మా బావి కథ-1

0
13

[ఊరికి కాస్త దూరంగా ఉన్న ఇంట్లో ఉన్న రోజుల్లో ఎద్దడి నీళ్ళ బాధలకి, యామిని అశోక్ గార్లే స్వయంగా బావి తవ్వుకున్నారు. మంచి కోసం సంకల్పం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం; తమ మీద తమకున్న భరోసా, మీరు చేయలేరు అనేకొద్దీ పెరిగిన పట్టుదల.. ఇవన్నీ తమ చేత ఇంతటి (ఘన)కార్యం చేయించిందంటున్నారు శ్రీమతి యామినిఅశోక్. ఆ స్ఫూర్తిదాయక ఉదంతాన్ని పాఠకులకు అందిస్తున్నాము]

పాతాళ గంగమ్మా రారా రా

[dropcap]వా[/dropcap]నలు విపరీతంగా ఉన్నాయి.

మా ఇంట్లో ఈ వానలకి బావి నిండుగా నీరొచ్చింది. అదేం పెద్ద విశేషం? ఎక్కడైనా అంతే అనుకుంటున్నారు కదా! నీళ్లు రావడం మామూలే, అసలు విషయం బావి అదొక అద్భుతమ్. ఎలా అంటారా? చెప్తాను వింటారా?

మా మామగారు మాజీ సైనికోద్యోగి. మాజీ సైనికోద్యోగ సంఘానికి ప్రెసిడెంట్ కూడా. ఈయన చొరవ వల్ల 110 మంది సైనికోద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు.

“ప్రెసిడెంట్‌కి, సెక్రెటరీకి మరో ఇద్దరికి టౌన్‌లో ఇస్తాము, మిగిలిన 106 మందికి ఊరి చివర ఇస్తాం” అంటే “కాదూ, కూడదూ అందరికీ ఒకే దగ్గర కావాలి” అని పేచీపెట్టి ఊరి చివర తీసుకున్నారు.

ఆయన మిలీట్రీ తర్వాత రైల్వేలో చేసి రిటైర్ అయ్యారు. ఆయన విశ్రాంత జీవనాన్ని.. ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు.

అయితే అప్పటికి ఇంకా పాతికేళ్ళ సర్వీసు ఉన్న మావారి ఉద్యోగం, పిల్లల చదువులు ఏవీ గుర్తురాలేదు. వీళ్ళని ఊరి చివర ఇంట్లో ఉంచి, మేము టౌన్‌లో ఉండాలి అంటే అలా చేయలేం.

పిల్లలు చిన్న వాళ్లేగా స్కూల్‌కి సైకిల్ లో వెళ్తారులే అని సర్దుకున్నాము. రెండు గదుల ఇల్లు కట్టుకుని, చుట్టూ తుంగతో వసారా దించి చక్కటి పర్ణశాల లాగా ఇంటిని కట్టుకున్నాము.

ఇంటి చుట్టూ బంతి మొక్కలు, టేకు చెట్లు, తీగ సంపంగి, కర్రపెండలం, కొన్ని కూరగాయల మొక్కలు వేశాము. మొక్కలకి నీళ్లు కొంత దూరంలో ఉన్న బోరింగ్ నుంచి తెచ్చుకోవాలి. కొంత హుషారుగా ఉండేది.

అప్పుడప్పుడు కొంచెం కష్టంగా కూడా ఉండేది. క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు ఇరవైనాలుగు గంటలూ నీళ్లు. ఇప్పుడు కాస్త పొదుపు పాటించాలి.

మొక్కలు, మొత్తం తొమ్మిది మంది, వచ్చీపోయే చుట్టాలు.. రెండు పూటలా స్నానాలు.. ఎన్ని నీళ్ళని మోసేది? పల్లెటూరి వాతావరణం నచ్చినా, పట్నపు సొగసుకి అలవాటు పడ్డ శరీరం అలిసిపోయేది.

దేవుడు మా మొర ఆలకించాడా అన్నట్లు ఒక వ్యక్తి వచ్చి ఏదైనా పని ఇప్పించమని బ్రతిమాలుకున్నాడు.

ఆయన పేరు బాషా. “ఏం చేయగలవు?” అంటే “అమ్మాయిలు నీళ్లు తీసుకుని రావడం చూశాను. నేను నీళ్లు తెచ్చి డ్రమ్ములో పోస్తాను. మీరు వాడుకోండి” అన్నాడు.

