ఎం.హెచ్‌.కె.-3

0
9

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత సన్నిహిత్ వ్రాసిన “ఎం.హెచ్.కె.” అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది మూడవ భాగం. [/box]

[dropcap]భు[/dropcap]జంగం!

ప్రతీ ఊరి లోనూ ఒక విలన్‌ ఉంటాడు. ఈ ఊరికి ఉన్న విలన్‌ అతను. బుర్ర మీసాలతో… చింత నిప్పులు లాంటి కళ్ళతో… ఆరడుగుల ఎత్తుతో భయంకరంగా ఉంటాడు. చిన్న పిల్లలు అతన్ని చూసి జడుసుకుంటారు. పెద్ద వాళ్ళు ‘వీడితో మనకెందుకు’ అని మర్యాదగా తప్పుకుంటారు. ఈ మధ్య చాలా రోజులుగా అతని చేతికి సరైన పని లేకుండా పోయింది. ఇప్పుడు విష్ణువర్ధనరావు పెట్టిన ప్రపోజల్‌తో కొంచెం పని తగిలింది అతనికి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. విష్ణువర్ధనరావు గారిని రహస్యంగా కలిసాడు.

“నాక్కొంచెం అవకాశం ఇచ్చి చూడండి.. మీ పని సులువుగా అయిపోద్ది” అని ఆఫర్‌ ఇచ్చినట్టు చెప్పాడు.

“ఆహా… అంత మొనగాడివా!” నవ్వుతూ అన్నాడు విష్ణువర్ధనరావ్‌.

“చాన్స్ ఇచ్చి చూడండి…”

“సరే… ఇదిగో అడ్వాన్స్…” అని ఒక నోట్ల కట్టని విసిరాడు విష్ణు.

“తస్సాదియ్యా… ఇహ చూస్కోండి…” అని చెప్పి వచ్చేసాడు భుజంగం. అతనటు వెళ్ళగానే మొబైల్‌ చేతిలోకి తీసుకుని ఎవరికో కాల్‌ చేసాడు విష్ణువర్ధనరావ్‌ – “ఈ భుజంగం గాడి మీద ఒక కన్నేసి ఉంచండి” అని చెప్పి పెట్టేసాడు.

***

ప్రేమ అనేది మనసులో పుట్టేవరకు జీవితం మన చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి అది పుట్టాక మన జీవితం మన కంట్రోల్‌లో ఉండదు. ప్రపంచం కొత్తగా కనపడుతుంది.

జనని పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎప్పుడూ పరధ్యానం… ఏదో ఆలోచన… ఉండుండి పెదాలపై సన్నగా మెరిసే చిరునవ్వు… ఇవి చాలవా ఆమె ప్రేమలో పడిందని తెలియడానికి!

రఘురామయ్య గారు ఇవన్నీ గమనిస్తున్నారు. కన్నె పిల్ల… కలలు సహజం… అని నవ్వుకున్నారు.

కళ్యాణ్‌ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రేమ తలపులలో మునిగి తేలుతున్నాడు. ఇంకా అలాగే తేలేవాడే కానీ మొబైల్‌ రింగ్‌ అవడంతో ఈ లోకంలోకి వచ్చాడు. తెర పైన నంబర్‌ చూసి ఎలర్ట్‌ అయ్యాడు.

కాల్‌ ఏక్సెప్ట్‌ చేసి “హలో… చెప్పండి సార్‌” అన్నాడు.

“ఎలా ఉంది రీసెర్చ్‌… అంతా సవ్యంగా జరుగుతోందా?” అడిగింది అవతలి గొంతు.

“బాగానే ప్రోగ్రెస్‌ అవుతుంది సార్‌…” అబద్ధం చెప్పేసాడు. అవతలి వైపు చిన్న నవ్వు.

“నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో మర్చిపోకు” ఫోన్‌లో హెచ్చరిక.

“అలాగే సార్‌…” అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసాడు.

