తప్పులెన్నువారు…

0
10

[dropcap]ఉ[/dropcap]క్రెయిన్‌పై రష్యా దాడి జరుగుతున్న ఈ రోజుల్లో చాలామంది రష్యన్లు తమ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవలసిందేమింటంటే ఒక దేశం మొత్తాన్ని భూతంలా చూడకూడదు. రష్యా ప్రజలు చాలామంది అణచివేతకు గురవుతున్నారు. ఒక నాయకుడి విస్తరణ కాంక్ష ఈ యుద్ధానికి ముఖ్యకారణం. చారిత్రకంగా ఇంకా కారణాలు ఉండొచ్చు. కానీ దేశం మొత్తాన్ని దోషిగా చూడటం తగదు.

అన్ని దేశాల్లోనూ వికృత సమస్యలు ఉంటాయి. మన దేశంలో అవినీతి, పరువు హత్యలు, మహిళలపై అత్యాచారాలు వికృత సమస్యలు. చట్టాల ద్వారా వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. రష్యా లాంటి దేశాల్లో చట్టాలు ఒక నాయకుడి చెప్పుచేతల్లో ఉంటాయి. అవినీతి విశ్వరూపం దాల్చింది. నిరసన వ్యక్తం చేయటం కూడా తప్పే. తమ దేశంలోని సమస్యలు పట్టించుకోకుండా ఇతర దేశాలలో తప్పులు పట్టేవారు గురివింద గింజలే. ఇక తిరుగుబాటు జరిగితే తప్ప పరిస్థితి మారదు.

కొందరు కళాకారులు తప్పులు ఎత్తిచూపుతారు. అలా రష్యాలోని కొన్ని సమస్యలని ఎత్తిచూపిన చిత్రం ‘లివయథన్’ (Leviathan). ఆంద్రే జ్వగింత్సెవ్ రూపొందించిన ఈ చిత్రం 2014లో విడుదలయింది. లివయథన్ బైబిల్‌లో చెప్పబడిన ఒక రాక్షస సముద్రసర్పం. దేవుడు దాన్ని సంహరిస్తాడు. ఈ సినిమా చూశాక ఆ రాక్షస సర్పం దేనికి ప్రతీకయో మనమే నిర్ణయించుకోవాలి.

కథలోకి వెళితే కోల్యా ఒక కారు మెకానిక్. తన కొడుకు రోమా, రెండో భార్య లీల్యాతో రష్యాలో ఉత్తర తీరప్రాంతపు ఊళ్ళో నివసిస్తూ ఉంటాడు. ఎవర్నీ ఒకపట్టాన నమ్మడు. మొరటుగా ఉంటాడు. తాగుడు అలవాటు ఉంది. కోపం వస్తే కొడుకుని ఓ దెబ్బ వేయటానికి వెనుకాడడు. లీల్యా సౌందర్యవతి. ఒక చేపల ప్యాకింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. రోమా టీనేజి కుర్రాడు. కోల్యా ఇల్లు తాతల కాలం నాటిది. ఆ స్థలంపై ఆ ఊరి మేయర్ కన్నుపడుతుంది. అక్కడ టెలీకమ్యూనికేషన్ టవర్ కట్టాలని ప్రతిపాదించి తక్కువ పరిహారంతో ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. కోల్యా మాస్కో నుంచి లాయరైన తన మిత్రుడు దీమాను రప్పిస్తాడు. కోర్టులో అప్పీల్ చేసుకున్నా ప్రయోజనం ఉండదు. జడ్జి మేయర్‌తో కుమ్మక్కయి ఉంటుంది. అయితే మేయర్ అక్రమాల గురించి దీమా సాక్ష్యాలు సేకరించాడు. వాటి ఆధారంగా మంచి పరిహారం రాబట్టవచ్చని ధైర్యం చెబుతాడు. ఆ స్థలంలో విలాసవంతమైన నివాసం కట్టుకోవాలని మేయర్ పన్నాగమని కోల్యా అనుమానం. కోర్టులో కోల్యా అప్పీల్ తిరస్కరించిన రోజు రాత్రి మేయర్ తాగి కోల్యా ఇంటికి వచ్చి బెదిరిస్తాడు. స్థలం అప్పగించటానికి ఇంకా గడువు ఉండగానే ఇలా బెదిరించటంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేసిన కోల్యాని అరెస్ట్ చేస్తారు. దీమా మేయర్ దగ్గరకి వెళ్ళి తన దగ్గర ఉన్న సాక్ష్యాలు అతనికి చూపిస్తాడు. వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే కోల్యాని విడుదల చేయాలని, పరిహారం పెంచాలని షరతు పెడతాడు. కోల్యా విడుదలౌతాడు. మేయర్ బిషప్ (మతాధికారి) దగ్గరకి వెళ్ళి తనకు తన ‘కర్తవ్యనిర్వహణ’లో సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతాడు. దేవుడికి చాలా శక్తి ఉంటుందని, ఆ శక్తిని మనుషులు ఉపయోగించుకోవాలని చెబుతాడు బిషప్.

