కుసుమ

0
6

[dropcap]ఆ[/dropcap] రోజు రాత్రి కుసుమకి ఇప్పటికీ గుర్తే. కృష్ణుడితో ఆటపాటలకి మిగతా గోపికలు వెళ్తున్నా స్వతహాగా బిడియపడేదీ, నలుగురితో కలవందీ కాబట్టి కుసుమ ఎప్పుడూ ధైర్యం చేయలేదు. ఎదురింటి నర్మద వొచ్చి కృష్ణుడు ఎంత బాగా వేణువూదాడో, కృష్ణుడు పక్కన కూచుని ఎట్లా కబుర్లు చెప్పాడో, ఎట్లాంటి చిలిపి పనులు చేశాడో చెబుతూంటే కుసుమకి వెల్దామని ఎంతో ఇదిగా అనిపించినా ధైర్యం చాలలేదు.

పక్కింటి నీలవేణీ, మూడో ఇంట్లోకి కొత్తగా కాపరానికొచ్చిన కోడలు, స్వయం ప్రభా స్నానానికనొచ్చి గంటలకొద్దీ కృష్ణుడి మాటలు మాట్లాడుతుంటే తను నోరెళ్ళ బెట్టుకుని వింటోందని వాళ్ళు ఎగతాళి చేస్తుంటే అల్లాగే నిలబడిపోయిందే గానీ ఏమీ మాట్లాడలేదు.

ప్రతి రోజూ రాత్రి దీపాలు పెట్టాక వేణునాదం వినిపించటమూ తోటి గోపిక లందరూ కృష్ణుడి దగ్గిరికి వెళ్టం చాలా రోజులనుంచీ ఆమె గమనిస్తోందే. రోజూ రాత్రయ్యేటప్పటికి అందరు గోపికలకి అద్భుత ఆనంద రాత్రి,ఆమెకి మట్టుక్కూ కాళరాత్రి. అప్పటిదాకా తను కూడా వెళ్దామనుకున్నా, వేణువు శబ్దం వినిపించే సరికల్లా ఒక్కసారి మనస్సు ఆనంద తరంగితం కావటమూ, తను వివశ అయ్యి అలా బొమ్మలాగా నిలబడిపోవడమూ, తెల్లవారుఝామున ఊరంతా నిద్ర లేస్తూంటే తెలివి రావటమూ ఇది రోజూ జరుగుతున్న విషయమే. మిగతా గోపికలందరూ కృష్ణుడితో ఆడిన ఆటలూ, పాడిన పాటలూ, చెప్పుకున్న ఊసులూ, చేసుకున్న బాసలూ, చేసిన కొంటె పనులూ, చేద్దామనుకున్న కోణంగి పనులూ, ఇవ్వన్నీ సమయం దొరికినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ, పొద్దున్న కళ్ళాపి జల్లి ముగ్గేసేడప్పుడూ, పాలు పితికేడప్పుడూ, యమునలో స్నానం చేసేటప్పుడూ, పిల్ల్లలకి చల్ది అన్నాలు పెట్టేటప్పుడూ, మొగాళ్ళు పనులమీద బైటికి వెళ్ళీనప్పుడూ,వాళ్ళు మధ్యాన్నం నిద్రపోయేటప్పుడూ, సాయంత్రం దీపాలు పెట్టేటప్పుడూ ఎప్పుడు వీలైతే అప్పుడు గోపికలు వాళ్ళల్లో వాళ్ళే గుంపులుగా కూడో, ఇద్దరు, ముగ్గురుగానో కబుర్లాడుకుంటుంటే, వినీ, వినీ కుసుమకి చెవులు అట్టలు కట్టిపోయాయి.

