లంబీ జుదాయి!

0
12

[ఆనంద్ బక్షి రచించిన హిందీ కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Anand Bakshi’s Hindi poem by Mrs. Geetanjali. గజల్ గాత్రం పాకిస్థానీ గాయని రేష్మ.]

~

[dropcap]ప్రి[/dropcap]యా.. నాలుగైదు రోజుల ప్రేమ మనది!
ఓహ్హ్ అల్లాహ్.. మేం విడిపోయి కూడా
నాలుగు రోజులు కాలేదు!

ఇంతలోనే ఈ దూరం ఏమిటి?
ఇక ముందు నిన్ను ఎడబాసి
ఏళ్లకేళ్ళు ఎట్లా బతికేది?
నీ జ్ఞాపకాలకు బదులు
నాకు మృత్యువు వచ్చినా బాగుండేది!
ఇంత సుదీర్ఘ వియోగాన్ని ఎలా తట్టుకోను?
నువ్వెక్కడున్నా నా ప్రాణమా..
నా పెదాలు నీ కోసం ప్రార్ధిస్తూనే ఉంటాయి.?
***
నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో చూసావా?
నా ప్రాణ పదమైనవాడు నా దగ్గర లేడు..
ఇక ముందు అతన్ని కలిసే
ఆశ కొంచెం కూడా లేదు..
దాని మీద వచ్చి పడిన
ఈ వసంత రుతువు..
నాలో వలపు నిప్పుని రాజేసింది.
ఓహ్హ్… ఈ వియోగాన్ని
ఇంకా ఎంత కాలం భరించాలి?
***
ముక్కలైన కాలం
నీ చేతులని విరగ్గొట్టింది.
ఆ చేతుల తోనే నువ్వు
నా సున్నితమైన హృదయపు
అధ్ధాన్ని బ్రద్దలు కొట్టావు!
ఒక యుగానికి సరిపడా..
మన మధ్య ఎత్తయిన
అడ్డుగోడలను లేపావు.
ఇధ్ధరి మధ్య ఇంత..
సుదీర్ఘ వియోగమా..
ఎలా బ్రతకాలి నిన్ను విడిచి?
***
నేను పెంచుకున్న పూల తోట
నాశనం అయిపోయింది.
ప్రణయ పుష్పాలు
వికసించక మునుపే
తోట ఎండిపోయింది.
కలవక ముందే
ప్రేమ పక్షులు విడిపోయాయి.
ఈ వసంతపు కోయిల పాట..
నన్ను విషాదంలో ముంచేస్తున్నది.
ఓహ్హ్… ఎంత సుదీర్ఘ ఎడబాటు ఇది?

కొద్ది రోజుల ప్రేమకే..
ఈ వియోగ దుఃఖాన్ని
ఎలా భరించేది..
అది కూడా నువ్వే చెప్పు కాస్త??

~

మూలం: ఆనంద్ బక్షి

అనువాదం: గీతాంజలి


ఆనంద్ బక్షి ప్రముఖ కవి, సినీ గీత రచయిత. మూడు వందల సినిమాలకు వేలాదిగా పాటలు రాసిన ఆనంద్ బక్షి నాలుగు సార్లు ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here