లేత మనస్సులు

2
8

[dropcap]నా [/dropcap]ముప్ఫై ఏళ్ళ సర్వీసులో ఇలాంటి చేదు అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆర్.టి.సి.లో డ్రయివర్‌గా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అన్ని రూట్లలో పని చేశాను. ఎక్కడ పని చేసినా ఏ రూట్లో వెళ్ళినా చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరితోను సత్సంబంధాలు ఉండేవి.

ఆయా ప్రాంతాలలో విందులు వినోదాలు పెళ్ళిళ్ళు పేరంటాలు, ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడి వారు “రోసయ్యా నువు రావాల్సిందే” అని ఆహ్వానించే వారు. నేనూ వెళ్ళి వచ్చేవాడిని.

పట్టణ ప్రాంతాలలో తిరిగే డ్రైవర్లను జనం అంతగా పట్టించుకోరు. పల్లె రూట్లలో తిరిగే వారికే ఈ గుర్తింపు, గౌరవం ఉంటుంది.

ఏదైనా వ్యవహారం పెట్టుకోవాలంటే సమ ఉజ్జీలతో పెట్టుకుంటే హుందాగాను గౌరవంగానూ ఉంటుందంటారు పెద్దలు. నేను పొయ్యి పొయ్యి పిల్లలు అదీ ఎలిమెంటరీ స్కూలు పిల్లలతో పెట్టుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

నాకు నేనుగా ఒక ఎత్తేస్తే వాళ్ళు రెండెత్తులేసి చివరకు నన్ను చిత్తుచేస్తూ ఉన్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేక మరింత ఠారెత్తిపోతూ ఉన్నాను. బలవంతమయిన సర్పము సయితము చలి చీమల చేత చిక్కి చావదే అనే పద్యం నాకు మాటిమాటికి గుర్తుకొస్తూ ఉంటుంది.

వాళ్ళు చిన్నపిల్లలు, నేను పెద్దవాణ్ణి, వాళ్ళకెందుకు భయపడాలి, సంజాయిషీ ఇచ్చుకోవాలి అనే ధీమా, గర్వం నాది. చివరకు నాకు గర్వభంగమే జరిగిందనుకోండి.

ఇంతకూ నేను చేసిన తప్పంతా పుత్తూరు కోదండరామాపురం బస్సులో తిరగటమే. ఉదయం పూట వాళ్ళు స్కూలుకు పోతూ ఎదురుపడతారు. సాయంకాలం ఇళ్ళకు పోతూ మరొక్కసారి ఎదురుపడుతూ ఉంటారు. ఎదురు పడినప్పుడంతా వాళ్ళు నాకు టాటా చెప్పడమో నమస్కరించటమో చేస్తూ ఉంటారు. నేను కూడా ప్రతి నమస్కారం చేసే వాడిని. వాళ్ళు పరమానందభరితులై వెళ్ళేవారు.

ఏ ఇబ్బంది లేకుండా రూట్లో తిరిగేవాడిని. అలాంటిది ఒక రోజు నేనేదో పరధ్యానంలో ఉండి వాళ్ళ నమస్కారానికి ప్రతి నమస్కారం చెయ్యలేకపోయాను. దాంతో వాళ్ళు నా మీద పగపట్టారు. ఇంత చిన్న విషయానికి వాళ్ళింత పగపడతారని నేననుకోలేదు. పగపడితే ఎలా ఉంటుందో చెపితే ఇతరులకు అర్థం కాకపోవచ్చు అనుభవించిన నాలాంటి వాడికే తెలుస్తుంది.

ఒక రోజు నేను బస్సు నడుపుకుంటూ కార్వేటినగరం దాటి కోదండరామాపురానికి వెళుతూ ఉన్నాను. ఎలాగు పిల్లలు ఎదురు పడతారు వాళ్ళు నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేసి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలని మనస్సులో అనుకున్నాను. వెళుతూ ఉంటే పిల్లలేమో ఎదురు పడ్డారు. వాళ్ళు నమస్కరించలేదు కదా! నావైపు గుఱ్ఱుగా చూచి వెళ్ళిపోయారు.

