మా ఆవిడ బంగారం

64
8

[శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘మా ఆవిడ బంగారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మొ[/dropcap]న్నీమధ్య, మా శ్రీమతి “బంగారు దుద్దులు కొనాలనుకుంటున్నా” అని చాలా రోజుల తర్వాత అడిగింది. అందులో తన పుట్టిన రోజు కూడా దగ్గరలోనే ఉంది. అందుకే అయిష్టం గానే అయినా సరే అన్నాను. అంతలోనే ఒకసారి బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకున్నా. బాలన్స్ ఎంతుందో అని. జీతం కూడా ముందురోజే పడి ఉండడంతో బాలన్స్ బానే కనపడుతోంది. ఐదో తేదీ దాటితే గానీ అసలు సంగతి బయటపడదు. కట్టాల్సిన ఇ.ఎం.ఐ.లు, ఇంటి ఖర్చులూ పోను నెల గడవడానికి మించి రెండు వేలు ఉన్నా, అవసరాలు మాత్రం అంతకు మించి ఉంటాయి ప్రతీ సారి. అవన్నీ లిస్ట్ చేసుకుని ప్రాధాన్యతల్ని బట్టి వాయిదా వేసే లిస్ట్ చాంతాడంత ఉంటుంది.

అందుకే శ్రీమతి ఏం కావాలంటుందో అని ఒక పక్క ఆందోళన. పాపం చాలా రోజుల తర్వాత అదీ పుట్టిన రోజు ముందు అడుగుతోంది ఎలాగైనా సరే తీసిద్దామనే అనిపించింది నాకు. ఇలా ఆలోచిస్తుంటే ఓ చిన్న డబ్బా తెచ్చి నా చేతిలో పెట్టింది శ్రీమతి.

ఏంటో అని ఆతృతగా తీసి చూశా. ఎప్పటివో చిన్న దుద్దులూ, చెవి పోగులూ, సొట్ట పోయిన ఉంగరం ఉన్నాయి అందులో. అప్పుడు చెప్పింది మెల్లగా.. “ఇవి వేసి దీనికి ఎంత బంగారం వస్తే అంతలో నే కొత్త దుద్దులు తీసుకుందాం” అని. నా మొహం మెరిసిపోయింది బంగారం కంటే గొప్పగా. ఇంత మంచి మనసున్న శ్రీమతిని ఇచ్చినందుకు దేవుడికి మనసులోనే దండం పెట్టుకున్నా.. ఓసి నా బంగారం గానూ అనుకుంటూ.

కానీ అది చాలా పాత బంగారం అవడంతో దానికి ఎక్కువ విలువ ఉండదనే అనుమానం నాకు. పైగా వాటిలో రాళ్లు తీసేసి మళ్ళీ తరుగు అని కోత పెడతారు. ఇంతా చేసి కొత్త బంగారం ఏం తీసుకున్నా దాని మీద తరుగు పైగా జీఎస్టీ అంటూ వాత పెడతారు.

ఇవన్నీ ఆలోచిస్తూనే కండిషన్ పెట్టాను. “దీనికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టేది లేదు” అని.

“ఇలా అంటారని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే మా అమ్మా వాళ్ళు పిల్లల పుట్టిన రోజులు అనీ నాకు అప్పుడప్పుడు ఇచ్చిన కొంత సొమ్ము దాచుకున్నా. అవసరమైతే అదిపెట్టి తీసుకుంటాలే” అంది శ్రీమతి.

“అయితే నాకు షాపు దాకా తోడు రండి చాలు. విసుక్కోకుండా కాస్త నాతో వస్తే మిగిలినవన్నీ నేను చూసుకుంటా” అంది. “అయితే ఒకే” అన్నా నేను ఎగిరి గంతేస్తూ.

