కుసుమ వేదన-26

0
13

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

షష్టాశ్వాసము – అయిదవ భాగము

తే.గీ.॥
అపుడు ఆనంద సాగర మందు గుసుమ
మున్గిపోగను కొలకుల మూలమందు
కరగిజారెను బాష్పముల్ కాలువగను
మిగుల యానంద భరితయై మిగిలిపోగ. (541)

తే.గీ.॥
అంత కరతాళ ధ్వనులును మారుమ్రోగ
సుంత చెలరేగి యంతట శోభితముగ
నిలచి సాగెను వెల్లువై నీరమటుల
సుడులు దిరుగుచు త్రుళ్ళుచు స్థూలముగను. (542)

తే.గీ.॥
భళిర కుసుమాంబ చేసిన భాగ్యమేమొ
దొడ్డ కొమరుని గన్నది; దోసిలొగ్గి
సేవ గురిపించు దనయుడు; చేతులొగ్గి
ప్రజల నీరాజనాలందు ప్రాజ్ఞుడితడు. (543)

తే.గీ.॥
అనుచు జనులంత గొనియాడ మనమునందు
తల్లిదనయులు యా వేళ చల్లగాను
నూరు ఏండ్లకు సంతోష నుత్సహించి
చేరి నిలువంగ జాతియు చెన్నమీర. (544)

వచనం॥
అప్పుడా గ్రామ కాపులానంద సాగరంబున దేలియాడుచు తమ బురంబున కరుదెంచిన స్వకులీనుండైన యా సోమరాజును యిచ్ఛారీతిని సన్మానించి సత్కారంబులొనర్చిన బిదప. (545)

కం.॥
అందరు లేచిరి యప్పుడు
ముందరగా నడచె తాను ముదమున్ మీరన్
అందరు యిక్కడె భోజన
మందుడి నేనిపుడు మాదు మాతను గాంతున్. (546)

తే.గీ.॥
అనుచు నూరికి తూరుపు సందునున్న
స్వంత యింటికి జనుదెంచ స్వాభిమాన
పరవశంబున తల్లిని పలుకరించ
అడుగు ముందుకు సాగించె నాత్రపడుచు. (547)

కం.॥
ఎప్పుడు జేరెనొ తెలియదు
నప్పుడు తన కొడుకు కొరకు నాత్రము తోడన్
యిప్పుడె యింటికి బోదును
తప్పక తన కొడుకు వచ్చు తల్లిని కనుకన్. (548)

చం.॥
సరగున తల్లికిన్ సుతుడు సాగిల రీతి నమస్కరించగన్
పరి పరి రీతులన్ దలచి ప్రార్థన జేసెయటంత లోపునన్
మరి మరి వేడెయా తనయు మానక నిల్చిటు తల్లి ముందరన్
పరుగున జేరె యాదరికి పాలెపు వాసులు యంతటప్పుడున్. (549)

మ.॥
తన వక్షంబుల పైన యాడినటు పుత్రాత్ముండు యీ లాగునన్
తన పాదంబుల మీద వాలగను యాత్రంబున్ మదిన్ చేకొనన్
వినయంబొందగ నాదు నందనుడు నీ వీధంబుగా జెల్లెనే
యనగన్ యచ్చెరువంది నిల్చెగద నీయాశ్చర్యమేమందుమో. (550)

ఉ.॥
అప్పుడు తల్లి బ్రేమ బహు యచ్చెరువందగ నుబ్కిరాగ; యా
గొప్ప క్షణాల లోపలను గూరిమి తోడుగ గర్భవాసమున్
చెప్పగ మాట రాదు యిక చేయునదేమియు లేక నంతటన్
అప్పుడె కారె కన్నులలొ యాకలిదప్పులు మర్చెనంతటన్. (551)

సీ॥
తన కన్నులందున తప్పక జారెను
రెండు బొట్లునపుడు ఖండితముగ
జన్మనిచ్చిన తల్లి జాతి కిదియెనేమొ
ఋణమంచు దలచెను రూఢిగాను
విద్య నేర్పిన యట్టి విజ్ఞాని సంఘంబు
కిదియేమొ భాగ్యంబు ఇటుల నరసి
తన రెండు చేతులన్ దప్పక దీవించె
యింత మంచి క్షణంబు ఇకను రాదు

