లోపాల లిఫ్ట్

4
10

[box type=’note’ fontsize=’16’] ఆంగ్లంలో సృష్టి త్యాగి రచించిన ‘The Faulty Elevator’ అన్న కథని తెలుగులో అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

[dropcap]ఎ[/dropcap]లివేటర్ పెద్ద కుదుపుతో పైకి లేచింది, నిలబడి ఉన్న శ్రీకాంత తన బాలెన్స్ కోల్పోయాడు. ‘ఏంటిది’ అనుకున్నాడు మనసులో, బంతి పూలతో అలంకరించిన రెయిలింగ్‍ని ఆసరాగా పట్టుకున్నాడు. సొసైటీ భవనం ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది, ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవడం అతనికి చిరాగ్గా ఉంది. వీటిని పట్టించుకునే సమయం లేదతనికి. తన ఆఫీసుకి చేరిన వెంటనే, మేనేజర్ మహేష్‍ని పిలిచాడు. “మహేష్, నిన్న నువ్వు లిఫ్ట్‌ని సర్వీసింగ్ చేయించలేదా?” అని అడిగాడు.

“చేయించాను సార్. కీచుమంటూ వచ్చే శబ్దం ఇప్పుడు రావడం లేదు. నిన్ననే షాఫ్ట్ కూడా శుభ్రం చేశాం.”

“మరి లిఫ్ట్ ఎందుకు – టర్బులెన్స్‌లో చిక్కుకున్న విమానంలా – కంపించిపోయింది?” శ్రీకాంత్ చిరాగ్గా అడిగాడు. అతనికి బాగా కోపంగా ఉంది. ఈ కొత్త ఎలివేటర్‌ని అప్పుడే, గత వారంలో రెండు సార్లు సర్వీస్ చేయించాల్సి వచ్చింది, అయినా సరిగా పనిచేయడం లేదు.

“ఆ లిఫ్ట్‌మాన్ ఎక్కడ చచ్చాడు?” తన గది తలుపుని కాలితో తంతూ కోపంగా అరిచాడు.

“నేను చూస్తాను సార్,” అని చెప్పి మహేష్ ఆ గది నుంచి బయటపడి, కొత్తగా పనిలో పెట్టుకున్న లిఫ్ట్‌మాన్ కోసం వెతకడానికి వెళ్లాడు.

10 అంతస్తులు, ఒక లిఫ్ట్ ఉండే విడి భవనానికి మామూలుగా అయితే ప్రత్యేకంగా లిఫ్ట్‌మాన్ అక్కర్లేదు. కానీ శ్రీకాంత్‍కి మాత్రం ఇది ఉత్తమమైన అవకాశం. అది మహేష్ ప్రతిపాదించిన ‘స్టిక్కర్లు అతికించడం’ అనే డాంబికపు ఆలోచన కన్నా మెరుగే అనుకున్నాడు. “ఇది కాలేజీ ప్రాజెక్టు కాదు” అంటూ మహేష్ ఆలోచనని త్రోసిపుచ్చాడు. పైగా ఇదంతా మహేష్ తప్పిదమే అనుకున్నాడు. బహుశా, మహేష్ వాళ్ళకి చెప్పినదాంట్లో ఏమైనా పొరపాటు దొర్లిందేమో, లిఫ్ట్ కంపెనీ వాళ్ళు బేస్‌మెంట్‌కి బటన్ లేని లిఫ్ట్‌ని తెచ్చి అమర్చారు. నేరుగా ‘జి’ అనే బటన్‌తో మొదలవుతుంది. స్విచ్‌బోర్డు మార్చేందుకు కాస్త సమయం పడుతుందట. అప్పటి వరకు ‘జి’ అనే బటన్‌ బేస్‌మెంట్‌కి, 1 గ్రౌండ్ ఫ్లోర్‍కి, 2 ఫస్ట్ ఫ్లోర్‍కి… ఇలా వాడుకోవాల్సి వస్తోంది. ఈ తికమక ప్రారంభోత్సవానికి వచ్చే అతిథులకు ఇబ్బందిగా ఉంటుందని శ్రీకాంత్ భయం! ఎందుకంటే – కార్యక్రమం వేదిక ‘మూడవ అంతస్తులోని సొసైటీ హాల్’. అందుకని తాత్కాలికంగా ఓ లిఫ్ట్‌మాన్‌ని నియమించి – సరైన బటన్‍ నొక్కి అతిథులను సరైన ఫ్లోర్‍లో దింపేలా చేయాలనుకున్నాడు శ్రీకాంత్. చిన్నపనే కాబట్టి, “ఏ ఫ్లోర్ మేడమ్/సర్?” అని అడగగలిగిన వ్యక్తిని లిఫ్ట్‌మాన్‌గా పనిలో పెట్టాడు. అయితే తన ఆ నిర్ణయం ఎంత తప్పిదమో మహేష్‌కి ఇప్పుడు అర్థం అవుతోంది. పైగా లిఫ్ట్‌లో లిఫ్ట్‌మాన్ లేడని శ్రీకాంత్ ఇప్పుడే మందలించాడు.

