లోకల్ క్లాసిక్స్ – 45: విఫల ప్రేమల విలాపం

0
12

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘సూరజ్ కా సాత్వా ఘోడా’ (హిందీ)

తనవి సమాంతర సినిమాలు కావని, ప్రత్యామ్నాయ సినిమాలని పిలిచే శ్యామ్ బెనెగల్, సాహిత్యాన్ని తెరకెక్కించినప్పుడు అందలమెక్కించేస్తారు. ఆ సాహిత్యం సమున్నత సినిమా గౌరవం పొందుతుంది. ఎలాటి సంక్లిష్ట నవలైనా బెనెగల్ చేయిపడితే వేలెత్తి చూపలేని దృశ్యకావ్యమై పోతుంది. ‘భూమిక’ (లోకల్ క్లాసిక్స్ -14), ‘అనుగ్రహం’, ‘జూనూన్’ వంటి నవలాధార ప్రత్యామ్నాయ సినిమాలు నవలలకి మించిన కళాత్మక సౌందర్యాన్ని సంతరించుకున్నాయి. నవలా కథనాన్ని ఆయన అలా ఎలా అనితరసాధ్యంగా తెరమీద కదిలే బొమ్మలకి ప్రాణంగా పోస్తారనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలి పోయింది. నవలలతో కమర్షియల్ సినిమాలు తీసి చెడగొట్టే మహానుభావులు దీన్ని అధ్యయనం చేసుకోవాలి. అసలు ఆర్ట్ సినిమాల్ని స్టడీ చేస్తే మంచి కమర్షియల్ సినిమాలు తీయొచ్చని ఆర్ట్ సినిమాల్ని చూస్తూంటే అర్ధమవుతుంది.

శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ (1992) ఇంకో అలాటి నవలాధార ప్రత్యామ్నాయ సినిమా. జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డు విజేత. 1992లో ఆర్ట్ సినిమాల శకం దాదాపు ముగుస్తున్న సమయంలో విడుదలైన ఇది సహజంగానే ప్రేక్షకాదరణ పొందలేదు. కానీ ఇంటర్నెట్ యుగంలో కొత్త తరం ప్రేక్షకులు దీని విలువ గుర్తిస్తున్నారు. విస్మృత సినిమాల జాబితాలో జారిపోకుండా పహారా కాస్తున్నారు. అంత విశేషంగా ఇదెందుకుందో ఒకసారి చూద్దాం…

కథ

శ్యామ్ (రఘువీర్ యాదవ్) గతంలో మానెక్ ముల్లా చెప్పిన కథల్ని గుర్తు చేసుకుంటూంటాడు: 1950 లలో మానెక్ ముల్లా (రజిత్ కపూర్) కశ్మీరీ యువకుడు. మానెక్ ముల్లా పేరులో ముల్లా ముస్లిం పేరు కాదు, కాశ్మీర్లో పండిత్ ల పేరు. ఇతను రచయిత. రైల్వేలో పోస్టల్ సూపర్‌వైజర్. ఎడారిలా వుండే రైల్వే స్టేషన్లో పెద్దగా పనేం లేక కథలు ఆలోచిస్తూ వుంటాడు. ఇతడికి శ్యామ్ (రఘువీర్ యాదవ్), ఓంకార్ (సిరాజ్ అహ్మద్), ప్రకాష్ (రాజేష్ ధర్) అనే మిత్రులు. వీళ్ళకి కథలు చెప్తూంటాడు. ఒక రోజు కొన్ని ప్రేమ కథలు చెప్తానని మొదలెడతాడు. రోజు కొకటి చొప్పున ముగ్గురు యువతుల కథలు చెప్తాడు.

మొదటి కథ : అలహాబాద్ లో జమున (రాజేశ్వరీ సచ్‌దేవ్) తో మానెక్ ముల్లా కథ ఇది. జమున ఇంటి పక్కన వుంటాడు మానెక్. జమున అటు పై అంతస్తులో వుండే తన్నా (రిజూ బజాజ్) తో ప్రేమలో వుంటుంది. తన్నాకి తండ్రి మహేసర్ దలాల్ (అమ్రిష్ పురి) అంటే చెడ్డ భయం. జమున తండ్రి (అనంగ్ దేశాయ్) బ్యాంకు ఉద్యోగి. జమునకి సంబంధాలు చూస్తూంటే, తన్నాని తప్ప చేసుకోనని చెప్పేస్తుంది జమున. వాళ్ళ గోత్రం మనకంటే తక్కువని ఒప్పుకోదు తల్లి (మోహినీ శర్మ) కూడా. మహేసర్ గుణం కూడా మంచిది కాదని కూడా చెప్తారు. పైగా తాము కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో వున్నందున మహేసర్ ఈ సంబంధం ఒప్పుకోడని కూడా చెప్పేస్తారు.

