మా బాల కథలు-14

0
6

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల – భలే కష్టం

ఆ రోజు ‘శాంతి నివాసం’ అంటే బాల వాళ్ళ ఇల్లు ఎంతో సందడిగా ఉంది.

ఒకటి ఆదివారం కావటం. రెండు బాలమ్మ గారు చెల్లెలుకు బాగా లేదని ఊరు వెళ్ళింది. రేపటికి గానీ రాదు. అందుకే ‘ఇష్టా రాజ్యం భరతుడి పట్టం’ లాగా ఉంది ఇల్లు. అలా అని బాలమ్మ గారు చెడ్డదని కాదు. గయ్యాళి అనీ కాదు. ఆవిడకు అన్నీ టైము ప్రకారం, పద్ధతిలో జరగాలి, అది అందరికీ ముఖ్యముగా వయస్సులో ఉన్నప్పుడు నచ్చదు కదా. అందులోను ఆమె ఇల్లు విడిచి సాధారణముగా ఎక్కడికీ వెళ్ళదు. ఇప్పుడు, అదీ ఒకరోజు కోసం వెళ్ళింది. అందుకే ఆ రోజు తమకి నచ్చినట్లుగా ఉండాలని తాపత్రయం.

బాబాయి, పిన్ని ఎన్నాళ్ళ ను౦చో అనుకుంటున్న సినిమాకి వెళ్ళారు. అత్త స్నేహితులతో కలిసి పక్క ఊరు తిరనాళ్లకు వెళ్ళింది. నాన్న స్నేహితులతో గడిపి చాలా రోజులయ్యిందని, నాన్నమ్మ ఉంటే శలవు రోజైనా మాతో గడపవా అంటుంది కాబట్టి వీలు కాదని సాయంత్రం వస్తానని అమ్మకి చెప్పి వెళ్ళాడు. అన్న ఎప్పుడూ తనే స్నేహితుల ఇంటికి వెళ్లి ఆడుకుంటూన్నానని, ఈ రోజు వాళ్ళని తమింటిలో క్రికెట్ ఆడుకోవటానికి పిలుస్తానని, అమ్మని పులిహోర చెయ్యమని కోరి, స్నేహితులను తీసుకు రావటానికి వెళ్ళాడు. అమ్మని పిన్ని,అత్తా పిలిచినా ఆ సరదాలు ఎక్కువలేని అమ్మ వాళ్ళని వెళ్ళమని, ఇంటిలో పని తను చూసుకుంటానని చెప్పి పంపింది,

బాల ‘అమ్మకూచి’ కాబట్టి తనూ వెళ్ళనంది. నాన్న తెచ్చిన కొత్త బొమ్మలతో ఆడుకోసాగింది.

బబ్లూ వాళ్ళు అరుపులతో, కేకలతో, మధ్యలో అమ్మ పెట్టిన పులిహోర, ఇంటిలోని నిమ్మకాయలతో చేసిన షర్బత్‌లతో ఊత్సాహముగా ఆడుకున్నారు. సాయంత్రం అయ్యింది.

అందరూ ఇల్లు చేరారు.అమ్మ ఇచ్చిన కాఫీ, పులిహోర తీసుకుంటున్నారు.

ఇంతలో భళ్లుమని శబ్దం వినిపించింది. అందరూ పెరట్లోకి పరిగెత్తారు. బబ్లూ కొట్టిన లాస్ట్ ఓవర్ లోని లాస్ట్ బాల్ నాన్నమ్మ ఊరగాయల రోజులోస్తున్నాయని మడిగా కడిగి ఆరబెట్టుకున్న జాడీకి తగిలి జాడీ మూడు ముక్కలయ్యింది. హాహాకారాలతో ఆట ముగిసింది. అందరూ బిత్తర పోయి, భయముగా చూస్తున్నారు.

ఆ జాడీ నాన్నమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చింది. పెద్ద సైజు ఆలీబాబా కథలో గాబులా ఉంటుంది. ఉమ్మడి కాపురం అని ముత్తవ్వ నాన్నమ్మ కిచ్చిందిట. అదంటే నాన్నమ్మకి చాలా ఇష్టం. ఎవ్వరినీ ముట్టనివ్వదు. తనే కడుక్కుంటుంది అందులోంచి ఊరగాయ కొద్ది కొద్దిగా మడిగా తీసి బయట పెడుతుంది.

ఇప్పుడెలా? పోనీ ఇంకొకటి తెప్పిద్దామంటే అలాంటివి దొరకవు. రేపు నాన్నమ్మ వస్తే ఇంటిలో ఆడినందుకు బబ్లూని, వద్దని వారించనందుకు తండ్రిని, సరిగా పెంచనందులకు అమ్మనీ, ఇంతమ౦ది ఉన్నా ఒక్కరోజు తను లేకు౦టే ఇల్లు చూసుకోలేక పోతున్న౦దుకు మిగతా వారికీ చివాట్లు తప్పవు.

తాము లేమని ఎవరూ అనలేరు. అది మరీ నేరం నాన్నమ్మ దృష్టిలో.. తను లేనప్పుడు బాధ్యత లేకుండా ఎవరి మటుకు వాళ్ళు తలోవైపూ వెళ్ళటం.

ఇంతలో మరో శబ్దం. భడేల్మని కొబ్బరకాయ పడింది. జాడీకి దూరంగా.

“కొబ్బరికాయ జాడీ మీద పడినా బాగుండేది. నాన్నమ్మ ఏమీ అనేది కాదు కదా నాన్నా” అంది బాల.

“ఎంతమంచి ఆలోచన ఇచ్చావే” అని బాబాయి కొబ్బరికాయ తెచ్చి జాడీ దగ్గర పడేసాడు.

“కానీ బాబాయ్……” ఏదో అనబోయింది బాల. అత్త బాల నోరు మూసేసింది.

అందరూ తప్పని తెలిసినా, తప్పక ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం సమస్య తీరినందుకు.

కానీ ఇప్పుడు వాళ్ళందరికి మరో సమస్య ఉంది.

జాడీ కొబ్బరికాయ పడటంవల్ల కాదు, అన్న బాల్ వేసి పగలగొట్టాడని, బాల నాన్నమ్మకు చెప్పకుండా చూడటం. ఎంత కష్టం?

అందుకే అందరూ బాలని తమ తమ పద్ధతుల్లో మెప్పించే, ఒప్పించే ప్రయత్నములో చుట్టూ చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here