మా మధ్య ప్రదేశ్ పర్యటన-3

0
8

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]హా[/dropcap]యిగా, గీజర్ వేసుకుని స్నానాలు చేశాము. బడలిక తీరింది. కాసేపు నడుములు వాల్చాము. యోగా ఎందుకో ఏదో ఆలోచనలో ఉన్నాడు.

“ఏమైందిరా?” అనడిగాను.

“అవే శర్మా, మనం చూసిన శిల్పాలు! మరీ గుళ్ల గోడల మీద! ఒక చోట అయితే ఏదో జంతువుతో సంభోగిస్తున్నాడొకడు. ఇవి అవసరమంటావా?”

యల్లమంద నవ్వి, చెప్పమన్నట్లు నావైపు చూశాడు.

“ఒరేయ్ యోగా, నీకు ఈ విషయాల పట్ల బొత్తిగా అవగాహన లేదు. జంతువులు కేవలం ఒక నిర్ణీత సీజన్ లోనే మేటింగ్ జరుపుకుంటాయి. వాటికి వావివరసలుండవు. దుస్తులు తీసుకొని రహస్యాంగాలను కప్పుకోవు. కాని భగవంతుడు వాటికి కామంలో ఒక క్రమశిక్షణను ప్రసాదించాడు.”

యల్లమంద అన్నాడు “యోగా గారు, మనిషిలో నిరంతరం కామం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది విపరీత పోకడలు పోతుంది. కొన్నిసార్లు వావివరసలు కూడా పరిగణించదు.. అందుకే, ఒక వయసు వచ్చాక, తల్లి పక్కన, చెల్లి పక్కన కూడా పడుకోవద్దన్నారు విజ్ఞులు. వాత్సాయన మహర్షి కామసూత్రములు వ్రాశాడు. మానవాళికి కామ దిశానిర్దేశం చేసే గ్రంథమది. కాని ఆయన ధర్మబద్ధమైన కామాన్నే బోధించాడు.” మేమిద్దరం శ్రద్ధగా వింటున్నాం.

“తాపీ ధర్మారావుగారు ‘మన దేవాలయాల మీద బూతు బొమ్మ లెందుకు’ అన్న పుస్తకం రాశారు. ఆయన్ను మించిన హేతువాది లేడు. సంతానమే వైవాహిక జీవితానికి పరమార్థం అని ప్రజలు నమ్మిన కాలమది. కాళిదాసుల వారు తమ రఘువంశ కావ్యంలో రఘువంశ చక్రవర్తుల గురించి చెబుతూ ‘ప్రజాయై గృహమేధినామ్’ అంటాడు. ‘ప్రజా’ అంటే సంస్కృతంలో సంతానం. సంతానం కొరకు మాత్రమే గృహస్ధులవుతారట సూర్యవంశ ప్రభువులు. కామం కొరకు కాదు.

శృంగారం పాపకార్యం కాదు. సృష్టికి మూలమే అది! మనం కొలిచే దేవుళ్లందరికీ భార్యలుంటారు. వశిష్ఠాది మహర్షులకు సైతం భార్యలున్నారు. కానీ, ఏకపత్నీవ్రతం అనేది మానవ ధర్మం. దానిని శ్రీరామచంద్రమూర్తి ఆచరించి చూపాడు. పెళ్లి అనేది ఒక పురుషుని, ఒక స్త్రీని కలుపుతుంది. హెల్తీ సెక్స్ మార్గం సుగమం చేస్తుంది. సెక్స్‌ను శాస్త్రీయంగా బోధించడమే ఈ శృంగార భంగిమల పరమార్థం.

‘ఇనుప కచ్చడాలు’, ‘పెళ్లి దాని పూర్వోత్తరాలు’ అన్న రెండు గ్రంథాలను కూడా తాతాజీ (ధర్మారావు) వ్రాశారు. యజ్ఞాలలో జరిగే బహిరంగ సంభోగాలను యాగాలతో దాగున్న పశుసంపర్కాలను, పండగల పేరున జరిగి అనాగరిక లైంగిక విశృంఖలతను, వాటి మూలాల్లోకి వెళ్లి వివరించాడాయన.

గూడవల్లి రామ బ్రహ్మంగారి సంపాదకత్వాన వెలువడిన ‘ప్రజామిత్ర’ పత్రికలో ధర్మారావుగారి వ్యాసాలు ప్రచురింపబడి, అప్పట్లో సంచలనాలకు నిలయమైనాయి.”

నేను నా మిత్రుడివైపు ప్రశంసగా చూశాను. యోగానందులవారికి విషయం అర్థమైంది. ఏడున్నరకు రెడీ అయ్యాము.

