ఎలాంటి మసాలా లేకుండా సామాజిక సమస్యలు చూపిన ‘లవ్ స్టోరీ’

8
4

[dropcap]శే[/dropcap]ఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనగానే ఏదో యూత్‌ఫుల్  ప్రేమ కథ అనుకుని, క్యాజువల్‌గా సినిమా చూడటం మొదలు పెట్టిన కాసేపటికే “రూపాయి చేతి కిచ్చిండా? చేతిలో ఏసిండా? ఆళ్ళు వేరు, మనం వేరు. ఆళ్ళు.. మనం.. అన్నది పోనంత వరకు ఇది ఇంతే” అని హీరో తల్లి (ఈశ్వరీరావు) అన్న డైలాగ్‌తో ఉలిక్కి పడటం అవుతుంది. సినిమా మొత్తం ‘కులం’ పేరు ఎత్తకుండా కులాల వైరుధ్యాలు, సెన్సిటివ్ అంశాలను తెరమీదకు తెచ్చి, స్పష్టంగా తెలియజేసాడు దర్శకుడు.

అక్కినేని, దగ్గుబాటి వంశాలకు వారసుడైన నాగచైతన్య సినిమాలో ఎక్కడా కనపడడు. ఆర్మూర్ నుండి హైదరాబాద్‌కి జీవనోపాధి కోసం వచ్చిన, ‘జీరోలో కెళ్ళి వచ్చి, హీరో కావాలనుకుంటున్న’, జుంబా డాన్స్ సెంటర్ పెట్టి, స్వయంకృషితో ఎదగాలనుకొనే పేద యువకుడు ‘రేవంత్’ కనిపిస్తాడు.

అందమైన మౌనిక (సాయిపల్లవి) తిండి సరిగ్గా తిననట్టు బక్కగా వుండడం, బీటెక్ చదివినా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోవడం, బైక్ ఎక్కాలంటే భయపడటం, ఇంటర్వ్యూలు సరిగ్గా చేయలేక ఉద్యోగం సంపాదించలేక, చివరికి ప్రతి చిన్న టెన్షన్ విషయానికీ ‘చెక్కర్’ వచ్చి పడిపోవడం…. కొండచిలువ లాంటి బాబాయ్‌ని చూసి  భయంతో ద్వేషంతో అసహ్యంతో ఎందుకు వణికిపోతుందో కొంత ఊహించవచ్చు. కానీ ‘బి.టెక్’ అని,  20 ఎకరాల ఆసామి, మోతుబరి పటేల్ గారి అమ్మాయిని అన్న టెక్కు ముసుగులో ధైర్యంగా వున్నట్టు నటిస్తూ ఉంటుంది. కానీ తన పేరు లాగే అన్ని బాధల్ని, భావాల్ని లోపలే దాచుకొని కుమిలిపోయే అధైర్య.

ఉద్యోగం సంపాదించాలని పట్నం వచ్చి ఖాళీగా ఉంటే పరువు పోతుందని బాధపడుతున్న మౌని కి తన డాన్స్ సెంటర్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేరమని ఆఫర్ ఇస్తాడు రేవంత్. తన చదువుకు తగదని భావించినా,  ఫ్రెండ్  ప్రోత్సహించడంతో మొదట గొప్పగా 20 వేలు అడిగినా, చివరికి 15 వేలకి ఒప్పుకుంటుంది మౌని. లావుగా ఉన్న అమ్మాయిలు తమ ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఏం చెప్పాలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన రేవంత్ మౌని రాకతో ఊపిరి పీల్చుకున్నాడు. ఒకరోజు వర్షంలో హుషారుగా, స్వేచ్ఛగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా, నెమలిలా నాట్యమాడే మౌని ని చూసి  అమ్మాయిలు… అబ్బాయిలు కూడా డాన్స్ చేయడం, తర్వాత ఎక్కువమంది జాయిన్ అవటంతో రేవంత్ సంతోషపడ్డాడు.

ఇద్దరిదీ ఒకే ఊరు. కానీ ఒకే కులం కాదు. ఒకే అంతస్తు కాదు. పండగ సెలవలకి వూరు వెళ్ళినా ఎవరి దారి వారిదే.

డాన్స్ సెంటర్‌ని  డెవలప్ చేయాలంటే డబ్బు కోసం, ఉన్న అర్దెకరం పొలం అమ్మాలని రేవంత్ మౌని వాళ్ళ బాబాయ్ నరసింహం (రాజీవ్ కనకాల) దగ్గరికి వెళితే పదిలక్షల ఖరీదు చేసే పొలాన్ని ‘ఐదు లక్షలు’ అనడంతో తిరిగివచ్చేసాడు.

