లోకల్ క్లాసిక్స్ – 3: ఆర్టుకి ‘రే’ కమర్షియల్ స్క్రీన్ ప్లే!

0
6

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సత్యజిత్ రే బెంగాలీ సినిమా ‘నాయక్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘నాయక్’ – స్క్రీన్ ప్లే!

సమాంతర సినిమా స్క్రీన్ ప్లేకి స్వేచ్ఛ ఎక్కువ, ప్రేక్షకులు తక్కువ. అందుకే అవి సమాంతర సినిమాలు, లేదా ఆర్ట్ సినిమాలు. లేకపోతే అశేష ప్రజానీకాన్ని ఆకర్షించే ప్రధాన స్రవంతి సినిమాలన్పించుకునేవి. ప్రధాన స్రవంతి సినిమాలు వ్యాపార సినిమాలు కాబట్టి, వ్యాపారాన్ని ఆకర్షించే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్‌తో, తక్కువ సృజనాత్మక స్వేచ్ఛతో వుంటాయి. ఈ వ్యాపారాన్ని ఆకర్షించే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది నాటకాలకి అరిస్టాటిల్ చెప్పిన మోడల్‌తో ప్రారంభమై, జోసెఫ్ క్యాంప్‌బెల్ చెప్పిన పురాణాల మోడల్ మీదుగా సాగి, ఆధునికంగా సిడ్‌ఫీల్డ్ సవరించిన పారడైం దగ్గరకొచ్చి ఆగింది. ఈ ముగ్గురి త్రీ యాక్ట్ స్ట్రక్చర్స్‌కి విభాగాలు మూడే. అవే బిగినింగ్, మిడిల్, ఎండ్‌లు. కాకపోతే ఈ మూడు విభాగాల్లో క్యాంప్‌బెల్ మజిలీలు పెంచి కథ పెంచాడు. సిడ్‌ఫీల్డ్ మజిలీలు కుదించి కథనం స్పీడు పెంచాడు. ఇలా గత మూడు దశాబ్దాలుగా సిడ్‌ఫీల్డ్ పారడైంతోనే వ్యాపార సినిమా లొస్తున్నాయి. అయితే ఈ త్రీ యాక్ట్ స్ట్రక్చరనేది కృత్రిమమైనది, యాంత్రికమైనది. దీనికుండే బిగినింగ్, మిడిల్, ఎండ్‌లలో సినిమా కథలు ఒకే పోతలో పోసినట్టు, ఒక టెంప్లెట్‌గా వుండిపోతాయి. ఆయా నిష్పత్తుల్లో వుండే ఈ బిగినింగ్, మిడిల్, ఎండ్‌లనే విభాగాలతో, నిష్పత్తులు మార్చి ప్రయోగాలు చేస్తే వ్యాపార సినిమాలు ఆడవు.

 అదే సమాంతర సినిమాలు, లేదా ఆర్ట్ సినిమాలతో నిష్పత్తుల్ని స్వేచ్ఛగా ఎలా మార్చి, ఎలా స్ట్రక్చర్‌ని చెదరగొట్టినా బాధ వుండదు. అసలామాట కొస్తే స్ట్రక్చరే అక్కర్లేదు సమాంతర సినిమాలకి. ఆర్ట్ సినిమాలకి, ఇంకా ఆర్ట్ సినిమాల్లాంటి వరల్డ్ మూవీస్‌కీ స్ట్రక్చర్ వుండదు. ఇవి చర్చలు పెట్టుకునే మేధావులకి, ఉత్తమాభి రుచి పేర ఫ్యాషన్‌గా చూసే ఒక వర్గం ప్రేక్షకులకి తప్ప, మిగతా ప్రేక్షక బాహుళ్యంలోకి వెళ్ళవు, డబ్బులు రావు.

 గత రెండు దశాబ్దాలుగా తెలుగులో వస్తున్న వ్యాపార సినిమా కర్తలు ఇది అర్థంజేసుకోలేక, వ్యాపార సినిమాలని స్ట్రక్చర్ లేని ఆర్ట్ సినిమాలుగా యుద్ధ ప్రాతిపదికన తీసేస్తూ, ఏటేటా 90 శాతం అట్టర్ ఫ్లాపులిస్తూ – దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. వాళ్ళని దీర్ఘ ఫ్లాపుళీ భవ! – అని దీవించడం తప్ప చేసేదేం లేదు. ఇది వేరే టాపిక్.

