లాక్‌డౌన్ నేపథ్యంలో..

2
9

[కరోనా కాలం – లాక్‌డౌన్ నేపథ్యంలో, మన ఊహకి అందని అవాంఛిత సంఘటనలు మన పొరపాటు వల్ల ఐనా చాలానే జరిగాయి. అప్పుడు అవి కరోనా కష్ట కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో జరిగినా, ఈ రోజుల్లో అవకాశం ఉన్నా, తెలిసీ మన అజాగ్రత్త వల్ల, మెలకువగా లేనందు వల్ల జరగవచ్చు, జరుగుతున్నాయి కూడా. ఈ విషయమే పాఠకుల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ కథ రాయటం జరిగింది. కథ చదివి కనీసం ఒక తల్లి – తండ్రి అయినా తమ జీవిత విధానంలో కొంత మార్పు తెచ్చుకుని, తమ పిల్లల పట్ల మెలకువతో వ్యవహరిస్తారని ఆశిస్తూ..]

[dropcap]మా[/dropcap] పక్క ఫ్లాట్‌లో ఒక చిన్న కుటుంబం – భార్య, భర్త, చిన్న బాబు. దాదాపు ఎనిమిది ఏళ్ళుగా ప్రయత్నం చేయగా – చేయగా ముద్దులు ఒలికే బాబు పుట్టాడు మూడేళ క్రితం. ఆ తల్లీ – తండ్రీ, వారి పెద్దల ఆనందం వర్ణనాతీతం. తల్లి కుసుమ, తండ్రి దివాకర్, ఇద్దరూ పెద్ద కంపెనీల్లో హోదా గల ఉద్యోగాల్లో ఉన్నారు. ముగ్గురు పని వాళ్ళని పెట్టుకుని బాబుని చక్కగా పెంచుకుంటూ వారి-వారి ఉద్యోగాలు కూడా సంవత్సరం పాటు చక్కగా నిర్వహించారు కుసుమ-దివాకర్. కానీ కరోనా మూలంగా ప్రభుత్వం లాక్- డౌన్ విధించేసరికి అందరీ లాగానే వీరికి కూడా కష్ట కాలం ప్రారంభం అయింది. ఒక్కసారిగా ఎటువంటి సహాయం లేకుండా మిగతా ఉద్యోగస్థుల లాగానే ఇంటి నుంచే ఆఫీస్ పని చేయనారంభించారు. బాబుని ఆడించేవారు లేక టీ.వీ.లో వచ్చే చిన్న పిల్లల కార్యక్రమాలే వారిని ఆదుకున్నాయి. బాబు టీ.వీ చూస్తూ అల్లరి మర్చిపోతే కుసుమా దివాకర్ ఎలాగోలాగ ఇంటి పనులు ఆఫీస్ పనీ చేసుకుంటూ ముంబై లోనే మూడు నాలుగు నెలలు గడిపారు. ఆ తరవాత అది కూడా కష్టం అయిపోయి దివాకర్ తల్లీ తండ్రుల దగ్గరకు మకాం మార్చేశారు. అక్కడ వారి పరిస్థితిలో ఎంతో మార్పు లేక పోయినా నలుగురూ ఒక దగ్గర ఉన్నందు వల్ల ఇంటి పనులు పంచుకుని చేసుకున్నారు. అందరి ప్రాణాలు కొంత కుదుట పడ్డాయి. కానీ బాబు మాత్రం టీవీకి అంకితం అయిపోయాడు. అన్నీ పనులు చేసుకుని అలసి పోయి సాయంత్రం కాసేపు బాబుతో ఆడుకుని నిద్ర పోయేవారు. బాబు ప్రవర్తన గమనించాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు. ఏడాది పై పడ్డ బాబుకి మాటలు రావాల్సిన సమయం, తనతో ఆడుకుని కబుర్లు చెప్పేవారు లేక ఒంటరి వాడు అయిపోయాడు.

