ఓ అపప్రథని చెరిపివేయాలనే నవల ‘లోహముద్ర’

1
12

[శ్రీ సలీం రచించిన ‘లోహముద్ర’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

[dropcap]సా[/dropcap]ధారణంగా మనుషులు తమ మీద చిన్న అపవాదు వస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఒక జాతి మొత్తం – తమవాళ్ళు కొందరు గతంలో చేసిన నేరాలకి – నేరస్థులనే ముద్రని కొన్ని దశాబ్దలా పాటు మోస్తే? ఒక అపప్రథని ఒక తరం నుంచి ఇంకో తరం కొనసాగిస్తూ సమాజంలో అవమానాలకి గురైతే ఆ వేదన ఎలా ఉంటుంది? ఊహించడానికి కూడా మనసొప్పదు.

వారిలో నేరం చేసినవారున్నారనేది ఎంత వాస్తవమో, చేయని నేరాలకి జైల్లో వేసి వారిని, వారి కుటుంబాలని శారీరికంగా మానసికంగా పాలకులు/సమాజం వేధించిన మాట అంతే నిజం!

నేరం జరిగిపోయాకా, నేరాలని ఎలా అరికట్టాలని చూసే కన్నా, అసలు నేరమే జరగని పరిస్థితులు కల్పించాలి.

ప్రముఖ రచయిత శ్రీ సలీం రచించిన ‘లోహముద్ర’ నవల చదివాకా, ఇవే ఆలోచనలు కలుగుతాయి. స్టువార్ట్‌పురం సెటిల్‍మెంట్‍లో స్థిరపరచబడ్డ ఎరుకుల తెగల వారి గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఒక అపప్రథని  తెలిసో తెలియకో సమాజం ఇప్పటికీ నమ్ముతోందనీ, అది వారి నొసటిపై చెరగని ముద్రలా మిగిలిపోయిందని ఈ నవల సూచిస్తుంది. ఆ ముద్ర పడిన వారిలో చాలామంది చదువుకుని ఉన్నతోద్యోగాలలో ఉన్నా, ఇంకా వారిని సమాజంలో కలుపుకోడంలో సంశయాలున్నానే చెప్పాలి.

~

తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎరుకలను అడవులకు, వారి తమదైన జీవన విధానానికి దూరం చేసి, ఆదాయాన్ని కోల్పోయి, కుటుంబ పోషణకై ఏం చేయాలో తెలియని స్థితికి తెచ్చింది అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం. వారిని దొంగలుగా, నేరస్థులుగా ముద్రవేసి, పునారావాసం పేరుతో వారికి ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి, అక్కడ ఉంచి వారిని నియంత్రించాలని ప్రయత్నించింది. అలా ఏర్పడిన సెటిల్‍మెంట్ లలో ఆంధ్ర ప్రదేశ్‍లోని స్టువార్ట్‌పురం ఒకటి.

‘లోహముద్ర’ నవలలో రచయిత -మూడు తరాల కథను చెప్తారు. దొంగతనాలనే ఉపాధిగా మార్చుకున్న తరం మొదటి తరం, ఇష్టం లేకపోయినా బలవంతంగా నేరం చేసిన తరం రెండో తరం, గతకాలపు అవమానాలను, వర్తమానంలోని అడ్డంకులను అధిగమిస్తూ – కొత్త జీవితంలోకి అడుగిడే తరం మూడవ తరం!

మొదటి తరపు శీను దొంగతనంతో  మొదలుపెట్టి, రెండో తరం ప్రసాద్ ఎదుర్కున్న సామాజిక బహిష్కరణను వివరించి మూడో తరం తిలక్ ఐఎఎస్ అవటం, తమ జాతికి ఉపయోగకరమైన పనులు చేయడం, తమ జాతి ఉజ్జ్వల భవితకై ఆశని వ్యక్తం చేయటంతో నవలని ముగించారు సలీం.