ఇంతలో లీల్యాకి దీమాతో అక్రమ సంబంధం ఉందనే విషయం కోల్యాకి, రోమాకి, వారి స్నేహితులకి తెలుస్తుంది. కోల్యా దీమాని కొడతాడు. దీమా తప్పించుకుని వెళ్ళిపోతాడు. మేయర్ దీమాని గూండాల చేత కొట్టిస్తాడు. దీంతో దీమా మాస్కోకి వెళ్ళిపోతాడు. కోల్యాకి లీల్యా మీద ప్రేమ తగ్గలేదు. రోమాకి మాత్రం సవతి తల్లి మీద అసహ్యం. లీల్యా ఎంతో మనోవేదనకు గురవుతుంది. ఒకరోజు ఉదయం ఇంటి నుంచి బయల్దేరిన ఆమె తిరిగిరాదు. దీమా దగ్గరకి వెళ్ళిపోయిందని అనుకుంటాడు కోల్యా. తాగుడు ఎక్కువ అవుతుంది. దేవుడు తననెందుకు కరుణించటం లేదని చర్చ్ ఫాదర్‌ని అడుగుతాడు కోల్యా. కష్టాలకు తట్టుకుని నిలబడటమే మన కర్తవ్యమని చెబుతాడు ఫాదర్. లీల్యా మృతదేహం సముద్రం ఒడ్డున దొరుకుతుంది. లీల్యాని కోల్యాయే చంపాడని అభియోగం మోపి అతన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అతనికి పదిహేనేళ్ళ శిక్ష పడుతుంది. రోమాని కోల్యా స్నేహితులు దత్తత తీసుకుంటారు. మేయర్ కోల్యా ఇల్లు పడగొట్టిస్తాడు. కొన్నాళ్ళకి అక్కడొక భవ్యమైన చర్చ్ వెలుస్తుంది. అందులో బిషప్ ప్రబోధం చేస్తాడు.

డబ్బు, అధికారం మనుషుల్ని ఎలా శాసిస్తున్నాయో చూపించారు ఈ సినిమాలో. లీల్యా దీమాతో అక్రమసంబంధం పెట్టుకోవటానికి కారణం ఏమిటి? ఆ ఊరి నుంచి బయటపడి ‘మంచి’ జీవితం గడపాలనేమో? కానీ చివరికి ఏమైంది? భర్త క్షమించటంతో అపరాధభావమే మిగిలింది. ఆమె కనిపించకపోవటంతో కోల్యా ఆమెని అనుమానిస్తాడు. దీమా మేయర్ దగ్గర డబ్బులు తీసుకుపోయాడని, లీల్యా అతని దగ్గరకి వెళ్ళిపోయిందని అనుకుంటాడు. ఫాదర్ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే నా భార్య తిరిగొస్తుందా అని అడుగుతాడు. అనుమానమూ, అనురాగమూ కలగలిసిన స్వభావం.

