మా మధ్య ప్రదేశ్ పర్యటన-2

0
9

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]భో[/dropcap]పాల్ జంక్షన్. చాలా పెద్ద స్టేషన్.

భోపాల్ రైల్వే స్టేషన్ వద్ద మిత్రులతో రచయిత

అర్షద్ వచ్చి మాకు నమస్కరించాడు. సామాన్లు డిక్కీలో పెట్టాడు. ఒక సూట్ కేసు పట్టలేదు. కారణం వెనక గ్యాస్ సిలిండరుంది. దాన్ని పైన స్టాండ్ మీద పెట్టి తాడు బిగించాడు.

అర్షద్ యువకుడే. స్కార్ట్‌గా ఉన్నాడు. “హర్షద్, హమ్‌కో రాస్తే మే డిన్నర్ ఖిలానా, బేటా!” అన్నాను

“జరూర్ జనాబ్” అన్నాడు. “మేరా నామ్ అర్హద్ హైజీ, హర్షద్ నహీ” అన్నాడు నవ్వుతూ. ఒక్క అక్షరంతో మతాలు మారాయి!

“సౌత్ ఇండియన్ ఖానా మిలేగా, కిధర్ భీ?”

“మిలేగా సాబ్”

పది నిమిషాల్లో ‘ఉడిపి శ్రద్ధా’ అన్న హోటల్ ముందాపాడు. ఇడ్లీ, ఆనియన్ ఊతప్పం తిన్నాం. మనవైపులా లేవు. అదే అంటే, యల్లమంద అన్నాడు – “సరేలెండి, తినడానికి వచ్చామా ఏంటి?” అని.

అదే టూరింగ్ స్పిరిట్ అంటే!

11 గంటలకు హోటల్ రాజహంస్‌లో చెకిన్ అయ్యాము. చలి ఎక్కువగా లేదు, కాని హాయిగా ఉంది. కోల్డ్ కాదు, కూల్! హోటల్ ఉన్న ఏరియా పేరు పీర్‌గేట్, కమలినీ మందిర్ రోడ్. రూం బాగుంది.

“రేపుదయం 5.45 కు రావయ్యా!” అని చెప్పాం డ్రైవర్‌కు. హాయిగా పడుకొని, ఉదయం 4.30కి లేచి తయారయ్యాం. రాత్రే, రెండోజులకు గాను బట్టలు, మందులు వగైరా ఒక షోల్డర్ బ్యాగులో సర్దుకున్నాం.

పెద్దబ్యాగులన్నీ వాళ్ల స్టోర్ రూములో పెట్టించాలి. ఎందుకంటే మళ్లీ రేపు రాత్రికి భోపాల్ రావాల్సిందే. అదే హోటల్! అవన్నీ మోయడం ఎందుకు?

యల్లమంద నా వైపు ప్రశంసగా చూశాడు.

దారిలో మంచి అద్రక్ చాయ్ తాగించాడు అర్షద్. సరిగ్గా ఆరు గంటలకు స్పేషన్‍లో ఉన్నాం. మేం ఖజురహో వెళ్లే రైలు ఆరున్నరకు. అది ఇంటర్‌సిటీ. దాని పేరు మహామానా ఎక్స్‌ప్రెస్. కిటకిటలాడుతుంది జనాలతో. జోజో మాకు ఎ.సి.ఛెయిర్ కార్ ఎందుకు బుక్ చేశాడే అర్థమైంది. ఎక్కి కూర్చున్నాం.

***

సరిగ్గా ఆరున్నరకు కదిలింది మహామానా ఎక్స్‌ప్రెస్. ఎ.సి.చెయిర్ కార్ బాగుంది. సీట్లు విశాలంగా, రూఫ్ అందంగా ఇంటీరియర్ డెకరేషన్‌తో, సౌకర్యవంతంగా ఉంది. టూరిస్టులు ఎక్కువగా వెళతారని కాబోలు! విశాఖ నుంచి అరకు వెళ్లే కిరండోల్ ఎక్స్‌ప్రెస్‍కు విస్టాడోమ్ కోచ్‍లు అమర్చారు. కారణం దారి పొడవునా కొండలు, జలపాతాలు, టన్నెల్స్, టూరిస్టులు చూసి ఆనందిస్తారని. ఈ రైలుకంత ‘సీను’ లేనట్లుంది.

