కుసుమ వేదన-23

0
10

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

షష్టాశ్వాసము – రెండవ భాగము

ఉ.॥
దండిగ నట్టి వేళలను దారుల వెంబడి నాగమించగన్
మెండుగ వచ్చి చేరెనుగ మేధిని యందున వేడ్క మీరగన్
కొండొకచో మరిప్పుడును కోలల నృత్యము సల్పుచుండగన్
ఖండిత రీతి సోమవరు కాగల కార్యము దీర్చడే ధరన్. (466)

చం.॥
కదలెను దారులన్ కదిలి కన్నుల కింపుగ సాగెనీ ధరన్
సదమల రీతిగన్ వెడలి సవ్య గుణంబుల బాతి సాగగన్
అదరె సమస్య గుండియలు ఆ దర మండెడి చోటు కానగన్
బెదురును లేక మంచి పని బేలగ చూపులు మాని యీ ధరన్. (467)

తే.గీ.॥
అటుల దారులెంబడి సాగె నాదరమున
పిన్న పెద్దలు యువకులు మిన్నగాను
మిగుల కేరింతలొందుచు మేలు మేలు
యనుచు పెద్దగ యరచుచు నాదరించె. (468)

తే.గీ.॥
అటుల నూరేగి గ్రామంపు అరుగు చెంత
ఆలయపు దాపుకై వచ్చె నంతలోనె
గ్రామ కాపులు పెద్దలు గౌరవింప
సోమరాజును గుడిలోకి సొచ్చెనంత. (469)

చం.॥
వెలుపల మేళతాళములు వేడుక మ్రోగుచునుండ నాపుడున్
అలుపును దీర్చ సోముడును అంతట నిల్చెను ఆలయంబునన్
పొలుపుగ గ్రామకాపులును పోడిమి తోడిత నారికేళమున్
కొలుపును జేయకుండ మరి కొట్టయటంచును యిచ్చెనత్తరిన్. (470)

చం.॥
మనసున దైవమున్ దలచి మక్కువ మీరగ సోమరాజు; యా
దినమున స్వంత గ్రామమున ధీటుగ సాగను వచ్చెనందునన్
పనిబడి దేవలంబునను ప్రార్థన చేసెను గొప్ప భక్తితో
గొనగని దైవమున్ దలచి గోరెను జాతిని రక్ష జేయుమా. (471)

సీ॥
కూర్మితో నప్పుడున్ కుంకుమ నందివ్వ
ఫాల భాగంబున పదిల పరచె
తన యూరి దైవాన్ని తలచుకొంచును వేగ
కొబ్బరికాయను కొట్టెనపుడు
గ్రామస్థులందరున్ ఘనముగా గొల్చెడి
దైవమున్ మనసులో దలచుకునియె
ఊరివారల కంత నుత్సాహ మొనరించు
కార్యంబు జరుగగా కాంక్ష సల్పె

తే.గీ.॥
యట్టి సమయంబు నందున యమిత గుణుడు
దైవము దల్చెనా వేళ ధాటిగాను
మాదు కులమున కెప్పుడు మరిచిపోని
మంచి చేకూర్చుమంచును మదిని దలచె. (472)

తే.గీ.॥
తిరిగి వేదిక వద్దకు తీసుకొచ్చి
పైకి నెక్కించె నెంతయు పాడిగాను
సరిగ మ్రోగించె కరతాళ శబ్ద సరళి
ఎంత ఎదిగెనొ మన వూరి సొంత మనిషి. (473)

తే.గీ.॥
అంత నారంభ మాయెను సుంతయైన
జాగు లేకను జరిగెను జనులు నంత
సేపు నిశ్శబ్ద దీక్షతో సేద దీరె
ఏమి జెప్పునో విందము ఈ విధంబు. (474)

ఉ.॥
ముందొక రిద్దరున్ పలికె ముచ్చట గొల్పగ సంతసంబునన్
కందువ మాటలన్ విడిచి కౌతుక రీతుల నాశజెందు; యా
సందడి జేయువారలను శాంతిని గూర్పగ మాటలాడె; యా
నందము గూర్పగన్ మదికి నచ్చెడి రీతిని సోమరాజుయున్. (475)

కం.॥
ముందుగ వచ్చిన వారలు
నందరు జూసిరి కలెక్టరప్పుడు పలికెన్
డెందము నందున గొలువగ
నందరి బాధలను వినుచు నప్పుడు లేచెన్. (476)

చం.॥
వినుమిక దెల్పెదాను మరి వీనుల యందున వింత గొల్పగన్
వినయము తోడ మీరు పడు యిక్కటులన్నియు విన్నవించితిన్
కనుమిక నాదు వర్గ ప్రజ కానని బాధల చిక్కి శల్యమౌ
మనమున జాలి నొంది మరి మానక నన్నిటు బంపె మంత్రియున్. (477)