జమున మానెక్ కంటే పెద్దది. అతణ్ణి ఆటలు పట్టిస్తూ వుంటుంది. ఇంట్లో చేసిన పదార్ధాలు పెడుతూంటుంది. వద్దన్నా బలవంతంగా తినిపిస్తుంది. మానెక్ ఆమెకి కథల పుస్తకాలిస్తూ వుంటాడు. పిరికివాడు తన్నాతో ఆమె ప్రేమ పట్ల అయిష్టంగా వుంటాడు. ఆమె తల్లినెలాగో ఒప్పించి తన్నాకి చెబితే, తన్నా తండ్రి భయంతో పెళ్లి చేసుకోనంటాడు. దీంతో మానెక్ జమునకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. కానీ జమునకి వేరే పెళ్ళయి పోతుంది. మానెక్ తన్నాని ఓదారుస్తాడు. కథ ముగుస్తుంది.

ఇలా కథ ముగియడంతో తీవ్ర అసంతృప్తి చెందుతారు మిత్రులు. ఇదేం కథ చెప్పావని నిలదీస్తారు. జమున ఉప్పు తిన్నందుకు మానెక్ తను చేయాల్సిన ప్రయత్నం చేశాడంటాడు రచయిత మానెక్. మిత్రుల్లో శ్యామ్ మాత్రమే ఈ కథలో విషాదాన్ని అర్ధం జేసుకుని బాధపడతాడు. మానెక్ ఇంకో కథ చెప్తాడు.

రెండో కథ : ఈ కథా ప్రారంభంలో జమున కింకా పెళ్ళి కాదు. కట్నమివ్వలేని తండ్రి నిస్సహాయత, గోత్రంతో తల్లి పట్టుదలా జమున పెళ్ళిని ప్రశ్నార్ధకం చేస్తూంటే, ఒక సంబంధం వస్తుంది. వేరే వూరు జమీందారు సంబంధం. ఇద్దరు భార్యలు చనిపోయిన వాడు. జమున తండ్రి వయస్సు వాడు. జమున తల్లి ఒప్పుకుని, భర్తనీ, జముననీ కుదేసి ఒప్పిస్తుంది. ఎంత గాలీ నీరూ తగిలితే అంత పరిపక్వత చెంది వుంటాడని ‘పెళ్లి కొడుకు’ గురించి చెప్తుంది.

ఇలా వయసు మళ్ళిన జమీందారు (సురేష్ భగవత్) ని పెళ్ళి చేసుకున్న జమున కొన్నాళ్ళ తర్వాత తిరిగొస్తుంది. ముభావంగా వుంటుంది. బ్యాంకులో ఎకౌంటింగ్ తేడా వచ్చి తండ్రి ఉద్యోగం పోయే పరిస్థితుల్లో వుంటాడు. జమునని డబ్బు అడగమంటాడు. ఇది విన్న జమున వెంటనే జాగ్రత్త పడుతుంది. కొంత చిల్లర ఇచ్చేసి, ఇక లేవంటుంది. చనిపోయిన ఇద్దరు భార్యల బంధువులు భర్తనుంచి చాలా డబ్బులు లాగేసే వాళ్ళు. అలా తన వాళ్ళూ లాగెయ్య కూడదని ఈ జాగ్రత్త.