మేము కాస్త తటపటాయించాము. పెద్దాయన్నేమి ఇబ్బంది పెట్టేది అని. కానీ ఆయన మరీ బ్రతిమాలాడు.

“నాకు అలవాటైన పనే అమ్మా! ఇల్లు కట్టే దగ్గర నీళ్లు మోసేది నా పని. ఒక పూట భోజనం పెడితే చాలు” అంటూ. వంటకి, త్రాగడానికి మేము తెచ్చుకునే వాళ్ళం.

వాడుకునే నీరు మొత్తం ఆయనే తెచ్చి పోసేవారు. చాలా హుషారైన మనిషి. నాలుగు రోజులు వరుసగా భోజనం చేసేసరికి.. మరీ హుషారు వచ్చేసింది.

ఆయన మా ఇంట్లో మనిషి అయిపోయాడు.

ఆయన్ని మా మామగారు మాత్రమే ‘భాషా భాయ్’ అనేవారు. మిగతా అందరం తాతా అని పిలిచేవాళ్ళం.

ఆయన మమ్మల్ని ‘యామమ్మా, అశోకయ్యా’ అని, చిన్నాడపడుచుని “ధనమ్మా..!” అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు.

మా పిల్లలు తాతకి ముందు నీళ్లు తగిలించేసి, ‘నీళ్ళతాత’ అని పిలిచేవారు.

కాలనీలో అందరికీ ఆయన నీళ్ళతాత అయ్యాడు.

ఒక రోజు “అశోకయ్యా, ఒక్కో బిందె తెచ్చేదానికంటే కావడి అయితే ఒక ట్రిప్పుకి నాలుగు బిందెలు తేవచ్చు” అనేసరికి.. ఫ్రెండ్ ద్వారా తెనాలి నుంచి కావడి బద్దలు తెప్పించారు.

తాళ్ళు తెచ్చేసరికి నీళ్ళతాతే కావడి సిద్ధం చేసుకున్నాడు. మొదటిసారి కావడి ఎత్తిన రోజు ఆయన సంతోషం చూడాలి. పెద్ద పెద్ద అంగలతో బోలెడన్ని నీళ్లు మోసేశాడు. “ఇక మీరేం జంకొద్దు. ఎంతైనా వాడుకోండి” అంటూ హామీ ఇచ్చేసాడు.

ఆ విధంగా నీళ్ల తాత మూడు సంవత్సరాలు ఏకధాటిగా నీళ్లు తెచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి, సాయంత్రం టీ త్రాగేసి ఇంటికి వెళ్లేవారు. వద్దన్నా ఏ మాత్రం వెలితి లేకుండా నింపేవాడు.

తరువాత్తరువాత…

కాలనీలో మిగిలిన కొందరు కూడా ఈయన చేత నీళ్లు మోయించుకునే వారు. కొడుక్కి పెళ్లి చేశాడు. కోడలు రాగానే ఈయన అందరం ఇచ్చే డబ్బులు తీసుకెళ్లి కోడలికి ఇచ్చేవాడు.

ఆమె “నువ్వు అక్కడ తినేసి వస్తావు కదా..!” అని రాత్రి భోజనం పెట్టేది కాదంట. (వేరే వాళ్లు చెప్తే తెలిసింది.) ఈయన మొహమాటం వల్ల మా దగ్గర రెండో పూట భోజనం ఆడిగేవాడు కాదు.

మనిషి కాస్త నీరసించి పోవడం మొదలు అయ్యింది.

అప్పుడప్పుడూ జ్వరం బిళ్ళలు కావాలనేవాడు. ఆ స్థితిలో ఆయన్ని చూసి నీళ్లు తెమ్మనేందుకు మనసొప్పేది కాదు. కాస్త సుఖపడిన ప్రాణానికి కాస్త కష్టం అనిపించేది.

ఇటు చూస్తే తాత డల్ అవుతున్నారు. మున్సిపల్ వాటర్ అప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదు.

ఇక ఏమి చేయాలి..?

ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే.. బావి త్రవ్వించాలి.

అంతే..!

బావి తవ్వాలోయ్..

ఈ రోజు ఆ బావి నీరు పైదాకా వచ్చి చేతికి అందిన సంతోషం.. ఉద్వేగం ఈ కథని రాయించింది.

✍️ మనింట్లో నే బావి త్రవ్వేసుకుంటే..!