మొబైల్‌ జేబులో వేసుకుని పొలం వైపు నడవడం ప్రారంభించాడు. ఎడతెగని ఆలోచనలు. పొలాల్లోకి వచ్చి వెళుతున్న ఏలియన్స్‌కి ఏం కావాలో అర్థం కావడం లేదు. వచ్చి వెళ్ళడం తప్ప ఇతర నష్టమేమీ చెయ్యడం లేదు వాళ్ళు. మరి ఎందుకు వస్తున్నట్టు?… ఏదో ఉంది… ఊరికే రారు వాళ్ళు… ఆ రహస్యం తెలుసుకోవాలి!

పొలం లోకి వెళ్ళి మళ్ళీ పరిశీలించసాగాడు. ఎక్కడా చిన్న తేడా కూడా కనపడటం లేదు. చాలా సేపు పరిశీలించి వెనుతిరిగాడు

“నమస్కారం బాబూ…” ఎవరో పలకరించారు.

“నమస్కారం” అని అతన్ని గమనించసాగాడు.

“అట్టే ఆశ్చర్యపోకండి… నా పేరు భుజంగం… ఈ ఊర్లో పెద్ద మనిషిని.”

“ఆహా… అలాగా…” అని “…చెప్పండి నాతో ఏంటి పని” అన్నాడు కళ్యాణ్‌.

“మీ లాంటి గొప్పోళ్ళతో మాట్లాడటమే మా అద్దుష్టం… ఇంతకీ తమరు ఈ ఊరు ఏ పని మీద వచ్చారు” అడిగాడు భుజంగం.

“ఏదో రీసెర్చ్‌ పని మీద వచ్చాను… మీకెందుకు అవన్నీ” విసుక్కున్నాడు.

“పోనీ లెండి నాకెందుకు అయన్నీ… నాతో ఏ అవుసురం ఉన్నా మోమాటపడకండి… కబురంపండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.

చిన్నగా నిట్టూర్చి “వీడెవడో జిడ్డులా ఉన్నాడు” అనుకుని ఇంటి దారి పట్టాడు కళ్యాణ్‌. భుజంగం ఒక విషసర్పం అని… అతనితో పరిచయం ప్రమాదం అని తెలీదు అతనికి.

***

రాఘవయ్య గారి చుట్టూ రైతులంతా చేరి సమావేశమయ్యారు.

అందులో ఒక మోతుబరి రైతు – “అయ్యా… ఆ వచ్చిన పెద్దాయన మా పొలాలని అడుగుతున్నాడు. ఆ పొలాలు మీదే ఆధారపడి బతుకుతున్న వాళ్ళం. ఇప్పుడు అవి కూడా మాకు లేకపోతే ఎలా బతకాలి బాబూ…” అన్నాడు దీనంగా.

రఘురామయ్య గారు కాసేపు ఆలోచించి “చూడండి… ఎన్నో ఏళ్ళుగా ఆ వ్యవసాయం మీదే మీరు బతుకుతున్నారు. ఇప్పుడు మీ నోటి ముందు కూడు లాక్కోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మీకు ఎన్నో ఆశలని చూపిస్తారు. కానీ వేటికీ లొంగకండి. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు. అమ్ముకున్న వాడే నష్టపోతాడు. ఇదే సూత్రం… గుర్తు పెట్టుకోండి” అన్నారు.

రైతులంతా “అట్టాగేనయ్యా…” అని తలలు ఊపి “వెళ్ళొస్తామయ్యా…” అని చెప్పి కదిలి వెళ్ళిపోయారు.

రఘురామయ్య గారు ఆలోచనలో పడ్డారు. ప్రెసిడెంట్‌ని, అతనికి అండగా ఉన్న భుజంగాన్ని తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు. ఏదో ఒక పథకం వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉండే ఉంటుంది. అందుకే ముందుగా పొలాలని అమ్మమని నింపాదిగా అడుగుతున్నారు. రైతులు ఎవరైనా మొండికేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ అసలు మనస్తత్వం. ఈ విషయాన్ని చాలా డెలికేట్‌గా డీల్‌ చెయ్యాలి. లేకపోతే మొదటికే ప్రమాదం అని మనసులో అనుకున్నారు.

