కుందేలు – పెసరట్లు

0
6

[box type=’note’ fontsize=’16’] నక్క దురాలోచనని గ్రహించి ఎత్తుకు పై ఎత్తు వేసి దాని పీడ వదిలించుకున్న కుందేలు గురించి చెబుతున్నారు శంకర ప్రసాద్కుందేలు – పెసరట్లు” అనే ఈ బాలల కథలో. [/box]

[dropcap]అ[/dropcap]డవిలో కుందేలు ఆనందంగా గడుపుతున్న రోజులవి. చక్కగా తన ఇంటి ముందు చిన్న పొలం వేసుకొని అందులో పెసర చేను పండించింది కుందేలు. అందులో పండిన పెసర్లతో రోజూ కమ్మటి నేతి పెరట్లు వేసుకొని తినేది కుందేలు.

ఇలా నేతి పెసరట్లు వేస్తుంటే ఆ కమ్మటి వాసనకి అటుగా వెళ్తున్న గుంట నక్క కుందేలు ఇంటికి వచ్చి ” అల్లుడూ ఏంచేస్తున్నావ్ ఇంత మంచి వాసన వస్తోంది” అని అడిగింది. అప్పుడు కుందేలు “నేతి పెసరట్లు వేస్తున్నా నక్క మామా” అని చెప్పి రెండు నేతి పెసరట్లు నక్కకి ఇచ్చింది. నక్క ఆ రెండూ లొట్టలు వేసుకుంటూ తిని “ఆహా దీని రుచి వర్ణించడానికి పది నాలుకలు కూడా సరిపోవు అల్లుడు, ఇవి నాక్కూడా రోజూ పెట్టు” అని అడిగింది. కుందేలు సరే అని చెప్పి రోజూ నక్కకి కూడా పెసరట్లు ఇస్తూ ఉంది.

ఎంతైనా నక్క జిత్తులమారి, దుర్మార్గురాలు. దానికి దుర్బుధ్ధి పుట్టింది. ఇంత రుచికరమైన పెసరట్లు రోజూ ఈ కుందేలు తింటుంది అంటే దాని మాంసం ఇంకెంత రుచిగా ఉంటుందో కదా, మాయ మాటలు చెప్పి ఈ కుందేలుని తినేస్తాను అని దురాలోచన చేసింది.

ఒక రోజు యథావిధిగా నక్క కుందేలు ఇంటికి వచ్చి, పెసరట్లు తిని, ” అల్లుడూ రోజూ నువ్వే నాకు పెసరట్లు పెడుతున్నావు, ఈ రోజు రాత్రికి నువ్వు నా ఇంటికి రా, నీకు రుచికరమైన పుట్ట గొడుగుల పులుసు పెడతాను” అంది. కుందేలుకి పుట్ట గొడుగులు అంటే ఇష్టం, తప్పకుండా వస్తుంది, అప్పుడు దాన్ని తినేయొచ్చు అని ఎత్తుగడ వేసింది. పుట్టగొడుగుల పులుసు అనగానే కుందేలుకి నోట్లో నిమ్మకాయ పిండినంతగా లాలాజలం ఊరింది. ఇక ఆలోచించకుండా సరేనంది. నక్క వెళ్ళిపోయింది.

తరువాత కుందేలు తన ఇంటి ముందు మామిడి చెట్టు కింద హాయిగా నడుం వాల్చి ఆలోచించసాగింది. ఇది అసలే చల్లటి చలికాలం. పుట్టగొడుగులు తొలకరి వానలు వచ్చినప్పుడు కదా పుడతాయి, ఈ నక్క నాకు మాయ మాటలు చెప్పి చంపాలనుకుంటుంది అని గ్రహించింది. ఎలాగైనా ఈ జిత్తులమారి నక్కకి గుణపాఠం చెప్పాలనుకుంది. తీవ్రంగా ఆలోచించిన తరువాత కుందేలుకి ఉపాయం తోచింది. వెంటనే తన పథకం అమలు చేయటానికి లేచి, నక్క ఇంటికి వెళ్ళే దారిలో ఓ పక్కగా పెద్ద గొయ్యి తవ్వి, అందులో తుమ్మ ముళ్ళు, ఈత ముళ్ళు వేసి మీద ఆకులతో కప్పింది.

సాయంత్రం నక్క ఇంటికి కుందేలు బయలుదేరి వెళ్ళింది. నక్క కుందేలు కోసం ఎదురు చూస్తోంది. కుందేలు రాగానే “రా  అల్లుడు, పుట్ట గొడుగుల పులుసు తిందువు గాని” అంది.  అప్పుడు కుందేలు “నక్క మామా పులుసు సంగతి అలా ఉంచు, నేను వస్తుంటే దారిలో బాగా బలిసిన అడవి కోళ్ళు కనిపిపించాయి, అవి నీకు ఇష్టం కదా, ఆ సంగతి నీకు చెబుదామని వచ్చాను” అంది.

అడవి కోళ్ళు అనగానే నక్క నోట్లో నారింజ కాయ పిండినంతగా లాలాజలం ఊరింది. వెంటనే “పద అల్లుడు, అడవి కోళ్ళు చూపించు” అంది నక్క.

కందేలు నక్కని తను తవ్విన గోతి వద్దకు తీసుకెళ్ళి “మామా కోళ్ళు ఈ గోతిలోనే ఉన్నాయి, నువ్వు అందులో దూకి వాటిని గబాల్న పట్టేసుకో” అంది. నక్క నోరు చప్పరించుకుంటూ ఒక్కసారిగా గోతి లోకి దూకింది. అంతే, తుమ్మ ముళ్ళు, ఈత ముళ్ళు ఒళ్ళంతా గుచ్చుకొని నక్క చచ్చింది. కుందేలు ఉపాయంతో అపాయం తప్పించుకుంది.

ఉపకారం చేసిన వారికి అపకారం తలపెడితే జరిగే పరిణామం ఇంతే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here