కుసుమ వేదన-8

0
9

కుసుమ వేదన-8

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

తృతీయాశ్వాసము – రెండవ భాగము

చం.॥
కదలిరి బాలరాజుకును కన్యను పత్నిగ చేదలంచగన్
వదన ముఖారవిందమున వైభవ శోభను గూర్చుకొంచు; యీ
విధముగ వారి పుత్రునకు వీడగ జేయును యవ్వనం చెరల్
సదమల రీతిగన్ కదలసాగెను యంతట బంధుమిత్రులున్. (109)

ఉ.॥
అంతట బంధు మిత్రులును యప్పురి జేరగ నుత్సహంబునన్
ఎంతటి దూర భారమును ఏమిటి యీ శ్రమ యంచుదల్చకన్
సంతస మందుచున్ యురికి సాగిరి యప్పురి దాపునప్పుడున్
మంతన మందునన్ బహుగ మానక మోదము సల్పుచుండగన్. (110)

చం.॥
ఇనుడటు పశ్చిమంబునకు ఏమరులేకను జేరుచుండగన్
చనిరటు వీరలున్ కుసుమ చావిడి చెంతకు నట్టి వేళలన్
వినయము తోడుతన్ కనిన యీ కనకాంగియు వీరలందరిన్
మునుగొని యాదరంబునను ముంగిట నిల్చి జలంబు లివ్వగన్. (111)

ఉ.॥
అంతట యూరనున్న తన అగ్రజులందరి బిల్చి నప్పుడున్
చెంతనె యుండు బంధుగుల స్నేహిత వర్గము నంత బిల్వగన్
సంతస మందుచున్ తరలె సౌఖ్యము గోరెడి వారలందరున్
ఇంతగ బిల్చె నెందుకని యింటికి చేరిరి శీఘ్రమే ధరన్. (112)

ఉ.॥
చేపలు బట్టు యూరదియి చెల్లెడి పాలన చేయుచుండ్ర; యా
కాపులటంచు బిల్చెదరు కార్యము లన్నిట వారె జ్యేష్టులౌ
రేపును మాపులన్ బహుగ రీతుల పాలన చేయుచుంద్రు; యా
కాపులనన్నిటన్ బ్రధమ గణ్యులు గానిట గౌరవించరే. (113)

సీ॥
అటు కొందరున్ మరి ఇటు కొందరున్ గూడి
పళ్ళాన తాంబూల పండ్ల నిల్పి
కొత్తబట్టలు చేర్చి కొల్లగా నటు చేరి
చీరలును పంపిణీ జేతురపుడు
కాబోవు వియ్యపు కామందులను బిల్చి
గ్లాసుల మద్యమున్ గారవింత్రు
అటువైపు వారలున్ ఇటు వైపువారలున్
గుమిగూడి త్రాగేరు గుంపుగాను

తే.గీ.॥
అటకు జేరిన వారికి యట్టివేళ
మత్తు గొల్పెడి పానముల్ మానకుండ
ఇచ్చి మర్యాద జేతురు యిచ్చ వచ్చి
నటుల దినుచును త్రాగేరు నాటి దినము. (114)

తే.గీ.॥
అటుల ఖర్చు నొదిలినంత నా విధముగ
కొన్ని దినములు వారలు కొదువగాను
చలనమును లేకయుండిరి చక్కగాను
ఇంత మనకేల కష్టంబు లేదటంచు. (115)

తే.గీ.॥
మగని బెండిలివారలు మక్కువగను
యాడు బెండ్లింటి వారల ఆదరమున
బిలువ వచ్చిరి యావేల బింకమరిసి
రెండు వర్గము వారలా రేయి ముందు. (116)

తే.గీ.॥
బాపనింటికి పోయిరి భవ్యముగను
బాలరాజుకు కుసుమకు బాగుగాను
బెండ్లి చేయగ కోరుచు బెంపు మీర
వచ్చినారము వేగమె ఖచ్చితముగ. (117)

తే.గీ.॥
అనుచు బలికిన యాతండు అంఛితముగ
లెక్కలేయుచు జదువుచు వక్కనించె
శ్రావణంబున తదియన సౌఖ్యముగను
బెండ్లి జేయుము యన్నిట బేర్మి మీర. (118)

తే.గీ.॥
అనుచు బలికిన విప్రుని బలుకులినుచు
సంతసంబున కదలిరి; సాటివారు
మెచ్చి దీవించ జేతుము ఖచ్చితముగ
పలువురాశ్చర్య చకితులై పరవశించ. (119)

తే.గీ.॥
అవని తనయుండు ప్రోలయ అద్భుతముగ
కీర్తి నొందగ బెండిలి కేతనమును
గగన శికలందు గొప్పగా గౌరవంబు
నిల్పు లాగున కళ్యాణ నిశ్చయంబై. (120)

ఉ.॥
ఆమని వచ్చె కాముడిక ఆగమమివ్వగ రాడె యంచు; భూ
భామినులందరున్ విరహ బాధల యందున వేగిపోగ; యా
కాముకుడొచ్చె నంతటను క్రమ్మర చేగొని పుష్పబాణముల్
భామల నేత్ర యుగ్మముల భాసిలె మోదము కూర్చనీ ధరన్. (121)