ఉంటానికి ఇల్లు యశోదమ్మ గారి ఇంటిముందే ఉంది. కానీ ఏం లాభం పదేళ్ళ నుంచీ కృష్ణుడు రోజూ పశువుల్ని తోలుకుని ఎప్పుడు వెడతాడో, మళ్ళీ సాయంత్రం తోలుకుని ఎప్పుడు వొస్తాడో అని వేచి,వేచి ఏ కిటికీలోంచో, తలుపుసందులోంచో దూర దూరంగా చూసిందే తప్ప, తను దగ్గరినించీ కిష్టయ్యని చూసిన పుణ్యాన పోలేదు. ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏవో దాయాదుల గొడవలతో, ఉంటం పక్కనే అయినా రాక పోకలు పెద్ద లేవు. చూసీ చూసీ ఇల్లా కాదు అనుకుని ఒక నిర్ణయానికొచ్చింది. చూసిన ఒక్క క్షణం లోనే మైమరపించే కన్నయ్యని ఎక్కువ సేపు ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, అని ఆలోచించింది. వాడు త్రిభంగిలో ఉన్నపుడు జగన్మోహనంగా ఉంటాడనీ, అప్పుడు వాణ్ణి ముద్దుపెట్టుకోకుండా ఉండటం అసంభవం అనీ అన్న నీలవేణి మాటలు ఎంత నిజమో చూడాలని ఒక నిర్ణయానికొచ్చింది. ఎల్లాగైనా ఒకసారి యమున ఒడ్డుకి వెళ్ళి కృష్ణుడు మురళి వాయిస్తుంటే వినాలి అని నిశ్చయించుకుంది. పక్కింటి నీలవేణితో మర్నాడు యమునకి స్నానానికెళ్తూ మనసులోమాట చెప్పింది.

“నాకు రోజూ రాత్రి ఎందుకో నిద్ర కమ్మేస్తుంది” అని కుసుమ అంటే నీలవేణి “అలానా” అంది.

“మీరందరూ రోజూ రాత్రి యమునా విహారానికి వెళతారటగదా”

“యమునలో కెళ్తే నీకేంటి, గంగలోదూకితే నీకేంటి”

“అది కాదు….”

” ఏది కాదు”

“మరి మీరందరూ…”

“మేమందరం”

“పాట వింటానికి వెళ్తారట కదా”

“ఏ పాట, ఎవరు చెప్పారు”

“అంత కోపమెందుకూ, నువ్వూ, ప్రభా మాట్లాడుకుంటున్..”

“మేమేదో మాట్లాడుకుంటుంటే దొంగతనంగా విని ఇట్లా “

“నీకు దణ్ణం పెడతాను, కోప్పడద్దు, కొత్త మీగడ పాలు రెండు చెoబులు పంపిస్తాలే సాయంత్రం, కోప్పడద్దు”

“సరే నీ కేంకావాలి”

“కృష్ణుడి వేణుగానం ఎలాగైనా ఒక సారి విందామని….అదేం అంత నవ్వు”

“ఆ కృష్ణుడు పెద్ద మాయలాడు. మొదట ఏదో అనుకుని వెడతాం, వెళ్ళొచ్చిన తరవాత ఇలా ఎలా జరిగిoదని ఆశ్చర్యపోతాం.”

“మాయల ఫకీరా, చూట్టానికి పాపం ఏమీ తెలీనట్టూ ..”

“వంద మాయల ఫకీర్లకంటే మొనగాడు. ఆ చూపులు చూసే అందరూ మోసపోతారు.”

“నేనంత తొందరగా మోసపోయే దాన్ని కాదులే”

“నిన్నొక్కసారి చూశాడంటే చాలు, వాడితో ఒక మాట మాట్లాడితే ఈ ప్రపంచంలో ఇంకేమీ వొద్దనిపిస్తుంది. వాడితో ఒక మాట మాట్టాడితే, కలిసి నాట్యం చేయకపోతే ఇదేం బతుకు అనిపిస్తుంది, కలిసి నాట్యం చేస్తే, వీణ్ణీ కావిలించుకుని ముద్దెట్టుకోని జన్మం ఏం జన్మం అనిపిస్తుంది”

“నువ్వు మరీ ఎక్కువ చెబుతున్నావు, నేను మరీ అంత ఇదేమీ కాదులే”

“నువ్వేమీ అంత ఇది కాదు, కానీ వాడు అంత ఇది అని మట్టుక్కు ఖచ్చితంగా చెబుతాను”

“మీరందరూ..”

