కుంబళంగి నైట్స్ : అతను రేమండ్ మేన్

0
7

[box type=’note’ fontsize=’16’] “పొరలు పొరలుగా వున్న కథనం, ఇతర ఇరవై మూడు నైపుణ్యాలూ వొక్క వీక్షణంలో గ్రహించడం కష్టమే. నేను బలంగా రెకమెండ్ చేస్తాను ఈ చిత్రాన్ని” అంటున్నారు పరేష్ ఎన్. దోషికుంబళంగి నైట్స్‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]చా[/dropcap]న్నాళ్ళకి సంతృప్తినిచ్చే సినెమా చూశాను. అది కుంబళంగి నైట్స్ అనే మళయాళ చిత్రం. మధు సి నారాయణన్ కి ఇది ప్రథమ ప్రయత్నం అంటే నమ్మలేనంత చక్కగా వుంది అతని దర్శకత్వం. ఇదివరకు అతను అసిస్టెంట్ దైరెక్టర్ గా పని చేసినప్పటికీ ఈ స్థాయిలో చిత్రం తీయగలగడం గొప్పే. ఇక కథా స్క్రీన్‌ప్లే శ్యాం పుష్కరన్ వ్రాశాడు. ఒక సారి కంటే యెక్కువ సార్లు చూస్తే మరిన్ని లేయర్లు చూడగలుగుతాము, అంత చక్కగా వుంది.

ఇక కథ విషయానికి వస్తే కేరళలోని వో చిన్న పల్లె కుంబళంగి. అక్కడి మనుషుల జీవిత గాథలు చెబుతూ సమాజంలో పురుషాధిక్యత అనండి మరొకటి అనండి అది ఎట్లా వుంది అన్నది చెబుతాడు దర్శకుడు. రెండు మూడు పాత్రల కథ చెప్పి మిగతా వారిని డమ్మీలగా చెయ్యకుండా ప్రతి పాత్రను వారి వారి స్వభావ వైచిత్రితో వివరంగా మన ముందు పెడతాడు. అంతే కాదు ఆ స్థలంలోని ప్రత్యేకతలు, అందాలు, విశేషాలు అన్నీ కథలో పూసలో దారం లా అల్లాడు. ఫ్రాంకీ అనే అబ్బాయి స్కాలర్షిప్ డబ్బులతో (అతను ఫుట్బాల్ ఆటగాడు) హాస్టల్లో వుంటూ చదువుకుంటూ వుంటాడు. శలవలు వస్తే ఇంటికి ప్రయాణం కడతాడు. అతని మిత్రుడు నేను కూడా వస్తానంటే లేదు మా ఇంట్లో అందరికీ మశూచి సోకిందని అబధ్ధమాడతాడు. కారణం ఇంట్లోని పరిస్థితులే. తండ్రి చనిపోయాడు. మొదటి భార్య కొడుకు సజి (సౌబిన్ షాహిర్), రెండో భార్యతో ఇద్దరు కొడుకులు బాబి (శనే నిగం), ఫ్రాంకి (మేథ్యూ తోమస్), ఆ రెండో భార్యకు ఇదివరకే వున్న కొడుకు బోణి (శ్రీనాథ్ భాసి). తండ్రి చనిపోయాడు. తల్లి సంసారాన్ని వదిలేసి ఆధ్యాత్మికతలో పడిపోయి చర్చిలోనే వుండిపోతుంది. ముగ్గురు అన్నదమ్ములు వొక ఇంట వుంటే, బోణి వేరుగా వుంటాడు. అయితే యెప్పుడూ సజి కి బాబి ల మధ్య గొడవలవుతూ వుంటాయి. ఇలాంటి ఇంటి వాతావరణం నచ్చకే ఫ్రాంకీ స్నేహితుడితో అబధ్ధం ఆడాల్సి వస్తుంది. వీళ్ళు వుండే ప్రాంతం వూరి బయట, చనిపోయిన కుక్కలవీ వదిలేసే చోటు.

మరో పక్క కాస్త మెరుగైన ప్రాంతంలో షమ్మి (ఫహాద్ ఫాసిల్) కొత్తగా ఆ ఇంటికి అల్లుడుగా వస్తాడు. అత్తగారు, భార్య, భార్య చెల్లెలు ఇతర సభ్యులు. మొదటి సారి అతను తెర మీద కనబడినప్పుడు అద్దం ముందు నిల్చుని తన మీసం మీద చేయి వేస్తూ అంటాడు : the complete man Raymond man అని. యెప్పుడూ డాబుసరిగా తయారై వుండడం, మాటిమాటికి మీసాలను నిమురుకోవడం, మాటలతో కాక తన నవ్వుతో అవమాన పరచడం, అవహేళనగా చూడడం చేస్తాడు. అలాంటి కొవ్వెక్కిన పురుష ప్రకృతి అతనిది. అతని క్రౌర్యం సగం ఇతర పాత్రల నడవడిక వల్ల కూడా తెలుస్తూ వుంటుంది. భార్య నంగి నంగి గా వుండడం, భయపడటం, అత్తగారు కూడా. వొక్క భార్య సిమ్మి (గ్రేస్ అంటొన్య్) చెల్లెలు బేబి (అణ్ణా బెన్) మాత్రం భయపడదు. షమ్మి ముఖం సీరియస్గానే వుంటుంది యెప్పుడూ, చాలా సార్లు పెదాల మీద ఎగతాళి చిరునవ్వు వుంటుంది. పెత్తనం యెలా చేస్తాడంటే వొకసారి అక్కా చెల్లెళ్ళు వంట గదిలో మాట్లాడుకొంటూ వుంటే కలగచేసుకొని యేం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. పర్సనల్ విషయాలు అని బేబి చెప్పినా వదలక పదే పదే అడుగుతాడు. అలాంటి వ్యక్తిత్వం.

