హైదరాబాద్ సినీ చరిత్రపై వెలుగు కిరణం ప్రసరింప చేసే ప్రయత్నం ‘లోటస్ ఫిలిం కంపెనీ, హైదరాబాదు’

0
13

[శ్రీ హెచ్. రమేష్‍బాబు రచించిన ‘లోటస్ ఫిలిం కంపెనీ, హైదరాబాదు, తెలంగాణ సినిమా మూకీ యుగం’ అనే పుస్తకంపై సమీక్షని అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]పంచవ్యాప్తంగా ఎన్నెన్ని ఉద్యమాలు, పోరాటాలు జరిగాయో, ఎన్నెన్ని అస్తిత్వాలు సాధ్యమయ్యాయో అన్నిటికీ ప్రేరణగానూ, మద్దతుగానూ సాహిత్యం నిలవకపోతే ఏ ఉద్యమం, పోరాటం కూడా సఫలమయ్యేది కాదు. కాలక్రమేణా కాలగర్భంలో కలసిపోయినా వాటి గుర్తులుగా నిలచినదీ సాహిత్యమే. హెచ్. రమేష్‌బాబు రచించిన ‘లోటస్ ఫిలిం కంపెనీ, హైదరాబాదు తెలంగాణ సినిమా మూకీ యుగం’ అన్న పుస్తకాన్ని ఈ నేపథ్యంలో పరిశీలించాల్సి ఉంటుంది.

“తెలంగాణ ఉద్యమకాలంలో తెలుగు సినిమా గురించి వ్రాస్తూనే, అసలు తెలంగాణ సినిమా అన్నమాట మాట్లాడటానికి వీలు లేని చోట స్ఫూర్తివంతంగా పరిశోధన చేసి తెలంగాణ సినిమా చరిత్రను వ్రాయడానికి పూనుకున్నవాడు హెచ్. రమేష్‍బాబు” (స్ఫూర్తివంతమైన పరిశోధన – కె.వి. రమణాచారి)

“ఇంతకాలం విస్మృతమై, కనుమరుగై ఎవరికీ తెలియకుండా చరిత్ర పొర్లల్లో నిక్షిప్తమై ఉన్న తెలంగాణ తొలినాళ్ల సినిమా ప్రస్థానం గురించి ఈ గ్రంథం ఒక సంపూర్ణ దృక్పథాన్ని, ఒక సమగ్ర ఆలోచనను రేకెత్తిస్తుంది అనటంతో సందేహం లేదు.” (తెలంగాణా సినిమా చరిత్రపై సాధికారిక ప్రకటన – మామిడి హరికృష్ణ)

ఈ పుస్తకానికి ముందుమాటలలో వ్యక్తమైన పై అభిప్రాయాలు ఈ పుస్తక రచనలో రచయిత ప్రేరణను, లక్షాన్ని స్పష్టం చేస్తాయి.

“ఇది హైదరాబాదు మూకీల సినిమా చరిత్ర. హైదరాబాదుకు సినిమా చరిత్రేమిటి? అనే వాళ్ళకు మూకీల చరిత్రంటే మరింత ఆశ్చర్యం కలుగవచ్చు. ఎందుకంటే మనం ఒక ఆరు దశాబ్దాలకు పైగా ‘తెలంగాణ’ స్పృహ లేకుండా ఉండిపోయాము. అది ఎంతో కాలం కొనసాగలేదు. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నూతన చరిత్రలు ఆవిష్కృతమవుతున్నవి. ఈ నేపథ్యంలో వెలువడుతున్నదే ఈ ‘లోటస్ ఫిలిం కంపెనీ హైదరాబాదు, తెలంగాణ సినిమా మూకీ యుగం’ అని స్వయంగా రచయిత తన ముందుమాట ‘ఒక పదేండ్ల ప్రయాణం’ లో చెప్పుకున్నారు.

కాబట్టి ఈ పుస్తకం ఊపిరి పోసుకున్నదీ, ప్రాణం పోసుకున్నదీ, రూపుదిద్దుకున్నదీ ఒక ఉద్దేశంతో, లక్ష్యంతో అన్నది స్పష్టం. ఈ పుస్తకంలో రచయిత అందించిన వాస్తవాలు, విశ్లేషించిన చారిత్రక అంశాలను, పొరపాట్లుగా భావించి విమర్శించటం కన్నా రచయిత ఉద్దేశం, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇతరులు పరిశోధించి నిరూపించిన సత్యాలను విస్మరించటం కూడని పని. అందుకే రచయిత కొన్ని ఆధారాలు లేని ప్రతిపాదనలు చేసినా, అది తెలంగాణ ప్రత్యేకతను నిరూపించాలన్న తపనలో భాగంగా భావించాల్సి ఉంటుంది తప్ప ఈ పుస్తకంలో ఉన్నట్లుగా నిరూపితమైన చరిత్రగా అర్థం చేసుకోకూడదు.