“సరే ఎక్కడికెళదాం” అనడిగా. “డబ్బులు ఊరికే రావుగా.. అక్కడికే వెళదాం ఈసారి..” అనడంతో అర్థమయింది నాకు ఆ గుండాయన బంగారు అంగడికే వెళ్లాలని. “త్వరగా టీ పెట్టు వెళదాం” అని డ్రెస్ వేసుకుని తయారయ్యా. ఎప్పుడూ ఆలస్యం చేసే శ్రీమతి ఈసారి ఉత్సాహంగానే రెడీ అయ్యింది త్వరగానే. ఇద్దరం బయలుదేరాం పిల్లలని ఇంట్లోనే ఉంచి.

***

మేం మా ఏరియా దాటి ముందుకెళ్లామో లేదో ఖజానా వాళ్లకి తెలిసిపోయింది కాబోలు. తరుగు లేకుండానే బంగారం అంటూ మెసేజ్ వచ్చింది. వీడికెలా తెలిసిందో అనుకునేంత లోనే ఎదురుగా పెద్ద హోర్డింగ్. బీమాస్ జెవెల్లెర్స్ వారి ఆఫర్లు అంటూ. వాటిని మా శ్రీమతి కంట పడనీకుండా ఒడుపుగా డ్రైవ్ చేసుకుంటూ రాజభవన్ రోడ్‌లోకి టర్నింగ్ తీసుకున్నా. సోమాజి గూడ దాటానో లేదో రోడ్డుకు అటూ ఇటూ అన్నీ బంగారు షోరూమ్‌లే. లోపల బంగారం. బయట బంగారు రంగు లైట్లు జిగేల్ జిగేల్ మంటున్నాయి. నా గుండె మాత్రం గుభేల్ గుభేల్ మనడానికి సిద్ధమవుతోంది.

అంతలోనే అల్లంత దూరంలో కనిపించింది గుండాయన బంగారు షోరూం. ఇంకేముంది వెళదామనేంతలోనే రెడ్ సిగ్నల్. చూడ్డానికి ఎదురుగానే ఉన్నట్టున్నా లెఫ్ట్ తీసుకుని యూ టర్న్ చేసుకోడానికి పావుగంట పట్టింది. ఎలాగైతేనేం షోరూం చేరుకున్నాం. వెహికల్‌ను వాలెట్ పార్కింగ్ వాళ్ళకిచ్చి షోరూం లోకి అడుగు పెట్టాం.

***

అంతకు రెండు రోజుల ముందు మా చింతల బస్తీలో కూరగాయల సంత. మా శ్రీమతి కూరగాయలు తెమ్మంటే వెళ్ళా. అన్ని కూరగాయల బళ్ళూ ఒకెత్తూ టమాటాల బండి వాడి దగ్గర మాత్రం చుట్టూ జనాలే. కొనేవాళ్ళు మాత్రం కొందరే. టమాటాలు బంగారం అయిపోయాయి మరి. అడిగే వాళ్ళే కానీ కొనే మొనగాడు లేనట్లు, కొన్న వాళ్ళు కూడా పావు కిలో టమాటాలతో సరిపెట్టుకుంటున్నారు.

బంగారం షోరూంలో అడుగు పెట్టగానే ఇంత కంటే ఆ కూరగాయల సంత లోనే నయం అనిపించింది. అంతమంది జనాలు అక్కడ. అదో పెద్ద సంతలా ఊరంతా అక్కడే ఉన్నట్లు జనం. ఆడ లేడీసు అద్దం ముందు కూర్చుని షో కేసుల్లో ఉన్న మోడల్స్ అన్నీ తీయించి పెట్టుకుని మురిసిపోతుంటే, మొగ జెంట్సు మాత్రం పిల్లలని ఎత్తుకుని సముదాయిస్తూ ఉసూరుమంటూ తిరుగుతున్నారు. పెళ్ళై కొత్తగా పిల్లలున్న వాళ్ళ సంగతైతే చెప్పనలవి కాదు.. పాపం డైపర్‌లు మార్చుతూ వాళ్ళని మరిపించే మగాళ్లని చూసి జాలేసింది. నేను ఆ దశ దాటి పోయినందుకు కాసింత రిలాక్స్ ఫీలయినా ముందుంది ముసళ్ల పండగ అన్నట్టుంది నా పరిస్థితి.