 “ఆ అదృష్టం రావాలంటే పెట్టిపుట్టాలి. ఉన్న వాళ్ళందర్లోకీ నేనే నాట్యం బాగా చేస్తానని నీకూ తెలుసు. కానీ, నాల్రోజులయ్యింది వాడొచ్చి నా పక్కన నుంచుని…”

“అదేంటి, ఏడవొద్దు, ఏడవొద్దు…”

“రాత్రి ఎప్పుడౌతుందా అని ఎదురుచూపులూ పిల్లంగోవి పాట వింటూ ఎగురుకుంటూ వెళ్టమూ, వాణ్ణి చూడగానే మైమరచిపోవటమూ, వెన్నెల్లో మాటలూ, పాటలూ,కళ్ళు విప్పి చూసేటప్పటికి పొద్దున కావటమూ, నాల్రోజులైంది ఈ అదృష్టం లేని దేహానికి వాడి చెయ్యి తగిలీ “

“నీలవేణీ, ఆగు, ఏడవకు,నువ్వు కాస్త బెట్టు చేస్తే, వీడు కూడా మిగతా మొగాళ్ళలాగాగే నీ చుట్టూ తిరుగుతాడే”

“వాడా”

 “ఏం వీడేమన్న ఆకాశం నించి దిగొచ్చాడా”

 “ఇంకా పైనించే అనుకో, సరే నిన్ను రాత్రి నిద్దర్లేపి తీసుకెళ్తాను, ఏంచేస్తావో చూస్తాగదా”

***

వెన్నెల పుచ్చపువ్వులాగా వుంది. గాలి సుగంధసుమనోహరమై ఉంది. యమున, సమాధిలో ఉన్న ముని లాగా నిస్తరంగంగా, చంద్ర కాంతి వల్ల ప్రకాశవంతంగా ఉంది. యమున ఒడ్డున ఉన్న కదంబవనం, మెరిసిపోతున్న బట్టలు కట్టుకునీ, గంధాలూ, కస్తూరీ అద్దుకునీ, గాజులూ, బావిలీలూ, మణిపద్మాలూ, చంద్రవంకలూ, వంకీలూ, వడ్డాణాలూ, పాపిడిబిళ్ళలూ పెట్టుకుని, రకరకాలుగా జుట్లు దువ్వుకునీ, కృష్ణుడి కోసం తయారై వొచ్చిన ఆడవాళ్ళతో కిల్లకిల్లాడుతోంది. “నిన్న నాతో ఎంత చక్కగా కలిసి నాట్యం చేశా”డనీ “నాతో పాడటం కోసమే పుట్టా”డనీ,”వాడికి నేనంటే ఎంతో ప్రాణ”మనీ ఇలా ఎవరికి వారే అనుకుంటుంటే వాళ్ళందరి మధ్యలోంచి నీలవేణి, కుసుమని తీసుకుని “వారం రోజులైంది నావంక చూసి” అని బాధపడుతున్న ఓ పంకజాక్షి దగ్గరికెళ్ళి ఓదారుస్తుంటే మురళీస్వనం దగ్గిర్లోంచి వినపడింది. కృష్ణుడొచ్చాడంటూ అందరూ కేరింతలు కొడుతూ శబ్దం వినిపించిన వైపు వెళుతూ ఉంటే తను కూడా అటు నడిచింది. అక్కడికి జేరేసరికల్లా చుట్టూ ఆడాళ్ళూ మధ్యలో కృష్ణుడు. వీళ్ళెప్పుడూ మొగవాణ్ణి చూడనట్టు చేస్తున్నారే అనుకుంది మనసులో. పిల్లాడు ఎంత చూడముచ్చటగా ఉంటే మట్టుక్కు ఇంత విడ్డూరం ఏమిటో కదా అనుకుంది. కృష్ణుడు అందరితో కూడి ఆడుతున్నాడు, పాడుతున్నాడు. వెనకవరసలో తనతో పాటు నుంచున్న ధాత్రమ్మ గారి మరుద్వతి “ఎంత బావున్నాడో అంటే “మీరు మొదటిసారి చూస్తున్నారా” అంది.