 సత్యజిత్ రే సమాంతర సినిమాలలా కాదు. అవి పైన చెప్పుకున్న వ్యాపార స్ట్రక్చర్నే కలిగి వుంటాయి, కాకపోతే కథలు వ్యాపారాత్మకంగా వుండకపోవచ్చు, ఆలోచనాత్మకంగా వుంటాయి. ఇదే సత్యజిత్ సినిమాల ఆకర్షణ. వ్యాపార స్ట్రక్చర్‌తో ఆలోచనాత్మక కథ. ఇంకో సుసాధ్యం చేసిన విషయమేమిటంటే, స్ట్రక్చర్‌తో ఆయన సృజనాత్మకత. ఒక చట్రంలో బందీ అయి జీవిత ఖైదుననుభవిస్తున్న స్ట్రక్చర్‌కి సృజనాత్మకతతో పైరగాలి ద్రోలి, స్ట్రక్చర్‌ని – బందికానాని మరిపించడం. ఇదెలా జరిగిందో మొదటి వ్యాసంలో చూశాం: శబ్దంతో ఆయన ప్రయోగం. ఈ ప్రయోగం కృత్రిమమైన స్ట్రక్చర్ ని మరిపించేసింది.

ఇంకో కథా న్యాయం :

‘నాయక్’లో ఇంకో క్షీర నీర న్యాయం చేశారు సత్యజిత్. ఈ కథ ప్రధాన కథగా, ప్రధాన కథలో భాగంగా పూర్వ కథగా, ఇంకో రెండు ఉప కథలుగా, మూడుగా వుంటుంది. ఈ మూడిట్లో పూర్వ కథని స్ట్రక్చర్‌లో వుంచలేదు. ప్రధాన కథని, ఉప కథల్ని మాత్రమే స్ట్రక్చర్‌లో వుంచారు. పూర్వ కథ, అంటే ఫ్లాష్‌బ్యాక్స్‌ని స్ట్రక్చర్‌లో వుంచలేదు. పొరపాటున దీన్నీ స్ట్రక్చర్ చేసి వుంటే, ఈ సినిమా గందరగోళంగా తయారై, అంతర్జాతీయంగా ఆయన అభాసయ్యేవారు. ఫ్లాష్‌బ్యాక్ అనేది నడుస్తున్న ప్రధాన కథకి అవసరమున్న సమాచారాన్నందించే వనరే తప్ప కథ కాదు. కథ కానప్పుడు స్ట్రక్చర్ వుండదు. సమాచారానికి స్ట్రక్చరేమిటి – అది న్యూస్ బులెటిన్ అయినపుడు. ఇలాగే ప్రధాన కథతోబాటే నడిచే రెండు ఉప కథలున్నాయి. ఇవి కథలు కాబట్టి స్ట్రక్చర్‌లో వుంచారు.

ఇలా సత్యజిత్ ‘నాయక్’ ప్రధాన కథని ఏడు ఫ్లాష్‌బ్యాకులతో, రెండు డ్రీమ్ సీక్వెన్సులతో, రెండు ఉప కథలతో చెప్పుకొచ్చారు. మొదటి డ్రీమ్ సీక్వెన్సుతో ప్రధాన కథ బిగినింగ్ విభాగాన్ని ముగించి, మిడిల్ విభాగాన్ని ప్రారంభించారు; రెండో డ్రీమ్ సీక్వెన్సుతో మిడిల్ విభాగాన్ని ముగించి ఎండ్ విభాగాన్ని మొదలు పెట్టారు. ఈ అమరికలో ప్లానింగ్ స్పృహ కన్పిస్తుంది.