~

పేదరికం, చదువు లేకపోవడం ఉపాధికి అవకాశాలు లేకపోవడం, పిల్లల ఆకలి వంటివి శీనుని దొంగతానానికి పురికొల్పుతాయి. దోపిడీలు చేసినా, హింసకు పాల్పడకూడదనీ, మనుషులను గాయపరచకూడదనీ, చంపకూడదనేది శీను ఉద్దేశం. కానీ వెంకటేశ్వర్లుకి అలాంటివేవీ లేవు. భూస్వామి చెంచయ్య ఇంట్లో నగలు, డబ్బు దొంగిలించి, అతన్ని నిస్సంకోచంగా గాయపరుస్తాడు. ఈ దోపిడీ సొమ్ములో వాట ఉన్న పోలీసు అధికారి కోటయ్య పరిస్థితి వర్ణనాతీతం. పోలీసులు పట్టుకొచ్చిన శీను తన పేరు ఎక్కడ చెప్పేస్తాడోనని! పోలీసు కోటయ్య మనఃస్థితి ఒకలా ఉంటే, దోపిడీకి గురైన భూస్వామి చెంచయ్య మానసిక పరిస్థితి మరోలా ఉంటుంది. అందరి ముందు నగుబాటు అయినట్టు, అవమానం పొందినట్టు భావిస్తాడు. కూతురు పెళ్ళి ఆగిపోయినందుకు చింతాక్రాంతుడై బలవన్మరణానికి పాల్పడతాడు. అది చూసి అతని కూతురు కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన శీను బాధపడతాడు. పోలీసులు  కొట్టిన దెబ్బలకన్నా ఈ వేదన ఎక్కువవుతుంది. తన వల్ల ఇద్దరి ప్రాణాలు పోయినందుకు తనని తాను క్షమించుకోలేకపోతాడు.

శీనుకి తన చిన్నతనం గుర్తొస్తుంది. తండ్రి దొంగతనాలు చేస్తూంటే, అవి మానేసి మంచి పనులు చేసుకుని బతకొచ్చుగా అని అంటాడు. అప్పుడు తండ్రి విరక్తిగా నవ్వి, అసలు విషయం చెప్తాడు. “మనకు స్వంత యిళ్ళంటూ ఉండవు. పొలాలు, ఇతర ఆస్తులేమీ ఉండవు. మనది సంచార జాతి కదా. ఈ రోజు ఇక్కడుంటే రేపు ఎక్కడుంటామో మనకే తెలియదు. మనల్నే కాదు మిగతా సంచార జాతులవాళ్ళని కూడా దొంగలనే అనుకుంటుందీ. సమాజం. దొంగతనాలు చేసి, రాత్రికి రాత్రి మకాం మార్చేసే అవకాశం ఉండటంతో మనల్ని అలా అనుకుంటారు,”.

శీను తన నేరం అంగీకరించి, తోటి దొంగల పేర్లు కూడా చెప్పేస్తాడు. కోర్టు మూడేళ్ళు జైలు శిక్ష విధిస్తుంది. సంతోషంగా జైలుకి వెళ్తాడు శీను. కొడుకు ప్రసాద్‌ దొంగగా మారకుండా చూడాల్సిన బాధ్యత భార్య లక్ష్మికి అప్పగిస్తాడు.

ప్రసాద్ తన అక్క గౌరితో ఆడుకోకుండా, వెంకటేశ్వర్లు కొడుకు రాజుతో స్నేహం చేస్తాడు.

జైలు నుంచి శీను విడుదలయ్యే సమయానికే బ్రిటీషు ప్రభుత్వం నేరస్థుల కోసం సెటిల్‍మెంట్ ఆలోచన చేస్తుంది. హెరోల్డ్ ఆర్థర్ స్టువార్ట్ – చీరాల, బాపట్ల, బెజవాడ ప్రాంతాలలో నేరాలలు పాల్పడుతున్న ఎరుకలవారిని సంస్కరించే ఉద్దేశంతో సాల్వేషన్ ఆర్మీ సహకారంతో ఒక సెటిల్‍మెంటును ఏర్పాటు చేస్తాడు. మొదట్లో దాన్ని  బేతపూడి సెటిల్మెంట్ అనేవారు. అక్కడ మేనేజర్‍గా రోబిల్లియర్డ్‍ని నియమిస్తారు. ఆయన ప్రతినిధులు ఎరుకల వాళ్ళని కలుసుకుని సెటిల్మెంట్ స్థాపన లక్ష్యాలు వివరించి, అందరినీ అక్కడికి చేరుస్తారు. ఈ సెటిల్మెంట్‍ను కొందరు ఎందుకు వ్యతిరేకించారో, మేనేజర్‍ శీనుకి అర్థమయ్యేలా చెప్పిన సందర్భంలోని మాటలు వాస్తవాలు. సెటిల్మెంటును కొనసాగనీయడంలో చుట్టుప్రక్కల ప్రాంతాల వారిని అంగీకరింపజేసిన హెరోల్డ్ ఆర్థర్ స్టువార్ట్ గారి పేరిట అది ‘స్టువార్ట్‌పురం’ అవుతుంది.