తాను వెతుకుతున్న లిఫ్ట్‌మాన్ ఎలివేటర్ దగ్గర తచ్చాడుతూ కనిపించే సరికి “పనికిమాలిన మనిషి” అని తిట్టుకున్నాడు మహేష్. “బాబూ? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎప్పుడూ లిఫ్ట్‌లో ఉండడం నీ బాధ్యత. ఇంకొక కంప్లయింట్ వచ్చిందంటే, నీ ఉద్యోగం ఊడుతుంది” హెచ్చరించాడతన్ని. ఆ తర్వాత ఎలివేటర్ సర్వీస్ చేసే వ్యక్తిని పిలవడానికి ఫోన్ చేయడానికి కదిలాడు. కాసేపట్లో అతనొచ్చాడు. ఒకగంటలో లిఫ్ట్‌ని సరిజేశాడు. ప్రస్తుతం అది చక్కగా పనిచేస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా, కార్యక్రమం ముగిసేదాకా, సర్వీస్ అతన్ని అక్కడే ఉండమని కోరాడు మహేష్. అతను ఉంటానన్నాడు, కానీ చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అడిగాడు. కాస్త బేరమాడుదామనుకున్నాడు మహేష్, కానీ అప్పటికే శ్రీకాంత్ తన కోసం కేకలు వేస్తుండడంతో, అతను అడిగిన మొత్తానికి ఒప్పుకున్నాడు. బాస్ వైపు పరిగెత్తాడు.

“మిస్టర్ సింఘానియా బయల్దేరారు. ఇంకో అరగంటలో ఇక్కడుంటారు, త్వరగా…” మహేష్‌తో చెప్పాడు శ్రీకాంత్.  మిస్టర్ అనిల్ సింఘానియా పెద్ద వ్యాపారవేత్త. టాప్ ఫ్లోర్‍లో – అక్కడ్నించి సముద్రం కనబడేలా – రెండ్లు సీ-ఫేసింగ్ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఆయన స్వయంగా హాజరవుతుండడం ఈ కార్యక్రమానికి నిండుదనం తెచ్చింది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని తాపత్రపయడుతున్నాడు శ్రీకాంత్.

కాసేపటికి అతిథులు రావడం మొదలైంది. శ్రీకాంత్ సూట్ వేసుకుని, అతిథులను పలకరిస్తూ, వారితో కలిసిపోయాడు, అయినా ఎలివేటర్ విషయంలో మహేష్ పట్ల కోపంగా ఉన్నాడు. అదే సమయంలో మిస్టర్ సింఘానియా కుటుంబంతో సహా విచ్చేసారని మహేష్ శ్రీకాంత్‌కి చెప్పాడు. ఆయనకు స్వాగతం చెప్పడానికి శ్రీకాంత్ వెంటనే కిందకి వచ్చాడు. అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీకాంత్ సింఘానియా పాదాలకు నమస్కరించాడు, స్వాగత వచనాలు పలికాడు. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీశారు. అప్పుడు సింఘానియా, ఆయన కుటుంబ సభ్యులు లిఫ్ట్‌లో ప్రవేశించారు. శ్రీకాంత్‌కి లిఫ్ట్‌లో స్థలం లేకపోయింది.

“మీరు వెళ్ళండి సర్, నేను వెనుక వస్తాను” మర్యాదగా చెబుతూ, శ్రీకాంత్ వెనక్కి వచ్చాడు.

ఎలివేటర్ తలుపు మూసుకుంది. మహేష్, మీడియా వాళ్ళతోనూ శ్రీకాంత్ ఎదురుచూస్తుండగా, ఉన్నట్టుండి ‘ధన్’ మన్న పెద్ద చప్పుడు వినిపించింది. ‘మళ్ళీ ఏమైందో’ అనుకున్నాడు మహేష్. అక్కడ్నించి మాయమైపోవాలనుకున్నాడు. శ్రీకాంత్ వాడి చూపులు తనని తాకడం అతడికి తెలుస్తోంది. “నే వెళ్ళి చూసొస్తాను” అంటూ మెట్ల వైపు వేగంగా పరిగెత్తాడు మహేష్.