బాబుకి రెండు ఏళ్లు దాటేసరికి ప్రభుత్వం లాక్-డౌన్ నియమాలు కొంత సడలించింది. జనాలు మెల్ల- మెల్లగా భయపడుతూ ఎవరి ఇళ్లకు వారు తిరిగి రావటం మొదలెట్టారు. కుసుమ కుటుంబం కూడా అదే ప్రయత్నంలో ఉండింది. ముంబైలో ముఖ్యంగా వారి ఫ్లాట్స్ లోకి పని వాళ్లని కనీసం ఒక పూట కయినా అనుమతించటానికై వేచి ఉన్నారు. ఈ లోపున ఎందుకైనా మంచిదని, బాబుకి వినికిడి లో ఏ సమస్య లేదు కదా, ఒకవేళ అందువల్లే బాబుకి మాటలు రావటం ఆలస్యం అవుతున్నదేమో అని ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్ ద్వారా పరీక్ష చేయించటానికి తీసుకువెళ్లారు. అక్కడ అన్నీ టెస్టులూ చేశాక బాబుకి అందులో ఏ లోపము లేదని తేలింది. మరి మాటలు రావటం ఎందుకు ఆలస్యం అవుతున్నది??? తమకు అలవాటైన పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లారు బాబుని. కుసుమ దివాకర్ చెప్పింది విని, బాబుని చూసి డాక్టర్‌గా ఆయన ఏం గ్రహించారో గానీ ఇద్దర్నీ చెడామడా దులిపిశారు – “మీ బాబు పుట్టిన వెంటనే మొదటిసారి నా దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు చీటీలో రాశాను, ఇదిగో చూడండి – ‘జీరో స్క్రీన్’ అని. ఇంత చదువుకున్నవారు మీకు అర్థం కాలేదా, అంటే ఏమిటో?? మేము ఇచ్చిన సలహా పాటించని వారు పిల్లల్ని మా దగ్గరకు ఎందుకు తీసుకు వస్తారు? జన్మ ఇవ్వడానికి అంత కష్టపడిన వారు పెంచటానికి మా సలహా పాటించనవసరం లేదా..”. కాసేపటికి ఆయన కోపం కొంచెం చల్లారాక వీలైనంత త్వరలో బాబుని పిల్లల మనోచికిత్సకుల దగ్గరకు తీసుకు వెళ్లమన్నారు. ఒక విజిటింగ్ కార్డ్ అందించారు.

కుసుమా-దివాకర్ నోట మాట లేకుండా ఉండిపోయారు. ఊహించలేని ఈ పరిణామానికి ఇద్దరు అవాక్కై పోయారు. ఏదో మాటలు రావటం ఆలస్యం అవుతాయని అనుకున్నారు గాని ఇదేమిటి మనోచికిత్సకుడిని కలవమంటున్నారు. ధైర్యం తెచ్చుకుని ఆ మాటే డాక్టరుని అడిగారు దివాకర్.

“నాకు ఈ విషయంలో ఎక్కువ ప్రవేశం లేదు కానీ మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ బాబు ప్రవర్తనలో ఒక రకమయిన స్తబ్ధతని గమనిస్తున్నాను – ‘ఆటిజమ్’ అనబడే మానసిక రుగ్మతకి గురి అయ్యాడని అనిపిస్తునది. ఈ ఆటిజమ్ కూడా చాలా విస్తృతమైన విషయం. మీ అంతట మీరు నిశ్కర్షకి వచ్చే ముందు నేను చెప్పిన డాక్టర్‌తో మాట్లాడండి. మీ బాబు తన ఈడు పిల్లలతో సమానంగా ఆడుతూ-పాడుతూ ఉషారుగా ఉండాలంటే ఇంటికి వెళ్లాక ముందు టి.వి. కనెక్షన్ తీసివేసి సెల్-ఫోన్స్ కూడా పిల్లవాడికి అందకుండా చూడండి. బాబు ముందు మీరు సెల్ వాడటానికి వీల్లేదు.” అని గట్టిగా హెచ్చరించి పంపించారు డాక్టర్ కుసుమ సుధాకర్‌ని. వారిద్దరి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో నా ఊహాకీ అందని విషయం.

కుసుమ కుంటుంబం తిరిగి ముంబై రాంగానే నేను కలవటానికి వెళ్ళాను. ఆందోళనతో నిండి ఉన్న వారి ముఖాలు చూసి అడిగితే కుసుమ ఈ పై వివరాలన్నీ చెప్పింది కన్నీరు పెట్టుకుని.