చిన్నపిల్లలకే అంత గర్వం ఉంటే నాకుండదా! వాళ్ళ వల్ల ఏమవుతుందిలే అనుకున్నాను. రాత్రి పదిన్నర గంటలకు నైటాల్టు వెళుతుంటే తెలిసింది వాళ్ళేమి చేశారన్నది. రోడ్డు కడ్డంగా రాళ్ళు గుట్టలు గుట్టలుగా రెండు మూడు చోట్ల పేర్చి పెట్టేశారు. బస్సులోనూ ప్రయాణికులెవ్వరూ లేరు. ఉన్న వాళ్ళ నగరంలోనే దిగేశారు. నేను కండక్టరే ఉన్నాము. ఆ వేళ్ళకు బోజనం కూడా చేయలేదు. బోంచేస్తే నిద్దరొస్తుందని బస్సు అక్కడ పెట్టేసిన తరువాత తీరిగ్గా తినే అలవాటు. ఆకలితో పాటు నిద్దరొక పక్క ఏం చేస్తాం ఆ రాళ్ళన్ని ఎత్తి పక్కకు పారేసి కోదండరామాపురం చేరేసరికి రాత్రి పండ్రెండు గంటలయింది. ఆ సమయంలో పిల్లలు ఒక్కడు కనబడినా గొంతు నులిమి చంపేసి ఉండేవాడిని అంత కోపం నాకు పళ్ళు కొరుక్కుంటూ నిద్రపోయాను. రేపు వాళ్ళ మీద ఎలా రివేంజి తీర్చుకోవాలా? అని ఆలోచిస్తూ.

ప్రొద్దున అయిదు గంటలకు కోదండరామాపురంలో బయలుదేరాలి. నాలుగు ముప్ఫైకే లేశాను. మామూలుగా దేవుణ్ణి తలుసుకొని నిద్రలేసేది. ఆ పూటెందుకో ఆ కుఱ్ఱ వెదవలు, వాళ్ళు పేర్చిన రాళ్ళే గుర్తుకొచ్చాయి. ఆ వేళకే ఆ ఊరి పెద్ద వాళ్ళు నిద్రలేసి కనబడ్డారు. వాళ్ళతో రాత్రి జరిగిన విషయమంతా చెప్పేశాను. ఇలా చేస్తే మేము డ్యూటీకి రాలేమని బస్సును నిలిపేస్తామని కూడా చెప్పేశాను.

వాళ్ళు “మా పిల్లలు చేసిన తప్పుకు క్షమించండి మేము వాళ్ళను తోలు వొలిచేస్తాము” అని హామీ ఇచ్చేదాకా నా కోపం మెట్టు దిగింది కాదు. మళ్ళా ఎనిమిది గంటల సింగిల్కు వెళుతుంటే ఎదురుపడ్డారు. వాళ్ళు తప్పుచేసిన వాళ్ళల్లా తలొంచుకున్నారు. కాని వాళ్ళ కళ్ళలో మునుపటి కంటే ఎక్కువ కోపం కనబడింది. కుఱ్ఱ వెధలవలకు తగిన శాస్తి జరిగిందిలే వాళ్ళ అమ్మనాన్నలు బాగా బుద్ధి చెప్పినట్టుంది. ఇక మన జోలికి రారులే అనే ధీమాతో వెళుతున్నాను తుస్సుమన్న శబ్దం వినబడింది. నిలిపి చూస్తే ముందు టైరు పంక్చరయ్యింది. కొత్త టైరు ఎలా పంక్చరయిందబ్బా! అని చూస్తే, రోడ్డు వారన టైరు వెళ్ళే దారిలో బెత్తెడు పొడవు ఓ పదునైన మేకు దిగగొట్టబడి ఉంది. మల్లా నాకు కోపం నషాళానికి అంటుకొంది. నా నోటి నుంచి బూతులు గూడా రాక తప్పలేదు.

బండిలో స్టెప్నీ లేదు. అది వేరే బండ్లు వచ్చే దారి కాదు. ఆ రోజు మా పిల్లవాడికి పుట్టిన రోజు. త్వరగా వచ్చేస్తానని చెప్పాను. కాని ఏం చేయను కండ్రక్టరు ఎవరిదో బండొస్తే దిగి వెళ్ళిపోయాడు. ప్రయాణికులు ఎవరి దారి వారు చూచుకొన్నారు.