తే.గీ.॥
యనుచు యా తల్లి దీవించె యనవతరము
వంశ కీర్తిని నిలబెట్ట వాసి గాంచె
దావు తప్పక గొనియాడు తరతరంబు
భళిర నా కొమరు నిను గన్న భాగ్యమునకు. (552)

వచనం॥
అటుల దన పాదంబుల చెంతనే కూర్చుని యున్న దనయుని హస్తంబులతో బైకి లేపి హృదయ కమలంబుల కత్తుకొనియె. బిదప తన కొరకై సిద్ధం చేసుకొన్న రాగి యంబలిలో చేదరాకును, గోంగూరను చేర్చి వండిన కూరను వడ్దించెను. అప్పుడా సోమరాజు యా రాగి యంబలిని అమృతోపమానంబుగా భుజించుచుండ, యాతని ననుసరించి వచ్చిన క్రింది స్థాయి యధికారులునూ, గ్రామవాసులును ఆశ్చర్యచకితులై నిలుచుండి యిటుల తలపోసె. (553)

సీ॥
పంచభక్షంబుల భక్షించు యధికారి
ఈ రాగి యంబలి నెటుల దాగె
ఏ వేళ యందునన్ ఏసిలో నుండును
ఈ చిన్న గుడిసెలో ఎటుల నుండె
తనవారు పనివారు తప్పక నుండగా
ఈ రీతి నొంటరి ఎటుల నుండె
గాలి లేదు సరిగ గాలి పంకయు లేదు
యిటుల నుండగ నిప్పుడెటుల తరము

తే.గీ.॥
ఇంత పెద్ద కలెక్టరు ఎటుల యింత
చిన్న గుడిసెను గూర్చుని ఎన్నడైన
నీళ్ళు త్రాగుట చూడము నిజము నిజము
వింత గాకను యిదియును ఎంత బాగు. (554)

తే.గీ.॥
అనుచు యా వేళ యందరు నచ్చెరువున
సంభ్రమాశ్చర్య చకితులై సదరు వేళ
తేలియాడుచు నుండిరి తిన్నవరకు
వారి వదనంబు లంతయు వాడిపోగ. (555)

ఉ.॥
అంతట సోమరాజు దన యాటలపాటల దేలియాడగన్
చెంతనె యుండునట్టి దరి చేరుద మిప్పుడు సంద్రతీరమున్
సుంత క్షణంబు జేరి మది సొంపుగ మానసమందు నింపగన్
ఇంత సుదూర ప్రాంతమున కెప్పుడు వత్తుమొ పోదమిప్పుడున్. (556)

ఉ.॥
అంతట బైలుదేరినవి యా బహు చక్కని కారులన్నియున్
చెంత సముద్ర తీరమును చేకొని జూసెడి భాగ్యమొచ్చెగా
ఎంతయొ మానసంబునకు యీ విధ మోదము చేరగా ధరన్
కొంతగు కాలమంతయును కొల్లగ సాగర మేడ్క జూడమే. (557)

తే.గీ.॥
అటుల సాగర దీరంబు నందు దిగిన
సోమరాజు వేగమె సొంపు మీర
నచటి పడవల తెప్పల యందు జేరి
చిన్ననాటిది యైనట్టి చేష్టలన్ని. (558)

తే.గీ.॥
మనసు పొరలందు దాగిన మాటలన్ని
యగ్గి పర్వత లావాల యట్లు బహికి
తన్నుకొని వచ్చెయనునట్లు తప్పకుండ
వారితో దెల్పెనీ రీతి వరుసక్రమము. (559)

ఉ.॥
చిన్నగు నాడు నేను యిట చిందులు వేయుచు నాట లాడగన్
చెన్నల లార గూడితిని జిల్లర చేష్టల జేసితీరితిన్
ఎన్ని విధంబులన్ కలల తీరుల బొందితి నన్ని రీతులన్
నన్నిటు బెంచినట్టి బ్రియనాయక సాగర యంజలించెదన్. (560)