ఇంకా స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, మొదటి డ్రీమ్ సీక్వెన్సుని ప్లాట్ పాయింట్ వన్‌గా పెట్టుకుని, రెండో డ్రీమ్ సీక్వెన్సుని ప్లాట్ పాయింట్ టూ గా పెట్టుకున్నారు. రెండిటి మధ్య ప్రధాన కథని, దాని తాలూకు ఏడు ఫ్లాష్‌బ్యాకుల్ని, రెండు ఉప కథల్నీ సర్దారు. ఫ్లాష్‌బ్యాకులు ఏడు ఎందుకు పెట్టారోగానీ, రెండో ఫ్లాష్‌బ్యాకులో పునర్జన్మ నమ్మకాల మీద చర్చ వస్తుంది. ఏడు ఫ్లాష్‌బ్యాకులు ఏడు జన్మలా? వివిధ అనుభవాలతో కూడిన ఏడు ఫ్లాష్‌బ్యాకుల్లో ఏడు జన్మలెత్తి నాయక్ ఇప్పుడున్న మనిషయ్యాడా? ఇలా మనం ఎక్కువ వూహిస్తున్నామేమో గానీ, ఏదో అర్థం వుండే వుంటుంది ఫ్లాష్‌బ్యాకులు ఏడు వుండడానికి.

మొత్తం సినిమా నిడివి గంటా 55 నిమిషాలు. మొదటి డ్రీమ్ సీక్వెన్సుతో బిగినింగ్ విభాగం 35వ నిమిషంలో ముగుస్తుంది. ఇక్కడ్నించీ ప్రారంభమయ్యే మిడిల్ రెండో డ్రీమ్ సీక్వెన్సుతో 85వ నిమిషంలో ముగుస్తుంది. దీని తర్వాత ఎండ్ విభాగం 30 నిమిషాలుంటుంది. అంటే మొత్తం గంటా 55 నిమిషాల స్క్రీన్ ప్లేలో 35 నిమిషాల బిగినింగ్, 50 నిమిషాల మిడిల్, 30 నిమిషాల ఎండ్ విభాగాలున్నాయి. వీటి నిష్పత్తులు 1:2:1 అన్న మాట. ఇలా ఇది వ్యాపార సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అయింది.

సత్యజిత్ వ్యాపార స్క్రీన్ ప్లే స్ట్రక్చర్‌తో వ్యాపార సినిమాల మీద వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించడం ఈ కథ ప్రత్యేకత. ఈ కథ ఒక కమర్షియల్ స్టార్ వ్యక్తిగత, వృత్తిగత, సామాజిక జీవితాల గురించి. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలెలాగూ వుంటాయి. కానీ వీటిలోనే మునిగితేలే స్టార్, సామాజిక బాధ్యతల నుంచి పలాయనం చిత్తగిస్తే, స్టార్ కానట్టేనన్నఅర్థంతో ఈ కథకి పరిపూర్ణత తెచ్చారు.

పాత్రోచిత కథనం :

ప్రధాన కథ ప్రారంభం పాత్రోచితంగా వుంటుంది. ఈ సినిమా అంతా పాత్ర మస్తిష్కమే. టైటిల్స్ తోనే ఇలా ప్రారంభిస్తారు. శిరస్సు వెనక భాగం క్లోజప్ మీద నిలువు, అడ్డ రేఖల విన్యాసం చూపిస్తారు. ముందుగా శిరస్సు మీద మూడు నిలువు రేఖలు, వాటి మీద ఒక దాని తర్వాతొకటి అడ్డ రేఖలూ పడతాయి. వీటి మీద మళ్ళీ రెండు అడ్డ రేఖలు పడి, ఇంకో అడ్డ రేఖ పడుతుంది. ఇలా నిలువుగా అడ్డంగా రేఖలు పడుతూ వెళ్లి వెళ్లి, మళ్ళీ ఒకటొకటిగా అవన్నీ అదృశ్య మైపోతాయి. టైటిల్స్ పూర్తవుతాయి. ఏమిటి దీనర్ధం? సినిమా పూర్తయ్యాక అర్ధమవుతుంది ఈ సింబాలిజం దేని తాలూకుదో. ఇక్కడ ఇంకో విశేష మేమిటంటే, నిలువు రేఖల సంఖ్య ఏడు. ఏడు ఫ్లాష్‌బ్యాకుల్లాగా. అడ్డ రేఖలు ఐదు. సినిమా పూర్తిగా చూస్తే, ఈ రేఖల కర్ధం అతడి మస్తిష్కం సంక్షుభితంగా వుందనీ; చివరికి రేఖలు తొలగిపోయాక – ముగిసిన కథలాగే మస్తిష్కం తేట పడిందనీ తెలుస్తుంది. సినిమా కథల మీద ఇరవయ్యేళ్ళు పరిశోధన చేసిన జేమ్స్ బానెట్ ప్రకారం, పాత్ర మెచ్యూర్డ్ పాత్రగా ఎదిగి ముక్తి పొందడమే మంచి సినిమా కథ.

