లోకల్ క్లాసిక్స్ – 4: కమర్షియలార్ట్ క్రియేటివిటీ!

0
9

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా సత్యజిత్ రే బెంగాలీ సినిమా ‘నాయక్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘నాయక్’ (బెంగాలీ)

క్రిందటి వ్యాసంలో సినిమా స్టార్ అరిందం పాత్ర మొదటి డ్రీమ్ సీక్వెన్స్‌లో డబ్బు గుట్టల్లో పీడకల దృశ్యం గురించి చెప్పుకున్నాం. ఇది కథా ప్రారంభానికి ఉత్ప్రేరక ఘట్టం. అంటే కథని ప్రేరేపించే కీలక ఘట్టం. ఇది కథలో ప్లాట్ పాయింట్ వన్ అనే మజిలీ. ఏ సినిమా కథైనా ప్లాట్ పాయింట్ వన్ నుంచే ప్రారంభమవుతుంది. దీనికి ముందు బిగినింగ్ విభాగంలో చూపించేదంతా కథ కాదు, కేవలం ఉద్దేశించిన కథకి ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతంలో పాత్రల పరిచయాలు, కథా నేపథ్యపు ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, వీటన్నిటి తర్వాత సమస్య ఏర్పాటు తాలూకు కథనమూ వుంటుంది.

ఏ సినిమాలోనైనా ప్రధాన పాత్రకి సమస్య ఏర్పడిందగ్గర్నుంచే కథ మొదలవుతుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్‌తో బిగినింగ్ విభాగం ముగిశాక, ప్రారంభమయ్యే మిడిల్ విభాగంతో కథ ప్రారంభమవుతుంది. ఇది ప్లాట్ పాయింట్ టూ దగ్గర మిడిల్ విభాగపు ముగింపు వరకూ సాగుతుంది. ఈ విధంగా ప్లాట్ పాయింట్ వన్‌కీ, ప్లాట్ పాయింట్ టూకీ మధ్య వుండే స్పేస్ లో వుండేదే కథ. దీనికిటువైపు బిగినింగ్‌లో వుండేది కథకి ఉపోద్ఘాతం, అటు వైపు ఎండ్‌లో వుండేది కథకి ముగింపు. అంటే మొత్తం స్క్రీన్ ప్లే మధ్య భాగంలో యాభై శాతం నిడివితో కథంతా పర్చుకుని వుంటుంది. దీనికి ముందు పాతిక శాతంతో ఉపోద్ఘాతం, దీని తర్వాత ఇంకో పాతిక శాతంతో ముగింపూ వుంటాయి. ఇదే 1 : 2 : 1 నిష్పత్తి. వ్యాపార సినిమాలకి ప్రామాణిక స్క్రీన్ ప్లే.

ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రధాన పాత్రకి సమస్య ఏర్పాటవుతుంది. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ ఏర్పాటైన సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది. ఈ రెండు బిందువుల మధ్య ఏర్పాటైన సమస్యకి పరిష్కారాన్ని సాధించే లక్ష్యం (గోల్)తో ప్రధాన పాత్ర పడే సంఘర్షణ వుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ప్రధాన పాత్రగా అరిందం ముఖర్జీకి డ్రీం సీక్వెన్స్‌లో పీడ కల రావడమే అతడికేర్పాటయిన సమస్య. దీనికి ముందు బిగినింగ్ విభాగంలో ఉపోద్ఘాతం తాలూకు కథనంలో – ఆయా పాత్రల పరిచయాలు, ఇది సినిమా రంగానికి సంబంధించిన కథంటూ తెలిపే నేపథ్యపు ఏర్పాటూ చూశాం. ఇక అలాగే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటయ్యే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా – ముందుగా అదితి అరిందం ఇంటర్వ్యూని అడగడం, ఆ తర్వాత అరిందం స్క్రిప్టు చదువుకుంటూ నిద్రలోకి జారుకోవడమనే పరిస్థితుల కల్పన చూశాం. ఈ రెండిటి పర్యవసానంగా అరిందం పీడకల కనడంతో – ఆ పీడకలే అతడి సమస్యగా ఏర్పాటవడాన్నీ గమనించాం. దీంతో బిగినింగ్ విభాగం ముగిసిపోయింది.