అయితే జమునకి సంతాన యోగం లేకుండా పోయింది. అప్పుడు జమీందారు భర్తతో కలిసి పూజారి దగ్గరికి వెళ్తుంది. కార్తీక మాసంలో సూర్యోదయాన గంగా స్నానం చేసి, చండీ మాతకి అర్చన చేసి, బ్రాహ్మణులకి బంగారమూ ధాన్యాలు పెట్టాలని చెప్తాడు పూజారి. ఆ ప్రకారం చేయబోయి, గంగా నది దగ్గర జారిపడబోతుంది జమున. జట్కావాడు రామ్ ధన్ (రవీ ఝంకల్) పట్టుకుని కాపాడతాడు. అప్పుడంటాడు – పూజారి మాటలు విన్నారు, ఈ పేదోడి మాటలు కూడా వినండి. తల మీద చంద్రుడి మచ్చ వున్న గుర్రం కుడి కాలి నాడా తీసి, చంద్ర గ్రహణం రోజున దాంతో ఉంగరం చేసి తొడుక్కుంటే పిల్లలు పుడతారని. అలా అతడి గుర్రం నాడా తీసి అలాగే చేసేసరికి ఆమెకి పిల్ల పుడుతుంది. ఏడాది తర్వాత పిల్లతో ఆడుకుంటూ భర్త చనిపోతాడు. జట్కావాడు ఆమెకి ధైర్యం చెప్పి జీవితానికి కొత్త దారి చూపిస్తాడు. ఆమెకి అండగా వుంటాడు.

మూడో కథ : ఇది తన్నా కథ. తన్నా తల్లి చనిపోయి ఇద్దరక్కలుంటారు. తండ్రి మహేసర్ దలాల్ ఇంకో పెళ్లి చేసుకుని పట్టపగలే సరసాలాడుతూంటాడు. తన్నాని పనివాడి కంటే హీనంగా చూస్తాడు, కొడతాడు. జమున తండ్రి తన్నాని పిలిచి, జమునని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం వుండాలని అంటాడు. జమున తల్లి అడ్డుపడుతుంది. ఇలా అటు తన్నా తండ్రి, ఇటు జమున తల్లీ మధ్య నలిగి పోతారు జమునా తన్నాలు. ఎదురు తిరగాలని జమున అనుకుంటే, తండ్రి భయంతో ధైర్యం చాలదు తన్నాకి.

ఇప్పుడు మహేసర్ కన్ను సబ్బులు తయారు చేసే సత్తి (నీనా గుప్తా) మీద పడుతుంది. గిరిజన అమ్మాయి సత్తికి సైన్యంలో పనిచేసిన చమన్ ఠాకూర్ (లలిత్ తివారీ) పెంపుడు తండ్రిగా వుంటాడు. సత్తి తనతో మగవాళ్ళ నకరాలు సాగనివ్వదు. సబ్బులు కోసే కత్తితో చంపి పారేసే తెగువ ఆమెలో వుంటుంది. మహేసర్ ని చూసి ఆమె సబ్బులు అమ్మగలవా అంటే, నీ కంటి కాటుక కూడా అమ్మగలనంటాడు సరసంగా మహేసర్. ఎలాగో చమన్ ఠాకూర్‌ని లోబర్చుకుని, ఆమెని అనుభవించాలని చూస్తూంటాడు. మరోవైపు కొడుకు తన్నాకి పెళ్లి ప్రయత్నాలు చేస్తాడు. కొడుకు పెళ్ళి కట్నం బాగా లాగి, వాడి అక్కల పెళ్ళిళ్ళు చేసేయాలని ప్లాను. అలా ధనిక అమ్మాయి లలిత (పల్లవీ జోషి) తో పెళ్ళి జరిపించేస్తాడు. సంబంధం మాట్లాడేప్పుడు లలిత తల్లి (ఇళా అరుణ్) మీద చేతులేసి ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడతాడు.

లలితని ప్రేమిస్తున్న మానెక్ చివరి నిమిషంలో తప్పించుకుంటాడు. జమునతో ఇలాగే చేశాడు. అసలు బియ్యే వద్దు ఉద్యోగం చేసుకోమన్న అన్న, పెళ్లి కూడా చేసుకుంటానంటే తంతాడు.

పెళ్ళికి ముందే ఒక వయసు వచ్చేసరికి లలిత చదువాగిపోయి వుంటుంది. రేపు చేసుకోబోయే భర్త కంటే తక్కువ చదువుకోవాలి కాబట్టి. అయితే పిరికి వాడైన తన్నా అంటే ఆమెకి పడదు. అందుకని కడుపుతో వుండగా పుట్టింటి కెళ్ళి తిరిగి రాదు. ఒక కేసులో పోలీసుల బారి నుంచి మహేసర్ తప్పించుకుని వియ్యంకురాలి ఇంటికొస్తే, ఆశ్రయమివ్వదు లలిత. ఇలా వుంటే, అటు తండ్రి దౌర్జన్యానికీ, ఇటు భార్య లలిత కాఠిన్యానికీ మధ్య పాలుపోక ఒక నిర్ణయం తీసుకుంటాడు తన్నా. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు. వెంటనే చూడడానికి లలిత రాదు. జమున వస్తుంది కూతురితో. ఆ తర్వాత కూతురితో వచ్చిన లలిత, సవతి వచ్చినట్టు ఫీలయ్యి జమునని దూషిస్తుంది.

