లోకల్ క్లాసిక్స్ – 31: ప్రశ్నించే బాల హాస్య లోకం

0
15

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘సర్కారీ. హి. ప్రా. శాలే, కాసరగోడు, కొడుగే – రామన్న రాయ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘సర్కారీ. హి. ప్రా. శాలే, కాసరగోడు, కొడుగే – రామన్న రాయ్’ (కన్నడ)

ఒకప్పుడు వాస్తవిక సినిమాలు కూడా ఒకవైపు నిర్మిస్తూ వచ్చిన కన్నడ సినిమా రంగం, ఆ తరం దర్శకులు అంతరించాక పూర్తిగా కమర్షియల్ సినిమాలకి నిలయంగా మారింది. కొత్త తరం దర్శకుల్లో వాస్తవిక సినిమా దృక్పథం లోపించింది. చాలా ఓవరాక్షన్ కమర్షియల్ సినిమాలు తీస్తూ ఫ్లాపవుతున్నా సరే, వాటిపైనే మక్కువ పెంచుకున్నారు. అయితే ఎప్పుడో ఓసారి ఓ యువ దర్శకుడు వాస్తవిక సినిమా అంటూ ముందుకు వస్తున్నాడు. దాంతో ఒక జాతీయ అవార్డు అందుకుని పోతున్నాడు. అలాటి యువ దర్శకుల్లో ఒకడు రిషబ్ శెట్టి అనే నటుడు, రచయిత. ఇతను బెంగళూరు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వం కోర్సు చేసినా నటుడుగానే తెరమీది కొచ్చాడు. 2013 నుంచి ఓ ఎనిమిది కమర్షియల్ సినిమాలు నటించి ఇంకో పది నటిస్తున్నాడు. 2016 లోనే దర్శకత్వం చేపట్టి ‘రికీ’, ‘కిరిక్ పార్టీ’ అనే రెండు కమర్షియల్ సినిమాలు తీశాడు. వీటిలో ‘కిరిక్ పార్టీ’ బాగా హిట్టయింది. ఆ తర్వాత 2018లో రూటు మార్చి వాస్తవిక సినిమా మీద దృష్టి పెట్టాడు. ఆ సినిమా టైటిల్ ‘సర్కారీ. హి. ప్రా. శాలే, కాసరగోడు, కొడుగే – రామన్న రాయ్’ అని ఒక ఉత్తరం చదివినట్టు చదవాలి. పొట్టి పిల్లల సినిమా, దీనికి చాంతాడంత టైటిల్. విద్యా వ్యవస్థపై ఈ సినిమా ఎందుకు తీశాడు, ఎలా తీశాడు ఓసారి చూద్దాం…

కథ

‘సర్కారీ. హి. ప్రా. శాలే, కాసరగోడు, కొడుగే – రామన్న రాయ్’ అనేది కర్ణాటక – కేరళ సరిహద్దులో కేరళకి చెందిన కన్నడ మీడియం పాఠశాల పోస్టల్ చిరునామా. సర్కారీ. హి. ప్రా. శాలే – లేదా సర్కారీ హిరియా ప్రాథమిక శాలే అంటే, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల. ఈ వూళ్ళో కన్నడ మాట్లాడే ప్రజలెక్కువ. కన్నడ – కేరళ మిశ్రమ సంస్కృతితో, సరదాగా మాట్లాడే స్నేహభావంతో, దేనికీ ఇబ్బంది పడని సుఖమయ జీవితాలతో ఆనందంగా వుంటారు. స్కూలు ఇలా వుండదు. చదువుకోవడానికి పుస్తకాలుండవు, తొడుక్కోవడానికి యూనీఫారాలుండవు, ఆడుకోవడానికి ఆటలుండవు, టీచర్లకి జీతాలుండవు, బిల్డింగుకి మరమ్మత్తు లుండవు. అత్యంత నీచాతి నీచంగా వుంటుంది. కారణం 60 మంది కూడా లేని కన్నడ పిల్లల కోసం స్కూలు నడపడం శుద్ధ దండగని కేరళ విద్యాశాఖాధికారి అనుకోవడమే.

నంబియార్ హెడ్ మాస్టర్. ఇతణ్ణి విధ్యాశాఖాధికారి బాలకృష్ణ పణిక్కర్ వేధిస్తూంటాడు. స్కూలుని మూసేసి మలయాళ మీడియం స్కూలు తెరిచే ఆలోచనతో వుంటాడు. ఈ ఆలోచనతో నంబియార్ చేత బలవంతంగా సంతకం పెట్టించుకుంటాడు. స్కూలు కూలే స్థితిలో వుందనీ, అందుకని కూల్చేయడానికి సిఫార్సు చేస్తూ రాసిన ఉత్తరమది.

