లోకల్ క్లాసిక్స్ – 49: ఆ నలుగురితో ఫాంటసీలు

0
9

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా భాస్కర్ హజారికా దర్శకత్వం వహించిన అస్సామీ సినిమా ‘కొథా నొది’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘కొథా నొది’ (అస్సామీ)

[dropcap]హిం[/dropcap]దీ సినిమాల ప్రభావంతో అస్సామీ సినిమాలు ఎంత కమర్షియల్ బాటపట్టినా సమాంతర సినిమాలు వాటి ఉనికిని అవి కాపాడుకుంటూనే వున్నాయి. ఈ అస్సామీ సమాంతరానికి దర్శకుడు భాస్కర్ హజారికా కొత్త కెరటం. తీసిన మొదటి సమాంతరాన్ని కమర్షియల్ సినిమాలకి దీటుగా నాల్గు వారాలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించుకున్నాడు. ఏమిటీ సమాంతరంలో అంత ప్రత్యేకత? బాలల సినిమా అనా? జీవితాలకి దగ్గరగా వున్న పెద్దల సినిమా అనా? హార్రర్ – ఫాంటసీలా వున్న యూత్ సినిమా అనా? ఇవన్నీ కలిసిన పచ్చదనాలూ, మైదానాలూ, నీటి వనరులూ, అడవులతో అస్సాం రాష్ట్రపు నైసర్గిక స్వరూపమనా?

‘కొథా నొది’ (కథల నది – 2016) తో హజారికా స్థానిక మార్కెట్లో విజయం సాధించడమే గాక, ఉత్తమ అస్సామీ జాతీయ చలన చిత్రం అవార్డు పొందాడు. 20 వివిధ దేశాల్లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాడు. ఇందులోని కథా వస్తువు సార్వజనీనమైనది. పైగా నేటికీ అనుభవమయ్యేది. ఈ కారణంగా ఇది వందేళ్ళకి పైగా పాపులారిటీని నిలుపుకుంటోంది. ఇన్ని ఆకర్షణలున్న పురాతన కథతో ఈ సమాంతర మేమిటోచూద్దాం…

కథ

బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతపు అరణ్యం. అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి గొయ్యి తీసి ఏడుస్తున్న శిశువుని పూడ్చేస్తాడు. అతడి భార్య మాలతి (ఆశా బర్దొలోయీ) కిది పాతిపెట్టిన రెండో సజీవ శిశువు. ఉదయం పడవెక్కి బయల్దేరతాడు దేవీ నాథ్ (ఆదిల్ హుస్సేన్). అతను వ్యాపార పనుల మీద గ్రామాలు తిరిగి వస్తూంటాడు. అతడికి భార్య స్నేహి (జరీఫా వాహిద్), కూతురు తేజిమోలా (కస్వీ శర్మ) వీడ్కోలు చెప్తారు. ఇక కూతుర్ని చంపడానికి మంచి అవకాశం దొరికిందనుకుంటుంది స్నేహి.

కేతకి (ఊర్మిళా మహంతా) గుడిసెకి నడుచుకుంటూ పోతూంటుంది. ఆమె వెనుక ఒక కాయ దొర్లుకుంటూ వస్తూంటుంది. అది ఆమె కన్న బిడ్డ. ఆమెని వదలకుండా ఆమె వెంటే వుంటుందెప్పుడూ. ఇక ధోనేశ్వరి (సీమాబిశ్వాస్) జగన్నాథ్ మహాజన్ (డాక్టర్ జయంతా దాస్) భార్య. ఈమె కూతురు బొన్లొతిక (మోనీషా భూయాన్) పెళ్లిని కొండ చిలువతో ఘనంగా జరిపించాలని కలలు గంటూ వుంటుంది…

మాలతి, స్నేహి, కేతకి, ధోనేశ్వరి – ఏమిటి వీళ్ళ సమస్యలు? ఆ సమస్యలతో ఎంత దూరం వెళ్లారు? ఏం చేశారు? ఎందుకు చేశారు? వీటికి కళ్ళు తెరిపించే సమాధానాలు మిగతా కథలో చూడాలి.