కొన్నాళ్ళకి సింహాచలంలో జరిగిన ఓ దోపిడీలో భాగం ఉందంటూ శీనుని పోలీసులు పట్టుకెళ్తారు. ఈసారి ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది. జైల్లో పరిచయమైన హనుమంతు ద్వారా శీనుకు స్వాతంత్ర్యోద్యమంపై అవగాహన కలుగుతుంది.

~

రాజు, ప్రసాద్ కొంచెం పెద్దవాళ్ళవుతారు. రాజు ప్రసాద్‌ని దొంగతనాలకి ప్రేరేపిస్తాడు. మొదట్లో దొరికిపోయి దెబ్బలు తిన్నా, ప్రసాద్ రాటుదేలిపోయి, రాజుకు సరిజోడవుతాడు. దొంగతనం చేయటంలోని థ్రిల్ అతన్ని ముంచేస్తుంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్‍లో చేరిన గౌరి బి.ఎ. పాసవుతుంది. రాజు తన చెల్లెలు వాసంతిని ప్రసాద్‍కి పరిచయం చేస్తాడు. పద్దెనిమిదేళ్ళకే జీవితంలో రాటుదేలిన వాసంతి ప్రసాద్‌ని ఇష్టపడుతుంది. చిన్న చిన్న దొంగతనాలు చేసి విసుగెత్తిన వాసంతి, ఏదైనా పెద్ద దొంగతనం చేయాలంటుంది. అప్పుడు ఓ దేవాలయాన్ని దోచుకోవాలన్న తన ప్రణాళికని వివరిస్తాడు రాజు. దేవుడి నగలు దొంగిలించడం పాపమనీ, దేవుళ్ళ జోలికి వెళ్ళద్దనీ అంటుంది వాసంతి. కానీ రాజు, ప్రసాద్ ఒప్పుకోరు. చివరికి ముగ్గురు కల్సి గుడిలో దొంగతనం చేస్తారు. అడ్డం వచ్చిన గుడి కాపలా మనిషిని రాజు చంపేస్తాడు. ముగ్గురు హైదరాబాద్ సంస్థానంలోని ఓ గ్రామానికి పారిపోతారు.

మర్నాడు ఉదయం పూజారి వచ్చి జరిగిన వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్‍లో రిపోర్ట్ చేస్తాడు. పోలీసులు విచారణ జరుపుతారు. దొంగతనానికి ముందు నిచ్చెన కొన్న రాజు, ప్రసాద్‍ల ఆనవాళ్ళు చెప్తాడా కొట్టతను. మొత్తానికి పోలీసులు ముగ్గురినీ పట్టుకుంటారు. రాజుకి యావజ్జీవ కారగార శిక్ష, ప్రసాద్‍కి, వాసంతికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తుంది కోర్టు.