ఈ ఆలోచన రావడం తడవుగా సై అంటే సైఅనుకున్నాం. ఒక కొత్త ఉత్సాహం. ఏదో ఒక అద్భుతాన్ని సాధించాలి అన్న బలమైన కోరిక. అప్పుడేగా పెళ్లికి ముందు బోలెడు అద్దె ఇళ్లు, పెళ్లయ్యాక క్వార్టర్స్, ఇప్పుడు సొంత ఇల్లు.

పెరడు, మొక్కలు. వాటికి కష్టం లేకుండా బావి కూడా వచ్చేస్తే.. ఇక ఎంత బాగుంటుంది. నిజమే కదా!

మా పెద్ద తమ్ముడు అప్పుడు ఏర్పేడులో ONGC లో చేసేవాడు. వారం వారం వచ్చేవాడు. ఒకరోజు రాత్రి అందరం వాకిట్లో కూర్చుని మాట్లాడుతూ, అనుకున్నాము.

ఎవరో అన్నారు మీన రాశి వాళ్ళు మొదలుపెడితే మంచిదని అనేసరికి, మా తమ్ముడిది మీన రాశి.

మా చిన్నాడపడుచుది మీన రాశి.

వారం, వర్జ్యం, ఏమీ చూడలేదు. ముహూర్తాలు పెట్టలేదు. వాస్తు గురించి పెద్ద అవగాహన కూడా లేదు అప్పటికి. కేవలం ఆగ్నేయంలో వంట, ఈశాన్యంలో బావి ఉండాలన్న బేసిక్ ఐడియా తప్ప మిగతావి తెలీదు, పట్టించుకోలేదు.

లేడికి లేచిందే పరుగన్నట్లు..

రాత్రి తొమ్మిది గంటలు దాటాక ఎక్కడైతే బాగుంటుంది..? అని ఆలోచించి ఉత్తర ఈశాన్యం వైపు ఒక గుర్తు వేశారు మావారు.

(ఎవరో ఒకరు ఎపుడో అపుడు)

అక్కడ ముగ్గు వేశాము, కాసింత పసుపు, కుంకుమ వేసి, దేవుడిని తలుచుకుని గడ్డపారతో మొదటి పోటు ఆడపడుచు, ఆ తర్వాత తమ్ముడూ వేశారు.

అంతే.. ఇక బాహుబలి (మావారు) బాహువులు ఉత్సాహంతో ఉరకలు వేశాయేమో, గడ్డపార తీసుకుని గబగబా త్రవ్వడం మొదలుపెట్టారు. అసలే చీకటి, అప్పటికి స్ట్రీట్ లైట్స్ కూడా రాలేదు. పావుగంట తవ్వినాక ‘ఇక ఈరోజుకి చాలు, రేపు ఉదయం చూద్దాం’ అని పడుకున్నాము.

మరుసటిరోజు ఎప్పటికంటే ఉదయమే లేచి, కాఫీ పని కాగానే గడ్డపార తీసుకుని త్రవ్వేస్తున్నారు. ఆ రోజు నుంచి అరగంట త్రవ్వి, వచ్చేసి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్లేవారు (మా తమ్ముడు ఊరెళ్లిపోయాడు). మళ్లీ సాయంత్రం రాగానే ఒక గంటసేపు ఈ పనే సరిపోయేది.

మెల్లగా రెండు అడుగుల లోతు త్రవ్విన తర్వాత తవ్వి పోసిన మట్టి ఒకడుగు, లోతు రెండు అడుగులు.

ఖచ్చితంగా ఒక మనిషి మట్టి లాగేందుకు కావాలి. అప్పుడు మా మరిది శ్రీహరికోటలో ఉద్యోగం. తను వచ్చేసరికి రాత్రి అయ్యేది. వారానికి ఒక్కసారే వీళ్ళకి వీలయ్యేది, మా తమ్ముడికి, మరిదికి. మావారికి రోజూ ఇది పార్ట్ టైమ్ జాబ్.

‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది’

‘పాతాళ గంగమ్మ రారా రా! ఉరికురికి, ఉబికుబికి రారారా’

లాంటి పాటలు మాకు స్ఫూర్తిని కలిగించాయి.

ఆ ఏడాది మావారు ఎప్పుడూ పెట్టనన్ని సెలవులు, పర్మిషన్లు పెట్టారు కేవలం బావి కోసమే.

