…లు

1
11

[శ్రీ అనిల్ అట్లూరి రచించిన ‘…లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ద[/dropcap]క్షిణామూర్తి ఎడం చేతివైపు ఇండికేటర్ వేసి నెమ్మదిగా గేటు లోపలికి నడిపించాడు బండిని. సెక్యూరిటి మనిషి ఈలేస్తూ బండి పార్కు చేసుకోవడానికి స్థలం చూపించాడు. రెండిటి మధ్యన జాగ్రత్తగా నిలిపాడు. దిగి బండి వెనకకి వెళ్లగానే “దస్” అంటూ ఆ సెక్యూరిటి అతను పసుపు రంగు రసీదుని చేతిలో పెట్టాడు. “పది రూపాయలా?” అని మనసు మూలిగినా, పర్సు తీసి అందులో రెండు వంద రూపాయలనోట్ల మధ్యనున్న ఐదు పది రూపాయలనోట్ల నుండి, ఒక నోటుని అతనికి అందించాడు. అతనిచ్చిన పార్కింగ్ టికెట్‌ని పర్సు లోపలి అరలో ఒకవైపుకి దోపి దానిని పాంటు వెనుక జేబులోకి నెట్టాడు.

***

‘…లు’ గారంటే దక్షిణామూర్తిగారికి చాల గౌరవం. ఆయన దగ్గిర తన తండ్రి పనిచేసాడు. తండ్రి చెప్పినదానిని బట్టి ‘…లు’ గారి మంచితనంతోనే తన తండ్రికి ఉద్యోగం లభించింది. గుమస్తా ఉద్యోగమే ఐనా, ఇతర అర్హతలు లేకపోయినా విపరీతమైన ‘నమ్మకం’ అనే లక్షణం ఉండటం మూలకంగా ‘…లు’ గారు తమ కొలువులో చేర్చుకున్నారనేది జగద్విదితం. గిట్టని వాళ్ళు మాత్రం ‘…లు’ గారికి కావల్సింది “కుక్క లాగ విశ్వాసంతో కాళ్ళ దగ్గిర పడిఉండే జీవి” అన్నిన్నూ దానికి దక్షిణామూర్తి తండ్రి సరిగ్గా సరిపొయ్యాడు కాబట్టి అతనిని కొలువులోకి తీసుకున్నాడు అన్నిన్ను చెవులు కొరుక్కుంటూ ఉంటారు.

‘…లు’ అంటే దక్షిణామూర్తికి భక్తి కూడా ఉంది. ఎందుకంటే ‘…లు’ గారు తన ‘ట్రస్ట్’ ద్వారా అతని చదువులకయ్యే ఫీజులని స్కాలర్షిప్పుతో భరించేసారు. మరీ ఆ లక్ష్మీపుత్రుడి అనుగ్రహమునూ, సరస్వతీ దేవి కటాక్షం లేకపోతే తను ఏ సైకిల్ షాపులో మెకానిక్కుగానో, బట్టలకొట్లో గుమాస్తాగానో జీవితం గడుపుతూ వుండేవాడిని కదా అనుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు ‘లు’ గారు గోల్ఫ్ క్లబ్బులో కాడికి (caddy) ఇచ్చే టిప్పు, తాగివదిలేసే కౌర్వొఇజర్ (Courvoisier) గోల్డెన్ డ్రాప్స్ ధర, పళ్ళెంలో వదిలేసిన డంప్లింగ్స్ ఖరీదు మొత్తం కలిపితే అయ్యే ఖర్చులో బహుశ ఒక పదోవంతు ఉంటుందేమో దక్షిణామూర్తికి అందే నెలసరి భృత్యం.

***

అక్కడెక్కడో హిందు మహా సముద్రంలో ఏర్పడిన తుపాను గాలికి, ఇక్కడెక్కడో బందరు ఒడ్డున ఉన్న పొట్లకాయ తీగకున్న చిగురుటాకులా వణికిపోతున్నాడు దక్షిణామూర్తి. కారణం తనలాంటి వారికి ఇలవేలుపు, పూజ్యుడు, కుబేరుడు, నానా విధ సంపన్నుడు, దయామయుడు ఐన ‘…లు’ గారి ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త అతని చెవిన పడింది. అది విన్నప్పటినుంచి దక్షిణామూర్తి మనసు మనసులో లేదు. అది విన్నప్పట్నుంచి కాలు ఆడడం లేదు, చెయ్యి కదలడం లేదు. మెదడు పని చెయ్యడం లేదు. అలా ఉండిపొయ్యాడు అంతే. ఆ వార్త అంది కూడ పదిరోజులైనది. ఐనా ‘…లు’ గారింటికి వెళ్ళే ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. ఎందుకని? దక్షిణామూర్తి లాంటి మూడవ తరగతి వారికి డబ్బు మాత్రమే ధైర్యం ఇస్తుంది. మూడవ తరగతి వారెవరంటారా? డబ్బులుంటే కాని ధైర్యం చెయ్యలేని వారు, దేనికైనా. మరి నెలాఖరు రోజులు. ఇప్పుడు దక్షిణామూర్తి దగ్గిర డబ్బులేదు. ఐనా ఇక తప్పదు. నెలాఖరైనా సరే వెళ్ళి తీరాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు.