బాబి పనేం చెయ్యకుండా రికామిగా తిరుగుతుంటాడు ప్రశాంత్ (సూరజ్ పాప్స్) అనే స్నేహితుడితో. అందంగా యేమాత్రం లేని ప్రశాంత్ కి వొక అందమైన అమ్మాయి సుమిష (రియా సైరా) ప్రియురాలు. బాబి కి ఇది నమ్మబుధ్ధి కాదు. సుమిష యెదుటే అతని అందం గురించి ఎగతాళిగా మాట్లాడితే, సుమిష ప్రశాంత్ ని నల్ల కళ్ళద్దాలు పెట్టుకోమని చెప్పి, ఇప్పుడు చెప్పు హీరో లా లేడూ అంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఎపిఫెని లాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో యెన్నో. బాబి, బేబి ప్రేమలో పడతారు. వారికి స్కూల్ రోజులనుంచీ పరిచయం వుంది. బాబి కుటుంబం క్రైస్తవ కుటుంబం. మరి పెళ్ళికి బావ (తండ్రి లేడు, ఇప్పుడు మగదిక్కు అతనే మరి) ఒప్పుకుంటాడా అని సందేహం. పధ్ధతి ప్రకారం తన అన్నను తీసుకుని వచ్చి బావతో పెళ్ళి గురించి మాట్లాడమంటుంది. ఆ క్రూరుడు ఒప్పుకోడు, పైగా అతనూ, అతని అనుచరుడూ అవమానకరంగా మాట్లాడుతారు. తమాషా యేమిటంటే బాబి వాళ్ళు చేపలు పట్టే వాళ్ళైతే, షమ్మి మంగలి పని చేస్తుంటాడు. కొంచెమే స్థాయి భేదం, కాని అహంకారానికి తక్కువ లేదు. వీళ్ళ పోరాటం ఇలా సాగుతుంటుంది.

సజి తన మిత్రుడు విజయ్ (రమేశ్ తిలక్) తో కలిసి ఇస్త్రీ పని చేస్తుంటారు. బాబి అంటాడు నువ్వు అతని శ్రమ మీద బతుకుతున్నావు, కష్టపడకుండా. దానికి బాధపడి విజయ్ తో చెబుతాడు ఇలా అంటున్నాడని. విజయ్ అది నిజమే కదా అనేసరికి దెబ్బతిన్న సజి గదిలో దూరి ఉరేసుకోబోతాడు. కంగారుపడ్డ విజయ్ ఇంటి పెంకులడాబా (సరైన పదం తెలీదు) ఎక్కి సజిని అంత పని చెయ్యొద్దంటాడు. ఈ లోగా కప్పు కప్పు విరిగి పడి ఆ ప్రమాదంలో సజి బతికిపోతాడు కాని విజయ్ చనిపోతాడు. అక్కడి నుంచి విజయ్ అంతర్ముఖుడైపోతాడు. మనసు కోసేసినట్టైపోతుంది. వెళ్ళి కడుపుతో వున్న విజయ్ భార్య సతి (షీలా రాజకుమార్) కాళ్ళ మీద పడిపోతాడు. ఆమె సమ్రక్షణా భారం మీద వేసుకుంటాడు. కాని మనస్సాంతి వుండదు. (చిదంబరంలో శంకరన్ (భరత్ గోపి) కి ఎదురైన పరిస్థితి లాంటిది). యేడిస్తే గుండె దిగులు తగ్గుతుందంటారు. కాని చుక్క కన్నీరు రాదు. చివరికి సైకియాట్రిస్ట్ ని కలవాల్సి వస్తుంది.

మరో జంట బోణి, నైలా (జాస్మిన్) అనే అమెన్రికా నుంచి వచ్చిన ప్రయాణీకురాలు. వాళ్ళకూ ఎదురవుతాయి కష్టాలు. ఇన్ని కథలు యెందుకు అవసరమొచ్చిందంటే సమాజాన్ని వొక microcosm లా చూపించి వేర్వేరు పధ్ధతుల అన్యాయాలను చర్చకు పెట్టడానికి.