ఇంతలో కళ్యాణ్‌ రావడం కనిపించింది. “ఏమిటి యంగ్‌ మేన్‌… ఎంతవరకు వచ్చింది నీ రీసెర్చ్‌” అని అడిగారు రఘురామయ్య.

“పర్వాలేదండీ… బాగానే సాగుతుంది” అని సమాధానం చెప్పి “…ఇందాక పొలం నుండి వస్తుంటే భుజంగం అనే అతను కనిపించాడు. నా గురించి డీటెయిల్స్‌ అడుగుతున్నాడు…” అని చెప్పాడు.

“ఆహా… అలాగా… అయినా ఆ భుజంగం అంత మంచి వ్యక్తి కాడు… అతనితో కొంచెం జాగ్రత్త” అన్నారు.

“అలాగేనండీ… నా జాగ్రత్త లో నేనుంటాను” అని చెప్పి తన రూములోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్‌.

కళ్యాణ్‌ తన రూములోకి వెళ్ళడం జనని గమనించింది. అతనితో ఏకాంతంగా మాట్లాడాలని ఆమె మనసు తహ తహలాడుతోంది కానీ ఇంట్లో ఉన్న పెద్దల భయం… పరిధులు దాటగూడదన్న నియమం ఆమెను వెనక్కు లాగుతోంది. కాసేపయ్యాక ఏదో పని కల్పించుకుని అతని రూములోకి వెళ్ళింది.

“రండి మేడం రండి. ఏంటో మా మీద సడన్‌గా ఇంత దయ కలిగింది?” టీజింగ్‌గా అన్నాడు.

“తమరే రీసెర్చ్‌ పనిలో ఇరవై నాలుగ్గంటలు బిజీ… ఇక మేమెక్కడ కనిపిస్తాం!” చురక అంటించింది జనని.

కళ్యాణ్‌ తేలిగ్గా నవ్వేస్తూ “సరే… సరే… చెప్పండి” అన్నాడు.

జనని మౌనంగా అయిపోయింది. గొంతుకు ఏదో అడ్డం పడ్డట్టు ఫీల్‌ అయి మాటలు రాని దానిలా చూస్తోంది. ఆమె అవస్థ కళ్యాణ్‌కి అర్థం అయింది. ‘అన్ని విషయాల్లో చురుగ్గా ఉండే జనని ప్రేమ విషయం వచ్చేటప్పటికి సాధారణ అమ్మాయిలా ప్రవర్తిస్తోంది… తనే కొంచెం చొరవ తీసుకోవాలి’ అని మనసులో అనుకున్నాడు.

“మీతో మాట్లాడాలని నాక్కూడా చాలా ఆశగా ఉంటోంది. కానీ నా లిమిట్స్‌ నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని కదిలించడం లేదు. అయినా సరే చెబుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ దేవుడు కరుణిస్తే మిమ్మల్ని పెళ్ళాడాలని అనుకుంటుంటున్నాను” అని చెప్పాడు

బెదిరిపోయినట్టు కళ్ళు పెద్దవి చేసి చూసింది జనని. “చాలా ధైర్యం వచ్చిందే అబ్బాయి గారికి. మా తాతయ్యకి తెలిస్తే మీ తోలు వలిచేస్తారు” అని హెచ్చరించింది.

“దేవి గారిని పొందడానికి ఏ బాధ భరించడానికైనా సిద్ధమే” అంటూ నవ్వేసాడు కళ్యాణ్‌. చురుగ్గా చూసి తుర్రున పరుగెత్తి వెళ్ళిపోయింది జనని. చిన్నగా నవ్వుకున్నాడు కళ్యాణ్‌! ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తున్నారని తెలీదు కళ్యాణ్‌కి.

***

భుజంగం… ఆ ఊరికి మాజీ ప్రెసిడెంట్‌!

తన హయాంలో ఎన్నో అక్రమాలు చేసాడు. ప్రజలు అతన్ని తిరస్కరించి కొత్త వ్యక్తిని ఎన్నుకున్నాక కుక్కిన పేనులా… తేలు కుట్టిన దొంగలా అయ్యాడు. కానీ గోతికాడ నక్కలా అవకాశం కోసం మాత్రం కాచుక్కూర్చున్నాడు.

