మా బాల కథలు-10

0
9

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల… ఫోటో మేళ

ఆ రోజు ఆదివారం. బాల నాన్నకి శలవు. ఆ రోజంతా బాల నాన్నని వదలదు. నాన్నా అంతే. బాలతో ఆడుతూ, ముద్దు చేస్తూ తన కోరికలు తీరుస్తూ ఉంటాడు నాన్న.

కానీ ఆ రోజు వింతగా బాల నాన్న దగ్గరకే వెళ్ళలేదు. కోపంగా, ముభావముగా అసలు అల్లరే లేకుండా, చదువుకుంటోంది. బాల అలా ఉంటే నాన్నకు అసలు తోచదు కదా.

అందుకే వెళ్లి బాల పక్కనే కూర్చున్నాడు.

“ఏంటి చిట్టితల్లి ఈ రోజు కోపంగా ఉంది?”

బాల మాట్లాడలేదు.

“ఎందుకురా?” అడిగాడు దగ్గరకు తీసుకుంటూ.

దూరంగా జరిగింది బాల.

“నేను చదువుకోవాలి, హోం వర్క్ చాలా ఉంది.”

“అలాగా! నేను సినిమాకు తీసుకెల్దా మనుకున్నానే.”

ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ రాసుకోసాగింది.

“అమ్మ అయినా, బాబాయి అయినా ఎవరైనా ఏమైనా అన్నారా?” రహస్యముగా అడిగాడు.

“లేదు” అంది విసురుగా.

“అమ్మా, అందరూ రండి” గట్టిగా పిలిచాడు. అందరూ వచ్చారు.

“నా బంగారు తల్లిని ఎవరైనా ఏమైనా అన్నారా?”

“ఎవ్వరూ ఏమీ అనలేదు. అని బతగ్గలమా?” అంది హాస్యముగా మామ్మ.

అందరూ నవ్వారు.

“అనకపోతే అడిగింది ఇచ్చి ఉండరు. చిన్నపిల్లని ఏడిపిస్తారు” అన్నాడు చిరాగ్గా.

“ఇచ్చేది అడిగితే ఇస్తారు. ఇవ్వలేనిది అడిగితే ఎలా ఇవ్వ౦?” అంది నాన్నమ్మ.

“అంత ఇవ్వలేనివి ఏమడుగుతుంది? ఏముంటాయి? ఇంతమ౦ది ఉన్నారు ఒక్క పిల్లను సముదాయించలేరు?” అన్నాడు రెచ్చగొడుతున్నట్లు. అలా అయినా నిజం చెబుతారని.

“రామలింగడి కథలోలా మాట్లాడకు. అది ఏమడుగుతోందో తెలుసా” అంది నాన్నమ్మ.

“అది అసలు అలిగిందే నీ మీద”

“నా మీదా అయితే అసలు సమస్యే లేదు. నిముషములో తీర్చేస్తా చెప్పు” అన్నాడు చిటికేస్తూ.

“నిన్న సచ్చు మామ్మ వచ్చింది. జానకి అంటే బాల అత్తయ్య పెళ్ళికి రాలేదు కదా అని ఫొటోలు చూపించారు, అన్నీ వరసాగ్గా ఒకే చోట వరసాగ్గా ఉండటం తోటి, రమణ, అంటే బాల బాబాయి ఫోటోలు, బాల అమ్మ నాన్న పెళ్ళి ఫోటోలు అన్ని ఫోటోలు చూసారు.”

“అది అత్తయ్య పెళ్లి ఫోటోలో ఉన్నాను. బాబాయి పెళ్లి ఫోటోలో ఉన్నాను. అమ్మ నాన్న పెళ్లి ఫోటోలో ఎందుకు లేను అని అడుగుతోంది. నేను లేకుండా ఫోటో ఎందుకు తీసుకున్నారని అడుగుతోంది. అది ఉన్న ఫోటో కావాలిట. నేను లేకుండా వాళ్ళేందుకు ఫోటో తీసుకున్నారు? అని అలిగింది నిన్నటి నుంచి. సమాధానం చెప్పు మరి, అలా ఎందుకు దిగారు?” అంది ఫక్కున నవ్వుతూ నాన్నమ్మ.

అందరూ శ్రుతి కలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here