘కులం’. మారుతున్న సమాజాన్ని అనుసరించి మారే వ్యక్తులే మనగలరని, దానికి తగ్గట్టు కులవృత్తి స్వరూపాలూ మారతాయన్న పాజిటివ్ దృక్పధాన్ని ప్రదర్శిస్తుంది నందినీ సిధారెడ్డి కథ ‘కులకశ్పి’. ఎవరినో మెప్పించటం కోసం వారిలాగా మారటంకన్నా వ్యక్తి తనను తాను గుర్తించి ఆత్మవిశ్వాసంతో నిలిస్తే ఏ కులమైనా గౌరవం సాధిస్తాడని రాప్తాడు గోపాలకృష్ణ కథ ‘అతడు బయలుదేరాడు’ నిరూపిస్తుంది. కుల సంకుచితత్వానికి విరుగుడు ‘ఆత్మవిశ్వాసం’ అంటుందీ కథ. ఎన్. దాదా హయాత్ కథ ‘ఎల్లువ’ మనిషి స్వార్ధానికి అగ్రవర్ణం, అల్పవర్ణం లేదని, మనిషి స్వార్ధం ముందు అన్ని కులాలు ఒక్కటే అని నిరూపిస్తుంది. ఈ కథ కులం ఆధారంగా జరిగే రాజకీయాలనూ స్పృశిస్తుంది. జూకంటి జగన్నాధం కధ ‘కళేబరం’ సమాజంలోని సంధిదశకు అద్దం పడుతుంది. మారుతున్న సమాజంలో కులవృత్తుల భావన అంతమైనా పోని కుల భావనను ప్రదర్శిస్తుందీ కథ. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కధ ‘చనుబాలు’ అత్యద్భుతమైన కథ. మనిషి మనిషికీ నడుమ ఉన్న అనుబంధం సంకుచితత్వాలకు అతీతం అని నిరూపిస్తుంది. అంతేకాదు, అల్పవర్గాల జీవన మూలాల్లోంచి అస్తిత్వాన్ని పొందిన అగ్రవర్ణాల మనస్సాక్షిని చర్నాకోలతో కొట్టినట్టు కొడుతుందీ కథ. ఆడెపు లక్ష్మీపతి కథ ‘అన్యాపదేశమ్’ ప్రతిభ, అర్హత వంటి విషయాలను కూలంకషంగా చర్చించి ఆ భావనల్లోని డొల్లతనాన్ని చూపిస్తుంది.

మంజరి కథ ‘నిమిత్తమాత్రుడు’ ఎంత తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని కులం ‘నీడ’ను చూపిస్తుంది. ఇలాంటి కథే దగ్గుమాటి పద్మాకర్ కథ ‘లక్ష రూపాయల కథ’. వ్యక్తి ప్రలోభమే కులం కొనసాగింపుకు కారణం అని సున్నితంగా చూపుతుందీ కథ. నంబూరి పరిపూర్ణ కథ ‘ఎర్ర లచ్చుప్ప’ ఒక విశిష్టమైన కథ. ఈ కథలో రచయిత్రి పలు విభిన్నమైన అంశాలను స్పృశించారు. ప్రేమించి పెళ్ళాడినా తన జీవిత భాగస్వామిని తనతో సమానంగా చూడలేని అగ్రవర్ణపు వ్యక్తి దురహంకారాన్ని ప్రధానంగా ప్రదర్శించే కథ అయినా, భారతదేశంలో గతంలో రామానుజాచార్యుల సంఘసంస్కరణను ప్రస్తావించిన కథ ఇది. భారతీయ సమాజంలో కొన్ని దశాబ్దాలలో వచ్చిన సాంఘిక, ఆర్థిక, మానసిక మార్పులను ప్రదర్శిస్తుందీ కథ. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అన్ని వివక్షతలనూ అధిగమించి సమాజంపై తన ముద్ర వేయగలడని నిరూపిస్తుందీ కథ. జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి కథ ‘పంచన్‌లామా’ పాఠశాలస్థాయిలోని వివక్షతను చూపుతూ దాన్ని విద్యార్థులు ఎదుర్కొన్న వైనాన్ని ప్రదర్శిస్తుంది. తన బలాన్ని గ్రహించిన వ్యక్తిని ఎవరూ లొంగదీయలేరని చూపిస్తుందీ కథ. ‘అనాది-అనంతం’ కథ ఒకే సమస్యలోని మూడు పార్శ్వాలను చూపిస్తుంది. దృక్కోణంలోని వారు కరెక్టేనన్న అవగాహనను చూపిస్తూ ‘మంచి’ అన్నది సాపేక్షం అన్న సత్యాన్ని ప్రదర్శిస్తుంది. మనుషులు ఇతరుల దృక్కోణంలో చూడటం అలవాటు చేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని సూచనప్రాయంగా కలిగిస్తుందీ కథ. అంతేకాదు, తాను లబ్ది పొంది దాన్ని ఇతరులకు అందివ్వని స్వార్ధాన్ని కూడా ఈ కథ ఎత్తి చూపిస్తుంది.