చం.॥
తరువుల పుష్పమాలికలు తాండవమాడు వసంత శీర్షికన్
చెరువుల నీరు యింకి పలు చేపలు చచ్చెనె గ్రీష్మ తప్తమౌ
ధరణికి నూత్న వత్సరము తాపము బాపుచు మోదమందగన్
సిరియును నిల్లు చేరె బహు శీఘ్రమె యాంధ్రుని యింటి పంటగా. (122)

చం.॥
శుభమును గూర్చు పత్రికల శోభను కొంచెము బెంచునట్లుగా
విభవము నొంది గీర్తులను వీధుల యందున వెల్గునట్లుగా
ప్రభలను రంగరించెమది ప్రాభవమై వెలుగొంద; తాళ స
న్ని భమగ నిల్చిపోగ ధర నిశ్చల గీర్తిని యెల్ల కాలమున్. (123)

ఉ.॥
పరిచిత వ్యక్తులన్ మరియు పాటెరువందగ బంధుమిత్రులన్
పరిపరి రీతులన్ బిలచి ప్రార్థన జేతు మదీయ పుత్రునిన్
సరగున బెండ్లి బీటలను సంతసమొందుచు గూర్చుచుండగన్
సరసకు వచ్చి దీవెనల చయ్యన నియ్యుడి; సంతసించెదన్. (124)

ఉ.॥
మా యిలు నందు జర్గునది మానక మీరును వచ్చి చేరుడీ
ఈయిల యందు నెవ్వరును ఎప్పుడు ఎక్కడ జేయనట్లు; మే
మీ యిల జేయదల్చితిమి మిక్కిలి యచ్చెరు వొందునట్లుగన్
మా యిలు జేరుడీ మదిని మక్కువ మీరగ సంతసించెదన్. (125)

తే.గీ.॥
అనుచు ప్రోలయ బంధుగు లవనిలోన
బిలిచి వచ్చెను వేగమె భీతిలేక
బెండ్లి కార్యములందున పెంపు మీర
మునిగె నంతలో రోజులు మోసుకొచ్చె. (126)

తే.గీ.॥
కుసుమ యింటను పనులును కూడ జరిగె
గోడలకు వెల్ల వేసెను గొప్పగాను
కనులు మిరమిట్లు గొలిపెను కలకలమున
వారి యిల్లని బోల్చుట వల్ల గాదె! (127)

ఉ.॥
పోయిరి వెచ్చముల్ కొనగ పూనిక తోడుత పట్నసీమలన్
పోయి కొనంగ జూసెదరు పుత్తడి యిత్తడి వస్తు సంపదల్
హాయిగ చల్ల నీరులను అక్కడ నక్కడ నుండు వేంద్రముల్
హాయిని గొల్ప తాగెదరు అచ్చట నచ్చట తిర్గులాడుచున్. (128)

సీ॥
మేనమామ కొనెను మెచ్చి యల్లుని కొర
కును వెండి జంధ్యంబు కూర్మి తోడ
మేనత్త కొనెనుగా మేలైన వస్త్రంబు
మెరసిపోయెడి రీతి మేదినందు
వెచ్చముల్ కొనిరంత వేడుక తోడుతన్
ఉప్పు పప్పుయు నూనె ఉదకములను
పెండ్లి బట్టలు కొనె బెద్దగా వెచ్చించి
అందరి కన్ననూ ముందు నుండి

తే.గీ.॥
కూరగాయలు పండ్లును కూర్మి తోడ
కొనియు నిండ్లకు దెచ్చిరి గొప్పగాను
పెండ్లి చేయగ దలచరి పృథ్విలోన
భూరి ఖర్చైన వెరువక భువిని మిగుల. (129)

తే.గీ.॥
అన్ని సామాగ్రి నిండ్లకు నలుపులేక
తెచ్చి దింపిరి దినుసులు తెగువ తోడ
రెండు రోజుల ముందర నిండు గాను
యుండి రీతిని భువిలోన దండి సరుకు. (130)

కుసుమ యింట నలుగు

చం.॥
కుసుమ కుమారి ముంగిటను కూరిమితోడుత బంధుమిత్రులన్
విసుగును లేక కార్యముల వీక్షణ సల్పుచు దీక్ష తోడుతన్
పసితన ప్రాయమందునను పాలకు నేడ్చెడి సూనవర్గముల్
విసుగును బొందకన్ ముదిత విజ్ఞత చేకొని బుజ్జగించగన్. (131)

ఉ.॥
యా మరునాడే బెండ్లియని అమ్మలు నక్కలునంత జేరగన్
ఆమని లాగ వచ్చె కుసుమాంబిక; చీరతో మేనమామలున్
ఏమరుపాటు నొందకను యీ దినమందున వెల్గె చిన్నదిన్
ఈ మనిషేన? మా కుసుమ! ఏమిటి వింతగ నుండె నీ ధరన్. (132)

తే.గీ.॥
అనుచు దలపోయు చుండిరి యతివలంత
ముక్కు మీదను వ్రేలిడి మక్కువగను
చూచు చుండిరి మ్రాన్పడి చుట్టములును
వెలిగె నీ వేళ కుసుమాంబ వేడ్క మీర. (133)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here