***

ప్రతి బుధవారం ఉదయం ‘…లు’ గారు, తన ‘గ్రేట్ డేన్’తో సుమారు 7 గంటల ప్రాంతలో ముచ్చట్లాడుకుంటారు. ఒక అరగంట సేపు. వారిద్దరి ముచ్చట్ల ఏకాంతానికి కాపలాదారుడు ఆ గ్రేట్ డేన్ ‘హాండ్లర్’ లాల్. పదాతిదళంలో పది సంవత్సరాలు పని చేసి రిటైరైన వాడు లాల్. డిసిప్లిన్ అంటే ఇష్టపడే ‘లు’ గారికి లాల్ లాంటి వాడు నచ్చకపోవడం ఉండదు. ఆ ముప్పై నిముషాలలోపు తనతో మాట్లాడానికి దక్షిణామూర్తికి చెప్పీ చెప్పక అనుమతినిచ్చారు ‘…లు’ గారు. తన విద్యాదాత వారికిష్టమైన, ప్రీతిపాత్రమైన మేలు జాతి శునకరాజముతో సంభాషిస్తునప్పుడే తనకి కూడ సమయం కేటాయించినందుకు దక్షిణామూర్తి కించిత్తు గర్విస్తున్నాడు కూడా!

ఆ రోజు మంగళవారం. ఆ నెలకు అదే ఆఖరి మంగళవారం కూడా. కాగా వచ్చే మొదటి వారాంతం లోపు దక్షిణామూర్తికి జీతం అందే అవకాశం ఉన్నా ఏ బందో, గిందో ఉంటే ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువ. కాబట్టి ఉన్న ఆ రెండువందల యాబై రూపాయలతోనే అంత వరకు నెట్టాలి. దక్షిణామూర్తి లాంటి వారు ఆలాంటి నిర్ణయం తీసుకోవడం సులభం కాదు.

దానికి కొనసాగింపే ఈ రోజు ఈ హైపర్‌మార్ట్‌కి రావడం. పెద్దవాళ్ళ దగ్గిరకి అందులోను ‘…లు’ లాంటి వారి దగ్గిరకి రిక్త హస్తాలతో వెళ్లకూడదని దక్షిణామూర్తికి తెలుసు. తన తండ్రి ఆచరించి చూపించాడు కూడా. దక్షిణామూర్తి తండ్రిగారు పెద్దవాళ్ల దగ్గిరకి వెళ్ళేటప్పుడు తన తాహతుకు తగ్గట్టు రెండో మూడో ఏవో కొన్ని ఫలాలు తీసుకెళ్ళేవాడు. అందులో ‘…లు’ గారి దర్శనార్ధం వెళ్ళేటప్పుడు మరీను. ప్రత్యేకంగా విదేశాలనుంచి దిగుమతి అయిన శ్రేష్ఠమైన వంగడానికి చెందిన ఫలాలని మాత్రమే కొనుక్కుని తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు దక్షిణామూర్తి అందుకనే ఈ హైపర్‌మార్ట్‌కి వచ్చాడు.

మరో వారం, పది రోజులు ఈ రెండు వందల యాభై రూపాయలతో గడపాలి. అందుకనే రెండు వందరూపాయల మధ్యనున్న ఐదు పదిరూపాయల నోటులలో ఒక నోటుని తీసి సెక్యూరిటి వాడికి ఇచ్చినప్పుడు అతని మనసు ఒక మూలుగు మూలిగింది. జీతం వచ్చిన తరువాత ‘…లు’ గారిని దర్శించుకోవచ్చు గాని అప్పటికే నాలుగు వారాలు అంటే ఒక మాసం గడిచిపోయింది ‘…లు’ గారు అనారోగ్యానికి గురై, ఆ వార్త తనకి తెలిసీ. పెద్దవారిది పెద్దమనసైనా, తనని “చిన్న మనిషి” అనుకుంటారేమోనని భయం.

ఎలాగన్నా సరే. ఈ బుధవారం వెళ్ళి వారిని దర్శించుకోవాలి. ఈ హైపర్‌మార్ట్‌లో ఆప్లికాయల్ని కొనుక్కుని తీసికెళ్ళి ఇస్తేనేగాని మనసు మనసులో ఉండదు. అందుకే ఈ రోజు ఈ పని పెట్టుకున్నాడు.