టైటిల్స్ తర్వాత సినిమా స్టార్ అరిందం ముఖర్జీ తల దువ్వుకుంటూ వ్యూలో కొస్తాడు. ముఖం కన్పించదు. ఈ ప్రారంభం టైటిల్స్‌కి విజువల్ కంటిన్యుటీ. కాకపోతే ఇప్పుడు శిరస్సు వెనకభాగాన దువ్వెన కదలడుతూంటుంది. డ్రెస్ చేసుకుంటాడు, బెల్టు పెట్టుకుంటాడు. ఇంతలో మేనేజర్ జ్యోతి వస్తాడు. అప్పడు వీళ్ళ మాటల్లో అరిందం ఉత్తమ జాతీయ నటుడి అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ ప్రయాణ మవుతున్నట్టు తెలుస్తుంది. విమాన టికెట్లు దొరకనందున ట్రైన్లో పోతున్నట్టు.

మన కొత్త సినిమా ఎలా ఆడుతోందని అడుగుతాడు. “ఆ సినిమాలో నువ్వు తప్ప ఇంకేముందని ఆడడానికి?” అంటాడు జ్యోతి. కాలం మారిందంటాడు అరిందం. జ్యోతి పబ్లిక్‌ని విమర్శిస్తాడు. “పబ్లిక్ లేకపోతే నేనేం చేసి బ్రతుకుతాను?” అంటాడు అరిందం. ఇలా మాటల్లో బూట్లేసుకుని కూర్చుని, లేసులు కట్టుకుంటున్నప్పుడు మాత్రమే అక్కడ్నించీ కెమెరా అరిందం ఫేసు మీద ఫోకస్ అవుతుంది. ఇంత సేపూ కన్పించని అతడి మొహం కాళ్ళకి బూట్లేసుకోవడం పూర్తయ్యాకే కన్పించడం షాట్స్ పరంగా ఈ సీను చెప్తున్న శిల్పం. కెమెరాతో కథ చెప్పడం. ఏది ఎప్పుడు రివీల్ చేస్తే సీను రక్తి కడుతుందో, చెబుతున్న మొత్తం కథలో భాగమవుతుందో తెలిపే డైనమిక్స్.

ఇప్పుడే పేపర్లో ఒక వార్త వస్తుంది. గత రాత్రి జరిగిన ఒక పార్టీలో అరిందం దురుసుగా ప్రవర్తించి గలభా సృష్టించాడని. ఇప్పుడే ఒక నిర్మాత వస్తాడు. గత రాత్రి ఎలా ఒకణ్ణి నాల్గు గట్టిగా పీకి వార్తల్లో నిలిచాడో నిర్మాతకి గొప్పగా చెప్పుకుంటాడు అరిందం. ఇంతలో జ్యోతి వచ్చి హీరోయిన్ ఫోన్ చేసిందంటాడు. అరిందం మొహం సీరియస్‌గా మారుతుంది. వెళ్లి రిసీవర్ తీసుకుంటూ వెంటనే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, సిగరెట్ వెల్గిస్తాడు. ఈ అనూహ్య చర్య మనం గుర్తించాలని అరిందం ప్రొఫైల్ మీద క్లోజప్ వేస్తాడు సత్యజిత్.

      

హీరోయిన్ ఎవరో రివీల్ చేయకుండా సస్పెన్స్. ఆమె మాటలు మాత్రమే విన్పిస్తాయి: “నేనూ రానా?” అంటుంది. “రాకపోతేనే బాగు” అంటాడు. “మీకు అన్నీ వివరిస్తాను ప్లీజ్” అంటుంది. అవసరం లేదని కట్ చేస్తాడు. ఏదో ప్రేమ భగ్నమైనట్టు ఈ సీను అర్థం చెప్పాక, దీని కొనసాగింపు వుండదు. ఇది ప్లాట్ పాయింట్ టూలో రెండో డ్రీమ్ సీక్వెన్స్‌కి సెటప్. ఈ ప్రేమ కథేమిటో అక్కడ పే ఆఫ్ అవుతుంది. అలాగే పైన చెప్పుకున్నన్యూస్ పేపర్లో వచ్చిన వార్త కూడా ఎండ్ విభాగంలో పే ఆఫ్ అయ్యే సెటప్పే. ఈ రెండూ తెలుసుకోవడానికి చివరంటా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే హుక్స్.

