మా మధ్య ప్రదేశ్ పర్యటన-6

1
9

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]అ[/dropcap]క్కడి నుంచి ‘గుఫా మందిర్ ధామ్’ చేరుకున్నాము. అదీ శివాలయమే. ఒక చిన్న గుట్ట మీద ఉంది. సుమారు 100 మెట్లున్నాయి. రెయిలింగ్ ఉంది. ‘హరహర మహాదేవ’ అనుకుంటూ ఎక్కేశాము. పైన, మందిరం అంతర్భాగం ఒక గుహలా ఉంది. గుడి శిఖరం చాలా ఉన్నతంగా, వంద మీటర్ల ఎత్తు వుంది. క్రింద, ఎడమవైపు ఆంజనేయస్వామి మందిరం ఉంది. ఒక మంటపంతో ఏదో వ్రతం చేయిస్తున్నాడు ఒక పండిత్ జీ. నార్త్‌లో పురోహితులను ‘పండిత్ జీ’ అంటారు.

మరొక వైపు ఒక పండిత్ మైకు పెట్టుకుని కీర్తనలు పాడుతున్నాడు. అది ఏ వ్రతమని అక్కడ కూర్చున్నవారిని అడిగితే, “కేదారేశ్వర్ వ్రత్” అని చెప్పా రు. గుఫామందిర్, లాల్ ఘాటీ అనే ఏరియాలో ఉంది. గుహలో శివలింగం తెల్లని రంగుతో ఉంది. దీనిని 1941లో శ్రీ మహంత్ నారాయణ దాస్‌జీ త్యాగి కనుగొన్నారు లోపల మరో 7 ఉప గుహాలున్నాయి. ‘గుఫ’ అంటే బుందేలీ భాషలో ‘గుహ’ అని అర్థం. ప్రతి భారతీయ భాషలో సంస్కృత భాషాజన్యాలైన పదాలుంటాయి. తెలుగులో మనం వాటిని తత్సమాలు అంటాము.

శివలింగం పైన ఎక్కడినుంచో నీటి ధార పడుతూ ఉంది. శివలింగం నిరంతరం తడిగా ఉంటుంది. క్రింద దుర్గామాత ఆలయం కూడా ఉంది. దేవాలయం ఆవరణలోనే ఒక ప్రాచ్య (సంస్కృత) కళాశాల కూడా ఉంది.

అక్కడ పూజాసామగ్రి అమ్మే దుకాణాలున్నాయి. ఒక చోట ఒక పండిత్ జీ చేత్తో వడికిన నూలు యజ్ఞోపవీతాలు అమ్ముతున్నాడు. రెండు కొన్నాను.

మా యోగానంద నన్నడిగాడు – “శర్మా, నీవు అంతా ‘వేరే’గా ఆలోచిస్తావు కదా! ఈ జంధ్యం ఎందుకు ధరిస్తావు?”

నేను నవ్వాను. “నిజమే రా. కేవలం జంధ్యం తోనే బాహ్మణునికి ఐడెంటిటీ రాదు. చిన్నప్పటి నుంచి తీసుకోవడంవల్ల అలవాటయిపోయిందంతే. ‘జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల?’ అన్నారు కదా పెద్దలు. అదొక భౌతికమైన వస్తువు, అంతే, నా దృష్టిలో.”

యల్లమంద అన్నాడు – “మిత్రమా! జగమెరిగిన.. అంటే జగము బాహ్మణుడిని అనా, లేక జగమును బ్రాహ్మణుడు అనా?”

“రెండూ వర్తిస్తాయి” అన్నాను.

“ఒకసారి, మనిద్దరం నర్సీపట్నంలో (బాయిస్ కాలేజ్) కలిసి పనిచేస్తున్నప్పుడు – జంధ్యం వేసుకొనేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఒక మంత్రం చెప్పావు. ఒకసారి చెప్పగలవా?”

“లక్షణంగా. కాని బ్రహ్మ తేజస్సు అభివృద్ధి చెందటానికి, సంధ్యావందన నిత్య కర్మానుష్టాన యోగ్యతా సిద్ధి కొరకు జంధ్యాన్ని ధరిస్తున్నానని సంకల్పంతో చెప్పుకుంటాము. ఉపనయన విధి కూడ చాలా లోతైనది కాని, దాన్నోక తంతుగా, ముఫై ఏళ్లొచ్చాక, పెళ్లికి ముందు రోజు, మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. సంధ్యావందనం ఎవరు చేస్తున్నారు? ‘Rituals for rituals sake’ కి నేను విరుద్దం.”

