లచ్చిగాడి లంక

1
8

[dropcap]“ఏ[/dropcap]డవ తరగతి పూర్తవుతున్నా వీడికి తెలుగు బొత్తిగా రాయటానికి అవడం లేదురా. మామూలుగా మనతో మాట్లాడడం స్పష్టంగా బాగానే వుంది. ఈసారికి నా మాట విను. నువ్వు వీలు కాదనొద్దు. ఈ ఎండాకాలం శెలవుల్లో వీడిని నేను మనూరు తీసుకుపోతాను. నేనూ మీ అమ్మా, వీడికి నాలుగు విషయాలూ నేర్పిస్తాం.”

“మనూళ్ళో వేసవి కాలంలో సరిగా కరెంటే వుండదు. వీడు ఎ.సి. లేందే వుండలేడు. మనకక్కడ మధ్యాహ్నమయ్యేసరికి ఒకటే ఉక్కపోత. ఒళ్ళంతా ఉప్పేసినట్లు అవుతుంది. వద్దులే నాన్నా.”

“అది కాదురా, ఓ వారం చూద్దాం. వాడుండ లేకపోతే నేనే తీసుకొచ్చి దిగబెడతాను. కోడలి గ్గూడా చెప్పు.”

“తనేదో వీడిని సమ్మర్ కోచింగ్‌కు పంపి మాథ్స్, ఫిజిక్స్ లాంటివి చెప్పించాలన్న ఆలోచనలో వున్నది. నేనూ రోజూ ఉదయాన్నే స్విమ్మింగ్‍కూ తీసుకెళ్ళాలి.”

“శెలవుల్లో నన్నా వీళ్ళ మెదళ్ళను కాస్త విశ్రాంతి నివ్వండి. మీరంతా ఏ క్లాసుల కెళ్ళి ఇంత వాళ్ళయ్యారు? నా మాట వినండి.”

***

“మీ తాతా నాయనమ్మలు మా మాట వినలేదు. నిన్నక్కడ ఆ పల్లెటూళ్ళోనే వుంచేశారు. ఎలా నల్లబడి వచ్చావో చూడు. నీ తోటివాళ్ళంతా సబ్జెక్టులు నేర్చుకోవటంతో పాటు పెద్ద పూల్ లోనూ స్విమ్మింగ్ చేస్తున్నారు. రేపు ఎయిత్ క్లాసులో నువ్వు డల్‍గా అవుతావు.”

“ఏం కాదులే అమ్మా. నీళ్ళు చల్లిన గచ్చు మీద చల్లగా హాయిగా రాత్రి పూట మంచాల మీద వాకిట్లో పడుకుని తాతగారు, నాయనమ్మల దగ్గర నేనూ చాలా నేర్చుకుని వచ్చాను. నా స్నేహితుల కెవ్వరికీ రాని వేమన పద్యాలు, ఎక్కాలు చాలానే నాకిప్పుడు వచ్చు. ఇవన్నీ మీ ఇద్దరికీ కూడా రావు తెలుసా?”

“ఏంటి రా లక్కీ! ఒక్క నెల రోజులకే మీ తాతా నాయనమ్మలు నిన్ను బాగా మార్చేసినట్లున్నారు. మమ్మీ డాడీలకు బదులు, అమ్మా, నాన్నగారూ, ఎక్కాలు, వేమన పద్యాలు అంటూ తెగ ఊదర గొట్టేస్తున్నావు.”

“ఆ.. మరి.. మీరేనా ఏంటి నాన్నగారూ? లచ్చిగాడి లంకలో బెల్లం లాలీపాప్‍లు చప్పరించింది? పుచ్చకాయలు పగలగొట్టి నేనూ తినొచ్చాను. చెట్టుకే పండిన తియ్యని మామిడి పండ్లు, ఈతకాయలు, లేత ముంజలు, పట్టు తేనె అన్నీ తినటం ఇప్పుడు నాకూ తెలుసు. దోసకాయలూ, చిలగడదుంపలూ, పసుపు కొమ్మలూ, ఇలా ఎన్నో పొలం నుండి తెచ్చి నాయనమ్మ కిచ్చాం తెలుసా?” అన్నాడు లక్కీ మెరిసే కళ్ళతో, నవ్వే పెదవులతో.