ఊరడింపుగా అయినా ఏమనాలో నాకు తోచలేదు. బాబుని చూస్తే చాలా సామాన్యంగా కనిపించాడు.. కానీ పిలిస్తే మాత్రం కళ్లు ఎత్తైనా చూడటం లేదు. ఏదో తన ధోరణిలో తాను ఒక మూలకి వెళ్లి ఆడేసుకుంటున్నాడు. తల్లి తప్పితే ఇంకెరి ఉనికి పట్టించుకోవటం లేదు. సాధారణంగా ఐతే పసి పిల్లవాడు కొత్త మొహాలు చూసి కొత్త చేస్తున్నాడు అనుకుంటాము. నాకు ముందే కుసుమ చెప్పి ఉండకపోతే అలాగే అనుకుందును.

డాక్టర్ సలహా మేరకు ఒక్కసారిగా టి.వి. మాన్పించేసరికి బాగా పేచీలు, మొండి పట్టు మొదలైనాయి. బాబుని అదుపులో పెట్టుకుని వారీ ముగ్గురి నిత్య క్రియలు పాటించటం కూడా చాలా కష్టం అయిపోయింది వారికి. ముఖ్యంగా ఒక్క నిమిషం తల్లి కనిపించక పోయినా గోల పెట్టేస్తున్నాడు. ఇంట్లో మిగతా పనులకి ఇద్దర్ని పెట్టుకున్నా, టి.వీ, ఫోన్ వాడకుండా బాబుని పట్టుకోవటం చాలా కష్టపడవల్సి వస్తున్నది.

వచ్చిన మరునాటి నుంచీ ముంబైలో బాగా ఖ్యాతి చెందిన పిల్లల మనోచికిత్సకుల దగ్గరకు వెళ్లారు. నానా విధమైన టెస్టులు చేయించారు. బాబు ది ‘ఆటిస్టిక్-స్పెక్ట్రమ్-డిసార్డర్’ అనబడే ఒక మానసిక దౌర్బల్యం అని గుర్తించారు. ఈ మానసిక వ్యాధికి ముఖ్య కారణం జెనెటిక్ అంటే వారసత్వంగా వచ్చింది అన్నారు. కానీ బాబు విషయంలో జెనెటిక్ కారణం కాదు. ఏమంటే కుసుమ వేపు కానీ దివాకర్ వేపు బంధువుల్లో గాని ఈ వ్యాధిగ్రస్థులు ఎవరూ లేరు. ఒకవేళ ఉండి ఉన్నాఆ రోజుల్లో అది ఒక మానసిక వ్యాధి గా గుర్తించి ఉండక పోవచ్చు. ఏది ఏమైనా బాబులో ఈ వ్యాధి పరిస్థితుల ప్రభావమే అని తీర్మానించారు. సరిగ్గా మాటలు నేర్చుకోవల్సిన సమయంలో తనతో ఆడుకుంటూ కబుర్లు చెప్పే వారు లేక జన్మించిన లోపం టీ.వీ. స్క్రీన్ వల్ల వృద్ధి చెందిది, అని చెప్పవచ్చు. బాబులో ‘ఏడి ఎచ్ డి’ – ‘ఏటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఏక్టివిటీ డిసార్డర్’ అనగా చిన్నపిళ్లలో ‘ఏకాగ్రత లోపం అనబడే’ మానసిక వ్యాధి. కేవలం మాటలు రావటం ఆలస్యం అనుకున్న కుసుమ దివాకర్‌కి డాక్టర్లు తమ బాబులో ఇలా ఒకొక్క మానసిక లోపం చెపుతుంటే చెప్పలేని వ్యథతో క్రుంగి పోయారు.

కుసుమ తన ఆఫీస్ యాజమాన్యానికి పరిస్థితి వివరించి కనీసం సంవత్సరం పాటు జీతం మినహాయించి సెలవు ఇవ్వమని కోరింది. కానీ వారు ఒప్పుకోలేదు. చేసేదిలేక బాబు భవిష్యత్తు కంటే ఉద్యోగం ముఖ్యం కాదు కదా!!! ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది కుసుమ. ఇద్దరిదీ ఇప్పుడు ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం. డాక్టర్ల సలహా తు..చా.. తప్పకుండా పాటించి బాబుని తన సమవయస్కుల్లా తయారు చెయ్యాలి. ఎలాగైనా సరే ఆటిజం అనబడే ఊబి నుంచి బయటకు లాగాలి. దీనికి ఎంత కాలం పడుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పలేక పోయారు ఎవరూ. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తించి దానికి చికిత్స మోదలేడీతే అంత త్వరగా బాబు ప్రవర్తనలో మంఛి మార్పు ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పారు.