MPT ఝంకార్ లాబీ చాలా కళాత్మకంగా ఉంది. సోఫాలు, పాండిలియర్స్, ఇంటీరియర్ డెకరేషన్ అద్భుతం. మర్నాడు ఉదయం కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఎనిమిది నుంచి పదిగంటల వరకు ఉంటుందని, చాలా అందంగా ఉన్న రిసెప్షనిస్ట్ వినయంగా చెప్పింది.

అమోఘ్ వచ్చేశాడు. దారిలో అతన్ని అడిగాను “అబ్బాయి, ఖజురహోను ‘ఖర్జ్’ అని ఎందుకంటారో నీకేమైనా తెలుసా?”

“తెలుసు సార్! ఖజురహా అంటే ఖర్పూరవనం అని అర్థం. ‘డేట్స్’ తెలుసు గదా మీకు? అప్పట్లో ఖర్జూర పంట విపరీతంగా పండేది. తవ్వకాలతో రెండు బంగారు ఖర్చూరాలు బయటపడ్డాయి సార్! మహాత్మాగాంధీజీ ‘శృంగార శిల్పాలు మరీ జుగుప్సాకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాల’ని హితవు చెప్పారట. అప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ గారు ‘ఖజురహో మన జాతీయ నిధి అనీ, వాటిని తొలగించడం అవివేకమ’ని అన్నారు” చెప్పాడు అమోఘ్.

‘అమ్మో! వీడు తక్కువవాడు కాదే!’ అనుకున్నాను. పేరుకు తగినట్లు అమోఘంగా చెప్పాడు.

మావాళ్లు అయోమయంగా చూస్తుంటే, నేను వారికి తెలుగులో వివరించాను.

పది నిమిషాలు తక్కువ ఎనిమిదికి NVR ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్‌కు చేరాం. అదొక మల్టీప్లెక్స్. అందులో రెండు స్క్రీన్‍లలో హిందీ సినిమాలు ఆడుతున్నాయి. అది రాజానగర్ రోడ్‌లో ఉంది. రోడ్డుకవతల మాతామందిర్ కనబడింది.

NVR ఆర్ట్ అండ్ కల్చర్ సెంటర్‌

జానపద నృత్యాలు ప్రదర్శించే ఆడిటోరియం మూడవ ఫ్లోర్‌లో ఉంది. రాత్రి చలి ఎక్కువగా ఉంది. వేడి వేడి కాఫీ తాగాలనిపించి, ఎవర్నో అడిగితే, సెల్లార్‍లో క్యాంటిన్ ఉందని చెప్పారు.

టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చునట. బయట కౌంటర్లో కూడా అమ్ముతున్నారు. టికెట్ ధర 350/- రూపాయలు. ఫోన్ పే చేసి, టికెట్లు తీసుకున్నాం. క్యాంటిన్‌కి వెళ్లి కాఫీ అడిగితే సీట్ నంబర్లు నోట్ చేసుకుని, పావు గంటలో తెచ్చిస్తానన్నాడు. కాఫీ ఒక్కోటి 30 రూపాయలు!

టూరిస్టులు చాలామంది ‘షో’ చూడటానికి వచ్చారు. వారిలో విదేశీయులు కూడ ఉన్నారు. వారు పెద్ద బ్యాగులను వీపున మోస్తున్నారెందుకో. దేవాలయాల సందర్శనలో కూడా అలాగే గమనించాం. హాయిగా రూముల్లో పెట్టి తిరిగొచ్చు కదా!

అందరికీ ఒక బ్రోచర్ ఇచ్చాడొకాయన. దాన్ని ఇంగ్లీషులో, హిందీలో ప్రచురించారు. షో ప్రారంభమయ్యేలోపు దాన్ని చదివి స్నేహితులకు వివరించాను. రాజా బల్వంత్ సింగ్ జానపద కళలను బాగా పోషించాడట. బుందేల్‌ఖండ్ సంప్రదాయానికి చెందిన జానపద నృత్యాలను కళాకారులు ప్రదర్శిస్తారట. ఆ కళారీతులు 16వ శతాబ్దానికి చెందినవట. చందేలా రాజవంశీయుల కాలంలోని ఒక తెగ వారు, వారి పేరు ‘జైజక్ భుక్తి’ అట, వారు బుందేలీ భాష మాట్లాడతారట. అది మధ్య భారతంలోని ఒక మాండలీకం. హిందీయేగాని, కొంచెం వేరుగా ఉంటుందట.