***

ఎలాగూ పాత బంగారం ఇచ్చేద్దామనుకున్నాం కాబట్టి కౌంటర్ లోని వ్యక్తిని అడిగాం.. ఏం చెయ్యాలని. “ముందు మీ బంగారానికి ఎంత విలువ వస్తుందో ఆ కౌంటర్‌కి వెళ్లి రాయించుకుని రండి. తర్వాత మీరు ఎంతలో బంగారం కొనాలనుకున్నారో చెప్తే మీకు ఐటమ్స్ చూపిస్తాం..” అన్నారు. సరేనని మా పాత బంగారం పట్టుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడో పెద్ద క్యూ ఉంది. మా వంతు వచ్చేసరికి ఓ పావు గంట పట్టేటట్లుంది. తీరా మా ముందున్నాయన మాలాగే ఏవో బంగారం ఇవ్వగానే, అదేదో గోల్డ్ క్వాలిటీ చెకింగ్ యంత్రం అట దాంట్లో పెట్టేయగానే అదెన్ని క్యారట్ల బంగారమో చెప్పేస్తోంది. ఆ కౌంటర్‌లో ఉన్నతను చెప్పేసాడు “సారీ అండీ ఇది మంచి బంగారం కాదు. దీన్ని మేం తీసుకోము” అని. మా వంతు రానే వచ్చింది.

నా గుండెల్లో గుబులు బయల్దేరింది. మాది ఎలాంటి బంగారమో అని.. ఒక్కో ఐటెం తీసి ఇచ్చాను. ఒక్కోటీ క్వాలిటీ చెక్ పాస్ అయి వస్తోంటే ఏదో సాధించానన్నట్లు ఆనందం.. నా కళ్ళలో. మా ఆవిడ చూపుల్లో మాత్రం గర్వం.. ‘చూసారా మా వాళ్ళు పెట్టింది ఎంత క్వాలిటీ బంగారమో’ అని. ఏం అయితేనేం ఓ పదిహేను వేలు విలువ కట్టించి మా పాత బంగారాన్ని పట్టుకుని కొత్త దుద్దులు చూడ్డానికి కౌంటర్‌కి వెళ్ళాం.

అక్కడున్నతను “మీకు బంగారం దుద్దులు కావాలంటే ఇక్కడే.. అదే డైమండ్‌వి కావాలంటే మూడో ఫ్లోర్‌లో ఉంటాయి” అని చెప్పగానే.. మా మొహాలకు అంత విలువ కట్టినందుకు వాణ్ని అభినందించాలో లేక నా జేబుకు చిల్లు వేసే సాహసం చేసినందుకు చీవాట్లు పెట్టాలో అర్థం కాలేదు. ఏమయితేనేం బంగారంవే చూద్దాం అని శ్రీమతి అనడంతో చూడ్డం మొదలు పెట్టాం.

ఎన్నెన్నో మోడల్స్ చూపిస్తూనే ఉన్నాడు.. కౌంటర్ లోని వ్యక్తి. మొత్తానికి ఓ నాలుగు సెలెక్ట్ చేసాం.. ఇద్దరం కలిసి. ఒక్కోటీ పెట్టుకుని చూస్తోంది శ్రీమతి. నేను ఫోటో తీసి వెంటనే వాట్సాప్ చేస్తున్నా ఇంట్లో ఉన్న పిల్లలకి. వాళ్ళూ ఓ రెండు బావున్నాయని అనడంతో వాటిల్లో ఒకటి దాదాపు ఫైనల్ చేసాం. ఇక దాని ఫైనల్ ప్రైస్ చెప్పమన్నాం. అతను లెక్కేసి పదమూడు వేలు అవుతుందని ఇంకో రెండు వేలు మిగిలుంటుందని చెప్పాడు. నా గుండెల్లో బరువు దిగినట్లయ్యింది. అంతలోనే అతనన్నాడు.. “ఆ డబ్బు వెనక్కి ఇవ్వరు. మీరు ఏదో ఐటెం కొనాల్సిందే” అని.