“అది నీవు వేరే చెప్పాలా?”

ముగ్గురం నవ్వుకున్నాము.

అక్కడ నుంచి ‘భారత్ భవన్’కు వెళ్లాము. అది మన ‘రవీంద్ర భారతి’ లాంటి ఆడిటోరియం. అక్కడ చక్కని పెయింటింగ్స్ ఉన్న మ్యూజియాన్ని దర్శించాము.

భారత్ భవన్

అక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ‘భారత్ భవన్’ కి దగ్గరలోనే ‘అప్పర్ లేక్’ ఉంది. భోపాల్ నగరానికి ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని పేరు. ‘లోయర్ లేక్’ కూడా ఉంది. 13 ఫిబ్రవరి 1982లో, అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ‘భారత్ భవన్’ను ప్రారంభించారు. మధ్య భారతానికి చెందిన వెర్బల్, విజువల్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ను ప్రమోట్ చేయడం ‘భారత భవన్’ ఉద్దేశం. మధ్యప్రదేశ్ ప్రభుత్వ, సాంస్కృతిక శాఖ ఆధీనంలో ఇది నడుస్తుంది.

‘అశోక్ వాజ్‌పేయి’ అన్న ఐ.ఎ.ఎస్. అధికారి, ఎమ్.పి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉండి, దీనిని అభివృద్ధి చేశారట. ఉజ్జయినీ నగరంలో, 1983లో ‘కాళిదాస్ అకాడెమీ’ని స్థాపించింది కూడా ఆయనే. ‘భారత్ భవన్’ను ‘ఇండియా హౌస్’ అని కూడా అంటారు.

రంగస్థల నిష్ణాతులు శ్రీ బి.వి. కారంత్ ఇక్కడ కార్యకలాపాలను చేశారు. ‘రంగమండల్ రిపర్టరీ’ కి ఆయన అధ్యక్షులు. అక్కడి ఆర్ట్ మ్యూజియాన్ని ‘రూపాంకర్’ అంటారు. అక్కడ ఎన్నో అరుదైన పెయింటింగ్స్‌ని, దేశీయ, విదేశీయ చిత్రకారులు వేసినవి, చూశాము. అందులో ‘Tribal Art’ ఎక్కువగా దర్శనమిచ్చింది మాకు.

మోడరన్ ఆర్ట్ గ్యాలరీ
ట్రైబల్ ఆర్ట్ గ్యాలరీ

హిందీ కవిత్వానికి ‘వాగర్థ్’ కేంద్రాన్ని, ‘కధాప్రసంగ్’ అన్న కేంద్రాన్ని హిందీ సాహిత్యానికి ఏర్పాటు చేశారు.

బహిరంగ్

‘బహిరంగ్’ అన్న ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. దాని వేదికను అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ‘అభిరంగ్’, ‘అంతరంగ్’ అన్న ఇండోర్ ఆడిటోరియంలు కూడా ఉన్నాయి. ‘ఆశ్రమ్’ అన్న వసతి గృహాంలో కళాకారులకు వసతి కల్పిస్తారు.

అభిరంగ్
అంతరంగ్

అక్కడినుంచి బయలుదేరాము. ‘అప్పర్ లేక్’ ఒడ్డున, ‘రాజా భోజ్’ (భోజ మహారాజు) విగ్రహాన్ని దర్శించాము. సరస్సు వెంట, మన హైదరాబాదు లోని ట్యాంక్‌బండ్ లాగా రోడ్ ఉంది. దాన్ని వి.ఐ.పి. రోడ్ అంటారు.

‘రాజా భోజ్’ విగ్రహం 32 అడుగుల ఎత్తు ఉంది. 11వ శతాబ్దానికి చెందిన రాజు ఆయన. సాహితీప్రియుడు, పోషకుడు. ‘భోజ్‌పాల్’ అన్న పేరే ‘భోపాల్’గా మారిందని అంటారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్‌కి మధ్యప్రదేశ ప్రభుత్వం ‘భోజ్ సేతు’గా నామకరణం చేసింది.