వేదిక వెనక పెద్ద కర్టెన్. దాని మీద కందారియ మహాదేవ్ మందిరం పెయింట్ చేసి ఉంది. ఒక గాయకుడు, ఒక తబలా విద్యాంసుడు, ఒక జంత్రవాద్య నిపుణుడు, ముందు మైకులు పెట్టుకొని కూర్చున్నారు. వారు నర్తకులకు గాత్ర, వాద్య సహకారం అందిస్తారన్నమాట. వారు చేయబోయే నృత్యాల వివరాలు కూడ బ్రోచర్‌లో, బొమ్మలతో సహా, వివరంగా ఇచ్చారు.

మొదట గాయకుడు విఘ్నేశ్వరస్తుతి చేశాడు. భాష సుబోధకంగా లేదు. లీలగా, సంస్కృత పదాల వల్ల, అర్థం అవుతూందంతే. ఆడిటోరియంలో లైట్లు ఆరిపోయి; వేదిక మీదకు ఫోకస్ లైట్లు వెలిగాయి. సీట్లు సౌకర్యవంతంగా ఉన్నాయి.

మా కాఫీలు వచ్చేశాయి. బాగున్నాయి. తాగుతూ షో చూడసాగాము. మొదటగా ‘బధాయి నృత్యం’ అని ప్రకటించిందొక స్త్రీ గొంతు. పెళ్లిళ్లలో, వియ్యంకులను స్వాగతించే నృత్యమట అది. అందమైన ఆడపిల్లలు ముగ్గురు, అంత అందంగా లేని మగపిల్లలు ముగ్గురు స్టేజి మీదికి వచ్చారు. పాట, వాయిద్యాలు ప్రారంభమయ్యాయి. వారు రంగురంగుల దుస్తులు ధరించి, చేతులతో కాషాయం రంగులో ఉన్న పెద్ద రుమాళ్లను చిత్ర విచిత్రంగా ఊపుతూ, నృత్యం చేయసాగారు. అందరూ ఇరవై, ఇరవై రెండేళ్లు లోపు వారే. అందంగా నవ్వుతూ నర్తిస్తున్నారు. బధాయి ఉంటే క్షేమం. ఆ వాయిద్యాల పేర్లు ధఫ్, డోలక్, నగాడియా, లోటా అని బ్రోచర్ లో ఉంది. మిత్రులిద్దరూ నృత్యాలను వీడియో తీస్తున్నారు.

జవారా నృత్యం

రెండవది ‘జవారా నృత్యం’. మంచి పంటలు పండినందుకు, రైతులు, దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసే నృత్యమది. బాలురు, బాలికలు రైతుల వేషాల్లో స్టేజి మీదకు వచ్చారు. వారి తలల మీద ధాన్యంతో నిండిన అందమైన ఘటాలున్నాయి. ఒకటి కాదు, ఒక దాని మీద ఒకటి, మొత్తం మూడు! అవి పడిపోకుండా నృత్యం చేస్తున్నారు.

మూడవది ‘రాయ్ డాన్సు’. రాయ్ అంటే ఆవాలు. మధ్యభారతం లోని బుందేల్‌ఖండ్‌లో అత్యంత ఉచ్చస్థితిలో వెలిగిన నృత్యరతి ఆట అది. ఒక ఆవగింజను ఒక సాసర్ లోకి విసిరితే అది ఎలా విన్యాసాలు చేస్తుందో, అలా నృత్యం చేస్తారట. అదేమిటో మాకు అర్థం కాలేదు! డ్రమ్ బీట్స్ ఊపందుకున్నాయి. వాయిద్యాలు సందడి చేశాయి. నర్తకి మేలిముసుగు ధరించింది. ఆమె ముఖం కనబడటంలేదు. ఒక వదులైన పెద్ద గాగ్రాను ధరించి, రెండు చేతులతో దాన్ని మనోహరంగా, రకరకాలుగా కదిలిస్తూ ఉందామె.

నాల్గవది నవరాత్ర నృత్యం. ఇది భక్తిపూర్వకమైనది. గ్రామీణ యువతులు, రంగురంగుల వస్త్రాలు ధరించారు. దేవాలయాలలోని ప్ర్రాంగణాల్లో చేరి, దుర్గాదేవిని కొలుస్తూ, నృత్యం చేస్తారు. మహిషాసురుని మర్దించిన ఆమె విజయాన్ని వారు ప్రస్తుతిస్తున్నారని మాకు అర్థమైంది. దసరా ఉత్సవాలతో దీనిని ప్రదర్శిస్తారు.