ఇంకా అతనన్నాడు.. “మీరు ఐటెం ఫైనల్ చేసినట్లయితే మీ పాత బంగారాన్ని ముందు గదిలో ఉన్న కంసాలికి ఇచ్చి ముద్దగా చేసాక దానికి అసలు విలువ లెక్క కట్టించుకుని రండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు డబ్బు మిగుల్తుందో లేక ఇంకా కట్టాల్సి వస్తుందో” అని.

చేసేదేం లేక కంసాలి దగ్గరికి వెళ్లి ముద్దగా చేయించి మళ్ళీ పాత బంగారానికి లెక్క కట్టించడానికి ఇంకో కౌంటర్‌కి వెళ్ళాం.

వాళ్ళు ఆ బంగారాన్ని మళ్ళీ తూచి దాని విలువ పదిహేను వేలే అని తేల్చారు.

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని మళ్ళీ దుద్దుల కౌంటర్‌కి వెళ్లి మిగిలిన రెండు వేలకి పిల్లలకి ఏవైనా చిన్న దుద్దులు ఉంటే చూపించమన్నాం. అంత చిన్నవి ఈ బంగారపు దుద్దుల కౌంటర్‌లో ఉండవని, రెండో ఫ్లోర్‌లో రాళ్ళ దుద్దుల కౌంటర్‌లో చూసుకుని రండి అంత వరకు మీ ఐటెం ఆఫర్‌లో ఉంచుతా అన్నాడు అతను.

అప్పటికే రాత్రి ఎనిమిదిన్నర. కడుపులో ఆకలి దంచేస్తోంది. బయటికి వెళ్లి ఏదైనా తిని వస్తే మంచిదనిపించింది. షో రూమ్ బయట ఫుట్‌పాత్ పైన ఒకతను భేల్ పూరి వేస్తున్నాడు. ఇద్దరం వెళ్ళాం. ఓ రెండు భేల్ పూరి తీసుకున్నాం. చూస్తే దాంట్లో ఒక్క టమాటా ముక్క కూడా లేదు.

“ఇదేం భేల్ పూరి బాబూ!” అని అడిగాం.

“ఏం చెయ్యమంటారు సార్.. టమాటాలు బంగారం అయిపోయాయి.. ఇరవై రూపాయలకి నాకు గిట్టుబాటు కాదు. రోజూ పెరిగే బంగారాన్ని మాత్రం కొనే జనాలు ఎప్పుడో గిట్టుబాటు కాదని రేటు పెంచితే మాత్రం రావట్లేదు. అందుకే ఏదో నిమ్మరసం పిండి ఇరవైకే ఇస్తున్నా!” అన్నాడు వాడు.

ఏంటో ఈ మనుషులు.. రోజు రోజు పెరిగే బంగారం ఇంకా పెరిగిపోతుందేమో అని ఈ రోజే కొనాలని ఆత్రపడతారు.. టమాటాలు మాత్రం ఏదో ఒక రోజు ధర తగ్గక పోతాయా అని ఎదురు చూస్తూ పావు కిలో కొని దాన్నే సర్దేస్తుంటారు అనిపించింది.