   ఇక మిడిల్ విభాగం ప్రారంభం. ఈ ప్రారంభంలో పీడకల వల్ల కలిగిన ఆందోళనతో వున్న అరిందం ఒక గ్రామీణ స్టేషన్లో ట్రైను దిగి టీ తాగుతూ, కిటికీ లోంచి చూస్తున్న అదితికి టీ ఆఫర్ చేస్తాడు. ఆమె వద్దంటుంది. తర్వాత ట్రైను కదిలినప్పుడు ఆమె ముందు కూర్చుని, తను గన్న కలని ప్రస్తావిస్తాడు – “నీకు కలల గురించి ఏమైనా తెలుసా?” అని. సబ్ కాన్షస్ లో వుండే మన విశ్వాసాలూ భయాలూ కలల రూపంలో బయటపడతాయని ఆమె అంటుంది. తను నోట్ల ఊబిలో కూరుకుపోతున్నట్టు కల వచ్చిందనీ, శంకర్ దాదా తనని కాపాడలేదనీ అంటాడు. “శంకర్ దాదా ఎవరు?” అని అడుగుతుంది. దీంతో కలలో కన్పించిన భారీ మనిషి శంకర్ దాదా అని మనకి అర్థమవుతుంది. ఇలా ఇతనెవరనే ట్రిగ్గర్ డైలాగుతో ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభమవుతుంది.

మొదటి ఫ్లాష్‌బ్యాక్:

అదొక నాటకాల కంపెనీ. ఆ నాటకాల కంపెనీలో సినిమాల్లో చేరతానంటున్న అరిందంని గురువు శంకర్ దాదా మందలిస్తూంటాడు, “సినిమాల్లో గ్లామర్ వుంటుందిరా, కళ వుండదు. కళలతో సినిమాలకి సంబంధం లేదు. అక్కడ నటులు కళా సేవ చేసేదేం వుండదు. సినిమాల గురించి వివరంగా చదివా. సినిమా నటుడొక తోలుబొమ్మ, అంతే. దర్శకుడి చేతిలో తోలుబొమ్మ. కెమెరా మాన్, సౌండ్ రికార్డిస్టు, ఎడిటర్, వీళ్ళందరి చేతిలో తోలుబొమ్మ! కానీ స్టేజి నటుడికి స్ఫూర్తి ప్రేక్షకులే. వాళ్ళ ముందు నటిస్తున్నప్పుడు నువ్వా స్ఫూర్తిని పొందుతావ్. వాళ్ళే నీకు శక్తి, స్ఫూర్తీ. వాళ్ళందర్నీ కాదనుకుని వెళ్లి పోతావట్రా?”

 “నువ్వు సక్సెస్ అవలేవని అనండం లేదు, నీకు పర్సనాలిటీ వుంది, వాయిస్ వుంది. సినిమాలకి వ్యాపార కోణం కూడా వుంటుంది. అది హృదయం లేని డిమాండ్ సరఫరా ఆట. నీకు రెండు వరస హిట్లు పడ్డాయంటే, చకచకా పైకి ఎగబ్రాకి పోతావ్. మూడోది నాల్గోది అట్టర్ ఫ్లాపయ్యాయంటే, నువ్వెక్కిన నిచ్చెనని ఎవరో లాగేసినట్టవుతుంది. నువ్విక ఫినిష్, పైకి లేవలేవు! అర్ధమైందా?” అని సుదీర్ఘ హితబోధ చేస్తాడు.

అరిందంకి మిత్రుడు జ్యోతి సినిమాలో హీరో అవకాశం తీసుకువచ్చాడు. శంకర్ దాదా చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు. దీంతో ఈ ఫ్లాష్‌బ్యాక్ పూర్తవుతుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ప్రధాన పాత్ర అరిందంకి సంబంధించిన సమాచారమిచ్చే ఉద్దేశంతో వుంది. ఏ సీను అయినా పాత్రకి చెందిన సమాచార మందించడానికో లేదా, కథని ముందుకు నడిపించడానికో వుంటుంది. ఈ సీను సమాచార మందించడానికే వుంది. తను సినిమాల్లోకి వెళ్ళా లనుకుంటున్నాడు, గురువు వద్దంటున్నాడు. మరి అరిందం సినిమాల్లోకి ఎలా వెళ్ళాడు? తర్వాతి ఫ్లాష్ బ్యాక్ లో చూద్దాం.