సెక్యూరిటి చెక్. డిటెక్టర్‌తో పైనుంచి క్రింది దాక స్కాన్ చేసాడు. స్వాగత సఖి (లాబీ మేనేజర్/హోస్టెస్) ప్లాస్టిక్కు నవ్వు నవ్వుతూ ఆ రోజున తమ స్టోరులో అందుబాటులోనున్న ఆఫర్ల గురించి వివరిస్తున్న బ్రోషర్‌ని అతని ముందుకు సాచింది. తీసుకోవాలా వద్దా ఆన్న సందేహంలో పడ్డాడు దక్షిణామూర్తి. తీసుకుంటే మొహామాటం కొద్ది తనకి అవసరం లేనివి కొనాల్సి వస్తుందేమో! తీసుకోకపోతే ఆమె తనని చిన్నచూపూ చూస్తుందేమోనని. ఆమె చిన్న చూపుని భరించలేనన్న నిర్ణయానికి వచ్చాడు. ఆమె చేతినుండి దానిని అందుకున్నాడు. ఇదంతా క్షణంలో వెయ్యోవంతులో జరిగిపోయింది. అందులో ఉప్పులు, పప్పులు, బట్టల సబ్బులు, కాయగూరల మీద తగ్గింపు ధరలు మాత్రమే ఉన్నవి. వాటిల్లో అతనిని ఆకర్షించినవి, కొనాల్సినవి ఏవి లేవు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ముందుకు నడిచాడు.

లోపలికి మరో అడుగు వెయ్యగానే, యూనిఫార్మ్‌లో ఉన్న ఒక యువతి కనపడింది. ఎవరికో కస్టమర్‌కి చేతులూపుతూ ఏదో చెబుతోంది. సేల్స్ గరళ్ అయిఉంటుంది అనుకుంటూ ఆమె వైపుకు వెళ్ళాడు దక్షిణామూర్తి. అతను ఆమెని చేరేటప్పడికి అమె మాట్లాడుతున్న వ్యక్తి వెళ్ళిపొయ్యాడు. పలుచటి మొఖం. నుదుట బొట్టులేదు. మెడకి ఏదో బిళ్ల. తాయొత్తో, ఫాషన్‌కి గుర్తో దక్షిణాముర్తికి అర్థం కాలేదు. “ఆప్లీకాయలెక్కడుంటాయండి?” అని ఆమెని అడగడం, “ఆ..” అని ప్రశ్నార్ధకంగా చూసి, “ఓ.. ఆపిల్సా.. ముందుకి వెళ్ళి లెఫ్ట్‌కి తిరగండి. ఆక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. అక్డ చూడండి” అంటూ చేతులూపుతూ చెప్పింది. ఆమె చేతులూపూతూ చెబుతున్నప్పుడు, భుజంమీద నుండి పైకి జరిగిన షర్ట్ స్లీవు క్రిందనుండి “పిల్లి” బొమ్మ (టాటూ) దక్షిణామూర్తి కళ్ళను తప్పించుకోలేదు. ఇందాక ఆమె మెడకి తగిలించుకుని కనపడింది తాయొత్తు కాదు, ఫేషన్‌గా వేసుకుందే అనే నిర్ణయానికి వచ్చేశాడు దక్షిణామూర్తి. విలువలు మారిపోతున్నాయి అని నిట్టూర్చుకుంటూ ఆమె చూపించిన వైపుకు సాగాడు దక్షిణామూర్తి.