ప్రస్తుతం ఊరి బయట ఒక గెస్ట్‌ హౌస్‌లో విష్ణువర్ధనరావు గారి సేవలో తరిస్తున్నాడు. సమయం రాత్రి తొమ్మిదయింది. మందు మీద కూర్చున్నారు. గ్లాసులో మందు పోసి విష్ణువర్ధనరావు గారికి భక్తిగా అందించాడు భుజంగం. దాన్ని అందుకుంటూ “నేను చెప్పిన పని ఎంత వరకు వచ్చింది” నెమ్మదిగా అడిగాడు విష్ణు.

“అవుతుంది సార్‌… కొంచెం ఓపిక పట్టాల… అదును చూసి దెబ్బ కొట్టాల… అయినా మీకు తెలీని ఇసయమా ఏటి” అని కిసుక్కున నవ్వాడు.

“సరే గాని… ఇంతకీ మన పంకజం ఏమంటోంది?” ఆశగా అడిగాడు విష్ణు. భుజంగం మనసులోనే నవ్వుకున్నాడు. విష్ణువర్ధనరావుకి స్త్రీ బలహీనత ఉంది. ఆ విషయం భుజంగానికి తెలుసు. అందుకే ఆ బలహీనతని తన అవసరానికి వాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ విషయం విష్ణుకి కూడా తెలుసు. కానీ తప్పదు. తన అవసరం తీర్చుకోవడానికి భుజంగం సహాయం కావాలి. అందుకే అతనికి లొంగినట్టు కనపడాలి. క్విడ్‌ ప్రోకో అన్న మాట!

భుజంగం అన్నాడు “దానిదేముంది సారూ… పంకజం త్వరలోనే మీ పక్కలోకి వచ్చేస్తుంది… నిశ్చింతగా ఉండండి.”

“అలాగే… ముందు కొంచెం మందు పొయ్యి” అని ఖాళీ గ్లాసుని ముందుకి తోసాడు విష్ణు.

పంకజం ఆ ఊళ్ళో ఒక పేద రైతు భార్య. బాగా సోకు చేసుకోవాలని… బోలెడంత డబ్బు మూటగట్టుకోవాలని ఆశ. కానీ భర్త ఒక సామాన్య రైతు కావడం వల్ల అవన్నీ కుదరడం లేదు. అయితే భగవంతుడు ఆమెకు గొప్ప వరం ఇచ్చాడు. అందమైన శరీరాకృతి ఆమె సొంతం. ఎలాంటి వాడికైనా ఆమెను చూస్తే మనసు జివ్వుమంటుంది. ఒక్కసారైనా ఆమెను అనుభవించాలని అనిపిస్తుంది. మగాళ్ళ చూపుల బట్టి ఆమెకు ఆ విషయం ఎప్పుడో అర్థమైంది. అందుకే తన శరీరాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని నిర్ణయించుకుంది…

ఆమె గురించి బాగా ఎరిగిన భుజంగం ఆమెను విష్ణువర్ధనరావుకి ఎరగా వెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే విష్ణువర్ధనరావు ఆలోచనలు ఇంకా అతిగా ఉన్నాయి. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని తన కార్యం సాధించుకోవడం ఎలా అన్నది అతని పథకం. చివరికి ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి.

***

ప్రశాంతంగా ఉన్న చెరువులో బండ రాయి పడినట్లు… నిశ్శబ్దమైన అడవి మధ్యలో బాంబ్‌ పేలినట్లు… ఒక పెద్ద కదలిక ఆ గ్రామంలో!

ఊరంతా ఆ వార్త విని ఉలిక్కిపడింది.

‘అయ్య బాబోయ్‌’ అని గ్రామస్తులందరినీ పరుగు పెట్టేలా చేసింది. ఊరిలోని చిన్నా పెద్దా అంతా ఆ ఇంటి ముందు గుమిగూడారు.