“మరీ విడ్డూరం మాటలు చెబుతావు, నేను లక్షోసారి చూడడం కానీ లక్షా ఒకటోసారి చూడాలనుకోవటం”

“అంత ఏముంది”

“సరిగ్గా చూస్తే అర్థమౌతుంది. అదిగో చూడు బుంగ మూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాడో, ఇదిగో క్షణంలో నవ్వులు విరజిమ్ముతూ కొత్త కృష్ణుడు, నవనవోన్మేషంగా క్షణ క్షణం ఏదో ఒక కొత్తతనం కనిపిస్తుంది కదా వీడిలో చూడు.”

“అది అంతా మీ ఆలోచనే నేమో”

“నువ్వు ఇవాళ్ళే వొచ్చావా”

“అవును”

“తెలుస్తోందిలే, రెండ్రోజుల తరవాత కలుద్దాం” అని ఆవిడ వెళ్ళీపోయింది.

“నిజంగా ఎంత బావున్నడు వీడు” అని ఒకసారి అనుకుని మళ్ళీ సద్దుకుని అక్కడ జరిగేదంతా చూస్తోంది. అందరి చూపులూ ఒకళ్ళ వైపే అందరి మాటలూ వాడితోటే, ఇంత మందిని ఎట్టా లోబర్చుకున్నాడో అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటే నాట్యం ముగిసిపోయింది. గోపికలందరూ ఎంతో కష్టంతో వీడ్కోలు తీసుకుంటుంటే కృష్ణుడు అందరికీ అతిప్రేమతో రేపు మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళుతూ వెళుతూ కుసుమకి పక్కగా వెళ్తూ ఒక్కసారి కుసుమ వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు

ఒక్క క్షణం కుసుమకి గుండె ఆగిపోయినట్టయింది. ఎంత అందమైన నవ్వు, ఎంత మనోహరమైన నవ్వు, ఎంత నిష్కల్మషమైన నవ్వు. ఇట్టాంటి నవ్వు జీవితంలో ఎప్పుడూ చూడలేదే అనుకుంది. ఎంత సుందరంగా నవ్వాడో, విచ్చుకున్న ఎర్రటి పెదాలు ఎలా నవ్వాయో, అల్లరి చేస్తూ ఆ కళ్ళు ఎలా నవ్వాయో ఆలోచిస్తూంటే నీలవేణి వొచ్చి భుజం తట్టి “పద”మంటే ఇద్దరూ కలిసి ఇంటికి జేరారు. స్నానాలప్పుడు కలుద్దామంటూ నీలవేణి వెళ్ళీపోయింది. ఇంటికొచ్చినా ఆ నవ్వే వెంటాడుతోంది.ఎటు చూసినా ఏం చేసినా ఆ నవ్వే గుర్తుకొస్తోంది. గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఆనందం, ఏదో తెలీని అనుభూతి. పాలు పితకటానికి దొడ్లోకి వెళ్తే అక్కడ కూడా అద్భుతమైన ఆ మొహమూ నవ్వే వెంటాడుతుంటే ఆవు అనుకుని ఎద్దు దగ్గర పాలు పితకటానికి కూర్చుంటే కాల్తో ఆ ఎద్దు పక్కకి తోసినప్పుడు కానీ తెలివి రాలేదు. పాలు కాస్తూ ఉంటే ఆ నవ్వే వెంటాడితే పాలు కాస్తా పొంగిపోతే అత్తగారు చీవాట్లేసింది. చల్ల చిలుకుతూ ఆ నవ్వు గుర్తుకొస్తే కుండ కాస్తా పగిలిపోయింది. అతి కష్టం మీద పాలు కాచి చల్ల చిలికి, పెరుగు తోడేసి, లేచేటప్పటికి పొద్దెక్కటం చూసి, త్వరగా స్నానానికి వెళ్ళింది. నీలవేణి ఎవరితోనో పరాచకాలాడుతోంది. కుసుమ వెళ్ళేటప్పటికి వాళ్ళు స్నానం పూర్తి చేసి వెళ్ళిపోయారు.