భోజ మహారాజు

భోజ మహారాజు ఒక చేతిలో కరవాలము ధరించి ఉన్నాడు. కిరీటము, మెలి తిరిగిన మీసములు, ఒక చేయి నడుముకు ఆనించుకుని, ఒక వితర్దిక మీద ఠీవిగా నిలబడి ఉన్నాడు. శిరసున కిరీటం. ఉత్తరీయం కప్పుకున్నాడు. మోకాళ్ల వరకు పొడవైన హరం ధరించి ఉన్నాడు. ఆ మహానీయుని చూసి మా మనసు పులకరించింది.

గన్ మెటల్, బెల్ మెటల్ వినియోగించి విగ్రహాన్ని తయారు చేశారు. దాని రూపశిల్పి ప్రభాత్ రాజ్. విగ్ర హంబరువు 7 టన్నులు. రాత్రి పూట రంగురంగుల L.E.D లైట్లతో విగ్రహం కాంతులీనుతుందట. విగ్రహం రంగు ‘రెడ్డిష్ బ్రౌన్’ (లేత ఎరుపు, గోధుమరంగుల మిశ్రమం). 2011 లో దీనిని ఎమ్.పి. ప్రభుత్వం నెలకొల్పింది.

యోగా అడిగాడు నన్ను – “కాళిదాసు ఈయన ఆస్థాన కవేనా?” అని.

“అది ఐతిహ్యం. ఆయన మాల్యా ప్రాంతంలోని ‘పరమారా’ వంశీయుడు. ఆయనకు ‘పరమభట్టారక’, ‘మహారాజాధిరాజ’ అన్న బిరుదులుండేవి. ఆయన భార్యలు రాణి లీలావతి, పద్మావతి. కళలను, సాహిత్యాన్ని ఆయన పోషించినట్లు ఎవరూ చేయలేదు. భోజ్‌పుర్ మహాదేవ్ ఆలయం ఆయన నిర్మించినదే అంటారు.

బిల్హణుడు, తాను భోజుని కాలంలో లేకపోయానే అని బాధపడినట్లు తెలుస్తున్నది. శ్రీకృష్ణ దేవరాయలు అభినవ ఆంధ్ర భోజుడు! ఆయన రాజధాని ధారా నగరం. ఆయన రచించినట్లు చెప్పబడిన గ్రంధాలతో చంపూ రామాయణం, శృంగార ప్రకాశకం, గోవింద విలాసం, సరస్వతీ కంఠాభరణం మొ॥ ఉన్నాయి. మనం సినిమాలలో చూసే భోజ కాళిదాసుల బంధం కల్పితం.” అన్నాను.

ఆత్మారామ్ జీ అలజడి చేస్తున్నాడు. డ్రయివర్‌ను మంచి హోటల్, వెజ్‌కు తీసుకుపొమ్మని చెప్పాను.

“సర్ జీ, భోపాల్ లోని టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఒకటుంది. దాని పేరు ‘బాపు కీ కుటియా’. భోజనం చాలా బాగుంటుంది”

“ ‘బాపుకీ కుటియా’ అంటే ఏమిటి రా శర్మా?” మా వాడి డౌటు!

“‘బాపూజీ కుటీరము’ అయి ఉంటుంది” అన్నాను.

“అయి ఉంటుంది.. ఏమిటి? నాకు హిందీ బ్రహ్మాండంగా వచ్చు.. అంటావుగా.. ఇంతేనా?”

నేను వాటిని కొట్టబోయాను. వాడు యల్లమంద వెనుక దాక్కున్నాడు. ఆయన నవ్వుతూ, “మన యోగానంద గారు, ‘నిన్ను, ఇంతేనా…?’ అనడం విని, ఇంగ్లీషు మాస్టారు! నాకొకటి గుర్తొచ్చింది” అన్నాడు

“షూట్ యిట్ డూడ్!” అన్నా

“తెలుగులో చెప్పొచ్చు గదా!” యోగా.

“పాండవవనవాసంలో భీముని దారిలో ఆంజనేయస్వామి, తోక అడ్డం పెట్టుకోని కూర్చుని ఉంటాడు. దాన్ని పక్కకు తీయమంటే, ‘ముసలివాడిని నాయనా! నీవే కాస్త జరుపుకో’ అంటాడు మారుతి. భీమసేనుడు, అదే మన యన్.టి.ఆర్, విశ్వప్రయత్నం చేసినా కదలదు. అప్పుడాయన, మిమ్మల్ని యోగానంద అన్నట్లే అంటాడు.”

“ఏమని మిత్రమా?”

“నాగాయుత బలసంపన్నుండనని అన్నావే.. ఇంతేనా?”