యెప్పుడూ లేనిది ఈ సారి కథ చాలా వివరంగా చెప్పాల్సి వచ్చింది, తప్పలేదు మరి. పురుషాధిక్యత చూపించడానికి వెకిలి చిరునవ్వు తో షమ్మి సరిపోతాడు. కాని అది వొక మానసిక జాడ్యం గా ప్రకటించడానికి ఆ పాత్రను సైకో లా చూపించాడు. చివరికి అతను తన పంతం నెగ్గించుకోవడానికి ఇంట్లో వున్న స్త్రీలను కట్టిపడేసి, వచ్చిన బాబి అతని సోదరులతో కలబడతాడు. వాళ్ళందరూ కలిసి షమ్మిని బంధించి, ఆడవాళ్ళను విడిపిస్తారు. ఇప్పుడు ఆ మానసిక జాడ్యం ఆ పాత్రదా, లేక సమాజంలో కొనసాగుతున్న పురుషస్వామ్యమా? పరిపూర్ణ పురుషుడు అని షమ్మి అనుకుంటాడు. అతనికి కాంట్రాస్టుగా సజి ఇంట్లో బాధ్యతలన్ని నెత్తినేసుకుని, తమ్ముళ్ళకి తల్లి లోటు లేకుండా చూస్తాడు. యెలాంటి అహంకారమూ లేని, తప్పు జరిగినప్పుడు కుమిలి పోయి, వో ఆడదాని ముందు సాష్టాంగ పడి, తన వల్ల జరిగిన తప్పు ను సరిదిద్దడానికి బాధ్యతగా చేయగలిగింది చేస్తాడు. కాని తనని పరిపూర్ణ పురుషుడు అని చెప్పుకోడు. నలుగురు అన్నదమ్ములు అవివాహితులుగా వున్నప్పుడు తాగుతూ, తిడుతూ, దెబ్బలాడుకుంటూ వున్న; వాళ్ళ జీవితాల్లో స్త్రీలు వచ్చిన తర్వాత క్రమంగా మార్పు రావడం, వాళ్ళు మెత్తబడటం చూస్తాం. బేబి తన జీవితం లో వచ్చాక బాబి మారి వొక చేపల ఫేక్టరీలో పనికి కుదురుతాడు. ఇక ఆ ప్రేమలు యెలాంటివి? చాలా సహజంగా, సిగ్గు పడుతూ, దొంగ ముద్దుల గురించి వెంపర్లాడుతూ, దెబ్బలాడుకుంటూ, తప్పులను గ్రహిస్తూ, మారుతూ ఇలా నిజమైన మనుషుల లాగా. వొక జంట గురించి పైనే వ్రాశాను. దేన్ని అంతమొందించాలో దానితో పోరాటం, యేది గెలవాలో, నెగ్గాలో, మిగలాలో దాని కొరకు ప్రయత్నం.

ఇక కథ తెర మీద చెప్పిన తీరు ఎలాంటిది? నూరుపాళ్ళు దృశ్యమాన సినెమా. దాన్ని క్లుప్తంగా చెప్పలేను గాని అది చూసి ఆనందించాల్సిందే. శైజు ఖాలిద్ ఫొటోగ్రఫి చాలా బాగుంది. కేరళలో అందాన్ని చూపించడమే ధ్యేయంగా కాకుండా కథకు అవసరమైనట్టుగా, దర్శకుని దార్శనికతను అనుసరించి వుంది. వొక క్లోజప్, వొక పేన్, తర్వాత అదే సన్నివేశాన్ని దూరం నుంచో పైనుంచో చూపించడం. పాటల మధ్య అవకాశం దొరికిన ప్రతి చోటా కుంబళంగి స్థానానికి వున్న ప్రత్యేకతలు కెమెరాకెక్కించడం. దానికి పరిపూర్ణ సహకారం అందించిన సుషీన్ శ్యాం సంగీతం. మెత్తగా, వినసొంపుగా. ఆ గాయకులు కూడా చాలా మంచి గాత్రంతో మెత్తగా పాడారు. ఇక నటన గురించి చెప్పాలంటే అందరంటే అందరూ బాగా చేశారు. వైవిద్యమున్న పాత్ర కాబట్టి ఫాజిల్ ప్రత్యేకంగా కనబడతాడు. అతని నటన చాలా గొప్పగా వుంది, యెంత గొప్పగా అంటే అతని నీడలో సౌబిన్ షాహిర్ నటనను తక్కువ అంచనా వేసే పొరపాటు చేయగలడు ప్రేక్షకుడు. సజి పాత్ర సినెమా మొత్తం వొకేలా వుండదు. రకరకాల పరిణామాలు చెందుతూ చివరికి సైకియాట్రిస్ట్ దగ్గర్ సాంత్వన పొందుతాడు. పొరలు పొరలుగా వున్న కథనం, ఇతర ఇరవై మూడు నైపుణ్యాలూ వొక్క వీక్షణంలో గ్రహించడం కష్టమే.

నేను బలంగా రెకమెండ్ చేస్తాను ఈ చిత్రాన్ని. తొందరలో ఇది టైపాను, టైపోలుంటే క్షమించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here