ఆధ్యాత్మిక తృప్తిని కలిగించే ‘కుంభకోణం యాత్ర’

0
9

[dropcap]భా[/dropcap]రతదేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. కొందరు వీలైనప్పుడల్లా వివిధ రాష్ట్రాలలోని ప్రసిద్ధ ఆలయాలను, దేవీదేవతలను దర్శించుకుని తరిస్తారు. ఆ కొందరిలో మరికొందరు – తాము చూసి వచ్చిన ఆలయాల గొప్పదనాన్ని, అక్కడి దేవీదేవతల మహత్యాన్ని, ఆ ప్రాంతపు విశేషాలు వింతలతో తమ ఆప్తులతో పంచుకోవడం ద్వారా తాము చూసిన ఆలయాలను ఇతరులు కూడా సందర్శించేలా ప్రోత్సహిస్తారు. ఇంకొందరు తమకున్న ప్రతిభతో ఆ యా ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాలను రచించి పుస్తకాల ద్వారా మరింతమందికి ఉపయోగపడేలా చేసి, ఆ ఆలయాల సందర్శనకి దోహదం చేస్తారు. అటువంటి వారిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి. యస్. యమ్. లక్ష్మి ఒకరు.

తాను చూసిన ఎన్నో ఆలయాలను తన బ్లాగు ద్వారా, పత్రికలలో వ్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా వివరించి ఎందరినో ఆ ఆలయాలు దర్శించేందుకు ప్రేరేపించి తన లాగే ఎందరో ఆధ్యాత్మిక బాటలో నడిచేందుకు మార్గం చూపారావిడ. తాను సందర్శించిన పుణ్యక్షేత్రాల వివరాలను ‘యాత్రా దీపిక’ అనే శీర్షికతో పుస్తకాలుగా ప్రచురించి పలువురిని ఆలయాల బాట పట్టించారు.

అలాంటి వాటిలో ఒకటి ‘కుంభకోణం యాత్ర’ పుస్తకం. ఈ పుస్తకంలో తమిళనాడు లోని కుంభకోణంలో పలు ఆలయాల గురించి, వాటి విశేషాలను గురించి, ఆలయాల మహత్యం గురించి తెలియజేశారు.

మనకి తెలుగులో కుంభకోణం అనే పదం ప్రతికూల అర్థంలో స్ఫురిస్తుంది. ఎక్కడైనా ఏదైనా స్కామ్ జరిగితే.. ఫలానా కుంభకోణం అని వార్తల్లో వస్తుంది. దురదృష్టవశాత్తు, తమిళనాడులోని ఈ ప్రాంతం కూడా మోసాలకి పేరుపొందింది. అక్కడికి వెళ్ళవద్దని వారించేవారు కూడా ఉన్నారు. అయితే, ప్రతీదానికీ రెండు పార్శ్వాలున్నాట్టే, ఈ ఊరికి మరో ముఖం కూడా ఉంది. అద్భుతమైన ఆలయాలకు నెలవు. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.

ఈ ఊరిలోని ప్రముఖమైన ఆలయాలను సందర్శించి, తమ రచన ద్వారా పాఠకులను కూడా ఆలయ యాత్ర చేయిస్తారు రచయిత్రి.

తొలుత ఆది కుంభేశ్వరుడి ఆలయాన్ని దర్శించి ఆ గుడి చరిత్రని వివరించారు. గుడి ప్రాంగణపు విశేషాలు తెలిపారు. స్థానికంగా లభించే పట్టుచీరలు, ఇత్తడి కుందుల గురించి సందర్భానుసారంగా తెలియజేశారు.

తరువాత ఎంత పెద్ద రోగమయినా, స్వామివారి దర్శనంతో నయమవుతుందనే విశ్వాసం ఉన్న సోమేశ్వరాలయాన్ని దర్శించారు. వేంకటేశ్వరునికి అసురులని చంపే శక్తినిచ్చిన దేవుడు ఈ స్వామి. ఈ ఆలయంలో మురుగన్ పాదరక్షలతో ఉంటాడని తెలుపుతారు. ఈ ఆలయానిది చోళ రాజుల నిర్మాణ శైలి అని వివరిస్తారు.