రెండో ఫ్లాష్‌బ్యాక్:

అరిందం స్వగతంతో ఈ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది, “దేవీ నవరాత్రులు ముగుస్తున్నాయి. ఉత్సవంలో ఉన్నట్టుండి శంకర్ దాదా కుప్పకూలి చనిపోయాడు. థ్రొంబోసిస్‌తో పోయాడు. ఎందరివో చావులు చూశాను… నా తల్లిదండ్రులవీ, బంధువులవీ. ఇంకెందరివో పాడెలు మోశాను. చావంటే నాకు ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ఏర్పడింది. అప్పుడొక అద్భుతం జరిగింది. శంకర్ దాదా చితిని చూస్తూంటే నాలో ఒక అద్భుతమేదో జరిగింది…” ఈ స్వగతంతో వస్తున్న దృశ్యాలు ఆగుతాయి.

సీనులోకి జ్యోతిని పిలుస్తాడు అరిందం. జ్యోతిని అడుగుతాడు, “పునర్జన్మల్ని నమ్ముతావా?” అని. “ఎవరి పునర్జన్మ?” అంటాడు జ్యోతి. “మానవ పునర్జన్మ, నీదే అనుకో” అంటాడు అరిందం. “నేనిప్పుడు నేను. పునర్జన్మలో ఈ నేనే ఆ నేనని నాకెలా తెలుస్తుంది? జ్యోతి బెనర్జీ జ్యోతి బెనర్జీగానే పుట్టడు కదా? అదే వస్తువు ఇంకో చోట వుండదు. ఇక నమ్మడం నమ్మకపోవడమనే ప్రశ్నెక్కడిది?” అంటాడు జ్యోతి.

“నిజమే ఇది దొంగ బాబాలు మాయ చేస్తున్న కాలం. పునర్జన్మలూ లేవు, దేవుడూ లేడు. నాకు తెలుసు, జీవితం ఒక్కటే వుంటుందని, దీంతో అవకాశం ఒక్కటే వుంటుందనీ. సినిమా నటులు తోలుబొమ్మలని నువ్వు నమ్ముతావా? బ్రాండో, బోగార్ట్, పాల్ మునీ…వీళ్ళంతా తోలుబోమ్మలేనా?” అంటాడు అరిందం.

“నువ్విలా నెలకి 333 రూపాయల చిల్లరేదో సంపాదిస్తున్నావ్. వార్షిక ఇంక్రిమెంట్ 10 రూపాయలతో. దీనికంటే విజయవంతమైన తోలుబొమ్మగా నోట్ల కట్టలు వెనకేసుకోవడమే బెటర్ కదా? సినిమాకి 20 వేలు, ఆలోచించు” అని వూరిస్తాడు జ్యోతి.

ఈ సీను కథని ముందుకు నడిపిస్తోంది. దాదా మరణంతో అరిందం ఫిలాసఫీలో కెళ్ళి, ఒకటే జీవితం – ఒకటే అవకాశం అనే నిర్ణయానికొచ్చి, సినిమా హీరోగా వెళ్లేందుకు సిద్ధమైపోయాడు. అయితే ఇది ఫార్ములా కథనంతో వుంది. కథకి అడ్డున్న పాత్రని చంపి కథ నడిపించుకునే ఫార్ములా కథనం. అరిందం సినిమా రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేయడానికి అసలుకైతే ఆర్గ్యుమెంట్ పంథా ననుసరించాలి. తన వాదనతో అరిందం ఎలా గురువుని గెల్చాడో చూపించి వుంటే, ఇది ప్రేక్షకులకి ఎడ్యుకేషన్ అయ్యేది. నిజజీవితాల్లో వివిధ సందిగ్ధ పరిస్థితులేర్పడుతూంటాయి. వాటినెలా ఎదుర్కోవాలో చెప్పడం కథన లక్షణ మవుతుంది. దీనికి బదులు విధిని ప్లే చేసి పరిష్కరించడం అవాస్తవిక మవుతుంది. ఒకాయనతో మనకి తెగక పోతే, విధి కల్పించుకుని ఆయన్ని చంపేసి, మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయదు కదా?