తమ ఊహలనే నిజాలుగా ప్రచారం చేస్తూ, సూత్రీకరించి, సిద్ధాంతాలు చేస్తూ భారతీయ చరిత్రను వక్రీకరించి రాసేస్తు గొప్ప చరిత్ర రచయితగా పేరు పొందుతూ సన్మానాలందుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. భారతీయ చరిత్ర రచయితలు నిరూపిస్తున్న సత్యాలను పట్టించుకోకుండా భారతీయులను తక్కువ చూపించి, పూర్వీకులు పొరపాటని నిరూఫించి, న్యూనతా భావానికి గురిచేసి ఆధిక్యాన్ని సాధించాలని విదేశీ పాలకులు సృజించిన చరిత్రనే సత్యంగా భావిస్తూ, ప్రమాణికంగా ప్రకటిస్తూ ఇంకా బానిస మనస్తత్వాన్ని వదులుకోలేని వారు, చరిత్ర పుస్తకాలు నాలుగు చదివినంత మాత్రాన చరిత్ర రచయితలై తీర్మానం చేస్తున్నవారు తామరతంపరగా ఉన్న సాహిత్య ప్రపంచం మనది. వారితో పోలిస్తే, ‘పీప్‍ హోల్ షోలు’, సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలను సినిమా ఆరంభానికి ఒక అడుగుగా భావించటం  క్షమించరానంత దోషం ఏమీ కాదు. పైగా రచయిత ఆ ఆధ్యాయం పేరును ‘1896, హైదరాబాద్‌లో పీప్‌ హోల్ షోస్, మూకీల ప్రదర్శన’ అని ఉంచారు, తప్ప, ‘హైదరాబాద్‌లో తొలి సినిమా 1896’ అని పెట్టలేదు. దీని అర్థం జరిగిన మూకీ షోసే తరువాతి కాలంలో సినిమా అభివృద్ధికి ఒక అడుగుగా భావిస్తున్నట్లు రచయిత స్పష్టం చేస్తున్నారు. ఇతరులు భావించకపోతే అది వారిష్టం. రచయిత దోషం కాదు.

“Most film historiography has originated from the urban centers of Bombay, Madras, Calcutta and Lahore. Recent scholarship has looked at smaller cities such as Pune and Kolhapur. In all these histories, details of film production happening in a city like Hyderabad are a curious absence” అంటూ ‘Film in the Princely state: The Lotus film company of Hyderabad’ అన్న ఒక పరిశోధనాత్మక వ్యాసాన్ని ఆరంభిస్తుంది సి. యామినీ కృష్ణమూర్తి.

బ్రిటీష్ వారు పాలించిన ప్రాంతాలలో ఉన్న విధంగా, సంస్థానాలలో సినిమాలకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేవని, అందువల్ల ఆయా రాజ్యాలలో సినిమా అభివృద్ధికి సంబంధించిన వివరాలు సేకరించటం ఎంతో కష్టమైన పని అని “the absence of the archive on film can thus be thought of as one of the important reasons for the lack of work on early cinema in the non-colonial cities like Hyderabad”  అని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజకీయాలను రంగంలోకి  తీసుకురాకపోతే ఆమె అభిప్రాయం సబబైనదే అనిపిస్తుంది.

హైదరాబాదు నిజామ్ పాలనలో ఉండటం కూడా హైదరాబాదు సినీ చరిత్ర మరుగున పడటానికి కారణంగా పలువురు సినీ చరిత్ర రచయితలు భావిస్తారు. దాంతో, హైదరాబాద్ జాతీయ జీవన స్రవంతిలో గుర్తింపు పొందలేక, స్వతంత్ర పోరాట చరిత్ర లోనూ సరిగ్గా ఎక్కక రెంటికీ చెడ్డ రేవడి అయిందని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎలాగయితే భారతదేశంలో ఆవిర్భవించి ప్రజల భాషగా ఎదిగిన ఉర్దూ భాష, దేశ విభజన తరువాత ‘పాకిస్తాన్’ జాతీయ భాషగా నిర్ణయించటంతో, మన దేశంలో ముస్లింల భాషగా ముద్రపడి నష్టపోయిందో, అలాగే హైదరాబాద్‌లో సినీ నిర్మాణం కూడా మద్రాసులో సినిమా సాధించిన ప్రగతి నీడలో ఒదిగి, కేవలం సినీ పరిశ్రమ 1970 ప్రాంతాల్లో హైదరాబాదుకు మారటం పట్లనే అందరు సినీ చరిత్ర రచయితల దృష్టి కేంద్రీకృతం అనటం వల్ల కూడా హైదరాబాదు సినీ చరిత్ర విస్మృతిలో పడిందని పలువురు అభిప్రాయపడతారు. కారణం ఏదైనా, హైదరబాదు సినీ చరిత్ర – చరిత్ర చీకటి నీడలలో ఒదిగిందన్నది కాదనలేని సత్యం. ఆ చీకటి నీడల్లో ఒదిగిన హైదరాబాద్ సినీ చరిత్రపై వెలుగు కిరణం ప్రసరింప చేసే ప్రయత్నం చేసిన తొలి సినీ పుస్తకం ‘లోటస్ ఫిలిం కంపెనీ, హైదరాబాద్’ అన్నదీ అమోదించాల్సిన సత్యం. ఈ పుస్తకం గురించి విస్తృత చర్చలు జరపటం ద్వారా మరుగున పడిన అనేక సత్యాలు వెలికి వచ్చే వీలుంటుంది. ఇది వాంఛనీయమై విషయం. ఈ పుస్తకం ఉద్దేశం కూడా అదే. ఇంత వరకూ చర్చకు రాని విషయాల గురించి చర్చించటం ద్వారా సత్యావిష్కరణకు దారి తీస్తే , తద్వారా హైదరాబాదు సినీ చరిత్ర ఆవిష్కృతమైతే ఈ పుస్తకం   ప్రయోజనం నెరవేరినట్టే.