“ఏం ఆలస్యమైంది”అంది నీలం. ఒక క్షణం మాట్లాడలేకపోయింది కుసుమ. కళ్లవెంట కన్నీళ్ళు కారుతున్నాయి.

“ఏమైందే” అని నీలం దగ్గరికి తీసుకుని వీపు మీద సుతారంగా రాసింది.

“ఏమైందే” అని మళ్ళీ అడిగింది. జవాబు రాకపోయేటప్పటికి “రాత్రి వొచ్చినందుకు బాధా, సరే అయిందేదో అయ్యింది, ఇక ఎప్పుడూ నిన్ను తీసుకు వెళ్ళనులే” అంది నీలం.

“కాదు కాదు” అంటూ ఖంగారుగా అంది కుసుమ.

 “ఏమయ్యిందో సరిగా చెప్పు “అని నీలవేణి అంటే, బేలగా”సాయంత్రం ఎపుడౌతుందే” అంది కుసుమ.

“దేనికే”అని నీలం అడిగితే “కన్నయ్యని చూడాలే ” అని బేరుమంది.

“కాసేపాగితే సరి” అన్న నీలం మాటలకి “అప్పటి దాకా ఎట్టాగే” అన్న జవాబొచ్చింది.

“ఏమైందే అసలు ,నిన్ను ఆ కృష్ణుడు ముట్టుకున్నాడా”,

“ముట్టుకోలేదు”,

” నీతో ఏమన్నా మాట్లాడాడా”

“మాట్టాళ్ళేదు”.

“మరి”

“…..”

“ఇలా అయితే నిన్ను సాయంత్రం తీసుకెళ్ళను”

“నన్ను తీసుకెళ్ళకపోతే నా స్వామి ఒంటరివాడైపోడూ, దిగాలు పడిపోడూ”

“స్వామా, నిన్న మాయల ఫకీరని అన్నట్టు గుర్తు.”

“నా స్వామిని అల్లా అనొద్దు.”

“సరే నువ్వు వెళ్ళకపోతే దిగులు పడతాడూ నీ స్వామి”

“అవును”

“నిన్న ఎంతమంది వొచ్చారో చూశావు కాదూ”

“ఎంత మంది వొచ్చినా నెను రాకపోతే స్వామికి క్షణం గడవదు, తెలుసా”

“ఏమయ్యిందే నీకు అసలు” అంటూ నీలవేణి ప్రేమతో దగ్గరికి తీసుకుని లాలించి. బెల్లించితే వెక్కుతూ…

“నిన్న వెళ్తూ, వెళ్తూ నన్ను చూసి ఒక్క నవ్వు నవ్వి వెళ్ళిపోయాడే స్వామి, నాకేమన్నట్టని పించిందంటే నువ్వు లేకపోతే నేను ఒంటరి వాణ్ణయిపోతాను కదా, నీ కోసమే అసలు ఇక్కడికివొచ్చాను. నువ్వు లేకపోతే నాకెట్లా అన్నట్టని పించిందే. ఆ ఒక్క నవ్వుతో నన్నూ నా మనస్సునీ గెలిచేసుకున్నాడే స్వామి” అని ఆగింది.