పరిష్కారాన్ని విధి చేతిలో పెడితే పాత్ర పాసివ్ పాత్రవుతుంది. అయితే ఆర్ట్ సినిమాల్లో వుండేది పాసివ్ పాత్రలే, యాక్టివ్ పాత్రలు అరుదుగా వుంటాయి.

మూడో ఫ్లాష్‌బ్యాక్:

ఇది మొదటి సినిమా అనుభవానికి సంబంధించి. ముకుంద్ అనే మొండిఘటం సీనియర్ నటుడితో అరిందంకి మొదటి షాట్. షాట్ కి ముందు మేకప్ రూమ్‌లో మేకప్ మాన్ ముకుంద్ మెడ పట్టలేకపోతే, అరిందం కల్పించుకుని మెడ బట్టుకుని తిప్పేస్తాడు. షాట్ తీస్తున్నప్పుడు ముకుంద్ అందరిమీదా జులుం ప్రదర్శిస్తాడు. అతనంటే దర్శకుడికి కూడా హడల్. “ఇంత ఉక్కగా వుందేమిటి – ఎవడ్రా ఫ్యానుకి అడ్డంగా?” అని కేకేస్తాడు. “యాక్టర్ ఒక్కడే కింగిక్కడ, అతను లేకపోతే ఏమీ జరగదు” అని హూంకరిస్తాడు.

డైలాగ్స్ గురించి అరిందంని హెచ్చరిస్తాడు. తను వున్నదున్నట్టు డైలాగులు చెప్పనని, మారిపోతూంటాయనీ, అవి అందుకుని రియాక్షన్ ఇవ్వాలనీ అంటాడు. ఈ సన్నివేశం జమీందారు అయిన తండ్రికీ (ముకుంద్), కొడుకు (అరిందంకీ) మధ్య డబ్బు సర్దుబాటు గురించి. “నేను చాలా డిస్టర్బ్ అయి వున్నాను నువ్వాలస్యం చేస్తే… నామీద అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది” అంటాడు ముకుంద్. “మామ గారు డబ్బు సాయం చేయలేనన్నారు నాన్నగారూ” అంటాడు అరిందం. “ఇంకో ఏర్పాటు చేశా నాన్న గారూ” అంటాడు మళ్ళీ.

దీంతో ముకుంద్ రియాక్ట్ అయి, “ఇదేనా నువ్వు డైలాగులు చెప్పే స్టయిల్? హాలీవుడ్ స్టయిల్?” అంటాడు కోపంగా. దీంతో సీను వదిలేసి డైలాగుల చర్చ మీదికి వెళ్ళిపోతారు. అవతల రీలు తిరుగుతూంటుంది, దర్శకుడు తల పట్టుకుంటాడు. “ఎందుకంత మెల్లగా మాట్లాడుతున్నావ్?” అని ముకుంద్ అంటే, ఆ రోజుల్లో తండ్రి ముందు పిల్లలు మెల్లగా మాట్లాడే వారని బంకిం చంద్ర ఛటోపాధ్యాయ చెప్పారంటాడు అరిందం. “అలాగా? మరి నేను నీళ్ళు అంటే నువ్వు చమురు అన్నప్పుడు ఈ రెండూ ఎలా కలుస్తాయి? నీ వాయిస్‌ని అండర్ ప్లే చేయాల్సిన అవసరం లేదు…” అని కసురుతాడు ముకుంద్.

ఇక్కడ సీను మీద అరిందం స్వగతం పోస్ట్ అవుతుంది – “షాట్‌లో అందరి ముందూ చాలా అవమానం చేశాడు. అతను సీనియర్ కాబట్టి ఓర్చుకున్నాను. కానీ అతడి యాక్టింగ్ స్టయిల్ అంతా రాంగ్. కాలం చెల్లిన నటన అది…” ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.