నాల్గో కథ : ఈ కథలో సబ్బులమ్మాయి సత్తితో పరిచయ మేర్పడుతుంది మానెక్‌కి. మానెక్ ఎఫ్.ఏ (ఫస్ట్ ఆర్ట్స్) పాసై బియ్యే చేయాలనుకుంటే అన్న (కెకె రైనా) ఉద్యోగంలో చేరి పొమ్మంటాడు. బియ్యే కి డబ్బు సాయం చేయనంటాడు. దీంతో సత్తి ముందుకొచ్చి మానెక్ చదువుకి సాయపడుతుంది సబ్బుల మీద ఆదాయంతో. మానెక్ ని పెద్ద ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది. ఇలా వుండగా తాగుబోతయిన చమన్ ఠాకూర్‌ని లోబర్చుకుని సత్తిని అనుభవించేస్తాడు మహేసర్. సత్తి పారిపోయి వచ్చి తనని ఎక్కడికైనా తీసికెళ్లి పొమ్మంటుంది మానెక్ తో. మానెక్ భయపడి అన్నకి చెప్తాడు. అన్న చమన్ ఠాకూర్ నీ, మహేసర్ నీ పిలిపించి సత్తిని పట్టించేస్తాడు. తర్వాత సత్తి శవమై దొరుకుతుంది. ఇదీ నాల్గు కథల కథ.

ఎలావుంది కథ

1952 లో ప్రసిద్ధ హిందీ రచయిత, ధరమ్ వీర్ భారతి (1926 – 97) రాసిన ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ (సూర్యుడి సప్తాశ్వాల్లో ఏడో గుర్రం) మహోజ్వల నవలని శ్యామ్ బెనెగల్ తెరకెక్కించారు. 46 ప్రచురణలు పొంది ఇప్పటికీ విపరీతంగా అమ్ముడుపోతున్న నవల. 1999లో ఇంగ్లీషు అనువాదం విడుదలైంది. యూట్యూబ్ లో నవలా పరిచయం ఇంకా పెడుతున్నారు. లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వుంటున్నాయి. తాజాగా ‘ది హిందూ’ దినపత్రిక సినిమా సమీక్ష ఇచ్చింది. సినిమా అమెజాన్లో, యూట్యూబ్ లో వుంది.

దీనికి ముందు రచయిత రాసిన ‘గునాహోఁ కా దేవత’ కూడా ఆనాడు యువతని కుదిపేసిన క్లాసిక్ ప్రేమ నవల. 55 ప్రచురణలు పొందింది. మున్షీ ప్రేంచంద్ తర్వాత ఎన్నదగ్గ రచయితగా భారతీని నిలబెట్టింది. ఇందులో విద్యార్థికీ, ప్రొఫెసర్ కూతురికీ మధ్య అప్రకటిత ప్రేమతో సంఘర్షణ. పట్టణ మధ్యతరగతి కుటుంబాల్లో ప్రేమలు సామాజికార్ధిక విభజనతో, మూస సామాజిక విలువల పంజరంలో, ఎలా సంక్షుభితాలవుతాయో చూపే కథ.