“అప్పటి నుంచీ ఎటు చూసినా ఆ నవ్వు మోమే కనిపిస్తోందే.అప్పటి పులకలు ఇంకా తగ్గలేదు చూడు.ఎంత అందంగా ఉన్నాడే స్వామి.ఎట్టాగైనా ఒక్క సారి వాణ్ణి…”

“ఊ చెప్పు, వాణ్ణి..”

“…”

“చెప్పవే చంపుతున్నావు,చెప్పు”

“వాణ్ణి..,వాణ్ణి ముద్దెట్టుకోవాలని ఉందే”

విరగబడినవ్వింది నీలవేణి. తనకి తెలీకుండా ఇంత చిత్రం ఏమొచ్చిందా అని యమునాదేవి తలెత్తి ఓసారి చూసి మళ్ళీ మామూలుగా సాగిపోయింది.

“ఎందుకే అట్టా నవ్వుతున్నావు, నన్ను చూసేనా” అంది కుసుమ.

“ఔనే నిన్ను చూసే. నిన్న ఎన్ని కధలు చెప్పావు, నేనంత, ఇంత అని. వాడు నీతో”

“వాడు ఏమిటి వాడు, స్వామి అనొచ్చు కదా చక్కగా”

“ఔనౌను మాట్టాడకుండానే, కలిసి నృత్యగీతాలు సలపకుండానే,కలిసి నవ్వుతూ నౌకా విహారం చెయ్యకుండానే స్వామి అయిపోయాడు కదా వాడు. మరి అవన్నీ అయితే ఏమంటారో తమరు వాణ్ణి.” అంది నీలవేణి.

“నా వాణ్ణి నేను ఏదో అనుకుంటాను, నాఇష్టం”

“అబ్బో అక్కడిదాకా వొచ్చిందీ సరె నేవెళతా, కానీ ఒకటి గుర్తుబెట్టుకో, కృష్ణుణ్ణి ముద్ద్దుపెట్టుకోవటం అసoభవమే తల్లీ. కృష్ణుడి దగ్గరకెళ్తేనే ఒక రకమైన మాయలో పడిపోతాం. వాడితో కలిసి పాడితే విభ్రమానికి గురౌతాము. వాడితో నాట్యం చేస్తే అవధుల్లేని మోహంలో పడిపోతాం. వాడి శరీరం ఏ నాట్యం చేస్తున్నప్పుడో అల్లా తగిలితేనే పులకాంకితులమై జన్మధన్యమైందని భావిస్తాం. ఆ రాధాదేవి తప్పితే ఇంకెవ్వరూ వాడికి ముద్దు పెట్టలేదిప్పటివరకూ. ఏమీ చేయకుండానే మమ్మల్నందర్నీ ఇంత పిచ్చి వాళ్ళని చేశాడే, ఇక ముద్దు పెట్టి కావిలించుకుంటే ఏమౌతుందో ఆలోచించటానికె భయమేస్తుందే. ఆ నల్లనోణ్ణి ముద్దెట్టుకోవాలంటే ఎవరికో, ఎంతో పూజలు చేసీ నోములు నోచిన వాళ్ళకి  గాని భాగ్యం అబ్బదు.గుర్తెట్టుకో,ఇంట్లో పనుంది” అని నీలవేణి వెళితే ఆదరా బాదరాగా స్నానమాడి ఇంటికెళ్ళింది కుసుమ.