ఎలా వుంది కథ

అస్సాంలో ప్రసిద్ధి పొందిన బాలల కథా పుస్తకంలో నాలుగు కథలివి. కవి, రచయిత లక్ష్మీకాంత్ బేజుబారువా 1911 లో సేకరించి రాసిన ఈ 30 జానపద కథలు ఇతర భాషల్లో కూడా అనువాదమై అమ్ముడుపోతున్నాయి. ఇవి నీతి కథలు. ఆదివాసీలు మౌఖికంగా చెప్పిన ఈ కథల్ని రచయిత అక్షరీకరించాడు. ఈ కథలతో సినిమాలు, నాటకాలు, టీవీ సీరియల్స్ వచ్చాయి. ప్రస్తుత సినిమా అలాటిదొక చిత్రాను వాదం. కొత్త దర్శకుడు భాస్కర్ హజారికా దీని రూపకర్త.

అయితే బాలల కథలతో ఇది బాలల సినిమా కాదు. కథలుగా వినడానికి బాలలకి బావుంటాయి. చూడడానికి కాదు. ఇందులో బాలల పాత్రల్లేవు. పెద్ద పాత్రలతో చూసి ఈ జానపద కథల అంతరార్ధాన్ని గ్రహించడానిది పెద్దల సినిమా. హార్రర్ -ఫాంటసీ దృశ్యాలతో యూత్ సినిమా కూడా. ఆదివాసీల దృష్టిలో హార్రర్ ఎలా వుంటుందో తెలుసుకునే ఒక అవకాశం.

ఈ సినిమా కథాకాలం కూడా 1900 ప్రారంభం నాటిదే. ఆ నేపథ్య వాతావరణంతో పాత్రలు, జీవనం కన్పిస్తాయి. ఈ కథల్లో నాయికలు, ప్రతినాయికలు స్త్రీలే. స్త్రీల పరాధీనత (మాలతి), కక్ష సాధింపు (స్నేహి), మమకారం (కేతకి), దురాశ (ధోనేశ్వరి) మొదలైన మానసిక వికార వికాసాలకి ప్రతీకలుగా వుంటారు. అంతిమంగా ఈ కథలు ఏం చెప్తాయంటే, ఆడపిల్లే అడవికి ప్రాణమని. జనారణ్యంలో జంతుసమానమని ఇంటా బయటా మనం చూసుకోవచ్చు సంస్కారవంతంగా.

ఈ ఆదివాసీ – జానపద కథలు సహజంగానే మాతృ స్వామ్య సమాజాన్ని చూపిస్తాయి. ఈ సమాజంలో పురుషుడు కాక, స్త్రీకి స్త్రీయే శత్రువన్నట్టు వుంటుంది. ఆధిపత్య మాతృ స్వామ్యానికే నీతిని చెప్తున్నట్టు వుంటుంది. ఎవరో వచ్చి చెప్పడం కాదు, తన నీతిని తానే తెలుసుకునే స్త్రీ స్వావలంబన. తనని తానే శుద్ధి చేసుకునే ఏర్పాటు ప్రకృతిలో వున్నట్టుగా. ఇందులో పురుషుల్ని ద్వేషించే ఫెమినిజం లేదు, స్త్రీలని హింసించే పితృస్వామ్యం లేదు. మరి ఈ తల్లులు పిల్లలతో పాల్పడే చర్య లేమిటి? తల్లిదండ్రులు పిల్లలతో పాల్పడే చర్యల్నిజడ్జి చేయలేమంటాడు స్వామి సుఖబోధానంద.

నటనలు- సాంకేతికాలు

ఈ కథల్లో పాత్రలెంత పరుషంగా వుంటాయో, చుట్టూ ప్రకృతి అంత పచ్చగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా వుంటుంది. పక్షుల కూతలు కూడా విన్పించవు. బ్రహ్మపుత్ర నది కూడా స్తంభించినట్టు నిశ్చలంగా వుంటుంది. చివరికి నదికి నివేదించే పాటప్పుడు కూడా కదలకుండా వుంటుంది. ఇలాటి కథలతో నిండిపోయాక కదల్లే నన్నట్టుగా.

దీనికి విజయ్ కుట్టి ఛాయాగ్రహణం పెద్ద ఆకర్షణ. నాటి గిరిజన జీవితాన్ని గులోక్ సాహా కళా దర్శకత్వం పట్టి చూపిస్తుంది. వందేళ్ల క్రితం గోధుమల్ని ఎలా దంచేవాళ్ళో ఒక రోకలి యంత్రంతో చూపించారు. స్త్రీ పాత్రల ఆహార్యం రిచ్‌గా వుంటుంది. మాతృస్వామ్యం కాబట్టేమో. అమర్నాథ్ హజారికా నేపథ్య సంగీతం హార్రర్ దృశ్యాల్లో వణుకు పుట్టించేదే. ఆరూపా పతంగియా కలిటా రాసిన సంభాషణలకి పేరొచ్చింది.