“బెల్లం లాలీపాప్ లేంటి?”

“వాడి భాష నాకర్థమైంది సునందా. నేను చెప్తాను. రేవు మధ్యలో వున్న లచ్చిగాడి లంకలో మనకు పదెకరాల పొలమున్నదని నీకూ తెలుసుగా. అది మా తాతగారి నుండి నాన్నగారి వాటా కొచ్చింది. దాంట్లో చెరకూ, పసుపూ, అరటి లాంటి వన్నీ పండుతాయి. మా ఊరి నుండి ఆ లంకకు వెళ్ళాలంటే రేవు దగ్గర పడవెక్కి దాటి వెళ్ళాలి. రేవులో నీళ్ళు లేనప్పుడు నడవగలిగిన వాళూ నడిచీ, కొందరు ఎడ్లబండ్లలోనూ తిరిగేవాళ్ళు. మా ఇంట్లో నా చిన్నప్పుడు మా నాన్న తెల్లవారు ఝామునే లేచి, పడవెక్కి రేవు దాటి, అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసేవారు. తర్వాత మరోసారి పడవెళ్ళినప్పుడు, నాన్నకు భోజనం క్యారియర్ పంపేవాళ్ళు. మా పిల్లలం ఖాళీ వున్నప్పుడల్లా పడవెక్కి ఆ లంక లోకి వెళ్ళేవాళ్ళం. బెల్లం వండించేటప్పుడు మా అందరి ఇళ్ళల్లో వాడకానికని రంగు వేయకుండా, ఏలకుల పొడి కలిపి మరీ ఒక కళాయి బెల్లం వండించేవారు. మేమెళ్తే చిక్కగా వుండి గట్టిపడబోయే, నులి వెచ్చని బెల్లం పాకాన్ని ఒక గట్టి పుల్లకు వత్తుగా చుట్టి ఇచ్చేవాళ్ళు. దాన్ని మేం చప్పరించేవాళ్ళం. దానికే వీడు బెల్లం లాలీపాప్ అని మంచి పేరు పెట్టాడు. అవునా లక్కీ?”

“అవును నాన్నగారూ. కనిపెట్టేశారు. మీరంతా తలా ఒక పుచ్చకాయ కోసి పగలగొట్టి, తిన్నంత తిని మిగతాది పారేసే వాళ్ళంట గదా? దోసకాయల కోసం తీగల్ని కూడా తెంపేసే వాళ్ళంట. తియ్యని ఎర్రని చిలగడ దుంపల్ని తవ్వుక్ని తినేవాళ్ళంట. నాకు తాతగారు అన్నీ చెప్పారు. రేవు లోని ఇసుకలో నేను చాలా దూరం నడిచాను. నాకేం కాళ్లు నొప్పి వేయలా తెలుసా?”

“ఇష్టమైతే సరి. మీ తాతగారు మాటల్తో మాయపుచ్చి వుంటారు. నిజంగానే అప్పట్లో లచ్చిగాడి లంకకు వెళ్ళటం చాలా సరదాగా వుండేది. అప్పుడక్కడ, మా బంధువుల్లో చాలామంది వ్యవసాయం చేసేవారు. రకరకాల పంటల్ని పండించేవారు. వాటిని కొనటానికి వ్యాపారస్థులు ఆ లంకలోకే వచ్చేవాళ్ళు. కాని ఇప్పుడు చాలా మంది రైతులు శ్రమ పడలేక ఆ పొలాల్ని అమ్మేసుకుంటున్నారు. నాన్నలాంటి వాళ్ళు మాత్రం ఇప్పటికీ కష్టపడుతూనే వున్నారు. రేవులో నీరు లేనప్పుడు వ్యవసాయ పనులకు ఇప్పుడు ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ ఇప్పటికీ ఆయిల్ ఇంజన్లతోనే పొలాలకు రేవులోని నీళ్ళు పారించాలి. చాలా ఖర్చు అవుతోంది.”

“సముద్రపు నీరు ముందుకు చొచ్చుకొచ్చి కొంత పొలం బీడుగా అయిపోతోందంట నాన్నగారూ!”

“చాలా వివరాలు నీకు చెప్పి పంపారా నాయనా? మీ తాతగారు ఎంతైనా తిప్పలు పడతారు గాని అమ్మమంటే అమ్మరు.”

