మా బాల కథలు-5

0
15

[dropcap]బా[/dropcap]ల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.

దేముడి వాటా

ఆ రోజు బాల పుట్టినరోజు. అమ్మ తలంటి పోసి పట్టు లంగా, జాకెట్ వేసింది. బాల గొలుసు, తన నెక్లేసు వేసి౦ది. బాలకి అలా తయారవ్వటం ఇష్టం. కానీ రోజూ స్కూల్ డ్రెస్ కదా కుదరదు.

తయారు చేసి గుడికి తీసుకు వెళ్దామని అనుకుంది. కానీ వంట తెమలలేదు. ఇంకా బాల కిష్టమైన బొబ్బట్లు చెయ్యాలని కూడా అనుకుంది.

అందుకే అన్న బాబ్లూని పిలిచి, బాలని గుడికి తీసుకెళ్ళమని, తనకి పని తెమల లేదని చెప్పి, దేమునికి వెయ్యమని బాలకి అయిదు రూపాయలు ఇచ్చింది. బబ్లూని కూడా వెయ్యమని రెండు రూపాయలు ఇచ్చింది.

గుడి నుంచి వచ్చిన బాల అన్న దేముడి పళ్ళెంలోంచి దేముడి వాటా డబ్బులు కొట్టేసాడని, అవి తను వేసిన డబ్బులేనని, తను అయిదు వెయ్యగానే తీసి జేబులో వేసుకున్నాడని, అడిగితే తను దేముడి వాట డబ్బులు తియ్యలేదని అవి తన డబ్బులే అని అంటున్నాడని గొడవ చేసింది.

తనకి పుణ్యం రాదనీ ఏడుపు మొదలెట్టింది.

అమ్మ బబ్లూని అడిగింది.

వాడు మళ్ళీ అలాగే చెప్పాడు.

“తీసిన మాట నిజమే కానీ అవి దేముడివి కావు…” అన్నాడు.

అమ్మకి కోపం వచ్చింది. ఎన్ని తప్పులు? దేముడి డబ్బులు తీయటం ఒక తప్పు అయితే దొంగతనం మరోతప్పు. పైని౦చి అవి దేముడివి కావని అబద్ధాలు. పళ్ళెములో వేసినవి దేముడువి కాక ఎవరివి? ఇక వినదలచు కోలేదు..

‘నాన్న రానీ నీ పని చెబుతాను” అంటూ తనూ రెండు తగిలించింది

దాంతో వాడు కూడా ఏడుపు మొదలెట్టాడు.

ఇద్దరి ఏడుపు నాన్న వచ్చే వరకు సాగింది.

“ఏమయ్యింది” అడిగాడు నాన్న. అమ్మ విషయం చెప్పింది.

“నువ్వు వేసాకే కదా అన్న డబ్బులు తీసింది” అడిగాడు బాలని దగ్గరకు తీసుకుంటూ నాన్న. తలూపింది బాల.

“ఇంకనేమి? నువ్వు వేసేసావు కాబట్టి నీ పుణ్య౦ నీకు వచ్చేసింది. ఇంకా ఏడవకు” అని ముందు బాల ఏడుపు ఆపించాడు.

తరువాత బబ్లూ వంక తిరిగాడు. “ఎందుకలా చేసావు? నువ్వు చేసింది తప్పు, పాపము రెండు కదా” అన్నాడు గంభీరముగా.

వాడు వెక్కుతూ మళ్ళీ “అవి దేముడివి కావు. నావే” అన్నాడు

“ఎలా” అడిగాడు గంభీరముగా

చెప్పాడు జరిగిన విషయం.

బాల పళ్ళెములో డబ్బులు వేసాక బబ్లూ కూడా అయిదు రూపాయలు వేద్దామనుకున్నాడు. కానీ వాడి దగ్గర అయిదు రూపాయలు లేదు పది ఉంది. పదీ దేమునికి వేసేయ్యటం వాడికి ఇష్టం లేదు. అందుకని తన దగ్గరున్న పది వేసి, బాల వేసిన అయిదు తీసుకున్నాడు. అయితే బాల వేసాక కళ్ళు మూసుకుని దండం పెడుతుండటం వల్ల తను ముందు పది వేయటం చూడలేదు. అయిదు తీసుకోవటమే చూసింది. అందువల్ల అలా అనుకుంది. అదీ సంగతి.

విషయము సరిగా తెలిసికోకుండగా కొట్టినందుకు అమ్మని కోప్పడ్డాడు నాన్న. అమ్మ కూడా బాధపడింది.

కానీ వాడు తప్పు చెయ్యలేదని అర్థమయ్యి ఆనందించింది.

అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే బాల తనకు అర్థమైన రీతిలో విషయము (అన్న దేముడి డబ్బులు తీసాడని) అందరికి ప్రచారం చెయ్యకుండా చూడాలి. విషయం సరిగ్గా తెలియ చెప్పాలి.

అమ్మకి బాల పెట్టిన పని ఎంత పెద్దది? కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here