ఉ.॥
గుజ్జన గూళ్ళు గట్టితిని గుంపుగ జేరుచు నాటలాడగన్
మజ్జన కుండు లేక మరి మాన్యులె నన్నిటు యాదరించగన్
బజ్జగ చేసి నన్ను మహి నొంటరిగా యిటువంటి బాధలన్
సజ్జన నాథులంత మన సందున బ్రోవగ నిట్లు నుంటినే. (561)

సముద్రాన్ని ఉద్దేశించి సోమరాజు

ఉ.॥
ఓ మహిమాన్వితంబగుడు యోర్పు వహించెడి వార్ధి రత్నమా
నీ మహి నీదు సన్నిధిని నిల్వగ గోరిన సజ్జనావళినన్
క్షేమము గోరుమా తనదు క్షేత్రము లంతయు నిక్కడే సుమీ
ఈ మహి యందు మాదు జన సేమము గోరితి; నీకు మ్రొక్కెదన్. (562)

ఉ.॥
చేపలు పట్టుటే బ్రతుకు చేరి సముద్రపు తీరమందునన్
రేపును మాపులంచు మరి రెప్పలు వేయక నిట్టి బత్కులన్
కాపు వహించి సాగరమ గన్నది భూమిని మమ్ములందరిన్
వీపున జేర్చి పెంచితివి విజ్ఞతతో మది నిల్పి మ్రొక్కెదన్. (563)

ఉ.॥
జేకొను నాదు ప్రార్థనయు చెల్లెను నాదు ఋణానుబంధమున్
వేకొని నిల్చి వేడితిని వందనమో యిల రక్ష జేయుమా
ఆకొని యుండు జాలరుల నక్కున జేర్చి యొసంగు సంపదల్
నీకు నమస్కరించెదను నిర్మల రీతిని యుండు మెప్పుడున్. (564)

ఉ.॥
పరుల హితార్థమై భువిని పాలన జేయగ నిల్చి యుంటివే
ఒరులకు వారి క్షేమమును ఓరిమి తోడుత కూర్చి గావుమా
అరయగ నిన్ను వేడితిని అందరి మన్నన లందునట్లుగన్
సరగున వారిగావు మిదె చయ్యన వేడితి శాంతి నొందుమా. (565)

ఉ.॥
ఈ జలమందునే యసుపు లించుక బాసెను నాదు తండ్రియు
న్నీ జలమందునే వసుధ నీళ్ళను బాయగ బోయె భావియున్
ఓ జలనాథ; నీ మదిని ఓర్మి వహించిటు గావు మెల్లరన్
రాజిత కీర్తి చంద్రికల రంజిల జేయుము ఓ మహా ప్రభో! (566)

ఉ.॥
నీ పద ముంగిటన్ నిలచి నీ సుపదార్థములార గించితిన్
నీ పద సన్నిధిన్ గరపి నిక్కము నేర్చితి గొప్ప విద్యలన్
యాపద దాపు జేరకను యైనటు వారల గాపు గాచెదన్
రేపును మాపులన్ నిలతు లెక్కకు మిక్కిలి వాస్తవం బిలన్. (567)

తే.గీ.॥
మరల నింకొక సారి నే మరచిపోక
వందనం బిదె తల్లిరో వాంఛ మీర
నాదు జాతుల నెల్లను మోదమలర
గాచి రక్షించు మ్రెక్కెద గారవమున. (568)

తే.గీ.॥
అనుచు సోమరాజు యునప్పుడార్తి తోడ
తనదు కరముల మ్రోడ్చుచు తన్మయమున
కడలి తల్లికి మ్రొక్కెను కావుమనుచు
మరల ప్రార్థించె నాతండు మౌనముగను. (569)

తే.గీ.॥
వెళ్ళి వత్తును తల్లిరో వేగముగను
నాదు ఉద్యోగ ధర్మంబు నవధరించ
పోవు చుంటిని దీవించి పొలుపు మీర
నన్ను నాదగు వర్గంబు నాదరించు. (570)

వచనం॥
అనుచు వెనుదిరిగి కారునెక్కి జిల్లా కేంద్రంబునకు బోయెడి సోమరాజును గని యా గ్రామ ప్రజానీకమెల్లరునూ రహదారి కిరువైపులా నిల్చి దండ ప్రమాణంబు లాచరించి రంతట. (571)

