కుసుమ వేదన-9

0
10

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

తృతీయాశ్వాసము – మూడవ భాగము

తే.గీ.॥
మేనమామలు గొన్నటి మేటి చీర
కట్టె కుసుమాంబ యా వేళ పట్టుదలను
కదలుచుండిన యా బాల కంటకింపు
నగుచు చూసిన వారికి నయము గాను. (134)

తే.గీ.॥
కాపులిండ్లకు నేగియు కన్నె కుసుమ
బంధుమిత్రుల యిండ్లకు భయము లేక
వేడ్క తోడుత పీటపై వెలిగిపోతు
నలుగు పెట్టించు కొనుచుండె నయము గాను. (135)

తే.గీ.॥
యూరి మధ్యన నిలచియు యుండినట్టి
సీతరాముల గుడి కెళ్ళి శిరసు వంచి
మీకు గల్గిన శోకాలు మాకు రాక
నాదు జీవితమంతయు నాణ్యము గను. (136)

తే.గీ.॥
గడచిపోయెడి విధమున గావుమమ్మ
యనుచు ప్రార్థింతు గావరె యార్తి గాంటి
నమ్మ సీతమ్మ రామయ్య అంజలింతు
ననుచు దెచ్చిన నైవేద్యమంత బెట్టె. (137)

తే.గీ.॥
శక్తి మందిర మందున శ్రమకు నోర్చి
చేరి ప్రార్థించె బడతియు చింత లేక
నిండు నూరేళ్ళు మాంగల్యముందు విధము
దీవెనల నీయు మాయమ్మ దివ్య చరిత. (138)

తే.గీ.॥
ఇల్లు జేరిన తోడనే యిట్టి దినము
బయలుదేరంగ వలెనంచు బంధుసఖులు
కదలె నావేళ నందరున్ కౌతుకమున
చేరె వరునిల్లు యా రాత్రి చెన్నలలర. (139)

తే.గీ.॥
విడిది చూపించి వారల వీలు నిచ్చి
విశ్రమించగ జేసెను వీధి చివర
అట్లు వారంత నిదురించె నాటి దినము
చల్ల గుండెను యా రాత్రి తెల్లవార్లు. (140)

వరునింట పెండ్లి శోభ:

ఉ.॥
కొబ్బరి యాకులన్ నరికి గొప్పగ వేసెను పందిరంతటన్
ఇబ్బడిముబ్బడై తరలి యిప్పుడు బెండిలి నిల్లు చేరగన్
నిబ్బరమైన రీతిగను నిల్చిరి బంధుగులంత నప్పుడున్
పబ్బము వంటి పెండ్లికిని పాటేరువొందక జేరె నీ ధరన్. (141)

సీ॥
అరటి యాకుల తోటి యాడంబరముగాను
బెండ్లి మండపమును బేర్చిరంత
టేబుల్లు, కుర్చీలు టింగురంగ యని
వేదికన్ గూర్చిరి వేగనపుడు
ఎండుపుల్లలు దెచ్చి వేడ్క ముక్కలు జేసి
యజ్ఞంబు కంచును అంతనపుడు
బాపన్ని గొనిదెచ్చె బాగుగా సలవాది
వెంట నుండి వివాహ మంటపముకు

తే.గీ.॥
ఇంటి దాపున నుండి యా వీధి వరకు
కండ్లు జిలుగను విధముల కాంతి గొలుపు
రంగు బల్బుల సరములు రంగుగాను
సరిగ బేర్చిరి భూలోక స్వర్గమటుల. (142)

తే.గీ.॥
మైకులను గట్టి పాటల మైకమందు
యూరి వారలు మునుగుచు ఊగునటుల
ఓలలాలించె నావేళ నుత్సహమున
బాలలందరు జేరిరి భవ్యమలర. (143)

తే.గీ.॥
నాట్యములు జేసె పాటలు నచ్చి యపుడు
తాగుబోతులు సైతము తడయకుండ
నృత్యములు చేయుచుండిరి నేమి వింత
యనుచు గుమిగూడె జనములు అచ్చెరొంది. (144)

ఉ.॥
స్త్రీ లను అన్ని వర్గములు శ్రీలును మించిన వారటంచు; ఒహ్
చాలగ బట్టుచీరలను జక్కగ గట్టుచు నుత్సహంబుగన్
బాలుర సంఘముల్ బహుగ బందిగ కొత్త బట్టలన్
మేలుగ కట్టి వచ్చెనట మేధిని యందున గొప్పగా ధరన్. (145)

ఉ.॥
బంగరు సొమ్ములన్ యపుడు బాగుగ బేర్చిరి యాడువారలున్
రంగరు పొంగరంచు రతిరాజులు యందపు పట్టపుట్టముల్
కంగరు లేక నప్పుడును కామినులందరు సిద్ధమైరిగా
పొంగుచు బాలరాజునకు బంగరు కన్యక కుస్మ నివ్వగన్. (146)