ఇక పండ్రెండున్నర గంటలకు ఆ రూటు సర్వీసు బండొస్తే దాంట్లో స్టెప్నీ వేసుకొని మెకానిక్ వచ్చాడు. తరువాత బండి రడీ చేసుకొని వెళ్ళేసరికి మద్యాహ్నం రెండున్నర గంటలయింది. ఇంటికి వెళితే నేను పుట్టిన రోజు పండక్కి రాలేదని పెళ్ళాం పిల్లలు పలకరించనైనా లేదు. నా మీద వారూ రివేంజి తీర్చుకున్నారు!

మరుసటి రోజు వీక్లీ ఆప్ వేరే అతను డ్రయివరిగా వెళ్ళాడు. ఉండబట్టలేక అతన్ని అడిగాను రూట్లో ఏదన్నా ప్రాబ్లమ్మా అని, అతను ఏమీ లేదన్నాడు. దాంతో నాకోపం మరీ ఎక్కువయిపోయింది.

అతనూ ఇబ్బందులు పడినట్టు చెప్పి ఉంటే నేను కొంతైనా సంతోషపడి ఉండేవాడినేమో. ఒక్కొక్క సారి మన కోపం ఈలాంటి వింత ప్రకోపానికి దారి తీస్తుంది. ఎదుటి వాళ్ళ ఇబ్బందులు మనకు సరదా పడేలాగ.

మరలా డ్యూటీకి బయలుదేరాను. తోటి డ్రయివర్లు సరదాగా జోకులేస్తూ ఉంటే నేను వాళ్ళతో సరదాగా గడపలేక సీరియస్‌గానే ఉన్నాను. ఎందుకలాగ ఉన్నావని తోటివారు అడిగారు ఇది చెప్పే విషయము కాదు చెప్పినా వాళ్ళ దృష్టిలో సులకనవడం కాయం. నవ్వులపాలవుతామని చెప్పలేదు.

బస్సును నేరుగా తీసుకొచ్చి సి.డి. కండిగ ఎలిమెంటరీ స్కూలు వద్దకు తెచ్చి ఆపాను. దిగి స్కూలులోకి వెళ్లాను. పిల్లలు అయ్యవార్లు అంతా నా వంక చూస్తూ ఉన్నారు. ఏం చెబుతాడోనని, జరిగిన విషయమంతా హెడ్ మాస్టరుకు చెప్పాను. మీరు వాళ్ళను కట్టడి చెయ్యకపోతే ఈ రూట్లో బస్సు రాదని చెప్పేసాను. మీరు ఇలాగేనా వాళ్ళను క్రమశిక్షణలో పెట్టేది అని వాళ్ళ లోపాన్ని వేలెత్తి సూపేసరికి తట్టుకోలేక, వాళ్ళకు కోపం వచ్చేసింది. వెంటనే కోదండరామాపురం పిల్లలంతా లేవండని హెడ్ మాస్టరు హుంకరించాడు. అందరూ లేచి నిలబడ్డారు. బెత్తంతో వాళ్ళను వాతలెగిరేలా కొట్టాడు. గోడకుర్చీ వేయించాడు. పిల్లలందరూ నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతూ ఉన్నారు. కాబట్టి వారు చేసిన తప్పుకు చింతిస్తూ ఉన్నారని అనుకున్నాను. వాళ్ళకు తగిన శిక్షపడినందుకు నవ్వొచ్చింది. నవ్వుతూనే ఉన్నాను. ఆపుకోలేకపోయాను. మరీ పగలబడినవ్వాను వికృతంగా,

నా మనస్సుకు నా నవ్వే వెకిలిగా అనిపిస్తూ ఉంది. అయినా రివేంజి అనేది అలా నవ్విస్తూనే ఉంది. ఒక్కొక్క సారి మన పంచేంద్రియాలు మనస్సు ఆదీనంలో ఉండవు. అతిక్రమిస్తాయి. మనిషిని అవహేళనకు గురిచేస్తాయి. చేసే పని తప్పని తెలిసినా చేస్తూనే ఉంటాము. ఈలాంటి వన్ని మనస్సును అతిక్రమించి చేసేవే. ఈనాటితో వాళ్ళ తిక్క కుదిరింది. ఇక నా జోలికి రారని నిర్ధారించుకొని వెళ్ళిపోయాను.