కం.॥
మనయూర బుట్టినాడగు
మన మధ్యనె బెరిగెనపుడు మహిలో మిగులన్
ఘనమైన విద్య నేర్చియు
వినయంబును పాదుకొలిపె విజ్ఞత మించన్. (572)

కం.॥
భళిరా ముద్దు కొమారా
భళిరా మా జాతి తనయ పదుగురు మెచ్చన్
భళిగా చదువులు చదువుచు
భళిగా నుద్యోగ్య క్రియను బాగుగ చేయన్. (573)

కం.॥
ఊరికి పుట్టిన జాతికి
పేరును నెలకొల్పె జనుల పెంపు వహింపన్
సారెకు దేవుని మారుగ
పేరున నిను దల్చె జనులు ధారుణి లోనన్. (574)

తే.గీ.॥
అటుల దలచుచు యా వూరి వారలంత
మరలి పోవగ; జనుదెంచె మాతృమూర్తి
ఊరు వెడలిన కారుల గుంపు జూసి
తన కుమారుండు అందులో తప్పకుండ (575)

తే.గీ.॥
సాగుచున్నట్లు దలపోసి సరగునపుడు
నిటుల నూహించె కుసుమాంబ నిక్కముగను
ఏమి నా జన్మ భాగ్యంబు ఏమనందు
తనదు కళ్ళను జారెను తప్త యశ్రువు (576)

ఉ.॥
ఏమది నాదు భాగ్యమును ఏమిటి నాదగు జన్మ; దైవమా
నా మది నింతగా మెదిలె నట్టుల కోరికలేమి చిత్రమో
ప్రేమను పంచగా నపుడు పెన్నిధి చెందెను కాల ధర్మమున్
నా మనసంతయున్ సుతుని యాలన పాలన జూడనైతినే (577)

చం.॥
గడచిన రోజులన్నియును గాంచితి పుత్రుని యోగ క్షేమముల్
గడిచెను వత్సరంబులును గారవమందు సుపుత్రు గాంచితిన్
వడివడిగాను నే తనయు వాంఛను దీరగ వండి వార్చగన్
కుడి ఎడమాయెగా బతుకు కుంభిని జీల్చిన రీతి నుండగన్ (578)

వచనం.॥

యనుచు విచారమున గుందుచున్న కుసుమ కొంత వ్యవధి యనంతరము వాస్తవంబును గ్రహించి “పోనిమ్ము నా కుమారుండు జిల్లా ప్రథమ యధికారిఅయి క్రిందవారల పైన పెత్తనము చేయుచుండును గదా” అని తలపోసి, ఇదియే కదా నాడు తన భర్త, తదుపరి తానునూ ఆకాక్షించినది. తన యింటికొచ్చిన తన కుమారుడు తనతో రమ్మని పిల్చినాడు కదా! ఈ వూరినీ, ఈ మనుషులనూ వదిలి రాలేనని తాను పలికినది. అటుల యోచించిన కుసుమాంబ తన నేత్రద్వయంబుల యందు తొంగిజూసెడి యశ్రు నయనంబుల చీరకొంగుతో వామ హస్తంబుల తుడుచుకుని మనస్సున యానంద డోలికలు తాండవమాడ నిజగృహంబునకు పయనంబయ్యె. (579)

ఆశ్వాసాంత గద్యము:

ఇతి శ్రీ మద్వల్లంద్ర రాజవంశ రాకా సుధాకర విరాజిత కీర్తి కాంతాసముపార్జితులౌ, పట్టపు మత్స్యకార్వర్గ, ఆవలాన్వయ సంభూతులౌ, శ్రీ సీతలాంబా ఉపాసిత శ్రీ మస్తానయ్య కుమార రత్నంబగు, సహజ కవీంద్రులై వరలు, శ్రీ వెంకట రమణ కవీంద్రుని విరచితంబగు కుసుమ వేదనా కావ్యము షష్టాశ్వాసము సర్వమూ సమాప్తము.

సర్వేజనా సుఖినో భవంతు

(సంపూర్ణము)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here