లాయరైన దీమాకి అన్నీ లావాదేవీలే. కోల్యా దీమాని కొట్టినపుడు లీల్యా “నావల్లే జరిగింది” అంటుంది దీమాతో. ఎవరి స్వార్థం వారిది అంటాడతను. ఆమె అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పబోతే “నమ్మకమేంటి?” అంటాడు. అంతలోనే “నాతో వస్తావా?” అంటాడు. అదొక లావాదేవీ అంతే. అతనితో జీవితం సౌకర్యంగా ఉన్నా ప్రేమ ఉండదని ఆమెకి అర్థమవుతుంది.

చివర్లో కోల్యా స్నేహితులు రోమాని దత్తత తీసుకుంటామంటే “డబ్బు కోసమా?” అంటాడు రోమా. దత్తత తీసుకుంటే ప్రభుత్వం మీకు డబ్బిస్తుంది కదా అంటాడు. డబ్బే పరమావధి అనుకునే తత్వం అందరిదీ. “కాదు, నీ తల్లి నాకు తెలుసు. నిన్ను చిన్నప్పటి నుంచి ఎరుగుదును” అంటుంది ఆ దంపతులలోని స్త్రీ. కోల్యా లీల్యాని, దీమాని చంపేస్తానన్నాడని సాక్ష్యం చేప్పేదీ ఈ స్నేహితులే. క్షణికమైన ఆవేశాలు మాత్రమే చూసే చట్టానికి అపారమైన అనురాగాలు ఏం తెలుస్తాయి?

ఇంతకీ లీల్యా ఎలా చనిపోయింది? ఆమె ముఖంపై గాయాలేమీ ఉండవు. ఆమె ఆత్మహత్య చేసుకుందనే అనుకోవాలి. దాన్ని కూడా మేయర్ తన స్వార్థానికి వాడుకుంటాడు. కోల్యా సుత్తితో ఆమెని కొట్టి చంపాడని, ఆ సుత్తి అతని మెకానిక్ షాపులో దొరికిందని పోలీసులు అంటారు. పోలీసులు అరెస్ట్ చేసి అభియోగం చెబుతుంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు కోల్యా. మేయరే లీల్యాని చంపించాడా? అయి ఉండవచ్చు. అలా కాక కోల్యాయే చంపాడనుకునేవారికి పోలీసు ఆధారాలు ఎలాగూ ఉంటాయి. ఆ ఆధారాలు నమ్మగలిగినవా కాదా అనేదే ప్రశ్న. కోల్యాకి శిక్ష పడ్డాక “నాకెదురు నిలిచినందుకు తగిన శాస్తి జరిగింది” అంటాడు మేయర్.

మతం కూడా అధికారదాహాన్ని చల్లార్చే ఒక సాధనంగా మారిపోతోంది. దీనికి ఏ మతమూ మినహాయింపు కాదు. కొన్నిచోట్ల కామదాహానికి కూడా మతాన్ని వాడుకుంటున్నారు. నిత్యానందలు, డేరాబాబాలు పుట్టుకొస్తున్నారు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? పాపం పండేవరకు చూస్తాడు. ఆ తర్వాత తగిన శాస్తి చేస్తాడు. మతగ్రంథాలలో, పురాణాలలో ఇలాంటి కథలే ఉంటాయి. సినిమాలో కథ ముగిసింది కదా అని అంతటితో దుర్మార్గులకి సుఖాంతమని అనుకుంటే పొరపాటే. జరిగే అక్రమాలను చూపించటమే ఈ సినిమా ఉద్దేశం. అక్రమ సంబంధంతో లీల్యా తన జీవితం నాశనం చేసుకుంది. రాజకీయ స్వార్థంతో మేయర్ కోల్యా జీవితాన్ని నాశనం చేశాడు.

మేయర్ బిషప్‌ని కలిసే సన్నివేశంలో బిషప్ “నాకేం చెప్పొద్దు. బలహీనుడవు అవ్వొద్దు. శత్రువులతో పోరాడు” అంటాడు. తన ప్రయోజనాల కోసం మేయర్‌ని వాడుకుంటాడు. మేయర్ తాను చేసిన అక్రమాలకు ఇది ప్రాయశ్చిత్తమని అనుకుంటాడు. దేవుడితో కూడా క్విడ్ ప్రో క్వో తరహా లావాదేవీలు చేస్తూ ఎవరికి వారు ఆత్మవంచన చేసుకుంటారు. తర్వాత మేయర్ పీకల మీదకొస్తే బిషప్ ఏమంటాడో ఊహించండి. “నేను అక్రమాలు చేయమని చెప్పానా?” అంటాడు.