‘సూరజ్ కా సాత్వా ఘోడా’ లో సామాజికార్ధిక వర్గ పోరాట పునాదులున్న ప్రేమలే మంచి ప్రేమ లవుతాయని చెప్తారు. సాహసం, పరిపక్వత లేని ప్రేమలు విఫలమవుతాయని రచయిత మానెక్ పాత్ర ద్వారా వివరిస్తారు. శరత్ ‘దేవదాసు’ కథ సామాజికార్థిక మూలాల్లోంచి ఉద్భవించకపోవడం వల్ల ఆ కాలానికి అది సరి తూగలేదని తేలుస్తారు. విఫల ప్రేమకి ఒక ఫార్ములాగా మారిన దేవదాసు పాత్రకి ప్రతిరూపా లనదగ్గ మానెక్, తన్నా పాత్రల బలహీనతలకి, దేవదాసులాగా పునాదిలేని ఉత్త ప్రేమలని గాక, సామాజికార్థిక కారణాలు కలగలిసిన ప్రేమలుగా చూపిస్తారు. కోరుకున్న ప్రేమని పొందలేక పోయిన ముగ్గురు యువతుల భంగ పాటుకీ ఇవే కారణాలుగా చూపిస్తారు. ప్రేమలు కావాలన్నా, పోవాలన్నా సామాజికార్ధిక శక్తుల పైనే ఆధారపడి వుంటుందని విశ్లేషణ చేస్తారు.

ఇక ఈ నవల కథ అల్లికని చూసినప్పుడు, దీన్ని తెరకెక్కించడం అసాధ్యమని ఎవరికైనా అన్పిస్తుంది. అందుకని దీని జోలికెవరూ పోలేదు. 1992లో శ్యామ్ బెనెగల్ తన రెగ్యులర్ రచయిత్రి షమా జైదీ చేత స్క్రిప్టు రాయించి ధరమ్ వీర్ భారతికి చూపించబోతే, బెనెగల్ మీద నమ్మకంతో ఆయన చూడడానికి తిరస్కరించాడని కథనాలు. నవల సంక్లిష్ట కథ అల్లికకి ఈ స్క్రిప్టు ఒక వండర్. బెనెగల్ తెరకెక్కించిన విధానం ఇంకో వండర్. దీని గురించి చెప్పడం కంటే చూసి తెలుసుకోవడమే బెటర్.

నటనలు – సాంకేతికాలు

ఈ సినిమాలో కథ తర్వాత కట్టి పడేసేవి అందరి నటనలు. నటనలతో ఆనాటి సహజ సిద్ధమైన వాతావరణంలోకి తీసి కెళ్ళడం. ’50ల నాటి సినిమాలు చూస్తే ఆ పాత్రలు, ఆహార్యాలు, మాటతీరూ ఎలా వుంటాయో అచ్చు గుద్దినట్టు అలా వుంటాయిందులో. ఇది బెనెగల్ సాధించిన గొప్ప విజయం. పాత కాలపు కథలతో పీరియెడ్ మూవీస్ వస్తూంటాయి. గడిచిపోయిన కాలాన్ని ఇంత సహజంగా, ఒరిజినల్ గా పునఃసృష్టి చేయడం వుండదు సంగీత సాహిత్యాలు సహా. పైగా 2000 నుంచి సహజత్వానికి కిలోమీటర్ల దూరాన డిజైనర్ చరిత్రలు వస్తున్నాయి. బెనెగల్ సినిమా చూస్తూంటే ఎలా వుండే ఇండియా ఇప్పుడెలా అయిపోయిందన్పిస్తుంది. మెదళ్ళలోంచి పంచ భూతాల మూలకాల్లో స్పేస్ (ప్రశాంతత) మాయమై పోయిందిప్పుడు. మెదళ్ళకి ఆక్సిజన్నిస్తున్నాం, నీరు ఇస్తున్నాం, ఆహారాన్నిస్తున్నాం, అరుగుదలకి వేడినిస్తున్నాం, ప్రశాంతత నివ్వడం లేదు. మెదళ్ళు డ్యామేజ్ అయిపో తున్నాయి. ఇలా స్పేస్‌ని అనుభవించేలా చేసే సినిమా ఇంకోటుంది : 1969 లో మణి కౌల్ తీసిన ‘ఉస్కీరోటీ’ (లోకల్ క్లాసిక్స్ -35).