పేద పిల్లలకి ఆధారమైన ఈ స్కూలు కూల్చేస్తారనే సరికి పిల్లలు ఆందోళన మొదలెడతారు. ఎట్టి పరిస్థితిలో స్కూలుని కాపాడుకోవాలనే సంకల్పంతో న్యాయ పోరాటానికి దిగుతారు. అప్పుడు మైసూరులో వుండే సామాజిక కార్యకర్త, లాయర్ అయిన అనంత పద్మనాభ గురించి వింటారు. వెళ్ళి అతణ్ణి కలుసుకుంటారు. కలవాల్సింది ఎం. అనంత పద్మ నాభ (రమేశ్ భట్) నైతే, పొరపాటు పడి పి. అనంత పద్మనాభ (అనంతనాగ్) ని కలుసుకుని చెప్పుకుంటారు. ఇద్దరు పద్మనాభాలూ స్నేహితులే అయినా కోర్టులో బద్ధ విరోధులు. పి. అనంత పద్మనాభ పిల్లల తరపున కోర్టులో కేసెయడానికి ముందుకొస్తాడు. ప్రత్యర్ధిగా ఎం. అనంత పద్మ నాభ తలపడతాడు. ఇక కోర్టులో ఈ కేసు ఎలా తేలిందన్నది మిగతా కథ.

2003 నాటి ఉదంతం

2003లో నిజంగా జరిగిన పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశానన్నాడు దర్శకుడు. తమిళనాడులో తెలుగు విద్య కోసం ఉద్యమించినట్టు, కేరళలోని కాసరగోడ్ లో కన్నడ స్కూలు ఎత్తేయకుండా పోరాటం. కోర్టు కేసుతో తేలే ఈ కథ చిన్నది, కథ చుట్టూ వివిధ పాత్రలతో అల్లిన ఉప కథలు పెద్దవి. ఒక పద్మనాభ అనుకుని ఇంకో పద్మనాభని తెచ్చుకునే హాస్య ప్రహసనం సహా ఉప కథలూ హాస్య ప్రధానమే. మొత్తంగా తెలిసీ తెలీని పిల్లల జ్ణానంతో ఇదొక బాల హాస్యలోకం. ప్రశ్నించే బాల హాస్యలోకం. దర్శకుడికి మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. చదువుల మీద వేసిన సెటైర్లు మెత్తగా చురక అంటిస్తాయి. ఈ హాస్యలోకంలో అప్పుడే బాల ప్రేమ లోకం కూడా వుంది. ఏడో తరగతి ఫెయిలవుతూ వుండే ప్రవీణా కుమార్‌కి ఏడో తరగతి చదివే పల్లవితో కౌమార ప్రేమాయణం. ప్రవీణా కుమార్‌కి అడ్డమైన చిట్కాలు చెప్పే ఫ్రెండ్ మహేంద్ర. ఇంకో మమ్మూట్టిగా పిలిపించుకునే ఆరో తరగతి వాడు. ఇలా బాల పాత్రలుంటాయి. వూరెలా వుందో పిల్లలూ అలా ఆనందంగా వుంటారు. స్కూలు సమస్యతో హాస్యంగానే పోరాడతారు. హాస్యం కూడా సమస్యల్ని సాధిస్తుందని నిరూపిస్తారు. ఇదొక కొత్త కోణం యాంత్రిక సినిమా కథలకి.

లాయర్ పాత్రల్లో అనంత నాగ్, రమేష్ భట్‌లు కోర్టు సీన్లు పోటాపోటీ హాస్యమే. క్లయిమాక్స్‌లో అనంత్ నాగ్ సుదీర్ఘ ఏకపాత్రాభినయం ఒక ప్రయోగం. ఒక వాస్తవిక సినిమాని వినోదంగా తీయవచ్చని చేసి చూపించాడు దర్శకుడు. ‘కథ’ తో సాయి పరంజపే చేసింది కూడా ఇదే. భాషా వివక్ష, భాషాధిక్య భావం సామాజిక అల్లికకి చెరుపు చేస్తాయని సందేశమిచ్చే ఈ వాస్తవికానికి కేంద్ర జాతీయ అవార్డుతో బాటు, కర్ణాటక రాష్ట్ర అవార్డు లభించాయి. వినోదంగా తీసిన ఈ వాస్తవిక సినిమా ఇంకో రికార్డు కూడా సాధిచింది. రెండు కోట్ల బడ్జెట్ కి 20 కోట్ల వసూళ్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here