మరల వారం రోజుల వరకు వారు నాకు కనబడింది లేదు. ఎప్పుడుపోతూ ఉన్నారో ఎప్పుడు వస్తూ ఉన్నారో అసలు స్కూలుకు నిలిచే పోయారేమోనని అనుకున్నాను.

ఇక నా జోలికి రారని నిర్ధారణకు వచ్చేశాను. కానీ ఒక రోజు రాత్రి ఏడు గంటలప్పుడు కోదండరామాపురం నుంచి పుత్తూరుకు తిరిగి పోతూ ఉన్నాను. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఇరువైపులా మామిడి తోటలు బస్సులో నలుగురైదుగురు ప్రయాణికుల కంటే ఎక్కువ లేదు. అంతే ఉన్నట్టుండి బళ్ళున శబ్దం అయింది. తీరా చూస్తే ఓ పెద్ద రాయి ముందు అద్దం మీద పడి ముక్కలు ముక్కలుగా పగిలి చెల్లా చెదురైంది. పగిలిన అద్దం ముక్కలు కొన్ని నా ముఖం మీద అక్కడక్కడా తగిలి రక్తం బొట్లు బొట్లుగా కారటం మొదలైంది. బస్సు నిలిపేశాం! అంత చీకటిలో చుట్టూ వెతికాం ఎవ్వరూ కనబడలేదు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. చెట్ల మీదనో చాటునో ఉండి ఆ పిల్లలు దాడి చేసుండాలి, అది తలుసుకోవటం వల్ల నేమో నా మనస్సుకు నిస్పృహ ఆవరించి ఒక్కసారిగా అశక్తుడనైపోయాను. వారితో నేనింక పోరాడలేననిపించింది. పోరాడలేనప్పుడు ఓడిపోయిన వాడు ఎలా చేతులెత్తేస్తారో అలా చేతులెత్తేశాను, డ్యూటీ దిగేశాను. సదరు అద్దానికి గాను ఆర్.టి.సి. వాళ్ళు నా వద్ద మూడు వేలు రూపాయలు వరకు వసూలు చేశారు. ఆ నెల పే స్లిప్ చూచిన నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. పోనీ మనమే ఓ మెట్టు దిగి రూటు మార్చుకొంటే పోలా ఎందుకొచ్చిన గొడవనుకుంటూ కంట్రోలర్ దగ్గరకెళ్ళి వేరే రూటుకు మార్చమన్నాను.

అతను ఇప్పుడు ఆ పని చేస్తే తనెతుట్టెను కదిపినట్టవుతుంది. అన్ని యూనియన్ల వాళ్ళు ఏదో ఒక ఆబ్లిగేషన్‌తో ఇబ్బంది పెడతారు అని చేతులెత్తేశాడు. చేసేది లేక రెండు రోజులు లీవు పెట్టేశాను.

పనిపాట లేకుండా రెండ్రోజులు ఇంట్లో ఉండే సరికి నాకేమి తోచలేదు. క్షణమొక యుగమైనట్టు కాలం స్తంభించిపోయినట్టు తోచింది. నేనుకొన్ని ఏళ్ళుగా ఒక క్రమపద్దతికి అలవాటు పడిపోయాను. ఉదయాన్నే డ్యూటీకి రాత్రైతే ఇంటికి వీక్లీ ఆప్ వచ్చిందంటే ఆ వారంలో చెయ్యాల్సిన పన్లన్నీ ఆ రోజు చేసుకొనే వాడిని. అలాంటిది. రెండు రోజులు ఖాళీగా ఉండేసరికి ఏమి తోచలేదు.

డ్యూటీకి వెళ్ళాలనిపించి వెళ్ళాను. తరువాత నాకే అనిపించింది ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో నుంచి చూస్తూ ఉన్నానేమోనని. సమస్య లేచింది ఎక్కడ అనుకుంటే ప్రతిదీ సమస్యే కదా. కాదనుకొంటే ఏదీ సమస్య కాదు. పనేమి లేకుంటే సమస్యే రాదనుకుంటే తిని కూర్చోవటం కూడ పెద్ద సమస్యగానే అనిపిస్తుంది.