క్షణమొక యుగంగా రాత్రయ్యింది. కుసుమ, భువనమోహనుణ్ణి చూట్టానికి భువనమోహనంగా తయారైంది. నీలవేణి వాళ్ళ ఇంట్లోకెళ్ళి తనని తయారుచేసి కలిసి వెళ్ళేటప్పటికి, కుసుమ కోరిక లాగా, చంద్రుడు కొద్దిగా పైకొచ్చాడు. అందరూ చిన్న గుంపులుగా కూడి మాట్టాడుకుంటున్నారు. ఎంతకీ కృష్ణుడు రావట్లేదు. ఆకు కదిలినా, గాలి వీచినా యమునలోన గలగలలు రేగినా దూరమందు సనసన్న పదధ్వని సుంత వినికిడికి తగిలినా, ఒళ్ళు ఝల్లంటుంది, నయనాలు దీర్హమౌతయ్యి, సుకుమారమైన కుసుమ వొళ్ళు ఎర్రగా అయిపోతుంది. కానీ కృష్ణుడు రాలేదు. అలా నేలకి వొరిగింది.

నీలవేణి వొచ్చి పక్కన కూర్చుని “ఏమయ్యిందే” అంటే

“చూడవే ఎంత బావున్నయ్యో”అని నేలమీద శంఖచక్రాంకితాలైన కృష్ణపాదాల్ని చూబించింది.

నిన్న నాట్యం చేస్తూ వ్యత్యస్తపాదుడై నుంచున్నప్పటి ముద్రలు.కిందకి వొంగి ముద్దు పెట్టుకుంది ఆ మట్టి కొంత తీసుకుని నుదుటి మీద తిలకంలాగా పెట్టుకుంది. ఇంతలో మురళీస్వనం మళ్ళీ వినిపించింది. గభాలున లేచి పరిగెత్తింది మిగతా వాళ్ళతో బాటు.

ఎదురుగుండా త్రిజగన్మోహన మూర్తి. గాలి పీల్చుకోడం ఆగిపోయింది. కళ్ళే తప్పితే మిగతా అంగాలేవీ పని చేయట్లేదు. ఆ మూర్తిలోని అమృతాన్ని ఆపకుండా, కళ్ళతోనే తాగేస్తోంది కుసుమ. అతిలోక సుందరమైన పెదాలు విచ్చుకున్నాయి. చిన్న దరహాసరేఖ కనిపించింది. ఎర్రటి లేత పెదాల మధ్య తెల్లటి పళ్ళు కనిపించీ కనిపించనట్టుగా నవ్వు రువ్వాడు. గుండెలనేవి ఇంకా ఎవరికన్నా మిగిలుంటే అవ్వన్నీ ఆగిపోయాయి. కాలం ఆగిపోయింది. యమునలో అలలూ, మలయమారుతమూ, పైన చంద్రుడూ, చుట్టూ కదంబవనంలోని చెట్లూ అన్నీ ఆ నల్లని చిన్నవాడి మందస్మితానికి దాసోహమయ్యి అలా ఆగిపోయాయి. నల్లనయ్య మెల్లగా ముందరికొచ్చి పక్కపక్కనే ఉన్న నీలవేణీ కుసుమల చేతులు పట్టుకుని నాట్యానికి పిలిచాడు. తనని తాను మరిచిపోయింది కుసుమ. మొదటిసారి దగ్గిరినించి చూస్తున్నాననే ఊహే పులకలు రేపెడుతోంది. ఒంటిమీద స్పృహే లేదు కుసుమకి. అత్యద్భుతంగా నాట్యం చెస్తోంది. కృష్ణుడి రెండు చేతులూ పట్టుకుని గిరగిరా తిరుగుతోంది. కృష్ణుడు నడుం చుట్టూ చేతులు వేసి అటూ ఇటూ తిప్పుతుంటే ఆకాశంలో విహరిస్తున్నట్టుంది. ఇంతలో కుసుమ భుజాలు పట్టుకుని కృష్ణుడు దగ్గరికి లాక్కున్నాడు. కృష్ణుడి మొహం దగ్గిరగా కనిపిస్తోంది.అంత అందాన్ని ఒకచోట ఎల్లా పెట్టాడో బ్రహ్మ అనిపించింది. కుసుమ ముఖాన్ని ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు కృష్ణుడు. కృష్ణుడి శరీరం లోంచి చందనమూ, పారిజాతమూ లాంటివన్నీ కలిపిన అత్యద్భుత సువాసన వొచ్చి కుసుమ ఘ్రాణ రంధ్రాల్లో దూరి తన్మయురాలిని చేసింది