“కొనుక్కున్న వాళ్ళకు కూడా కష్టమే గదా నాన్నగారూ!”

“మేం ఇలాంటి వన్నీ ఆలోచించ లేదురా. ఒక్క నెల మీ తాతగారి దగ్గర వుండి వచ్చేటప్పటికి ఆయన లాగానే మాట్లాడుతున్నావేంటిరా బాబూ?”

“నేను ప్రతి శెలవులకు అక్కడి కొస్తానని చెప్పాను. నాకక్కడ చాలా బావుంది.”

***

“అమ్మ బాగుందా నాన్నా? ఊర్లో సంగతులేంటి? ఇన్ని మూటలు మోసుకొచ్చారా? సంచీలో ఆ సీసా లేంటి?”

“అందరూ బాగున్నారు. మన కొబ్బరి చెట్లకు కాసిన లేత బోండాలు, ముదురు కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి పట్టించి తీసిన కొబ్బరినూనె, కొమ్ములు ఎండబెట్టి పట్టించిన పచ్చి పసుపూ, కొంత వంట పసుపూ, చక్కెర కేళీలు అన్నీ సర్ది ఇచ్చింది అమ్మ. మన ఆవు ఈనింది. ఆవు జున్ను అరవై ఏళ్ళకొకసారి అయినా తిని తీరాలని అంటారురా. జున్ను వండి ఇక్కడ తలా కాస్త పంచండి.”

“శ్రమ పడి కరివేపాకు, కూరగాయలూ మోసుకొచ్చారు. ఈ గుమ్మడి కాయలూ, కందా, పెండలం లాంటి వన్నీ ఇవ్వబోయినా, తీసుకోవడానికి ఇక్కడ ఎవరూ, పెద్దగా ఇష్టపడడం లేదు. తేవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు” అన్నది సునంద విసుగ్గా.

“డబ్బులు పెడితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి నాన్నా. మా మాట వినండి. అమ్మ మూటలు గట్టి సర్దడానికీ, మీరు మోసుకు రావటానికీ సరిపోతున్నది. ఇంతకీ లచ్చిగాడి లంక పొలం బేరం పెట్టారా లేదా? ఆ లంక పొలం సాగులో వచ్చే ఫలసాయం, పనివాళ్లని మేపటానికి చాలటం లేదు.”

“నీకు తెలియనిది ఏముందిరా? ఊరికి దగ్గరలో వున్న పొలాల కన్నా ఆ లంక పొలం బాగా మెరక. రేవుకు వరద రాగానే చుట్టుపక్కలున్న పొలాలు మునుగుతాయి. రోడ్డూ, మన దొడ్లూ, దోవలు అంతా వరద పొడుస్తాది. కాని లచ్చిగాడి లంకను వరద త్వరగా పొడవదు. పైగా మొనగాడి పొలం. రేపో మాపో ఆ లంకకు కరెంట్ గూడా శాంక్షన్ అవుతోంది. చూస్తూ చూస్తా తెగనమ్ముకోవటం ఎట్లాగురా?”

“కరెంటు వస్తే ఆయిల్ ఇంజన్లకు బదులు కరెంటు మోటార్లు ఆడతాయి. కాని లంకకు చేరటానికి, అక్కడ పండిన పంటల్ని మార్కెట్‍కు చేర్చటానికి ఎంత ఖర్చవుతుందో ఆలోచించండి. గిట్టుబాటు లేని వ్యవసాయం, లాభసాటి కాని వ్యాపారం దండగ కదా నాన్నా?”

“చాలా రోజుల్నుండి అమ్మేయమనే చెప్తున్నాం. మీరు వినిపించుకోవటం లేదు. కొద్దో గొప్పో మిగలటం తప్పితే పెద్దగా డబ్బు కళ్ళకు కనబడ్డం లేదు. మీ అబ్బాయి చెప్పినట్లు చెయ్యండి మామయ్యా. మీకు తెలియనిది కాదు. అనవసరంగా శ్రమ పడటం ఎందుకని?”

“ఏ పొలమైనా ఒకేడు ఎండుద్ది, మరొక ఏడు పండుద్ది. మీరింతగా చెప్తున్నారు కాబట్టి అలాగే బేరం పెడతాను. అమ్మేద్దాం లే.”

