లోకల్ క్లాసిక్స్ – 38: నిర్బంధంలో నచ్చిన స్వాతంత్ర్యం

0
7

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా మమతా మూర్తి దర్శకత్వం వహించిన మణిపురీ సినిమా ‘ఫ్రైడ్ ఫిష్, చికెన్ సూప్ అండ్ ఏ ప్రీమియర్ షో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఫ్రైడ్ ఫిష్, చికెన్ సూప్ అండ్ ఏ ప్రీమియర్ షో’ (మణిపురీ)

[dropcap]తీ[/dropcap]వ్రవాదం సినిమాలని నిర్బంధిస్తే సినిమాలకి స్వాతంత్ర్యం వచ్చినట్టా? వచ్చినట్టేనని నిరూపిస్తున్నాయి మణిపురీ సినిమాలు. స్వాతంత్ర్యమేం ఖర్మ, దాంతో పాటూ జాతీయ అంతర్జాతీయ అవార్డులూ దర్జాగా సొంతమవుతాయని రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వాలు సినిమాలని నియంత్రిస్తే ఆందోళన, తీవ్రవాదులు నియంత్రిస్తే అదో క్రమశిక్షణ. తీవ్రవాద భావ వ్యాప్తికి కాదు, మణిపురి సంస్కృతీ పరిరక్షణకి. మణిపూర్ స్వతంత్ర దేశమన్న మౌలిక పోరాటంలో వేళ్లూనిన ఆత్మ గౌరవ కాంక్ష. తత్ఫలితంగా మణిపురీ సినిమాలివ్వాళ ఈశాన్య భారతపు మణి మకుటాలయ్యాయి.

2001లో మణిపూర్‌లో తీవ్రవాదులు బాలీవుడ్ సినిమాలని నిషేధించడంతో మణిపురీ సినిమాలకి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ బాలీవుడ్ సినిమాల ప్రభావంతో పెడ ధోరణులు పట్టి పోయి, సొంత సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోయిన ప్రజలు, బాలీవుడ్ సినిమాల నిషేధంతో పద్ధతి మార్చుకున్నారు. బాలీవుడ్ సినిమాలు ఏలిన రెండు దశాబ్దాల కాలం ఏడాదికి ఒకటీ ఆరా నిర్మాణమయ్యే మణిపురీ సినిమాలు, నిషేధం తర్వాత ఏకంగా ఏడాదికి డెబ్బై సినిమాల స్థాయికి చేరుకున్నాయి. తీవ్రవాద చర్యతో బాలీవుడ్ సినిమాల నుంచి మణిపూర్ సినిమా పరిశ్రమకి స్వాతంత్ర్యం లభించినా, తీవ్రవాద నిర్బంధంలో కెళ్లిపోయింది. ఒకటే షరతు: ఇక నుంచి మణిపురీ సినిమాలు పరిపుష్టమైన మణిపురీ విలువలకి అద్దం పట్టాలి. ఈమేరకు సినిమాల మీద నిఘా వుంటుంది, సెన్సార్ వుంటుంది. దాదాపు ముప్ఫై తీవ్రవాద సమూహాల ఒకే మాట, పెడదోవ పట్టారో తుపాకీ తూటా తప్పదు. దీంతో సినిమాలు క్రమశిక్షణతో మణిపురీ జీవితపు దర్పణాలుగా మెరుపులు మెరిపించ సాగాయి.

దర్శకురాలు మమతా మూర్తి ఏ సినిమాలనైతే నిషేధించారో ఆ బాలీవుడ్ నుంచే సరాసరి మణిపూర్ వచ్చింది. పైగా తీవ్రవాద ప్రభావిత మణిపురీ సినిమా తీరు తెన్నుల్నే డాక్యూ డ్రామాగా రికార్డు చేయదల్చుకుంది. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కంపెనీ’ వంటి బాలీవుడ్ సినిమాలకి పని చేసిన అసిస్టెంట్‌గా తొలి ప్రయత్నమే మణిపూర్‌తో చేసింది. 2012లో  ‘ఫ్రైడ్ ఫిష్, చికెన్ సూప్ అండ్ ఏ ప్రీమియర్ షో’ అన్న టైటిల్‌తో మణిపూర్ సినిమా చరిత్రని వర్తమాన దృశ్యంతో మిళితం చేసి ఒక అపూర్వ సృష్టి చేసింది. ఇందుకుగాను కళలు/సంస్కృతి విభాగంలో జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డు, ముంబాయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ జ్యూరీ అవార్డు, ఆ తర్వాత కేరళ సైన్స్ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డూ సగర్వంగా పొందింది.

కథ

‘21వ శతాబ్దపు కుంతి’ సినిమా షూటింగ్ ఏర్పాట్లతో ప్రారంభమవుతుంది. సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న మధ్యతరగతి ఆవిడ యూనిట్‌కి పొయ్యి మీద వంట చేస్తూ షూటింగ్ ఏర్పాట్లని పర్యవేక్షిస్తూంటుంది. స్క్రిప్టు రచయిత అయిన ఆమె భర్త దర్శకుడికి సీను వివరిస్తూంటాడు. ఈ దర్శకుడు మేకప్ మాన్ కూడా. ఆర్టిస్టులకి మేకప్ వేస్తూ ద్విపాత్రాభినయం చేస్తూంటాడు. కెమెరామాన్, లైట్ బాయ్స్, అసిస్టెంట్లు, ఇతర సిబ్బందీ ఆ సాధారణ లొకేషన్లో  చాలా హడావిడీ చేస్తూంటారు. వంట పూర్తి చేసి ఆవిడ యూనిట్ అందరికీ వేడి వేడి వరి అన్నంతో ఫ్రైడ్ ఫిష్ వడ్డిస్తుంది.

షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ షూటింగ్ వివిధ లొకేషన్లలో నిరంతరాయంగా జరుగుతూన్తుది. ఔట్ డోర్‌లో గస్తీ తిరిగే భద్రతా దళాల మధ్య, ప్రజల మధ్య షూటింగ్ చేస్తారు. పాటలు కూడా చిత్రీకరిస్తారు. ఇదంతా వీడియో షూటింగే చేస్తారు. షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్ చేస్తారు. స్థానిక సెన్సార్ ఫోరం విధించిన కట్స్‌ని పాటిస్తారు. ఈ కట్స్‌లో చికెన్ సూప్ అన్న పదం కూడా వుంటుంది.

ఇక విడుదల తేదీ ప్రకటిస్తూ పట్టణ గోడల మీద పోస్టర్లు అతికిస్తారు. ప్రదర్శనకి హాలుగా మార్చిన పెద్ద నిర్మాణంలో టికెట్లు విక్రయిస్తారు. భారీగా జనం తరలి వస్తారు ప్రీమియర్ షోకి. టికెట్లు అయిపోయి తోసుకుని లోపలలికి జొరబడి పోతారు. క్రిక్కిరిసిన హాల్లో కేరింతల మధ్య ‘21 వ శతాబ్దపు కుంతి’ సినిమా ప్రదర్శన ప్రారంభమవుతుంది…

కథతో చరిత్ర

ఈ సినిమా కుంతీదేవి గురించి కాదు. సినిమాలో సినిమాగా ఉదాహరణకి వాడుకున్న ‘21 శతాబ్దపు కుంతి’ అనే సినిమా నిర్మాణ ప్రక్రియ. స్థూలంగా కుంతీదేవి సంతానంలో ఇద్దరు తూర్పు పడమర (తీవ్రవాది- సైనికుడు) లయ్యే కాన్సెప్ట్. దర్శకురాలు మణిపూర్‌లో ఈ సినిమా నిర్మాణ ప్రక్రియ ఎలా వుంటుందో చూపిస్తూ, మధ్యమధ్యలో మణిపూర్ సినిమా – రాజకీయ- తీవ్రవాద చరిత్ర, దాని పరిణామ క్రమం  రికార్డు చేస్తూ వుంటుంది, వాటి తాలూకు క్లిప్పింగ్స్ వేస్తూ.

మణిపూర్ సినిమాల విషయానికొస్తే, నేటి డిజిటల్ సినిమాల దగ్గర్నుంచి, వెనక్కి చరిత్రలో 1891లో జరిగిన మొదటి మ్యాజిక్ లాంతరు అనే ప్రక్రియతో వేసిన ‘సినిమా’ ప్రదర్శన చూపిస్తుంది. రాజకీయాలకి వస్తే 1891 లోనే వేరే దేశంగా వున్న మణిపూర్‌లో జరిగిన బ్రిటిష్ పోరాటం దగ్గర ఎత్తుకుంటుంది. బ్రిటన్ ప్రతినిధిగా వున్న ఫ్రాంక్ గ్రిమ్ వుడ్, మణిపూర్ రాజవంశంలో తిరుగుబాటుని అణిచివెయ్యడానికి పూనుకుంటాడు. అతడి భార్య ఎథెల్ సెయింట్ క్లెయిర్ గ్రిమ్ వుడ్‌ని ఈ సందర్భంగా మణిపూర్ హీరోయిన్‌గా పేర్కొన్నారు.

1947లో భారత్‌కి స్వాతంత్ర్యం లభించినప్పటికీ మణిపూర్ సంస్థానం విలీనం కాలేదు. 1948లో విలీనమైంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తీవ్రవాద చరిత్ర ఇక్కడ్నుంచీ మొదలవుతుంది. 1972 నుంచి మణిపూర్ సినిమా నిర్మాణాల ప్రారంభం, బాలీవుడ్ ప్రభావం, 2001 లో తీవ్రవాదులు విధించిన బాలీవుడ్ సినిమాల నిషేధం, స్థానిక మణిపూర్ సినిమాల ఊపు, తీవ్రవాదులు మణిపూర్ సాంస్కృతికోద్యమాన్ని చేపట్టి సినిమాల్ని శాసించడం, ఆ మేరకు మణిపూర్ సినిమాలు గుణాత్మకంగా నిర్మాణమవడం మొదలైనవి… ఈ డాక్యూ డ్రామాని వీక్షించడం మంచి సినిమాటిక్ అనుభవం, ఎడ్యుకేషన్. దీని నిర్మాత మధుశ్రీ దత్తా, కెమెరా హోదమ్ టామీ సింగ్, ఎడిటింగ్ రిఖవ్ దేశాయ్, సంగీతం అర్జున్ సేన్, దర్శకత్వం మమతా మూర్తి. యూట్యూబ్ లో యాభై రూపాయలు చెల్లించి చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here