మా బాల కథలు-1

0
11

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

వడ్లు ఒలిచేద్దాం:

బాలా వాళ్ళది రామాపురం అనే పల్లెటూరు.. తండ్రికి పక్క ఊరిలో ప్రభుత్వ ఉద్యోగ౦.

సొంత ఊరు,తల్లి తండ్రులు పెద్ద వాళ్ళు అయ్యారనే ఉద్దేశంతో అక్కడే ఉంటూ రోజూ పక్క ఊరు వెళ్ళివస్తాడు. ఒక బాబాయి డాక్టర్. అక్కడే. ఇంకో బాబాయి చదువు. అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. అందరూ అక్కడే. ఉమ్మడి కుటుంబం. పెద్ద ఇల్లు. సంపన్న కుటుంబం. బోలెడన్ని పొలాలు.

ఉమ్మడి కుటుంబం అయినా ఎక్కడా పొరపోచ్చాలు లేవు. అందరూ కలిసి కట్టుగా ఒక్క మాట మీదే ఉంటారు. ఆ ఊరిలో అందరికి ఆ కుటుంబం అంటే గౌరవం.

నాన్నమ్మ మాటకారితనము, సహాయ గుణం వల్లా, పెద్ద మండువా లోగిలి కావటం వల్లా చాలా మంది ఆడవాళ్ళు మధ్యాహ్నాలు బాల ఇంట్లో చేరేవారు.

కబుర్లకి కొందరు, కాలక్షేపానికి కొందరూ, నాయనమ్మ ప్రపకానికి కొందరు బాలా వాళ్ళ ఇంటికి వచ్చేవారు. ఎక్కడెక్కడి విషయాలు కలబోసే వారు పనిలో పనిగా కలసి అప్పడాలు ఒత్తుకోవటం, బియ్యం బాగు, ఊరగాయ రోజుల్లో ఆ పనులు అందరూ కలిసి చేసుకునే వారు. ఇది నీ పనీ నా పనీ అని లేదు.. ఎవరింటి పని అయినా అందరూ కలిసే. ఏ పనులూ లేనప్పుడు, అష్టా చెమ్మా, చింత పిక్కలు, గవ్వలు, వైకుంటపాళీ లాంటివి ఆడుకునేవారు. అన్నిటికీ నేపథ్య వాయిద్యంలా మాటలు నడుస్తూనే ఉండేవి.

ఆ రోజు నాయనమ్మ కేకలతో బాలకి పొద్దున్నే మెలకువ వచ్చింది. బాల కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మ, పిన్నులు, అందరూ నాయనమ్మ ఎదుట తల దించుకుని నిలుచుని ఉన్నారు.

“ఇంతమంది ఉన్నారు. ఎవరికీ బాధ్యత లేదా? అన్నీ నేనే చూసుకోవాలా?” కోపంగా అంటోది.

బామ్మ ఎంత మంచిదో అంత కంజాయింపు మనషి. ఎవరైనా ఏదైనా సరిగా చెయ్యకపోతే, చెప్పిన మాట వినకపోతే, క్రమశిక్షణగా ఉండకపోతే, లేక ఎందుకైనా ఆమెకే కోపం వస్తే అయిపోయిందే.

అందువల్ల అందరికీ భయమే. ఆమె కోపముగా ఉంటే ఇంట్లో ఎవ్వరూ తిరిగి మాట్లాడలేరు. ఆమె మాట శిలా శాసనం.

“ఎందుకు మామ్మ కోప్పడుతోంది” అడిగింది బాబాయి కూతురు నీలిమని మెల్లగా బాల.

“హుష్” అంది నీలిమ.

“ముందర చూసికోవద్దా ఏమి తింటారు? ఎలా తింటారు? ముగ్గురు కోడళ్ళు ఉన్నా నాకు తప్పదు. అన్నీ నేనే చూసుకోవాలి.” మామ్మ కోపం తారాస్థాయిలో ఉంది

క్రమంగా బాలకి విషయం అర్థమయ్యింది. బియ్యం నిండుకున్నాయి.