శ్రీకాంత్ అతన్ని అనుసరించాడు. “ఏం జరుగుతోంది? ప్రెస్ వాళ్ళు ఇక్కడున్నారంత సంగతి మరిచిపోయావా?” అని గుసగసగా అడిగాడు. ఆ కంఠస్వరంలో విసుగు ప్రస్ఫుటంగా గోచరిస్తోంది.

“సార్… బహుశా లిఫ్ట్ ఏదో ఒక ఫ్లోర్ దగ్గర జామ్ అయింది” మహేష్ గొణిగాడు.

“ఏంటీ?” సీరియస్‍గా అన్నాడు శ్రీకాంత్. “ఏ పనీ నువ్వు సరిగ్గా చేయలేవా? మొదట లిఫ్ట్‌లో కుదుపులు… తర్వాత లిఫ్ట్‌మాన్ మాయం, ఇప్పుడు…”

“హలో… లిఫ్ట్ తలుపు తెరుచుకోవడం లేదు….” సింఘానియా అరుస్తున్నారు. “హలో?? ఎవరికైనా వినబడుతోందా?” శ్రీకాంత్, మహేష్ భయపడినట్టే – ఆ భవనంలో ఉన్నవారందరికీ సింఘానియా అరుపులు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ కోపంతో మండిపోతున్నాడు.

హఠాత్తుగా మహేష్‍కి లిఫ్ట్ సర్వీస్ అతను జ్ఞాపకం వచ్చాడు. “సార్, సర్వీస్ అతను ఇక్కడే ఉండాలి. నేను అతన్ని కాసేపు ఉండమన్నాను. వెళ్ళి పిలుచుకువస్తాను” గబగబా చెప్పి, అతన్ని పిలవడానికి పరిగెత్తాడు.

సరిగ్గా అప్పుడే పెద్ద ధ్వని వెలువడడం మొదలైంది. లిఫ్ట్‌లో ఉన్నవారెవరో… అలారం బటన్‌ని గమనించి నొక్కినట్టున్నారు. భారీ శబ్దంతో సైరన్ వినబడుతోంది. వచ్చిన మరికొంతమంది అతిథులు, చుట్టు పక్కలవాళ్ళు అందరూ గ్రౌండ్ ఫ్లోర్‍లో లిఫ్ట్ దగ్గర మూగారు. ఈ గందరగోళాన్నంతా ప్రెస్ వాళ్లు ఫోటోలు తీస్తున్నారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి శ్రీకాంత్ గ్రౌండ్ ప్లోర్ వద్దకి పరిగెత్తాడు.

‘వావ్! ఎలివేటర్‍లో సరిగ్గా పని చేస్తున్నది అలారం ఒక్కటేనన్న మాట, బావుంది’ అనుకున్నాడు మహేష్, సర్వీస్ అతన్ని రెండో అంతస్తుకు తీసుకువస్తూ. ఎలివేటర్ రెండో అంతస్తులో చిక్కుకుపోయిందని మహేష్ భావించాడు. కానీ లిఫ్ట్ తలుపులు తెరవాలని సర్వీస్ అతను ప్రయత్నించినప్పుడు, ఎలివేటర్ – నాలుగు, అయిదు అంతస్తుల మధ్య చిక్కుకుందని గ్రహించారు. ‘అక్కడికెలా వెళ్ళిందబ్బా’ విస్తుపోయాడు మహేష్. లిఫ్ట్ తలుపు తెరుచుకోగానే ఆ లిఫ్ట్‌మాన్‍ని ఉద్యోగం నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడు.

అలారం శబ్దం ఆగిపోయింది. ఓపెన్ షాప్ట్ వైపు వంగి “వీలైనంత త్వరగా బయటకి రప్పిస్తాము” అని సింఘానియా వాళ్ళకి భరోసా ఇచ్చాడు మహేష్. అందుకు ఆయన ప్రతిస్పందన మరీ చిరాగ్గా లేదనిపించింది మహేష్‌కి. అది ఒకింత ఊరటనిచ్చినా, లిఫ్ట్‌మాన్ మీద కోపం మాత్రం తగ్గడం లేదు. సర్వీస్ అతను సమీపంలోని ఫ్లోర్‍కి లిఫ్ట్‌ని చేర్చాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే మహేష్‌కి తననెవరో పిలుస్తున్నట్లనిపించింది. “చెప్పండి, మిస్టర్ సింఘానియా” అంటూ షాఫ్ట్ వైపు జరిగాడు.

“జాగ్రత్త” అంటూ సర్వీస్ అతను అరిచాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది.