‘లోటస్ ఫిలిం కంపెనీ’ పుస్తకం ద్వారా మనకు సావే దాదా, హీరాలాల్ సేన్, స్వామి కణ్ణన్ విన్సెంట్ వంటి వారు, మహమూద్ మియా బండి, వంటివి పరిచయమౌతాయి. ముఖ్యంగా లోటస్ ఫిలిం కంపెనీ, ధీరేన్ గంగూలీ పరిచయమౌతారు. పుస్తకం ప్రధానంగా లోటస్ ఫిలిం కంపెనీ గురించే అయినా పుస్తక పరిథిని పెంచి  అందుబాటులో ఉన్న అనేక సంబంధిత  అంశాలను  ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ధీరేన్ గంగూలీకి నిజామ్ ప్రభుత్వం సహాయసహకారాలు లభించినట్టు లేదు. బయట నుంచి వచ్చిన వారు హైదరాబాదులో వ్యాపారం చేయటం కష్టమన్నట్టు వ్యాఖ్యానించాడు ధీరేన్ గంగూలి.  అతనికి ఆర్థిక సహాయం అతని సోదరుడి నుంచి లభించిందని, ఖర్చు తగ్గించటం కోసం అతని భార్య సీతాదేవి నటించాల్సి వచ్చిందనీ ధీరేన్ గంగులీ స్వయంగా చెప్పుకున్నారు. అందుకే ‘రజియా బేగం’ చిత్రం పట్ల అభ్యంతరాలు వ్యక్తం కాగానే కన్ను మూసి తెరిచేలోగా తట్టాబుట్టా పట్టుకొని ధీరేన్ గంగులీ కలకత్తా పోవాల్సి వచ్చింది. ‘నిజామ్ నుంచి అనుమతులు లభించి ఉంటాయి కానీ ప్రోత్సాహం లభించలేద’ని వ్యాఖ్యానిస్తారు సినీ చరిత్ర విశ్లేషకులు. హైదరాబాద్‌లో సినీ థియేటర్ల పై పన్ను లేకపోవటం  కూడా గంగూలీ హైదరాబాద్‌ను ఎంచుకోవటానికి ఒక కారణం అంటారు.

ఇంతవరకు మరుగున పడి అంతగా ప్రస్తావించని విషయాలను ప్రస్తావించి, వాటిపై వెలుగు ప్రసరింప చేసిన రమేష్‍బాబు అభినందనీయులు. ఇకపైనన్నా హైదరాబాదులో నిజామ్ కాలంలో సినిమాతో సహా ఇతర సామాజిక ప్రభావం కల కళల అభివృద్ధి, తీరుతెన్నులపై సమగ్ర పరిశోధనలు జరగటానికి ఈ పుస్తకం ప్రేరణగా నిలవాలని, నిష్పక్షపాతము,, నిర్దిష్టం అయిన సమగ్రమైన హైదరాబాదు సినీ  చరిత్ర వెలుగు చూస్తుందన్న ఆశను కలిగిస్తుందీ పుస్తకం.

***

లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాదు (తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 –1932)
రచన: హెచ్. రమేష్‌బాబు
పేజీలు: 160
వెల: ₹150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/lotus-film-company-hyderabadu
రచయిత: 7780716386
rameshbabuh99@gmail.com

 

 

~

‘లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాదు’ అనే పుస్తకాన్ని వెలువరించిన సినీ పరిశోధకులు హెచ్. రమేష్‍బాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ లింక్.
https://sanchika.com/special-interview-with-h-rameshbabu/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here