ఈ ఫ్లాష్ బ్యాక్ ముగింపు కూడా అదితికి చెప్తున్నట్టు స్వగతంతో వుంది. ఇక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్ లోంచి ప్రెజెంట్ లోకి రావడానికి ట్రాన్సిషన్ టూల్ గా స్వగతాన్ని (వాయిస్ ఓవర్‌ని) వాడారు. ఇది అరిందం, ముకుంద్‌ల మధ్య చాలా ఫన్నీ సీన్ – కమర్షియల్ నటుల తీరుతెన్నుల్ని సత్యజిత్ చేసే ఎగతాళితో. సీను ప్రారంభంలో ఇంకా పరిచయం కూడా లేని ముకుంద్ మెడ బట్టుకుని అరిందం తిప్పేయడం సింబాలిక్ చర్య. ముకుంద్ పొగరుకి చికిత్స అన్నట్టు. కాలక్రమంలో ముకుంద్ కి అరిందమే ఆపద్బాంధ వుడయ్యే పరిస్థితి మున్ముందు ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది.

సత్యజిత్ ఒక్కో ఆపరేటింగ్ సీనుతో అరిందం ముందు జీవితాన్ని చాలా దూరం తీసికెళ్ళి ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. స్థల కాలాల ఐక్యతా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. దీంతో కథనం క్లుప్తంగా వుంటూనే పరిపూర్ణంగా వుంటోంది. మొదటి ఫ్లాష్‌బ్యాకుతో అరిందం సినిమా లక్ష్యాన్ని చూపించి, రెండో ఫ్లాష్‌బ్యాకులో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసికెళ్ళారు. మూడో ఫ్లాష్‌బ్యాకులో షూటింగ్ లో ప్రవేశపెట్టి, ఇప్పుడు నాల్గో ఫ్లాష్‌బ్యాకులో సినిమా విడుదలని చూపించ బోతున్నారు…

నాల్గో ఫ్లాష్‌బ్యాక్:

ఎప్పుడూ మద్యం జోలికిపోని అరిందం, జ్యోతి ప్రోద్బలంతో తీసుకుంటాడు. రేపు సినిమా విడుదల టెన్షన్‌తో వున్నాడు. అందుకని జ్యోతి గ్లాసు నింపుతాడు. అప్పుడు తన టెన్షన్ దేనిగురించో చెప్తాడు అరిందం.

తను సరిగ్గా నటించలేదు. నటనలో తప్పులు చేశాడు. ఆ తప్పులు నటించే తనకి తప్ప మరెవ్వరికీ తెలీవు. ముకుంద్‌తో నటించిన ప్రతీ సీనూ చెడిపోయింది. అవి నాల్గు సీన్లే కావచ్చు, ఒక్క సీనైనా అలాగెందుకుండాలి? ఈ మొదటి సినిమాతోనే తను గేమ్ గెలవాల్సింది. ముకుంద్ మోకాలొడ్డేడు. లేకపోతే అతనే తప్పులో పడేవాడు. అతడి బండారమే బయట పడేది. తను పాత్రని క్షుణ్ణంగా అర్ధం జేసుకుని నటించడం అతను భరించలేకపోయాడు. ఇలాటి వాళ్ళకి పాత్రలతో పని లేదు. ఏ పాత్ర ఇచ్చినా ఒకే తీరులో నటిస్తారు. అదే వాచికం, అదే అభినయం, అవే మ్యానరిజమ్స్. ప్రేక్షకులూ ఇదే ఇష్ట పడుతున్నారు. ముకుంద్‌ని గ్రేట్ అంటున్నారు. కెమెరా ముందు ఒవరాక్ట్ చేస్తే అది పదింతలు చేసి చూపిస్తుంది. ఇది సినిమాల్లో నటించే విధానం కాదు. తను చేయాలనుకున్నది చేసేస్తే అతను ప్రమాదంలో పడేవాడు. ఇది గ్రహించే తన మీద అరవడం, అవమానించడం మొదలెట్టాడు. మొత్తం మీద తనని జీరో చేశాడు…

అరిందం ఇలా చెప్పుకుపోతూంటే, “ఈ ఇరిటేషన్ నీకు మంచి సంకేత” మని జ్యోతి అంటాడు. పైకొస్తావంటాడు. పైకొస్తానని బల్లగుద్ది చెప్తాడు అరిందం. రుజుమార్గంలో పైకొస్తానంటాడు. టాప్ కెళ్తానంటాడు…

ఈ ఫ్లాష్ బ్యాక్ చివరి డైలాగుతో అరిందం తర్వాతి ఫ్లాష్ బ్యాకులో స్టార్‌డమ్‌తో దర్శనమిచ్చేట్టు స్థల కాలాల ఐక్యతా సూత్రంతో కథనం చేశారు.