పైన చెప్పుకున్న పాత్రల్లో నటించిన వాళ్ళందరూ మేటి నటులే. సీమా బిశ్వాస్ సాఫ్ట్ విలనీ చేస్తే, జరీఫా వాహిద్ టఫ్ విలనీ చేయడం వెరైటీ. ఆదిల్ హుస్సేన్ ది జగ్గయ్యలాంటి పాత్ర. ఆడ పాత్రలు ఆడ పాత్రల్ని హింసిస్తూంటే, మగ పాత్రలు మనకెందుకులే అన్నట్టుంటాయి. కూతురు కస్వీ శర్మని భార్య జరీఫా హింసిస్తూంటే, ఆదిల్ హుస్సేన్ పక్కగ్రామం వెళ్ళి ఊర్మిళా మహంతా సమస్యని పరిష్కరిస్తూ వుంటాడు.

పొట్టి కథల గట్టి అల్లిక

ఈ నాల్గు వేర్వేరు పొట్టి కథల్ని కలిపి దర్శకుడు హజారికా ఒకే కథగా మల్చడంతో – వేర్వేరు పొట్టి కథలతో ఆంథాలజీలుగా వచ్చి ఆకట్టుకోలేక పోతున్న సినిమాలకి భిన్నంగా, ఆకట్టుకునే పూర్తినిడివి కథతో సినిమాగా వుంటుందిది (షార్ట్ ఫిలిమ్సే వుండగా ఇంకా ఆంథాలజీ లెందుకు దండగ).

నాల్గు చిన్న కథల ఒక కథగా శ్యామ్ బెనెగల్ పూర్వం ‘సూరజ్ కా సాత్వా ఘోడా’ తీశారు (లోకల్ క్లాసిక్స్ -45). అయితే అది అలా వున్న ఒక నవల. హజారికా తీసుకున్నది సంపుటిలోని నాల్గు వేర్వేరు పొట్టి కథల్ని. వీటన్నిటినీ కలిపి ఒకే కథగా మార్చడానికి అనుసరించిన ప్రక్రియ – ఒక కథలో పాత్రని ఇంకో కథలో ప్రవేశపెట్టడం. పాత్రలిలా అటూ ఇటూ కథల్ని పాలించడంతో, ఇవి చిన్న చిన్న కథలుగా అన్పించవు. ఒక్క శిశువుల్ని పాతి పెట్టే పాత్ర పునై, అతడి భార్య పాత్ర మాలతి కథ మాత్రం విడిగా వుంటుంది. పునై (కపిల్ బోరా) మత్స్యకారుడు. అతడికో పిన తండ్రి వుంటాడు. పుట్టిన శిశువునల్లా పాతిపెట్ట మంటూంటాడు. పిన తండ్రి మంత్ర గాడనీ, మాట వినవద్దనీ భార్య మాలతి పోరుతూ వుంటుంది. వరసగా ముగ్గురు పుట్టిన శిశువుల్ని పాతి పెట్టాక, నాల్గో శిశువుని పినతండ్రి ముందుంచుతారు. ఈ కూతురితో మీ దురదృష్టం తొలగిందని, భాగ్యవతి అని పేరు పెడతాడు పినతండ్రి.. మరి ముగ్గురు కొడుకుల్ని ఎందుకు చంపమన్నావని అడిగితే, రాత్రి వెళ్ళి చూడమంటాడు. రాత్రి వెళ్ళి శ్మశానం దగ్గర చూస్తే, ముగ్గురు కొడుకుల ఆత్మలు ఆక్రోశిస్తూంటాయి. మేం బతికి వుంటే నిన్ను చంపి నీ సంపద అనుభవించే వాళ్ళం కదా -అని ఏడుస్తూంటాయి. పునై, మాలతి నిర్ఘాంత పోతారు ఈ మాటలకి. నిజానికి పునై ఇప్పుడు బాగా సంపాదించి సంపన్నుడయ్యాడు.

