ఎం.హెచ్‌.కె.-10

0
5

[box type=’note’ fontsize=’16’] సన్నిహిత్ గారు వ్రాసిన ‘ఎం.హెచ్.కె.’ అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది 10, చివరి భాగం. [/box]

[dropcap]ర[/dropcap]ఘురామయ్య గారి ఇంట్లో ఆత్మీయ సమావేశం జరుగుతోంది. భార్య సావిత్రమ్మ, కూతురు, అల్లుడు, మనవరాలు, కళ్యాణ్‌, రంగడు ఇంకా మిగతా పనివాళ్ళు అందరూ ఉన్నారు.

చాలా సంతృప్తిగా ఉంది ఆయనకు. ఇన్నాళ్ళకు ఇల్లు అందరితో కళకళలాడసాగింది. అయితే ఈ ఆత్మీయ సమావేశం వెనక ఉన్న కారణం అప్పటికే జననికి లీక్‌ అయింది. అందుకే కొంచెం సిగ్గుపడుతూ తలవంచుకుని కూర్చుంది. కళ్యాణ్‌ మాత్రం ఇంత మంది ఆత్మీయుల మధ్య కూర్చోవడం వల్ల వచ్చిన సెక్యూరిటీ ఫీలింగ్‌తో ఆనందంగా ఉన్నాడు.

రఘురామయ్య గారు గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించారు.

“జనని.. నాముద్దుల మనవరాలు. ఈ చేతులతో ఎత్తుకుని అల్లారు ముద్దుగా పెంచాను. అలాంటి పసికందు ఇప్పుడు పెరిగి పెద్దదై యుక్తవయసుకి వచ్చింది. తన మనసుకు నచ్చిన వాడిని ఎన్నుకుంది. అతన్ని వివాహం చేసుకోవాలని కలలు కంటోంది. దానికి మనందరి ఆమోదం కావాలి. ముఖ్యంగా నా కూతురు, అల్లుడు ఒప్పుకోవాలి. దీనికి మీరేమంటారు” అని ఆగారు.

అందరూ ఒక్కసారిగా ‘ఓ’ అన్నారు.

“అయితే ఇప్పుడు జనని తన మనసు గెలుచుకున్న అబ్బాయి పేరు చెప్పాలి” అన్నారు

“అవును చెప్పాలి… చెప్పాలి” అని అందరూ గట్టిగా అరవసాగారు. జనని విపరీతంగా సిగ్గుపడింది. కానీ అందరూ ‘చెప్పాలి, చెప్పాలి’ అని అరుస్తుండటంతో నెమ్మదిగా తల పైకెత్తింది.

చిన్నగా ‘కళ్యాణ్‌’ అంది.

“ఏంటీ… మాకు వినపడ్లేదు… మళ్ళీ చెప్పాలి” అని అందరూ అరిచారు.

జనని “నేను అన్ని సార్లు చెప్పను. ఇంకొక్కసారి చెబుతాను” అని మెల్లగా ‘కళ్యాణ్‌’ అంది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. కళ్యాణ్‌ జననిని ప్రేమగా చూసాడు.

పల్లవి, సాయిక్రిష్ణ ముక్త కంఠంతో “కళ్యాణ్‌ మాకు నచ్చాడు… అతనే మా అల్లుడు” అని ఆనందంగా చెప్పారు.

రఘురామయ్య గారు కళ్యాణ్‌ని దగ్గరకు రమ్మని పిలిచి “బాబూ… చూసావా… ఇంతమంది గారాల పట్టి మా జనని. దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాము. ఎంత బాగా చూసుకుంటావో అన్నది నీ ఇష్టం” అన్నారు.

“చాలా సంతోషం అండీ” అంటూ ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించాడు.

“లే బాబూ… లే…” అని భుజాలు పట్టి లేపి ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని దీవించారు. తర్వాత అందరూ భోజనాలకి కూర్చున్నారు. ఇన్నాళ్ళ తర్వాత కళకళ లాడుతున్న ఆ ఇంటిని చూసి ఆనందాశ్రువులు కార్చాడు రంగడు.

***

పంకజం విష్ణువర్ధనరావ్‌గారి ఇంటికి వచ్చింది. భుజంగం ఆమెను చివరికి ఒప్పించి అక్కడికి పంపించాడు. ఆమెను చూడగానే విపరీతంగా పొంగిపోయాడు విష్ణువర్ధనరావ్‌.

“రా పంకజం… రా” అంటూ ఆహ్వానించాడు.

సిగ్గుపడుతూ లోనికి వచ్చింది పంకజం.

“ఇంట్లో ఎవరూ లేరా” అంది.

విష్ణువర్ధనరావ్‌ నవ్వుతూ “ఎవరో ఎందుకు… నువ్వున్నావు గా” అంటూ ఆమెను కౌగలించుకున్నాడు. గువ్వలా ఒదిగిపోయింది పంకజం. నెమ్మదిగా ఆమెను బెడ్రూము లోకి తీసుకెళ్ళాడు విష్ణు.