ఐదో ఫ్లాష్‌బ్యాక్:

రాత్రి పూట అరిందం ఇంటికొచ్చి, తినడానికేమైనా పెట్టమని అడుక్కుంటాడు సీనియర్ నటుడు ముకుంద్. మనిషి దిగాలుపడి వుంటాడు. “నా సింహాసనం నాకుంది, దాని మీంచి నన్ను తోసేశారు” అని చెప్పుకుంటాడు. ఏమైనా వేషాలుంటే ఇప్పించమని అడుక్కుంటాడు. వాచ్‌మన్ వేషమైనా సరే. “4 ఇయర్స్ నో వర్క్” అంటాడు. “నువ్వింకేం నటిస్తావ్?” అని అరిందం తిరస్కారంగా అంటాడు.

ఈ సీనులో అరిందం స్టార్‌డమ్‌తో వుంటాడు. ముకుంద్ రోడ్డు మీద వుంటాడు. జీవితాలు ఉల్టాపల్టా అయిన జగన్నాటకం. దీంతో అరిందం నట జీవిత వృత్తాంతం పూర్తవుతుంది. ఇక సామాజిక చైత్యనం ఎలా వుందో చూద్దాం…

ఆరో ఫ్లాష్‌బ్యాక్:

బీరేష్ పదేళ్ళు కలిసి చదువుకున్న క్లాస్‌మేట్. అతను కార్మిక నాయకుడైతే, అరిందం నాటక నటుడయ్యాడు. ఒకరోజు అరిందం సాయం తీసుకోవడానికి వస్తాడు బీరేష్. ఒక పరిశ్రమ మూతబడింది, కార్మికులు ఆందోళన చేస్తున్నారు రమ్మంటాడు. “కల్పనా ప్రపంచంలో నువ్వుండిపోతే లోకంలో వాస్తవాలు నీకు తెలీవు” అంటాడు.

“నేనొచ్చి ఏం చెయ్యను?” అంటాడు అరిందం. వాళ్ళకి మద్దతుగా ఉపన్యాసమిమ్మని బలవంతంగా బయల్దేరదీస్తాడు బీరేష్. అక్కడికి వెళ్లేసరికి పోలీసులతో గొడవ జరుగుతూంటుంది. పోలీసులు కొడుతూంటే పరుగెత్తుతూంటారు కార్మికులు. లాఠీ దెబ్బలు తప్పించుకుంటూ అరిందం పరిగెడతాడు. పోలీసులు బీరేష్‌ని అరెస్ట్ చేసి తీసికెళ్ళి పోతారు.

నాల్గేళ్ళూ బీరేష్ కన్పించడు. ఈలోగా అరిందం సినిమా స్టార్ అయిపోతాడు. ఒకరోజు కాస్ట్యూమర్ వచ్చి కొలతలు తీసుకుంటాడు. “సరిగ్గా ఫిట్టవ్వాలి, లేకపోతే నటన ఫిట్టవదు” అని అరిందం అంటే, “బాగా ఫిట్టవుతుంది, మీరు హిందీ సినిమాల్లో కూడా నటించ వచ్చు” అంటాడు కాస్ట్యూమర్. ఇంతలో బీరేష్ వచ్చేస్తాడు.