వికేంద్రీకరణ లేక అధికారం కొందరి చేతుల్లోనే ఉంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. రష్యాలో కాబట్టి ఇలా జరిగింది అనుకోవటానికి లేదు. అధికారం వికేంద్రీకరిస్తే అన్ని స్థాయులవారు ఎవరి స్థాయికి తగినట్టు వారు వాటాలు వేసుకుని భోంచేయటం చూస్తూనే ఉన్నాం. డబ్బే పరమావధి అనుకుంటే ఎప్పటికీ పరిస్థితులు మారవు.

కోల్యాకి ఇన్ని కష్టాలు ఎందుకొచ్చాయి? ఫాదర్ బైబిల్‌లో చెప్పబడిన జోబ్ కథ చెబుతాడు. కష్టాల్లో ఉన్న జోబ్ దేవుణ్ణి దూషిస్తాడు. భార్య, స్నేహితులు చెప్పినా వినడు. దేవుడు తుఫాను రూపంలో వచ్చి కొన్ని దృశ్యాలు చూపించి అంతా వివరిస్తాడు. జోబ్ విధిలిఖితాన్ని తప్పించలేమని తెలుసుకుని శరణాగతి చేస్తాడు. 140 ఏళ్ళు బతుకుతాడని చెబుతాడు ఫాదర్. సినిమాలో చెప్పకపోయినా బైబిల్‌లో ఇదే కథలో లివయథన్ ప్రసక్తి కూడా ఉంది. బెహిమత్, లివయథన్ అనే జీవుల్ని దేవుడు ఎలా నియంత్రించాడో వివరించబడింది. బెహిమత్ భూమిపైని జీవి, లివయథన్ సముద్రజీవి. భాష పరిణామక్రమంలో బెహిమత్ అంటే అమిత శక్తివంతమైన పదార్థం అని, లివయథన్ అంటే పెను తిమింగలమనే అర్థాలు వచ్చాయి. లివయథన్ మనిషి స్వార్థానికి ప్రతీక అని నా అభిప్రాయం.

‘లివయథన్’ చిత్రానికి అంద్రే జ్వగింత్సెవ్, ఓలెగ్ నెగిన్ రాసిన స్క్రీన్ ప్లే కి క్యాన్ చిత్రోత్సవంలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డ్ వచ్చింది. కథలో జరిగే కొన్ని సంఘటనలు మనకు చూపించరు. కానీ సంభాషణలని బట్టి మనం మన అభిప్రాయలని ఏర్పరచుకోవచ్చు. పత్రికల్లో వార్తల్ని చూసి అభిప్రాయాల్ని ఏర్పరచుకున్నట్టే. ఫొటోగ్రఫీ గురించి విశేషంగా చెప్పుకోవాలి. రంగులన్నీ మాసిపోయినట్టున్నా ప్రకృతి అందాలు గొప్పగా ఉంటాయి. దేవుడి సృష్టి గొప్పగా ఉంటుందని, మనిషి స్వార్థంతో జీవితాన్ని నిస్సారం చేసుకుంటాడని చెప్పకనే చెబుతాయీ దృశ్యాలు. సముద్రాన్ని చూపించే దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎగిరే తిమింగలాలు కూడా లక్కపిడతల్లా కనిపిస్తాయి సముద్రంలో. లీల్యా చివరిసారి సముద్రం అంచున నిలబడ్డ దృశ్యాలు ఈ అనంతవిశ్వంలో మనిషి ఉనికి ఎంత అనిపించేలా చేస్తాయి. ఒడ్డున ఉన్న తిమింగలం అస్థిపంజరం విస్మయం కలిగిస్తుంది. సినిమా కోసం ఇనుము, లక్కతో తయారు చేశారిది. భారత్‌లో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డ్ వచ్చింది. 2014కి గాను ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది.