మొత్తం 384 కి.మీ. దూరం ఉందని ‘రైల్ యాత్ర’ యాప్ చూపిస్తోంది. ఒక గంట ప్రయాణించాం. మా ముగ్గురికీ వరుసగా త్రీసీటర్ వచ్చింది. నేను కిటికీ వద్ద, యోగాగాడు మధ్యలో, యల్లమంద అటు చివర. కిటికీ దగ్గర ‘విండో ‘అని, ‘ఐల్’ అని (window, aisle) రాసి ఉంది. యల్లమంద నన్ను అడిగాడు.

“మాస్టారు, ఐజిల్ అంటే?”

“ఐజిల్ కాదు మిత్రమా, ఐల్. అంటే రెండు వరుసలమధ్య ఉండే మార్గం అని”

“కిటికీ వైపు కానిది అన్నమాట”

నాకు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలోని లిఫ్ట్‌లలో – స్ట్రీట్ లెవెల్, ప్లాట్‌ఫామ్, కన్‍కోర్స్  (Concourse) అనే బటన్‌లు గుర్తొచ్చాయి. మొదట్లో కన్‌కోర్సు అంటే తెలిసేది కాదు. గూగుల్ తల్లిని అడిగితే చెప్పింది – ‘a large open area inside a public building, e.g. railway station.’ అని.

అంటే మెట్రో స్టేషన్ మధ్యలో, టికెట్ తీసుకొని, సెక్యూరిటీ చెక్ చేయించుకుని లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ఉండే విశాల ప్రాంతం. ఎంత ఇంగ్లీషు లెక్చరర్ నైనా, అన్నీ తెలియవు కదండి!

రెండున్నర గంటల తర్వాత బీనా జంక్షన్ వచ్చింది. అదంతా బుందేల్‌ఖండ్, మాల్వా ప్రాంతం. అక్కడ రైలు పదినిమిషాలు ఆపాడు. పోహా, సింగణా, ఉప్మా అమ్ముతున్నారు. పోహా, ఉప్మా, ప్యాక్ చేశారు. సింగణాలంటే మీడియం సైజులో ఉండే సమోసాలు. అవి మాత్రం గరమ్ గరమ్‌గా ఉన్నాయి. ప్లేటు 30 రూపాయలు. మూడుంటాయి. అవి తిన్నాం. చాలా బాగున్నాయి. వాటితో బాటు ఇచ్చిన పచ్చి మిరపకాయలను (ఫ్రైడ్) నేను యోగాగాడు ప్రీతిగా తిన్నాం. రాయలసీమోళ్లం కదా, కారమంటే మమకారం. యల్లమంద ఆంధ్రోడు. కారం తినలేనని వదిలేశాడు. అతన్ని చూసి జాలిపడ్డాం.

‘లలిత్‍పూర్’ అనే స్పేషన్ వచ్చింది. అక్కడ ‘టీ’ వచ్చింది. చాలా బాగుంది. వేడిగా లేకపోతే డబ్బు లివ్వనని, వేడి మాత్రమే కాదు, రుచి బాగలేకపోయినా ఇవ్వవద్దని, నేను, టీ అబ్బాయి సవాళ్లు విసురుకున్నాం. చివరికి అతనే విజేత! టీ వేడిగా, రుచిగా ఉంది.

యల్లమంద అన్నాడు “మిత్రమా! హిందీని ధారాళంగా మాట్లాడేస్తున్నారే?

“నా మొహం! ధారాళతే గాని, వ్యాకరణ బద్ధత ఉండదు మాస్టారు. క్రియాపదాల్లో తప్పులు వస్తాయి!”