యోగ క్షేమాలడిగాక, అరిందం కెరీర్ ముచ్చట్లు మాట్లాడుకున్నాక, “నీ కారులో నాకు లిఫ్ట్ ఇస్తావా?” అనడుగుతాడు బీరేష్. అరిందం కారెక్కించుకుని బయల్దేరతాడు. కారు వెళ్లి వెళ్లి ఓ పరిశ్రమ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ సమ్మె చేస్తూంటారు కార్మికులు. దూరంగా కారాపేస్తాడు అరిందం. విప్లవం వర్ధిల్లాలంటూ కార్మికులు నినాదాలు చేస్తారు. బీరేష్ కారు దిగి అరిందంని కిందికి దిగమంటాడు. దిగనంటాడు అరిందం. కార్మికుల ముందుకొచ్చి నాల్గు ముక్కలు మాట్లాడమంటాడు బీరేష్. అది వాళ్ళకి మనోబలాన్నిస్తుందంటాడు. వాళ్ళు 24 రోజులుగా సమ్మెలో వున్నారనీ, వాళ్లకి చెప్పే నిన్ను తీసుకు వచ్చాననీ అంటాడు. వాళ్ళు నీ మద్దతుని ఆశిస్తున్నారనీ అంటాడు.

కానీ ఇందులో ఇన్వాల్వ్ అవడం మంచిది కాదంటాడు అరిందం. ఇది రిస్కు, ఇలాటి విషయాలు నీకు తెలియవంటాడు. మాటా మాటా పెరుగుతుంది. “నీకు ఫీలింగ్స్ లేవా?” అని బీరేష్ నిలదీస్తే, కావాలంటే డబ్బిస్తానంటాడు అరిందం. బీరేష్ హర్ట్ అవుతాడు, “డబ్బ వసరపడితే నీ దగ్గరికి వస్తాలే” అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. కార్మికులందరూ చూస్తూండగా అరిందం కారు తిప్పుకుని వెళ్ళిపోతాడు.

సామాజిక బాధ్యతలనుంచి పలాయనం చిత్తగించే నటుల మానసిక చిత్రణ ఇది. తమలో సామాజిక స్పందనల్లేకపోయినా ప్రజాదరణకి మాత్రం కొదవ లేకుండా చూసుకునే పిరికిపంద మనస్తత్వం. పిరికి వాడిలాగే అక్కడ్నించి పలాయనం చిత్తగిస్తాడు అరిందం. దీంతో అదితికి తన గతాన్ని చెప్పుకోవడం పూర్తవుతుంది. కాసేపు పిచ్చా పాటీ మాట్లాడుకుని డైనింగ్ కార్లోంచి వెళ్ళిపోతారు.

అరిందం తన కూపేలో కొచ్చి. నిద్ర మాత్ర లేసుకుని పడుకుంటాడు. పడుకుని ఆలోచనల్లోకి జారుకుంటాడు. ఉదయం తనతో ఫోన్లో మాట్లాడిన హీరోయిన్ గుర్తు కొస్తుంది…

ఏడో ఫ్లాష్‌బ్యాక్:

హీరోయిన్‌గా అవకాశం ఇప్పించమంటూ వస్తుంది ప్రమీల. హీరోయిన్ సెలెక్టు అయిందంటాడు. “మార్చలేరా మీ పలుకుబడితో?” అంటుంది. ఎందుకు మార్చాలంటాడు. తను బాగా నటిస్తానంటుంది. సిగరెట్ తాగుతూ ఆమెకేసే సాలోచనగా చూస్తాడు. “పెళ్లయిందా?” అంటాడు. ఆమె అతన్నే చూస్తూ చూస్తూ ఒక్క పెట్టున ఏడ్చేస్తుంది. కంగారు పడతాడు. ఆమె తేరుకుని ఫకాల్న నవ్వేస్తుంది. “ఇది నటన” అంటుంది చిలిపిగా. తనకి గ్లిసరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయంటుంది… సరే, నీ పేరిచ్చి వెళ్ళు, నా జీవిత చరిత్రలో రాస్తానంటాడు.

మిస్ ప్రమీలా ఛటర్జీతో ఇలా మొదలవుతుంది అరిందం ఏకపక్ష ప్రేమ.