***

భర్త దేవీ నాథ్ వ్యాపార పనిమీద వెళ్ళిపోయాక భార్య స్నేహి, కూతురు తేజిమోలాని చంపే ఆలోచనలు చేస్తుంది. అర్ధరాత్రి పడవెక్కి అవతలి తీరానికి వెళ్ళి, దుష్ట శక్తి అయిన ప్రియుడితో గడిపి, అతనిచ్చే సూచనలు పాటిస్తుంది. తేజిమోలాని హింసించడం ప్రారంభిస్తుంది. తేజిమోలా నేస్తం బొన్లొతిక పెళ్లి వుంటుంది. ఆ పెళ్ళికి ఈ చీర కట్టు కెళ్ళమని, భద్రపర్చిన తన తల్లిగారి చీర సంచీలో పెట్టి ఇస్తుంది. సంచీలో ఒక చిట్టెలుకని వేస్తుంది. తేజిమోలా సంచిలోంచి చీరతీసి చూస్తే, ఎలుక కొట్టేసి వుంటుంది. దీంతో -మా అమ్మ చీర నాశనం చేశావ్ కదే -అని బాదడం మొదలెడుతుంది తేజిమోలాని. రాత్రంతా గోధుమల రోకట్లో చిత్ర హింసలు పెట్టి చంపేస్తుంది సవతి కూతుర్ని.

***

అటు వ్యాపారం మీద వెళ్ళిన దేవీ నాథ్ ఒక గ్రామం బైట కేతకిని చూస్తాడు. ఆమె వెంట ఒక కాయ దొర్లుకుంటూ రావడం చూసి, ఇదేదో మాయలాడి అనుకుంటాడు. గుచ్చి గుచ్చి అడిగితే, ఆమె చెప్పుకుంటుంది… పుట్టక పుట్టక పుడితే ఆ కాయ పుట్టిందనీ, దీంతో మంత్రగత్తె అని భర్తా గ్రామమూ బహిష్కరిస్తే, ఇక్కడ గుడిసె వేసుకుని వుంటున్నాననీ అంటుంది. ఈ కాయ ఏదో రహస్య ఫలమని, దీన్ని తేల్చుకోవాలని అక్కడే వుండిపోతాడు దేవీ నాథ్ తనకి తెలిసిన విద్యలు ప్రయోగిస్తూ. నువ్వెంతో ప్రేమించే రహస్య ఫలంలో శిశువు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందంటాడు. విద్యలతో దాన్ని బయటికి తీస్తాడు. అప్పుడు బీభత్సంగా, దుర్మార్గంగా కేకలేస్తూ బయటికొస్తాడు కొడుకు…

***

ధోనేశ్వరి ఇదివరకు సవతి కూతురు చంపావతి పెళ్లి చేసేసింది. ఆ పెళ్ళికి ముందు దీన్ని వదిలించుకోవాలని కొండచిలవ కిచ్చి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేసింది. ఆ కొండ చిలువ వచ్చి, నగలూ నట్రా ఇచ్చేసి, మళ్ళీ కనిపించకుండా మాయమైపోయింది.

దీంతో ధోనేశ్వరి ఇప్పుడు కన్న కూతురి పెళ్లి కొండ చిలవతోనే చేస్తే మహారాణి అవుతుందని నమ్ముతుంది. కొండ చిలువని పట్టి తెచ్చి బంధించి, ముద్దుల కన్నకూతురు బొన్లొతిక పెళ్లి చేసేస్తుంది. శోభనం ఏర్పాటు చేస్తుంది. గది లోంచి కూతురు వచ్చి, అమ్మా కాళ్ళు పట్టుకున్నాడే అంటుంది. గొలుసులు పెడతాడే – అంటుంది ధోనేశ్వరి. కూతురు మళ్ళీవచ్చి, నడుం పట్టుకున్నాడే అంటే, వడ్డాణం పెడతాడే అంటుంది. కూతురు మళ్ళీ వచ్చి, ఎద పట్టుకున్నాడే అంటే, మణిహారం పెడతాడే అంటుంది. తెల్లారి చూస్తే కొండ చిలువ కూతుర్ని మింగేసి వుంటుంది.

***

ఈ క్లయిమాక్సులన్నీ ఒకే రాత్రి జరుగుతాయి. పునై- మాలతిలకి ఆడశిశువు జన్మించి, రాత్రి శ్మశానంలో దుర్మార్గులైన కొడుకుల్ని చూస్తే, ఇటు మాలతి ఎంతో ప్రేమించిన రహస్య ఫలంలోంచి, దుర్మార్గంగా కొడుకు బయటికొచ్చాడు. అటు ఎదిగిన సవతి కూతుర్ని కక్షతో స్నేహి చంపేస్తే, ఇంకా అటు ఎదిగిన కన్నకూతుర్ని దురాశతో చంపుకుంది ధోనేశ్వరి… ఓ ఉషోదయాన తేజిమోలా సమాధి ముందు స్నేహి కూర్చుంటే, సమాధిలోంచి మొక్క మొలకెత్తుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here