దివారీ నృత్యం

ఐదవది ‘దివారీ నృత్యం’. దీపావళి పండుగ తర్వాత పక్షం రోజులకు ఇది జరుగుతుంది. శ్రీకృష్ణదేవుని కీర్తిస్తూ సాగే నృత్యమది. నర్తకులు రెండు బృందాలుగా విడిపోయారు. వారి ఆహార్యం కళ్లు చెదిరేలా ఉంది. చేతిలో పెద్ద నెమలి పింఛాలు ధరించారు. మరొక చేతితో అలంకరించిన వెదురుకర్రలు. ఆడపిల్లలు కాలి కంకణాలకు గజ్జెలు ధరించారు. బృందాలతో వ్యక్తులు అటూ ఇటా మారుతున్నారు

ఇక చివరిది ‘బరేదీ నృత్యం’. అది పశువుల కాపరులకు సంబంధించినదని అర్థమైంది. యువ కాపరులు తమ పశువులను ఇంటికి తోలుకువచ్చిన తర్వాత, రిలాక్సేషన్ కోసం చేసే నృత్యం. వారితో బాలకృష్ణుడు చేరడం విశేషం. ఆయన జగన్మోహనంగా ఉన్నాడు. పద్నాలుగేళ్లుంటాయి. కస్తూరీ తిలకం.. అన్న శ్లోకంతో వర్ణించిన ‘గోపాల చూడామణి’లా ఉన్నాడు అచ్చం! గొల్లపిల్లవారు ఒక పద్దతి ప్రకారం వంగితే వారి మీదకి లాఘవంగా ఎక్కి, వ్యత్యస్త పాదారవిందుడై, మురళిని పెదవులకానించుకొని నిలుచున్నాడు. నృత్యం పూర్తయిన తర్వాత, రాధ కూడ వచ్చి ఆయన సరసన చేరడం విశేషం.

దివారీ నృత్యం – రాధ

మొత్తం షో పూర్తవడానికి గంటపైగా పట్టింది. ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందా ప్రదర్శన. అప్పుడు తొమ్మిది దాటింది. డ్రైవరుని ఏదైనా సౌత్ ఇండియన్ హోటల్‌కు తీసుకొని వెళ్లమన్నాం. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ అయితే మరీ మంచిదన్నాము.

“ఏక్ జగా హై సాబ్! తుమారా సబ్ చీజ్ ఉధర్ మిలేగా. ఓపెన్ మే ఖానా పడేగా” అన్నాడు.

ఆ హోటల్ పేరు ‘సౌత్ ఖానా’. అక్కడ మాకు వేడి వేడి ఇడ్లీ, సాంబారు, కొబ్బరి చట్నీ లభించాయి. మైసూర్ మసాలా దోశెలు కూడా! పానీపూరీలు కూడా ఉన్నాయి. జిహ్వ లేచి వచ్చింది, ఆ రోటీలు, బాస్మతి రైస్ తినలేక చస్తున్న మాకు. ఎంతో రుచిగా ఉన్నాయా టిఫిన్స్.

మేం ఝుంకార్ రిసార్టుకు చేరేసరికి పదయ్యింది. కంఫర్టర్స్ కప్పుకొని, ఎసి 28లో పెట్టి, ఫ్యాన్ ఒకటి పెట్టి, నృత్యాలను గురించి మాట్లాడుకుంటూ నిద్రబోయాము.

***

ఉదయం లేచి తయారై, ఎనిమిదిన్నరకు, రిసార్టు లోని ఖర్ట్ రెస్టారెంట్‌కు చేరుకొన్నాం. రూమ్ చెక్ ఔట్ చేశాము అక్కడ బఫె బ్రేక్‌ఫాస్ట్ ఉంది. డిషెస్ అన్నీ వేడిగా ఉన్నాయి. ఇడ్లీ, సాంబారు, కొబ్బరి చట్నీ, పూరీ, కుర్మా, కిచిడీ, పోహ, బ్రెడ్ టోస్ట్, కార్న్‌ ప్లేక్స్, మిల్క్, ఆరెంజ్ జ్యూస్, వాటర్మెలన్ జ్యూస్, టీ, కాఫీ.. ఏం తినాలో సెలెక్ట్ చేసుకోవడం కష్టమయింది. మా మిత్రులు నా వెంటే తిరుగుతూ నేను ఏం తింటే అది తిందామని చూస్తున్నారు. నిన్నరాత్రి ఇడ్లీ, దోసె తిన్నాం కదా పూరీ, కిచిడీ ట్రై చీదామన్నాను. వాళ్లెపుడూ ఒ.కె. షుగర్‌లెస్ కాఫీతో మా ఉదయపు తిండి సుసంపన్నం. కిచిడీ అంటే బొంబాయిరవ్వ ఉప్మాలో రకరకాల వెజిటబుల్స్ వేశారంతే. కొంచెం స్పైసీగా ఉంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here