ఈ జ్ఞాపకాల్లోంచి తేరుకుంటాడు అరిందం. అలా అలా నిద్రలోకి జారుకుని కలగంటాడు…

డ్రీమ్ సీక్వెన్స్ -2:

కలలో రాత్రిపూట అడవి. అడవిలో షూటింగ్. అరవింద్ ఎవర్నో వెతుక్కుంటూ పోతూంటాడు. కన్పిస్తుంది హీరోయిన్ ప్రమీల. చేరుకోబోతూంటే తప్పించుకుని పరిగెడుతుంది. కవ్విస్తూ కవ్విస్తూ ఒక భవనంలోకి వెళ్ళిపోతుంది. ఆ భవనంలోకి ప్రవేశిస్తాడు అరిందం. హాలు నిండా అతిధులుంటారు. అందరూ నల్ల కళ్ళ జోళ్ళు ధరించి వుంటారు. డ్రింక్ చేస్తూ పేకాడుతూ వుంటారు. ఆడవాళ్ళు కూడా వుంటారు. వాళ్ళల్లో ప్రమీలని వెతుక్కుంటూ తిరుగుతాడు. పేరుపెట్టి పిలుస్తాడు. వాళ్ళలో ఒకతను లేచి ఆమె తన భార్యంటాడు. “నీ భార్యా?” అంటాడు కలవరంగా అరిందం. ఆ అతిధులు ఒకొక్కరే లేస్తారు. ప్రమీల తన భార్య అన్నతను అరిందం మీద పడి కొట్టేస్తూంటాడు…

ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చుంటాడు అరిందం. ఇది ప్లాట్ పాయింట్ టూ ఘట్టం. దీంతో మిడిల్ మిడిల్ ముగిసింది. ఈ మిడిల్లో అరిందం సినీ, సామజిక, వ్యక్తిగత జీవితాల్ని చూశాం. వ్యక్తిగత జీవితంలో ప్రమీలతో ఏకపక్ష ప్రేమ గుడ్డిదని, దానికి జోలికి పోవద్దనీ పీడకల హెచ్చరించింది. నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకున్న అతిధులు గుడ్డి ప్రేమకి సింబాలిజంగా అంధులు.

ఇప్పుడిక ఎండ్ విభాగం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అరిందంకి జీవితం అర్థమై పోయింది. ఒంటరి జీవితం. లేచి బయటికి వంగి రైలు పట్టానే చూస్తూంటాడు బాగా తాగేసి. అదితి వచ్చేసి లాగేస్తుంది. వెళ్ళిపొమ్మంటాడు. మీరు వెళ్తేనే వెళ్తానంటుంది. ప్రమీల గురించి ఏదో చెప్పబోతాడు. ఆమె హతాశురాలవుతుంది. ఇంకేం చెప్పవద్దంటుంది మనసు చంపుకుని. అతడితో ఇంటర్వ్యూలో అతడి పట్ల పుట్టిన అనురాగం కాస్తా పటాపంచలవుతుంది. అతడి జీవితంలో ఆదర్ వుమన్ ప్రస్తావనతో.

తెల్లారేక ఢిల్లీ చేరుకుంటున్నప్పుడు ఎదురెదురవుతారు. మామూలు వీడ్కోలు మాటలు మాట్లాడుకుంటారు. ఆమెని ఎలా హర్ట్ చేశాడో అతను తెలుసుకోలేకపోతాడు. ప్రమీలతో ప్రేమ కుదిరేది కాదు, ఇటు ప్రమీలని ప్రస్తావించి అదితి ప్రేమని కూడా కోల్పోయాడు. రెంటికి చెడ్డ రేవడి. సామాజిక జీవితంతో బాటు వ్యక్తిగత జీవితంలోనూ విఫల మయ్యాడు. ఇక మిగిలింది ఇప్పుడు సుఖమివ్వని సూపర్ స్టార్ నట జీవితమే.

అదితి అన్నివిధాలా అతడి బాగు కోరుకుంటూ, ఇంటర్వ్యూ రాసుకున్న కాగితాలు చించేస్తుంది. “అదేమిటి, మెమరీలోంచి రాస్తావా?” అంటాడు. మెమరీలో వుంచుకుంటానంటుంది వెళ్ళిపోతూ…

ఇలా ఈ స్క్రీన్ ప్లే అంతా ఒక ఆకర్షణీయమైన కథనంతో కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సత్యజిత్ తీసింది ఆర్ట్ సినిమా. అది కమర్షియల్ స్ట్రక్చర్ లో పొరలుపొరలుగా ఇమిడి వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here