లోకల్ క్లాసిక్స్ – 8: భూస్వామ్య మూషికం!

0
10

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా అదూర్ గోపాలకృష్ణన్ మలయాళం సినిమా ‘ఎల్లిప్పథయం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘ఎల్లిప్పథయం’ (మలయాళం)

[dropcap]ఈ[/dropcap] సినిమాల్లో చూపించే తల్లిదండ్రులది నిజానికి పచ్చి స్వార్థం. ఎంతసేపూ తమ గురించే. ఇది దాటి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని ఆలోచించే సినిమాలు రావు. ఈ తల్లిదండ్రులు తమ కొడుకులు తమని చూడ్డం లేదని సంకుచితంగా ఆలోచిస్తారు తప్ప – ఈ పరిస్థితి రేపటి తరాలకి రాకూడదని చర్యలు మాత్రం తీసుకోరు. తమ సినిమా కొడుకులు తమని చూడ్డం లేదు సరే, రేపు ఆ కొడుకుల్ని మనవళ్ళు కూడా చూడరు. ఇంకా రేపు ఆ మనవళ్ళని మునిమనవళ్లు కూడా చూడరు. దీనికి అంతెక్కడ? ఈ చక్రభ్రమణాన్ని ఆపాలా వద్దా? ఇవ్వాళ్ళ కాస్త తమ స్వార్థం వదులుకుని దూరదృష్టితో ఆలోచిస్తే, తమ పరిస్థితి తమ కొడుకులకి రాకుండా మనవళ్ళకి మొక్కై వుండగానే విలువలు నేర్పే ఆలోచనలు చేస్తారు. కొడుకులు రావడం లేదని కాదు, ఆ కొడుకులకి తమలాంటి పరిస్థితి రాకుండా చూడ్డమే తమ కర్తవ్యంగా భావించడం నిజమైన పెద్దరికం, వంశ సేవా, పూర్వులకి నివాళీ అవుతాయి.

ఇలా చెప్పే సినిమాలు రావు. ఉమ్మడి కుటుంబ విలువల కోసం ఇదొక పరిస్థితి అయితే, భూస్వామ్య దర్పాల కోసం ఇంకో రకం విలాపం. కాలగర్భంలో కలిసిన దొరతనాల కోసం వెంపర్లాడ్డం. భూస్వామ్య వ్యవస్థా కాంక్ష కుటుంబ విచ్ఛత్తికి దారి తీస్తున్నా చూస్తూ కాలం గడిపేయడం. చివరికి ఎవ్వరికీ పనికి రాకుండా పోయి చెత్త బుట్ట దాఖలవడం.

కేరళ రాష్ట్రం కమ్యూనిస్టు ప్రభుత్వాల కింద భూస్వామ్య వ్యవస్థ చూసింది. ప్రజలు తీసుకున్న నిర్ణయాల వల్ల భూస్వామ్య వ్యవస్థ బీటలు వారింది. 1970-80 లలో కేరళ ప్రజలు భూస్వామ్య క్షేత్రాల్లో ఉపాధికి బైబై చెప్పి, గల్ఫ్ దేశాల బాట పట్టారు. సంపన్నులుగా ఎదుగుతూ రాష్ట్ర రూపురేఖల్నిమార్చేశారు. ఈ వలస జీవుల్లో ఉమ్మడి భూస్వామ్య కుటుంబాల నవ యువతీ యువకులు కూడా వున్నారు. కానీ నమూనాగా మిగిలిన భూస్వాములకి ఉమ్మడి కుటుంబాలు ఇక లేవన్న ధ్యాస కన్నా, భూస్వామ్యం పోయిందన్న గోసే ఎక్కువైంది. దీంతో పతనం మరీ కొత్త పుంతలు తొక్కింది.

అదూర్ గోపాలకృష్ణన్ పరిచయం అక్కర్లేని మలయాళ సమాంతర సినిమా దర్శకుడు. ఐదు దశాబ్దాల్లో తీసినవి డజను సినిమాలే అయినా, 14 జాతీయ అవార్డులు, మరెన్నో అంతర్జాతీయ అవార్డులూ ఆయనని అనుగ్రహించాయి. తీసిన ప్రతీ సినిమా అవార్డులు తెచ్చుకోవాల్సిందే, ఇన్ని అవార్డులు పొందడం సత్యజిత్ రే, మృణాల్ సేన్‌ల తర్వాత తనే. అయితే షార్ట్ ఫిల్ములు, డాక్యుమెంటరీలు కూడా నలభై వరకూ తీశారు. ‘ఎల్లిప్పతయం’ (ఎలుక బోను) 1981 లో తీసిన మూడో సినిమా. ఇది ఇరవై దేశాల్లో ప్రదర్శనల కెళ్ళింది. అక్కడి వివిధ అవార్డులతో బాటు జాతీయ, కేరళ రాష్ట్రీయ అవార్డులు కూడా పొందింది. ఆదూర్ తాజాగా 2016 లో ‘పిన్నేయం’ (మళ్ళీ ఒకసారి) అనే ప్రేమ కథ తీశారు. అయితే ‘ఎల్లిప్పతయం’ అయన అద్భుత కళాసృష్టి అని ఇప్పటికీ అంతర్జాతీయ విమర్శకులు పేర్కొంటారు. దీని కథా కథనాలు చూద్దాం.