చల్లటి ఏసీ ఒక్క సారిగా ఒంటిని చుట్టేసింది.

“అబ్బా, ఆ ఏసీ ఆపెయ్యండి” అంది పంకజం. ‘సరే’ అని ఆపేసాడు.

బెడ్‌మీద వాలగానే ఆమె ఒంటి మీద వస్త్రాలని ఒక్కొక్కటిగా తీసేసాడు. నిండైన విగ్రహం పంకజానిది. ఆమెను అలా చూడగానే విష్ణువర్ధనరావ్‌ ఒంట్లోని నరాలన్నీ ఒక్కసారి జివ్వు మన్నాయి. తను కూడా బట్టలు తీసేసి ఆమె మీద దాడి చేసాడు. ఆమెను తృప్తిగా అనుభవించడంలో మునిగిపోయాడు.

రశ్మి తన తండ్రిని కలుద్దామని ఇంటికొచ్చింది. పని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంట్లోకొచ్చి “డాడీ..డాడీ..” అని పిలుస్తూ బెడ్రూము దాకా వచ్చింది.

లోపలి నుండి ఏవో శబ్దాలు వినబడటంతో ఆగి పోయింది. బెడ్రూము తలుపు లోపలి నుండి లాక్‌చేసి ఉండటంతో లోపల తన తండ్రి ఎవరితోనో ఉన్నాడని స్పష్టంగా అర్థమైంది. లోపల జరుగుతున్న కార్యక్రమం కూడా ఆమెకు అర్థమైంది.

నిస్సత్తువగా అనిపించి వెనుతిరిగి బయటకు వచ్చేసింది. ఆ క్షణం ఆమెకు రవి గుర్తుకొచ్చాడు. అతనితో అటో ఇటో తేల్చుకోవాలని అనుకుంది. వెంటనే అతనికి కాల్‌చేసింది.

చాలా సేపు రింగ్‌ అయ్యాక ఫోన్‌ ఎత్తాడు రవి.

“హలో… ఎవరూ…” అన్నాడు. ఆశ్చర్యపోయింది రశ్మి. తన నెంబర్‌ కూడా అతను గుర్తుపట్టలేదన్నమాట. అదీ అతని జీవితంలో తనకున్న స్థానం.

“నేను రవీ.. రశ్మిని” అంది అభిమానాన్ని చంపుకుంటూ.

“ఓ… నువ్వా… నేను నీకింకా గుర్తున్నానా…” అన్నాడు.

“అదేంటి రవీ… నిన్నెలా మర్చిపోతాను…” ఆశ్చర్యంగా అంది.

“ఎందుకు మర్చిపోవు… పగలు నీ చుట్టూ ఎప్పుడూ ఊరివాళ్ళు… రాత్రిళ్ళు ఆ కళ్యాణ్‌గాడు… ఎందుకు మర్చిపోవు” వ్యంగ్యంగా అన్నాడు.

హతాశురాలైంది రశ్మి. ఇదేనా రవి తనని అర్థం చేసుకున్నది? గుండె ముక్కలైనట్టు భావించింది. ఇక రవితో మట్లాడటం వృథా అనిపించింది. కానీ అతని అపోహలు తొలగించాలి…అందుకే –

“చూడు రవీ… నువ్వనుకున్నట్టు అంత శీలం లేని దాన్ని కాను నేను. కళ్యాణ్‌ నాకు మంచి మిత్రుడు. అంతే… అయినా అలాంటివి నీకు చెప్పినా అర్థం కాదు… గుడ్‌బై” అని ఫోన్‌ పెట్టేసింది.

ఆమె చెంపల మీదికి కన్నీళ్ళు జారాయి. తుడుచుకుని ‘నేను రవికి అక్కర్లేకపోవచ్చు. కానీ ఊరి ప్రజలకు కావాలి.. నా జీవితాన్ని వాళ్ళకే అంకితం చెయ్యాలి’ అనుకుంటూ ఊరి వైపు కదిలింది.

***

కల్యాణ్‌ పంపించిన రిపోర్ట్‌ని ప్రభుత్వ యంత్రాంగానికి చూపించాడు ప్రొఫెసర్‌ బ్రహ్మం.

ఆ రిపోర్ట్‌ ఆధారం చేసుకుని… ప్రొఫెసర్‌చెప్పినది నమ్మి వెంటనే ఒక పోలీసు బెటాలియన్‌ ఆ ఊరికి పంపించబడింది. వాళ్ళు యుద్ధప్రాతిపదికన ఆ భూగృహాన్ని, అందులోని ఎక్విప్మెంట్‌ని పూర్తిగా తమ ఆధీనం లోకి తీసుకున్నారు. ఈ మానవజాతి విధ్వంసక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్‌ చేసారు. ఈ హడావుడి అంతా సద్దు మణిగాక ఊరి వాళ్ళందరూ రఘురామయ్య గారి ఇంటి ముందు గుమిగూడారు.