ఇక మీదట నేనుగా వారి జోలికి వెళ్ళదల్చుకోలేదు. వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోక ఏమీ తెలియని వాడిలా ఉండిపోవాలని అనుకున్నాను. నేను రూట్లో పోతూ ఉంటే పిల్లలంతా ఎదురు పడ్డారు. వాళ్ళు నా వంక చూడనైనా లేదు. చూస్తే చేయి ఊపి స్నేహానికి ముందుగా నేనే నాంది పలకాలని ఆశించాను. వాళ్ళ దారిన వారు పోతూ ఉన్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి.

ఒక రోజు నేను డ్యూటీలోనే ఉన్నాను. రూట్లో పోడూతుంటే మామిడి చెట్లు పూత పూసి పిందెలేస్తూ ఉండగ మిగిలిన చెట్లన్ని ఆకులు రాలిపోయి బోసిగా కనుపిస్తూ ఉన్నాయి. మరళా చిగురించటానికేమోనన్నట్టు ఆకాశం బాగా మబ్బు పట్టి పెళపెళమని ఉరుములు ఎక్కడో పిడుగు పడిన శబ్దంతో చెవులు చిల్లులు పడినట్టయింది. వీచే గాలిలో మట్టి వాసనలు కలగలిపి ముక్కుపుటాల్ని తాకి వెళుతున్నాయి. దీని పట్టి దగ్గర్లో ఎక్కడో వర్షం పడేటట్టుగా అనుపించింది.

పశువులైతే కొన్ని తోకలనునిటారుగా పైకి లేపి మోరలు పైకెత్తి మట్టి వాసనల్ని పీల్చి మజా చేస్తూ చెంగుచెంగున గంతులేస్తూ కనబడ్డాయి. ఈ మధ్యన శాస్త్రవేత్తలు కూడా రాబోవు ప్రకృతి వైపరీత్యాలను పశుపక్ష్యాదులు ముందుగానే పసిగట్టగలవని చెప్పటం విన్నాం. మనిషి పసిగట్టలేని వర్షం రాకను అవీ ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాయేమో ననిపించింది.

చూస్తూ ఉండగానే గాలి వాన. గాలి అంత పెద్ద బస్సునే ముందుకు పోనీయక అటు ఇటు ఊపేస్తూ ఉంది. దీనికి తోడు వడగండ్లు రాళ్లు లాగ బస్సు మీద పడి దభి దభా మని శబ్దం వస్తూ ఉంది. అప్పుడు వొంటిపూట బళ్ళు మాత్రమే అంతటి గాలి వానలో పిల్లలు ఇంటికి వెళుతున్నట్టుగా ఉంది. వాళ్ళు వేసుకున్న బట్టలన్ని అప్పటాటికే తడిసి ముద్దెపోగా పుస్తకాల సంచులు కూడా తడిసి నీళ్ళు ధారగా కారుతూ ఉన్నాయి. అందరూ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చెట్టు కొకరు పుట్టకొకరు లెక్కన అయిపోయినారు. నేను వాళ్ళ దగ్గర బస్సు ఆపేశాను. ఎక్కమంటే ఎక్కనంటారు. అంత వానలో నేనే దిగాల్సి వచ్చింది. దొరికిన వాణ్ణి దొరికినట్టే లోపల ఈడ్చి పడేశాను. నేను అప్పటికే తడిసి ముద్దయిపోగా వడగండ్లు పెటీపెటీమని పడుతున్నా లెక్క చేసిన వాణ్ణికాదు. బస్సులోపల కూడా రొచ్చురొచ్చుగా మారిపోయింది. అద్దాల సందుల్లో నుంచి నీళ్ళు ఉబికి లోపలికొచ్చేస్తూ ఉన్నాయి.