సూర్య ప్రసాదరావు కథ ‘వాదమే వేదం’ ఆధునిక సమాజంలో కులభావ ప్రదర్శనే అభ్యుదయంగా ప్రచారమవుతూ వ్యక్తుల నడుమ అడ్డుగోడలు నిర్మించటాన్ని చక్కగా ప్రదర్శిస్తుంది. ఆధునిక సమాజంలోని సంకుచితాల స్వరూపాన్ని విప్పి చెప్తుంది. మానవతావాదాన్ని మించినదేదీ లేదని బోధిస్తుంది. వారణాసి నాగలక్ష్మి కథ ‘అమృతాన్ని సాధించు’, అమృతాన్ని సాధించే కన్నా ముందు భరించాల్సిన గరళ స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. అగ్రవర్ణస్తురాలిని వివాహమాడి కూడా ద్వేషాన్ని, న్యూనతాభావాన్ని వదలని మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుందీ కథ. అంబల్ల జనార్దన్ కథ ‘దండుగు’ రిజర్వేషన్ వల్ల లబ్ది పొంది ఎదిగి, ఇంకా ఎదగని తనవారికి చేయూతనిచ్చేబదులు వారిపట్ల వివక్ష చూపించే మనస్తత్వానికి ‘దండుగు’ (penalty) వేసే కథ. కొలకలూరి ఇనాక్ కథ ‘కాలేరా?’ ఒక కమ్మటి కలపై తెరతీసి ఆశాభావాన్ని ప్రదర్శించే విశిష్టమైన కథ. ఈ కథ ఒక స్వేచ్ఛాభావన, సుఖభావన, సౌందర్య భావన, సమన్వయ భావనను ప్రస్తావించే అద్భుతమైన కథ. ‘మేరెడ్డి యాదగిరి రెడ్డి’ కథ ‘తోలుబొమ్మలు’ వ్యక్తులలోని తీవ్ర భావనల స్వరూపాన్ని చూపిస్తుంది.

కస్తూరి మురళీకృష్ణ కథ ‘ఎక్స్‌పైరేషన్’ ఆధునిక సమాజంలో కులభావన వ్యక్తుల స్వార్ధానికి పాలయి, ఎలా కొందరి కెరీర్ ఎదగటానికి తోడ్పడుతోందో, తద్వారా సమాజంలో విచ్ఛిన్నకరమైన ఆలోచనలు చెలరేగి యువత భవిత నాశనమవుతోందో చూపిస్తుంది. ముఖ్యంగా సంకుచిత భావనలు, ద్వేషభావనలు వెదజల్లేవారిలో మతాంతరీకరణ చెందినవారు అధికం అని భగవద్గీత ఈ సమాజాన్ని రక్షించగలిగేదని ప్రతీకాత్మకంగా సూచిస్తుందీ కథ. మొలకలపల్లి కోటేశ్వరరావు కథ ‘రేయ్’ సమాజంలో ప్రతిభ పట్ల నెలకొని ఉన్న అపోహలను పటాపంచలు చేసే కథ. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని సూచిస్తుందీ కథ. యక్కలూరి వై. శ్రీరాములు కథ ‘దళిత బ్రాహ్మణుడు’ ఆధునిక సామాజిక పరిస్థితులకు, సమాజంలో నెలకొని ఉన్న అపోహలకు ముఖ్యంగా దర్పణం పడుతుంది. ఇదొక ట్రావెలాగ్ లాంటి కథ. సమకాలీన సమాజానికి ట్రావెలాగ్ ఈ కథ. మూరిశెట్టి గోవింద్ కథ ‘గంగమ్మ తిర్నాళ్లు’ ఏ రకంగా అగ్రవర్ణాలవారి క్రోధాలకు అల్ప వర్ణాలవారు పావులయి బలవుతున్నారో చూపిస్తుంది. ఇండస్ మార్టిన్ కథ ‘చేపముల్లు’ అల్ప వర్ణాలవారి చదువును వ్యంగ్యంగా చూపిస్తూ పనికిరారని పక్కన పెట్టినా అన్ని ప్రతికూల పరిస్థితులను దాటుకుని వారు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారో చూపిస్తుంది. రావుల కిరణ్మయి కథ ‘గంగిరెద్దు’ తలవంచనివాడి ముందు సమాజం తల వంచుతుందని, కులం కూడా తలవంచక తప్పదని నిరూపించే కథ. బొమ్మదేవర నాగకుమారి కథ ‘ఏమిట్లు?” వేరే దేశం వెళ్లినా మారని వివక్షతను కులం భావనను ప్రదర్శిస్తుంది. వసంతరావు దేశపాండే కథ ‘పెంటయ్య బాబాయి కథ అందరికీ ఎదురునిలచి పోరాడేవాడి పోరాటంలో ఎంత నిజం ఉన్న ఒంటరేనని చూపిస్తుంది.