నలు చదరంగా ఉన్న పెట్టెలలో వరుసగా పేర్చారు పళ్ళని. బత్తాయిలు. గోవాలు. బెర్రీలు. ఇంకేవో పళ్ళు కనపడ్డవి కాని వాటి పేరేంటో తెలియలేదు దక్షిణామూర్తికి. ఆప్లికాయలు మట్టుకు నిగ నిగా మెరుస్తున్నవి. కొన్ని ఎర్రగా ఉన్నవి, కొన్ని గులాబి రంగులో ఉన్నవి. దక్షిణామూర్తి ముట్టుకుంటే మాసిపోయెలాగా ఉన్నవి. ఒక పెట్టెలో వాటికి మట్టుకు ప్రతి పండుకి ఏదో తొడిగినట్టుంది. సందేహిస్తూ దాన్ని ముట్టుకున్నాడు. మృదువుగా తగిలింది వేళ్లకి. బహుశ పళ్ళు దెబ్బతినకుండా తగిలించి ఉంటారు అనుకున్నాడు దక్షిణామూర్తి. అక్కడే పళ్ళు సర్దుతున్న సేల్స్ గరళ్‍ని ఆ తొడుగు గురించి అడుగుదామని అనుకున్నాడు కాని, తనని పల్లెటూరు బైతు అనుకుంటుదేమోనని అనుమానించి ఆ ఆలోచన మానుకున్నాడు. వీటి ధర ఎంతో అనుకుంటూ తలెత్తి చూసాడు. కిలో ధర 249/- రూపాయలని చిన్న పలక మీద వ్రాసి ఉంది. గులాబి రంగు ధరవి ఎంతో అని చూసాడు. వాటి ధర 199/- కిలోకి. ఎర్రగా ఉన్నవాటి ధర ఎంతోనని చూసాడు. వాటి ధర కిలో 149/- మాత్రమే. ఎన్ని తూగుతయో ఇవి కిలోకి అనుకుంటూ అటూ ఇటూ చూసాడు. పక్కనే ఉన్న మధ్య వయస్కుడు ఆ కిలో 149/- వే ఏరుకుంటున్నాడు. బహుశ ఇంకా పిల్లలు సంపాదనాపరులై ఉండరేమో అనుకున్నాడు దక్షిణామూర్తి. తను చిన్నమనిషైనా, పెద్దవారికి వారికి తగినవే ఇవ్వాలికదా అదే కదా మన సంస్కారం అనుకుని ఆ 249/- రూపాయల ధర ఉన్న ఆప్లీకాయల వంక చూశాడు. ఏరుకుందామా అనుకుంటే అన్ని ఎర్రగా, బుర్రగా, ఆరోగ్యంగా, సలక్షణంగా, అందంగా డబ్బున్నవారి లాగానే కనబడ్డాయి. డబ్బుతో వచ్చిన సంస్కారం వంతమైన పళ్లలాగానే కనపడ్డవి కూడా.

ఇప్పుడు ఎన్ని ఎన్నుకోవాలన్నది సమస్య. మరి ఒకటి ఐతే మాత్రం తను తీసుకోడు. రెండు మరీ తక్కువ. మూడు పళ్ళు బాగానే ఉంటాయ్ కాని డజను పళ్ల ధరని తను భరించలేడు కదా! పది ఐతే? ఇంట్లో ఎంతమంది ఉంటారో. ‘…లు’ గారింట్లో భోజనానికి ఎంతమంది కూర్చుంటారో తనకి తెలియదాయే. ఒక పండుని చేత్తో తీసుకుని బరువుని తూచడానికి చూసినట్టు పైకి కిందకి ఎగరేసి చూసాడు. అబ్బే లాభం లేదు. అతనికి బరువు తెలియలేదు. పర్సులో మిగిలిందేమో 240/- మాత్రమే. ఇప్పుడేం చెయ్యాలో! దాదాపుగా కళ్ళు మూసుకుని చేతికి అందిన మూడు పళ్ళని అందుకున్నాడు. దగ్గిరలో యూనిఫార్మ్‌లో ఉన్న అమ్మాయి దగ్గిరకి వెళ్ళి, “ఈ మూడు ఆప్లికాయలు ఎంత అవుతాయ్, మేడం?” అని అడిగాడు. తనకన్నా వయస్సులో చిన్నదైనా “మేడం” అని సంబోధించేంత సంస్కారం తనకున్నదని ఆవిడకు తెలియబరచాలిగా మరి. తనేమి చిన్నమనిషి కాడు మరి. ఆ అమ్మాయి ఒక నవ్వు నవ్వింది. నవ్వి అంది కదా, “అక్కడ వెయ్ట్ చూసి చెప్తారు సార్” అని అంటూ తనే చొరవగా దక్షిణామూర్తి చేతిలోని పళ్ళని అందుకుంది.