ఇంత జరుగుతున్నా వాళ్ళనెక్కిస్తూ ఉన్నా కండక్టరు అభ్యంతరం చెప్పటం కాని నోరు తెరిచి మాట్లాడిన వాడు మాత్రం కాదు. గుడ్లప్పగించి చూస్తూ ఉండటం తప్ప. బస్సు స్టార్టు చేసి దాదాపు కోదండరామాపురం దగ్గరికొచ్చేశాను. అంత వానలో మసక మసగ్గా రోడ్డు మీద జీపు కనబడింది. ఎవరిదోలే అనుకున్నాను. అప్పటికే ఇద్దరు వ్యక్తులు జీపు దిగి రోడ్డు మీదకు వచ్చారు. రెయిన్ కోటుల్లో ఉన్నా పూర్తిగా తడిసి ముద్దయి పోయి ఉన్నారు. బస్సు ఆపటం ఆలస్యం పరుగున ఐసెక్కి కండక్టరు చేతిలో ఉన్న ట్రె,ఎస్.ఆర్.ను లాక్కున్నారు. అంత మందిని టిక్కెట్టు లేకుండా ఎక్కించినందుకు కండ్రక్టరు మీద కేసు రాస్తానన్నారు. నేను వప్పుకోలేదు. పిల్లలను ఫైన్ కట్టమన్నారు. దానికి నేను కాదన్నాను. “దీనికంతటికి పూర్తి బాధ్యుణ్ణి నేనే, నా మీద కేసు వ్రాసినా సరే తొలగించినా నాకు అభ్యంతరం లేదు” అని వాదించాను. దాంతో నన్ను డ్యూటీ నుంచి తొలగించి విచారణ చేసేసరికి రెండు నెలలు అయిపోయింది. ఇంక్రిమెంట్లు లాంటి బెనిఫిట్స్ కట్ అయినా ఉద్యోగం మల్లా ఇచ్చారు. అదే రూటులో వెళుతున్నాను. మునుపటిలా వాళ్ళకు నా మీద ద్వేషమేమి లేదు. మనల్ని కాపాడబోయి పెద్ద రిస్కు తీసుకున్నాడనేది వారి ఆలోచన. కావచ్చు అదే వారికి నామీద ఏర్పడిన సింపతీకి కారణం!

నేను డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఎదురుపడి నమస్కరించటమో చెయూపి టాటా చెప్పడమో సర్వసాధారణమైపోయింది. నేను కూడా దానికి దీటుగా స్పందిస్తూనే ఉన్నాను. నేనొక రోజు సాయంకాలం బస్సు నడుపుకుంటూ వెళుతూ ఉన్నాను. మసక మసక చీకటి హెడ్ లైట్లు కాంతిలో రోడ్డు స్పష్టంగా కనబడుతూ ఉంది. అల్లంత దూరంలో రోడ్డుకడ్డంగా ఏదో కనబడింది అంతే బ్రేకు మీద కాలేసి స్లో చేశాను. చెరుకు ట్రాక్టరు బోల్తా పడి ఉంది. చూస్తే స్కూలు పిల్లలు తమ పుస్తకాల సంచులను పక్కన పడేసి రోడ్డుకడ్డంగా ఉన్న చెరుకును ఎత్తి అవతల పారేస్తూ కనబడ్డారు. అంతే బస్సు ఆపి క్రిందకు దిగి పిల్లల్ని అడిగాను. ‘మీరెందుకు ఈ పని చేస్తూ ఉన్నారు. ట్రాక్టరు డ్రైవర్ ఏమయ్యాడ’ని, అందుకు వారు ‘డ్రైవర్ మనుష్యుల్ని తీసుకొస్తానని అప్పుడనగా వెళ్ళిన వాడు ఇంతకూ రాలేదు. మరి మీరు చీకట్లో ఎత్తలేక ఇబ్బంది పడతారని మేమే ఎత్తి వారగా పడేస్తూ ఉన్నామ’ని చెప్పే సరికి నా మనస్సుకెట్ అయిపోయింది. చీ! ఛీ! ఇలాంటి పిల్లలకా నేను కీడు తలపెట్టింది. తల్లిదండ్రుల దగ్గర తిట్లు అయ్యవారి దగ్గర వాతలు గోడ కుర్చీ తల్సుకుంటే నా మీద నాకే అసహ్యమేసింది.

వాళ్ళ ఔదర్యం కొండలా నాముందు పెరిగిపోతూ ఉంటే నేనేమో మరుగుజ్జులా మారి నాకు నేనే నీచంగా కనబడసాగాను. సరేనని తమాయించుకొని ‘మీరు చిన్నపిల్లలు పక్కకు వెళ్ళండి. బస్సులో ఉన్నవారు మేము తీసి పడేస్తామం’టే వినకుండా వాళ్ళపని వాళ్ళు చేశారు మేము చేయి చేయి కలిపి చిటికెలో రోడ్డుకున్న అడ్డాని తొలగించి వెళ్ళిపోయామనుకోండి.