“మా కంటే మేలే కద!” అన్నారు యోగానందులవారు. కూర్చునే ఒక కునుకు తీసి లేచారిది వరకే. తర్వాత ఖర్గపూర్. వెస్ట్ బెంగాల్‍లో ఖరగ్‌పూర్ అనే నగరం ఉంది. అక్కడ ఐఐటి క్యాంపస్ ఉంది. మన తెలుగువాళ్ల అక్కడ ఎక్కువ. విశాఖ-హౌరా లైన్‍లో వస్తుంది. చాలా పెద్ద జంక్షన్.

తర్వాత ఛతర్‌పూర్. వచ్చే స్టేషనే ఖజురహా అని యాప్ చూపిస్తూంది. ఒకటిన్నరకు దిగాము. స్టేషన్ను ఖర్జ్ (Khurj) అని కూడా రాశారు. ఈ పేరెందుకు వచ్చిందా? అని ఆలోచించాను.

ముందే, డొనేటో వారు ఏర్పాటు చేసిన కారు డ్రైవరు అమోఘ్ చౌహన్ ఫోన్ చేశాడు. మమ్మల్ని ఆదరంగా రిసీవ్ చేసుకొన్నాడు. సామానేమీ లేకుండా వచ్చారేమని ఆశ్చర్యపోయాడు! భోపాల్‌లో పెట్టి వచ్చామని చెప్పాం. అతనిలా అన్నాడు.

“సాబ్ జీ! ఖజురహోలో చాలా మందిరాలున్నాయి. అన్నీ ఆరు గంటలకే మూసేస్తారు. ప్రాచీన ఆలయాల కాంప్లెక్స్ లను మూడు సెక్టార్లుగా విభజించారు సార్, ఈస్టర్న్, వెస్ట్రన్, సదరన్. మనం ఈరోజు వెస్ట్రన్ కవర్ చేద్దాం. చెకిన్ ఇప్పుడు వద్దు. టైం వేస్ట్. మీకిచ్చిన రిసార్టు పది కి.మీ. ఉంది. ముందు లంచ్ చేయండి.”

అతడే మా గైడ్ కూడా!

జాహ్నవి ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌కు తీసుకువెళ్ళాడు. అక్కడ ‘మార్వాడీ తాలీ’ తిన్నాం. రోటీలు, దాల్, చనామసాలా, గులాబ్ జామ్, పాపడ్, కొంచెం అన్నం. అదీ బాస్మతి రైస్, పెరుగు లేదు. అన్నం ఎంత తక్కువ అంటే మా మనవడికి కూడా చాలదు. మా గులాబ్ జాములు రెండూ యల్లమంద కిచ్చేశాం.

Khajuraho Monuments Board

వెస్ట్రన్ సెక్టార్ ఒక కి.మీ. ఉంది. పార్కింగ్ ఏరియా నుంచి కి.మీ. నడిస్తేగాని దేవాలయాలు కనబడవు. భుక్తాయాసం లేదు! మిత భోజనం కదా! పైగా వాతావరణం చాలా హాయిగా ఉంది. ఇరవై నిమిషాల్లో ‘కాందరీయ మహాదేవ టెంపుల్’ చేరుకున్నాం. అంతా రెడ్ స్టోన్ నిర్మాణం. ఇరవై ముఫై మెట్లున్నాయి.

ఎత్తు మీదే నిర్మించారు. ఆ శిల్పసంపద కళ్ళు చెదిరేలా ఉంది. గోడల మీద సన్నని లతలు, గొలుసులు, రాతిలోనే చెక్కారు. ఆ ప్రాంతాన్ని, అంతా ‘సేవాగ్రామ్’ అంటారు. గుడి పేరు తప్పుగా పలుకుతున్నామని గ్రహించాం, హిందీలో చూసి! అది ‘కందారియా’. దాని కర్థం ‘మహా గుహా నివాసి’ (The Great God of the Cave). యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్. మధ్యయుగపు అలయ నిర్మాణ కౌశలం అద్భుతం.