కథ

ఓ అర్ధరాత్రి కేకలేస్తూ లేచి వురుకుతాడు ఉన్ని(కరమణ). ఏమైందేమైందని రాజమ్మా (శారద), శ్రీదేవీ (జలజ) పరుగెత్తుకొస్తారు. వచ్చి చూస్తే తప్పించుకుంటూ ఎలుక. వార్నీ అనుకుని శ్ర్రేదేవి అటక మీంచి ఎలుక బోను తీస్తుంది. అది సరిగ్గా తెర్చుకోదు. నూనె పోసి వదులు చేసి బోను సిద్ధం చేస్తుంది. ఒకచోట పెడుతుంది. తెల్లారేటప్పటికి అందులో ఎలుక వుంటుంది. దాని గంతుల్ని రాజమ్మా శ్రీదేవీ మురిపెంగా చూస్తారు. ఆ తర్వాత శ్రీదేవి బోను తీసుకుని బయల్దేరుతుంది. బయట మురికి గుంటలో దాన్ని ముంచి ఎలుకని జల సమాధి చేసేస్తుంది. ఈ కథలో శ్రీదేవి ఇంకో మూడు సార్లూ ఇలాగే చేస్తుంది. ఎలుకని పట్టడం, జలసమాధి చేసేయడం. ఇదే న్యాయమని భావిస్తుంది. రాబోయే రోజుల్లో వూరి ప్రజలు కూడా ఇదే న్యాయమని భావిస్తారు. ఎందుకిలా?

ఉన్నీ రాజమ్మా శ్రీదేవీ అన్నా చెల్లెళ్ళు. రాజమ్మకి ముఫై ఏళ్ళొచ్చాయి. శ్రీదేవి చదువుకుంటోంది. ఇంకా పెద్ద చెల్లెలు జనమ్మ (రాజం నాయర్) పెళ్ళయి ఐదడుగుల కొడుకుతో ఇంకో వూళ్ళో వుంటోంది. ఉన్నికి అన్ని సేవలూ రాజమ్మ చేయాలి. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉదాసీనంగా కాలం గడుపుతూంటాడు. పెద్ద లంకంత ఇల్లూ, చాలా పొలాలూ వున్నాయి. అయినా ఇంకేదో బాధ. పెత్తందారీ పోయిందే అన్న బాధ. దొర కాకుండా పోయాడే అన్న వ్యథ. జనం తనని ఇదివరకులా ప్రత్యేకమైన వ్యక్తిగా చేతులు కట్టుకుని చూడ్డం లేదు. నమస్కారాలు పెట్టడం లేదు. చాలా కష్టం వచ్చిందే అనుకుంటూ మీసంలో తెల్ల వెంట్రుకలు కత్తిరించుకోవడం, వొళ్ళంతా నూనె రాసుకోవడం, పేపరు చదువుకోవడం, పెట్టింది తినడం, పడక్కుర్చీలో పడుకోవడం.

ఇదేమీ పట్టించుకోకుండా శ్రీదేవి అద్దంలో చూసుకుని మురిసిపోవడం, ఆ అందాలతో కాలేజీ కెళ్ళడం. ముఫై ఏళ్ళొచ్చిన రాజమ్మ పెళ్ళీ, ఇంకా రేపు శ్రీదేవి తాళీ పట్టని ఉన్ని బండ రాయిలా ఇంట్లో పడుండడం. పెళ్లి సంబంధాలొస్తే స్థాయి తక్కువని కాదనడం. ఇలా ఎన్ని సంబంధాలు కాదన్నాడో… దీంతో రాజమ్మకి దిగులు పట్టుకుంటుంది. ఈ దిగులు ప్రాణాల మీదికే తెస్తుంది…

         

ఇంతలో పెద్ద చెల్లెలు జనమ్మ ఐదడుగుల కొడుకుతో వచ్చి ఆస్తిలో వాటా, ఫలసాయంలో వాటా అడుగుతుంది. బండ రాయిలా వుంటాడు. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఐదడుగుల కొడుకు మొహం నిండా పౌడరు రాసుకుని వెళ్ళిపోతాడు.

ఇంకో రోజు శ్రీదేవి వుండుండి ప్రేమించిన వాడితో ఉడాయిస్తుంది. ఉన్ని బండ రాయి లాగే వుంటాడు. రాజమ్మ బాధ ఇంకా ఎక్కువై పోతుంది. మంచాన పడుతుంది. ఈమె వైద్యం గురించి కూడా ఆలోచించకుండా బండ రాయిలాగే వుంటాడు ఉన్ని. ఆమె ప్రాణాలు పోతున్నా పట్టనట్టే వుంటాడు. ఇక ఆమె కూడా వెళ్ళిపోయాక తన పరిస్థితి తెలిసివస్తుంది. నా అన్న మనిషి లేని లేని కొంపలో దెయ్యంలా గడుపుతూ దెయ్యమై పోతాడు. కేకలేస్తూంటాడు. ఏదో భయం, తన నెవరో చంపడానికొస్తున్నట్టు కలలు. పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తన.

ఇక లాభం లేదని వూరి జనాలు వెంబడించి పట్టుకుంటారు. అర్ధరాత్రి మోసుకెళ్ళి మురికి గుంటలో విసిరి పారేస్తారు. ఆ గుంటే శ్రీదేవి ఎలుకల్ని ముంచిన మురికి గుంట…

(విశ్లేషణ వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here