ఉర్దూ భాష స్త్రీ వాద రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి కథలు, వ్యాసాల ఆంగ్లానువాదం LIFTING THE VEIL

0
15

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]భా[/dropcap]రతదేశంలోని గొప్ప రచయిత్రులలో ఇస్మత్ చుగ్తాయి ఒకరు. ఉర్దూలో వీరి కథలు, వ్యాసాలు చాలా సంచలనం లేపాయి. అప్పటి ఆధునిక రచయితుల మధ్య ఆవిడ ఒక తారగా వెలుగొందారు. సాదత్ హసన్ మంటో కథలతో పాటూ వీరి కథలపై కూడా అశ్లీలతను ప్రేరేపించిన కథలు అనే నెపం మీద కేసులు నడిచాయి. అటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక స్త్రీగా ఎంతో ధైర్యంతో తాను చెప్పాలి అనుకున్న విషయాలను ఎవరికీ భయపడకుండా రాసుకుంటూ వెళ్లారు ఇస్మత్. ఈ పుస్తకంలో వీరివి 21 కథలు వ్యాసాలు ఉన్నాయి. వీటిని ఉర్దూ నుండి ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. భారతీయ వ్యవస్థలో స్త్రీ స్థితిగతులు ముఖ్యంగా ముస్లిం కుటుంబంలో స్రీల అణిచివేతను విషయంగా తీసుకుని రాసిన కథలు ఇవి. ఆవిడను కోర్టు చూట్టూ తిప్పిన కథ “లిహాప్” ఆంగ్లానువాదం ఈ సంకలనంలో ఉంది. దీన్ని THE QUILT అనే శీర్షిక కింద అనువాదం చేసారు. ఇది రచయిత్రి ఒక నిజ జీవిత కథ ఆధారంగా రాసాను అని చెప్పడం మరో వివాదం.

ఉర్దూలో లెస్బియన్ సంబంధంపై వచ్చిన మొదటి కథ లిహాఫ్. అప్పటి సాంప్రదాయవాదులను భయపెట్టిన కథ కూడా. ఒక నవాబ్‌ను వివాహం చేసుకున్న ఒక బేగం లోని నిరాశ, కోపం, నిస్సాహాయత ఈ కథలో కనిపిస్తాయి. నవాబ్ గారికి మగపిల్లల సాంగత్యం కావాలి. తనదైన జీవితం జీవిస్తుంటాడు ఆయన. భార్య అవసరాల గురించి అతనికి పట్టదు. తన శారీరిక కోరికలు తీరక, జీవితంలో ప్రేమ దొరకక ఒంటరితనంతో బాధపడుతూ ఉన్న బేగమ్ తన సేవకురాలితో ఏర్పరుచుకున్న బంధంలో సేద తీరుతూ ఉంటుంది. పురుషాధిక్య సమాజంలో స్త్రీలను పట్టించుకోని పరిస్థితుల మధ్య జీవింస్తున్న సంసార స్త్రీల పరిస్థితులను వివరించే కథ ఇది. తన అవసరాల కోసం తనకు దొరికిన మార్గాన్ని ఎన్నుకుని తనని ఆ స్థితికి తీసుకువచ్చిన సమాజం పై తిరుగుబాటు ప్రకటిస్తుంది బేగమ్. ఆమె అసహాయత, కోరికలు తీరని దాహం ఆమెను మరో స్త్రీతో శారీరిక సంపర్కానికి ఉసిగొల్పుతాయి. స్త్రీకి కూడా అవసరాలు ఉంటాయని అర్థం చేసుకోని పురుష సమాజానికి చెంపపెట్టుగా రాసిన కథ ఇది.

చుగ్తాయి ఈ కథలో తాను రాసిన బేగంను నిజంగానే కలిసానని చెబుతారు. ఆమె తరువాత తన నవాబ్ భర్తకు విడాకులిచ్చి మళ్ళీ వివాహం చేసుకుని ఒక మగబిడ్డకు తల్లి అయిందని కూడా చెప్తారు. అందువలన ఈ కథను లెస్బియన్ కథ కన్నా ఒక స్త్రీ తిరుగుబాటు కథగా చూడవలసిన అవసరం ఉంది. నాలుగు గోడల మధ్య బందీగా మిగిలిపోయే స్త్రీల కోపం ఇందులో ఉంది. పురుషుడిని స్వేచ్ఛగా వదిలే సమాజం అతనికి భార్య పట్ల బాధ్యతను గుర్తు చేయలేదన్న అసహాయత ఉంది.