(కలసి తవ్వుదాం బావి)

ఇక హీరోగారు బావిలో తవ్వుతుంటే హీరోయిన్ ఊరుకుంటే ఎట్లా? చక్కగా చుడీదార్ వేసుకుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని మట్టి తోడేదానికి వెళ్ళేదాన్ని. వారానికొక్క రోజు బాహుబలి తమ్ముడూ, మా తమ్ముడూ మట్టి లాగేవారు, మిగతా రోజులు నేనే లాగేదాన్ని. అలా అలా కొన్ని వారాలు గడిచాయి. బావికి అటూ, ఇటూ కర్రలు పాతి, గిలక వేశారు. తవ్వేసి బకెట్‌లో మట్టి వేస్తే, నేను పైకి లాగి మట్టిని గుట్టగా ఒ కదగ్గర పోసి బకెట్ లోనికి వదిలేదాన్ని. అప్పుడప్పుడు బకెట్లో నిమ్మరసం, మజ్జిగ, మంచినీళ్లు వంటివి దించేవారం. ఒక్కోసారి మా మరిది, ఈయన ఇద్దరూ కలిసి తవ్వేవారు. తాడు లాగి, లాగి నా చేతులు బొబ్బలెక్కి పోయేవి. వాళ్ళకి గడ్డపారతో త్రవ్వి చేతులు కాయలు కాచేవి.

అలవాటు లేని పని. అయినా సరదా కొద్దీ, అవసరం అనీ, మొదలుపెట్టాము. అలా అలా తొమ్మిది అడుగుల లోతు తవ్వి..

పదో అడుగు తవ్వేదానికి పలుగు వేస్తే ఖంగు మంటూ శబ్దం వచ్చింది.

లంకెల బిందెలు అంటూ జోకులు వేసుకుని, మర్నాడు ఉదయం లోనికి దిగి చూస్తే బండ పడింది.

చాలా బాధ అనిపించింది. ఇంత కష్టానికి ఫలితం ఇదా అని.

ఈలోపు మా మరిదికి పెళ్లి కుదిరింది. వాళ్ళ పెద్ద బావమరిది.. ఏదో పనిమీద ఇంటికి వచ్చి “అయ్యో! బండ పడిందా! మీరేం చేస్తారు గానీ, ఊరినుంచి సేద్యగాళ్లని తెస్తాను. బిర్రుగా అన్నం పెడితే చాలు. అసలు ఏట్లాంటి రాళ్లయినా పిండి పిండి చేసేస్తారు” అనేసరికి హమ్మాయ్య అనుకున్నాం.

ఫలానా రోజు వాళ్ళని తీసుకుని వస్తామని చెప్పి వెళ్లారు. ఆరోజు రానే వచ్చింది. ఆయన తీసుకొచ్చిన

ముగ్గురు సేద్యగాళ్ళు.. యమా జమాజెట్టీలు.

ఆరు అడుగులు మించి పొడవు, దానికి తగ్గ లావు.

వాళ్లే వస్తూ వాళ్ళకి వాటమైన గడ్డపారలు కూడా తెచ్చేసుకున్నారు.

వచ్చిన వాళ్ళ కోసం వంట చేయాలి మరి.

✍️ పల్లెటూరి వాళ్ళు,బాగా పని చేసేవాళ్ళు, బాగా తింటారు. నా పాకాశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాను. అసలే మరిదికి కాబోయే అత్తగారి ఊరు.

అందుకని చక్కగా పుదీనా రైస్, వెజిటబుల్ కుర్మా, వైట్ రైస్, సాంబారు, రసం, పెరుగు, అప్పడాలతో హంగామాగా భోజనం పెట్టేశాము. వరండాలో ఆకులు వేసి వడ్డించాము. సుబ్బరంగా తిన్నారు మెచ్చుకుంటు.

అరగంట గడిచాక లేచారు.

బావిలోకి దిగేందుకు.

మేమంతా గబగబా భోజనాల పని కానిచ్చి కుతూహలంగా కూర్చున్నాము. ఇంతవరకూ వచ్చీరాని పని మేము చేసింది. వాళ్లేమో ప్రొఫెషనల్ వర్కర్స్. వాళ్ళు మా పనిని చూసి ఏమి నవ్వుకుంటారో అనుకుంటూ, వాళ్ళు పగల గొట్టే బండ శబ్దం వినేందుకు చెవులు రిక్కించి ఉన్నాము. ఒకే ఒక్క శబ్దం వినిపించింది. ఖంగుమంటూ. లాఘవంగా వేసిన గడ్డపార బండని చీల్చి చెండాడి రాయి ముక్కలు పైకి చెదురుతాయి అనుకుంటే..😆

లోనికి దిగిన పనివాళ్ళు పోటు వేసి పైకి లేచిన గడ్డపారతో పాటు పైకి వచ్చారు. (అంత వేగంగా అన్నమాట).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here