బెనెగల్ దర్శకత్వంలో మెలో డ్రామా, కన్నీళ్ళూ లేవు. వీటిని సన్నివేశాల్లో సబ్ టెక్స్ట్ గా మనం అనుభవిస్తాం. గురుదత్ ‘ప్యాసా’లో లాంటి మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ చిత్రీకరణ అన్నమాట. భావుకతకి లోటు లేదు. ఇలాటి ప్రేమ దృశ్యాలు చచ్చినా కమర్షియల్ సినిమాల్లో చూడం. ఈ రోజుల్లో ప్రేమలు కమర్షియలే కాబట్టి. ఈ సినిమా చూసి ప్రేమలు నేర్చుకోవాలిప్పుడు. లలితని ప్రేమించే మానెక్ తో ఒక సీను వుంటుంది – రాత్రి పూట కిటికీ దగ్గర నిలబడి వుంటుంది లలిత. ఆమె చెంప మీద శ్వేద బిందువులు జారుతూంటాయి. దూరం నుంచి ఈ అందమైన దృశ్యాన్ని అనుభవిస్తూ వాటిని తుడవద్దంటాడు. గాలికి ఆమె చెంపల్నితాకుతున్న శిరోజాల్ని సవరించ వద్దంటాడు. ఇందులోంచి పాట వచ్చేస్తుంది – ఈ సాయంకాలాలు అంతటా అంధకారం, వీటికి ఏ అర్ధమూ లేదా, కలవర పాటుతో నిన్ను గుర్తు చేసుకుంటే ఈ సాయంకాలాలకి అర్ధమే లేదా అని (రచన వసంత్ దేవ్, గానం ఉదిత్ నారాయణ్ – కవితా కృష్ణ మూర్తి, సంగీతం వనరాజ్ భాటియా).

తాత్పర్య తరంగాలు

ఒక్కో కథ ముగిస్తూ తాత్పర్యాలు చెప్తూంటాడు రచయిత మానెక్ ముల్లా. మొదటి కథలో జమునతో పిరికివాడు తన్నా. జమునతో అప్రకటిత ప్రేమికుడు మానెక్. సమాజం ధనవంతుడైన జమీందారుకి అప్పజెప్పేస్తుంది జమునని. డబ్బు మాట్లాడుతుంది, ఉత్తి ప్రేమలు మాట్లాడలేవు. ఇవి మనకి సన్నివేశాల్లో అర్థమయ్యే విషయాలు. అందుకని మంచి ప్రేమ కథనేది సమాజ కళ్యాణాని కుపయోగ పడాలంటాడు మానెక్. ముసలి జమీందారుతో పెళ్లి సమాజ కళ్యాణ మెలా అవుతుంది? ఇదీ పాయింటు. కానీ సామాజిక శక్తులకి సమాజ కళ్యాణంతో పనేంటి? తమ కళ్యాణం చాలు. ఈ మొదటి కథ పేరు ‘ఉప్పు తిన్న విశ్వాసం’. జమున పెట్టే చిరుతిళ్ళకి తగ్గ విశ్వాసం చూపలేక పోయిన మానెక్.

రెండో కథ పేరు ‘గుర్రపు నాడా’. ఇందులో జమునకి పిల్ల పుట్టేందుకు గుర్రపు నాడా చిట్కా చెప్పిన జట్కా వాడి నుద్దేశించి, ఏ వృత్తినీ చిన్న చూపు చూడరాదంటాడు. ఇక ముసలి జమీందారుని పెళ్లి చేసుకున్న జమున గురించి మిత్రుల మధ్య వాదోప వాదాలు జరుగుతాయి. జమున మానవతకి ప్రతీక అయితే, జమీందారు ఫ్యూడలిస్టు, మానెక్ మధ్య తరగతి వాడు. వీళ్ళిద్దరూ జమునకి ఉజ్వల భవిష్యత్తు చూపలేక పోయారు కానీ శ్రామిక వర్గపు జట్కా వాడు జమునకి కొత్త జీవితం చూపించాడని ఒక మిత్రుడు సామాజిక వ్యాఖ్య చేస్తాడు. ‘నువ్వు మార్క్స్ ని మించిపోయావురో’ అంటాడు మానెక్.

‘అసలు జమునలాంటి నాయిక కథ ఎందుకు చెప్పాలి. అమాయక శకుంతలనో, పవిత్ర రాధనో, లేక ఇంకెవరైనా ఆధునిక నాయికనో తీసుకోక?’ అని ఇంకో మిత్రుడంటే – జీవితంలో జమునలాంటి వాళ్ళే 99 శాతం వుంటారంటాడు. రచయిత ఆశావాది కావాలిగా అంటే, ఇందుకే ప్రేమల మీద ఆర్ధిక ప్రభావ ముంటుందని అంటానంటాడు. మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆదర్శాలు ఇట్టే ఆవిరై పోతాయనీ, అన్ని పరిస్థితుల్లో రాజీ పడిపో తూ వుంటామనీ అంటాడు. కానీ అందరూ జమునలు కారనీ, ఆదర్శాల కోసం పోరాడే వాళ్ళూ వుంటారనీ అంటే, ఆ సచ్ఛీలతే పిరికితనమని కూడా అన్పించుకుంటుందని తన్నా కథ చెప్పుకొస్తాడు.