ఎలాగైతేనేం భేల్ పూరి తిని మళ్ళీ గుండాయన షోరూం రెండో ఫ్లోర్ లోకి అడుగుపెట్టాం.. రాళ్ల దుద్దులు చూద్దామని. అక్కడ వజ్రాల్లా మెరిసిపోతూ ఆకర్షణీయంగా ఉన్న దుద్దుల్ని చూస్తూ మా ఆవిడ మనసు మారిపోతోంది. రెండు వేలకి ఓ జత చిన్న దుద్దుల్ని చూద్దామని వెళ్లిన మా శ్రీమతికి అక్కడే ఉన్న పెద్ద రాళ్ళ దుద్దుల పైన పడింది చూపు. ఇంకేముంది ఓ రెండు జతల్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని అద్దంలో చూసుకుంది. తన మొహంలో మునుపటికన్నా వెలుగు.. ఆ రాళ్ళ మెరుపుల్ని మించి. నా మొహం మాత్రం మాడి పోయింది. కంసాలి చేతిలో పాత బంగారంలా.

వెంటనే ఆ రాళ్ల దుద్దులకి వెల కట్టమంది. నాకు ఒకటే టెన్షన్. కౌంటర్ లోని వ్యక్తి ఆ దుద్దుల్ని తీసుకుని ఎటో వెళ్లి లెక్కవేసుకుని వచ్చాడు.

“సార్ దుద్దులు ఇరవై నాలుగు వేలు, తరుగు నాలుగు వేలు జీఎస్టీ మరో రెండు వేలు.. వెరసి ముప్పైవేలు” అని చెప్పాడు కూల్‌గా.

“ఇంతకీ మీ పాత బంగారం విలువ పదిహేను వేలన్నారు గదా సార్!.. మిగిలింది క్యాషా కార్డా..?” అన్నాడు గుక్క తిప్పుకోనీయకుండా.

“కార్డే నండీ” అంది మా శ్రీమతి. ‘మరి పిన్ ఎవరిదో’ అని లోపల్లోపల సణుక్కున్నాను. కౌంటర్ దగ్గరికి వెళ్లే వరకు ఒకటే టెన్షన్. కార్డు తను తీస్తుందో లేక నన్ను తియ్యమంటుందో.. అని.

“ఐటెం ఫైనలే కదా సార్.. బిల్ వేయిస్తున్నా.. మీ ఓల్డ్ గోల్డ్ వోచర్ ఇవ్వండి లెస్ చేసి నెట్ బిల్ ఇస్తాను.” అనేసరికి చేసేదేం లేక పాత బంగారపు వోచర్ అతనికి ఇచ్చాను. “ఇక కౌంటర్ దగ్గరికి రండి” అని మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. నేను నా రెండు చేతులూ జేబులో పెట్టుకుని చూస్తున్నా.. శ్రీమతి ఏమంటుందో అని.

చాలా కూల్ గా శ్రీమతి అంది.. “పిల్లల పుట్టిన రోజులకి ఐదేసి వేలు మా అమ్మావాళ్లు ఇచ్చారు.. ఇక మీరు.. నా పోయిన బర్త్ డే నుండీ నాకు నెలకి రెండు వేలు ఇస్తున్నారు కదా.. అందులో మొన్న మీ బర్త్ డే కి డ్రెస్సులు తీసుకోగా ఇంకా ఐదు వేలు ఉన్నాయి. మొత్తం పదిహేను వేలు అవుతాయి. మన బడ్జెట్‌కి సరిగ్గా సరిపోతుంది” అంటూ తన కార్డునే ఇచ్చి పిన్ కొట్టమని నన్నే అడిగింది.

నా మొహం ఇంకా చిన్న బోయింది. టమాటాలా ఎర్రగా కందిపోయింది. కానీ ఆ క్షణంలో నా టమాటా మొహానికి అంత విలువ లేదు.

తన కిష్టమైన రాళ్ళ దుద్దుల్ని చిన్న పర్సులో పెట్టుకుని ఆనందంగా బయటకు వచ్చిన నా శ్రీమతికి బర్త్ డే కి ఏదో ఒక గిఫ్ట్ తప్పక ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయిపోయాను. అప్పుడు అనిపించింది.. నా మనసులో.. ‘మా ఆవిడ బంగారం’ అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here