వెయింగ్ స్కేల్ మీద ఆ మూడు పళ్ళని పెట్టింది. ఎర్రని ఎరుపు రంగులో దానికున్న స్క్రీన్ మీద అక్షరాలు వెలిగాయి. దక్షిణామూర్తికి కనబడి, అతని గుర్తు పట్టినవి అందులో మూడు సంఖ్యలు… 230/- దక్షిణామూర్తి మేధ క్షణాలలో లెఖ్ఖల్లో తేల్చేసింది, ఆ మూడు ఆప్లీకాయాలు కొంటే మిగిలిన పది రూపాయలతో మరో వారం గడపాలి అని. ఇక ఆలోచించడానికి వ్యవధి కూడా లేకుండా ఆ యూనిఫార్మ్‌లో ఉన్న అమ్మాయి, అలా వెయింగ్ మెషిన్ మీట నొక్కడం ఏమిటి, ఇలా అక్కడే వున్న ఒక జల్లెడ సంచిని అందుకోవడమేమిటి, ఆ మూడు ఆప్లీకాయలను ఆ సంచీలోకి జారవెయ్యడమేమిటి, ఆ సంచి మెడను అలా చుట్టేయడమేమిటి, ఈ లోపు గర గర అరుస్తూ, ప్రింటర్ నుంచి బయటపడ్డ స్టికర్‌ని ఆ సంచి మెడచుట్టూ అంటించడమేమిటి, ఆ సంచీని అందులో ఉన్నామూడు ఎర్రగా, బుర్రగా, ఆరోగ్యంగా, దక్షిణామూర్తి నాన్న నేర్పిన సంస్కారానికి ప్రతీకలైన ఆప్లీకాయలని దక్షిణామూర్తి అప్రయత్నంగా ముందుకి జాపిన చేతిలోకి నెట్టడమేమిటి ఒకదానెమ్మట ఒకటి జరిగిపోయినవి. ఈ లోపు దక్షిణామూర్తి నెత్తిన జుత్తు మధ్యలో మొదలై కిందకు ప్రయాణం సాగించిన స్వేదబిందువు, మెడమీద నుంచి, అతను ధరించిన షర్ట్ కాలరుని తడపకుండా వీపుకి అంటుకుపోయిన బన్నిలోని రెండు చిరుగులమధ్య నుంచి జారుకుని అతని నడుం మీదకి పాకింది. సరిగ్గా అప్పుడే దక్షిణామూర్తి కొద్దిగా విడివడిన తన పెదవులతో నోరుని మూసేసుకోవడం కేవలం కాకతాళీయం అని చూసిన వారు అనుకోవచ్చు!

ఆ సంచిని అరిచేతిలో పెట్టుకుని జాగ్రత్తగా పట్టుకుని ఎక్జిట్ గేటు దగ్గిరకి రాగానే, ధృడంగా, ఎర్రగా ఉన్న సెక్యూరిటి వాడు “బిల్ సాబ్” అని అడిగాడు. బిల్లు మీద ‘పెయిడ్’ స్టాంప్ వేయించుకుని పార్కింగ్‌లో ఉన్న తన వాహనం దగ్గిరకి చేరుకున్నాడు. పార్కింగ్ వాడు పళ్ళు ఇకిలించుకుంటూ వచ్చి ఇందాక అతనిచ్చిన రసీదుని అందుకుని వెళ్ళమన్నట్టు కళ్లతోనే సైగ చేసాడు. స్టార్టర్ బటన్ నొక్కి వాహన్నాన్ని నెమ్మదిగా హైపర్‌మార్ట్ నుండి రోడ్డు మీదకి బుధవారం వైపుకి మళ్ళించాడు దక్షిణామూర్తి.

***

ఆరున్నరకే స్నానపానాదులు ముగించుకుని తనకున్న వాటిలో మంచి బట్టలు వేసుకుని గుమ్మం దగ్గిరకు వచ్చి చెప్పులో కాళ్ళు పెట్టబొయేటప్పుడు వాటిని చూసి ఆగిపొయ్యాడు. వాటినిండా అంగుళం మందాన దుమ్మూ, మట్టి. దులిపేసి పాలిష్ చేసే సమయము లేదు. ఏం చెయ్యాలి? ఎడం చేత్తో వాటిని పట్టుకుని స్నానాలగదిలోకి వాటిని తీసుకెళ్ళి పంపు తిప్పి ఆ నీటిధారలో జాగ్రత్తగా వాటిని కడిగాడు. ప్లాస్టిక్ చెప్పులే కదా ఫరవాలేదు అనుకుంటూ. దుస్తుల మీద నీళ్ళు పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ చెప్పుల్ని అలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి నీళ్ళు చెదిరిపొయ్యేలా విదిలించిన తరువాత తన స్కూటర్ ఫుట్‌బోర్డ్ మీద పెట్టాడు. గుమ్మం దగ్గిర కాళ్ళు తుడుచుకునే పీచు మీద తన పాదాలని శుభ్రంగా తుడుచుకున్నాడు. పాదాలకు మళ్ళీ దుమ్ము అంటకుండా మడమల మీదే అడుగులు ఎత్తేత్తి వేస్తూ వాహనం దగ్గిరకి చేరుకుని కాళ్ళని జాగ్రత్తగా చెప్పులోకి దూర్చాడు. అప్పుడు అనుకున్నాడు.. అయ్యో కొంచెం ముందే లేచి చక్రాలు కూడ కడిగేసి ఉంటే బాగుండేది కదాని?