చందేలా వంశీయుడైన విద్యాధరమహారాజు (1003- 1035) కాలంలో దీన్ని నిర్మించాడు. ఆయన మహమ్మద్ ఘజనీని ఎదిరించి పోరాడాడు. గెలిచాడు కూడా! ఆ విజయాన్ని పురస్కరించుకుని, తనకు విజయ ప్రదాత అయిన పరమేశ్వరునికి ఈ కందారియా మందిరం కట్టించాడు. శిల్పి పేరు ‘విరింద’ అని కూడా శాసనంలో ఉంది. నిర్మాణకాలం 11వ శతాబ్దం.

దేవాలయం 102 అడుగుల ఎత్తు ఉంది. పోర్చ్‌లు, గోపురాలు, ప్రధాన గోపురం, మెజస్టిక్‌గా ఉన్నాయి. గుడి 13 అడుగుల విశాలమైన గద్దె మీద ఉంది. మేరు పర్వతం ఆకారాన్ని పోలి ఉంది. ఇరవై మీటర్ల వెడల్పు. ఖజురహో లోని అతి పెద్ద, గొప్ప దేవాలయం ఇదే. ప్రవేశ ద్వారం మీద శిలా తోరణం ఉంది. దాని శిల్పచాతుర్యం చూసి అబ్బురపడ్డాము: ఒక పెద్ద పూలదండను రాతిలో చెక్కారు. అబ్బ! అనిపించింది. సింహాలు ఏనుగులు సజీవంగా ఉన్నట్లు భ్రమింప చేస్తున్నాయి. మొత్తం గుడి వెలుపల 84 spires, అంటే గోడల మీద చెక్కిన విడిభాగాలున్నాయి.

లోపల మూడు మండపాలున్నాయి. చాలా విశాలమైనవి. గర్భగుడిలో కందారియా మహాదేవుడు లింగరూపంలో విలసిల్లుతున్నాడు. లోపల వెలుగు తక్కువగా ఉంది, గర్భగుడి ఒక గుహను తలపింపచేసింది. ఎంతోమంది దేవతామూర్తులు కుడ్యాలపై కొలువుతీరి ఉన్నారు. ప్రధాన గోపురానికి అనుషంగికంగా ఉప గోపురాలు. విగ్రహాల్లో అగ్నిదేవుని విగ్రహం అద్భుతం! కొన్ని మైధున క్రియలను ప్రదర్శించే స్త్రీపురుషుల విగ్రహాలున్నాయి కుడ్యాలపై. బహుశా అప్పుడు కమ్యూనిటీ సెంటర్లు గుడులే, కాబట్టి, ప్రజలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పడానికి వాటిని చెక్కి ఉంటారు. చతుర్విధ పురుషార్థాలలో ‘కామం’ కూడా ఉంది కదా! “కామిగాక మోక్షగామిగాడు” అని సెలవిచ్చాడు యోగి వేమన.

గుడి అంతా చూసి దిగి వచ్చి, క్రింద బెంచి మీద కాసేపు కూర్చున్నాం. మూడు దాటింది. వాటర్ బాటిల్స్ రెండు తెచ్చుకున్నాం. మధ్యలో గొంతు తడుపుకుంటున్నాం. తర్వాత ‘చిత్రగుప్త’ టెంపుల్‍కు వెళ్లాం. అంతా పచ్చని పచ్చిక బయళ్లు. మధ్యలో ఫౌంటెన్లు, విశ్రమించడానికి రాతి బెంచీలు.

‘చిత్రగుప్త’ టెంపుల్‍

ఈ గుడి కొంచెం చిన్నది. ఇది కూడ పదకొండో శతాబ్దపు నిర్మాణమే. ఇది సూర్యుని గుడి. మరి చిత్రగుప్త అనే పేరెందుకు పెట్టారు? లోపల మహామండపం పైకప్పు నిండా శిల్ప సౌరభం. గర్భగుడి శిధిలంగా ఉంది.