సంకలనం కథల ఉపసంహారం కథ స్వామి రచించిన ‘నిన్నటి ఊపిరి. సమాజంలో సమస్య ఉంది. ఎంతసేపూ గతాన్ని తల్చుకుంటూ కూర్చుంటే సమస్య జటిలమవుతుంది తప్ప పరిష్కారం కాదు. కాబట్టి గతాన్ని వదలి ముందుకు సాగటమే శ్రేయస్కరం అని చూపిస్తుంది. ఎంత తవ్వుకుంటే అంత అయోమయం అని భారతదేశ dynamic history ద్వారా చూస్తుందీ కథ. తమ ఉనికిని గతంలో వెదుక్కుచూసినవారు అల్పజ్ఞులు అని స్పష్టంచేస్తూ గతాన్ని పట్టుకుని వ్రేలాడటం కాదు వర్తమానంలో బంగారు భవిష్యత్తుకు బీజాలు వేస్తూ ముందుకు సాగాలి అని సూచిస్తుందీ కథ. కులాన్ని రూపుమాపాలంటే గతాన్ని తవ్వుకుని లాభం లేదు. ఒకరినొకరు ద్వేషించి దూషించి లాభంలేదు. గతాన్ని మరచి ముందుకు కలసికట్టుగా సాగాలి. ఒకరినొకరు అర్ధం చేసుకుని, భేదభావాలను అవగాహన చేసుకుని సమన్వయంతో, ఒకరికొకరు చేయూతనిస్తూ ముందుకు సాగాలి. పైకి ఎదిగిన వాడు క్రింద ఉన్నవారిపట్ల తన బాధ్యతను గుర్తించి తనతోపాటు వారు ఎదిగేందుకు పాటుపడాలి. అయితే ఇదంతా సాధ్యం కావాలంటే కావాల్సింది ఆత్మవిశ్వాసం, నిజాయితీ అన్నది ఈ కథల సంకలనంలోని కథలు నిరూపిస్తాయి. ఆత్మవిశ్వాసం, నిజాయితి, నిస్వార్ధం కల సమాజమే అన్ని సమస్యలకు పరిష్కారం అని ఈ 42 కథల సంకలనం నిరూపిస్తుంది. ఈ కథల సంకలనం సమాజంలో ఒక ఆలోచనకు ఒక మధనానికి ప్రేరణ అవ్వాలని, ఆరోగ్యకరమైన చర్యలకు నాందీ ప్రస్తావన కావాలన్నది మా ఆశ.

ఈ సంకలనం తయారీలో అనుక్షణం వెంట ఉండి, పుస్తకాలు, సూచనలు ఇచ్చిన కె.పి. అశోక్ కుమార్‌కు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సంకలనం తయారీలో స్వేచ్ఛనిచ్చి నాణ్యమైన సంకలనాలు రూపొందటంలో చేయూతనిస్తున్న సంచిక వెబ్ పత్రిక సారథులు లంక నాగరాజు, కనక బైరాజు, భానుగౌడలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పుస్తకం సకాలంలో రూపొందటంలో సంపూర్ణ సహకారం అందించిన ఆనంద్, దుర్గలకు ధన్యవాదాలు. పుస్తకాన్ని ప్రచురిస్తున్న సాహితి ప్రచురణల ఎమెస్కో లక్ష్మి గారికి కృతజ్ఞతలు. కవర్ పెయింటింగ్ ను అందచేసిన బాబు దుండ్రవెల్లికి కృతజ్ఞతలు.

కులం అన్న పదానికున్న సంకుచితత్వాన్ని పరిహరించి విస్తృతార్ధంలో తీసుకుని తయారయిన ఈ సంకలనంపై మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపాలని ప్రార్థన. మా ఇతర సంకలనాలలాగే ఈ సంకలనాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ (సంపాదకులు).

***

కులం కథ (కథా సంకలనం)
ప్రచురణ: సంచిక – సాహితి ప్రచురణలు
పుటలు: 368
వెల: ₹ 250/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here