‘…లు’ గారు ఉండేది ఆ నగరంలోని అత్యంత భాగ్యవంతులు నివసించే ప్రాంతం కదా? అటువంటి ప్రాంతంలో ఆ రహదారులలో తను వాడుతున్న డొక్కు వాహనాలు ఉండవు కదా? మరి తన డొక్కు స్కూటర్‍తో, చెత్త ప్రదేశాలలో తిరిగి, ఆ చెత్తనంతా చక్రాలకు తగిలించుకుని ఆ వీధులలో తిరిగితే ఆవి మాసిపోవు?

***

వీధి మొదట్లనే ఒక బూమ్ బారియర్. దానికొక గార్డు. ఆ గార్డుకొక కాబిన్. ‘…లు’ గారిని చూడటానికి వచ్చానని దక్షిణామూర్తి గార్డ్‌కి తనని పరిచయం చేసుకుంటూ చెప్పాడు. గార్డు, నీలాంటి దరిద్రనారాయణుడితో ‘లు’ గారికి పనేముంటుందని అన్నట్టుగా చూసాడు. కాబిన్ గోడకి తగిలించున్న ఫోనుతో ఎవరికో ఫోను చేసాడు. బహుశ ‘…లు’ గారింటికేమో అవతలవాళ్ళు సరే అన్నట్టున్నారు. విజిటర్స్ బుక్‌లో దక్షిణామూర్తి పేరు, విలాసం, ఫోను నెంబరు, ఎవరిని కలవడానికి వచ్చింది, అది వ్యక్తిగతమా, అధికారికమా, వచ్చిన సమయం, తేది, సంతకం వ్రాయించుకున్నాడు. ‘…లు’ గారి ఇల్లు తెలుసా అని అడిగాడు. ఎందుకైన మంచిదని కాబిన్ బైటకి వచ్చి బారియర్ పోల్‌ని పైకి లేపి, దక్షిణామూర్తికి ‘…లు’ గారింటికి చేరడానికి సూచనలు ఇచ్చి వెళ్లమని సంజ్ఞ చేసాడు.

ఆ వీధి చివర ఎడమచేతి వైపు ఇల్లు. నడుమెత్తు ప్రహరిగోడ ఐనా ఇల్లు కనపడలేదు. ఇల్లు కనపడకుండా ప్రహరిగోడకి ఆనుకుని అందంగా ఏపుగా పూలతో నిండిన రకరకాల చెట్లు. వాటి మధ్య నుంచి రెండు కళ్ళూ క్రూరంగాను, తీక్షణంగా చూస్తున్నవి. అవి తననే చూస్తున్నాయని గ్రహించి దడుచుకున్నాడు దక్షిణామూర్తి. తన ముట్టెని ప్రహరిగోడ అంచుమీద ఉంచి చూస్తోంది, చెవులు రిక్కించి వింటోంది, ముట్టెతో వాసన పట్టడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు అడుగు పొడుగున్న దాని నాలుక, దక్షిణామూర్తి కుడి చేతిలో ఉన్న ఆప్లికాయల్లగానే ఎర్రగా ఉంది. పొట్టిగా ఉన్న తోకని నిటారుగా నిలబెట్టి ఉద్రేకంగా విసురుగా అటూ ఇటూ విసురుతూ గుర్రు మంటోంది. గోడ దూకుతుందా, అడుగు వేసి దాటుతుందా? తమ పరిస్థితి ఏమిటి? ముందుకు వెళ్ళాలా? పలాయన మంత్రం పఠించాలా? ప్రహరీగోడ అంత ఎత్తున్న మేలుజాతి జాగిలం అది. “ప్రిన్స్, బి యె గుడ్‍బాయ్,” అంటూ ఈ లోపు ఎవరిదో గొంతు వినపడింది. వినడానికా అంటూ చెవులు వెనక్కి కదిలించి “బ్రతికావు ఫో” అంటునట్టుగా ఒక చూపు చూసి, చాలా నిర్లక్షంగా వెనక్కి తిరిగి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ముచ్చెటమలు పట్టిన దక్షిణామూర్తి జేబురుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. కుడి చేతిలో 230/- రూపాయల ఆప్లీకాయలు భద్రంగానే ఉన్నాయి. గేటు దగ్గిరకి వెళ్ళాడు. ఎవరూ లేరు అక్కడ. గేటుని ఎలా తెరవాలో కూడ తెలియకపోయింది దక్షిణామూర్తికి. కానీ ఈ లోపు ‘ప్రిన్స్’ చేసిన పనిని గుర్తించాడు కాబోలు, ఖాక్కీ నిక్కరు, తెల్లని బన్ని, కాన్వాస్ షూస్ ధరించిన వ్యక్తి బహుశ హేండ్లర్ ‘లాల్’ ఏమో వచ్చి గేటు తెరిచాడు. దక్షిణామూర్తి గేటు దాటాడు. ‘…లు’ గారింటి ప్రహరిలోకి అడుగుపెట్టాడు. ఒకవిధమైన వణుకు దక్షిణామూర్తి తల దగ్గిరనుంచి పాదాల వరకు జెర్రిగొడ్డులా పాకి భూమిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఒక లిప్తలో.