సీ॥
తెల్లవారక ముందె తేలె సంద్రము పైన
ఏ పాటి మర్మంబు లెరుగలేరె
ఆ యుప్పు నీళ్ళలో ఆయుష్షు తగ్గినా
లెక్క లేక బతుకు ఎక్కడున్న
చేప బట్టెడి జాతి చేపట్టదే కుట
ముత్యమంత స్వచ్ఛ ముఖులు వీరు
మాయ మర్మమెరుగ మత్స్యాల గ్రహణంపు
కులము వారు మిగుల కూర్మి లేక

తే.గీ.॥
ఎన్ని వర్షంబులీ భూమి పన్ను గాను
వృద్ధి లోనికి రాగను వీలులేక
ఆయఖాతంబునందునే అలమటించ
ఏమి కర్మమొ తెలియదు నీ విధంచు. (478)

తే.గీ.॥
అట్టి ప్రజలకు సాయంబు నందజేయ
వలయునని పల్క ఆయన వత్సలమున
పోయి చేయుము శీఘ్రమే పూని వేగ
నీకు అనుమతి నిస్తిని నిజము గాను. (479)

తే.గీ.॥
నేను మీ వాడ నంచును నిపుడు వేగ
మీదు బాధల నన్నిటి మిగుల దీర్తు
నాకు దెల్పుడి నయముగ నాదు పరిధి
నున్న వాటిని దీర్తును ఉన్నతముగ. (480)

తే.గీ.॥
అని ఆనంద పరవశ మందివారు
వేగ తమదగు కష్టంబు ఏకరీతి
పలికి నారంత యా వేళ పనులు విడిచి
నిలిచినందుకు మంచియే నిటుల జరిగె. (481)

తే.గీ.॥
అనుచు తలపోసి వారలు మనసున అట్టులంచు
మనదు కొమరుడు మనకిట్లు మరువకుండ
కొంత మేలును కూర్చును కూర్మి తోడ
ఎంచి రాగను మనమంత అంచితముగ. (482)

తే.గీ.॥
ఎదురు నిలువగ కదలేము వేడుకలర
అదియు నతనికి కలిగెను ఆత్మయందు
ఇంక మన బత్కులంతయు ఈ విధంబు
మిగుల నానంద మందుచు మింట నిలచు. (483)

తే.గీ.॥
మ్రోగె కరతాళ ధ్వనులంత మిక్కుటముగ
సాగెనా వేళ జనమంత సంతసమున
రేగె వారికి మనసున రెక్కలిడిచి
పోగ కోర్కెలు హెచ్చెను ప్రోది మీర. (484)

తే.గీ.॥
అహహ ఎంతటి మాటల నాడినాడు
ఎంత కాదన్న మన వూరి చింతబాప
వెడలి వచ్చిన మన వాడి వెంట నిల్చి
విన్నవించెద మంచును వీనులలర. (485)

తే.గీ.॥
ఊరివారల నందరున్ ఓర్మి నిల్చి
పెద్ద లొకరిద్దరప్పుడున్ బేర్మి తోడ
ఉన్న కష్టము లన్నియు విన్నవించ
పైకి లేచిరి జెప్పిరి బాధలెన్నో. (486)

తే.గీ.॥
అయ్య మా వూరి మధ్యన అపుడు నీవు
బుట్టి బెరిగిన మనిషని పుడమి లోన
మనదు గ్రామంబు నుండెడి మందగమన
మైన యిబ్బందు లన్నింటి మార్పు కొరకు. (487)

తే.గీ.॥
నీవు అరుదెంచి నావని నిక్కము గను
నమ్మి యుంటిమి మేమంత నమ్మకముగ
నీకు దెల్పెద మన జాతి నిజముగాను
యిన్ని కష్టములన్నిట యిడుమలరసి. (488)

తే.గీ.॥
ముందుసాగుట దెలియక ముఖ్యముగను
జీవితం బంత యిడుమల జిక్కి మేము
బతుకు బండిని లాగను గతుకు దారి
మీద దొరలచు పొరలుచు మేది నందు. (489)

చం.॥
ఇసుకతొ నిండియున్నదియు ఈ దినమందున దారులన్నియున్
మసనము నందు మేము మరి మార్గము నందునే సంద్రతీరమున్
విసుగును బొందకుండగను వీపుల మీదను సద్దికూడుతో
పసితన మందు నుండి యిటు ప్రాణంబు పోయెడి రోజు నంతకున్. (490)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here