మా బాల కథలు-16

0
9

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

బాల – భలే నిజాలు

ఆ రోజు అమ్మ పని తొందరగా అయిపొయింది. శనివారం ఫలహారాలే కాబట్టి.. అందుకని బాలకిష్టమైన అరటికాయ బజ్జి చేసింది. “ఎప్పుడూ దానికిష్టమైనవే చేస్తావు, దానికిష్టమైనవే నేనూ తినాలా” అని గొడవ చేస్తాడు బబ్లూ. అందుకని వాడి కిష్టమైన మైసూర్ పాక్ కూడా చేసి వాళ్ళ కోసం ఎదురు చూడసాగింది. బాలమ్మ గారు పక్కింటి కాంతమ్మ గారితో గుడి కెళ్ళారు.

బాల, బబ్లూ ఇద్దరూ ఇల్లు చేరారు. “త్వరగా కాళ్ళు కడుక్కుని రండి. మీకు ఇష్టమైన టిఫిన్లు” అంది అమ్మ ఊరిస్తూ.

రాగానే అమ్మని వాటేసుకునే బాల, అమ్మ దగ్గర చేరే బబ్లూ ఇద్దరూ ముభావంగా పుస్తకాలు పెట్టేసి కాళ్ళు కడుక్కుని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయారు. అమ్మ మళ్ళీ పిలిచింది.

“నాకు ఆకలి లేదు” అన్నాడు బబ్లూ.

“నాక్కూడా” అంది బాల.

“ఏమయ్యింది ఇద్దరికీ. మళ్ళీ వచ్చేటప్పుడు దెబ్బలాడుకున్నారా” అంది అమ్మ.

ఇద్దరూ మాట్లాడలేదు. ఫలహారమూ చెయ్యలేదు.

ఇంతలో నాన్న కూడా తొందరగా వచ్చేసాడు. విషయం విని బాలని ఎత్తుకుని నాన్న వస్తే, బబ్లూగాడి చెయ్యి పట్టుకుని బాబాయ్ తీసుకు వచ్చాడు.

“ఏమయ్యిందిరా” అన్నాడు నాన్న.

“వద్దంటే దాన్ని మా స్కూల్‌లో చేర్చారు” అన్నాడు కోపంగా.

“అయితే? ఇప్పుడేమయ్యింది?” అన్నాడు నాన్న.

బబ్లూ తరువాత ఆరేళ్ళకి పుట్టింది బాల. అత్త తరువాత చాలా సంవత్సరాలకి ఇంటిలో ఆడపిల్ల పుట్టడం వల్ల, ఆడపిల్ల అంటే ఆ ఇంటిలో అందరికీ ఉన్న ఇష్టం వల్ల, అత్త అత్తారింటికి వెళ్ళిపోవటం వల్ల, బాలంటే అందరికి ముద్దే.

ఆడపిల్ల, చిన్నపిల్ల, కాబట్టి బాలను కూడా బబ్లూ ఉంటాడు అనే ధైర్యంతో అదే స్కూల్లో వేసారు.

అలా బాబ్లూకి ఏ మాత్రము ఇష్టంలేదు. దాన్ని తీసుకు రావటం, తీసుకెళ్లటం, కాపలా కాయటం అవన్నీ తన స్వత౦త్రాన్ని హరిస్తాయి కదా, వద్దన్నాడు. కాని అది నాయనమ్మ నిర్ణయం కాబట్టి ఎవరూ వినలేదు.

దానికి తగ్గట్టే బాల, స్కూల్‌లో తను చేసే అల్లరి పనులన్నీ ఇంటిలో చేరవేసి తరచుగా నాయనమ్మ తోటి చివాట్లు పెట్టిస్తుంది. అమ్మ ఏమీ అనదు. నాన్న వేరే ఊరినుంచి వచ్చి అలసిపోతాడు. ఎక్కువ పట్టించుకునే అవకాశం తక్కువ. అందుకని బబ్లూ తప్పులకు శిక్ష వేసేది నాయనమ్మే.

బబ్లూ ఏడుపు మొదలెట్టాడు.

“ఏమి చేసింది చెప్పు” బుజ్జగించాడు నాన్న.

“అన్నే నన్ను తిట్టాడు” అంది బాల కూడా ఏడుపు గొ౦తు పెట్టి.

“చెల్లిని ఎందుకు తిట్టావు? నేను ఏమీ అననులే చెప్పు” అన్నాడు మళ్ళీ నాన్న.

తల్లి, బాబాయి ఇచ్చిన ధైర్యముతో చెప్పాడు బబ్లూ.

ఆ రోజు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారు. బబ్లూ స్నేహితుడు రాజుకి తక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకని పేరెంట్స్ మీటింగ్‌కి వాళ్ళ నాన్నను తీసుకు రమ్మని చెప్పింది టీచర్ (ఆ స్కూల్‌లో మీటింగ్‌కి పేరెంట్స్, పిల్లలూ కూడా రావాలి). తలూపాడు రాజు.

ఇంతలో బాల “అమ్మయ్య. ఫరవాలేదులే రాజన్న.. మీ అమ్మని తీసుకు రమ్మ౦టే కష్టమయ్యేది” అంది.

“ఎందుకు?” అంది టీచర్.

“వాళ్ళ అమ్మ స్ట్రిక్ట్ టీచర్. మార్క్స్ తక్కువొస్తే పనిష్మెంట్ ఇస్తుంది” అంది.

“అలాగా అయితే ఈసారి మీ అమ్మని తీసుకునిరా మీటింగ్‌కి” అంది రాజుతో టీచర్.

“మీ ఇంటిలో ఎవరంటే భయం అమ్మంటేనా? నాన్న అంటేనా?” అడిగింది (సరదాగా).

“ఇద్దరంటే కాదు, నాన్నమ్మ అంటే” అంది బాల.

“అయితే నువ్వు మీ నాన్నమ్మని తీసుకురా మీటింగ్‌కి” అని చెప్పింది బబ్లూతో.

అది సాధ్యమేనా? ఒకవేళ వచ్చినా ఇప్పడు ఇంటిలోనూ, మీటింగ్లో స్కూల్ లోను నాన్నమ్మ చేయబోయే గడబిడ గురించే వాడి ఏడుపు.

వాడి ఏడుపుకి అర్థం ఉంది కదా. పాపం బాల నిజాల వల్ల మీటింగ్‌లో రాజు పరిస్థితి, బబ్లూ పరిస్థితి ఏమిటో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here