2009లో వచ్చిన ‘ఎ సీరియస్ మ్యాన్’లో కూడా ఎన్నో కష్టాలు పడే ఒక ప్రొఫెసర్ కథని చూపించారు దర్శకులు కోయెన్ సోదరులు. చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఈ జీవితం పరమార్థమేమిటి అని ఆలోచిస్తారు. కొందరు కుంగుబాటులో పడతారు. కొందరు నలుగురితో పాటు మనమూ అనుకుంటారు. కొందరు గుంపుకి దూరంగా నిలబడి నిర్లిప్తంగా చూస్తూ ఉంటారు. ఈ చివరి వర్గం వారు ఉన్నదానితో సంతృప్తి పడి జీవిస్తారు. సంతృప్తి ఉంటే లీల్యా ఆనందంగా ఉండేది. ప్రత్యక్షంగా మేయర్, పరోక్షంగా బిషప్ ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండేవారు. చివర్లో ఇచ్చే ప్రబోధంలో బిషప్ ప్రస్తుత కాలంలో నీతికి నిర్వచనం మారిపోతోందని, నీతి మాలిన పనులు చేసి తప్పించుకోలేమని అంటాడు. వినేవాళ్ళలో కోల్యాకి జోబ్ కథ చెప్పిన ఫాదరూ ఉంటాడు, మేయరూ ఉంటాడు. మేయర్ పిల్లవాడైన తన కొడుకుతో “వింటున్నావా? దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు” అంటాడు. అబద్దం చెబితే కళ్ళు పోతాయ్ అని మన పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పినట్టే. ఇదంతా ఓ నాటకం. పిల్లలను భయపెట్టడానికి వాడుకునే అస్త్రం మతం.

రష్యాలో సొంత భూమి కోసం ప్రజలు కలలు కంటుంటారు. సొంత భూమి ఉంటే భరోసా, గౌరవం. అలాంటి భూమి వదులుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. తాతల నాటి భూమి అయితే ఇంకా కష్టం. కానీ ప్రభుత్వం పట్టుపడితే పెద్దగా చేయటానికి ఏమీ ఉండదు. ఇంకో విషయం ఈ చిత్రంలో చూపించిన తాగుడు. సమాజంలో అన్ని వర్గాల వారికి తాగుడు అలవాటు పెరిగిపోతోంది. సంతోషంగా ఉంటే పార్టీలో తాగుడు, కష్టాల్లో ఉంటే మర్చిపోవటానికి తాగుడు. ఇది ఎంత అనర్థదాయకమో చెప్పేవారే కరువైపోతున్నారు. ప్రభుత్వాలే ఈ అలవాటుని పెంచి పోషిస్తుంటే ఏం చేయగలం?

చిత్రనిర్మాణంలో తోడ్పడినా పరిస్థితులని మరీ దారుణంగా చూపించారని రష్యన్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని విమర్శించింది. అయినా ఆస్కార్ అవార్డులకి పంపింది. అందులోని భావమేమిటో? తమ తప్పులు తమకు కనబడవు కదా. మామూలు రష్యా ప్రజలు మాత్రం సోషల్ మీడియాలో ఈ చిత్రం వాస్తవాలకు దర్పణంలా ఉందని అన్నారు. కొసమెరుపేమిటంటే ఆంద్రే జ్వగింత్సెవ్‌కి ఈ చిత్రానికి ప్రేరణగా నిలిచిన సంఘటన అమెరికాలో జరిగింది. 2004లో మార్విన్ హీమెయెర్ అనే వ్యక్తి అధికారుల వేధింపులకి సహనం కోల్పోయి ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఒక బుల్ డోజర్‌తో అమెరికాలోని తన ఊరిలోని టౌన్ హాల్‌కి, పాత మేయర్ ఇంటికి, ఇతర కట్టడాలకి భారీ నష్టం కలిగించాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విన్న జ్వగింత్సెవ్ స్క్రీన్ ప్లే రాయటం మొదలు పెట్టాడు. అదే ఈ చిత్రంగా రూపుదాల్చింది. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరగొచ్చు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇతరుల తప్పులు ఎత్తిచూపే ముందు మన తప్పులు చూసుకోవటం ఎంతో అభిలషణీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here