కృష్ణుడి భుజాల మీద చేతులువేసి దగ్గరికి లాక్కుంది కుసుమ. కృష్ణుడు కుసుమ మెడమీద చెయ్యి వేసి ముఖం ముఖం ఆనేంతవరకు తీసుకొచ్చాడు. కుసుమకి స్పృహ లేదు. అన్ని వృత్తులూ ఆగిపొయ్యాయి.నాట్య వేగం హెచ్చింది. కుసుమ ఈ లోకంలో లేదు. కృష్ణుడు ఏదో నవ్వుతూ అంటున్నాడు. కుసుమ తల ఊపుతోంది. తన పంచ ప్రాణాలూ తన ఎదురుగ్గా ఉన్న మూర్తిపైనే కేంద్రీకరించింది. మనస్సూ, బుద్ధీ పని చేయట్లేదు. నన్ను కృష్ణుడు పట్టుకున్నాడు అనే భావన అంతమై నేనే కృష్ణుణ్ణి అని అనిపించిందొక్కసారి. కళ్ళ ఎదట ఉన్న కృష్ణుడు మాయమై ఒక మహా జ్యోతి లాగా మారిపోయినట్టూ, దానిలో పడి తనూ జ్యోతి లాగా మారి ఆ పెద్ద జ్యోతిలో కలిసి పోయినట్టూ అనిపించింది.

కొంతసేపటికి కుసుమకి తెలివొచ్చింది. నీలవేణితో నాట్యంచేస్తూ ఉన్న కృష్ణుడు కుసుమ వైపు తిరిగి నవ్వాడు. కాసేపటికి నాట్యం అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. నీలవేణి కుసుమ దగ్గరకొచ్చి”అదృష్టవంతురాలివే, మొత్తానికి ముద్దు పెట్టావు” అంది.

“నేనా, ఎప్పుడు” అంది కుసుమ.

“నాట్యం చేస్తూ దగ్గరికి తీసుకున్నాడు కదే”

“అయితే”

“ముఖం ముఖం ఎదురెదురుగా ఉంచాడు కదే”

“అవును అంతే ముద్దు మట్టుక్కు పెట్టలేదు”.

“అంత దగ్గరకొచ్చి ఎందుకు పెట్టడు”.

“నువ్వు చూశావా”.

“నేను కొద్దిగా దూరంలోనే ఉన్నా, కృష్ణుడు ముద్దు పెట్టాడనే అనిపించింది, అవును, నిజ్జంగా  పెట్టాడు.”

“లేదే నాకు ఏమీ ముద్దు పెట్టిన సంగతే గుర్తుకురావట్లేదు”

“వాడు ఏది చేస్తాడో ఎల్లా చేస్తాడో తెలీకుండా చేసే మాయగాడు అని నె చెప్పలేదూ” అంది నీలవేణి.

“మాయగాడు కాదు మoచివాడు” అంది సిగ్గుపడుతూ కుసుమ.

అవుననీ, కాదనీ వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉంటే యమున “వాడు కొంచెం మాయలాడూ  కొంచెం మంచివాడూ”  అంటూ గలగలా నవ్వింది. చంద్రుడు, ఇంత పిచ్చి పిల్లలేమిటని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వనంలో వృక్షాలన్నీ వాళ్ళమీద పూల వాన కురిపించాయి.

ఇంతకీ మీరు చెప్పండి, కుసుమ కృష్ణుడు ముద్దుపెట్టుకున్నారా లేదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here