‘చిత్రగుప్త’ టెంపుల్‍

సప్తాశ్వరథమును ఆరోహించిన భాస్కరుని విగ్రహం అద్భుతంగా ఉంది. ఆయన కవచము, శిరస్త్రాణము, బూట్ల వంటి పాదరక్షలు ధరించి, నిలుచున్న భంగిమలో ఉన్నాడు. చేతిలో పద్మములను ధరించాడు. కుడ్యముల మీద శృంగార రస రతి భంగిమలతో విగ్రహాలు చెక్కారు. విష్ణువు దశావతారాలను మనోహరంగా చెక్కారు. ఒక చోట తన దుస్తులను పైకి లేపి తన ‘యోని’ని ప్రదర్శిస్తున్న అప్సరస విగ్రహం!

యల్లమంద అన్నాడు. “మిత్రమా! ఇదేమిటి మరీ అసభ్యంగా”

నేను నవ్వాను. “రసపట్టులో తర్కం కూడదు” అన్నాను. యోగా నోరు తెరుచుకోని అన్నీ చూస్తున్నాడు. శతాబ్దాల క్రిందటి మన భారతీయుల శృంగారరస స్ఫూర్తికి అచ్చెరువొందాము.

నేను మిత్రులకు చెప్పాను “అబ్బాయిలూ (?), ఇప్పుడు ఇంటర్నెట్‌లో పోర్న్ దృశ్యాలు చిన్నపిల్లలు కూడా చూసేస్తున్నారు. ఆ లెక్కన ఇవి సభ్యమైనవే!”

ఇద్దరూ ఏకభవించారు నాతో.

గుడికీ గుడికీ మధ్య మూడు వందల మీటర్ల దూరాలున్నాయి. మా తదుపరి దర్శనం విశ్వనాథ్ టెంపుల్.

మామూలుగా అయితీ ప్రతి సెక్టారుకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారట. ప్రస్తుతం ‘వరల్డ్ హెరిటేజ్ వీక్’ నడుస్తుందట. కాబట్టి ఫ్రీ! ఇది మా చోదకుడు మరియ మార్గదర్శి ఐన అమోఘ నామధీయుడు చెప్పాడు. మంచిదే కదా!

 

ఈ గుడిని 1002లో కట్టారు శిల్పరీతి కందారియా మందిరాన్ని పోలి ఉంది. ఎందరో సురసుందరీమణులు, సమున్నత కుచములను, నతనాభులను, ఘన జఘనము లను, అస్తినాస్తి విచికిత్సాహేతువులైన కౌను (నడుము) లను – కుడ్యముల మీద ప్రదర్శిస్తున్నారు. ఎంత మనోహరంగా ఉన్నారో! వారిలో దివ్యసౌందర్యమే గాని, అశ్లీలత లేదు.

‘యద్భావం తద్భవతి’ అన్నారు. అంతా మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. దీన్ని నిర్మించినవాడు చండీలా వంశస్థుడైన ధంగుడు. సప్తమాతృకలను శిల్పాలుగా చెక్కారు. నృత్యం చేస్తున్న గణికుని శిల్పం అపూర్వం. ఇక బయటి కుడ్యాలు చూసి తీరవలసిందే. నుదుట కుంకుమ దిద్దుకుంటున్న యువతి, స్నానం చేసి కురులార బెట్టుకుంటున్న పడతి, అద్దంలో తన్ను తాను చూసుకుంటున్న నెలత, మురళి వాయిస్తున్న ఉవిద, అబ్బో! ఆ సజీవాకృతులు చేసి ధన్యులమయ్యాము. గర్భగుడి చుట్టూ పరిక్రమ (ప్రదక్షిణ) మార్గం కూడా శిల్పకళాశోభితమే. ఎడమ కాలిని కొంచెం పైకెత్తి, పాదానికి పారాణి పూసుకుంటున్న స్త్రీ శిల్పం అనల్పం. చేతులు వెనక్కు పెట్టి కంచుకమును (బ్రా) బిగించుకొనుచున్న సుందరి. తర్వాత మైధున దృశ్యాలు సరేసరి. ఇవి ‘acrobatic sex’ ను ప్రదర్శిస్తున్నాయి. మలివయసులోని వారం కాబట్టి, మాకెలాంటి మనోవికారాలు కలుగలేదు. నలభై ఏండ్ల క్రిందట ఐతే పరిస్థితి వేరుగా ఉండేది.