మరొక్కసారి ఇలాంటి సంఘటనే జరిగింది. గాలి వానొచ్చి కరెంటు లైన్లు తెగి రోడ్డు కడ్డంగా పడిపోతే పెద్ద వాళ్ళు ఎవరూ లేకపోయినా వాళ్ళు అక్కడే కాపలా ఉండి చివరకు నా ప్రాణానే కాపాడారు. నేనొక్కడినే కాక బస్సులో ఉన్న ప్రయాణికులందర్ని సేవ్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు వాళ్ళకు నాకు మధ్య స్నేహబంధం పునరుద్దరింపబడిన తరువాత.

తరువాత రాష్ట్ర ప్రభుత్వం దయతలసి ఎలిమెంటరీ స్కూలు పిల్లలకి ఉచిత ప్రయాణం ఆర్టిసి బస్సులో కల్పించారు. దీంతో రోజు వాళ్ళని ప్రయాణికులతో పాటు తీసుకెళ్ళి దింపటం మరలా స్కూలు విడిచిన తరువాత తీసుకురావటం పరిపాటైపోయింది. ఆలస్యమయినా జనం రద్దీగా ఉన్నా వాళ్ళను వదలి వెళ్ళింది లేదు. అప్పుడప్పుడూ వాళ్ళకు చాక్లెట్లు కూడా తీసుకెళ్ళి ఇస్తుండేవాడిని. వాళ్ళు నాకు పుట్టిన రోజనో, పండగ రోజన్ చాక్లెట్లు వడలు పాయసాలు తెచ్చివ్వటం మామూలు అయిపోయింది. ఎప్పుడూ డ్రైవర్ అంకుల్ డ్రైవర్ అంకుల్ అంటూ నా చుట్టూ చేరి ఊపిరి సలుపనిచ్చేవారు కాదు.

ఈ పసివాళ్ళు నేను డ్యూటీకి రాని రోజు ఏదో తమకిష్టమైన వస్తువు దారబోసుకున్న వారిగా కనుపించేవారట. నన్ను చూస్తూ ఉండగానే ఉత్సాహం ఇనుమడించేదని ప్రయాణికులు అప్పుడప్పుడూ నాతో అంటూ ఉంటే విన్నాను. నేను వాళ్ళ కోసమే లీవు పెట్టకుండా డ్యూటీలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తరువాత నేను డ్రయివరుగా రిటైరు అయ్యాను. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. అక్కడక్కడా కనబడి ఇప్పటికి ఆప్యాయతలతో పలకరించి నేను నా సమాచారములు విచారించట రివాజుగా వస్తూ ఉంది.

చిన్నపిల్లల మనస్తత్వం ఒక్కక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కర్ని దండించితే దారిలో పడతారు. ఇంకొందరు దండించితే రెచ్చిపోయి వద్దనన్న పని అదేపనిగా చేస్తారు. దీంతో మనం ఎవరితో ఎలా మెలగాలో అలా మెలగాలి. పిల్లల్ని కూడా మంచిగా పెంచి పోషించడమనేది అరవై నాలుగు కళల్లో ఇదీ ఒక కళ అనుకుంటా. ఈ కళ తెలిసుంటే చిన్నపిల్లలతో కలిసి మెలిసి ఉండడంలో ఉన్న అనందం ఇంకొక దానిలో ఉండదు. ఇది తెలిసిన కొంతమంది ఉపాధ్యాయులు తమ ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ ఉండటం మనం నిత్యజీవితంలో అనేక మందిని చూస్తూ ఉంటాం ఈ కళలో ప్రావీణ్యం లేని అనేకమంది తరచు పిల్లల చేత అవహేళనకు అవమానాలకు గురవుతుంటారు ఏదిఏమైనా చిన్నపిల్లల్ని లేత వయస్సులోనే వారి మనస్తత్వాన్ని ఎరిగి దారిలో పెట్టాలి. అలాకాక చిన్నపిల్లల అల్లరికి దండించటమొకటే దారనుకొంటే వారిలో శాడిజం మొక్కనుంచి మానై చివరకు మహావృక్షమై వంచలేని స్థాయికి ఎదిగి కొరకరాని కొయ్యగా మరింత పెంకెగా తయారయే ప్రమాదముంది. అది వారికే కాక సమాజానికి మరింత నష్టం. మొక్కై వంగనిది మ్రానై వొంగదు గదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here