ఒక్క ప్రారంభ సీన్లో పాత్రే ప్రధానంగా పాత్ర వృత్తిగత, వ్యక్తిగత కోణాలతో పాత్రని పరిచయం చేసేశాక- రైలు ప్రయాణం మొదలవుతుంది.

రైల్లో ఉప కథల పాత్రలు పరిచయమవుతాయి. వీటితో పాటు ప్రధాన కథలో పత్రికా సంపాదకురాలు అదితీ సేన్ గుప్తా (షర్మిలా టాగూర్) పాత్ర పరిచయమవుతుంది. ఉపకథ పాత్ర బిజినెస్‌మాన్ ఘోష్ పరిచయమైనప్పుడు, అతను అరిందంకి తన అభిప్రాయాలు చెప్తాడు: సినిమా పరిశ్రమ స్లంప్‌లో వుందనీ, స్టూడియోలు ఖాళీగా పడున్నాయనీ, టీవీ డామినేట్ చేస్తోందనీ, అమెరికన్ కల్చర్ వచ్చేసిందనీ, వాళ్లనుంచే నేర్చుకుంటున్నామనీ, క్వాలిటీ గురించి మనం ఆలోచించే ప్రసక్తే లేదనీ, ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, చెత్త ప్రొడ్యూస్ చెయ్యాలి – ఇదే మన విధానమనీ చురక లంటిస్తాడు.

ఇక అదితి అరిందంని పరిచయం చేసుకున్నప్పుడు ఇంటర్వూ అడుగుతుంది. తన విషయాలు చెప్పుకుంటే మార్కెట్ పోతుందంటాడు అరిందం. “మేం వెలుగు నీడల జీవులం, పబ్లిక్‌లో బయటపడకూడదు” అంటాడు. తర్వాత్తర్వాత అతను కూపేలో పడుకుని స్క్రిప్టు చదువుకుంటూ, పొగ రింగులు రింగులుగా సిగరెట్ వదులతున్నప్పుడు, నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్రలో కల. ఆ కలలో విశాలమైన మైదానంలో వెయ్యి రూపాయల నోట్ల గుట్టలు. ఆ నోట్ల గుట్టల్లో దర్జాగా తిరుగుతూ అరిందం. ఎక్కడ చూసినా అపారమైన డబ్బు గుట్టలు. వాటి మీద ఆనందంతో అరిందం ఎగరడం, దూకడం, పరుగెత్తడం. ఉన్నట్టుండీ టెలిఫోన్ శబ్దం. ఆగి చూస్తే, ఒక నోట్ల గుట్టలోంచి పొడుచుకు వచ్చిన ఆస్థిపంజరపు చెయ్యి. ఆ చేతిలో రింగవుతున్న టెలిఫోన్. భయంతో పరుగు. ఎటు పరుగెత్తినా ఆ నోట్ల గుట్టల్లోంచి టెలిఫోన్ తో ఆస్థిపంజరాల చేతులు. చెవులు పగిలేలా టెలిఫోన్ల ఫోన్ల శబ్దం. ఉన్నట్టుండీ నోట్ల గుట్ట ఊబిలా మారిపోవడం. ఆ ఊబిలో తను కూరుకుపోవడం. కేకలేయడం. ఒక భారీ మనిషి మెరిసిపోతూ ప్రత్యక్షమవడం. చేయి చాచి పైకి లాగమని అరిందం అరవడం. ఆ మెరిసే మనిషి లాగకుండా చూస్తూ వుండడం…

ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు అరిందం. ఇదీ బిగినింగ్ ముగుస్తూ డ్రీమ్ సీక్వెన్స్-1 తో ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. కథని మలుపుతిప్పే ప్లాట్ పాయింట్స్ సీన్లు రెండూ సంఘటనలతో వున్నప్పుడు, బలంగా రిజిస్టరవుతాయి ప్రేక్షకుల మైండ్స్‌లో. ఈ డ్రీమ్ సీక్వెన్స్ అర్ధమేమిటో, దీని ప్రేరణతో మిడిల్ విభాగపు కథనం ఎలా ప్రారంభమయ్యిందో, ఫ్లాష్ బ్యాకుల కథా కమామిషేమిటో, వచ్చే వారం ముగింపు వ్యాసంలో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here