విశ్వనాథ్ టెంపుల్

ఉపరతి భంగిమలు కూడా ఉన్నాయి. ఉపరతి అంటే స్త్రీ పైన ఉండి ‘యాక్టివ్ పార్ట్’ తీసుకోవడం. మా యోగాగాడు నన్నడిగాడు – “ఒరేయ్ శర్మా! ఇదెక్కడి చోద్యంరా?” అని.

“పాశ్చాత్య దేశాలలో ఇది కామన్ రా. మన ఆడవాళ్లకు అంత చొరవ ఎక్కడిది? ఒకవేళ చొరవ చూపుదామనుకొన్నా, బరితెగించిందంటుంది మన పురుషాధిక్య సమాజం. ఒరేయ్ యోగా, సెక్స్ అనేది ఏ పరిమితులకు లోబడదు. స్త్రీ, పురుషుల ఇష్టానికి తగినట్లు, ఏమైనా సంభవమే!” అన్నాను.

“మిత్రమా! బాగా స్టడీ చేశారు!” అన్నాడు యల్లమంద.

“ఓన్లీ స్టడీ!” అన్నా నవ్వుతూ.

కాసేపు విశ్రాంతి తీసుకున్నాం ఒక తిన్నె మీద. ఐదయింది. వెలుగు తగ్గుతూ ఉంది. ఇక రెండు గుళ్లున్నాయి. పార్వతీమందిర్, లక్ష్మణ మందిర్.

“పదండి! ఆరు గంటలకు మూసేస్తారట” అన్నా!

పార్వతీమందిరం దగ్గరే. అది ఒకే గోపురం! నిలువుగా ఉంది. గర్భగుడి ద్వారం మీద ఒక కళాత్మకమైన ఆర్చ్. దాని మీద త్రిమూర్తుల విగ్రహాలను చెక్కారు. పక్క కుడ్యం మీద రతి భంగిమలు డిటో! దాన్ని చూడటానికి ఎక్కువ సేపు పట్టలేదు.

పార్వతీమందిరం
పార్వతీ మందిర్ వద్ద మిత్రులు యల్లమంద గారితో

తర్వాత లక్ష్మణమందిర్. దీనిని పదో శతాబ్దంలో యశోవర్మ అనే చందేలా రాజు నిర్మించాడు. పంచాయతన రీతిలో ఉంది నిర్మాణం. ఎత్తైన గద్దె మీద ఉంది. బయట బాల్కనీలు, కిటికీలు (అన్నీ రాతి లోనే) ఉండటం విశేషం. లక్ష్మీదేవి విగ్రహం చాలా బాగుంది. చతుర్భుజుడైన మహావిష్ణువు గోడమీద కొలువు తీరాడు. ప్రధాన విగ్రహం తల మానవరూపం, ఇరు వైపుల వరాహ సింహరూపాలు. రాముని తమ్ముడు లక్ష్మణునికి ఈ గుడికి ఏమీ సంబంధం లేదు. మహిషాసురమర్దని, నృసింహుని విగ్రహం ఉన్నాయి. హయగ్రీవుని విగ్రహం, వామనుడి విగ్రహం కళాత్మకంగా చెక్కారు.

లక్ష్మణ్ మందిర్, సైడ్ వ్యూ

మా ముగ్గురికీ ఏదో వేరే లోకంలో విహరించినట్లుంది. ఎంత సౌందర్యం? ఎంత సౌకుమార్యం? అంతా రెడ్ స్టోన్ లోనే. ఆ కళాప్రపూర్ణులకు జోతలర్పించాం. పావు తక్కువ అరుకు వెస్టర్న్ సెక్టార్ పూర్తయింది. ఇంకా చిన్నచిన్న గుళ్లున్నాయి కానీ, అన్నీ చూడలేం కదా!