~

బి.ఎ. పాసయిన గౌరికి స్టువార్ట్‌పురంలోనే టీచర్ ఉద్యోగం వస్తుంది. గౌరికి ఉద్యోగం వచ్చిన నాలుగు నెలలకి శీను జైలు నుంచి విడుదలవుతాడు. కూతురు చదువుకుని ఉద్యోగస్థురాలైనందుకు సంతోషించినా, కొడుకు తప్పుడు మార్గం పట్టినందుకు బాధపడతాడు. గౌరి తన తోటి ఉపాధ్యాయుడు నాగేంద్రని వివాహం చేసుకుంటుంది. వాళ్ళకో కొడుకు పుడతాడు. జైలు నుంచి విడుదలై ప్రసాద్ ఇంటికి వస్తాడు. తండ్రి ఎదురుగా వెళ్ళాలంటే సిగ్గుపడతాడు. జైల్లో ఉన్నన్నీ రోజులు మానసిక వేదనని అనుభవిస్తాడు ప్రసాద్. ప్రజల దృష్టిలో హత్యలు చేయడం కన్నా, దేవుడి నగలు దొంగిలించడం హీనాతిహీనమైన నేరమని జైల్లో ఉన్నప్పుడు గ్రహిస్తాడు. పశ్చాత్తాపడతాడు. గౌరి సలహా మీద వాసంతికీ, ప్రసాద్‍కి పెళ్ళి చేస్తాడు శీను. ఏడాది తరువాత వారికి ఓ బాబు పుడతాడు. తన మనవడికి ఓ మంచిపేరు సూచించమని శీను హనుమంతుని అడిగితే, తిలక్ అని పెడతాడు.  ఆంధ్ర పర్యటనకి వచ్చిన గాంధీగారి చేతుల్లో తిలక్‍ని ఉంచి, ఆశీర్వాదాలు పొందుతాడు శీను. తన మనవడు గొప్పవాడవుతాడని కలలు కంటాడు.

~

స్వాతంత్ర్య సమరం ఉధృతమవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి, ఎరుకలను షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చడం జరుగుతుంది.

~

తిలక్ పెరిగి పెద్దవుతాడు. చక్కగా చదువుకుంటాడు. మేనత్త కూతురు సామ్రాజ్యాన్ని ఇష్టపడతాడు. ఐఎఎస్‌ పరీక్షలు రాస్తాడు. ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్స్ అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్తాడు. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తాడు. తొలి పోస్టింగ్ మద్రాసులో వస్తుంది. స్వరాజ్యాన్ని వివాహం చేసుకుంటాడు. ఇద్దరు మగపిల్లలు పుడతారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా తాను ఎక్కడ ఉన్నా, తిలక్ తమవాళ్ళని పైకి తెచ్చే ప్రయత్నాలను ఆపడు. ఈ ప్రయత్నంలోనే ఉన్న లవణం దంపతులతో చేతులు కలుపుతాడు. వాళ్ళ కృషిని అభినందిస్తాడు. కాలం గడుస్తుంది. స్టువార్ట్‌పురంలో నవతరం విద్యావంతులవుతారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరుతారు. రిటైరైన తిలక్ స్టువార్ట్‌పురంలోనే ఇల్లు కట్టుకుంటాడు. కాలక్రమంలో స్టువార్ట్‌పురం సెటిల్మెంట్ బేతపుడి గ్రామంలో కలిసిపోతుంది.

సమాజం తమపై వేసిన లోహముద్ర చెరిగిపోతున్నందుకు సంతోషిస్తాడు తిలక్.

~

ఈ నవలలో స్టువార్ట్‌పురం స్థాపన గురించి, నేరస్థులను సంస్కరించాలనున్న ఆంగ్లేయాధికారుల గురించి సందర్భోచితంగా  వివరించారు రచయిత. చేయని నేరం తమపై రుద్దబడినప్పుడు వ్యక్తుల మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలిపారు. ఎరుకల సాని సోది చెప్పాలంటే, సోదెమ్మగా మారాలంటే ఎలాంటి పద్ధతి ఉంటుందో వివరించారు. ఇప్పటికైనా ఎరుకల తెగ వారిపై ఉన్న ఈ అపప్రథని చెరిపివేయాలని చెప్తుంది ‘లోహముద్ర’ నవల.

***

లోహముద్ర (నవల)
రచన: సలీం
ప్రచురణ: అన్వీక్షికి ప్రచురణలు
పేజీలు: 225
వెల: ₹ 250/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/Lohamudra-Novel-Saleem/dp/9395117486

 

 

 

~

శ్రీ సయ్యద్ సలీం గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-saleem-lm/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here