ఎక్కువ సమయం టీ.వీ. ముందు ఉండి పోవటం వల్ల బాబుకి మాటలు రాకపోవటమే కాకుండా తన ఈడు పిల్లలతో సమానంగా మెదడు వికసించలేదు. ఏమంటే టి.వి. స్క్రీన్ కానీ సెల్ స్క్రీన్‌లో కానీ దృశ్యాలు చూస్తాము, వింటాము కానీ అవి తిరిగి మనతో మాట్లాడవు కదా. ఒక రకంగా చెప్పాలంటే బాబు మెదడులో ఒక భాగం వికసించింది కానీ మరో భాగం పూర్తి నిష్క్రియగా ఉండిపోయింది. అందువల్ల మిగతా తన ఈడు వారి కంటే దాదాపు సంత్సన్నర వెనక పడిపోయాడు. తన సమవయస్కుల్లా బాబు మాటలు నేర్చుకుని సామాన్యంగా అవ్వాలంటే, డాక్టరు చెప్పిన విధానంగా మందులతో పాటూ మొదటి నాలుగు నెలలు ఆక్యుపేషనల్ థెరపీ అనగా బాబు ఏ పని చేసినా, దాని పై కొన్ని క్షణాలైనా గురి ఉంచేందుకు కృషి చేయ్యాలి. అది ఒక దారికి వచ్చాక స్పీచ్ – థెరపీ అనగా కొన్ని విశేషమైన ఆటలు ఆడిస్తూ ఒకే మాటని పలు సార్లు చెప్తూ బాబు చేత ఆ మాట పలికించటానికి కృషి చేయటం. రోజు విడిచి రోజు బాబుని తీసుకుని ఏదొక క్లాస్‌కి, ఒక్కో రోజు ఐతే రెండేసి క్లాసులకి తీసుకు వెళ్లి వస్తున్నారు. కేవలం తీసుకు వెళ్లి రావటమే కాదు. అక్కడ డాక్టర్లు చెప్పిన విధంగా బాబుతో ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో కూడా కుసుమ నేర్చుకుని వస్తునది. ‘ఏకాగ్రత లోపం’ అనబడే మానసిక రుగ్మతకి మూడు అంశాలు- ఇన్టెన్షన్, హైపెర్ ఏక్టివ్, ఇంపల్సివ్. ఈ మూడు విభాగాల్లో ఏదొకటి ఒకరిలో తక్కువా ఎక్కువా ఉండవచ్చు. బాబు విషయంలో ఈ మూడింటి పైనా చాలా కృషి చెయవల్సి ఉండింది. ఇన్టెన్షన్ అంటే తన ఈడు పిల్లలు తేలిగ్గా చేసే పనులలో కూడా ఇటువంటి పిల్లలు ఏవో తప్పులు చేయటం, ఒక పని కానీ ఆట కానీ పూర్తి చేయకుండానే మరో ఆటలోకి, అటునుంచి మళ్లీ మరో పని లోకి వెళ్లి పోవటం, ఇంపల్సివ్ అనగా ఏదైనా వస్తువు చేతిలో తీసుకున్న వెంటనే దాన్ని వీసిరేయటం, పగలకొట్టటం, ఉన్నట్లుంది గట్టిగా ఏడవటం, కేకలు వెయ్యటం, ఎక్కడ పడితే అక్కడ నెల పై పడి పొర్లటం లాంటివి చేస్తారు. ఇటువంటి అసామాన్యపు, అసందర్భపు  ప్రవర్తనని సరి చెయ్యాలంటే ప్రప్రథమంగా చాలా ఓర్పు అనివార్యం. చికిత్సకి మొదటి మెట్టు – బాబుని పేరు పెట్టి పిలిస్తే పిలిచిన వారి వైపు చూడాలి. చూపు కలవందీ మనం ఏం చెప్పి ప్రయోజనం ఉండదు. సామాన్యంగా చిన్న పిల్లలలో ఈ లోపాలు గుర్తించటం చాలా కష్టం. జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ ఇటువంటి అసామాన్యపు ప్రవర్తన గుర్తించటం కష్టం. ఇటువంటి ప్రవర్తన ఏదో ఒక స్థానంలో సరిగ్గా ఉండి, మరో చోట సరిగ్గా లేకపోవటం కాకుండా కనీసం రెండు స్థానాల్లో ఐనా ఒకేలా ప్రవర్తిస్తే ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అతి చిన్న వయసులో అలా అసందర్భంగా ప్రవర్తిస్తే దాన్ని ‘ఏకాగ్రత- లోపం’ అన్న మానసిక వ్యాధిగా గుర్తించాలి. గుర్తించాక మాత్రం, వయస్సుతో పాటూ సర్దుకు పోతాయని నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయానికి సరైన చికిత్స చేయించటం చాలా అవసరం. బాబు మన లోకం లోకి రావాలంటే తల్లి-తండ్రిగా ముందు వాడిని ఒకే పేరుతో చూపు కలిపేదాకా పిలిచి, ఒకొక్క మాటా ఒకటికి రెండుసార్లు అర్థం అయ్యేదాకా, ఆ మాటకి సంబంధించిన వస్తువు చూపించి, తిరిగి ఏ రకంగా ఐనా ప్రతిక్రియ చూపించే దాకా చెపుతూ ఉండమన్నారు. ప్రస్తుతం కుసుమ తన ఉద్యోగం మానేసింది కాబట్టి వారి కుటుంబం మునపటి లాగానే ఆర్థిక స్తోమతతో మెలగాలంటే ఒక్క దివాకర సంపాదన, మునుపు చేసిన ఇన్వెస్ట్ మెంట్స్ ఆధారం అయినాయి. బాబుతో నిరంతరంగా ఆడుతూ, ఆడిస్తూ, కబుర్లు చెపుతూ ఉండే చురుకైన, కొంచెం చదువుకున్న, ఇంగ్లీష్ వచ్చిన పని అమ్మాయి కావాలి. కొంతమందిని పిలిచి మాట్లాడగా వారికి కావల్సిన అమ్మాయి దొరికింది. ఇలా ప్రారంభమైంది కుసుమా దివాకర్‌తో పాటూ మా అందరి ప్రయత్నం కూడా. వారిద్దరూ క్లాసులకి వెళ్లి వచ్చి ఇచ్చిన సలహా తమ గ్రూప్‌లో వారందరితో పంచుకుంటున్నారు. దాని బట్టి మేమందరం, అనగా వారి సన్నిహితులు కూడా వీలైనప్పుడల్లా మా ప్రయత్నం మేము చేస్తున్నాము.