ఎప్పుడూ పనివాడు తమ ఒంటెద్దు బండిలో ధాన్యం తీసుకెళ్ళి మర పట్టించుకోస్తాడు పక్క ఊరిలో. చుట్టూ పక్కల ఊర్లలో ఒకటే ధాన్యం మిల్లు ఉంది. రోజంతా పట్టేస్తుంది రద్దీ ఉంటే వెళ్లి రావటానికి. అందుకే రెండు నెలలకోసారి, ఒకేసారి ఎక్కువగా పట్టిస్తారు.. ఎప్పుడూ ఉండగానే పట్టిస్తారు కానీ, ఈసారి ఎందుకో ఎవరూ గమనించలేదు.

తీరా నిన్న పనివాడు తండ్రికి బాగాలేదని భార్యతో సహా ఊరు వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో తెలియదు. పోనీ దంపించటానికి అతని భార్య కూడా వెళ్ళింది. ఏమి చెయ్యాలో?

“ఇవ్వాళ అందరం బుద్ధిగా ఉండాలి. లేకపోతే నాన్నమ్మ కోపానికి బలే” అన్నాడు అన్న రహస్యముగా.

“ఓస్ ఇంతేనా” అంటూ నానమ్మ దగ్గరికి పరిగెత్తింది బాల – “నాన్నమ్మా” అని అరుస్తూ.

అందరూ భయముగా, ఆశ్చర్యంగా చూస్తున్నారు.

“నువ్వీమీ కంగారు పడకు నాన్నమ్మా” అంది ఆరిందాలా.

“కంగారు పడకుండా ఎలాగే? ఏమి తింటా౦ వాడు వచ్చే వరకు? నీళ్ళు తాగి బతకుదామా” అంది చిరాగ్గా.

“లేదు. సచ్చు మామ్మ చెప్పిందిగా వడ్లు ఒలిచేద్దాం. మర డబ్బులూ మిగులుతాయి.” అంది గొప్ప ఆలోచన చెబుతున్నట్లు.

బిత్తర పోయిన నాన్నమ్మ తేరుకుని బిగ్గరగా నవ్వేసింది, కోపం మరచి పోయి బాల బుగ్గ గిల్లుతూ.

“నీ పెళ్లి అయ్యాక మీ ఆయనకి అల్లాగే వడ్లు ఒలిచి, వండి పెడుడువులే” అంది నవ్వుతూ నాన్నమ్మ.

నాన్నమ్మ నవ్వు చూసిన అందరికీ ధైర్యం వచ్చి అందరూ నవ్వేసారు.

సచ్చు మామ్మ, నాన్నమ్మ స్నేహితురాలు. ఊరిలోనే ఉంటుంది. కానీ వయస్సు రీత్యా ఎక్కువగా రాదు. కానీ వచ్చినప్పుడు ఎన్నో మంచి విషయాలు, కొత్త విషయాలు చెబుతుంది.

అందులో “గోరు తలంబ్రాలు” ఒకటి. ఒకసారి తమ ఊరు (నేల కొండపల్లి) గొప్పదనం గురించి చెబుతూ, రాములవారి కళ్యాణములో తలంబ్రాలకి దంపుడు బియ్యం కానీ, మర బియ్యం కానీ వాడరని, గోరుతో ఒలిచిన ధాన్యపు బియ్యమే వాడతారని, తమ ఊరుకు,తమకు ఆ అదృష్టం పట్టిందని చెబుతూ ఫోటోలు కూడా చూపించింది. అందరూ సచ్చుమామ్మ అదృష్టం పొగిడారు. అదీ సంగతి.

అప్పటి నుంచి ఎప్పుడు మర బియ్యం ని౦డు కున్నా “ఓ బస్తా వడ్లు బాల కియ్యండిరా ఒలుస్తుంది” అని ఏడిపించసాగారు అందరు.

అసలు అందులో నవ్వటానికి ఏముందో బాలకి అర్థం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here