తన్నా ఆత్మహత్య చేసుకున్న మూడో కథకి పేరివ్వడు. ఈ ఆత్మహత్యకి అర్ధం డాంటే రాసిన ‘డివైన్ కామెడీ’ లో చదువుకో మంటాడు. ఇందులో నాయకా నాయికలు స్వర్గంలో కలుసుకుంటారని, నాయిక నాయకుణ్ణి శ్రమపడి సింహాసనం వరకూ తీసికెళ్తుందనీ అంటాడు. ఆరోగ్యకర సామాజిక బంధాల్నేర్పరచే పరిపక్వతతో సాహసంగా మారని ప్రేమ- కురిసే మేఘపు నీడలాగా మాయమై పోతుందనీ తాత్పర్యం చెప్తాడు.

అసలు నువ్వు చెప్పే కథలకి టెక్నిక్ లేదని మిత్రులు ఆక్షేపిస్తారు. ఎవరి కవసరం టెక్నిక్ అంటాడు. కథలో చెప్పడానికి విషయం లేని రచయితకి టెక్నిక్ కావాలంటాడు. ఫ్లోబార్, చెహోవ్, మాపాసా కథలు చదవమంటాడు. టెక్నిక్ వుండదంటాడు. ఎదురుగా ఏ వస్తువుంటే ఆ వస్తువు కథై పోతుందని చెహోవ్ అన్నాడంటాడు. దీంతో మిత్రుడు అతడి చేతికి కత్తి ఇచ్చి, దీన్ని చూసి కథ చెప్పమంటాడు.

నాల్గో కథలో కత్తితో సత్తి పేదరాలు. ఆమె కత్తిలాంటిది. ఆకూ ముల్లూ సామెతని తిరగేస్తే ఆమె జీవితం. కత్తి వెళ్ళి పుచ్చకాయ మీద పడ్డా, పుచ్చకాయ వెళ్ళి కత్తిమీద పడ్డా కత్తికే నష్టమయింది. ఆమె మహేసర్ చేతిలో బలైంది. మానెక్ మౌన ప్రేక్షకుడయ్యాడు. జమునతో, లలితతో అలా చేశావ్, ఇప్పుడు సత్తితోనూ విఫల మయ్యావని ఆరోపిస్తారు మిత్రులు. ఆత్మనిందకి పాల్పడతాడు మానెక్. ‘నేను జీవించలేదు, జీవితమే నన్ను జీవించింది. బొట్టు బొట్టూ పీల్చేసి రోడ్డున పడేసింది’ అంటాడు. అయితే ఎక్కడో కాంతి కిరణం కన్పిస్తున్న ఆశతో జీవిస్తున్నానంటాడు. సూర్య రధాన్నిఆరు గుర్రాలూ లాగ లేక అలసిపోతే, చిన్నదైన ఏడో గుర్రం వేకువ వైపుకి నడిపిస్తున్న ఉజ్వల దృశ్యం కని పిస్తోందంటాడు. ఈ మాటలన్న తర్వాత సినిమా ముగింపు దృశ్యం అనూహ్యమైన షాకింగ్ దృశ్యం. నాల్గు కథల మిశ్రమంతో ఈ కథ అల్లిక స్క్రీన్ ప్లే పరిభాషలో హైపర్ లింక్ నిర్మాణమే. నిర్మాణం కనపడకుండా కప్పి పుచ్చారు. ఇలాటి కథలతో టెక్నిక్ హాలికులు చేసే హడావిడికి సమాధానంగా సృజనాత్మక సృష్టి ఇది. టెక్నిక్ థ్రిల్ చేస్తుందే తప్ప రసానుభూతి నివ్వదు. సృజనాత్మకత టెక్నిక్ కుదుపు లివ్వకుండా, కథలో సంలీనం చేసి కథానుభూతి నిస్తుంది. శ్యామ్ బెనెగల్‌ది ఇలాటి మాస్టర్ క్రియేటివిటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here