“కమాన్, యంగ్ మాన్,” అంటూ వినిపించిన వైపుకు చూసాడు దక్షిణామూర్తి. మల్లెపూవంత తెల్లగా, స్వచ్చంగా ఉన్న టీ షర్ట్, ఖాఖీ షార్ట్స్, కాళ్ళకి సాక్స్, వాటికి తగ్గ షూస్. అవన్ని కలిపి సుమారుగా ఒక పాతికవేలు చెయ్యవూ అనుకోకుండా ఉండలేకపొయ్యాడు దక్షిణామూర్తి. వాటిని ధరించిన ‘…లు’ గారు ఒక బుల్లి మోడా మీద కూర్చుని కనపడ్డారు. మోడా చక్కగా చెక్కిన కొండ రాయి మీద ఉంది. కొండరాయి నలుచదరంగా ఉంది. అలాంటి నలుచదురంగా ఉన్న అనేక కొండరాళ్ళు విశాలంగా పరిచి ఉన్నయి. రాతికి, రాతికి మధ్య అరంగుళంకంటే తక్కువున్న ఖాళీలో అంగుళం మాత్రమే పెరిగిన చిక్కని పచ్చని గడ్డి చక్కగా పెరిగి తమ హద్దులని ప్రకటిస్తున్నాయి. ఆ కొండరాళ్లలోనుంచి అటువైపున వెలిసిన గోడ రంగు చిక్కని గోధుమ రంగు. అందులోనుండి లోపలికి వెళ్ళడానికి పెద్ద ద్వారం. నగిషీలు చెక్కి ఉన్నది. ఓ పది లక్షలు ఖరీదు చెయ్యదూ అని అనుకోకుండా ఉండలేకపొయ్యాడు దక్షిణామూర్తి.

“హల్లో యంగ్ మాన్, హౌ ఆర్యూ?” అంటూ పలకరించారు ‘…లు’ దక్షిణామూర్తిని.

“బాగున్నాను సారు” అని జవాబిచ్చాడు దక్షిణామూర్తి.

‘..లు’ గారు ఇంకా అటే శునకరాజం వైపే తిరిగిఉన్నారు. ప్రిన్స్ ఆయన ముందు నిలబడి ఉంది. దాని భుజాలు ‘..లు’ గారి కంటే ఎత్తులో ఉన్నాయి. దాని మెడకి అరంగుళం మందాన ఉన్న బంగారు రంగు గొలుసుని అటూ ఇటూ తప్పిస్తూ ‘…లు’ గారు తమ కుడిచేత్తో నెమ్మదిగా ఆ మెడని రుద్దుతూ, కండరాలని సర్దుతూ, పాముతున్నారు. ఎడమచేత్తో దాని చెవుల వెనుక మునివేళ్ళతో సుతారంగా గోకుతూ, తలని నిమురుతూ అలా ఉన్నారు. దక్షిణామూర్తికి ‘…లు’ గారి వీపు కనపడుతున్నది. “ప్రిన్స్” అవకాశం ఇస్తే మీద పడి కొరికేద్దామా అని చూస్తున్న కోరచూపులు కనపడుతున్నవి దక్షిణామూర్తికి. లాల్‌కి యోగదృష్టి ఉందేమో! దక్షిణామూర్తి వెనుక నిలబడ్డాడు, ఒక వేళ దక్షిణామూర్తి కోరిక నిజమైతే పారిపోకుండా ఆపుదామన్నట్టు. దక్షిణామూర్తి కుడి చేతిలోని ఆప్లికాయల సంచిని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు. ఎడమకాలు మీద బరువుని కుడి కాలుమీదకి మార్చుకున్నాడు. తలని కాస్త కిందికి వంచాడు.

‘లు’ గారు తనవైపు తిరగడం చూడలేదు కాని దక్షిణామూర్తి గ్రహించాడు.

“హవ్స్ యువర్ జాబ్?”

“బాగుందండి”

“సారు గారు.. తమరి ఆరోగ్యం ఎలాగుంది?” అని అడిగాననుకున్నాడు దక్షిణామూర్తి. కాదు అడుగుతున్నాననుకున్నాడు… గొంతు పెగలందే.

ఎడమకాలు మీద బరువుని కుడి కాలుమీదకి మార్చుకున్నాడు.

అప్పుడు గుర్తువచ్చింది. ఎడమచేతిలో ఉన్న ఆప్లీకాయల సంచి.