“ఇంత చదువుకుని పెద్ద ఉద్యాగాలు చేసుకుంటూ ఏం లాభం ఆంటీ? అపురూపంగా పుట్టిన ఒక బిడ్డని సవ్యంగా పెంచుకోలేక పోయాము.” మనసు వికలమైనప్పుడు కుసుమ తప్పనిసరి పరిస్థితి లో ఐనా తన వల్ల జరిగిన తప్పుకి కుమిలి పోతూ ఉంటుంది. స్త్రీకి కన్నీరు ఒక వరం లాంటిది. కన్నీరు కార్చి కనీసం దుఃఖం బయట పెట్ట కలదు. పాపం దివాకర్ అది కూడా చేయలేక ఎంత బాధ పడుతున్నాడో! కుసుమ ఉద్యోగం రాజీనామా ఇవ్వటంతో దివాకర్ పై సంపాదన భారం ఎక్కువ అయి రాత్రిం పగళ్లూ కష్ట పడుతున్నాడు. ఇంటి పనులకి ఇద్దర్ని పెట్టుకుంటేనే కుసుమ బాబుపై తన దృష్టి ఉంచగలదు. కానీ ఒక్కరి సంపాదనతో ముంబై నగరంలో ముగ్గురు పని వాళ్లని భరించాలంటే, ఇంటి ఖర్చులతో పాటూ ఎంత కష్టమో ఊహించలేని విషయం కాదు. దేముడి దయ వల్ల కనీసం వీరికి ఆ స్తోమత ఉంది. అది కూడా లేని వారి పరిస్థితి ఏమిటి? ఎలాగైనా సరే బాబుని ఈ ‘ఆటిజమ్’ అన్న ఊబి నుంచి పైకి లాగ గలిగతే కష్టం ఫలించినట్టే కదా!!