కుంభకోణంలో ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో ప్రాదాన్యం వహించే ఐదు ఆలయాలలో ఒకటైన రామస్వామి ఆలయం గురించి తెలుపుతూ దీన్ని తంజావూరు రాజు రఘునాయకుడు నిర్మింపజేశాడని తెలిపారు. దక్షిణ అయోధ్య అని పేరున్న ఈ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ శిలలతో రూపొందించబడ్డాయి. ఈ ఆలయంలోని  రాముల వారి పాదల వద్ద ఆంజనేయస్వామి చేతిలో వీణ ధరించి ఉంటాడట. ఇది అరుదైన విగ్రహం అని వ్యాఖ్యానించారు రచయిత్రి.

శ్రీ వైష్ణవుల దివ్యదేశాలలో మూడవది కుంభకోణం లోని సారంగపాణి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించిన రచయిత్రి గుడి విశేషాలను తెలియజేశారు. ఈ ఆలయానికి ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం రెండూ ఉన్నా, ఉత్తర ద్వారం గుండా పవిత్ర దినాలలో మాత్రమే కాకుండా భక్తులు ఎప్పుడైనా దర్శనం చేసుకునే వీలుందని చెప్తారు.

తరువాతి ఆలయం – నాగేశ్వరరార్ కోవెల. భూభారాన్ని మోయలేక ఆదిశేషుడు శివుడిని శరణు కోరి ఆయన ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థించిన కారణంగా నాగేశ్వరరార్ ఆలయంగా పేరుపొందింది ఈ గుడి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మింపజేశాడు. చిత్తిరై మాసంలో మొదటి మూడు రోజులు సూర్యకిరణాలు స్వామి వారికి తాకడం ఈ ఆలయ విశేషం.

కుంభకోణం ఊరి మధ్యలో ఉన్న గుడి కాశీవిశ్వేశ్వరాలయం. ఈ గుడిలో ఉపాలయాలుగా తొమ్మిది నదీమ తల్లులకు గుడులు ఉండడం విశేషం. ‘మహామహం’ అని పిలువబడే ఈ ఆలయ పుష్మరిణి మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం.

మహామహానికి ఎదురుగా తూర్పున ఉన్న మరో ఆలయం – అభిముఖేశ్వరాలయం. ఈ క్షేత్రాన్ని నారికేశ్వరం అని ఎందుకంటారో తెలియజేశారు రచయిత్రి. ఈ తీర్థం చుట్టూ 16 అందమైన చిన్న చిన్న మండపాలున్నాయని వివరించారు.

కుంభకోణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది వైట్ వినాయగర్ ఆలయం. దేవతలు సముద్ర నురగతో చేసిన విగ్రహం స్వామివారిది. అందుకని తెల్లగా ఉంటుంది.  నురగతో తయారైన విగ్రహం కాబట్టి, స్వామివారికి వస్త్రాలు ధరింపజేయరు, పూలు పెట్టరు, అభిషేకాలు చేయరు, కేవలం పచ్చ కర్పూరం పొడి జల్లుతారు. ఈ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కుంభకోణం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఆలయం పట్టీశ్వరం. ఇది దుర్గామాత గుడి. ఈ ఆలయంలో అమ్మవారి వాహనం సింహం తల అమ్మవారి కుడి చేతి వైపు కాక, ఎడమ చేతి వైపు ఉండడం విశేషం. ఇక్కడే ఉన్న మరో ఆలయం ధేనుపురీశ్వార్ ఆలయం – శివుడి గుడి. భక్తుల పట్ల భగవంతుడి ఆదరాన్ని ప్రత్యేకంగా చూపే ఆలయమిది అని తెలిపారు రచయిత్రి. ఈ ఆలయపు ఇతర విశేషాలు, వివరాల కోసం పుస్తకం చదవాలి మరి.

ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే ఉన్న మరో ఆలయం తిరుసతిముత్రం. పార్వతి దేవి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన ప్రాంతం ఇదని చెబుతారు. ముత్తు పండాల్ ఉత్సవం ఊరేగింపు ఈ ఆలయం నుంచే ప్రారంభమవుతుంది. సఖ్యత లోపించిన భార్యభర్తలు ఇక్కడ పూజలు చేస్తే వారి మధ్య అభిప్రాయభేదాలు తొలగుతాయన్నది భక్తుల నమ్మకం.

కుంభకోణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని దారాసురంలో ఉన్న ఐరావతేశ్వరం యునెస్కో హెరిటేజ్ గుర్తింపు పొందిన ఆలయం. దుర్వాస మహాముని శాపం వల్ల తన నల్లగా మారిన ఐరావతం ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి తన తెలుపు రంగుని పొందిందని ఐతిహ్యం. అద్భుతమైన శిల్పాలున్న ఈ ఆలయ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలంటే అందుబాటులోని గైడ్‍లని ఉపయోగించుకోవాలని సూచించారు రచయిత్రి.

దారాసురం సమీపంలో బ్రహ్మన్ కోవెల్ అనే ఆలయం ఉన్నప్పటికీ అక్కడి ప్రధాన దైవం బ్రహ్మ కాదని తెలియజేస్తారు. వేదనారాయణుడు తన దేవేరులతో కొలువుతీరినది ఈ గుడి. ఇక్కడి బ్రహ్మ నాలుగవ ముఖం గాయత్రిదేవిగా కనిపించడం విశేషం.

తరువాత కుంభకోణానికి చుట్టు పక్కల 10 కి.మీ.ల లోపు దూరంలో వున్న  చక్రపాణి ఆలయం, ఆది వరాహ స్వామి ఆలయం, సారనాధ ఆలయం, తిరుచెరి, నాచియార్ కోయిల్, ప్రత్యంగరా దేవి ఆలయం, తిరు నాగేశ్వరం (రాహు ఆలయం), ఉప్పు తినని ఉప్పిలియప్పన్ ఆలయం, మహాలింగేశ్వరస్వామి, తిరువిడైమరుదూర్, తిరు భువనం; స్వామిమలై, సూర్యనాధార్ ఆలయం, కరుంబై వినాయగర్, సుందరేశ్వరస్వామి ఆలయం, పెట్టికాళి అమ్మన్, తిరుపడల వనం, మహాకాళి ఆలయం, సెట్టి మండప, బాణాపురేశ్వరార్, బాణాదురై, దశావతార ఆలయం దర్శించారు రచయిత్రి.

ఈ విధంగా కుంభకోణం లోని ప్రముఖ ఆలయాలను సందర్శించి వాటి వింతలు, విశేషాలను, మహిమలను వెల్లడించారు రచయిత్రి.

వీటన్నిటి విశేషాలను సమీక్షలో రాసేస్తే పాఠకులు కుతూహలం కోల్పోయే అవకాశం ఉంది. అందుకని పుస్తకం కొని చదవవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

అత్యంత ప్రాచీనకాలం నాటి ఆ ఆలయాల సందర్శన ద్వారా మన పురాణాల గురించి కూడా కొంత తెలుసుకోగలిగామని రచయిత్రి అన్నారు.

అంత పెద్ద దేవాలయాలు, ఆ దేవతామూర్తులు, ఆ శిల్ప సంపద, ఎంత చూసినా తనివి తీరలేదని; మన భారత దేశ వైభవాన్ని నలుగురికి పరిచయం చెయ్యాలనే తన చిన్ని కోరికకి ప్రతిరూపం ఈ పుస్తకమని అన్నారు రచయిత్రి.

***

కుంభకోణం యాత్ర (యాత్రా దీపిక-8)
రచన: పి.యస్.యమ్. లక్ష్మి
పుటలు: 128
వెల: ₹ 120.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత్రి: 9866001629
ఆన్‌లైన్‌లో తెప్పించుకునేందుకు
https://books.acchamgatelugu.com/product/kumbhakonam-yatra
https://www.amazon.in/Yatra-Deepika-8-Kumbhakonam/dp/B01LZ5SSOH/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here