కుడి చేతిలోకి మార్చుకుని ఆ సంచిని తడబడుతూ మోటుగా ‘లు’ గారి వైపుకి సాచాడు.

వారికి అర్థం కాలేదేమో అనుకునేలోపే… వారికి అర్థం అయ్యి కుడిచేత్తో దాన్ని అందుకున్నారు, చిన్నగా నవ్వుతూ… “యూ అర్ లైక్ యువర్ డాడ్,” అంటూ. ఆ సంచిని అలా విసిరెయ్యలేదు. తనముందు నిలబడి ఉన్న ప్రిన్స్ ఎడంకాలి పాదానికి ఆరు అంగుళాల దూరంలో ఎడంచేతివైపే పెట్టారు. దక్షిణామూర్తి మనసు పులకిరించిపోయింది. ప్రభాతసమయంలో నిర్మలమైన వెచ్చని సూర్యుడి కిరణాలలో స్నానం చేసినట్టపినించింది. మేను అపాదమస్తకం ఒక్కసారిగా జలదరించింది. మనసులోనే తన తండ్రికి నమస్సులు తెలుపుకున్నాడు. ఆ మహానుభావుడితో పోల్చిన ‘…లు’ గారి వ్యక్తిత్వం తాటిచెట్టుకంటే పొడుగయ్యంది అతని దృష్టిలో.

“వెళ్దామా అయ్యా?” అంటు గొంతు వినిపించినవైపు వెనక్కి తిరిగి చూశాడు దక్షిణామూర్తి. ఎప్పుడు వచ్చాడో గాని, బులుగు రంగు యూనిఫార్మ్‌లో, నల్లగా నిగ నిగలాడుతున్న షూస్ వేసుకుని, వినయం ఉట్టిపడుతూ నిలబడి ఉన్నాడు, ‘…లు’ గారి కారు డ్రైవరు నూకరాజు. పలకరింపుగా నవ్వాడు దక్షిణామూర్తి. నూకరాజు కూడా అలాగే నవ్వాడు అని అనుకున్నాడు.

“టేక్ ఇట్, నూకరాజు,” అంటూ దక్షిణామూర్తి అందించిన ఆప్లీకాయల సంచిని తన కళ్ళతోనే చూపించారు ‘…లు’ గారు. “అయ్యా,” అంటూ ముందుకు వంగి రెండుచేతులతోను దానిని అందుకున్నాడు. ముడి విప్పి ఆ సంచి లోపలున్న మూడు ఆప్లీకాయలను బయటకు తీసాడు.

“మూడున్నయ్ అయ్యా,” అని చెప్పాడు.

“యూ టేక్ వన్,” అన్నారు ‘…లు’ గారు.

“గ్యివ్ వన్ టు లాల్,” అని మళ్ళీ అన్నారు. ఒకటి తను తీసుకుని, రెండవది ‘లాల్’కి అందించాడు.
“సో దేరిజ్ ఒన్మోర్ లెఫ్ట్, ఇజిట్? గ్యివ్ ఇట్టు వెంకి” అన్నారు ‘…లు’ గారు.

వెంకి అని పిలవబడుతున్న వెంకయ్య ‘…లు’ గారి తోటమాలి.

“లెట్స్ మీట్ అగైన్ సం టైమ్ లేటర్ మై బాయ్,” అంటూ లేచి ముందుకు సాగారు ‘…లు’ గారు. ప్రిన్స్ వారి పాదాలవెమ్మట వారి అడుగులో అడుగువేసుకుంటూ గంభీరంగా, రాజసంగా కదిలింది. ముందు డ్రైవర్ నూకరాజు, వెనుక ‘…లు’ గారు, వారి వెనక వారి అద్భుతమైన మేలిమి వంగడానికి చెందిన శునకరాజము ‘ప్రిన్స్’, వరుసలో ఆఖరువాడిగా లాల్, ది డాగ్ హేండ్లర్. వారందరితోపాటే ‘…లు’ గారి సంస్కారమున్ను.

తరతరాలుగా, ఒక తరం నుంచి మరో తరాన్ని అందుకుంటూ వచ్చిన “సంస్కారం”తో పునీతుడైన దక్షిణామూర్తి భూమిలోకి పాతేసిన విగ్రహంలాగా అక్కడే నిలబడిపొయ్యాడు. అతనితో పాటే అతని తండ్రినుంచి నేర్చుకున్న సంస్కారమూను.

(పెపంచకంలో శ్రీనివాసులు లు చాలామందున్నారని తన పేరుని ముచ్చటాగా ఏకాక్షర నామధేయం ‘లు’ గా మార్చుకున్న వారైతిరి ఈ భాగ్యవంతులైన పిదప సంస్కారవంతులైన ఈ శ్రీనివాసులు గారు!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here