లక్ష్మణ్ మందిర్

మళ్ళీ వెనక్కు నడవాలేమో, దేవుడా! అని భయపడ్డాము. కాని ‘ఎగ్జిట్’ అని ఎదురుగా బోర్డ్ చూసి సంతోషించాము

ఎగ్జిట్ ఎదురుగా పార్కింగ్ కారు పెట్టుకోని మా అమోఘ్ చౌహాన్ రెడీ.

“అచ్ఛా చాయ్ పిలావో బేటా!” అనడిగాను.

“రిసార్ట్ మే మిలేగీ జీ” అన్నాడు.

“తబ్ తక్ ఇంతజార్ నహీ కర్ సక్తే భయ్యా, నజ్‍దీక్ మే కోయీ చాయ్ కా దుకాన్ దేఖ్. బడా రెస్టారెంట్‌ కా జరూరత్ నహీవో! రోడ్ సైడ్ చాయ్ వాలా భీ చలేగా!” అన్నా.

మా సంగతి అతనికి అర్థమైంది. రెండు నిమిషాలతో ఒక చిన్న కొట్టు దగ్గర ఆపాడు. అక్కడ శనగపిండితో చేసిన పొడవైన అప్పడాలున్నాయి. అంగుళం వెడల్పు, అడుగు పొడవు. వాము వేశారు. వందగ్రాములు 30 రూపాయలట. ఎనిమిది వచ్చాయి.

“పంపకాలు కుదరవే!” అన్నాను.

యోగాగాడన్నాడు – “నాకు రెండు చాలు. మీరిద్దరూ చెరో మూడు తినండి”

వాడి త్యాగనిరతిని ప్రశంసిస్తే, నవ్వాడు.

ప్రత్యేకంగా స్ట్రాంగ్ టీ పెట్టిమ్మని, సాబ్‌జీలు హైదారాబాదు నుంచి వచ్చారని టీ కొట్టామెతో చెప్పాడు డ్రైవర్. ఆమె నవ్వుతూ మాకు నమస్కరించింది. ఫుట్‍పాత్ మీదే ఒక చెక్క సోఫాలో కూర్చున్నాం. టీ అద్భుతం! మా చక్కెర కూడా యల్లమందకే వెయ్యమన్నాం. ఆయన నవ్వి, “ఎక్కువైతుంది! ఒక స్పూన్ చాలు” అన్నాడు.

మేం రిసార్టు చేరుకొనేసరికి ఆరున్నర. దాని పేరు MPT ఝంకార్. అంటే మధ్యప్రదేశ్ టూరిజం వారిది. అద్భుతంగా ఉంది. టౌన్‌కు దూరం. ముందు లాన్, పెద్ద వృక్షాలు, వాటిని సీరియల్ లైట్లతో అలంకరించారు. అక్కడక్కడ డోమ్ లైట్లు.

MPT ఝంకార్‌లో

చెకిన్ అయ్యాం. రూం చాలా పోష్‌గా ఉంది. అంత మంచి రిసార్టు బుక్ చేసినందుకు డొనేటో జోజోను ఫోన్ చేసి అభినందించాలని అనుకున్నా.

MPT ఝంకార్‌లో

అమోఘ్ అన్నాడు – “సార్ మీరు కాసేపు రెస్ట్ తీసుకొంది, రిఫ్రెష్ అయింతర్వాత. నేను ఏడున్నరకు వస్తా. మధ్యప్రదేశ్ రీజనల్ డాన్స్ ప్రదర్శన ఉంది. తొమ్మిదికి పూర్తవుతుంది. డిన్నర్ చేయించి రిసార్టులో డ్రాప్ చేస్తా.”

“వెరీగుడ్.” అన్నాను.

“వెళదామా?” అన్నా మావాళ్లతో.

“లక్షణంగా!” అన్నారు వాళ్లు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here