డాక్టర్లు చెప్పి నట్లు బాబుని క్షణమైనా ఒంటరిగా వదలకుండా ఇంటా- బయటా ఎంత మందిని కలుస్తూ ఉంటే పిల్లవాడు అంత త్వరగా మన లోకం లోకి వస్తాడని చెప్పిన దగ్గర్నుంచీ కరోనా భయం తగ్గాక దివాకర్ తల్లి-తండ్రి, కుసుమ తల్లీ-తండ్రి, ఒకరి తరవాత ఒకరు వంతులు వేసుకుని వచ్చి బాబుతో సమయం గడుపుతున్నారు. ఎవరు ఏ పూజ మంఛిది అంటే అది చేస్తున్నారు, చేయిస్తున్నారు. అన్నీ రకాలుగా ప్రయత్నించగా, ప్రార్థించగా బాబుకి ఇప్పుడు మూడేళ్లు దాటాక ప్రవర్తనలో కొంత మార్పు స్పష్టంగా కనపడుతున్నది. బాగా తెలిసిన వారు పిలిస్తే తల ఎత్తి చూస్తున్నాడు. ముఖ్యంగా మిగతా పిల్లల్లాగానే నర్సరీ స్కూల్‌లో వేసింతర్వాత బాబులో మార్పు త్వరగా వస్తునది. స్కూల్‌లో కూడా ఈ కోవకి చెందిన పిల్లలు మిగతా వారి కంటే మెల్లగా విషయం గ్రహిస్తారు కాబట్టి అసలు ఉపాధ్యాయినితో పాటూ శిక్షణ పొందిన మరో సహాయకురాలిని నియమిస్తారు. ఆ సహాయక ఉపాధ్యాయినికి జీతం ఏ.డి. ఎచ్.డి. పిల్లల అభిభావుకులే ఇస్తారు. తానే దగ్గర ఉండి ముఖ్య ఉపాధ్యాయిని బోధిస్తున విషయం ఈ పిల్లల్కి మరీ మరీ బోధిస్తుంది. బాబు స్కూల్లో తన టీచర్‌తో, మిగతా పిల్లలతో కొంచెం కలవటం మొదలు పెట్టాడు. రోజూ ఉదయం మూడు గంటలు స్కూల్‌కి వెళ్లి వస్తున్నాడు పేచీ పెట్టకుండా. ఒక రోజు కుసుమ నన్ను కూడా తీసుకు వెళ్లింది ఏదో ఏక్టివిటీ ఉంది అంటే చూడటానికి. ఒక క్లాసుకి పదిహేను మంది పిల్లల కంటే ఎక్కువలేరు. కానీ స్కూలో వాతావరణం చూడ ముచ్చటగా ఉండింది. మన బాబు మాత్రం ఉండి- ఉండి ఏక్టివిటీ మధ్య వాళ అమ్మ దగ్గర కు వచ్చి కూర్చుండి పోతున్నాడు. లేకపోతే అసిస్టెంట్ టీచర్ వేలు పట్టుకుని తిరుగుతున్నాడు. అదిగో అలా తన ఈడు మిగతా పిల్లల మధ్య ఉన్నప్పుడే బాబు ప్రవర్తనలో వ్యత్యాసం బాగా గోచరిస్తుంది.

నేను చాలా సార్లు ప్రయత్నించాను, బాబుని మా ఇంటికి కూడా తీసుకువచ్చి ఆడిద్దామని, కానీ లాభం లేకపోయింది. అలవాటైన పని పి‌ల్లతో కిందకు వెళ్లి పార్క్‌లో ఆడుకుంటాడు కానీ అక్కడ మాత్రం తోటి-పిల్లలతో కలవడు ఏమంటే ప్రతి రోజూ పార్కులో ఆడుకునే పిల్లలు మారుతూ ఉంటారు కదా. మధ్య-మధ్యలో మాత్రం బాబు వివిధమైన క్లాసుల ఒత్తిడి వల్లో ఏమో విపరీతమైన తిక్క పెట్టినప్పుడు కుసుమ ఓర్చుకోలేక చాలా గట్టిగా కేకలు వేస్తుంది బాబు పైన. పక్క ఫ్లాటులో వాళ్ళకి వినిపిస్తాయి తన కేకలు. విని బాధ పడటం మినహా ఏం చేయలేని పరిస్థితి.