తే.గీ.॥
క్రమముగా వచ్చె యా గ్రావ కాపు యొకడు
అతనితో వచ్చె ముదాము అతని బంటు
ప్రోలయాఖ్యుండు ఎదురేగి పొలుపు మీర
కుర్చి చూపించి గారమున్ కూర్చోబెట్టె. (147)

తే.గీ.॥
ఆడబడుచులు చనుదెంచి యట్టివేళ
పీటలను వేసి సరకుల బేర్చిరపుడు
వరుడు యా బాలరాజును వచ్చెనపుడు
మంత్రములు సాగి బాపని మాటలట్లు. (148)

తే.గీ.॥
అంత విడిదందు నుండియు నాగమించె
కలికి కుసుమాంబ యేతెంచె కదలి యపుడు
విప్రునోటను మంత్రంబు వేగ సాగె
పేర్మి గుసుమాంబ బాలరాజ్పెల్లి సాగె. (149)

సీ॥
నీలి యాకాశంబు నిలచు సుధాబింబ
మైదోచె సుదతియు మాన్య చరిత
వెలయు సాగర మందు వెలిగేటి రవిబింబ
యాకృతిన్ దోచెనా యతివ యపుడు
కారు చీకటి యందు కాంతి రేఖ విధాన
కల యంచ గాన్పించె కనుల కపుడు
కోటి సూర్యుల కాంతి కొదువ లేక యపుడు
యువిద మోమున జూడ యుద్భవించె

తే.గీ.॥
ఇంత సౌందర్య మోహన ఇందువదన
బాలరాజుకు భార్యౌట భావ్యమౌనె
ఏమియాతని యదృష్ట మేమనందు
యంచు నోటిని వేలుంచె యంత జనులు. (150)

ఉ.॥
సిగ్గుల మొగ్గయై కుసుమ శీర్షము కిందకి వాలిపోగ, బల్
బుగ్గలు ఎర్రబారగను బూరెల చందము యుబ్బి యుండగన్
సిగ్గును దీసియున్ శిరము నెత్తుక జూడను వీలుగాక; తన్
సిగ్గుబడిన్ బరుండు విధ స్త్రీ ధనరత్నము పెక్కు భంగులన్. (151)

ఉ.॥
ఆ నవ జంట జూడగను అందముగా భువి దివ్య జోడుగా
కానము భూమి యందునను; కమ్మని రీతిగ కంటి కింపుగన్
ఏ నవ జంటకున్ జగతి నెప్పుడు సైతము సాటి రారు; యీ
మానవ నవ్య జంట మరి మానక జూసిన శోభ గూర్చదే. (152)

సీ॥
దివి వీడి నీలాగు భువి కొచ్చినటువంటి
దివ్య జంటగ వారు దిక్కులందు
మనిషి కంటికి నిట్లు మంత్రమేసిన యట్లు
కానుపించెను గదా కనుల కటుల
కనురెప్ప వేయకన్ కాంచెనా దృశ్యంబు
కదలలేకను బోయె కాంతలపుడు
మహిని వెలుగు జంట మానవు లేరికిన్
ముచ్చటన్ గొల్పదే మోదమలర

తే.గీ.॥
యక్షుడై బాలరాజును యవనిలోన
కూర్మి సురకాంతయై పోయె కుసుమ యపుడు
వారి బెండిలి సాగెను వాంఛితముగ
ఏమియా జంట భాగ్యంబు లేమనందు. (153)

ఉ.॥
తెల్లని పట్టు వస్త్రములు తేజము నొప్పగ ప్రజ్వరిల్లుచున్
నల్లని బాలరాజుయట నాతిని బొందగ నుత్సహించుచున్
తెల్లగ నుండెడిన్ కుసుమ తేకువ తోడుత బొందె నీ ధరన్
మల్లియ వంటి జాణ కుసుకామిని జూడ ప్రయత్నమొందగన్. (154)

తే.గీ.॥
అన్ని పూజలు సల్పిన యంత బాప
డంత మంగళ సూత్రమున్ యతని కిచ్చి
కుసుమ మాలిక మెడ మీద కూర్చి కట్టి
తనదు బార్యగ చేపట్టు మనుచు దెల్పె. (155)

తే.గీ.॥
అంత లేచెను నవ వరుడుంపుడు; చేత
సూత్రమును కుసుమాంబయౌ సుదతి కంఠ
సీమ యందున గట్టెను ప్రేమ మీర
కుసుమ బాల్రాజు బంధంబు కుదిరె నౌర! (156)

తే.గీ.॥
మేళతాళంబు మ్రోగెను మిగుల రీతి
వరుస దీవించె నందరు వధువు వరుని
అక్షతల జల్లె నంతటానందముగను
దివిని విరివాన కురిపించె దివిజవరులు. (157)

తే.గీ.॥
అటుల శోభిల్లె యావేళ నద్భుతముగ
నవ్య జంటను దీవిమ్చె భవ్యముగను
దీర్ఘకాల సుమంగళి దేవి యంచు
శీఘ్రకాలంబె పుత్రుల చెల్లెననుచు. (158)

(సశేషం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here