“ఆ డబ్బుతో ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొందాం.”

“మీ ఇష్టం.”

***

“తాతగారూ! రేవులో నీళ్ళున్నాయిగా? పడవ తిరుగుతున్నదా? మనం ఇవ్వాళే లచ్చిగాడి లంక కెళ్దాం. నేనందుకే ఈ దసరా శెలవులకు ఇక్కడి కొచ్చాను.”

పడవలో జాగ్రత్తగా ఎక్కి కూర్చుని అవతలి ఒడ్డుకు చేరుకున్నారు తాతామనవళ్ళు. పొలంలో నేలంతా తడితడిగా వున్నది. అరటి మొక్కలు ఏపుగా పెరుగుతూ, గాలి వీచినప్పుడల్లా తల లూపుతున్నాయి. రైతులు, కూలీలు అక్కడక్కడ పనులు చేసుకుంటూ కనబడుతున్నారు. కనుచూపు మేరంతా పచ్చగా, కంటికింపుగా వున్నది. ఒక అరటి పిలక కున్న లేత అరిటాకును సుతారంగా తన చేతులతో పట్టుకుని వేళ్లతో రాస్తూ “మెత్తగా, నునుపుగా ఎంత బాగుందో, తాతగారూ! మనమీ పొలం అమ్ముకోవద్దు. ఇక్కడ చాలా రకాల మొక్కలు, చెట్లు కనబడుతున్నాయి. అంటే చాలా రకాల పంటలు పండుతున్నట్లేగా? ఇదంతా ఎంతో బాగుంది.”

“పొలం అమ్మటం నాకూ అస్సలు  ఇష్టం లేదురా. మీ నాన్న బలవంతం చేస్తుంటే, సరేనన్నాను. రైతన్న వాడు కష్టపడాలి, తప్పదు. తనకున్న బిడ్డల్లో ఒక బిడ్డ రెండు ముద్దలు ఎక్కువ తింటాడని వాడి ఆకలి తీర్చకుండా తల్లి వాడి కడుపు మాడ్చుద్దా? కాస్త తెలివి తక్కువ కొడుకుని చదివించటానికి ఖర్చు ఎక్కువవుతుందని చదివించకుండా తండ్రి వదిలేస్తాడా? ఇదీ అంతే. ఖర్చూ, శ్రమా ఎక్కువే. కానీ ఈ పొలం నా ప్రాణం. నన్నెప్పుడూ నిరాశ పరచలేదు. రైతు గుండె లోని ప్రేమా, తేమా మీ నాన్నలాంటి వాళ్ళకు అర్థం కాదు. చిన్నవాడి వైనా నువ్వు అర్థం చేసుకున్నావు. నువ్వు పెద్దవాడివైన తర్వాత ఈ లచ్చిగాడి లంక పొలాలకు ఏమైనా మేలు చెయ్యాలని ఆలోచించు. అదేంటంటే సముద్రపు నీటి తడి పాకి వచ్చి, ఇక్కడి పొలాలు చౌడేసి పోతున్నాయి. ఆ చౌడు విరగటానికి జిప్సమ్ లాంటివి వాడతా వున్నాం. కానీ పెద్దగా ఉపయోగం వుండటం లేదు. నీ తరం వాళ్ళయినా దాని విరుగుడుకు మరేదైనా మంచిది కనిపెట్టండి. అప్పుడు నాలాంటి రైతులు ఈ పొలాలను వదిలించుకోవాలనుకోరు” అన్నాడు కాలితో, నీటి జాలును నొక్కుతూ.

“మీరు చెప్పినది గుర్తుంచుకుంటాను తాతగారూ, మర్చిపోను.”

“పసి మనసుతో, లేత పలుకులు పలికినా, నీ మాటలతో నాకు మళ్ళీ పొలం మీద ఆశ పుడుతోందిరా. ఈ పొలాన్ని నీ కోసమే అమ్మకుండా వుంచుతాను. అమ్మేది లేదని మీ నాన్నకు గట్టిగా చెప్తానురా” అంటూ ఆ తడి నేల మీదే చతికిలబడ్డాడు.

కూర్చున్న తాతగారి భుజంపై లక్కీ అనునయంగా చేయి వేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here