***

ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల వేళ మా డోర్ బెల్ అదే పనిగా మొగుతుంటే విసుక్కుంటూ చేతిలో పని పక్కన పెట్టి వెళ్లి తలుపు తీశాను. కుసుమ లోపల్కి వచ్చి “ఆంటీ!” అంటూ నన్ను వాటేసుకుని ఏడవటం మొదలెట్టింది. హడలి పోయాను. “ఏమైంది కుసుమా? బాబుకి వంట్లో బాగోలేదా?? దివాకర్ కులాసాయేనా?” అని అడిగాను. కుసుమ తల అడ్డంగా తిప్పి, ఎడుపూ నవ్వూ కలిపిన స్వరంతో “ఆంటీ.. ఇవాళ నిద్ర లేస్తూనే బాబు వన్ నుంచి టెన్ దాకా అంకెలు చెప్పేశాడు. నేనూ దివాకర్ విన్నది నిజమేనా అనుకునేసరికి మళ్లి టెన్ నుంచి వన్ దాకా బాక్ కౌంటింగ్ చెప్పాడు. నాకూ దివాకర్‌కి మూర్ఛ వచ్చినంత పని అయింది. వాళ్ల స్కూల్‌లో నేర్పించారుట. మా అమ్మా నాన్న నిన్ననే తిరిగి వెళ్లారు కదా. మాకు మా ఆనందం పంచుకోవటానికి మీరే కనిపించారు ఆంటీ.” అంది కుసుమ కన్నీరు తుడుచుకుంటూ. వారి సంతోషంలో నా కళ్లు కూడా చెమర్చాయి కానీ నా నోట మాట రాలేదు. “మీ అందరూ ఇచ్చిన మనోబలం వల్లనే కదా ఆంటీ మేము ఈ రోజు ఇంతటి సంతోషం చూడగలిగాము..” అంది. నేను తేరుకుని “అదెంటమ్మా, నేను చేసింది ఏముంది కుసుమా? సరైన సమయానికి మీ పొరపాటు గ్రహించి ఏక దీక్షతో మీరు చేసిన కృషికి ఆ దేముడి అనుగ్రహం వల్ల బాబుకి మాట వచ్చింది. ఇక మిగతా సమస్యలు కూడా త్వరలో సమసిపోతాయి. పై వాడి మీద శ్రద్ధా, ఓర్పు ఉంచుకుని లోపం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. తప్పక మీ కృషి త్వరలో ఫలమిస్తుంది” అన్నాను. ఇన్నాళ నుంచి ఆ భార్యాభర్తలు పడిన మానసిక క్షోభ, ఆవేదన, కష్టం నేను కళ్లారా చూసి ఉన్నానేమో వారి ఆనందం ఊహించగలను. కష్ట పడినా మొదటి మెట్టుపై విజయం సాధించారు. బాబుని పూర్తిగా సామాన్యంగా అవటానికి మిగతా మెట్లు ఎక్కటానికి ఇద్దరిలో నమ్మకం, ఉత్సాహం అన్నింటికంటే ముఖ్యం నిస్పృహ స్థానలో ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

~

[ఇది నాకు బాగా తెలిసిన ఒక కుటుంబ-గాథ. లాక్ డౌన్ సమయంలో ఇటువంటి కేసెస్ మామూలు కంటే చాలా ఎక్కువ వచ్చాయని డాక్టర్లు చెపుతున్నారు. మనకి చాలా సార్లు అదేపనిగా సెల్ ఫోనుకి కంప్యూటర్‌కి దగ్గరగా ఉంటే విషమ పరిణామాల గురించి మెసేజులూ వస్తూ ఉంటాయి కానీ పట్టించుకోము. నిజ జీవితంలో మనకి అటువంటి పరిణామాలు ఎదురైనప్పుడే ఆ సలహాల విలువ గుర్తిస్తాము. ఇటువంటి మానసిక రుగ్మతకు అసలు కారణం ఐతే ఇప్పటి వరకు శోధించలేక పోయారు. కానీ ఈ దౌర్బల్యాన్ని పెంపొందించే ముఖ్య మైన యంత్రాలు-టి.వి స్క్రీన్, ఇంక సెల్ ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ అని మాత్రం ధృవపరుస్తున్నారు. పాఠకులకి మరో విజ్ఞప్తి – పై కథలో బాబు గురి అయింది ‘ఆటిజమ్’ అనబడే మానసిక దౌర్బల్యంలో ఒక చిన్న పక్షమే. ‘ఆటిజమ్’ అన్న విషయం చాలా చాలా విస్తృతమైనది. ఇందులో వివిధమైన పరిశోధనలు ప్రయోగాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బాబు నూరు శాతం ఈ వ్యాధి నుంచి ముక్తి పొందుతాడో లేదో కూడా డాక్టర్లు ధ్రువపర్చలేక పోతున్నారు. మన ప్రయత్నం మనం చేసుకు పోతూండటమే మన ప్రస్తుత కర్తవ్యం.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here