చివరికి తల్లిని ఒప్పించి పొలం కాగితాల్ని బ్యాంకులో షూరిటీ పెట్టి లోన్ తీసుకున్నాడు రేవంత్. మౌనికని బిజినెస్ పార్టనర్‌గా తీసుకున్నాడు.

“మౌనిక లేకపోతే నీ సెంటర్ నడపగలవా? అసలైనా ఈ బిజినెస్‌లు ‘మీ’కెందుకు? ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చుగా! ‘మీకు’ ఈజీగా దొరుకుతాయి కదా!” అన్న మౌనిక ఫ్రెండ్ మాటలకి షాక్‌లో, బాధలో, చికాకులో మునిగిపోయాడు రేవంత్. అదే సమయంలో మౌనిక వచ్చి “నిన్న నేను పిలిస్తే ఎందుకు రాలేదు? ‘మీరం’తా ఇంతే! ‘మిమ్మల్ని’ నమ్మటం అంటే నాశనం అయిపోవడమే” అని నోరు జారడంతో, ‘ మీరు’ అన్న మాటకి పూర్తిగా మానసికంగా దెబ్బతిని పార్ట్‌నర్‌షిప్ పేపర్స్ తెచ్చి “నువ్వు అవసరం లేదు” అని విసిరి కొట్టాడు.

తప్పు తెలుసుకున్న మౌనిక మర్నాడు వచ్చి ‘కన్విన్స్’ చేసి  ఐ లవ్ యు చెప్పింది. రేవంత్ మాత్రం కొంచెం మొహమాటంతో, ఎక్కువ సంతోషంతో “నేనైతే మొదటిసారి నిన్ను చూసినప్పుడే…” సంకోచంగా ఆగిపోయాడు. ఒకరికి ఒకరు… తోడుగా… కేరింగ్ గా… ప్రేమగా… రోజులు గడుస్తున్నంతలో —

తమ సెంటర్లోని గీతని ప్రేమించినందుకు పెద్దలు సన్నీని యాక్సిడెంట్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడం, అది తెలిసి గీత ఆత్మహత్య చేసుకోవటంతో, భయపడి తమ ప్రేమ విషయం అయినా ఇంట్లో చెప్పడం మంచిదని నిర్ణయించుకుంటారు ఇద్దరు. వాళ్లు చెప్పటం, పెద్దలు వ్యతిరేకించడం సహజంగానే జరిగిపోయింది. రేవంత్‌ని చంపడానికి నరసింహం మనుషులని పంపాడు.

తల్లిని, మౌనిని తీసుకొని, చేసేదేమీలేక, పారిపోతూ, ఆయాసంతో స్మశానం దగ్గర  ఆగినప్పుడు తల్లి అంటుంది – “ఒరేయ్, ఇది ఆళ్ళది రా” అని. “ఏది ఆళ్ళది కాదు! మన బతుకంతా ఆళ్లది. కాయకష్టం మనది, ఊరు ఆళ్ళది. ఏడకి పోదాం! ఎందుకు పోవాలా!” అంటూ కొండచిలువ ఇంటికి వెళ్ళాడు రేవంత్. ఇద్దరూ తలపడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నరసింహం మేడ మీద నుంచి కింద పడి మరణిస్తాడు.

తర్వాత ఏం జరిగింది? శిక్ష పడిందా లేదా? పెళ్లి చేసుకున్నారా? అన్న కథ అనవసరం. నాడు, నేడు ఇదే కథ. కానీ ఈ చిత్రంలో ఆద్యంతం మాటలు (బహుశా చైతన్య పింగళి, శేఖర్) బలమైన బాకుల్లా  ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సహజంగా, పాత్రల్ని కళ్ళ ముందు నిలిపారు. ఉత్తేజ్, దేవయాని మొ.

అశోక్ తేజ, మంగ్లీ ‘సారంగ దరియా’తో ఎప్పుడో పాపులర్ అయ్యారు.

“ఇల్లు, పొలం, చదువు, బుద్ధి, బుర్ర, ఉద్యోగం… ఏదైనా కానీ మనం మంచిగా బతకాల. మనం ఇచ్చే రోజు రావాల. మన చేయి పైన ఉండాల. దానికి చాలా కష్టపడాల”… ఇదే రేవంత్‌కి తల్లి చేసిన హితోపదేశం. కర్తవ్యబోధ. దాన్ని నమ్ముకొని ముందడుగు వేశాడు. అడుగడుగున ఎందరో “మీరు… మీరు..” అంటున్నా, ధైర్యంగా తను బతికి పదిమందికి బతుకునిచ్చేలా… తనకు వచ్చిన డాన్స్ తోనే మంచి సెంటర్‌ని నెలకొల్పాడు. “నీతోని కాదు,  నీతోని కాదు…” అన్న వారితోనే “నీ తోనే అయితది. నీతోనే అయితది…” అనిపించుకొన్నారు నాగచైతన్య, శేఖర్ కమ్ముల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here