“గైండా” అన్నది ఒక బాల్య వితంతువు కథ. ఆమెను ఒక యువకుడు పనిమనిషిగా ఉన్నప్పుడు లొంగదీసుకుంటాడు. ఆమె ఒక బిడ్డకు తల్లి అవుతుంది. ఈ పసిదాన్ని తల్లిని చేసిన యువకుడిని మరో చోటుకు పంపేసి అతని భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు కుటుంబీకులు. ఈ పసిది మత్రం మరో పసివాని తల్లిగా ఒంటరిగానే మిగిలిపోయి ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉండిపోతుంది. ఈ కథను ఆ యువకుని చెల్లెలి పాత్ర ద్వారా చెప్పిస్తారు రచయిత్రి. ఆమె కూడా చిన్న పిల్లే. తాను చూస్తున్న విషయాలను అమాయకంగా చెబుతూ స్త్రీల పరిస్థితి సమాజంలో ఇలా ఎందుకుంది అని ప్రశ్నిస్తుంది ఆమె. ఇద్దరు సుఖాన్ని పొందిన బంధం పురుషుడికి పారిపోయే వెసులుబాటిచ్చి స్త్రీ జీవితాన్ని ఎందుకు సమస్యలమయం చేస్తుంది అన్న ప్రశ్న ఆ అమ్మాయి వేస్తుంది. చుట్టూ ఉన్న వారు కూడా స్త్రీనే తప్పుబట్టడం, పురుషున్ని ఏమీ అనకపోవడం ఆమెకు వింతగా కనిపిస్తాయి.

“The wedding suit” అన్న మరో కథ ఒక అసహాయిరాలయిన వితంతువు తన ఇద్దరు కూతుర్ల వివాహం కోసం పడే తపనను గురించి చెబుతుంది. పిలల్లు మంచి ఇంట్లో పెళ్ళి చేసుకుని వెళ్ళాలని ఆమె కోరిక. ఒక బంధువు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కడుపులు మాడ్చుకుని అతనికి అతిథి మర్యాదలు చేస్తారు. ఇంట్ళో వస్తువులు అమ్మి అతని అవసరాలు తీరుస్తారు. తన పెద్ద కూతురుని అతను వివాహం చేసుకుంటాడని తల్లి అనుకుంటుంది. పెద్ద అమ్మాయి సాధారణమైన యువతి. ఆమె అతన్ని ఆకర్షించదు. చిన్న అమ్మాయిపై అత్యాచారం చేస్తాడు ఆ యువకుడు. పెద్ద కూతురు తిండికి మాడి చాకిరీ చేయలేక చనిపోతే, ఆ అబ్బాయి ఇదే అదను అని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ కూతురు పెళ్ళికోసం కొన్న బట్టలే ఆమె శవంపై కప్పడానికి పనికి వస్తాయి. స్త్రీకి పెళ్ళి ద్వారానే భద్రత సంతోషం కలుగుతాయని నమ్మి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం తపించి పోయే తల్లులు చివరకి ఆ పెళ్ళి వెనుక ఉన్న స్వార్థానికి బలి అవడం ఈ కథలో చూస్తాం. వివాహం తోనే స్త్రీకి గౌరవం అని నమ్మి జీవితాలను నష్టపరుచుకున్న ఎందరో అమాయక స్త్రీలు మనకు ఈ కథ ద్వారా గుర్తుకువస్తారు. ఈ గౌరవం కోసం పేద ఇంటి ఆడపిల్లలు ఎలాంటి దోపిడికి గురు అవుతున్నారో చెప్పే కథ ఇది.

“Childhood” అన్న కథలో తమ చిన్నతనాన్ని ప్రేమగా ఆనందంగా గుర్తుకు తెచ్చుకునే వారికి అందరికీ తమ చిన్నతనం అంత ఆనందాన్ని మిగల్చదనే చేదు నిజాన్ని చెప్తారు రచయిత్రి. తాను చిన్నతనంలో అనుభవించిన వివక్ష, ఆధిపత్య ధోరణుల మధ్య నలిగిపోయిన ఆనందాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పేదరికంతో పుట్టిన ఆడపిల్ల అయినందువలన ఆమె కోరికలను పరిగణనలోకి తీసుకోని కుటుంబం, తీరని వేదన ఇవే ఆమె బాల్యానికి గుర్తులు. అందుకే తన చిన్నతనాన్ని తాను గుర్తు చేసుకోవడానికి ఇష్టపడనని, ముస్లిం కుటుంబంలో ఆడపిల్లగా ఆమె దుఃఖాన్ని తప్ప మరేమీ అనుభవించలేదని ఏదీ దాచకుండా చెప్తారు. ఈ కథలో ని ప్రతి మాటలో ఆమెలో అంతర్లీనంగా ఉన్న బాధ కనిపిస్తూ ఉంటుంది.

