లాక్‌డౌన్ 1,2,3,4

0
7

మార్చినెల, 2020. ఆఖరివారం. లాక్‌డౌన్ మొదలు.

సంహిత అపార్టుమెంట్ ప్రెసిడెంటు, కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశాడు.

“రేపటి నుంచి మన అపార్టుమెంట్లోకి పేపర్ బోయ్, పనివాళ్ళు, పాలవాళ్ళు రాకూడదు. ఇది మనందరి క్షేమం కోసం తీసుకున్న నిర్ణయం. కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా వస్తుందో తెలీదు” అన్నాడు.

ఈ ఆంక్షలు కొందరు సభ్యులకు ఇష్టంలేక పోయినా, ఏదైనా జరిగితే అందరూ తమనే అంటారనే భయంతో, అందరూ అందుకు సరేనన్నారు.

వాచ్‌మన్‌ని పిలిచి బయట వ్యక్తుల్ని ఎవరినీ అపార్టుమెంట్లోకి రానివ్వద్దని చెప్పారు. అలాగే ఒక నోటీసు తయారుచేసి అన్ని ఫ్లాట్ల వాళ్ళకి పంపారు.

లాక్‌డౌన్‌తో పిల్లలు, మగవాళ్ళు అందరూ ఇంటికే పరిమితమవటంతో, ఇంటి ఇళ్ళాళ్ళ కష్టాలు పెరిగాయి. పనివాళ్ళు కూడ రావద్దనటంతో వారి పరిస్ధితి దయనీయంగా మారింది.

లాక్‌డౌన్ 2 వచ్చే సరికి, ‘మాకు పేపరు లేకపోతే తోచదు, పని మనిషి రాకపోతే కష్టం’ అంటూ కొందరు జారిపోయారు. మిగిలిన వాళ్ళు ‘వేచి చూద్దాం’ అనుకున్నారు.

లాక్‌డౌన్ 3 , ‘మాకు ప్యాకెట్టు పాలు పడవు. మా పాలబ్బాయి తెచ్చి పోసే పాలే కావాలి’ అంటూ ఇంకొందరు జారిపోయారు. ఇందులో అపార్టుమెంటు ప్రెసిడెంటు, సెక్రటరీ కూడ ఉన్నారు.

లాక్‌డౌన్ 4. ఇప్పుడు అపార్టుమెంట్లోకి పనివాళ్ళు, పాలవాళ్ళు, పేపర్ బోయ్ యథావిధిగా వస్తున్నారు, పోతున్నారు.

ప్రెసిడెంటు గారి ఇంట్లో ట్యాప్ లీకవుతోంది. మరొకరింట్లో ఫ్యాను తిరగటంలేదు. లిఫ్టు రిపేరు కొచ్చింది.

అంతే, లాక్‌డౌన్ ముగిసేలోగానే ప్లంబరు, ఎలక్ట్రీషియన్,లిఫ్టు మెకానిక్ అందరి అవసరం పడటంతో వాళ్ళందర్నీ అపార్టుమెంట్లోకి రానివ్వక తప్పింది కాదు.

నగరంలో కరోనా వస్తూ పోతూ దోబూచులాడుతూనే వుంది.

అదంతే, మనమింతే అనుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ, వీలయినంతవరకు భౌతిక దూరం పాటిస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here