అందరం నవ్వుకున్నాము. యోగాగానికి నా దగ్గర చనువు. నన్ను ఏమైనా అనగలడు. నాకు ఫ్రాన్సిస్ బేకన్ గారి ‘ఆఫ్ ఫ్రెండ్షిప్’ అనే వ్యాసంలోని మాటలు గుర్తొచ్చాయి – ‘The real remedy for one’s flattery is the freedom of one’s friend’.

అదీ మిత్రులతో చెప్పాను – “ఒక వ్యక్తి యొక్క స్వోత్కర్షకు సరైన మందు ఆ వ్యక్తి స్నేహితుని స్వతంత్రమే”.

తన స్నేహితుడు ఎంత గొప్పవాడయినా, ‘నీ మొహం లేరా! చాలు గానీ, అపు!’ అనగలిగిన వాడు స్నేహితుడొకడే! యోగాగాడు నన్ను ఆనందంతో వాటేసుకున్నాడు!

‘బాపు కీ కుటీయా’ చాలా పెద్దది. జనంతో కిటకిటలాడుతుంది. మా ముగ్గురికీ టేబుల్ దొరకడానికి ఇరవై నిముషాలు నిలబడాల్సి వచ్చింది. ‘అన్‌లిమిటెడ్ థాలి’కి ఆర్డర్ ఇచ్చాము. బెండీ మసాల, నారియల్ క్యారెట్ చట్నీ, దాల్ మఖన్, మసాలా పాపడ్, గ్రీన్ సలాడ్, కడీ, ఖీర్, దహీ! లంచ్ సూపర్. ముఖ్యంగా, రైస్ బాస్మతి కాకుండా, నార్మల్, మెత్తగా ఉంది. భోజనం 130 రూపాయలు మాత్రమే! రీజనబుల్!

అక్కడనుంచి ‘అప్పర్ లేక్’కు బయలుదేరాం. అక్కడ బోట్ క్లబ్ ఉంది. చాలా పెద్ద సరస్సు. తెల్లని కొంగలు నీటిలో ఈదుతున్నాయి. బోటింగ్ ఫెసిలిటి ఉంది. అప్పుడు 3 గంటలవుతూంది. సరస్సు మీద పొగమంచు అలుముకుంటూ ఉంది.

అప్పర్ లేక్ బోట్ క్లబ్ వద్ద మిత్రులతో రచయిత

సరస్సును ‘భోజ్ తల్’ అంటారు. నగరానికి పశ్చిమాన ఉంది. భోపాల్ నగరానికి త్రాగు నీటివనరు అది. రోజూ 30 మిలియన్ల ఇంపీరియల్ గ్యాలన్స్ నగరానికి సరఫరా చేస్తుంది. దీనిని కూడా `రాజా భోజ్’ తవ్వించాడు. ఒకసారి ఆయనకి ఏదో చర్మ రోగం వచ్చిందట. వైద్యులు దాన్ని నయం చేయలేకపోయారట. ఒక యోగి వచ్చి, 365 తీర్థాల సంగమంగా ఒక పెద్ద సరస్సును తవ్వించి అందులో స్నానం చేయమని సలహా ఇచ్చారట.

బేట్వా నది 32 కి.మీ. దూరంలో ప్రవహిస్తుంది. దానికి 359 ఉప నదులు ఉన్నాయి. ఇంకా అరు కావాలి. రాజు గారి గోండు సేనాని కాలియా, వాటిని కనుగొన్నాడు. 11 స్లూయిస్ గేట్లతో ‘భద్బాడా డ్యామ్’ నిర్మించారు నదికడ్డంగా. 1965లో కట్టారు. అక్కడ రిజర్వాయర్‌ను ‘కాలియా సోట్’ అంటారు. సరస్సుకు ‘బడా తలాబ్’ అనే పేరుండేది. 2011లో దానిని భోజరాజు పేర ‘భోజ్ తల్’గా మార్చారు. ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.

సరస్సుకి దక్షిణాన ఒక విశాలమైన ఉద్యానవనం ఉంది. దానిని ‘వనిహర్ నేషనల్ పార్క్’ అంటారు. 31 చ. కి.మీ. విస్తీర్ణంలో ఉంది సరస్సు. సరస్సుకు సాంస్కృతిక, మతపర ప్రాధాన్యత కూడా ఉంది. విగ్రహాల నిమజ్జనం, పవిత్రస్నానాలు సరస్సును కొంత కలుషితం చేశాయి. సరస్సులో ఒక చిన్న ద్వీపం ఉంది. దాని పేరు ‘టకియా ఐలండ్’. అక్కడ షా అలీషా అనీ ముస్లిం నవాబు సమాధి ఉంది.