‘ధబ్’మన్న చప్పుడుతో గ్రౌండ్ ఫ్లోర్‍లోని అందరూ బిత్తరపోయారు. షాఫ్ట్‌లో ఎవరో పడిపోయారనేది స్పష్టం. ఆ పడిపోయిన సింఘానియా వాళ్ళ కుటుంబంలోని వ్యక్తి కాకూడని ప్రార్థిస్తూ శ్రీకాంత్ అక్కడికి పరుగెత్తుకొచ్చాడు. ప్రెస్ వాళ్ళు అతన్ని అనుసరించారు, వాళ్ళకిదో సంచలనాత్మక కథనం! శ్రీకాంత్‍కి కాస్త ఊరట – ఆ పడిపోయినది మహేష్! అతను రెండో అంతస్తు నుంచి కింద తవ్విన ఘోరమైన గోతిలో పడ్డాడు, కానీ అదృష్టవశాత్తు సజీవంగా ఉన్నాడు. అతన్ని బయటకి తీయడానికి కాస్త సమయం పట్టింది. అతని కాలి నుంచి రక్తం కారుతోంది. మహేష్‌కి దాదాపుగా స్పృహ తప్పుతుండగా – తనని స్ట్రెచర్‍ మీద ఆంబులెన్స్ లోకి ఎక్కిస్తుండగా – స్ట్రెచర్‍ని ఒక వైపు పట్టుకున్న లిఫ్ట్‌మాన్ నవ్వుతూ ‘ఏ ఫ్లోర్ సర్?’ అని అడుగుతున్నట్లు అనిపించింది. అతన్ని తిడదామని నోరు తెరిచాడు మహేష్… కానీ మాట బయటకు రాలేదు.

***

మర్నాడు నిద్ర లేచేసరికి మహేష్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. చేతులకి గాయలయ్యాయి. బ్రేక్‍ఫాస్ట్ ట్రేతో నర్స్ వచ్చి, అతన్ని కూర్చోబెట్టుంది. “ఇవి తినండి, తర్వాత వచ్చి మందులు ఇస్తాను” అని చెప్పి వెళ్లిపోయింది. ట్రేలో ఏమున్నాయని చూస్తున్న మహేష్‍కి దినపత్రిక కనబడింది.

‘రసాభాసగా మారిన సొసైటీ భవనం ప్రారంభం! తప్పిన పెను ప్రమాదం’

అన్న హెడ్ లైన్ కనబడింది. శ్రీకాంత్ కోరుకునే ప్రచారం ఇది కాదు. మహేష్ హృదయం ముక్కలైంది. ఈ ఉద్యోగంలో చేరి, రెండు నెలలే అయ్యింది, అప్పుడే ఉద్యోగం పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు.

‘సీ-ఫేసింగ్ శ్రీ హైట్స్ సొసైటీ ఎలివేటర్ షాఫ్ట్‌లో ఇది రెండవ ప్రమాదం. ఎనిమిది నెలల క్రితం శివ్ కుమార్ (29) అనే కార్మికుడు ఇదే గుంటలో పడి మరణించాడు. నిర్లక్ష్యంతో, స్థలంలో పని చేస్తున్న కార్మికుడి మరణానికి కారణమైనందుకు బిల్డర్ శ్రీకాంత్ పటేల్‍పైన కేసు నమోదైంది. అయితే తదుపరి జరిగిన విచారణలో – ఆ కార్మికుడి మద్యం మత్తులో పై నుంచి జారి పడిపోయాడని తెలియడంతో శ్రీకాంత్ విడుదలయ్యారు.’

ఇది చదివి మహేష్ విస్తుపోయాడు. ఆ స్థలంలో ఓ కార్మికుడు మరణించాడన్న సంగతే అతనికి తెలియదు. అదే సొసైటీకి తనని మేనేజర్‍గా నియమించుకున్నప్పుడు ఈ వివరాలన్నీ చెప్పాల్సిన బాధ్యత శ్రీకాంత్‍కి ఉంది కదా. మిగిలిన వార్తను చదివేందుకు దినపత్రిక మడత విప్పగానే వార్త మధ్యలో రెండు ఫోటోలు కనబడ్డాయి.

‘సొసైటీ మేనేజర్, మహేష్ చౌబే (ఎడమ); మృతుడు శివ్ కుమార్ (కుడి)’

‘నన్ను అడగకుండా నా ఫోటో ఎలా వేస్తారు?’ అనుకున్నాడు మహేష్. కానీ కుడివైపున ఉన్న ‘శివ్ కుమార్’ ఫోటో చూడగానే అతని కనుబొమలు ముడిపడ్డాయి. అది బాగా పరిచయం ఉన్న ముఖంలా అనిపించింది. ‘కాని ఎలా… అయినా నిన్ననే…’ మహేష్‍కి మాట పెగ్గల్లేదు.

‘ఏ ఫ్లోర్ సర్?’ అని అడుగుతున్న లిఫ్ట్‌మాన్ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి.

ఆంగ్ల మూలం: సృష్టి త్యాగి

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here