“అయ్యా… రఘురామయ్య గారూ… ఒక్కసారి బయటకి రండి” అంటూ అందరూ ముక్తకంఠంతో పిలిచారు.

రఘురామయ్య గారు కండువా సరిచేసుకుంటూ బయటకు వచ్చారు. ఇంటి ముందు జనం. ఊరు ఊరు అంతా కదిలి వచ్చినట్టున్నారు.

ఊరి ప్రెసిడెంట్‌ “అయ్యా… మీ ఇంటిలో ఉన్న కళ్యాణ్‌ దయవల్ల ఈ ఊరికి పెద్ద ఉపద్రవం తప్పింది. మన ఊరి పొలాలు… దుర్మార్గుల చేతుల్లో పడకుండా కాపాడబడ్డాయి. అదేదో మనుషులు మన భూమికి హాని తలపెట్టడానికి చేసే దుష్టకార్యం పోలీసులు ఆపేసారు. ఇంతకంటే ఏం కావాలి… మన ఊరికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పడానికి” అన్నారు.

రఘురామయ్య గారు ఆనందంగా చూస్తూ “అవును… మా కళ్యాణ్‌ సామాన్యుడు కాడు… ప్రాణాలకు తెగించి ఈ ఊరిని… ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని కాపాడాడు. అతన్ని ఎంత పొగిడినా… ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే! నా నీడన ఉంటూ ఇన్ని మంచి కార్యాలు చేసిన కళ్యాణ్‌ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీకో విషయం చెప్పాలి. త్వరలోనే కళ్యాణ్‌ మా ఇంటి మనిషి కాబోతున్నాడు. నా మనవరాలు జననిని అతనికిచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నాము” అన్నారు.

జనం చప్పట్లు కొడుతూ తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేసారు.

“జననికి కళ్యాణ్‌ కరెక్ట్‌ జోడీ!” అంటూ కుర్రాళ్ళు కేకలు పెట్టారు. అక్కడే ఉన్న జనని తల్లిదండ్రులు పల్లవి, సాయిక్రిష్ణ ఊరి జనం ఆనందాన్ని చూసి సంతృప్తిగా నవ్వుకున్నారు.

ప్రెసిడెంట్‌, జనం అందరినీ చూస్తూ “ఇన్నాళ్ళూ మనం ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మాం. దయ్యాలని చూసి మన బ్రతుకులు బాగుచేసే దేవుళ్ళని భ్రమపడ్డాము. కానీ ఆ భగవంతుడి దయవల్ల తొందరగానే ఆ దయ్యాలు తలపెట్టిన ప్రమాదం నుండి బయటపడ్డాము. ఈ రోజు నిజంగా మనకు పండగ రోజు. అన్నిటికంటే ముఖ్యంగా రఘురామయ్య గారి కుమార్తె పల్లవి… మన ఊరి అమ్మాయి మళ్ళీ ఇన్నాళ్ళకి మన ఊరికే చేరుకోవడం ఎంతో గొప్ప విషయం. అది మనందరికీ నిజమైన ఆనందాన్ని పంచే అద్భుత విషయం. ఇక మీదట మనందరం ఐకమత్యంగా ఉంటూ మరింత గొప్పగా అభివృద్ధి చెందుతామని ఆశిస్తున్నాను” అన్నాడు పొలిటికల్‌ స్టైల్లో. అందరూ చప్పట్లు కొట్టారు.

రఘురామయ్య గారు “ఇంతదాకా మీరు ఎన్నో మాట్లాడారు… కానీ ఎంతో బాగా చదువుకొని, తన చదువుని ఈ ఊరికే ఉపయోగించాలని కంకణం కట్టుకుని మనందరికీ ఎంతో సేవ చేస్తున్న డాక్టర్‌ రశ్మికి మనందరం ఋణపడి ఉన్నాము. మీరంతా ఆమెకు జేజేలు పలకాలి” అన్నారు.

జనమంతా “డాక్టరమ్మకు జిందాబాద్‌… డాక్టరమ్మకు జిందాబాద్‌” అంటూ అరవసాగారు. రశ్మి అందరికీ చేతులెత్తి దండం పెట్టింది.

రాము తన తల్లిదండ్రుల పక్కన చేరి చప్పట్లు కొట్టసాగాడు. అందరూ అతన్ని మృత్యుంజయుడిలా చూడసాగారు.

రోడ్డు పైన ఉన్న గాంధీ తాత విగ్రహం ఆ ఊరి జనం సంతోషాన్ని చూసి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్నట్టు బోసి నవ్వులు నవ్వసాగింది.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here