సరస్సులో మత్స్యసంపద సమృద్ధిగా ఉంటుంది. దాని హక్కులు 500 బెస్తవారి కుటుంబాలతో ఏర్పటిన ఒక కో-ఆపరేటివ్ సొసైటీకి చెందుతాయి. బోట్ క్లబ్‌ను ‘నేషనల్ సెయిలింగ్ స్కూల్’ అంటారు. అక్కడ వివిధ జల క్రీడలు (వాటర్ స్పోర్ట్స్) ర్యాష్టింగ్, వాటర్ స్కైయింగ్, ప్యారాసెయిలింగ్ లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు.

అరుదైన పక్షి జాతులు సరస్సుకు ప్రత్యేక ఆకర్షణ. వైట్ స్టార్క్, బ్లాక్ నెక్డ్ స్టార్క్, బేర్ హెడెడ్ గూస్, స్పూన్‌బిల్ జాతులు కొన్ని. సారస్ క్రేన్ అనీ కొంగ జాతి పక్షుల్లో అతి పెద్దది.

లోయర్ లేక్ వద్ద మిత్రులతో రచయిత

అక్కడనుంచి ‘లోయర్ లేక్’కు వెళ్లాము అక్కడ మెయింటెనెన్స్ ఏవి బాగోలేదు. కరిష్మా పార్క్ అని ఉంది గాని, పిచ్చి మొక్కలు, పాత బెంచీలు ఉన్నాయి. రహస్య ప్రేమికులకు అది చక్కని అడ్డా అని గ్రహించాము!

అక్కడ నుంచి ‘ఇందిరాగాంధీ మానవ సంగ్రహాలయ్’కు వెళ్ళాము. అదొక గిరిజన మ్యూజియం. దారిలో ‘టీ’ కి ఆపాడు అలీ. ‘అబ్దుల్లా టీ హబ్!’. అది పీర్ గేట్ ఏరియాలో ఉంది.

ఇందిరాగాంధీ మానవ సంగ్రహాలయ్

“ఈ చాయ్ మీకు తాగించాలని మూడు కి.మీ. తిరుక్కొని వచ్చాను సర్!” అన్నాడా యువకడు.

“వెరీగుడ్!” అన్నాను. టీ ఎంత బాగుందంటే, అంత బాగుంది!

ఇందిరాగాంధీ మానవ సంగ్రహాలయ్ ఉన్న ప్రాంతాన్ని ‘శ్యామల హిల్స్’ అంటారు. 200 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఒక ఎథ్నోగ్రాఫిక్ మ్యూజియం. ఇండియా లోనే అతి పెద్దది. మానవ సంస్కృతి క్రమపరిణామాన్ని సూచించే ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.

1977లో ఇది స్థాపించబడింది. దీని దర్శకుడు డా॥ భువన్ విక్రమ్ గారు. ఎన్నో బహిరంగ ప్రదర్శనలు, ఇండోర్ గ్యాలరీలు ఉన్నాయి. ఒకచోట మణిపూర్ కల్చరల్ డాన్స్‌ను ప్రతింబింబిస్తున్న, సజీవ విగ్రహం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. ఎడారి గ్రామం, హిమాలయన్ గ్రామం, రాక్ ఆర్ట్ హెరిటేజ్, రివర్ వ్యాలీ కల్చర్, అయ్యనార్ పుణ్యక్షేత్రం, సాంప్రదాయ సాంకేతికత.. ఇలా ఎన్నో మినీ ప్రపంచాలను అక్కడ అవిష్కరించారు.

అక్కడనుంచి 7 గంటలకు హోటల్ చేరుకున్నాము. స్నానాలు చేసి రిలాక్స్ అయ్యాము. లుంగీలు, టీషర్టులతోనే క్రింద రెస్టారెంట్‌కు వెళ్లి ఆనియన్ ఉతప్పం, వాటర్ మెలన్ జ్యూస్‍తో డిన్నర్ చేశాము. మా అవతారాలు చూసి తమిళియన్స్ అనుకొన్నట్లున్నారు. ఒకాయన “మద్రాసీ హై క్యా?” అని అడిగాడు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here