‘ఎలా జరిగింది… ఎలా జరిగింది?’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఆ ఇంటి దంపతుల దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. కన్నీటితో… బేల వదనంతో వెర్రి వాళ్ళలా చూడసాగారు. నిరక్షరాస్యులైన వారి మనసు నిండా ఎంతో గుబులు… అంతులేని భయం… కడుపుకోత మిగిల్చిన ఆ సంఘటన వాళ్ళని తాత్కాలికంగా అసహాయులని చేసింది.

జనాన్ని చూడగానే “మా కొడుకుని… మా కొడుకుని… మాకు చూపించండయ్యా” అని గోలు గోలున ఏడుస్తున్నారు. అసలు జరిగినదేంటంటే… ఆ దంపతులకి లేక లేక కలిగిన కొడుకు ‘రాము’. ఏడేళ్ళ కుర్రవాడు. సాయంత్రం ఆడుకుంటానని పొలాలవైపు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఊరంతా వెదికారు ఆ దంపతులు. తోటలు… గట్లు… చెరువులు… నూతులు… అన్నీ… అన్నీ తిరిగి చూసారు. కానీ ఎక్కడా జాడ లేదు. చిన్న ఆనవాలు కూడా దొరకలేదు. అసలు ఏమైనట్టు?… బ్రతికి ఉన్నట్టా? చనిపోయినట్టా? అదే ప్రశ్న! అందరి మదిలోనూ మెదులుతున్న అతి పె… ద్ద ప్రశ్న! చూద్దాం సమాధానమేమిటో!

***

కళ్యాణ్‌ ఆలోచించసాగాడు. ‘ఇంత చిన్న పల్లెటూర్లో పిల్లాడు కిడ్నాప్‌ కావడమేంటి? ఏదో జరుగుతోంది. ఎవరో చేస్తున్నారు. పిల్లాడు కనిపించకుండా పోవడం అనేది కాకతాళీయం కాదు. ఒక పెద్ద పథకం ప్రకారం జరుగబోతున్న కార్యంలోని మొదటి అంకం. అందులో సందేహం లేదు. అందుకే ఈ రాత్రి ఆ సంగతేమిటో తేల్చుకోవాలి’ అని నిశ్చయించుకున్నాడు.

చీకటి పడింది. అందరూ భోజనాలు చేసి నిద్రకుపక్రమించారు. ఊరు కొంచెం సద్దుమణిగాక… సెల్‌ ఫోన్‌ జేబులో వేసుకుని కదిలాడు. అతని మనసులో ఏదో సాధించాలి అన్న పట్టుదల. ఎలాగైనా దుర్మార్గుల ఆట కట్టించాలి అన్న తపన!

అతను నడుస్తుంటే కాళ్ళ కింద గడ్డి మెత్తగా అణిగిపోతోంది. పొలాల్లో పాము ఏదో పాక్కుంటూ వెళుతున్నట్టు జర జరా శబ్దం! నడుస్తూ వెళ్ళి పొలాల మధ్యలోకి చేరుకున్నాడు. చుట్టూ చూసాడు. ఎక్కడా మనిషి జాడ అన్నది లేదు. కీచురాళ్ళ రొద… గుంపులుగా మీద పడి దాడి చేస్తున్న పురుగులు. అలాగే నడుచుకుంటూ ఆ పొలాలను దాటి చెట్ల తోపులోకి ప్రవేశించాడు. చెట్లు చాలా దట్టంగా ఉన్నాయి. జాగ్రత్తగా నిశ్శబ్దాన్ని వినసాగాడు. ఎక్కడి నుండో చిన్న శబ్దం వస్తోంది. గాలి గుస గుసలాడుతున్నట్టు

చిన్న పాటి సవ్వడి. మరింత ఎలర్ట్‌ అయ్యాడు. కళ్ళు చిట్లించి చూడసాగాడు. సెల్‌ ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేద్దామనుకుని మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. తన ఉనికి శత్రువులకి తెలియజెయ్యడం అతనికి ఇష్టం లేదు. కానీ అప్పటికే అతని రాకను అవతలి వ్యక్తులు పసిగట్టారు. హఠాత్తుగా కళ్యాణ్‌పై దాడి జరిగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here