“The Mole” మరియు “The Homemaker” ఈ సంకలనంలో గుర్తు పెట్టుకోవలసిన కథలు. తమకు నచ్చిన వారితో సంబంధం పెట్టుకోవడానికి సమాజంతో యుద్దం చేసే స్త్రీల కథలు ఇవి. దాని కారణంగా సమాజం బహిష్కరించిన వ్యక్తులు వీరు. వారికి కావలసిన దారిలో వారు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మర్యాదస్తులనబడే వాళ్ళే ధైర్యం చేయలేక, జీవితంలోని దోపిడిని ఎదుర్కోలేక నిరంతరం బాధపడుతూ కనిపిస్తారు. మర్యాద అనే ముసుగు వెనుక ఎంత వేదన ఉంటుందో అనుభవిస్తూ కూడా ఇతర స్త్రీల నైతికత గురించి ప్రశ్నిస్తూనే ఉంతారు. నీతి అనే చట్రంలో తమకు తాముగా బందీలయి అశాంతిగా జీవిస్తున్న వీరు సమాజాన్ని ఎదిరించి బ్రతుకుతున్న వారి జీవితాలలో, మచ్చలను వెతికే ప్రయత్నం చేస్తారు.

“Quit India” అనే కథ ఆంగ్లో ఇండియన్ల కథ. దేశ స్వాతంత్ర్యం తరువాత ఎటూ కాకుండా జీవించవల్సిన వారి అసహాయతను ఇందులో చూస్తాం. “Vocation” చాలా తిరుగుబాటు ధోరణిలో రాసిన కథ. స్త్రీ నైతికతకు అర్థం వెతికే ప్రయత్నం ఈ కథలో నిస్సిగ్గుగా మొహమాటం లేకుండా రచయిత్రి చేస్తారు. ఒక వేశ్య స్కూల్ టీఛర్ల జీవితాలను చూపిస్తూ ఎవరి నీతి ఎవరిని సుఖపెట్టింది అన్న ప్రశ్నతో రచయిత్రి చాలా మంది కోపానికి గురి అయ్యారు.

“Hell bound” కథ రచయిత్రి జీవిత కథ. తన సోదరుడు ఆజిమ్ బేగ్ చుగ్తాయి ఆఖరి రోజుల గురించి రాసిన కథ ఇది. మృత్యువుకు దగ్గరవుతూ పక్క మీద లేవలేని స్థితిలో కూడా మరణించని అతని మగ అహంకారాన్ని చూపే కథ ఇది. కుటుంబం ఆ రోజులను ఎలా గడిపిందో దాచకుండా చెబుతారు ఆమె. తన సోదరుని అహంకారాన్ని గురుంచి చెబుతూ అతన్ని తన సోదరునిగా మాత్రమే కాక ముస్లిం కుటుంబాలలోని పురుషునిగా చూపించే ప్రయత్నం చేసారు. నేను చదివిన కథలలో చాలా నిజాయితీతో రాసిన స్వీయ కథగా ఇది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.

“My friend My enemy” అన్నది ఇస్మత్ మంటోతో తన అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ రాసిన వ్యాసం. పాకిస్తాన్‌లో ఒంటరిగా మరణించిన మంటో తనను ఎలా ప్రభావితం చేసారో అతనితో తన స్నేహం ఎటువంటిదో చెప్పే ప్రయత్నం చేసారు.

“In the name of married woman” ఈ సంకలనంలోని ఆఖరి వ్యాసం. తన కథ లిహాప్ కోసం తను కోర్టుకు వెళ్లవలసి వచ్చిన అనుభవాలను రాసుకున్నారిందులో. మంటోతో పాటూ రచయిత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం వారు చేసిన పోరాటం, ఎదుర్కున్న పరిస్థితులు ఈ వ్యాసంలో కనిపిస్తాయి..

ఇస్మత్‌ను ఒక స్త్రీ వాద రచయిత్రిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సంకలనం ఇది. పురుషాధిక్య వ్యవస్థకు లొంగకుండా జీవించిన ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రచనలున్న మంచి పుస్తకం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here